చిత్రలేఖనము/BOOK II/ప్రథమ భాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చిత్రలేఖనము.

BOOK II.

ప్రథమ భాగము.

రంగులు పూయుట.

కొందఱికి కొన్నిరంగు లిష్టము. ఇతరులకు మఱికొన్ని యిష్టము. ఈయిష్టానిష్టములు వారివారిరుచులనుబట్టి యుండును. ప్రపంచమునందు మూడువర్ణము లున్నవని న్యూటెను (Newton) చెప్పెను. అవి ఎఱుపు, పసుపు, నీలి. వీనిలోరెంటినికలిపిన వేఱురంగులు వచ్చును. వీనిని గౌణవర్ణము (Secondary Colours) లందురు. వీనిలోరెంటిని కలిపిన తృతీయవర్ణములు (Teriatory Colours) వచ్చును.

గౌణ వర్ణములు :-

ఎఱుపు + పసుపు = నారింజ వర్ణము.

పసుపు + నీలి = ఆకుపచ్చ వర్ణము.

నీలి + ఎఱుపు = ఊదా వర్ణము.

తృతీయ వర్ణములు :-

నారింజ వర్ణము + ఆకుపచ్చ = సిట్రిను

ఆకుపచ్చ + ఊదా + ఆలివు.

ఊదా + నారిజ = కావిరంగు.

పైని చెప్పినదానినిబట్టి చూచినయెడల నారింజవర్ణము, ఆకుపచ్చ, ఊదా, గౌణవర్ణము లనియు, సిట్రిను, ఆలివు, కావిరంగు తృతీయవర్ణము లనియు తెలియును.

ఈక్రింద వ్రాసిన చిత్రమును చూచిన నివి చక్కగ బోధపడును. 24 - చూడుము.

1. కావిరంగు. 2. ఎఱుపు. 3. ఆకుపచ్చ. 4. ఊదా. 5. నారింజ. 6. నీలి. 7. పసుపు. 8. ఆలివు. 9. సిట్రిను.

కావిరంగును, ఆలివును, సిట్రినును, బాగుగా బోధపఱుచుకొనుటకు పచ్చని బూడిదవర్ణము, నీలమైన బూడిదవర్ణము, ఎఱ్ఱని బూడిదవర్ణము అని పిలుతుము.

ప్రథమరంగుల (Primary Colours) దట్ట మీవిధముగ చూపింపబడినది.

ఎఱుపు = 5. పసుపు = 3. నీలి = 8.

ఎఱుపును దట్టముచేసిన నలుపుగనో లేక ఊదావర్ణముగనో కనబడును. పలుచుగ చేసిన గులాబిరంగుగనో లేక మట్టిరంగుగనో మాఱును.

మొదటి భాగము.

పసుపువర్ణమును దట్టము చేసిన, మట్టిరంగుగనో ఆకుపచ్చగనో మాఱును. పలుచన చేసిన, బూడిదవర్ణముగ మాఱును. లేనియెడల నారంగు శుభ్రముగ మాయమై పోవును. నీలియందు మార్పు లేమియు లేవు.

ఏదోయొకరంగును తీసుకొని చాయను సులభముగ నీయగలము. ఈగుణము చిత్రకారులకు చాల సహాయకారిగా నున్నది. సాధారణముగ మన మొక పెన్సిలును చేతనిడుకొని చిత్రమును వ్రాయ మొదలిడిదము. సృష్టియందిటులకాదు. ప్రతివస్తువును రంగులతో మిశ్రితమై యుండును. అందువలన మనము చిత్రములను వ్రాయుటయందు సృష్టి ననుసరించుట యుత్తమము.

వస్తువుయొక్క రంగునుబట్టి చాయ మాఱుచుండు నని మనము సాధారణముగ తలతుము కాని యీ చాయను వెలుతురుకూడ మార్చుచుండును.

ఎఱుపువర్ణము బాకాయొక్క ధ్వనికి పోల్పబడినది. నీలిరంగు పిల్లనగ్రోవియొక్క శబ్దమునకు సరిపోల్పబడినది.

