Jump to content

చాటుపద్య రత్నాకరము/పంచమతరంగము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చాటుపద్యరత్నాకరము

పంచమతరంగము

అర్ధకందమున దశావతారముల యిమిడిక

క. వనచరములు నాల్గరయన్
   మనుజాకృతు లేను పైనిమావొక్కటియై
   తనరిన నరహరి మా కెపు
   డనుపమసౌఖ్యంబు లొసఁగు నవనీస్థలిలోన్.

దశావతారశ్లేష


క. ఏమీననఁ దాఁబేలన
   నాముంగిటికేలరాఁడు? నరహరి పిన్నా!
   రాముని ముమ్మాఱంపితిఁ
   బ్రేమంబున బుద్ధిఁ జెప్పి పిలువవె కలికీ!

భృత్యులు


క. వాసవరవిసోమార్కులు
   వాసవరవిసోమసుతులు వాసవసుతులున్
   వాసవులు కవులు సోములు
   వాసవరవిసోమసుతులు వాకిట భృత్యుల్.

శ్రీగండవరపమ్మదండకము
రచయిత చేజెర్ల నారాయణకవి



శ్రీమత్సమస్తావనీనిస్తులద్దేశదేశాభిముఖ్యప్రకాశోజ్జ్వలస్థానమై యొ
ప్పు నప్పాకనాటిప్రసిద్ధస్వదేశంబునం జాల రంజిల్లు కుల్లూరు సీమందుఁ
చేజెర్ల గ్రామంబునం బూర్వకాలంబునం దుద్భవంబైన గండారపమ్మాఖ్య
విఖ్యాతయౌ శక్తియుక్తిప్రకాశోన్నతిం జెంది తత్తీర్థసేవావిశేషా
ర్థము ల్మాని స్వస్థానమానాభిమానంబుఁ బోనాడి తానేగి కొన్నాళు లు
న్నంతలో శోభకృద్వత్సరంబందు వైశాఖమాసాన శ్రీపాకనాటీకులశ్రే
ష్ఠుఁడైనట్టి తూమాటి వెంగన్న స్వప్నంబులో వచ్చి సాకారరేఖావిలాసం
బుతో శక్తి ప్రత్యక్షమై ప్రేమఁ దత్పూర్వవృత్తాంత మాద్యంతముం
జెప్పి తానప్పుడే యప్రకాశంబునుం బొంద నవ్వేళ వేగంబె మేల్కాంచి
యత్యంతసంతోష ముప్పొంగ నావెంగధీరుండు శూరుండు నారీజనా
నందసౌందర్యకందర్పుఁ డాభోగదేవేంద్రుఁ డాసద్గుణైశ్వర్యసంపన్నుఁ
డాకాంతిచంద్రుండు సత్కీర్తిసాంద్రుండు ప్రత్యర్థిమత్తేభకంఠీర
వాభుండు సౌఖ్యోన్నతిం జెంది చేజెర్ల చెన్నాభిధానప్రభావాచ్యుతా
నంతగోవిందుఁ డైనట్టి యద్దేవు నవ్యాద్భుతాకారగర్భాలయాద్యంత
రాళంబులుం దద్విమానప్రపద్యత్కటాక్షస్ఫురద్వైనతేయాదిసద్వాహ
నంబుల్ మహావిశ్వకర్మాంశసంభూతులౌ భీమలింగయ్య గుర్వయ్య చెం
చాభిధానాది శిల్పాధికారప్రసన్నుల్ ప్రభావజ్ఞులౌ వారిచేత న్వినో
దంబుగాఁ బూని నిర్మింపఁగా నెంచి తర్వాత గండారపమ్మ న్వినోదంబుగా
శక్తిరూపంబు నాశిల్పశాస్త్రప్రకారంబుగాఁ గౌశలం బొప్పఁ జేయించెఁ
దచ్ఛక్తి సౌందర్యముం జూచి వర్ణింపఁగా బ్రహ్మకున్ శక్యమే గాదు నిక్కం
పుఁ జొక్కంపు స్వర్ణాశసంభుతహైయంగవీనాభ్రసంజాతవిద్యుల్ల
తాతుల్యదేహన్ జగన్మోహనాకారతారుణ్యలావణ్యదుగ్ధార్ణవావిర్భహృ

