చాటుపద్య రత్నాకరము/చతుర్థతరంగము
శ్రీరస్తు
చాటుపద్యరత్నాకరము
చతుర్థతరంగము
వేమగుంట వేంకట్రాయుఁడు
క. విధ వైన మేలు మగనికి
తిథి వెట్టును కథలు వినును తీర్థము లేగున్
అధముఁడవు దానికన్నను
విధవాయా వేమగుంట వేంకట్రాయా.
వేముల చిన్నారాయఁడు
క. తల లెంత పెంచుకొన్నను
కులధర్మము విడిచి కన్నకూళ్ళం దిన్నన్
గలుగదు మోక్షము చిత్తము
విలయము గాకున్న బిజన వేములచిన్నా.
గువ్వలచెన్నని పద్యములు
క. గుడి కూలును నుయి పూడును
వడినీళ్లన్ జెఱువు తెగును వనమును ఖిలమౌఁ
జెడనిది పద్యం బొకటియె
కుడియెడమలఁ గీర్తిఁ గన్న గువ్వలచెన్నా!
క. వెలయాలు సుతుఁడు నల్లుఁడు
నిలపతియును యాచకుండు నేవురు ధరలోఁ
గలిమియు లేమియు నెఱుఁగరు
కులపావనమూర్తి వన్న గువ్వలచెన్నా!
క. అంగీలు పచ్చడంబులు
చంగావిమెఱుంగుసేలు సరిగంచులమేల్
రంగుల దుప్పట్లును నీ
గొంగడి సరిఁ బోలవన్న గువ్వలచెన్నా!
క. ఎఱుఁగుదువు సకలవిద్యల
నెఱుఁగని విఁక రెండుకలవ వేవే వన్నన్
బిరికితనంబును లోభము
గుఱు తెఱుఁగవు జగతి నెన్న గువ్వలచెన్నా!
క. ఈవీయని పదపద్యము
గోవే సభఁ జదివె నేని కుంభినిలోనన్
ఈవిచ్చిన పదపద్యము
గోవే సభఁ జదువకున్న గువ్వలచెన్నా!
క. పరిగేరుకున్న గింజలు
కఱవున కడ్డంబు రావు కష్టుం డిడు నా
తిరపెమున లేమి తీరదు
గురుతరసత్కీర్తిఁ గన్న గువ్వలచెన్నా!
కొత్త అమరప్ప
క. భూమండలిలోఁ గల్గిన
యేమానవుఁడైన ధన మపేక్షించును గా
ఆమేల్మిగుణము పట్లను
కోమట్లనుఁ జూడ గొప్ప కొత్తమరప్పా!
క. వరహా లెన్ని గణించిన
పరమార్థజ్ఞానిపోలె పావనుఁ డౌనా?
ధర వన్నె లెన్ని గల్గిన
గురిగింజకు నేమి గొప్ప కొత్తమరప్పా!
క. వాట మెఱిఁగి వచియించిన
బాడిలుఁగా వానిమాట పదుగురిలోనన్
వాట మెఱుంగక పలికినఁ
గోటికి సరతూగదప్ప కొత్తమరప్పా!
క. కూటికి గద యింద్రాదులు
వాటముగా యజ్ఞములకు వచ్చుటలెల్లన్
గోటానకోటు లొసఁగినఁ
గూటికి సరితూగదప్ప కొత్తమరప్పా!
క. ఇమ్మహి గుణములకెల్లను
సమ్మతి వితరణగుణంబు సరసులు మెచ్చే
సొమ్ములలో ముత్తైదువ
కొమ్మలకుం దాళి గొప్ప కొత్తమరప్పా!
కృష్ణరాయక్షితీంద్ర
సీ. ఏనుఁగు సింహంబు నెలనాగయునుఁ గూడి
యొకమాటలోపల నుండవలయుఁ
బక్షియు వస్త్రంబుఁ బాషాణమునుఁ గూడి
యొకమాటలోపల నుండవలయుఁ
ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుఁడు గూడి
యొకమాటలోపల నుండవలయుఁ
రారాజు రతిరాజు రాజరాజును గూడి
యొకమాటలోపల నుండవలయుఁ
దీనియర్థంబు జెప్పఁగా దీనిధులకు
నెలలు పన్నెండు గడు విత్తు నేర్పుగాను
చెప్పునాతఁడు భావజ్ఞశేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
సీ. మనుజునియాకారమహిమకు మొద లెద్ది?
