Jump to content

చిత్రభారతము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చిత్రభారతము

షష్ఠాశ్వాసము



యువతీకరుణావీ
క్షాయతసంపద్విశేష హరి భూరుహ రా
ధేయ శశిదాన హరశో
భా యెన్ములపల్లి మాదయప్రభుపెద్దా.

1


వ.

అవధరింపుము మృదుమధురవచనరచనాపరితోషితముని
జాతుం డగుసూతుండు హరికథాశ్రవణాహ్లాదు లగుశౌన
కాదులకు నిట్లనియె నయ్యజాతశత్రుం డభ్యంతరమంది
రంబునకుం జని యంతవృత్తాంతంబును గుంతి, ద్రౌపదుల
కెఱింగించి భీమార్జుననకులసహదేవచతుర్దనసమేతుండై
నిజబలం బక్షౌహిణీద్వితయంబునం గొలువఁ గరినగరం
బున కరిగి తమతాత యగుభీష్ముపాలికిఁ జని యతనికిం
బ్రణామం బాచరించి తదనుజ్ఞాపూర్వకంబుగా నుచితపీఠం
బునం గూర్చున్న యంత సహజసంభాషణంబు లాడుచు నా
దేవవ్రతుం డాధర్మనందనున కిట్లనియె.

2


తే.

పాండవాగ్రజ యేమి నెపంబు గలిగెఁ
దమ్ములును నీవు నధికవేగమ్ముతోడ

నిచటి కేతేర నీమానవేశుఁ డెవ్వఁ
డీవిధంబంతయును నాకు నెఱుఁగఁ జెపుమ.

3


సీ.

అనవుడు ధర్మనందనుఁడు గేలు మొగిడ్చి
             యమ్మహాత్మునితోడ నర్జునుండు
వేఁటఁబోయినయట్టివిధమును గుండినా
             ధీశుండు వచ్చి ప్రార్థించుటయును
నతనిఁ గావఁగఁబూని యనిమిషేశ్వరసూతి
             ప్రతిన గావించినపద్ధతియును
దమ్మునిమాట యుద్ధతి మీఱఁ జెల్లింపఁ
             నొడఁబడ్డచందంబు నుచితభంగిఁ


తే.

దెలియఁజెప్పిన నాతండు కలఁకనొంది
వేఁడినిట్టూర్పు నిగిడించి విషమకార్య
మయ్యెఁ గృష్ణునితోడఁ గయ్యంబుకలిమి
ననుచుఁ జింతించి యిట్లను నతనితోడ.

4


శా.

భద్రేభాయుతసత్త్వశాలి సమరప్రౌఢప్రతాపాఢ్యుఁ డ
చ్ఛిద్రప్రాభవుఁ డుగ్రవైరిదనుజశ్రేణీతమస్సూర్యకో
పోద్రేకుండు గుణౌఘభూషణుఁడు దానోపాయదక్షుండు ని
ర్ణిద్రుం డాఢ్యుఁడునైన శౌరి యనిలో నిల్వన్ హరుం డోపునే.

5


క.

ఎక్కడి చతుర్ధనుం డిటు
ద్రెక్కొని యేతెంచెఁ బుండరీకాక్షునితో
నెక్కడి పోరాటము మన
కక్కట సమకూడె దైవమా యని మఱియున్.

6

క.

ఇలఁ దనదు మేలుఁ గీడును
నలఘుమతిస్ఫురణఁ గరతలామలకముగాఁ
దెలియక [1]వెంగలితనమునఁ
బలికినఁ గీడొందు నెట్టి బలియునికైనన్.

7


మ.

వనజాక్షున్ బలి వేఁడఁజేసె నల దేవజ్యేష్ఠశీర్షంబుఁ బో
నొనరించెన్ మరు రూపుమాపె నమరవ్రాతేశు నొంచెం దపో
ధను లెల్లం బ్రతివాసరంబును మదిం “దస్మై నమః కర్మణే"
యనుచు మ్రొక్కఁగ దాని గెల్వ మనశక్యంబా విచారించినన్.

8


క.

కావలసిన యర్థంబులు
దైవప్రేరణము కతనఁ [2]దఱిఁ దామె యగున్
గావున నర్జును దూఱం
గా వల దీ రాజుఁ గావఁగాఁదగు మనకున్.

9


క.

అని యాగంగానందనుఁ
డనిపిన ధర్మజుఁడు వేడ్క నవనీనాథుం
డునుఁ దమ్ములుఁ దోఁ జనుదే
ర నరిగె ధృతరాష్ట్రుమందిరమునకు ననఘా.

10


వ.

అదియు శరచ్చంద్రచంద్రికానూనప్రభాపటలచటులహీర
వారస్థగితహేమకుంభవిరాజితంబును బాలభానుభాను
విజృంభమాణమాణిక్యబద్ధసమిద్ధభిత్తిమనోహరంబును శుద్ధ
స్ఫటికఘటితప్రాంగణప్రదేశంబును నానావిధవిచిత్ర
వితానసంతానసముల్లసితోపరిభాగంబును ముక్తాఫలవల్లరీ
ప్రభాఝల్లరీతోరణాలంకృతంబుసు వివిధమణిగణరంగ

వల్లీవిలసితంబును నై సరోవరంబునుంబోలె రాజహంస
ధార్తరాష్ట్రనివాసం బై, హరికథావిలాసంబునుంబోలెఁ
గర్ణానందకరంబై, రాక్షసకృత్యంబునుంబోలె దుశ్శాసన
గౌరవం బై చండభానూదయంబునుంబోలెఁ దోషితపద్మినీ
మండలంబై యొప్పు నందు.

11


సీ.

అంగ వంగ కళింగ బంగాళ నేపాళ
             చోళ బర్బర సింధు మాళవాంధ్ర
భోట పానాట కాంభోజ మహారాష్ట్ర
             సౌవీర ఘూర్జర సాల్వ మత్స్య
లాట కర్ణాట మాళవ కుంతల మగధ
             సావంత యామున యవన మద్ర
కొంకణ కేకయ టెంకణ హూణ కు
             ళింద సౌరాష్ట్ర పుళింద పాండ్య


తే.

కాశి కాశ్మీర నాట త్రిగర్తఝాట
భోట మలయాళ కోసల పుష్పితాది
భూపతులు దొరల్ మంత్రులు బుధులుఁ గొలువ
నోలగంబున ధృతరాష్ట్రుఁ డుండె వేడ్క.

12


తే.

నిఖిలరాజన్యమౌళిమాణిక్యవిమల
కిరణనీరాజితాంఘ్రిపంకేరుహుండు
నిరుపమానంతసంతోషభరితుఁ డగుచు.
నిండుగొలువున దుర్యోధనుండు నుండె.

13


వ.

అంత నయ్యజాతశత్రుండును భీమాద్యనుజచతుష్టయం
బును జతుర్ధనుండును దోడరా దౌవారికులవలన నవసరం
బెఱింగినవాఁడై కొలువుకూటంబునకుం జని యయ్యాంబి

కేయునకు వందనం బాచరించి తనకు నెఱఁగిన దుర్యోధ
నాదికుమారులను దక్కిన రాజవరుల నాలింగనసంభా
షణాద్యుపచారంబులఁ గారవించి కనకపీఠికాసీనుండై
యందఱ నుచితాసనంబులఁ గూర్చుండ నియమించి తత్త
దుచితప్రకారంబున సంభావించుచున్న యవసరంబున
నచ్చతుర్దనుం డచ్చీఁకుఱేనికి నమస్కరించిన.

14


క.

ఆనరనాయకుఁ గౌరవ
భూనాథుం డెత్తి ధర్మపుత్త్రునితో నీ
మాననపతి యెవ్వం డిట
రా నేమికతంబు గలిగెఁ గ్రమమునఁ జెపుమా.

15


క.

నావుడు ధర్మజుఁ డక్కురు
భూవరునకు నెడ్డఁ గరుణ పొడమఁ బలికె నా
దేవవ్రతునకుఁ జెప్పిన
ఠేవన్ నరుపూన్కి రాజు డెప్పరముఁ దగన్.

16


వ.

ఇట్లు దెలిపి.

17


తే.

అర్జునుప్రతిజ్ఞతోఁగూడ నవనినాథ
యితనిఁ బాలింపు మిందుకై యిచట కేగు
చెంచినాఁ డిట్టి కర్జంబు దేవవాహి
నీసుతుఁడు వీనిఁ బ్రోవఁగనే తలంచె.

18


క.

మీమనమున నిక్కార్యం
బేమని తలఁచితి రన న్నరేంద్రుఁడు కృపతో
నీమనము గల్గియుండఁగ
నీమనుజేశ్వరునిఁ గావ నెంతనె నాలోన్.

19


వ.

శకుని కర్ణ దుర్యోధన దుశ్శాసనులుఁ దమలో విచారించి
హర్షించి రందు శకుని ధర్మజున కిట్లనియె.

20

ఆ.

ధర్మతనయ నీకుఁ దగునె బేలవుఁబోలె
వాఁడిఁ జేసి యిట్లు నేఁడు పలుక
యాదవేంద్రుసత్వమంతయు మన మెఱుం
గుదుముగాదె [3]గెలువఁగూడు ననిన.

21


వ.

కర్ణుం డిట్లనియె.

22


ఉ.

అర్జునునంతవాఁ డితని నాదరణంబునఁ గావఁబూనె నా
నిర్జరు లెల్ల వచ్చి ధరణీవరకోటులఁ గూడి విక్రమ
స్ఫూర్జితమూర్తులై యనికిఁ జొచ్చిన వీని వధింప శక్తులే
కర్జమునం దలుప నల కంజదళాక్షునిఁ జెప్ప నేటికిన్.

23


వ.

అనిన దుర్యోధనుం డిట్లనియె.

24


మ.

వనజాక్షుండన నెంత చాపగురుఁ డశ్వత్థామయున్ గౌతముం
డును మీ రేవురు నేను బాహ్లికుఁడుఁ గర్ణుండున్ మదీయానుజుల్
ఘను లీరాజులు భీమజాద్యసురులున్ గంగాసుతుం డాదిగా
మనసైన్యంబులు గూడి పొల్చిన రణక్ష్మామండలి న్నిల్చునే.

