Jump to content

చిత్రభారతము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

తొలుదొలుత నీచిత్రభారతమును మ. రా.రా. శ్రీ రావుబహదూరు కందుకూరి వీరేశలింగముపంతులుగారు తమచింతామణి మాసపత్రికయందుఁ బ్రకటించి 1898 సం.నఁ బుస్తకరూపముగాఁ బ్రచురించియుండిరి. అప్పుడు వా రీగ్రంథమున కీక్రిందివిధమునఁ బీఠిక వ్రాసియుండిరి—

"ఈచిత్రభారతము మిక్కిలి యపురూపమయిన గ్రంథము. ఇది యిప్పుడు దొరకుటయే యరుదుగ నున్నది. బ్రహ్మశ్రీ బహుజనపల్లి సీతారామాచార్యులవారు తమశబ్దరత్నాకరనిఘంటువులో దీనిని నామమాత్రావశిష్టము లైనగ్రంథములలో నొకదానినిగాఁ జేర్చియున్నారు. పోలవరపు జమీన్దారుగారగు బ్రహ్మశ్రీ శ్రీరాజా కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణరావుగారి సాహాయ్యమువలనఁ గొంతకాలముక్రిందట నా కీగ్రంథముయొక్క ప్రతియొకటి లభించెను. అదియు శుద్ధమయినది కాదు. అక్కడక్కడఁ గొన్నిచోట్ల పద్యపాదములు సహితము విడువఁబడియుండినవి. అయినను నాకుఁ బ్రత్యంతరము దొరకకపోవుటచేతను, ఇంకను నుపేక్ష చేసినచో నీయున్నప్రతికూడ నశించునేమో యన్నభీతి కలఁగుటచేతను, లోపించిన భాగములను యథాశక్తిని పూరించి వానిని వలయితములు చేసి, స్ఖాలిత్యములను సంస్కరించి చింతామణిలోఁ బ్రచురింప నారంభించి యిప్పటి కీగ్రంథము నొకరీతిని సమగ్రముగా ముద్రింపించితిని. దీనిప్రతి యెవ్వరివద్దనైన నున్నచో వారు దయచేసి నాకుఁ బంపినయెడల సరిచూచి తగినసంస్కరణములు చేసి వారిప్రతిని వారికి వందనపూర్వకముగాఁ బంపివేసెదను.

చెన్నపురి, పరశువాకము,

23, వెల్లాలవీథి,

కందుకూరి వీరేశలింగము"

10-1-1898 సం॥

పిమ్మట, ననేకసంస్కృతాంధ్రగ్రంథప్రకాశకులును, సుప్రసిద్ధులును, బ్రహ్మశ్రీ వావిళ్ల రామస్వామిశాస్త్రులవారి పుత్త్రులును, మన్మిత్రులు నగు వేంకటేశ్వరశాస్త్రులుగారు కొంతకాలముక్రిందట నేదియో ప్రస్తావవశమునఁ "జిత్రభారతము పరిశుద్ధముగాఁ బ్రకటింపవలయునని యున్నది; కావున నది మీరొకసారి యామూలాగ్రముగఁ జదివి సాధ్యమైనంతవఱకు ముద్రాప్రమాదాదులు సవరించి యిచ్చినయెడ వెంటనే పునర్ముద్రణప్రయత్నము చేయుదు” నని చెప్పుచు శ్రీవీరేశలింగముపంతులుగారు ప్రచురించిన చిత్రభారతపుస్తకమొకటి నా కిచ్చిరి. నే నది యొకవిధముగాఁ జదివిచూచితిని గాని, నా కది ప్రత్యంతరసాహాయ్యము లేక చక్కఁగాఁ బరిష్కరించుటకు సాధ్యముకాదని తోచినది. తరువాత నే నొకప్పుడు ప్రాచ్యలిఖితపుస్తకభాండారమున బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులవారితో నీగ్రంథమును గుఱించి ప్రస్తావింపఁగా వా రిప్పు డీభాండాగారమునఁ బరిపూర్ణమైన చిత్రభారతప్రతి కలదని సెలవిచ్చిరి. ఈసంగతి నేను మన్మిత్రులగు వేంకటేశ్వరశాస్త్రులుగారితో మనవిచేసి, వారు నాకుఁ జదవఁగా నిచ్చినపుస్తకము నచ్చటచ్చటఁ గొన్ని కొన్ని సవరణలు చేసి యుంచినదానిని మరల వారి కిచ్చితిని. వా రాగ్రంథమును బ్రభాకరశాస్త్రులవారిసాహాయ్యమున భాండాగారప్రతితో జక్కఁగా సరిచూపించి సవరణలు చేయించి యిప్పటి కీవిధమున సంపూర్ణముగను నిర్దుష్టముగాను బ్రకటింపఁగలిగిరి. అందంద దొరలిన స్వల్పములగు ముద్రాప్రమాదములు క్షంతవ్యములు

