Jump to content

చిత్రలేఖనము/BOOK II/రెండవ భాగము

వికీసోర్స్ నుండి

రెండవ భాగము.

ప్రదేశపటములను రంగులతో చిత్రించుట.

(LANDSCAPE PAINTING.)

సూర్యుడు గొప్పరంగు వేయువాడు. గొప్ప చిత్రకారుడు. వీనిప్రకాశమునుబట్టి సృష్టియొక్క రంగు మాఱుచుండును. సూర్యకాంతి లేనపుడు ప్రపంచమంతయు నంధకారపూరిత మైయుండును. తీక్ష్ణముగ ప్రకాశించునప్పు డన్నియు శుభ్రముగ కనబడును. సూర్యకిరణములు వేనిమీద పడిన నవి చాలవఱకు తెల్లగ కనబడును. వానివాని నిజరంగులను వెల్లడిపుచ్చుచుండును. కొన్నికొన్నిసమయములయందు వాని నిజమైన రంగులను పోగొట్టుకొనుచుండును. నల్లని వస్తువును సూర్యుని ప్రకాశమునం దుంచిన నది యంతనల్లగ కాన్పింపదు. దానినే నీడయందుంచిన స్వాభావికమైన రంగుతో కాన్పించును. ప్రదేశచిత్రములను వ్రాయుటయం దీవిషయమై చిత్రకారులు బహుజాగ్రత్తగ నుండవలెను.

ఈ సూర్యప్రకాశమే చాయకు కారణము. ప్రాత:కాలపు సూర్యప్రకాశము సువర్ణచ్ఛాయ గలిగి యుండును. అప్పుడు సూర్యరశ్మిచే తాకబడిన వస్తువు లన్నియు పసుపురంగును పొందును. సాయంకాలంబున తామ్రవర్ణపు కిరణములు సూర్యునివద్దనుండి వెలువడును. అప్పుడు సృష్టియందుండు వస్తువులన్నియు నాచాయను పొందును.

ప్రదేశచిత్రములందు ముఖ్యముగ మనకు కావలసిన దొకవస్తువునే వ్రాయుచు దానికనుగుణముగ తక్కినది వ్రాయుచుండవలెను. ఇట్టిపటములను చూచినవెంటనే యావస్తువు దృగ్గోచరమగుచుండవలెను. అందువలన దీనిని చిత్రముయొక్క మధ్యను వ్రాసిన బాగుగనుండును. వీలైనయెడల నిటుల వ్రాయవలెనేకాని వీలుకాని సమయమున మధ్య నట్టివస్తువును వ్రాసి చిత్రముయొక్క సౌందర్యమును పోగొట్టరాదు.

మన మొకయుదాహరణమును తీసికొందము. ఈచిత్రమునందు నల్లని చెట్లసమూహమును వ్రాయుచు, సూర్యుని రూపమునైనను, తెల్లని మేఘములనైనను, యింక యితరమైన సౌందర్య మైన వస్తువును దేనిని వ్రాయకూడదు. ఏలనన: నీవు చూపదలచుకొనిన చెట్లయొక్క ప్రాముఖ్యత తగ్గిపోవును. నల్లని చెట్లయొక్క రంగునకును, సూర్యుని ప్రకాశమునకును విరుద్ధభావము నేర్పడును. ఇట్టి రంగుగల చెట్లసమూహమువద్ద ప్రకాశించుచున్న సూర్యుని చిత్రమును వ్రాసిన చెట్లకు నలుపు మిశ్రితమైన ఆకుపచ్చకు బదులు ఊదా మిశ్రితమైన ఆకుపచ్చరంగును వేయవలసియుండును.

ఇదివఱకు చెప్పినటుల నీనిబంధన లన్నిటికిని లోనై యీచిత్రమును పాడుచేయకూడదు. నీరుచి ముఖ్యముగ కావలసినది. సాధ్యమైనంతవఱకు నీనిబంధనల ననుసరించుటయే మంచిది. కాని సమానముగ మనోరంజకము కలుగజేయు వస్తువు లేవియు నొకేచిత్రమునందు వ్రాయకూడదు. ఏలయన: ఇదివఱకు చెప్పినటుల రెండువస్తువులయొక్క ప్రాముఖ్యతయును చెడిపోవును.

పటముయొక్క చివరయందు ఛాయ దట్టముగనుండదు. కొన్నిసమయములయందు పటముయొక్క క్రిందిభాగము నందు పలుచగ నుండును. ఏలయన: క్రిందిభాగము మనకు దగ్గరగ నుండును. మీదిభాగము దూరముగనుండును.

ఇంకొక సంగతిని గమనింపవలసియున్నది. క్రిందిభాగమునం దేమియు పెద్దవస్తువులను వ్రాయకూడదు. అటుల వ్రాసినయెడల పటముయొక్క సౌందర్యము చెడిపోవును. ముఖ్యమైన వస్తువుల ప్రాముఖ్యత పోవును.

మనకు కనబడునటుల వ్రాయవలదా? నిజమును ప్రదర్శింపవలదా? యని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. మనము దృష్టము నెంచుకొనునప్పుడే జాగ్రతగనుండవలెను. అభ్యాసమైనకొలదిని ఇట్టివి యెంచుకొను శక్తిగలుగునని నే నిదివఱకు చెప్పియుంటిని. చాయను వ్రాయునపుడు బహుజాగరూకులమై యుండవలెను. నీడయు వెలుతురును అనుపాతముగ నుండవలెను. తెల్లని వస్తువునందు నల్లనిచుక్క నొకదానిని పెట్టిన నసందర్భముగ నుండును. ఇట్టితప్పులనుండి తప్పించుకొనుట కభ్యాసమే ముఖ్యము కాని నేను చెప్పుట కేమియు లేదు.