నగవైరివైరుని నగర మెద్ది?
రఘుపతి గాచిన రాక్షసాండజ మెద్ది?
శిబికన్ను లార్జించు చెలువ మెద్ది?
పంచబాణునియింటఁ బరఁగినరుచి యెద్ది?
గిరిపతి భుజియించుగిన్నె యెద్ది?
నయనాంగరక్షకు ననువైనన నలు పెద్ది?
చెలఁగి మానముఁ గాచు చెట్టదెద్ది?
అన్నిఁటికిఁ జూడ రెండేసియక్కరములు
చెప్పునాతఁడు భావజ్ఞశేఖరుండు
చెప్పఁ గల్గిన నే నిత్తుఁ జిన్నిమాడ
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
సీ. అసమానకోదండుఁ డైనరా జెవ్వఁడు?
రాజు పేరిఁటఁ గల రాగ మెద్ది?
రాగంబు సరివచ్చు రాజిత ఋతువెద్ది?
ఋతువు పేరిఁటఁ గలరుద్రుఁ డెవఁడు?
రుద్రునిపేరిఁట రూఢియౌ పక్షెద్ది?
పక్షి పేరిఁటఁ గలవృక్ష మెద్ది?
వృక్షంబు సరివచ్చు వెలయుభూషణ మెద్ది?
భూషకు సరివచ్చు భూమి యెద్ది?
అన్నిఁటికిఁ జూడ మూఁడేసి యక్షరములు
ఆదు లుడుపంగఁ దుద లెల్ల నాదు లగును
చెప్పునాతఁడు భావజ్ఞశేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
సీ. ఇలరామునకు సీత యెచ్చటఁ గనఁబడె?
నారాముఁ డేటికి యడవి కరిగె?
నేఁగిన మారీచుఁ డేమిరూపముఁ దాల్చె?
నెలమి దైత్యుల రాముఁ డెచటఁ జంపె?
సుగ్రీవుఁ డారాముఁ జూచి యేమని పల్కె?
వాలి రామునిచేత నేల చచ్చె?
లంక యేరీతిని రాముఁడు శోధించె?
.....................బ్రదుకఁ జూచె?
అన్నిఁటికిఁ జూడ మూఁడేసి యక్కరములు
మొదలు దుదలును నొక్కెడ నొదిగి యుండు
చెప్పగలవాఁడు భావజ్ఞశేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
సీ. నక్షత్రవీథికి నాయకుఁ డెవ్వండు?
రంగగు గుడిలోన లింగ మెద్ది?
వాహనంబులమీఁది వన్నెకు మొదలెద్ది?
దేవతాఋషులకుఁ దిండి యెద్ది?
నరకాసురునిఁ గన్న నాతినామం బెద్ది?
పొలతి చక్కఁదనానఁ బోల్పనెద్ది?
తల్లికిఁ గడగొట్టు తనయునిపై నెద్ది?
కమలాప్తుబింబంబుఁ గప్పునెద్ది?
అన్నిఁటికిఁ జూడ రెండెసి యక్కరములు
ఆదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును
చెప్పునాతఁడు భావజ్ఞశేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
సీ. రాముఁ డెవ్వరిఁ గూడి రావణు మర్దించె?
పరవాసుదేవుని పట్టమెద్ది?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది?
వెలయ నాలుగువంటివిత్త దేది?
సీతను గొనిపోవఁ జెఱచిన ధనువెద్ది?
సభవారి నవ్వించు జాణ యెవఁడు?
అలరంభతురుములో నలరునూలిక యేది?
............................................
అన్నిఁటికిఁ జూడ నైదేసి యక్షరములు
ఆదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును
చెప్పునాతఁడు భావజ్ఞశేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
శృంగారము
చ. కరభము లేమపెందొడలకాంతులఁ గాంచఁ దలంచి భీతిచే
విరలగతిన్ సతీగమనవృత్తి వహింపఁగ నోచెనో తుదన్
దరిగిన మధ్యమస్థితి పదద్యుతిచే ముఖవర్ణ మంతమై
తిరిగి సకంటకావిలగతిన్ దలవంచి నశించెఁ గోఁతలన్.