మన యిష్టానిష్టములప్రకారము వాసనవచ్చునటుల వాసనద్రవ్యములనుకలిపెదము రుచికలుగునటుల తిను బండారములను వండెదము. అటులనే మనమనస్సునకు తృప్తి కలుగునటుల రంగులను కలుపవలెను.

ఏలయన: చక్కని యత్తరును, మంచి సంగీతమును, రుచియైన భోజనమును, మనముప్రేమించునటుల నయనానందమును కలుగజేయు చిత్రమును చూచుట కభిలాషపడెదము.

సంగీతవిద్యార్థి ప్రథమమున మంచి కృతులను పాడలేడు. అభ్యసించినకొలది వానిజ్ఞాన మావిషయమున నభివృద్ధిపొంది తుదకు కర్ణానందముగ గానము చేయగలడు. అటులనే మనము ప్రతినిముషమును సృష్టిని చూచునప్పటికిని ప్రథమమున చక్కగా రంగులతో చిత్రములను వ్రాయజాలము. అభ్యసించినకొలది నీవిద్య అబ్బును.

కొందఱు మొదట కొన్నిరంగులకు భేదము కనుగొనలేరు. అభ్యాసము చాలకపోవుటయే దీనికి కారణము.

కొందఱు ఒకచేతితోనే వ్రాయగలరు. మఱికొందఱు రెండు హస్తములతోను చిత్రింపగలరు. దీనికని అభ్యాసమే ముఖ్యము. గుఱ్ఱమును ఒంటెవలె నడిపింపవచ్చును. ఒంటెను పిల్లివలె నడిపింపవచ్చును. అటులనే ఎడమచేతిని కుడిచేతివలెనే పనిచేయింపవచ్చును. ఫిడిల్ వాయించువాడు రెండుచేతులను ఉపయోగించును. ఏ చేయి చేయవలసినపని నది చేసివేయుచుండును. అటులనే మన మభ్యసించినయెడల రెండుచేతులతోను వ్రాయవచ్చును.

మనము కొంచెము ఇంధ్రధనస్సువైపు చూతము. అందు ఏడురంగులు కాన్పించును. 24 - 2 చూడుము.

మనము చిత్రమును వ్రాసినప్పుడు ఇష్టము వచ్చినటుల వ్రాయుటకు వీలుండదు. కొన్ని నిబంధనలకు లోబడవలసివచ్చును.

చిత్రములను చిత్రించుటకు 5, 2, నెంబరుల విండ్సర్, న్యూటను కుంచెలు (Windsor and Newtons' Red Sable hair brushes Nos. 5 and 2.) కావలసియుండును.

క్రొత్తవారు నేర్చుకొనుట కేదైనరంగును దట్టముగ నరుగదీసి వలయాకారములయందారంగును పూయుచుండవలెను. తరువాత నీవలయాకారములద్వారా అక్షరములను వ్రాసి యొక్కొక్కవలయమునకు నొక్కొక్కరంగును పూయుచుండవలెను. సాధారణముగ నని యీదిగువచెప్పినప్రకారము పూసిన సుందరముగ కనబడును.

1. ఎఱుపు. 2.ఊదా. 3. గాఢనీలము. 4. నీలము. 5. ఆకుపచ్చ. 6. పసుపు. 7. నారింజ.

24 - 3 చూడుము.

ఇందు చక్కగ నభ్యాసమైనతరువాత ఇండియన్ యింకు (Indian Ink) నరుగదీసి దానితో చిత్రములను వ్రాయుచుండవలెను. మొదటిభాగమునందు పెన్సిలుతో జంతువులను సులభముగ వ్రాయుట జెప్పితిని. అటులనే యిప్పుడు కుంచెతో వ్రాయుట నభ్యసింపవలయును.