25


వ.

అని మఱియు వీరాలాపంబు లాడి శరణాగతుండగు నీ
చతుర్ధనుం గావంబూనిన యర్జునుప్రతిజ్ఞ[4]తోన నడరు
నని నిశ్చయంబుగాఁ బల్కిన యనంతరంబ దుశ్శాసనుం
డిట్లనియె.

26


చ.

మనము సమస్తభూవరసమాజము సేనలతోడఁ గూడి రాఁ
బనుపుద మంత నాధరణిపాలురు వచ్చిన సైన్యరాజితోఁ
గినుక దలిర్ప ద్వారవతికిం జని వేడెలు వెట్టి యాచతు

ర్ధనునిభయంబుఁ బాపుదము దానవసంహరుఁ బాఱఁ
దోలుచున్.

27


వ.

నావుడు నాదుష్టచతుష్టయంబు నాలోకించి యుధిష్ఠిరుం
డిట్లనియె మనము సకలరాజన్యుల రావించి శ్రీకృష్ణుని
తలఁపుఁ దెలియ నొక్కదూతం బంపి యక్కార్యంబుఁ దెలిసి
చేయవలయుచందంబునఁ జేయుదము గాంగేయుం డిబ్భంగి
నిశ్చయించుననినఁ దక్కినవార లెల్ల నట్లకాక యని రంత
నంతవృత్తాంతంబు విని యశేషరాజన్యలోకంబును నిజ
సైన్యసమేతంబుగా రాఁబనిచి పాండవేయుల నిజనివాసం
బున కనిచి చతుర్ధనున కొక్కహర్మ్యంబు [5]విడిది యొసంగ
నియమించి దుర్యోధనాదులను దక్కిన భృత్యామాత్య
వర్గంబును వీడు కొలిపి కొలువు చాలించి యయ్యాంబి
కేయుండు సంజయుకరం బూఁతగాఁ గొని విదురుండును
దోడరా నభ్యంతరమందిరంబున కరిగె నంత నానాదేశా
ధీశులు తమతమచతురంగబలంబులతో హస్తిపురికి రాఁ
దొడంగి రందు.

28


ఉ.

భండనభీమవిక్రముఁడు బాణకళానిపుణుండు మత్తవే
దండఘటాతురంగమరథప్రకరంబులతోడ మత్స్యభూ
మండలనాథుఁడైన యరిమానవిభంజనశాలి యావిరా
టుం డరుదెంచె సంగరపటుత్వమునం గురురాజువీటికిన్.

29


ఉ.

సింధురబంధురాశ్వరథసేవితుఁడై చనుదెంచి సన్నభ
స్సింధురమానుజాతసురసింధురపాండురకీర్తి వేడుకన్

సింధువిభుండు సైంధవుఁ డసిప్రముఖాయుధదీక్షితుండు ద
ర్పాంధుఁడు యుద్ధరంగనిహతాహితవీరుఁ డుదారమూర్తియై.

30


క.

విందానువిందు లఖిలా
రిందము లుగ్రాహవసుపరిశ్రమసేనా
బృందముతో వచ్చిరి యా
నందం బెసఁగంగ హస్తినాపురమునకున్.

31


క.

మత్తగజదానధారా
యత్తభ్రమరీవితానహారిస్వనముల్
చిత్తమున మెచ్చుచున్ భగ
దత్తుం డేతెంచె గబ్బితన మేర్పడఁగన్.

32


క.

క్ష్వేడాకంపితకూర్మ
క్రోడదిశాకుంభిగోత్ర గోత్రమరుద్భు
గ్రాడంబుధియై సమర
క్రీడారతి మీఱ ధృష్టకేతుఁడు వచ్చెన్.

33


తే.

దర్పితారాతి రాజకాంతాకుచాగ్ర
హారిహారగుళుచ్ఛసంహరణచణకృ
పాణభూషితనిష్ఠురపాణి యగుచు
సేనతో గూడ నాసుదక్షిణుడు వచ్చె.

34


క.

నిజకరిహరిరథసుభట
వ్రజపాదోద్ధూతభూపరాగపిహిత నీ
రజహితులై కేకయు ల
క్కజముగఁ జనుదెంచి రపుడు గరిపురమునకున్.

35


క.

అక్షీణ నిజమహాశుగ
లక్షీకృతవైరి నృపకలాపశరీరుం

డక్షౌహిణితోఁ బాంచా
లక్షోణీశ్వరుఁడు సుతు లలమిరా వచ్చెన్.

36


శా.

చండాయోధనకల్యుఁ డున్నతభుజాచంచద్గదాదండమా
ర్తాండప్రోద్భవతుల్యుఁ డుగ్రరిపువీరస్వాంతశల్యుండు శ
ల్యుం డక్షౌహిణి తన్నుఁ గొల్వఁగ జయోద్యోగంబుతో వచ్చె ను
ద్దండప్రక్రియ మించ నచ్చటికిఁ బాతాళక్షమాధీశ్వరా.

37


శా.

రక్షోనాథశిఖావతంసము సమగ్రప్రాభవుం డుగ్రయు
ద్ధక్షోణీతలభీష్మమూర్తి రిపుకాంతాకంఠసూత్రఛ్ఛిదా
దక్షాక్షుద్రకుఠారహస్తుఁడు సముద్యత్క్రోధధూమధ్వజుం
డక్షీణోద్ధతి వచ్చె భీమజుఁడు దా నక్షౌహిణీయుక్తుఁడై.

38


శా.

అంగాధీశుఁడు చోళవల్లభుఁడు పాండ్యక్ష్మాతలేంద్రుండు కా
ళింగుం డాంధ్రవసుంధరాధిపతి పౌళిందుండు నేపాళుఁడున్
బంగాళేశుఁడు మాళవక్షితిపుఁడున్ బానాటనాథుండు న
వ్వంగక్షోజీవిభుండు నాదిగ జగద్వంద్యుల్ నృపుల్ వేడ్కతోన్.

39


వ.

అరుగుదెంచిరి మఱియు మాహిష్మతీపతి యగునీలుండును
విదర్భాధీశ్వరుం డగురుక్మియును మొదలుగాఁగల నానా
దేశాగతరాజన్యులు పదునాలుగక్షౌహిణులతోడం గూడి
చనుదెంచిన ధృతరాష్ట్రానుమతంబున దుశ్శాసనాదిధార్త
రాష్ట్రులు తమతనుమూలబలంబు [6]రెండక్షౌహిణులు కొలువ
రథాధిరూఢులై యెదురుచని యారాజసమూహంబుఁ
దోడ్కొని హస్తిపురంబునకు వచ్చి యయ్యైఠావుల విడియ

నియమించిన వారలకు నప్పురంబునుం దన్మహోద్యాన
ప్రాంగణప్రదేశంబునుఁ బట్టుచాలక క్రిక్కిఱిసి యుండె
నంత.

40


తే.

పాండవులుఁ గౌరవులు సర్వపార్థివులును
హస్తిపురమునఁ గూడుట యాప్తచరులు
దనకు వినిపింపఁ గృష్ణుఁ డుద్ధవునిఁ బిలువ
నంపి యాతనితోడ నిట్లనుచుఁ బలికె.

41


క.

కలియును నూనెయు బలె మును
గలయక క్షీరోదకముల కరణిం గౌంతే
యులుఁ గౌరవు లిపు డెనసి స
కలనృపులను గూర్చినారు కరినగరమునన్.

42


వ.

అందు.

43


తే.

పాండవులు నాకు నొక్కింతపనియుఁ జెప్పి
కాని చేయరు నేఁ డిట్టికార్య మెత్తి
యెఱుఁగ వినిపింప రిందుల కేనెపంబొ
చిత్ర మయ్యెడి బుద్ధి నీక్షించి చెపుము.

44


వ.

అనవుడుఁ గృష్ణున కుద్ధవుం డిట్లనియె.

45


తే.

మనము బంధుల మీధరామండలమునఁ
గలుగు నృపులును వారినే కలిసినారు
రిపుఁ డొకండును లేఁడు తర్కించి చూడ
నింక నొకమాట వినుమని యిట్టు లనియె.

46


సీ.

ఈధృతరాష్ట్రుపై నాధృతరాష్ట్రుండు
             వచ్చెనో పన్నగ[7]వైరిఁ గూడి

యీరాజరాజుపై నారాజరా జెత్తి
             యరుదెంచెనో యక్షు లలమికొలువ
నీధర్మరాజుపై నాధర్మరా జెత్తి
             వచ్చెనో కింకరావళులఁ గూడి
యీధనంజయునిపై నాధనంజయుఁ డెత్తి
             వచ్చెనో ధర వడవడ వడంక


తే.

నాత్మఁ బెనగొన్న సామ్యపుటలుక గలుగు
కతనఁ గాకున్న వీర లీకరణి గూడఁ
గారణం లేమి యచటి కొక్కరునిఁ బంచి
తెలియఁ దగు నిది వసుదేవతనయ.

47


వ.

అనిన నయ్యాదవోత్తముండు త్రికాలవేది యయ్యును
రాజధర్మం బవలంబించి యక్రూరునిం బిలిపించి యతనితో
నిట్లని యానతిచ్చె.

48


క.

పాండవులుఁ గౌరవులు వే
దండపురమ్మున సమస్తధరణీశుల ను
ద్దండతఁ గూరిచిరఁట యా
దండునకుంబోయి ధర్మతనయాదులతోన్.

49


క.

మనసేమముఁ జెప్పి నయం
బున వారివిధంబు స[8]ర్వముం దెలిసి రయం
బున రమ్మని యనుప నతఁడు
చనియె రథారూఢుఁడై గజపురమునకున్.

50


వ.

