చిత్రలేఖనము/BOOK I/ప్రథమ భాగము
చిత్రలేఖనము.
BOOK 1.
ప్రథమభాగము.
మొదటి ప్రకరణము.
బాలురు చిత్రలేఖనమునందు మిగుల శ్రద్ధ వహించెదరు ; కాని వీరియం దీగుణమును వృద్ధి పొందించుటకు పెద్దలేమియు ప్రయత్నింపలేదు. దీనిని వృద్ధి పొందించిన యెడల మనదేశములో చాలమంది చిత్రలేఖకులు వెలువడెదరు.
చిత్రలేఖన మనేక విధముల బరగుచుండును. పెన్సిలు, కణిక (Crayon), మసిబొగ్గు, రంగులు, కుంచెలు, కలము మొదలగునవి యుపయోగించి చిత్రములను వ్రాయవచ్చును. కాగితమును బొమ్మరూపముగ కత్తిరింప వచ్చును. మట్టితో ప్రతిమలను చేయవచ్చును. రాతిమీదను బొమ్మలను చెక్కవచ్చును.
మనస్సున పుట్టిన యుద్దేశమును మనము పైని చెప్పిన పరికరముల నుపయోగించి పైకి కనపఱుపవచ్చును. పిల్లి చాపమీదను పండుకొనియున్నట్లు మన మనస్సునం దూహించి దానిని కాగితము మీద పెన్సిలుతో వ్రాయవచ్చును. రంగుతో చిత్రింపగలము. కత్తెరతో కాగితమును కత్తిరింపవచ్చును. కత్తితో కఱ్ఱమీదను చెక్కవచ్చును.
బాలురకు నేర్పించుటయందు పెన్సిలును, రంగులను, సాధారణముగ నుపయోగించెదరు.
ఒక బొమ్మను చుచి వ్రాయుట చాల చెడ్డది. దీనికి బదులు నిజమైన వస్తువును బాలుని చేతికిచ్చి వ్రాయించుట మంచిది.
చేయి మనస్సు యొక్క నౌకరి. అందువలన మనసున పుట్టిన యుద్దేశమునే వ్రాయించుట యుత్తమము.
ఈ దిగువ నుదహరించిన ప్రకారము బాలురకు నేర్పిన చాల మంచిది. బాలు రాడుకొనునటుల వ్రాయించిన వారి కత్యానందము కలుగును. చిత్రలేఖనమునం దభిరుచి కలుగును.
ఈ చిత్రములయందు బాలురకును పెద్దవాండ్రకును భేదము తలనుబట్టి తెలియును. బాలురకు దేహమును పట్టిచూడా శిరస్సు పెద్దదిగనుండును. పెద్దవారికి చిన్నదిగ నుండును.
ఇం దభ్యాసమైన తర్వాత మనుజు లేదైన పనిని చేయుచున్నటుల వ్రాయింపవలయును. రెండవ ప్రకరణము.
కొంచెము చేయి కుదిరిన తరువాత రెండు చేతులతోను వ్రాయుట నభ్యసింప వలయును. 3 - 1&2 చూడుము.
ఇవి చక్కగ వ్రాయగలిగిన తరువాత నీదిగువ నుదహరించినవి రెండు చేతులతో వ్రాసిన చక్కగ వచ్చును. 3 - 3&1 చూడుము.
N. B. పై నుదహరించిన 3 సంఖ్యలవి వ్రాయుట చాల కష్టమైన పని. వీనియందు బాలురకు చాల యభ్యాస ముండవలెను. మొదట ఎడమచేతితోను తరువాత కుడిచేతితోను వ్రాయించుచుండవలెను. అనేక వస్తువుల నొకపర్యాయము వ్రాయుటకంటె నొక వస్తువునే యనేక పర్యాయములు వ్రాయుట చాల లాభకరము.
వ్రాయుటయం దభిరుచి కలిగిన గాని అభివృద్ధి కాజాలదు. అందువలన నీదిగువ చెప్పినవి వ్రాయింపవలయును.
మూడవ ప్రకరణము.
వస్తువులన్నియు మనకు సమదూరములందుండవు. కొన్ని దూరముగ నుండును. మఱికొన్ని దగ్గఱగ నుండును. దూరముగ నున్నవి చిన్నవిగ కనబడును. దగ్గఱ నున్నవి పెద్దవిగ కనబడును. ఇట్టి సమయమున వ్రాయుటయందు మిగుల జాగరూకతతో నుండవలెను. సమానమైన చెండులను తీసుకొని టేబిలుమీదనో నేలమీదనో యుంచి వ్రాయవలెను. ఇంకొక సంగతి. దూరముననున్న వానిని కొంచెమెత్తుప్రదేశమునందు వ్రాయవలెను. 5-1చూడుము.
కొన్ని వస్తువులు పెద్దవిగను మరికొన్ని చిన్నవిగనుండును.5-2 చూడుము.
మనుష్యుని కంటె గడ్డికుప్ప పెద్దదిగ నుండును. అట్టి సమయమునందు గడ్డికుప్ప దూరముగనుండినను పెద్దదిగ కనబడును. చాలా దూరముగనుండిన చిన్నదిగా కనబడును. 5-3 & 4 చూడుము.