ప్రారంభమునందు ఆకును చేత నిడికొని దానిని చూచుచు వ్రాయ నభ్యసింపవలయును. తరువాత జంట యాకులను వ్రాయవలెను. ఇందభ్యాసమైనతరువాతను పుష్పములను చిన్నచిన్నకొమ్మలను వ్రాసిన మంచిది. ఫలములను వ్రాయుట సులభము. ఏదైనఫలమును దగ్గరనుంచుకొని దానిని చూచుచు నతిజాగ్రత్తగ చిత్రించుచుండవలెను. కలశములను చూచి వ్రాయుట మంచిది. ఈయన్నిటియందు నభ్యాసమైన తరువాత చెట్లనుచూచి వ్రాయుచుండవలెను. ఎటుల వ్రాయుటయో యీదిగువ నుదహరించిన చిత్రములను చూచిన బోధపడును. నేను చెప్పినవే వ్రాయవలెననికాదు. మీకేవి బాగుగ తోచునో వాని నన్నిటిని వ్రాయుచుండుట మంచిది. కోళ్లు, పావురములు, చేపలు, కీటకములు మొదలగునవి వ్రాయుటకెంతయో యానందకరముగ నుండును. పడవలను వ్రాయుట యెంతయో బాగుగ నుండును. వీనిని వ్రాయుసిరా మిక్కిలి చక్కగ నుండవలెను. కుంచెయొక్క మొన సన్నముగ నుండిననే గాని వ్రాయజాలరు. 25 - చూడుము.

ఇవన్నియు చక్కగ వ్రాయగలిగినతరువాత ప్రదేశ చిత్రములను వ్రాయవలెను. ఏదైన నొకస్థలమునందు కూర్చుండి ఎదుట కనబడుచున్నప్రదేశమును చిత్రించుట బహు ఆనందకరముగ నుండును. విస్తారమభ్యాసముండిననేకాని ఇటుల వ్రాయజాలము. తరువాతను మనుష్యుల చిత్రములను వ్రాయుట నభ్యసింపవలెను.

26, 27, 28 పటములను చూడుడు.

పైఁజెప్పినవానియం దభ్యాసమైనతరువాత వివిధమైన రంగులతో చిత్రములను వ్రాయ నభ్యసింపవలెను.

ఒక కాగితమును తీసికొని దానిని డ్రాయింగు ఫలకమునం దంటించి రంగును పూయుటకు సిద్ధపఱుపవలెను. రంగును చాల పలుచగా కలిపి యొక చిన్నగాజుపళ్లెము (slant) నం దుంచవలెను. తరువాత శుభ్రమైన కుంచెను తీసి రంగునందు ముంచి కాగితముపై వేయుట ప్రారంభింపవలయును. ఈరంగు చిక్కగ నుండిన సమానముగ వచ్చునటుల పూయజాలము. రంగును మీదినుండి క్రిందికి పూయుచుండవలెను. కుంచె నెప్పుడును క్రిందికే జరుపుచుండవలెను. కాని మీదికి జరుపరాదు. ఇటుల చేసినయెడల చిత్రము చెడిపోవును. డ్రాయింగు ఫలకము ఏటవాలుగ నుండిన సదుపాయముగ నుండును.

ఈరంగు పూసినతరువాత బాగుగ నారనీయవలెను. తడిగానున్నపుడే రెండవపర్యాయము రంగును వేసిననొకచోట పలుచగను, నొకచోట దట్టముగ నంటుకొనును. ఇటులనే అనేకపర్యాయములు పలుచని రంగును పూసి దట్టముగ రంగంటుకొనునటుల చేయవచ్చును.

ఇటుల వేయగలిగినతరువాత వలయాకారమును పెన్సిలుతో చుట్టి దానియందు రంగును పూయుచుండవలెను.

క్రొత్తవారు దట్టముగ రంగును పూయుట కిచ్చగించెదరు. రంగును పూయుటయం దభిలాషను పుట్టించుటకు సులభమైనటువంటి వివిధమైన చిత్రములను వ్రాసి వానియందు రంగును పూయుచుండవలెను. వీనికనుకూలమైనవి వివిధదేశపు బావుటాలే. ఇవిగాక 29 - వ పటములో చూపినవి వ్రాయవలెను. 29 - చూడుము.