చని యతఁడు తత్పురోపవనప్రాంగణప్రదేశంబునఁ గ్రందు
కొనియున్న సకలసైన్యంబుల నున్నతప్రాకారగోపురాట్టా

లకప్రాసాదంబులం గనుంగొనుచు నరిగి యరిగి రాజమం
దిరద్వారంబున రథావతరణంబుఁ జేసి దౌవారికులచేతఁ
దనరాక యాంబికేయున కెఱింగించి తదనుఙ్ఞాతుండై సభా
మంటపంబునకుం బోయి యచ్చట గాంగేయబాహ్లికసోమ
దత్తాదిజ్ఞాతులును, ద్రోణకృపాశ్వత్థామాదిమహావీరు
లును, యుధిష్ఠరాదిపాండవేయులును, సుయోధనాది
కుమారవర్గంబును ద్రుపదసౌబలసైంధవాదిబంధువులును
మత్స్య మద్ర మగధ మాళవ నేపాళ చోళ టెంకణ
కొంకణ కోసల కుకుర కురు కరూశాది నానాదేశా
గతరాజవరులును విదురసంజయులుం గొలువ ననర్ఘ్య
మణిమయసింహాసనాసీనుండై పేరోలగంబున్న వైచిత్ర
వీర్యునకుఁ బ్రణామం బాచరించి గాంగేయద్రోణాదులకు
నమస్కరించి తనకు నభివందనం బాచరించిన కౌంతేయ
గాంధారేయాదుల నాలింగనంబు గావించి తక్కినవారల
చేత సంభావితుండై యంతకమున్న యొక్కయింతిచేతఁ
దనకని పెట్టించినకనకపీఠంబునఁ గూర్చుండి కుశలపూర్వ
కంబుగాఁ దత్తదుచితప్రకారంబున వినోదాలాపంబు లాడు
చున్నక్రూరునకు నజాతశత్రుం డిట్లనియె.

51


క.

క్రూరుఁడవుగాని నెపమున
సారససంభవుఁడు నీకు సార్థకముగ న
క్రూరుం డని పే రొసఁగెను
శ్రీరమణపదాంబుజాతచింతనహృదయా.

52


మ.

హరికిన్ సేమమె సీరికి న్ముదమె సాత్యక్యాదితత్సోదరుల్
పరిణామంబున నున్నవారె శుకుఁడున్ బ్రద్యుమ్నుఁడున్ సాంబుఁడున్
దరుఁడున్ మోదముతోఁ జెలంగుదురె యోధశ్రేణికిన్ లెస్సయే

తరుణీసంఘము సంతసం బొదవ నిత్యశ్రీల వర్తిల్లునే.

53


క.

అనఘా నీ వనిశంబును
వనజాక్షునిసేవఁ జేయువాఁడవు నెయ్యం
బున నొక్కవేళను దలం
చునె మముం గృష్ణుఁడు దయసొంపున ననుడున్.

54


తే.

ఆయుధిష్టురుతోడ నిట్లనియె గాంది
నీతనూజుండు తననేర్పు నెగడఁ గృష్టు
నకును మీకును భేద మున్నదె యతండు
మిమ్ము నేప్రొద్దుఁ దలఁచు నర్మిలి దలిర్ప.

55


వ.

అనవుడు నయ్యజాతశత్రుండు సంతసంబునం బొంది మహాత్మా
భవదాగమనంబునకుం గారణం బెయ్యది యనిన నక్రూరుం
డి ట్లనియె.

56


ఉ.

మీరును ధార్తరాష్ట్రులును మించినవైరము దక్కి క్షీరమున్
నీరముఁబోలె నేకముగ నెమ్మిఁ జరించుట రాజవాహినీ
వారముతోడ నిచ్చటికి వచ్చుటయుం దనుజాంతకుండు దాఁ
జారులచే నెఱింగి కడుసంతస మొందెఁ బృథాసుతాగ్రణీ.

57


వ.

ఇత్తెఱంగున మీవృత్తాంతంబు విన్నవాఁడై యావెన్నుండు
నన్నుం బిలిపించి యిట్లని యానతిచ్చె.

58


క.

నీ వచటి కరిగి యేమిటి
కై వచ్చిరొ వారిజాడ లరసి వియద్గం
గావరనందనుఁ బొడఁగని
యావాసవిఁ జూచి యడుగుమని న న్ననిచెన్.

59

చ.

ఏ నమ్మహానుభావుని యానతి శిరంబున నిడుకొని యరుగు
దెంచితి విూర లపారసేనాసమేతుల రయి యిప్పట్టణంబున
నెట్టకేలకుంగూడఁ గతం బెయ్యదియని యడుగ నందు
లకు నయ్యుధిష్ఠిరుండును దక్కినవారలును మిన్నకయున్న
యంతన గాందినేయునకుఁ గాంధారేయాగ్రజుం డిట్ల
నియె.

60


సీ.

అనఘాత్ముఁ డీచతుర్ధనుఁడు దివ్యహయంబు
             నెక్కి యాకసమున నేగుదేర
నాఘోటకాస్యంబునం దుద్భవించిన
             నురువు మారుతముచేఁ దొరిఁగి యమున
లోనున్న తనదుకేల్దోయిలోఁ బడఁగ నా
             కృష్ణుండు నెలకు హరింతు ననుడు
విని భయంబునఁ దన వెన్నుఁ జొచ్చిన వీని
             గాండీవి కరుణతోఁ గావఁబూనెఁ


తే.

గాన శరణొందువానిరక్షణముకొఱకు
నేము సేనలతోఁ గూడి యిచట నుంట
నెపములేని ప్రతిజ్ఞ మాన్పించుటొండె
దేజ మొప్పంగ నితని సాధించుటొండె.

61


క.

పని యిదియె మాకు నిప్పుడు
విను మయ్యాదవుఁడు ప్రతిన విడిచి యతనిఁ దా
మనుచుట మంచిది లేదా
తనబలిమియు మాబలంబుఁ దానే యెఱుఁగున్.

62


శా.

ద్రోణాచార్యుఁడు భీష్ముఁడుం గృపుఁడుఁ గర్ణుం డర్జునుండున్ జగ
త్ప్రణాత్మోద్భవధర్మజుల్ గవలు నాహైడింబుఁడున్ ద్రౌణియున్

క్షోణీనాథులుఁ బోరనిల్వఁగ బిడౌజుండో యజుండో [9]కడున్
వేణుధ్వానముఁ జేసి [10]గొల్లసతులన్ వేఁగూడుటో కయ్యముల్.

63


వ.

కావున బహుశాస్త్రజ్ఞుండవగు నీవు మీకృష్ణునకు బుద్ధిఁ
జెప్పి యా చతుర్ధనుఁ జంపెదనన్న ప్రతిన మాన్పించు
మనవుడు నక్రూరుం డతని కిట్లనియె.

64


తే.

రాజ్యగర్వంబు పెంపున రాజరాజ
మీఁదు గానక యాడితి మిన్న కీవు
సత్యసంకల్పుఁడైన యాచక్రపాణి
ప్రతిన మాన్పెదనని పూన బ్రహ్మతరమె.

65


చ.

సురల జయించి దేవపురి చూఱలుపట్టి సమస్తలోకములో
పొరిఁబొరినేర్చు నయ్యసురపుంగవకోటుల మాటమాత్రలో
శరములపాలు చేసి దివిషద్వరుబెల్ల నుతింపఁబొల్చు నా
హరికిని మీకు హస్తిమశకాంతర మారసి చూడ నెమ్మెయిన్.

66


వ.

మఱియును.

67


సీ.

కల్పాంతశిఖకల్ప[11]కాళియఫణములఁ
             జిదమిదగా మట్టి మద మడంచె
సత్వనిర్జితదిశాసామజశ్రేష్ఠంబుఁ
             గువలయాపీడంబు నవనిఁ గూల్చె
విశ్వలోకాప్రతివీరుఁ జాణూరుని
             బాహుయుద్ధంబునఁ బట్టి చంపె
బంధురబలు జరాసంధుఁ బద్నెనిమిది
             మాఱులు రణభూమిఁ బాఱఁదోలె

తే.

నరకమురదైత్యనాథుల నఱకివైచెఁ
బారిజాతంబుఁ గొని యింద్రు భంగపఱచె
బలితనముతోడఁ బురహరుఁ గలన నోర్చె
నడ్డ మెవ్వాఁడు గలిగె బ్రహ్మాండమునను.

68


క.

పగ యావిభుతోఁ [12]గైకొనఁ
దగదని తెలుపంగ ననికిఁ దార్కొనితిర యేన్
దగరు గిరిఁ బూని తనతల
పగులఁగఁ దాఁకుటయె గాదె పరికింపంగన్.

69


క.

కావున మీరందఱు నీ
భూవల్లభుఁ దోడుకొని ప్రభుత్వముతో మా
శ్రీవనితాధిపపదరా
జీవంబులు శరణుఁ జొరుఁడు చేకొను మిమ్మున్.

70


వ.

అనుడు నా సుయోధనుండు కోపోద్దీపితమానసుండై
యక్రూరున కిట్లనియె.

71


శా.

ఏమేమీ హరి శూరుఁ డంటి నిజమౌనే యాజరాసంధుఁ డు
ద్దామప్రక్రియఁ జుట్టికొన్నఁ బురమున్ దర్పంబు డించెన్ సమి
త్సీమం దాయవనుండు ద్రోల గుహఁ జొచ్చెన్ జూడఁగా నిన్నఁ గా
దా ముంజేతుల కంకణంబులకు నద్దం బేల యక్రూరకా.

72


వ.

అనవుడు నతం డాసుయోధను నలక్ష్యంబుఁ జేసి యుత్తరం
బియ్యక భీష్ము నుద్దేశించి మహానుభావా యితండు మదాం
ధుండు గావున నవ్వీరాగ్రేసరు ప్రభావం బెఱుంగక యా
డెడు శతానందశతంబును సక్రందనసహస్రంబునునైన నా

నందకధరుండు క్రుద్ధుండై చూచిన యుద్ధంబున నిలువ
సమర్థంబులే కావున మీ రెఱుంగని యర్థంబు లే దా హరి
తోడి యాయోధనంబు మాని శరణాగతులై మనుం
డనవుడు మాఱుత్తరం బియ్యం డయ్యె నంత నక్రూరుం
డక్కౌంతేయుల నుపలక్షించి యిట్లనియె.