గీ. కంధరం బింతిజడసరి గాక యోడి
ప్రథమవర్ణంబుఁ బాసి కుచాగ్రసీమ
కొత్తుఁ బోయి కచశ్రీకిఁ దత్తరిల్లి
క్రిందుమీఁ దయి ముఖసీమఁ బ్రీతి నెనసె.
మ. మృగశాబేక్షణ గుబ్బిగుబ్బగవతో మెం డొడ్డి హీనంబులై
నగముల్ వృద్ధి వహించి యానయసమాన స్వచ్ఛరోమాళితోఁ
బగ సాధింపఁగ లేక పూర్వమునఁ బుంభావమ్మున న్నాభికిన్
దగకే క్రిందున్ బడె ధరిత్రి బలవద్వైరంబు వాటిల్లుటన్.
క. కంధరము ధరము కరమును
కంధరధర దరము కరము కచకుచకటివా
క్సింధురమా సింధురమా
సింధురమా వైభవాప్తిఁ జెలువ యొసంగున్.
సీ. ద్విరదంబునడతోడ సరిరాక ముఖభంగ
దశనొంది నవ్వుతోఁ దనరఁజూచె
గగనంబుకౌనుతోఁ బగజెంది మధ్యమాం
తము నొంది నవ్వుతో దనరఁజూచె
సారసం బంఘ్రితో సరిరాక సావర్ణ
గతిమాని మోవితోఁ గదియఁబూనె
గనకారికటితోడ నెనరూని నారివే
సముఁ బూని మేనితో సమతఁ జెందె
తిరిగి సతికంఠకుచబాహు సరసనాసి
కలకు భయమంది మొఱవెట్టిగతులు మాని
యొరఁగి ధరఁగూలి వత్తు లై యొకటరెంట
మూటనాల్గింటితో సరి మొనయవయ్యె!
సీ. కుచపాళి గాంగేయకుంభజప్రభ మించె
ధర్మరాజఖ్యాతిఁ దనరెఁ బొమలు
పటుమత్స్యరాజప్రభావంబుఁ కనెఁ గన్ను
లంగ మశ్వత్థామరంగుఁ దాల్చె
ఘనకృపాతిశయంబుఁ గల్గి పల్కులు మించె
చక్రితేజముఁ గేలి సల్పె నారు
ధార్తరాష్ట్రద్యుతిఁ దనరె యానస్ఫూర్తి
రూపుఁ ద్రుష్టద్యుమ్నరుచుల మిగిలె
నఖము లర్జునసత్కాంతి నగవు మిగిలె
ఘర్మసంపద నవనవగణన మొసఁగె
తరుణిఁ గురుపాండవబలంబు తనరె మేన
నెంత చిత్రం బహో యింతి నెంచి చూడ.
క. అహహా దానిపిఱుందులు
రహిఁ బోల్పఁగ దానుఁ బోలు రమణీయములై
మహిళామధ్యము నెన్నఁగ
మహిళామధ్యంబుఁ బోలు మంగళ మగుచున్.
క. నగమా కుచ మా రొగిప
న్నగమా తరళేక్షజీవనగమా నగమా
నగ మార్కొను నుడి రంభా
నగమా తొడ లీఘనాఘనగమా మణికిన్.
ఉ. మోహము మోహరించె సతి! మొల్ల సుగంధిరొ! తాళఁజాలనే
మోహము నిల్వదాయె కడు ముష్కరమారుఁడు బాణజాలమున్
దేహము స్రుక్కఁగన్ మిగులఁ దీవ్రత నేసెను భామ! చూడవే
యాహవవీరుఁ డౌమథుఁడు నద్భుత మొప్పఁగ మూర్ఛఁగూర్చెనే!
మ. మమతను తన్కు నొక్కచెలి మానిని నీవిభునామ మేమనన్
గమలజగంధి పల్కెఁ గరి కంధి ప్రజాపతి సోముఁ డాతప
త్రములఁ ద్రివర్ణయుక్తముగ వ్రాసియు నందలిమధ్యవర్ణముల్
క్రమముగఁ గూర్చి పల్కినను గ్రమ్మర నావిభునామ మయ్యెడిన్.