అందఱి యాలోచనయందును సృష్టియొక్కమోస్తరుగనుండదు. కనుక నొక్కొక్క రొక్కొక్క విధముగ వ్రాయుచుందురు. కురుచైన చిత్రకారుడు మనుష్యాకారములను పొట్టిగ వ్రాయును. పొడగైనవాడు పొడుగుగ వ్రాయును.

సాధారణముగ చెట్లు ఆకుపచ్చగ కనబడునని తలతురు. నమ్మెదరు. అభ్యాస మైనకొలదిని అవి సాధారణముగ నట్టి యాకుపచ్చగ కనబడదని తెలిసికొనెదరు. దూరమునుబట్టి రంగులు మాఱుచుండును. సూర్యరశ్మి తగులుటవలన నాకులపైభాగములు గాడ మైనరంగులను కలిగియుండును. క్రిందికి ఉన్నవైపులు మట్టిరంగు మిశ్రితమైనవై యుండును. అందువలన నీరంగులు మిశ్రితమైనట్టి ఆకుపచ్చగ కనబడవని నేను దృడముగ చెప్పగలను.

గాలియం దనేకమైన పదార్థము లుండును. ధూళి యెగురుచుండును. నీటివాయువు కలిసియుండును. కొన్ని సమయములయందు మంచు పడుచుండును. అందువలన దూరపువస్తువులు దగ్గరవస్తువు లంత శుభ్రముగ కానరావు. దూరమున నున్నవస్తువులచాయ యంతదట్టముగ కానరాదు.

సాధారణముగ పర్వతములు నీలిగ నుండునని యందుము; కాని యవి నిశ్చయముగ నారంగు కలవి కావు. మనకవి లీలిగనే కనబడును. వాటి నిర్మితస్థలమునుబట్టి సూర్యునిగమనమునుబట్టి వాటిరంగు మాఱుచుండును. దూరముగ నున్నవస్తువులు నీలిరంగుగ నుండు ననుసంగతి మనకు విదితమే గడ్డిచే కప్పబడు పర్వతములకంటె, చెట్లమయ మైనగిరులు నీలిరంగుగ కనబడును.

ఇంకొకసంగతిని గమనింపుడు దూరముగనున్న పర్వతములరంగు, దానిదగ్గరనున్న ఆకాశముయొక్క రంగున కనుగుణముగ నుండును. పర్వతములు నీలిగనైనను ఊదాగనైన నున్న నాదగ్గరనున్న యాకాశపురంగు నీలిగనైనను ఊదాగనైన నుండును. ఆకాశ మెఱుపుగనున్న పర్వతము లూదాగా నుండును.

అంతెందుకు? ఆకాశపురంగునుబట్టి సృష్టియొక్క రంగును మాఱుచుండును. ఈగ్రంథము ఇరువదవపేజీయం అచ్చువేసిన చిత్రములను చూచిన మీకు బాగుగ బోధపడును. ఇందుకు కారణమేమని మీ రడుగవచ్చును.

ఎఱ్ఱని వెలుతురునం దొకవస్తువును పెట్టినయెడల దానియొక్కరంగు చాలవఱకు యెఱ్ఱగ మాఱుచుండును.

ఇటులనే నీటిరంగును మీకడిగిన నీలియని చెప్పెదరు; కాని మనము చూచునప్పుడది నిజముగ నీలిరంగుగ కనబడదు. దీనిరంగు ముఖ్యముగ నాకాశపురంగునుబట్టి మాఱుచుండును. ఏలయన: ఆకాశపురం గీనీటియందు ప్రతిబింబిత మగుచుండును. చుట్టునున్న చెట్లు మున్నుగాగలవి కూడ ప్రతిఫలించును. నీటియొక్క రంగు గమనింపవలసియున్నది. స్వచ్ఛమైననీటికి రంగు లేకపోయినప్పటికిని జలసమూహము నీలిగనే కనబడును. కొంతనీరు మట్టిరంగుగ నుండును. మఱికొంత నల్లగ గనబడును. మధ్యధరాసముద్రపునీ రన్నిటికంటె నీల మైనదని కనిపెట్టబడినది. వీటినన్నిటిని గమనించి మనము చిత్రింపవలెను.

తలవెండ్రుకలు నల్లనిరంగు గలవి. అవి యెల్లకాలములయందును మనకు నల్లగ కనబడును. కాని అవి మెఱయుచుండుటవలన వాటియొక్కరంగు మాఱుచుండును. కాన ప్రదేశచిత్రములను వ్రాయునప్పుడు వేళను ఆకాశపు స్థితిని గమనించుచుండవలెను.

దగ్గరగనున్న వస్తువులు దూరముననున్న వస్తువులకంటె బాగుగ కనబడునని యిదివరకే చెప్పియుంటిని. దగ్గరనున్న గడ్డిపోచ కనబడవచ్చును కాని దూరముననున్న చిన్నమొలకకూడ కనబడకపోవచ్చు ననికూడ యిదివఱకు చెప్పియుంటిని. వీటిని మఱచిపోరాదు.

ఈ నిబంధనల నన్నిటిని చూచి మీరు బెంగ పెట్టుకొనరాదు. అభ్యసించినకొలది నవియే యలవడును. లోకమునందు మనుజుడు చేయలేనిపని లేదు. చావును జయించుటకంటె నివి గొప్పవియా?