Jump to content

చిత్రలేఖనము/BOOK I/మూడవ భాగము

వికీసోర్స్ నుండి

మూడవ భాగము.

ప్రదేశ చిత్రలేఖనము.

మొదటి ప్రకరణము.

మననేత్రములు గొప్పయంత్రములు. ఇవి లేని జీవనమెందుకు? మనుజులు తమచాకచక్యమునుబట్టి వీనినుపయోగించదరు. ఒకమూర్ఖునియెద్దనొక సుప్రసిద్ధచిత్ర ముంచినయెడల "ఇది బాగుగలేదు. రంగులు దట్టముగ నుండిన బాగుగ నుండును" అనును. దానినే యొకచిత్రలేఖకునియెద్దునుంచిన నెంతో యానందించును.

మనమేదైన ప్రదేశమును (Landscape)చిత్రింపవలెనన్న చాలజాగరూకతతో నొకదృష్టము (Scene) ను ఎంచుకొనవలెను. అది చూచుట కానందకరముగ నుండవలెను. ఇందుకు మనుజునకు చిత్రలేఖనాభ్యాసము ముఖ్యము. మనయభ్యాసమెక్కువైన కొలది మంచి దృష్టములను ఎంచుకొనుశక్తి గలుగుచుండును. మనమేదైనా చూచునప్పుడు ఒక గుండ్రని దృష్టము దృగ్గోచరమగును.

18 చూడుము

కాని మనము దీనిని వ్రాయునపుడు మొదట దృష్టి మట్టపుగీతను నిర్ణయింపవలెను. దానింబట్టి మనము చిత్రమును వ్రాయవలెను. ఈ గీతకు పైనున్న వస్తువుల దిగువ భాగము కాన్పించును గాని పైభాగము కాన్పింపదు. దానికి దిగువునున్న వస్తువల పైభాగము ప్రధానముగ కాన్పించును. అందువలన ఈగీత చాలా ముఖ్యమైనది. 18 చూడుము

వ్రాయునపుడు పెద్దవస్తువలను మొదట వ్రాయవలెను. తరువాత చిన్నవస్తువులను లిఖింపవలెను. ఇవన్నియు వ్రాసినతరువాత వెనుకభాగము (Background) ను వ్రాయవలెను.

మనకు దగ్గరనున్నవస్తువులు చక్కగ కాన్పించును. దూరమున నున్నవస్తువు లంతస్పష్టముగ కాంపింపవు. దీనింబట్టి మనము వ్రాయుగీతలదట్టము మారుచుండును. ఇంకొకసంగతి గమనించవలసియున్నది. ఇట్టి స్థలములను వ్రాయుటయం దొకజాగ్రతను వహింపవలయును. కొలతప్రకార మన్నియు వ్రాయవలసి యుండును. దూరముననున్న చెట్టుకంటె దగ్గరనున్న మనుజుడు పెద్దగ కనబడును. మనుజుడు, చెట్టు మనకొకే దూరమున నుండిన చెట్టునే పెద్దదిగ వ్రాయవలెను. పిల్లచెట్లు మనుష్యునికంటె చిన్నవిగ నుండవచ్చును. అట్టిసమయమున నాచెట్లు బాల్యమునం దున్నవని చక్కగ నిరూపింపవలయును.

ఇంకొకసంగతి. కొన్నిచిత్రములలో నొకరాతిదగ్గర నొకమనుజుడు నిలువబడినట్లు మీరనేక పర్యాయములు చిత్రపటములలో చూచియుందురు. ఆరాతియొక్క కొలతను తెలియజేయుట కట్టుల వ్రాసెదరు.

ఇప్పుడు మనమొక పెద్దవృక్షమును వ్రాసిన దానియెత్తు మనకు తెలియదు. దానిం దెలియ జేయుటకు గాను సాధారణమైన పొడుగుగలమనిషి దానివద్ద నిలుచున్నట్లు వ్రాసిన వృక్షముయొక్క యెత్తు చక్కగ విశదమగును.

ఒక్కొక్క దేశమునం దొక్కొక్క విధమైన దుస్తులను ధరించెదరు. మహమ్మదీయులు షరాయిని దొడిగి వారి జాతీయటోపీని ధరించెదరు. హిందువులు పంచెను కట్టుకొని తురకటోపీ నెవరును ధరింపరు. కాన నిట్టితప్పులనుండి మనము తప్పించుకొనుచుండవలెను.

హాలండునం దొకస్థలమును చిత్రించిన హాలండు మనుజులనే వ్రాసినయెడల సందర్భముగ నుండును. మనము వ్రాయు రూపమునం దుండుమనుజు లేదేశీయులో తెలిసికొనుటకు వీలుకలుగుచుండవలెను. ఒక్కొక్క దేశీయుల రూపురేఖ లొక్కకమోస్తరుగ నుండును. వీనిని ప్రదర్శించుటయందుకూడ మిగుల జాగరూకత వహింపవలెను.

హిందూదేశమునం దొకకఱ్ఱం జేతనిడికొని గొఱ్ఱెలకాపరి గొఱ్ఱెలను కాయుచుండును. ఇంగ్లాండువారు పంట్లామును తొడుగుకొని వంకకఱ్ఱను పట్టుకొని గొఱ్ఱెలను కాయుచుండును. కాన నట్టిసమయమునందు వానిదగ్గర హిందూదేశమునందు నివసించు రెండుకొబ్బరిచెట్లను వ్రాసిన సందర్భవిహీనముగ నుండును.

గాలివేయుచున్నప్పుడు చెట్లు వంగి యుండును. అన్నియు నొకవైపునకే వాలియుండును. అందున్న మనుష్యుల బట్టలుకూడ ఎగురుచుండును. కనుక రూపము నందు కనుపఱచిన ప్రతివస్తువు గాలియొక్క ప్రతాపమునకు లోనౌను. ఇట్టివి వ్రేయుట చాల కష్టము.

ఏదైన దేశచరిత్రమును వ్రాయునపుడు ఏకాలము నందు జరిగిన సంగతిని ప్రదర్శింపబోవుచున్నామో మనస్సునం దుంచుకొని వ్రాయుట ప్రారంభింపవలయును. లేనియెడల తప్పులకు లోనౌదుము. అప్పటికాలపు ఆచారములు, దుస్తులు, వారుపయోగించు పరికరములు, ఇండ్లు మొదలుగాగల వానియొక్క రూపములు మనకు చక్కగ తెలియుండవలెను.