త్పూర్ణచంద్రాననన్ జూడ దృగ్గోచరంబైనతల్లిన్ విలోకించి నేనెంత
సేవింతు భావింతు నాయంతరంగంబునం గట్టిగా సూటిగా నాటఁగా,
నీటుగా నున్నయద్దేవి దివ్యావతారంబుగా నొప్పుచందంబు నందంబుతో
నుత్తమాంగంబుపైనం గిరీటప్రభల్ భానుబింబంబు తేజంబు మాయింప,
నయ్యిందుబింబావతంసంబు తత్ఫాలభాగంబునం దొప్ప, నాభూతిరేఖల్
ముఖాబ్జంబునం దందమై యొప్ప కందర్పుబాణంబులం గేరు నేత్రంబు లా
నందముం గొల్పఁ దన్మధ్యదేశంబునం దున్నతంబైన సంపెంగసూనం
బు నానొప్పు ముక్కందున న్ముక్కరల్లాడ ముత్యంబు నృత్యంబుతో నిక్కి
తా ధిక్కరింపంగ మాత్సర్యముం బూని తా రక్తసిక్తాంగమై మ్రింగనుంకించు
బింబాధరశ్రీల నొప్పారు వక్త్రంబునన్ హాసము ల్గుల్కఁగా వజ్రతుల్యంబులౌ
దంతధావళ్య మారెంటినిం గప్పఁగాఁ గంబుకంఠంబు ఘోషింప భర్మాంగ
రాగప్రభాభూషణవ్రాతము ల్బట్టి పల్లార్చి చిందాడఁగా రత్నతాటంకుయు
గ్మంబుతోడ్తోడ వర్తించుచుండంగ నాచెక్కుటద్దాలు ముద్దాడ సంగీతసాహి
త్యసామాగమం బంతలో నృత్తతాళానురూపంబులై గొప్పలై యొప్పుచున్న
ట్టి వక్షోజకుంభంబు లుప్పొంగఁగా జూచి తత్కంఠహారంబుల్ గప్పు నాచొ
ప్పు వీక్షించి రంగైన యాపైఁటకొంగంత లోగంతుల న్వైచి హారాలు పోఁ
ద్రొబ్బి తా గొబ్బునం గుబ్బచందోయిపైఁ జక్కఁగా దండ లుద్దండవృత్తిన్
వుడాయించి యాకొంగుపొంగారఁగాఁ ద్రొక్కుచుండంగ నూగారునాభి
ప్రదేశంబునందును బంగారటొడ్డాణ మామధ్యదేశంబు నాశంబు గావింప
క్షోణీతలశ్రోణి తా నీవిబంధానుబంధంబుతో చిత్రవస్త్రంబు పాదాల
పర్యంతముం గట్టఁగా దెప్పరంబైన హారంబుతోఁ గింకిణీనూపురద్వంద్వ
ము ల్జోడుగాఁ గూడి ఘోషింప నీలాభ్రసంకాశవేణిన్ సదామంజువాణిన్
శరత్కాలసంపూర్ణచంద్రాననన్ గుందమందారహాసన్ సునాసన్ జకోరా
క్షినక్షీణత్రైరేఖ భూతిర్లలాటం జలాటాన్వయగ్రీవసద్భావజంభారిగం
భీరకుంభీభవత్కుంభధిక్కారశుంభత్ స్తనిన్ నిస్తులద్బాహుదండో