వ్యయప్రయాసములు గణింపక యి ట్లనేకసంస్కృతాంధ్రగ్రంథములను నిర్దుష్టములుగను, మనోహరములుగను ముద్రింపించి ప్రకటించుచుఁ జిరకాలమునుండి యుభయభాషాసేవ చేయుచున్న వావిళ్లవారి కాంధ్రులెల్లరును గృతజ్ఞులుగాకయుండరు.

ఈచిత్రభారతమును రచియించినకవి చరికొండ ధర్మన్న. ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. కౌండిన్యసగోత్రుఁడు. తిమ్మనామాత్యునకును, మాదమ్మకును బుత్త్రుఁడు. వైష్ణవభక్తుఁడు. శతలేఖినీసురత్రాణబిరుదకలితుఁడు. ఈవిషయములన్నియును గ్రంథకర్తయే యీ క్రిందిపద్యమున నిట్లు చెప్పుకొనియున్నాఁడు—

సీ.

కౌండిన్యగోత్రదుగ్ధసముద్రచంద్రు నా
             పస్తంబసూత్రశోభనగరిష్ఠు
సర్వవిద్యాభిజ్ఞుఁ జరికొండ తిమ్మనా
             మాత్యాగ్రణికి మాదమకును గూర్మి
నందను నతిశాంతు నారాయణధ్యాన
             తత్పరు శ్రీరంగధామసదృశ
భట్టపరాశరప్రభురంగగురుపాద
             నీరేజబంభరు నిర్మలాత్ము


తే.

ధర్మనాహ్వయు సత్కవితాధురీణు
దాంతు శతలేఖనీసురత్రాణబిరుద
కలితు నను వేడ్కఁ బిలిపించి గారవించి
తేనియలు చిల్క నిట్లని యానతిచ్చె.

ఈకవి యీగ్రంథమును, ఏకశిలానగరముం బరిపాలించిన “మానభూపాలచిత్తాంబుఖానునకు” మంత్రియైన యెనుములపల్లి పెద్దామాత్యునకుఁ గృతి యిచ్చెను. శ్రీ వీరేశలింగముపంతులుగారు ప్రకటించిన గ్రంథమునందును, వారియాంధ్రకవులచరిత్రమునందును, గృతిపతియింటిపేరు "ఇనుములపల్లి” వారనియును, అతని ప్రభువు పేరు “మానభూనాథుఁ" డనియును గనుపట్టుచున్నది. చూ. "శ్రీ యినుములపల్లి మాదసచివేశ్వరు పెద్దనమందిరంబునన్.” “మానభూనాథచిత్తాబ్జభానుఁ డతఁడు" మొదలైనవి. ఇది యి ట్లుండఁగా, నిప్పుడు ప్రాచ్యలిఖితపుస్తకభాండారప్రతినిబట్టి సవరింపఁబడిన యీగ్రంథమునఁ గృతిపతియింటిపేరు “ఎనుములపల్లివా" రనియును, అతని ప్రభునిపేరు “మానభూపాల (చిత్తాంబుఖానుఁ)” డనియును గనఁబడుచున్నది. చూ. “శ్రీ యెనుములపల్లి మాదసచివేశ్వరు పెద్దన" “మానభూపాలచిత్తాంబుఖానఘనుఁడు” “మానధనుఁడైన” “చిత్తాంబుఖాన”విభుఁడు మొదలైనవి.