73


ఉ.

నూనియతోడి కప్పురపునుగ్గుతెఱంగున ధార్తరాష్ట్రసం
తానముఁ గూడి విూరు విబుధస్తవనీయచరిత్రు లయ్యు స
న్మానవిహీనులై దురభిమానముఁ జెంది చరింపనేల మీ
మానసవీథిఁ జూడుఁ డిది మంచిదొ కృష్ణునిపొందు మంచిదో.

74


క.

హరి మీకుఁ బ్రాణబంధువు
గురువున్ సచివుండు రక్షకుఁడునై మిమ్మే
వురఁ గూర్మి నెల్లవేళల
నరయుచు రక్షించినందుకా యిది దలఁపన్.

75


వ.

ధార్తరాష్ట్రులు సహజశాత్రవులయ్యు మిత్రభేదంబుకొఱకు
మిమ్ముఁ బొదివినా రింతియెకాని నిక్కువంబగు మక్కువఁ
గాదు కృష్ణుండు మీమీఁద దయదప్పి నప్పు డఖిలరాజ్యం
బునుం జేకొనందలంచినారు గౌవున నీ నృపకీటకంబుఁ
జేపట్టి శార్ఙ్గితోఁ గపటంబు సేయుట కర్జంబు గాదని యర్జు
నున కిట్లనియె.

76


క.

[13]విరసింపఁ దాతతనయునిఁ
బొరిగొను కృష్ణునకు నితరుఁ బొరిగొను టరుదా
మఱఁది వనుచనవు మానుము
హరిశరణముఁ జొరుము భద్రమయ్యెడుఁ బార్థా.

77

వ.

అనిన నయ్యక్రూరునకు నతం డిట్లనియెఁ గృహీతపరి
త్యాగంబు సేయరామి నెఱుంగవే సర్వభూతాంతర్యామి
యగు నప్పరమేశ్వరుం డేమి సేసినఁ జేయుంగాత మనియెఁ
దదనంతరంబ యుధిష్ఠిరాదు లతనితో మా విన్నపంబుగా
రమావల్లభునకు నెఱింగింపుమని యథోచితవచనంబులు
కొన్ని పల్కి యే మతని సమ్ముఖంబునకు నొక బుద్ధిమంతు
నంపి సర్వంబు విన్నపంబుఁ జేయించిన యటమీఁదఁ గావల
సిన యర్థం బయ్యెడునని వినయపూర్వకంబుగా ననిపిన
నయ్యక్రూరుండు రథారోహణంబుఁ జేసి రయంబున ద్వా
రకానగరంబునకుం జని.

78


క.

తనరాక యొక్కవేత్రధ
రునిచేఁ [14]జెప్పంప విని యరుగుదేరంబం
చినఁ జని సోదరులును నం
దనులుఁ గొలువనున్న మురమథనుఁ గని మ్రొక్కెన్.

79


వ.

ఇ ట్లమ్మురాంతకునకు నమస్కరించి యతని యనుమతి నొక్క
సువర్ణపీఠంబునం గూర్చున్నయవసరంబున నవ్విభుం
డచ్చటివృత్తాంతం బేమని యడిగిన నతం డిట్లను దేవా,
భవదనుజ్ఞాతుండనై కరినగరంబున కరిగి యచ్చట నాంబి
కేయు పేరోలగంబునకుం జని యాతని యాదరణంబున
నొక్కపీఠిక నాసీనుండనై యుచితాలాపంబు లాడుచున్న
యంత నయ్యజాతశత్రుం డిచ్చటి యోగక్షేమం బడిగిన
నే నందుల కుత్తరం బిచ్చి వారిపరిణామం బడిగి వారణ
పురంబున మాతంగశతాంగవీరభటసంఘంబులతో నానా
రాజవరులు కూడియున్న కారణం బెయ్యది యన నయ్యుధి

ష్ఠిరుం డూరకున్న పదంపడి దుర్యోధనుండు శరణాగతుం
డైన యీచతుర్ధనుం గాచెదనని మావిజయుండు పలికిన
నేము వీరలతోడం గూడియున్నవారము కృష్ణుం డీ
చతుర్ధనజననాయకుఁ జంపెదనన్న ప్రతిన మానుట [15]మేలు
లేదా యటమీఁదఁ దానే యెఱుంగునని యివి యాది
గాఁగల యనుచితవచనంబులు పల్కినం దగిన యుత్తరం.
బిచ్చి యతని లక్ష్యంబు సేయక భీష్మాదులతోఁ దత్తత్ప్రకా
రంబుల వెన్ను చూపి కొన్నిమాట లాడి యాప్రజ్ఞాచక్షు
నకుం జెప్పి యే నరుగుదెంచునవసరంబున ధర్మజభీమార్జు
నులు దమమాటలుగా భవత్సన్నిధానంబున విన్నపంబు
సేయుమని నాతో ననినతెఱం గెఱింగించిన నవధరింపు
మందు ధర్మజుం డిట్లనియె.

80


చ.

కమలదళాక్ష, మీజనకు గాదిలిసోదరి మాకుఁ దల్లి భా
వమునఁ దలంచినన్ నెనరువారము వెండియు దేవరందుఁ గూ
రిమి గలయట్టిభక్తులము ప్రీతిమెయిం గరుణింపు సర్వభూ
రమణులలోన నెయ్యపుమఱందికి నీచన వియ్యఁ జెల్లదే.

81


చ.

వలపరిమూపుగో దివిజవల్లభునిం దెగఁ జూచి వైరులన్
గెలువఁగఁ జేసి శుభ్రతరకీర్తి దిశావళి నించి యింతగా
మెలసితి వీవ యిప్పు డొకమేదినిఱేనికి విరోధివై
నలఁచిన నవ్వరే సురగణంబులు మానవనాథకోటులున్.

82


వ.

అనుడు భీముం డిట్లనియె.

83


చ.

వెఱపున ధర్మనందనుఁడు [16]విన్నప మాడుట గాదు బాంధవం
బరిగెడునో యటంచుఁ దెగనాడకయుండుట గాని యర్జునుం

డఱిముఱిఁ గాచినట్టి మనుజాధిపుఁ బైకొని బ్రహ్మరుద్రు లే
డ్తెఱఁ జనుదెంచిరేనియు వధింపఁగనోపుదురే తలంపఁగన్.

84


క.

కావున నీ కుండినపతిఁ
గావు నయం బెసఁగ నట్లు గాదా నన్నున్
దేవేంద్రనందనుని వసు
దేవతనయ! చూచి యెఱుఁగుదేకద యనుమీ.

85


వ.

అనిన యనంతరం బర్జునుం డిట్లనియె.

86


చ.

నిను మనఘాత్మ నన్ను నరవిందదళేక్షణుఁ డింతవానిఁగాఁ
బెనిచె నటైన నీనృపతి భీతిలి చేరినఁ గాచినాఁడ నీ
తనికయి చచ్చుటొండె రణధారుణిలో గెలుపొండె మేలుగా
కని వినిపింపునిమీ కొలువునందు బలాదు లెఱుంగునట్లుగన్.

87


వ.

అని పలికె నంత భీష్మాదులెల్ల దేవరసముఖంబునకు నొక
బుద్ధిమంతు నంపెదమని న న్నంపిన నేనుం జనుదెంచితినని
విన్నవించిన నయ్యరవిందనయనుండు గించిదరుణితలోచ
నుండై కొలువు గలయం గనుంగొని.

88


చ.

వినఁ గడుఁజోద్య మయ్యెఁ బృథివీవరకోటులతోడఁ గూడి నేఁ
గినిసిన కుండినేశ్వరునిఁ గ్రీడియె కావఁగఁ [17]బూనె నట్టె యే
మనఁగలవార మన్న ముసలాయుధుఁ డాలము సేయఁబూనెఁ జే
పనిగుడ మార సాంబకృతవర్ములు నవ్విరి గేలిఁ బెట్టుచున్.

89


వ.

మఱియుఁ దక్కినవారెల్లను వీరాలాపంబు లాడుచుండి
రంత నిక్కడ ధృతరాష్ట్రుండు విదురసంజయులతోఁ గూడఁ

గర్జంబు దప్పెనని కటకటంపడి కొండొక చింతించి కుంతీ
తనయాగ్రజు నుద్దేశించి యిట్లనియె.

90


శా.

అక్రూరుం డరుదెంచి యీకొలువులో నత్యంతవాక్ప్రౌఢి నా
చక్రిన్ సంగరకేళి గెల్వఁగ సరోజాతోద్భవుల్ నూర్వురున్
శక్రుల్ వేవురునైన నోపరనె నాచందంబు నిక్కంబు యు
ద్ధక్రీడ న్మన మెంత నీకు నయశాస్త్రప్రక్రియం జెప్పెదన్.

91


చ.

వినయవివేకభూషణుఁ బ్రవీణుఁ గులీనుఁ బరేంగితజ్ఞు స
త్యనిరతు బుద్ధిమంతు నుచితప్రదుఁ గార్యదురంధరున్ గృపా
త్ము నతిగుణాకరున్ బతిహితున్ జననాథుఁడు రాయబారిఁ జే
సిన నతఁ డెట్టులైన ఫలసిద్ధిగఁ జేయు సమస్తకృత్యముల్.

92


వ.

కావున నిట్టిగుణంబులు గలవాని నయ్యాదవవల్లభుపాలికిం
బెట్టి పంపుదమనుడు వల్లెయని కౌంతేయాగ్రజుండు తనతో
విచారింప శంతనుతనయుం డిట్లనియె.

93


క.

దేవాజేయుఁడు బలముస
దేవాచార్యుండు నీతి ధీరత్వమునన్
దేవాచలంబు మన సహ
దేవుండని బుద్ధిఁ దెలిసిలిన్ ధర్మసుతా.

94


క.

అని యెఱిఁగించిన యమనం
దనుఁ డప్పుడు పిలిచి నకులుతమ్ముని నాశాం
తనవుని ముందఱ [18]నిడ నా
తనితో [19]నతఁ డిట్టులనె నుదారప్రౌఢిన్.