మ. చవితిన్ షష్టజుఁ డేగి పంచమనిధిస్థానంబు లంఘించి యే
డవవాఁ డేలినవీడుఁ జేరి పదిలుండై యష్టమస్యందనో
ద్భవి వీక్షించి తృతీయుచెంతకుఁ జతుర్థశ్రేణి నంపించి యా
దివిరోధిన్ బెదిరించి యప్పురి ద్వితీయు న్నిల్పి వచ్చెన్ వెసన్.
చ. వనదఝషేందుజంబిలసువర్ణములన్ గిరి నీట నింగిఁ జె
ట్లను సెగ నెక్క నీద భహుళవ్యధఁ బాల్పడ మాగఁ గ్రాగ ను
ర్మను బెళుకంగఁ గంద నిలరాలఁ గరుంగఁగ నీరుఁగ్రక్కము
న్గ నవియ నొక్కనీరుగ నొనర్చెఁ గచాక్షిముఖస్తనాంగముల్.
సీ. ఘవకేశి యని నీవు చెనకరాకు సమీర!
భుజగరోమాళి యీ పువ్వుఁబోఁడి
మీనాక్షి యని నీవు మీఱకు కోకంబఁ!
జంద్రికాహాస యీ చంద్రవదన
బింబోష్ఠి యని నీవు బెదిరింపకు శుకంబ!
సాంకవామోద యీ సన్నుతాంగి
కంజాస్య యని నీవు కలహింపకు మృగాంక!
స్వర్భానువేణి యీ జలజపాణి
శ్వాస వక్షోజ వచనాస్యబాంధవముల
బంధువులు గాన మీకుఁ జెప్పంగవలసె
నిట్లు వినకుండినఁ బరువు లిడుట యెగిరి
పడుట వదరుట కుందుట ఫలముసుండి!
చ. సరసిజనేత్ర! నీవిభునిచారుతరం బగుపేరుఁ జెప్పుమా!
అరయఁగ నీవు నన్నడుగునాతనిపే రిదె చిత్తగింపుమా!
కరియును రక్కసుండు హరుకార్ముకమున్ శర మద్దమున్ శుకం
బరుదుగ వీనిలో నడిమి యక్కరము ల్గణుతింపఁ బేరగున్.
చ. నగతనయన్ ధరన్ సిరిన్ నాలుగువర్ణములన్ లిఖించి పొం
దుగఁ దుది నొక్కయక్కరము దూకొని వ్రాయగ నింపుమీఱగా
నగును గజాననుండు మఱి యాదిగ నొక్కొక యక్కరంబు దిం
చగఁ జతురాననుండు శరజన్ముఁడు పంచశరుండు వహ్నియున్.
చ. అరయఁగ నాఱువర్ణముల నర్జునుపేరు లిఖించి చూడ నా
యమరవిభుండు షణ్ముఖుఁడు నక్షిపయోరుహవైరిమేదినీ
సుమశరు లయ్యెడిన్ మఱియుఁ జోద్యము దానితుదాది చేసినన్
గమలయు భూమిసంభవుఁడు కాంతియు స్వర్గము గాఁ గనంబడున్.
చ. సతికుచవాక్సమత్వ మరిజాతసుధ ల్గొనఁ బూని వాదులై
హతులయి వారిజాతవసుధాకృతు లూని యు దృఙ్నితంబని
ర్జితరుచి గాంచియుం దుది నరిత్వము జెందినచంద్ర శేవధి
స్థితిని ముఖాంగముల్ గెలిచె సీ తగ దిన్నిట నొంటి నోడినన్.
ఉ. అక్షరపక్షపాతమున నర్థము నూళ్ళ నొసంగ నుబ్బుచున్
భిక్షజటాధరాధికులు భిన్ననిజవ్రతు లౌదు రైన దు
ర్భిక్షరుజాశిశుచ్యుతులు పెక్కగు భక్తియ చాల దాననౌ
తక్షుభితత్వమే యఘము దార్పుఁడు శంక దొఱంగు మీయెడన్.
