చిత్రలేఖనము/BOOK I/నాల్గవ భాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నాల్గవ భాగము.

మనుజుని రూపము.

మనుష్యులను వ్రాయుటయందు మన మనేకసంగతులను గమనింపవలెను. మనము వ్రాసిన చిత్రమునందు భాగములన్నియు ననుపాతముగా నున్నవో లేవో చూచుకొనవలయును. 20 - 1 చూడుము.

చిన్న కాళ్లును, పెద్దనడుమును, ఇంక పెద్దతలను, కలిపి వ్రాసినయెడల హాస్యాస్పదముగ నుండును. బుఱ్ఱకు తగినచేయి, చేతికి తగిన దేహము, దేహమునకు తగిన కాళ్లు ఉండునటుల చిత్రమును వ్రాయవలయును.

కొన్నికొన్ని సమయములయందు కాళ్లు పెద్దవిగ వ్రాయవలసివచ్చును. మఱికొన్ని సమయములయందు బుఱ్ఱ పెద్దదిగ వ్రాయవలసివచ్చును. ఇట్టిసమయములయందటుల చేయక తీరదు. ఏలయన, నేదో యొకపుస్తకము ననుసరించి చిత్రమును వ్రాయవలసివచ్చినప్పు డందు చెప్పినట్లు వ్రాయుటకు బద్ధులైయుందుము. నవ్వుపుట్టించు చిత్రము నేదైన వ్రాయవలసివచ్చినప్పుడుకూడ మన మన్నియు సమముగ వ్రాయుటకు వీలుండదు. కాన మనము సమయమునుపట్టి చిత్రమును వ్రాయవలసియుండును. 20 - 2 చూడుము.

ఆఫ్రికాదేశమునందు నివసించు నీగ్రోజాతివారికి పెదవులు పెద్దవిగ నుండును. జపానుజాతీయులకు కండ్లు చిన్నవిగను ముఖములు బల్లపరపుగ నుండును. పోలండు దేశీయులు కురుచుగ నుందురు. వీరిచిత్రములను వ్రాయుట యందు వీరివీరిరూపముల ననుసరించి వ్రాయచుండవలెను.

ఒకమనిషి నిలువబడియుండినవానిని వివిధస్థలములనుండి చూచిన ననేకవిధముల కనబడును. మన మేదైన జనసమూహమును వ్రాయవలసివచ్చినపుడు మనుజులంద ఱొకేవిధముగ నిలువబడినటుల వ్రాసిన ప్రకృతిరూపము ననుసరించి యుండును. అందువలన ననేకవిధములైన రూపముల ననుసరించి వ్రాయుట నభ్యసింప వలయును. 21 చూడుము.

ఇచ్చట నచ్చువేసిన ప్రకారము తలల నభ్యసింపవలెను. మొదటిభాగమునందు మనుజునాకార మెటుల వ్రాయుటయో చెప్పియుంటిని. ఇట్టి స్థితి యందటుల వ్రాయక మీరు మనుజుల నెటుల చూచెదరో యటుల నభ్యసింపవలెను.

కొన్ని సమయముల యందు పరుగెత్తుచున్నటుల మఱి కొన్ని సమయముల యందు నిలుబడినటుల ఇతర సమయములయందు పనిచేయుచున్నటుల వ్రాయవలసివచ్చును.

స్త్రీలు కోమలశరీరలు. వారి యంగములు పురుషుల యంగములవలె నుండవు. ఇవి యెట్లుండునో చూచిననే బోధపడునుగాని వర్ణించుట నాతరము కాదు. పురుషుల శరీరములందు నరములు కనబడు చుండును. స్త్రీల యంగములయం దటుల కనంబడవు. పురుషుల స్నాయువులు పైకి కనబడును. స్త్రీలవి కనంబడవు. ఇట్టి భేదములు బహు జాగరూకతతో గమనింపవలెను.

పురుషుల ముఖములకును స్త్రీల ముఖములకును అనేక భేదము లుండును.

ఇట్టివాని నభ్యసించుట యందు కన్నులు, ముక్కు, నోరు, మీసములు, గడ్డము, చెవులు, చేతులు, పాదములు, కాళ్లు మొదలగు నంగములను వ్రాయుట నేర్చుకొనవలెను. ఇంకొక సంగతిని జ్ఞాపక ముంచుకొనవలసియున్నది. వయస్సునుబట్టి యా యంగములరూపు మాఱుచుండును.

పసిబాలుని యంగములన్నియు గుండ్రముగ నుండును. యౌవన వంతుని యంగము లన్నియు బలిష్టములై యుండును. రోగులమాట నేను చెప్పుటలేదు. వృద్ధుల యంగములు వదలి యుండును. 22 - చూడుము.

ఐదవ భాగము.

ఛాయాపటములను పెద్దవిగ వ్రాయుట.

ముందు చెప్పినప్రకారము బాగుగ నభ్యసించినకాని ఛాయాపటములను పెద్దవిగ వ్రాయజాలరు. ప్రదేశ పటములను లిఖింపగలిగినను మనుష్యాకారములను చిత్రింపగలిగినను ఈవిద్యకుదురుట కష్టము. దీనియందభ్యాసము కలుగజేసికొనుటకు ఛాయవ్రాయుట చాల యభ్యసింపవలయును. ఇందు బహుజాగరూకత గలిగియుండవలెను. లేనియెడల చిత్రమునువ్రాయజాలము. ఏలయన: కొంచెము తప్పిపోయిన చిత్రముయొక్క రూపమంతయు మాఱిపోవును.