95

తే.

వత్స! నీనేర్పు మీఱ నవ్వాసుదేవు
నకును నెఱిఁగింపుమని వచనములు కొన్ని
చెప్ప నవియును గురు యుధిష్ఠిర వృకోద
రార్జునాదులమాటల నాత్మ నిలిపి.

96


వ.

అందఱచేత ననుజ్ఞాతుండై యరుగ ధర్మజుండు తిరుగం
బిలిపించి యిట్లనియె.

97


క.

సహదేవ! నీవచనముల
కు హలాయుధకృష్ణసాత్యకులుఁ బ్రద్యుమ్నా
శ్రీహరికుమారులు నతికుపి
తహృదయులై పల్కినను బెదరకుము తాల్మిన్.

98


వ.

అని బుద్ధి చెప్పి యనిపిన రథారూఢుండై మితపరిజనం
బులు గొలువ ద్వారవతీపురంబునకుం బోయి రాజమార్గం
బునఁ దత్తద్విశేషంబు లీక్షించుచుఁ జని చని పెనుమొగ
సాలఁ దఱిసి రథంబు డిగ్గి ద్వారపాలకులచేతఁ దనరాక
విన్నపంబు సేయించి తదనుజ్ఞాపూర్వకంబుగా నాస్థాన
మంటపంబునకుం జని.

99


సీ.

కనియెఁ బద్మదళాక్షుఁ గౌస్తుభమణీవక్షు
             శ్యామలదేహు నాజానుబాహుఁ
గాంచనకౌశేయుఁ గాంతావిధేయు గం
             ధర్వకోటివిలాసు నవ్యహాసు
బ్రహ్మాండధౌరేయు బ్రహ్మానుసంధేయు
             దనుజారికరణు దేవనుతచరణు
జలజాప్తనుతతేజు సకలయాదవరాజు
             భక్తమందారు శోభనవిహారు

తే.

సకలదైవతమౌళిరత్నకిరణప్ర
చయవిభూషితపదనీరజాతు భువన
రాజిజనిహేతు నభ్రగరాజకేతు
శ్రీవధూటీమనస్సంచరిష్ణుఁ గృష్ణు.

100


వ.

కని కృతాప్రణాముండై నిలిచిన నతని నుచితప్రకారం
బున సంభావించి భద్రాసనాసీనుం గావించి యిట్లని యాన
తిచ్చె.

101


మ.

ముదమే యత్తకు ధర్మరాజునకు సమ్మోదంబె భీముండు స
మ్మదలీల న్విహరించునే కుశలమే మత్ప్రాణమై పొల్చు నా
త్రిదశాధీశ్వరసూతికిన్ నకులుఁడుం బ్రీతాత్ముఁడే సౌఖ్యసం
పదఁ బాంచాలి మెలంగునే పరిజనుల్ భవ్యాత్ములే యెప్పుడున్.

102


చ.

అనవుడు మాద్రిపట్టి వినయంబున నిట్లని పల్కె దేవకీ
తనయ! భవత్కృపామహిమ తల్లివిధంబునఁ బ్రోవఁగా ముదం
బ నెగడుఁగాక మాకును విపన్నత గల్గునె కుంతిదేవియు
న్వినుత చరిత్ర ద్రౌపదియు నిండినవేడ్క జరింతు రెంతయున్.

103


వ.

నావుడుఁ గృష్ణుండు సంతసిల్లి సహదేవునిం జూచి ప్రొద్దు
గ్రుంకుచున్నయది రేపకడ సహసంభాషణం బయ్యెడుఁ
బథశ్రాంతి దీఱ విశ్రమింపుమని యొక్కభర్మప్రాసాదంబున
విడియ నియమించి వీడుకొలిపి యప్పుడు గొలువు సాలించి
తాను నభ్యంతరమందిరంబున కరిగె నంత.

104


క.

కమలినిఁ బుష్పిణిఁ గరముల
నిమురుటకు న్మరియు వారుణీపరిచయదో

షమునకు రవి ప్రాయశ్చి
త్త మొనర్చుకొనెనన నపరధరముచరిఁ బడెన్.

105


తే.

ఎన్నఁడును బగలును వేఁడి యెడలనట్టి
భానుఁ గని బ్రహ్మ కోపించి వానిసీమఁ
గువలయాప్తున కీయఁ జిగురునఁ దోర
ణ మొనరించె నన సాంధ్యరాగము దనర్చె.

106


క.

సగపాలు సాంధ్యరాగము
నిగిడినఁ గెంజాయఁ దనరి నెఱచీఁకటిచే
సగపాలు నలుపు నొందుచు
గగనము గురివెందగింజకైవడిఁ బొల్చెన్.

107


తే.

చలివెలుంగులఱేఁడు రేచామ నిపుడు
పెండ్లియాడెడునంచు సంప్రీతి వేల్పు
ముద్దియలు పెట్టు ముత్యాలముగ్గు లనఁగ
గగనతలమున నిండి చుక్కలు వెలింగె.

108


సీ.

సంధ్యాంగనామనోజ్ఞవినీలవేణికా
             భారప్రభాకదంబం బనంగ
గగనభాగశరావకంజాతహితదీప
             సంజాతసాంద్రకజ్జల మనంగఁ
బరధనాహరణతత్పరపశ్యతోహర
             గణనియుక్తాదృశ్యకరణి యనఁగ
నఖిలనిర్మలపదార్థావబోధక్రియా
             విజ్ఞానపరిపంథ్యవిద్య యనఁగ


తే.

శ్యామలంబయి మేదురం బగుచుఁ గన్నుఁ
బ్రామి వెలియును లోను నేర్పడఁగనీక

నీరజాతోద్భవాండంబునిండ సంధ
కారపటలంబు నురువడిఁ గలయఁబర్వె.

109


చ.

ఇనుఁ డొకయింతమాటునకు నేగిన యంతటిలోననే నయం
బును దగవు ద్యజించి నవపుష్పిణి యయ్యు మధువ్రతంబు గై
కొని సుఖనిద్రఁ జెందె నదిగో వెసఁ బద్మినియంచు నింత న
వ్వినగతిఁ గైరవంబులు సవీనవికాసము నొందె నత్తఱిన్.

110


క.

జక్కవ లడంగ నంబుధు
లొక్కమొగిన్ బొంగ విరహు లొగిఁ గ్రుంగ సురల్
గ్రుక్కిళ్లు మ్రింగ నలినము
నక్కిళ్లు పడంగఁ దూర్పునను శశి వొడమెన్.

111


వ.

ఇట్లుదయించి.

112


చ.

క్రమమున దిష్టవర్తకుఁడు గారవ మొప్ప సురేంద్రువీట వ
జ్రములు సుధారసంబు ఘనసంభవమౌక్తికకోటి విల్చి నె
య్యము దనరంగ నమ్మ వరుణాశకునై గగనాబ్ధిలోన వే
గమ్మునఁ జరింపఁజేయు తెలికప్పలినాఁగ శశాంకుఁ డొప్పెఁ దాన్.

113


చ.

అల గురుపత్నిఁ బొందినదురాత్ముఁడు చంద్రుఁడు దన్గరంబుల
న్బలువిడిఁ బట్టునో యనుచుఁ బద్మిని చాలభయంబు నొంది తాఁ
దలుపులు మూసికొన్నగతిఁ దామరరేకులు మోడ్చెఁ బట్టికి
న్వలదని చెప్పఁబోవుక్రియ వారిధి మిన్నులు ముట్టె నెంతయున్.

114


చ.

చెలియలికట్టఁ గైకొనక చిత్రము గాఁగఁ బయఃపయోధి యి
ట్టలముగఁ బొంగి నీచులు దడంబడ లోకములెల్ల ముంచెనో
చిలువలఱేని భూషణము చేసినవేలుపుకొండ భూమిపైఁ

గలయఁ జరించెనో యనఁగఁ గప్పె జగంబులఁ బండువెన్నెలల్.

115


చ.

గిరులు సితాద్రులై తనరెఁ గేసరులయ్యె మృగంబు లెల్ల సుం
దరులును భారతీమహిమ దాల్చిరి మానవు లెల్లఁ జూడ శం
[20]కరులనుఁ బోలి రాపగలు గంగలునాఁ గడు నొప్పెఁ బక్షు లం
చరుచుల మీఱెఁ జంద్రకరజాలము సోఁకినఁ జిత్రవైఖరిన్.

116


వ.

అంతకుమున్న యమ్మురాంతకుండు సాయంకాలసంధ్యా
క్రియలు నిర్వర్తించి సహదేవునిం బిలిపించి యతండునుం
దానును సత్యభామామందిరంబున మరకతపాత్రంబుల
షడ్రసోపేతరుచిరాన్నంబులు భుజించి హస్తప్రక్షాళనం
బొనరించి కర్పూరతాంబూలం బొసంగి యతని విడిదికిం
బోనియమించి తానును బాదాంతపర్యంతముక్తాహారంబు
ధరియించి పన్నీర పరిపూరితగలంతికాప్రభాగౌరవంబును
జతురశీతిప్రభేదబంధచిత్రితకుడ్యవిరాజితంబును మనోజ్ఞ
పద్మరాగమణిదర్పణమండితంబును నీలకీలితకాంచనపాదుకా
యుగళకలితపర్యంకాధఃప్రదేశంబును శ్రుతిసమ్మిళితవిపంచి
కాంచితంబుసు నలినపూగనాగవల్లీమౌక్తికచూర్ణకర్పూర
పూర్ణరత్నస్థాపితహాటకపేటికారాజితంబును మంజుల
ప్రవాళకృతమంచాలంబితహంసతూలికాతల్పడోలావిలా
సంబును మంజులమణిదీపసహస్రతేజోమయంబును
శర్కరాకదళీఖర్జూరగోక్షీరాదినవ్యద్రవ్యయుక్తంబును,
సంకుమదకుంకుమకస్తూరీఘనసారసమ్మిళితహృద్యగంధసార

సంపూరితముక్తాశుక్తివాసనావాసితంబును బహువిధవిచిత్ర
వితానసముల్లసితోపరిభాగంబును నిజసౌందర్యవిజితవిబు
ధాంగనాదాసీసహస్రపరిపాలితంబును నగు నొక్కమహో
త్సేధసౌధంబున సత్యభామాసమేతుండై సరసకేళీలోల
మనస్కుండై యలసి మలసి నిదురగదుర సుఖనిద్రావర
వశుండై యుండె నప్పుడు.