శా. శైవాలంబును సైకతంబు లెదురై చంద్రప్రవాళాంబుజ
గ్రావాకాశభుజంగకూపములు దూరం బైన నేతత్పరీ
క్షావిద్యావిభవం బొనర్పఁగ దశాబ్జజ్యోత్స్నలో నర్ధచం
ద్రావిర్భావముఁ జూపినం గలిసె దానాత్మేశుభావజ్ఞయై.
గీ. తామరబిడారు కొమ్మనెమ్మోమునకును
సారచంద్రచంద్రస్ఫూర్తి సాటి యగునె?
నాతితలమిన్నచెక్కిలివాతెరకును
సారచంద్రచంద్రస్ఫూర్తి సాటి యగునె?
క. ఆగరితకు ముఖకచకుచ
భాగరిమసుధాంశులకుచబలభన్మణికా
ధాగధగీధైగధగీ
నైగనగీవిభ్రమముల నగుఁ దగు మిగులన్.
సీ. కుసుమంబు లనిన నో భసలకిరోరుహ!
కనుక వెన్కధరింతు ననకు మమ్మ!
సారసం బనిననో చారుకాంచనగాత్రి!
యాద్యంతముల విడనాడకమ్మ!
అగరులపరిమళం బనినచో మీనాక్షి!
పగమీరఁ గాఁ దెగఁ బల్కకమ్మ!
కస్తూరి యనినచో కంజనిభానన!
విసరమధ్యమవృత్తి విడువకమ్మ!
వనిత నీమాటలే నీకు వైర మగును
అనుచు నొక్కతె పల్క మాఱనె నొకర్తు
శ్వాస, యుచ్చ్వాస, ఘనవేణి చంద్రికాస్మి
తహరిమధ్యమ లేదని తలఁగ కనియె.
ఒకానొక వేశ్యారసికుఁ డొకవెల్లాటకత్తెయింటికి వెళ్ళెనఁట. ప్రసంగానుకూలముగా నాపడుపుచెలి రసికునిట్లు ప్రశ్నించెనఁట.
ఉ. మొల్లసుగంధి కూఁతురది ముంగిటనున్నది దానిఁ జూడు; నే
నెల్లవిధంబులన్ రతుల నేలెడుదానను నన్నుఁ జూడు; ము
త్ఫుల్లసరోజనేత్ర వరపుత్రిక పుత్రిక దానిఁ జూడు; నా
కల్లుఁడ వయ్యెదో? మగఁడ వయ్యెదవో? మనుమండ వయ్యెదో?
ఆప్రశ్న కారసికుఁ డీరీతిగా జవాబొసంగెనఁట.
ఉ. మొల్ల సుగంధికూఁతురిని ముంగిటఁ గంటిని దాని మాన; నీ
వెల్లవిధంబులన్ రతుల నేలెడుదానవు నిన్ను మాన; ను
త్ఫుల్లసరోజనేత్ర వరపుత్రిక పుత్రిక దాని మాన; నీ
కల్లుఁడ నయ్యెదన్ మగఁడ నయ్యెద మనుమండ నయ్యెదన్.
అటుపిమ్మట కొంతసేపటి కాధనకాంత రసికునకు వక్కలాకు లొసంగెనఁట. ఆతఁడు సున్నముఁ దెమ్మని యీరీతిగా నడిగెనఁట.
గీ. పర్వతశ్రేష్ఠపుత్రికాపతివిరోధి
యన్నపెండ్లామునత్తనుగన్నతల్లి
పేర్మిమీఱినముద్దులపెద్దబిడ్డ!
సున్న మించుకఁ దేగదే? సుందరాంగి?
ఆజాణ సున్నమును దెచ్చి “యిదిగో తీసికొమ్మని” యీరీతిగాఁ జెప్పెనఁట.
క. శతపత్రంబులమిత్రుని
సుతుఁజంపినవానిమామసూనునిమామన్
సతతముఁ దాల్చెడు నాతని
సుతువాహనవైరివైరి? సున్నం బిదిగో!
చ. పలుకకపల్కరించుగతి పాడకపాడినరీతిఁ దేనియల్
చిలుకఁగ నవ్వకేనగినలీలఁ గనుంగొనుచున్నవారిక
న్నుల కతిసుందరంబయి మనోజ్ఞపుఁ జిత్తరువందు నున్న నీ
చెలువముఁ జూచి నేను నొకచిత్తరు వైతినిగాదె? కోమలీ!