శ్రీపంతులుగారు తమయాంధ్రకవులచరిత్రమునం దీకవికాలనిర్ణయముం జేయుసందర్భమున నిట్లు వ్రాసియున్నారు.

"ఈ మానభూనాథుఁ డెవ్వరో గ్రంథమువలన స్పష్టపడదుగాని యెనిమిదవయాశ్వాసాదియందలి యీక్రింది కృతిపతిసంబోధనపద్యమువలన నతఁడు శ్రీరంగరాయనికాలములోని యొకమండలేశ్వరుఁడని యూహింపఁదగియున్నది.

క.

శ్రీరంగరాజసేవాపారంగతహృదయ!...

మొదటి శ్రీరంగరాజు విజయనగరసంస్థానమును 1574వ సంవత్సరము మొదలుకొని 1585వ సంవత్సరమువఱకును పాలించెను. రెండవ శ్రీరంగరాజు 1614వ సంవత్సరమునకు తరువాత రాజ్యమునకు వచ్చెను. ఈకవి యీయిరువురిరాజులలో నొకరికాలమునం దుండినందున పదునాఱవశతాబ్దముయొక్క యంతమునందో పదునేడవశతాబ్దముయొక్క యాదియందో యుండియుండుటకు సందేహము లేదు. ఇదిగాక కవియొక్క కాలమును నిర్ణయించుటకు గ్రంథమునందే యింకొకయాధారము కనఁబడుచున్నది. కృతినాయకునివంశమును వర్ణించుచు కందాళ అప్పలాచార్యులు కృతిపతియొక్క తండ్రికిని, పెదతండ్రికిని గురువైన ట్లీక్రిందిపద్యములలోఁ జెప్పియున్నాఁడు.

శా.

వందారువ్రజదోషమేఘపవనున్ వారాశిగంభీరు నా
నందాత్మున్ హరిపాదభక్తు నిఖలామ్నాయజ్ఞు విశ్వంభరా
మందార క్షితిజాతమున్ నిగమసన్మార్గప్రతిష్ఠాపరున్
గందాళప్పగురున్ వివేకనిధి లోకఖ్యాతు వర్ణించుచున్.


క.

ఆదేశికపదకమలము, లాదరమున హృదయవీథి ననవరతంబున్
మోదమున నిల్పి శ్రీలల, నాధవునిఁ గొలుతురు నారనయు మాదనయున్.

ఈపద్యములనుబట్టి యీచిత్రభారతకృతిపతియు పాండురంగమాహాత్మ్యకృతిపతి కాలములోనివాఁ డయిన ట్లేకగురుఁశిష్యత్వమువలనఁ దేటపడుచున్నందున, ఈధర్మకవి యించుమించుగా తెనాలిరామకృష్ణునికాలమువాఁడే. కందాళ అప్పలాచార్యులుగారు చిత్రభారతకృతిపతి తండ్రికి గురువైనందున, ధర్మకవి రామకృష్ణకవికిఁ గొన్నిసంవత్సరములుతరువాత నుండిన నుండవచ్చును... ఈ కవియొక్క చరిత్రమునుగూర్చి యిప్పుడు చెప్పినదానికంటె నధిక మేమియుఁ దెలియరానందున.."

శ్రీవీరేశలింగముపంతులుగారు, వారికి లభించిన ప్రతియందలి పాఠమునుబట్టి యీ "మానభూనాథుఁ డెవ్వరో గ్రంథమువలన స్పష్టపడదు” అని వ్రాసియుండవచ్చును. ఇప్పుడు లభించినప్రతియందలి పాఠమునుబట్టి యీ “మానభూపాలచిత్తాంబుఖానఘనుఁడు" గాని, “మానధనుఁడైన చిత్తాంబుఖానవిభుఁడు”గాని యెవ్వరై యున్నదియుఁ తెలిసికొనుట కవకాశము కలిగినదేమో చరిత్రకారులు పరిశీలింతురు గాత! ఈచిత్రభారతమునందలికవిత్వ “మనర్గళమైనధార కలదై సలక్షణముగా నున్నది.” కావున సరసులు చవిచూచెదరుగాత!

గులాబీ

అడయారు, మద్రాసు.

ఓలేటి వేంకటరామశాస్త్రి

24 జూలై 1934.