ఒక వస్తువుముందు మఱి యొక వస్తువుండిన వెనుక నున్న వస్తువు కొంతవఱకే కానబడును. ముందునున్న వస్తువు పూర్ణముగ కనబడునుయ 5-5 చూడుము. నాల్గవ ప్రకరణము.
వృక్షములు:- మొదట మెత్తని పెన్సిలును తీసికొని చెట్టుయొక్క ఏభాగమునందు ఎక్కువనీడ యున్నదో దానిని వ్రాసి పిమ్మట వెలుతురు పడుచున్న భాగములను వ్రాయవలయును. తరువాత కొమ్మలు పైకివచ్చునటుల జాగరూకతతో వ్రాయవలెను. పిమ్మట మొండెమును చిత్రింపవలయును. 6 - 1 చూడుము.
కొన్నికొన్ని సమయములయందు కొమ్మలు కాన బడును. వీనిని వ్రాయుటయందు జాగరూకత గలిగియుండవలెను. చెట్టుయొక్క మొండెము మిగుల పెద్దదిగ నుండి కొమ్మలంతకంతకు సన్నమైపోవును. 6 - 2 చూడుము.
అనేకజాతుల చెట్లున్నవి. మఱ్ఱిచెట్టు పొట్టిగను దట్టముగను ఉండును. మునగచెట్టు పలచగ నుండును. కొన్ని చెట్లయం దచ్చటచ్చటమాత్ర మాకు లుండును. కొబ్బరిచెట్టుయొక్క కొనయందే ఆకు లుండును. వివిధజాతుల చెట్లను వ్రాయుటయందు వానివానికిరూపును ప్రదర్శించుచు వ్రాయవలెను. 6 - 3 & 1 చూడుము.
తుప్పలయొక్క మొండెము కానరాదు. 6 - 5 చూడుము.
దూరమున నున్న చెట్లసమూహమునందు కొమ్మలుకాని విడివిడి చెట్లుకాని కానబడవు. 28 - చూడుము.
ఆకు లనేకవిధములు. బాలునిచేతి కొకయాకు నిచ్చి దాని రూపమును వ్రాయింపవలెను. ఇది బాగుగ వచ్చిన తరువాత కొమ్మలను వ్రాయవలెను. 7 - చూడుము.
ఐదవ ప్రకరణము.
వెనుకనున్న వస్తువు దానిముం దున్నదానిచే కొంతవరకుకప్పబడునని యిదివరకే చెప్పియుంటిని. ఇది అన్నివిషయములందును నిజముకాదు. అద్దముయొక్క వెనుకనున్న వస్తువుకూడకనబడును. కాని అద్దమును వ్రాయుటయందొక కష్టమున్నది. దానియందు ప్రకాశము ప్రతిఫలించును. 8 - 1 చూడుము.
చంచలనము లేనినీటినిచూబఱచుట కష్టము. దానిప్రక్కను మఱియొక వస్తువు నుంచి నీ రచట నున్నటుల కనబఱుపవచ్చును. 8 - 2 చూడుము.
8 - 2 సంఖ్యగల బొమ్మలో నొకచెఱువున్నటుల సులభముగ తెలియును. చేపపై కెగియునపుడుకాని నీటిపక్షు లీదినపుడుగాని నీటిని చంచలింప జేయును. ఇటుల వ్రాసిన నచ్చట నీరున్నటుల స్పష్టముగ తెలియును.
కొన్ని సమయములయందిట్టినీరు లేనప్పటికిని వీటియొక్క పనినిబట్టి అచ్చట జలమున్నటుల తెలియును.
సూర్యుడు వెలుతురునుబట్టి వస్తువుల రంగు మాఱుచుండును. తీవ్రమగు యెండకాయుచున్నప్పుడును, మబ్బువేసినప్పుడును, రాత్రియందును వివిధవిధముల వస్తువులు కానబడుచుండును.
ఆఱవ ప్రకరణము.
పక్షులకును బుఱ్ఱ, కాళ్లు, మొదలగునవి యుండును; కాని వానియొక్క రూపములనుబట్టి యిదికాకి, ఇది పక్షిఅని పోల్పగలము.
పక్షుల పాదములు వాని దేహములకు సమానముగా మధ్య నుండును. లేనియెడల పక్షి పడిపోవును. యేమిపని చేయుచున్నదో తెలియజేయుచు వ్రాయవలెను.
తోక కొన్నిసమయములయందుమీది కెత్తియుండును. మఱికొన్ని సమయములయందు దించి యుండును. ఎగురునప్పుడు ఱెక్క అనేకవిధముల నుండును. పక్షుల పతములు వ్రాయుటయందు దీని విషయమై మిగుల జాగరుకతతో నుండవలెను.
ఒక్కొక్క జంవువున కొక్కొక్క స్వభావముండును. చెవులపిల్లి ఎలుకను పట్టునటుల వ్రాసిన సందర్భముగ నుండును. కనుక దేనిస్వభావమును చూపుచు దానిని వ్రాయవలెను.