వీనియం దభ్యాసమైనతరువాత వివిధమైన వస్తువులను వ్రాసి వానికనుగుణమైన రంగులను పూయుచుండవలెను.

ఆకును వ్రాసి యాకుపచ్చను దట్టముగ పూయవలెను. నారింజపండును వ్రాసి నారింజరంగును వేయవలయును. నిమ్మపండును వ్రాసి పసుపును పూయవలెను.

ఇటులనే చెట్లనుకూడ వ్రాయవచ్చును. చిక్కనియాకుపచ్చను తీసికొని చెట్టుకొమ్మలవలె కాగితమునందుపూసి మట్టిరంగు (Burnt Sienna) తో మొండెమును చిత్రింపవలెను. ఈచెట్లను వ్రాయువిషయమై మఱియొక ప్రకరణమునందు చెప్పెదను. పైఁజెప్పినవాని నన్నిటిని వ్రాసివేయవచ్చును; కాని అవి యెటుల కనబడునో యటుల వ్రాయుట కష్టము. దీనికి ఛాయయే ముఖ్యము. వీనికి రెండు కుంచెలు కావలసియుండును. ఒకకుంచెతో రంగును వేయుచు రెండవ కుంచెను నీటియందు ముంచుచు తుడుచుచుండవలెను. అనగా రంగును సన్నని కుంచెతో నొకధారవలె వేయుచు నీటితో దానియొక్క కొనను తుడిచిన ఛాయ శుభ్రముగ వచ్చును.

మొదట హెచ్చుతగ్గులుగ వచ్చును. అభ్యాసమైన కొలది చదునుగా రంగును వేయగలుగుదురు.

ఒకఫలమును వ్రాసి దానికేదైన నొకరంగును వేసి ఛాయ నియ్యవలెను. పుష్పములను వ్రాయుటయందు నిటులనే చేయవలెను. ఛాయ నియ్యనిది పుష్పము కళా విహీనముగ నుండును. ఈఛాయ సూర్యుని వెలుతురు వలన జన్మించుచున్నది. ఏలయన: ఒకవైపున సూర్యుడు ప్రకాశించునప్పుడు మఱియొకవైపున చీకటిగ నుండును. రాత్రులు, పగళ్లు కలుగుట కిదియే కారణమని మన భూగోళశాస్త్రజ్ఞులు చెప్పియున్నారు. వస్తువుయొక్క యొక వైపున సూర్యుడు ప్రకాశించిన రెండవవైపున చీకటిగ నుండును. అందువలన నేదైన చిత్రమును వ్రాయునప్పుడు చాయ నిచ్చుచుండవలెను. 30 - చూడుము.

ఇందభ్యాసమైన తరువాత చిన్నప్రదేశచిత్రములను వ్రాయుచుండవలెను. ఇదివఱకు మీరు చెట్లనువ్రాయుట నభ్యసించితిరి. కనుక చిన్నచెట్లతోను పర్వతములతోను చిత్రములను వ్రాయుట సులభమని నాతాత్పర్యము. ఈ ప్రదేశచిత్రములను వ్రాయుటయందు చాల సంగతులను గమనింపవలెను. కాని ప్రారంభకులు సాధారణముగ వ్రాసిన చాలును. ఆనిబంధనలకు లోబడనియెడల ప్రదేశ చిత్రములను వ్రాయుట సులభమైనపనియే. అభ్యాసమైన కొలదిని వానినన్నిటిని గమనింపవలసియుండును. ప్రారంభకులే యట్లు చేసినయెడల వారెప్పటికిని మంచి చిత్రములను వ్రాయజాలరు. నేనిదివఱకే చెప్పియుంటిని. సంగీతములో ప్రారంభమున కృతులనే నేర్పించినవానికి సంగీత మబ్బునా? అబ్బినను వట్టి సంగీతజ్ఞానశూన్యుడగును.