భూషావిశేషన్ అశేషామరస్తుత్యపాదారవిందన్ సదానంద లోకైక
మాతన్ మహాపాతకవ్రాతజీముతవాతన్ ద్రిశక్త్యాదిశక్తిన్ గుణాతీత
నవ్యక్తఁ బూతన్ జగన్నేత్రి బ్రహ్మాదిమూర్తిత్రయాధారవేదాంతసారన్
నిరాకారఁగా సన్నతుల్ సేయఁగా వచ్చి సాకారరూపంబుతో నున్న యా
దేవికిన్ సిళ్ళు బోనాలు బొంగళ్ళు నివ్వాళ్ళు గర్పూరసాంబ్రాణిధూపంబు
సూపాన్నపూపాదిభక్ష్యంబులు న్వేఁటలున్ ఆటలున్ బాటలున్ గండ
దీపాలు వస్త్రాలు శస్త్రాలు శివ్వాలు బువ్వాలు పవ్వాడముల్ వారముల్
మంత్రముల్ యంత్రముల్ తంత్రముల్ జంత్రగాత్రంబుతోఁ బాడువీణాది
వేణుస్వనానందముల్ గంధముల్ పిండిగండంబు జందేలుచిందేలు పచ్చా
కుపుప్పొళ్ళు జవ్వాజికస్తూరికర్పూరముల్ దీపముల్ ధూపముల్ హారతుల్
చిందులున్ చప్పటల్ తప్పెటల్ జమ్లికన్ కొమ్ములున్ పంబలున్ గుం
భముల్ సుద్దులున్ గద్దెలున్ పద్దెముల్ మద్దలల్ కీర్తనల్ నర్తనల్ వెం
డిబంగారుపుంగిండ్లు సింగారపుబండ్లు మాధుర్యపుంబండ్లు చేచల్లయుం గల్లు
సారాయి మాంసంబు రక్తంబు యుక్తంబుగాఁ దెచ్చు పచ్చళ్ళు నచ్చంపు నూ
బిండి కూరాకులున్ యిడ్డెనల్ లడ్డులున్ చక్కెరల్ ఉక్కెరల్ బిల్వపత్రం
బులుం బుష్పముల్ పచ్చనక్షింతలున్ బోగు నూళ్ళాదిగాఁ గల్గు సర్వోప
చారాలతో బ్రాహ్మణక్షత్రవిట్ఛూద్రులున్ శాయనాసాది బైనేళ్ళు మాతం
గు లామద్యపానంబుచే మత్తులై బూతులాడంగఁ జూడంగ నాఁడెంతయున్
వేదఘోషంబుతో శంఖభేరీమృదంగాదివాద్యధ్వనుల్ సన్నమేళంబుతో
మిన్ను భేదింపఁగాఁ బూర్ణహర్షంబుతో వచ్చి తద్బాణవిద్యాది నానావినో
దంబులం జూచి యానందముం బొందఁగా నందమౌ సుందరుల్ మందలై
మందయానంబుతో గంతుపూబంతులై మించి పూగొమ్మలై కమ్మ లల్లా
డఁగా రత్నపుంసొమ్ములం బెట్టి చూపట్టు హొంబట్టు పుట్టంబు లొప్పారఁ
గాఁ గట్టి దట్టంబుగా గంధకస్తూరిజవ్వాజి నెమ్మేనుల న్మెత్తి గుత్తంపుఁజందో
యిపై వ్రేలుతో రాలహారాలు వేఁజిందులం ద్రొక్కఁ జొక్కంపుఁ గర్పూర

తాంబూలముల్ సేయుచున్ పాయుచున్ జోడుఁగాఁ గూడుచున్ గొప్పు
లం జుట్టుదట్టంపుఁ జెంగల్వపూదండ లొండొండు తండోపతండంబులై
తత్కటిద్వీపము ల్దాటి వ్రేలాడఁగా నవ్వుచున్ జవ్వనుల్ కేరుచున్
మూకలో దూఱుచున్ బోయి యాయాసముం జెంది తద్గండభాగంబులం
దీర్చు కస్తూరికావక్రపత్రానుసమ్మిశ్రమై జారుఫాలప్రదేశంబునం బుట్టి
ఘర్మాంబుజాలంబు మూలంబుగా గోరులం గీరి పార్శ్వంబులందున్న సౌంద
ర్యకందర్పులం జూచి హాస్యంబుగా వారిలోనన్ వికారంబులం జూచి
నేత్రంబులన్ జిమ్ముచున్ మమ్మరం బైనయాపేక్షతో వచ్చి గండారపమ్మ
న్విలోకించి దండప్రణామంబులం జేసి తాంబూలము ల్వెట్టి యాశక్తియా
కార మాద్యంతముం జూచి యానందమగ్నాంతరంబు లుప్పొంగ ము
గ్ధాంగనల్ నాసికాగ్రంబులం దర్జనీయంగుళా లుంచి యాశ్చర్యముం బొంది
సందేహముల్ దీర “కోయమ్మ! యీయమ్మ నణ్ణెత్తిపై నున్నదేమే? అదే
బొప్పిగా; కాదు చూడే గరాసా! కిరీటంబు; ఓయబ్బ! యీయుబ్బుగాను
న్న రెండేంటివే? కణ్తులే; కావుచీ కుయ్యకే గుబ్బచన్గొండలే; గొడ్డుబోతా
డదో? పట్టితే గట్టిగా నున్న వీచన్ను; లట్లందురా దోసమే నోరుపుచ్చీని,
ఈగొంతుచు ట్టేంటివో? తోలుపాదాలు; నీకండ్లు చెడ్డావటే రత్నహారాలు
ఈనోరుగబ్బేమొకో? కల్లు దాగేదిగా? వుండవే గొండగొయ్యా! యిదే గం
ధకస్తూరికావాసనే యమ్మ! యిన్నాలుగు న్నేంటివో? తెడ్లుగా; కావు హ
స్తంబులే బోటి! వొడ్డారమా దీని సుట్టేంటివో? విల్లుగా; కాదె ఓమల్లి! నీవొ
ల్లు కొవ్విందటే, చూడవే తోరణం; దీనిపైనున్న దీబాకినోరేమొ? చెయ్ బె
ట్టితే కర్సునో పిల్లియేమొక్కొ కాదే బికారీ! యిదే సింహతల్లాటమే య
క్క! నిక్కంబుగాఁ జెప్పవే దీనివొళ్ళంతయున్ దెల్లఁగా నెఱ్ఱఁగా నున్న
వీచారలేమే? బళా స్ఫోటకంమచ్చలే యిచ్చకమ్మాటలో పిచ్చికల్లాల యీ
యమ్మ మేనంతయున్ సొమ్ముతో కమ్మియున్నట్టి యీయమ్మ తాఁగట్టు
కున్నట్టి చిత్రంపుచీరందమే; చేతులం బట్టుకో పొంచుకున్నట్టి వివ్వేంటివో