117


తే.

చక్రవాకంబుకవలును జారిణులును
దక్కఁ దక్కిన జంతుసంతానమెల్ల
వివిధసంతోషలీలల విఱ్ఱవీఁగి
మదులఁ బొడమిన యలసత నిదురఁజెందె.

118


వ.

అంత.

119


తే.

జక్కవల మించుటెఱకలచాయఁ గూడి
మిగులఁ గమలానురాగంబు మిన్ను ముట్టె
ననఁగఁ దూర్పున నంతంత కగ్గలించి
యరుణకాంతులు దిక్కుల నత్తమిల్లె.

120


తే.

చుక్కలును గైరవంబులు సొంపుదక్కి
ముచ్చముణుఁగుచు నందంద ఱిచ్చపడియెఁ
జక్రవాకంబులును సరోజాతములును
గడఁగి వికసించె నయ్యుషఃకాలమునను.

121


చ.

కలువలఱేని తోడిచెలికాఁడు జగంబులలోనఁ గల్గు పు
ణ్యులు సురలోకసౌఖ్యములు కోర్కి మెయిం జను పెద్దత్రోవ మిం
చుల తలకట్టు లోకముల చుట్టము చీఁకటిగొంగ [21]వేఁడిలా
గుల పెనుదిట్ట తూర్పుదెస కొండపయిన్ బొడతెంచె నత్తఱిన్.

122

సీ.

తనమనోహరదీప్తితతి దిశాకామినీ
             సిందూరరేఖలఁ జెన్ను కొలువఁ
దనవింతచెలువంబు దళదబ్జరాగసం
             పదల నంతంతకుఁ బసలు గొలుపఁ
దనమేలిరంగు లుద్యద్దాతురాగరం
             జితధరంబులు క్రొత్తసిరులు గొలుపఁ
దనమెఱుంగులు ధరాతలముపై నిండంగ
             గుంకుము నెఱపిన కొమరుఁ గొలుపఁ


తే.

దనబెడంగుల విలసిల్లు వనములకును
సురుచిరంబుగఁ బల్లవస్ఫూర్తి గొలువఁ
గెంపుఁజాయల గిరికొను ముంపు మెఱసి
బాలభానుండు మింటిపైఁ బరిఢవిల్లె.

123


వ.

ఇవ్విధంబున సూర్యోదయం బగుటయు నంతకుమున్న వైణిక
వాంశికవైతాళికమధురగానంబులచేత నవ్వనజనాభుండు
మేల్కని కాల్యకరణీయంబులు దీర్చి మనోహరవస్త్రగ్రంధ
మాల్యాభరణభూషితుం డై యుద్ధవాక్రూరబలభద్ర
సాత్యకిప్రద్యుమ్నానిరుద్ధాదులం బిలిపించి వారలుం
దానునుఁ గొలువుకూటంబున కరుగుదెంచి తత్తదుచితా
సనాసీనులై యుండిరంత.

124


తే.

వనజనాభునియానతి గొని రయమున
వేత్రహస్తుండు పాండవవీరవరునిఁ
బిలువ నాతండు భూషణములు ధరించి
యింపుతోడుత హరికడ కేగుదెంచె.

125


వ.

ఇట్లు వచ్చిన సహదేవునిం గూర్చుండ నియోగించి మృదు
మధురసరససల్లాపంబులఁ బ్రొద్దుపుచ్చుచున్నంత నీరాకకుఁ

గారణం బేమని యడిగిన నతం డయ్యదునాయకున కిట్ల
నియె.

126


సీ.

ధరణిఁ గుండినపురీధవుఁడు చతుర్ధనుఁ
             డను నొక్కరాజు మాయాహయంబు
నెక్కి యాకసవీది నేతెంచునప్పుడు
             యమునలో మీరు దేవాళిఁ గూర్చి
తర్పణం బొనరింపఁ దద్దరిముఖఫేన
             ఖండంబు దైవసంఘటనకతనఁ
దమహస్తయుగళిలోన మహాద్భుతంబుగాఁ
             బడుటఁ జిత్తమునఁ గోపంబు పొడమి


తే.

యంబుజోద్భవ రుద్రాదు లడ్డపడిన
నీహయముమీఁద నున్ననరేంద్రుశిరము
చక్రమున నొండె నిష్ఠురాస్త్రముల నొండెఁ
ద్రుంతు మాసంబులో నని తొడరి తనఘ!

127


వ.

అందులకు నతండు భయంబొంది ధనంజయుండు వేఁటఁ
బోవఁ దెలిసి యాచొప్పున నవ్విజయుకడకు వచ్చి భవ
న్నామధేయం బుగ్గడింపకయ వెరవున శరణంబు వేఁడిన
నవ్వీరుం డతనిం గావఁ బ్రతిజ్ఞఁ జేసి పదంపడి నీకు భీతిదుం
డెవ్వం డట్టివాని నామధేయం బేమని యడిగిన మీరని
చెప్ప నర్జునుండు మీతోడ శత్రుభావంబు భజింపఁబడె
నని విచారించి మగిడి పురంబున కేగుదెంచి తద్వృత్తాంతం
బంత యాయుధిష్ఠిరున కెఱింగించిన నతండును గరినగరం
బున కరుగుదెంచి భీష్మాదికురువృద్ధులతో విచారించి నన్ను
భవత్నన్నిధానంబునకుఁ బుత్తెంచునప్పుడు దమమాట

లుగా మీకు విన్నపంబు సేయుమని యందఱుం జెప్పినది
కాక ధర్మతనయుండు నాతో నిట్లనియె.

128


ఉ.

నీకరుణావిశేషమున నీరజలోచన సవ్యసాచి నీ
లోకులు చూచి యేమనక లోఁగుచు నుండుదు రిట్టిచోట నీ
వే కినుక న్నరుం బరిభవించినఁ బెంచినచిల్కఁ బట్టి చీ
కాకు పడంగఁజేయుటయకా మదిలోఁ దలపోసి చూచినన్.

129


చ.

మనమునఁ గోపగింపకుము మాధవ చిత్తమునం దలంప నీ
మనుజవిభుండు క్రొవ్వి యవమానముఁ జేసినవాఁడు గాఁడు మ
న్నన యొనరింపు దైవికమునం దురగాననఫేన మింత జా
ఱినఁ దెగనేల సర్వము నెఱింగిన దేవుఁడ వీ వెఱుంగవే.

130


వ.

అని చెప్పుమనియె నని విన్నవించి యతండు మఱియు నిట్ల
నియె.

131


క.

వనజాక్ష! రాజధర్మం
బున శరణాగతునిఁ గావఁబూనె న్మాయ
ర్జునుఁ డించుక గురు గంగా
తనయ కృప ద్రౌణీముఖ్య దార్థ్యులతోడన్.

132


తే.

ధర్మతనయుండు పెక్కువిధముల నీకుఁ
బ్రియము చెప్పంగ నీయల్క వేర్చె నేల
యింతమాత్రంబునకు నెన రేల చెఱుచు
కొన మనలకును నామాట వినుము కృష్ణ.

133


చ.

అనుఁ డొకయింత నవ్వి జలజాక్షుఁడు గన్గొనలందుఁ గెంపుఁజా
య నిగుడ రామసాత్యకిగదాసమబాణులఁ జూచి పాండునం
దనులు నయంబు వింటిరెకదా తమమాట నిజంబు సేయనే

పెనఁగెద రింద్రుఁడున్ విధుఁడుఁ బేర్చిన నావచనంబు తప్పునే.

134


సీ.

నీలాంబరుఁడు నవ్వె గేలిఁ బెట్టె గదుండు
             కృతవర్మ కన్నులు గీటె సాంబుఁ
డల్లన తలయూఁచె నసమబాణుఁడు భుజం
             బప్పళించెను [22]జేతులార్చె నుగ్ర
సేనుండు చేవైచెఁ జేకితానునిపైని
             ననిరుద్ధుఁ డక్రూరుఁ డదిమె ఋషభుఁ
జారుధేష్ణుండు రోషమునఁ బండ్లు కొఱికె
             సారణుఁ డట్టహాసంబుఁ జేసెఁ


తే.

బెదవి విఱిచెను సాత్యకి మదము మెరసి
చూచె దీప్తిమంతుండు భోజులును యాద
వులును వార్ష్ణేయులును మది నలుక వొడమి
గుజగుజలు పోయి బీరముల్ గొనిరి మిగుల.

135


క.

ఈరీతిఁ జేయ సభ్యులఁ
దేరఁగఁ గని పాండుసుతుఁడు తెలిగన్నుల సాం
ధ్యారాగ మొదవ నుడుగని
వీరత్వము మెఱయ ననియె వినఁ జిత్రముగన్.

136


ఆ.

నెనరు మనసులోన నిలిపి యీ తెఱఁగున
సామభాషణములఁ బ్రేమతోడ
లోకులెల్ల మెచ్చ మీకుఁ జెప్పితిఁ గాక
బలిమి మమ్ము గెలువఁగలరె మీరు.

137

క.

సకలాస్త్రకోవిదుని యు
ద్ధకళానిపుణుని విరోధిదర్పవనీపా
వకుని నసహాయశౌర్యా
ధికు నర్జును గెలువఁగలఁడె త్రిణయనుఁడైనన్.

138


వ.

అనవుడు సహదేవునకు వాసుదేవుం డిట్లనియె.

139


చ.

నిజము నిజంబు పాండుధరణీవరసూనులు మీరు మత్తది
గ్గజములవంటివారలు జగన్నుతశౌర్యనిధు ల్నతారిభూ
భుజ లతిశౌర్యు లుగ్రసురపుంగవ[23]నందనుఁ డాహవోగ్రుఁ డౌ
ట జగ మెఱుంగు నక్కటకటా పలుమాఱును నెంచ నేటికిన్.