చెప్పవే జడ్డిగప్పిడ్తయున్ మూకుడున్ కోలయున్ గొఱ్ఱు లున్నట్టుగా నున్న
వే చూడవే, అంటివేకొమ్మ! నీవింక నోరెత్త కీ నాలుగున్ డక్కియున్ గి
న్నెయున్ గత్తియున్ శూలమున్ యుల్లమం దుంచుకో గట్టిగా మంచి దోయ
మ్మ తా నాడదేవంటివే, అంటుముట్టైతె యేలాగు పూజారి తా నీళ్ళు కాపించి
పోశీని? యిట్లాడితే నాలుగ ల్గొయ్యరా? అయ్యయో పాపమే తల్లి! ముల్లోక
ముల్ ప్రోచు నిల్లాలికిన్ అంటుముట్టొచ్చునా? దైవమే మ్రొక్కవే,
కుయ్యకవ్యక్తురాలా! అదే తిట్టబో కీపెకుం బిడ్డలా? గొడ్డుగా; చూడు నే
నెంతఁగా దిట్టినా గుట్టుగా నుండగా నేరవేమందు నీయందు సుజ్ఞానమార్గం
బు గోరంతయున్ లేదు యీయమ్మకుం జంగమస్థావరాలాదిగా గల్గు
యీజంతుజాలంబుతోఁ గూడ వారందఱున్ బిడ్డ లీమాటకు న్మాఱుమాటా
డఁగా వద్దు ర”మ్మంచు సుజ్ఞానముం దెల్పి యందొక్కచోఁ గూడి యాసుం
దరీబృందముం దాను దద్దేవతాగారము న్వీడి స్వస్థానమార్గమ్ములం బట్టి తా
మేగి; రీరీతి నిత్యోత్సవక్రీడ ప్రత్యబ్ద మాశక్తికిం జెల్లుచుండంగ చేజెర్ల చెన్న
ప్పకు న్మెప్పుగాఁ దీర్థసేవావిశేషంబు లేటేట నత్యంతసంతోష మొప్పా
రఁగా సాగుచుండంగఁ దానిత్యముం జెన్నకేశుండు నీశుండు వేదాంతసా
రుండు ధీరుండు కంజాతనేత్రుండు పాత్రుండు బ్రహ్మాదిసేవ్యుండు భా
వ్యుండు నాద్యంతశూన్యుండు మాన్యుండు నానాగుణౌఘాభిరాముండు
భీముండు ఓంకారవాచ్యైకరూఢుండు గూఢుండు మాణిక్యవక్షస్థలాలం
కరిష్ణుండు జిష్ణుండు మార్తాండకోటిప్రభాభాసమానుండు నిత్యుం డనిత్యుండు
గోవిందుఁ డానందుఁడై లోకముల్ మోదముం జెందఁ బాలించుచు న్వచ్చి
తూమాటి వెంగన్నకుం బుత్రపౌత్రాదిసంతానసౌభాగ్యముల్ గూర్చి చేజెర్ల
రంగప్రధానాగ్రణీసత్కుమారుండు నారాయణాఖ్యుండు నిర్మించు నీదండ
కం బెప్పు డెవ్వారు భాషింతు రెవ్వారలు న్విందురో వారి కవ్వారిగా సంపదల్
గూర్చి రక్షించు మో దేవదేవీ నమస్తే నమస్తే నమః.

హెచ్చరిక

ఉ. చంద్రకళాధరుండు కలుషానలవారిధరుండు శంకరుం
   డింద్రియలోలదూరుఁ డఖిలేశ్వరుఁ డద్రిసుతాసమేతుఁడై
   మంద్రవచోవిశేషపరమామృతసేచన మొందుచున్నవాఁ
   డింద్ర! పరాకు వే విడిచి యీనిశి నీదిశఁ గాచియుండుమా.

ఉ. మౌనిమనోంబుజాంతరనిమగ్నపదద్వయషట్పదుండు కా
   దేనవిభూషితుం డజుఁ డతీంద్రియుఁ డద్రిసుతాధరామృతం
   బానుచుఁ గార్యకారణమ యాత్మసుఖంబునఁ జొక్కినాఁడు వై
   శ్వానర! యీత్రియామమున సమ్మతి నీదశఁ గాచియుండుమా!

ఉ. కుండలిమండనుం డసురకోటివిఖండనుఁ డంగజాహితుం
   డండజవాహనాత్మహితుఁ డవ్యయుఁ డాఢ్యుఁ డగేంద్రకన్యకా
   ఖండితరోపగూహనసుఖంబున మిక్కిలిఁ జొక్కినాఁడయా
   దండధరా! వివేకమతి దక్షిణ మీనిశఁ గాచియుండుమా.

ఉ. హేమనగేంద్రచాపుఁ డురగేంద్రకలాపుఁ డుపేంద్రమిత్రుఁ డా
   హైమవతీపయోధరయుగాంతరతల్పశయానురక్తుఁడై
   శ్యామపయోధరాంతరనిశాంతతటిల్లతఁ బోలియున్నవాఁ
   డేమర కీవు దైత్యవర! యీనిసి నీదశఁ గాచియుండుమా.

ఉ. సూరినుతుండు దర్పకనిషూదనుఁ డార్తశరణ్యుఁ డీశుఁ డిం
   పారతుషారశైలతనయాపరిరంభణచుంబనాదిశృం
   గారకళావిశేషపరికల్పితకాముకుఁ డైనవాఁడయా
   వారినిధీశ! యీనిశ ధ్రువంబుగ నీదిశఁ గాచియుండుమా.

ఉ. భూతగణేశ్వరుం డఖిలభూతదయాపరుఁ డీశుఁ డాజగ
   న్మాతమనోగతు ల్వెలయ మంజులతల్పశయానుఁడై మనో
   జాతవిలాససంజనితసౌఖ్యరసంబునఁ జొక్కె సుమ్మి యీ
   రాతిరి గంధవాహ! మదిరంజిల నీదిశఁ గాచియుండుమా.

ఉ. రాజకళాధరుండు కవిరాజితభూధరమందిరుండు వి
   భ్రాజితనీలకంధరుఁ డరాతిభయంకరుఁ డద్రికన్యతో
   రాజమరాళతల్పమున రంజిలి మిక్కిలి చొక్కినాఁడ యా
   రాజవరేశ! యీరజని రంజిల నీదశఁ గాచియుండుమా.

ఉ. ఈశుఁ డశేషలోకనుతుఁ డీప్సితిదాయకుఁ డద్రికన్యతోఁ
   బేశలపుష్పతల్పునఁ జేర్చి పెనంగి యనంగసంగర
   క్లేశసముద్గణాంబుకణకీర్ణవికారశరీరియైనవాఁ
   డీశ! దిగీశ! యీనిసిని నింపుగ నీదిశఁ గాచియుండుమా.

ఉ. నందకపాణిసౌహృదుఁ డనంతుఁ డభేద్యుఁ డఖండసచ్చిదా
   నందుఁ డుమార్ధవిగ్రహఘనాంబుమదంబుదగర్భనిర్గతా
   స్పందకఠోరుఁడై హరుఁడు తత్పదమంది వెలుంగుచుండెనో
   నందిముఖప్రధానగణనాయకులార! చలింపకుండుఁడీ.