140


చ.

ఘనబలుఁడైన యానరుఁ డొకండు నదీతనయుండుఁ గుంభజుం
డును ధృతరాష్ట్రభూవరతనూజులు భానుసుతుండు వాయునం
దనుఁడును ద్రోణజుండు వసుధావరులుం దమలావు మీఱి యే
కినిసిన యానృపాలు రణకేళిఁ జలంబునఁ గావకుందురే.

141


వ.

అనిన బలభద్రుండు క్రోధారుణితలోచనుండై సహదేవుం
గటాక్షించి కృష్ణున కిట్లనియె.

142


చ.

అనఘ భవద్భుజాబలమహత్త్వ మెఱుంగనివారిరీతి ని
ట్లనియెద రర్జునుండును దృణాకృతి నీఘనరోషవహ్నికిం
గనుఁగొన ధార్తరాష్ట్రు లనఁగా సరిదుద్భవకుంభజాతభీ
మనకులమిత్రసూను లన మా కొకలక్ష్యమె యెన్నిభంగులన్.

143


చ.

ఘనతరదివ్యబాణములకందువ శౌర్యము చేవ యైన య
ర్జునుఁడు భవద్విరోధి నృవరుం గరుణించెను నీప్రతిజ్ఞ మా

ను నలిననేత్ర యంచుఁ దననోటికి వచ్చినరీతి నాడఁగా
మనము గలంగె నీపడుచుమాటలు మాకు రుచింప వేమియున్.

144


శా.

హేళిం గేలఁ దెమల్తునో జగము లీరేడు న్వడిం ద్రుంతునో
వ్యాళాధీశసమానమత్పృథులబాహాలాంగలాగ్రంబుచేఁ
గేళిన్ సప్తసముద్రనీరములు నాకెంజేతికిం దెత్తునో
యీలోకంబునఁ గల్గు రాజు లనఁగా నేలెక్క తర్కించినన్.

145


వ.

అనుడు సీరపాణికిఁ జక్రపాణి యిట్లనియె.

146


తే.

నాసహాయంబు లేకున్న నరుఁడు నరుఁడు
నాసహాయంబు గలిగిన నరుఁడు హరుఁడు
ఇత్తెఱంగెల్ల భీష్మాదు లెఱిఁగి యెఱిఁగి
యేల చేసిరి యిప్పని బేల లగుచు.

147


వ.

అనుటయు సహదేవుం డదిరిపడి యిట్లనియె.

148


సీ.

ద్రోణుని పంపున ద్రుపదుఁ దెచ్చినయప్పు
             డబ్జాక్ష నీసహాయంబు గొనెనొ
దారుణమత్స్యయంత్రం బేయునప్పుడు
             నబ్జాత నీసహాయంబు గొనెనొ
పాంచాలికై మహీపతుల గెల్చినయప్పు
             డబ్జాక్ష నీసహాయంబు గొనెనొ
[24]సింధుదేశాధీశు సైంధవు గెల్చునా
             డబ్జాక్ష నీసహాయంబు గొనెనొ

తే.

యేల యీమాట లాడంగ నింద్ర సూతి
యొకసహాయంబుఁ గోరునే యుగ్రమైన
గాండివంబును గవదొనల్ పాండురాశ్వ
విమలరథమును దేవదత్తమునుఁ దక్క.

149


వ.

కావున జగదేకవీరుండును నసహాయశూరుండును నగు
గాండీవితోడ భండనంబు సేయ నాఖండలాదు లోపరనినఁ
దక్కినవారలం జెప్ప నేల యదియునుం గాక యతనిసూరెల
నున్న మహాయోధవరుల నెన్నెద నవధరింపుము.

150


చ.

చతురంభోధిపరీత భూవలయరక్షాదక్షబాహాబలో
ద్ధత రాజన్యసమూహశుష్కగహనోద్యద్దానవహ్నిచ్ఛటా
యితశాతోగ్రకుఠారభార్గవమదాహిస్తంభనోదగ్రమం
త్రితమౌర్వీరవభీష్ము భీష్ము నని వారింపంగ మీశక్యమే.

151


శా.

దివ్యాస్త్రజ్ఞుఁడు, ఘోరసంగరకళాధిష్ఠాత, దక్షుండు, గౌ
రవ్యాచార్యుఁడు, మేరుధీరుఁ, డరివీరక్షోణిభృద్వజ్రి, భూ
రివ్యాళాధిపకోపనుం, డతిరథశ్రేష్ఠుండు, ద్రోణుండు శ
స్త్రవ్యాపారము సూప నిల్వఁగలవారా వీరలున్ మీరలున్.

152


చ.

కృపుఁడను పేరుగాని రణకేళి మెయిం దలపోసిచూడ ని
ష్కృపుఁ డతులప్రతాపుఁడు వశీకృతదివ్యశరుం డజేయుఁ డు
గ్రపుఁదఱి వానిమ్రోలఁ బడిరా విధియు న్మనఁజేయఁజాలఁ డ
ట్టి పురుషవర్యు గెల్వఁగలఁడే యొకఁడైన మురారి, వీరిలోన్.

153


మ.

నిటలాక్షాగ్ని[25]కణంబులై మెఱయ నిర్ణిద్రప్రభావంబు మి
క్కుటమై గ్రాలఁగఁ గొండనాఁదగు మహాకోదండ మెక్కించి తాఁ

జటులక్రీడ యొనర్చురుద్రుఁ డన నశ్వత్థామ సూపట్ట ని
చ్చటివారెల్లను గెల్వకుండుదురె వాచాప్రౌఢినైనం దగన్.

154


మ.

ప్రళయార్కప్రతిబింబమై మొగము దోఁపన్ జూపులన్ వహ్నికీ
లలు గ్రమ్మంగఁ గృతాంతదండ మనఁ గేలన్ దండ మొప్పంగ మూఁ
కలపై మారిమసంగి భీముఁడు మహోగ్రక్రీడ సూపంగ మీ
పలరక్తంబులు జాఱ నవ్విభుఁ దలంపన్ జూడఁగా నేర్తురే.

155


మ.

బకదైతేయునిప్రాణముల్ వెఱికి శుంభల్లీలమై నాహిడిం
బకు భంజించియునైన చేతికని వాపంజాల లేనైతి నిం
కొకఘోరాహవకేళి గల్గవలెనం చువ్విళ్లు నా వాయుపు
త్త్రకుఁ డేవేళను గోరు నట్టిపని దాఁదానయ్యె నీచేఁతలన్.

156


క.

గద తుండంబు, భుజంబులు
పొదలెడు కుంభములు దంతములు దంతరుచుల్
ముద మెసఁగ సుయోధనుఁడను
మదకరి మీవాహినిం గ్రమంబునఁ గలఁచున్.

157


క.

స్వర్ణాగధీరుఁ డుగ్ర
స్వర్ణాగోద్దతుఁడు వైరిజనవనదహనుం
డర్ణోరాశిగభీరుఁడు
కర్ణుఁ డతనిమ్రోల నిల్వఁగలరా మీరల్.

158


శా.

మాయాజాలవిధానధీమహితుఁ డస్మత్సైన్యదక్షుండు క్రో
ధాయత్తాత్తుఁడు దివ్యబాణనిధి దైత్యాధీశలోకాధిపా
జేయుం డిద్దసమిద్దరాశివిశిఖాస్ఫీతుండు భీమాత్మజుం
డాయోధాగ్రణిమ్రోల నిల్వఁగఁ దరంబా వీరిలో నేరికిన్.

159

క.

శల్యుఁడు నిహతాహితవా
త్సల్యుఁడు విజయప్రదోగ్రశస్త్రాస్త్రకళా
కల్యుఁడు రణవిషమాంబక
తుల్యుఁడు సంగ్రామమన్నఁ దోడనె యుబ్బున్.

160


వ.

మఱియును.

161


సీ.

ద్రుపదుఁ డాయోధననిపుణుఁ డాతనిసూను
             డంతకంటెను ఘను లాహవమున
విరటభూపతి మహావీరుఁ డాతనికంటె
             బాహ్లికుఁ డతిభుజబలధనుండు
సోమదత్తుఁడు రణోద్దాముఁడు భూరిశ్ర
             వుండు భండనమున దండిమగఁడు
భగదత్తుఁ డరిమానభంజనుండు సుదక్షి
             ణుఁడుఁ గేకయులును నీలుఁడును యవన


తే.

విభుఁడు శకునియు విందానువిందనృపులు
రుక్మియును ధృష్టకేతుండు రూఢయశులు
పాండ్యనాథుండు సింధుభూపతియుఁ జూడఁ
జిచ్చు కబళింతురన నాజిఁ జెప్పనేల.

162


వ.

వెండియు దుశ్శాసనాదిధార్తరాష్ట్రకుమారవర్గంబును నంగ
వంగ కళింగ బంగాళాదినానాదేశాగతరాజపుంగవులును
సముద్రంబులు గలంచి యువ్వెత్తునఁ గులపర్వతంబులు పెక
లించి యవ్విజయునిప్రతిజ్ఞ నిలుపఁబూని మదంబున దమ్ము
నెఱుంగకయున్నవా రది గావున.

163


సీ.

కపికేతనంబు భీకరతఁ దోఁపకమున్న
             తొడరి గాండీవ మెక్కిడకమున్న

పటుతరశరపరంపరలు పర్వకమున్న
             బాంధవుల్ ధరణిపైఁ బడకమున్న
రక్తవాహినులు ఘోరముగఁ బాఱకమున్న
             సకలబలంబులుఁ జావకమున్న
యాదవు లుగ్రబాణాగ్నిఁ గ్రాఁగకమున్న
             ధృతి వాహినీశులు తెగకమున్న


తే.

దేవదత్తరవంబు వీతేకమున్న
తెల్లగుఱ్ఱపుఁగొదమలతేరు రాక
మున్న విజయుండు గాచిన యన్నరేంద్రుఁ
గావు తక్కినబుద్ధులు గావు కృష్ణ.