ఉ. మానితభూజలాగ్నిపవమానవిహాయసమానసాధికా
   ధీనకృతాంగమధ్యసముదీరతనిర్జరతిస్రగంతరో
   ద్యానవిహారుఁడై హరుఁడు తత్పదమంది వెలుంగుచుండెనో
   మానసమా! వినిశ్చలసమీధి వహించి భజించుచుండుమా.

రాముఁగనుగొంటి


సీ. శ్రీకరరత్నశింజితనూపురాన్విత
               పాదపద్మంబులఁ బరఁగువాని
   గాంచీకలాపసంఘటితహస్తంబులు
               కాంచనచేలంబుఁ గలుగువాని
   గ్రైవేయకంబులు కమనీయహారము
               ల్కంకణాంగదములు గలుగువాని
   మకరకుండలరత్నమహనీయమకుటస
               న్మందహాసవిలాసమహిమవానిఁ
   జెలఁగి సింహాసనంబున సీతతోడ
   రమణఁ గూర్చుండి రాజ్యపాలనము సేయు
   నట్టికోదండరాము నేనాత్మలోన
   మెలఁగఁ గలఁగంటి నంతట మేలుకొంటి.

ఆశీర్వాదము


చ. మనసిజుమామమామయభిమానమడంచినవానిమామనం
   దనునివిరోధినందనునినందనుసుందరిమేనమామఁ జం
   పిన జగజెట్టిపట్టిఁ బొడిఁజేసినశూరునితండ్రిఁ గన్నుగన్
   గొనినసురాధినాథునితనూభవునాయువు మీకు నయ్యెడున్.

ఉ. మామను సంహరించి యొకమామను గర్వ మడంచి యల్లఱే
   మామను రాజుఁ జేసి యొకమామతనూజున కాత్మబంధుఁడై
   మామకుఁ గన్నులిచ్చి సుతుమన్మథు నింతికిఁ దానె మామయై
   మామకు మామయైన పరమాత్ముఁడు మీకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్.

సీ. అన్నపై శయనించి యన్నను పైనుంచి
               యన్నను మునిమాపు హతము సేసి
   అన్నసుతు రక్షించి యన్నసుతు శిక్షించి
               యన్నసుతునకుఁ దనయనుజ నిచ్చి(?)
   మామకు మామయై మామను బంధించి
               మామసుతుధరకు మామఁ జేసి
   కొడుకుకు బావయై కూఁతురిపెనిమిటై
               కొడుకు నాలములోనఁ గూలనేసి
   మించు శ్రీహరి కరుణచే మీకు నొసఁగు
   బహుతరంబగు నాయురైశ్వర్యములను
   వస్తువాహనసంపన్నవైభవముల
   సకలసామ్రాజ్యవిభవంబు సంతతంబు.

గీ. ఆలినొల్లకయున్న వానమ్మనుగని
   నందులోపలనున్న వానక్కమగని
   నమ్మినాతనిఁ జెఱచు దానమ్మసవతి
   సిరులు మీకిచ్చు నెప్పట్లఁ గరుణతోడ.

ఉ. ఆలికి నల్లుఁడై పిదప నల్లునికిందగఁ దానె యల్లుఁడై
   యాలికిఁ దండ్రియై మనుమరాలికిఁ బెండ్లికుమారుఁడై సదా
   ఆలిమఱందిచెల్లెలికి నర్మలిభర్తయు నౌచునొప్పు గో
   పాలుఁడు రంగశాయి మనపాలఁగలండు విచారమేటికిన్.

లేఖకుఁడు


గీ. తప్పు సవరించి వ్రాయు టుత్తమము లేక
   ప్రతిసమానముగా వ్రాయు టతిముదంబు

   రెండు విడిచియు వ్రాసెడు లేఖకుండు
   కలిమి కవిసేయు భాగ్యంబుగాదె కృష్ణ!

క. ప్రతిఁ జూచి వ్రాసినాఁడను
   అతిసెబ్రలువ్రాలు చూడ నన్నియుఁ దప్పుల్
   యతియును ప్రాసము నెఱుఁగను
   మతిమంతులు తప్పు దిద్ది మన్నింపరయా!

చాటుపద్యరత్నాకరము

సమాప్తము