164


ఉ.

లావును శస్త్రనైపుణిబలంబును జూచిన మాకు మీకునున్
వావిరి మేదినీధరలవంబుల యంతర మీవిరోధ మే
లా వసుధేశుఁ జంపెడుచలంబు హరింపుము మేలుగాఁగ ల
క్ష్మీవర కాదయే నినుపచీలకు హర్మ్యముఁ గాల్చినట్లగున్.

165


వ.

అని పల్కు నాసహదేవుపల్కులు ముల్కులచందంబునఁ
గర్ణరంధ్రంబుల సోఁకిన.

166


తే.

తోఁక ద్రొక్కిన భుజగేంద్రు వీఁక సటలు
గుదిచి పెఱికిన సింగంబుకొదమమాడ్కి
దండతాడనకుపితోగ్రపుండరీక
భంగిఁ గృష్ణుండు రోషించి పలికె నిట్లు.

167


క.

వినుఁడీ మున్నొక్కచతు
ర్ధనుఁ జంపెదనంటి నిపుడు ధర్మతనయు నొ
కని డించి సంగరస్థల
మున నందఱఁ ద్రుంతుఁ జక్రమునఁ జిత్రముగన్.

168

ఆ.

అని ప్రతిజ్ఞ సేయ నఖిలలోకంబులు
వడఁకె గిరులు దూలె వార్డు లింకెఁ
జుక్క లురిలె బ్రమసి సోమసూర్యులు ద్రోవఁ
దప్పనడచి రింద్రతనయతనయ.

169


వ.

అయ్యెడ సహదేవుండు పోయివచ్చెదనని బలభద్రాదులకు
నెఱింగించి కొలువుకూటంబు వెడలివచ్చి రథారోహణంబు
గావించి రయంబునఁ గరినగరంబున కరుగుదెంచి.

170


తే.

సకలరాజన్యులును బంధుజనులు సుతులుఁ
బాండవేయులుఁ గెలఁకుల బలసికొలువ
విదురసంజయు లిరుమేలఁ గదిసి నిలువ
నున్న ధృతరాష్ట్రుఁ గనుఁగొని యుచితభంగి.

171


క.

పలికెన్ సహదేవుఁడు దా
నెలమిన్ ద్వారకకు నేగి కృష్ణు ననినమా
టలచందము నందుల కతఁ
డలిగి ప్రతిన చేయుటయు బలాదులతెఱఁగున్.

172


వ.

ఇట్లు పలికిన యనంతరంబ.

173


క.

కినుక దలిర్పఁగ దుర్యో
ధనుఁడు దుశ్శాసనుండుఁ దర్పంబునఁ గృ
ష్ణునిపురికి నిపుడ కదలుద
మని తమకించుటయు భీష్ముఁ డను వారలతోన్.

174


వ.

మీర లిక్కార్యం బెఱుంగరు నిలువుండని వైచిత్రవీర్యు
నుద్దేశించి యిట్లనియె.

175


సీ.

ధర్మనందన సుయోధను లీచతుర్ధన
             రక్షణార్థంబుగా రాజవరుల

బంధుల మిత్రుల గంధేభసైంధవ
             స్యందనభటుల నందంద కూర్చి
రనఘ యీపెన్మొన యష్టాదశాక్షౌహి
             ణీసంఖ్య యయ్యె దాని న్మెలంపఁ
గావఁ గృష్ణునితోడఁ గయ్యంబు సేయంగ
             మనయోధులందు నర్జునుఁడ కాని


తే.

త్కరుం డింతభారంబు దాల్చి నిల్చు
వాఁడు లేఁ డది గావున వాహినీప
తిత్వమున కీక్షణంబ మరుత్వదాత్మ
జాతుఁ బట్టంబు గట్టుట చాల మేలు.

176


వ.

అనిన నగుంగాక యనియె నంత నావివ్వచ్చుం డాదేవ
వ్రతున కిట్లనియె.

177


మ.

అనఘా యిట్లని యాన తీఁ దగునె యోధాగ్రేసరస్ఫూర్తి మిం
చిన మీరున్ గృపుఁడున్ ధనుర్గురుఁడు రాజీవాప్తసూనుండు రా
జును భీముండును ద్రోణజుండు సకలక్షోణీశులు న్నిండి యుం
డినచో నా కభిషేకవైభవము దండిం బూనఁ గర్తవ్యమే.

178


క.

వీరలలోపల నొకబలు
వీరుం డొండేని లోకవిఖ్యాతుఁడవై
మీఱిన నీవొండెన్ నే
నారాజత్వంబు [26]దాల్చిన న్మే లరయన్.

179


క.

ఏనును నానేర్పున నా
దానవరిపుతోడఁ బోరెద న్మీరున్ దే

వానీకము నను మెచ్చఁగ
నానాశస్త్రాస్త్రముల రణస్థలి ననినన్.

180


వ.

భీష్ముం డిట్లనియె.

181


తే.

అనఘ, నీమాట యట్టిదయగు నిజంబు
వినుము వీరల నెల్లఁ గాదనుట గాదు
సకలవైరులయని యొక్కచంద మంబు
జోదరునితోడ రణము వేఱొక్కవిధము.

182


వ.

కావున నీచతుర్ధనుం గావను గృష్ణున కెదురించను నీవ
సమర్థుండవు. నీపిఱుందన యుధిష్ఠిర దుర్యోధన దుశ్శాసన
శకుని సైంధవ ద్రుపద విరాట ఘటోత్కచులును ధృష్ట
కేతుండును సుదక్షిణ పాండ్య భగదత్తులును గేకయు
లేవురును నీలుండును రుక్మియు కల్యుండును విందాను
విందులును గూడఁ బదునెనమండ్రు, నక్షౌహిణీపతు లయ్యె
దరు. వీరలు నేనును గురు కృపాశ్వత్థామ కర్ణ బాహ్లిక
సోమదత్త భూరిశ్రవులుం దక్కినయోధవీరులును సంగ
రంబున నీచెప్పినరీతిన తిరిగెద మనిన నయ్యర్జునుం డియ్య
కొని నాకు సారథియుం జక్రరక్షకులును మహాయోధులు
గావలయు ననిన నతండు మిగుల విచారించి యశ్మంతకు
నక్షౌహిణీపతిత్వంబునకు నియమించి శల్యు సారథ్యంబు
నకు నియ్యకొలిపి చక్రరక్షకత్వంబునకు నొడంబఱచిన
నుత్తమోజుండును యుథామన్యుండును నట్ల గాక యని
రంత.

183


తే.

ఉత్తమంబైన యభిజిన్ముహూర్తమునను
భూసురాశీర్నినాదంబు బోరుకొనఁగ

జాహ్నవీనీరములచేత సవ్యసాచిఁ
జిత్త మలరంగ నభిషిక్తుఁ జేసి మఱియు.

184


వ.

ఇట్లు సకలాక్షౌహిణీపతిత్వంబునకు నయ్యర్జును నభిషిక్తుం
జేసి మున్ను చెప్పిన పదునెనమండ్ర నేకైకాక్షౌహిణీ
నాయకత్వంబునకు నియోగించి యంతవృత్తాంతంబు
నెఱింగించిన నోలగంబు చాలించి యందఱ ననిపి ధృత
రాష్ట్రుం డభ్యంతరమందిరంబున కరిగె నెల్లవారలుఁ దమ
తమ విడుదల కేగి సుఖం బుండిరని శుకయోగీంద్రుం డిలా
వంతునకుఁ జెప్పిన మీఁదటివృత్తాంతం బేమని యడుగుటయు.

185


శా.

మందారద్రుమమంజరీస్రుతసుధామాధుర్యవాగ్ధుర్య స
ద్బృందాంభోరుహపద్మమిత్రరిపుభూభృన్మంత్రిమంత్రక్రియా
సందోహాంబుధరప్రభంజనకళాసర్వజ్ఞ మీనేక్షణా
కందర్పా ప్రతిగండ భైరవ సమగ్రశ్రీధనాధీశ్వరా.

186


క.

హరిదంత దంతిదంత
ద్విరసనపరివృఢ వియన్నదీ శశి నాగా
భరణ సితాభ్రసితాభ్రా
మర భూరుహచారుకీర్తి మన్మథమూర్తీ.

187


స్రగ్విణి.

మాదయాపాత్ర సంపద్ధరామండలా
మాదయాత్మోద్భవా క్ష్మాసురాఖండలా
హ్రాదినీ భాను దీవ్యత్ప్రతాపానలా
హ్రాదినీరాడ్గభీరా ద్విడబ్దానిలా.

188

గద్యము.

ఇది శ్రీమత్కౌండిన్యగోత్రపవిత్ర చరిగొండ తిమ్మ
నామాత్యపుత్త్ర సకలవిద్యాపారీణ శతఘంట సురత్రాణ
సుకవిజనవిధేయ ధర్మననామధేయప్రణీతం బయినచిత్ర
భారతం బనుపురాణకథయందు షష్ఠాశ్వాసము.

  1. గబ్బితనంబున
  2. దముఁదామె
  3. మేలుగూడు ననిన
  4. నెగడెడునని
  5. విడియ నొసంగ
  6. లేడక్షౌహిణులు
  7. వరులఁ
  8. త్త్వముం
  9. కదా
  10. గొల్లెతలలో వేయాడుటే
  11. కాళియుఁ బదముల
  12. దలకొన
  13. విరసించినచోఁ దనయుని
  14. జెప్పింప విని యరుగుదే నియమిం,చిన
  15. గడు నుచితంబు
  16. విన్నన చెప్పుట గాదు
  17. బూనెనంట
  18. నిడి యా
  19. నిట్లనియెఁ దా
  20. కరులనఁ బొల్చి రాపగలు
  21. వేండిలాగుల
  22. జకురాడె నుగ్ర
  23. తుల్యులు నాహనోగ్రు లౌ,ట
  24. ఖాండవవనమంతఁ గాల్చిపుచ్చిన యప్పు డబ్జాక్ష
  25. శరంబులై
  26. దాల్చినన్ మీమ్రోలన్.