ఉత్సాహ. ఐతినైదునైదునైదునైదునైదుగల్గినన్
భాతిగుమ్మతీలునైదు పంకజాస్త్రుఁ డేసినన్
జేతివై దెఱుంగనట్టి చీకుపోతు గూడునే?
నీతిమేతివైదువేని నీరజాక్షి! వేడుకన్.
క. వండిన దెండిన దొక్కటి
ఖండించిన పచ్చి దొకటి కాలిన దొకటై
తిండికి రుచియై యుండును
ఖండితముగ దీనిఁ దెల్పు కవియుం గలఁడే?
క. శిల్పవృక్షలతలఁ బుట్టిన
చెలువలు మువ్వురును గూడి చిడిముడి పడుచున్
తలవాకిట రమియుంతురు
సలలితముగ దీని నెఱుఁగు సరసులు గలరే?
క. శుద్ధకులజాత యొకసతి
యిద్ధరణిం దండ్రిఁ జంపి యెసఁగ విశుద్ధిన్
బుద్ధిఁ బితామహుఁ బొందుచు
సిద్ధముగాఁ దండ్రి గనునుఁ జెప్పుము దీనిన్.
ఉ. భూపతిఁ జంపితిన్ మగఁడు భూరిభుజంగముచేతఁ జచ్చెనే
నాపదఁ జెంది చెంది యుదయార్కునిపట్నముఁ జేరి వేశ్యనై
పాపముఁ గట్టుకొంటిఁ దనపట్టివిటుండని కౌఁగిలించి సం
తాపముఁ బొంది యగ్నిఁ బడి దగ్ధము గాకిటు గొల్లభామనై
యీపని కొప్పుకొంటి నృపతీ! వగపేటికి చల్ల చిందినన్?
గోలకొండ; మాలముండ; పూలదండ; కొత్తకుండ; యను నాలుగుపదములును వచ్చునట్లు శృంగారవిషయముగాఁ గందపద్యముం బూరించుట.
క. ఒకగోల కొండచెంతను
బ్రకటంపుతమాల ముండఁ బటుతరగతి రా
చుక పూలదండ విడ నా
యనకు మైకొత్తకుండ నతివ రమించెన్.
సీ. చంద్రుఁ డెవ్వరికైనఁ జల్లనై యుండఁడా?
పద్మాలపుణ్య మాపాటి గాక
వరవసంతుఁడు వచ్చి వనమెల్లఁ బ్రోవఁడా?
జాజిసూనపుటదృష్టంబు గాక
సంపంగివాసనల్ చర్చింప శక్యమా?
యిలఁ దేంట్లకును దైవ మీఁడు గాక
హరుఁ డేప్రసూనంబు శిరమునఁ దాల్పఁడా?
సంపంగికిని ప్రాప్తి లేదు గాక
ఎవ్వరెవ్వరిభాగ్యంబు లెట్టివొక్కొ
మాకు ప్రాప్తంబు లేకున్న మానెగాని
పద్మదళనేత్రి! ప్రౌఢభూపాలపుత్రి!
చిక్కవిరూపాజి! మరునిరాచిల్కతేజి!
ఉ. ఇంచుక సూదిపోటు సహియించినమాత్రన నంగనాకుచో
దంచితసౌఖ్యకేళి సతతంబును గంచుకి కాంచె నాజి ని
ర్వంచనతీవ్రబాణనికరక్షతదేహుల కబ్బవే మరు
చ్చంచలలోచనాచకితచారుకుచద్వయసంగసౌఖ్యముల్.
పాలకుండ; గోలకొండ; మాలముండ; పూలదండ; యను నాలుగుపదములును వచ్చునట్లు రామాయణార్థమునఁ బూరింపఁబడిన పద్యము
మ. బలవద్రాక్షసపాలకుండ వనుచుం బాటింప నా గొలకొం
డలచెట్లందుఁ జరించువేళ మగనిం దప్పించి తే నీతియే?
ఖలుఁడా! నీ విటు పొంచివైచుటలు నా కంజాక్షినీమాలముం
డలలో నుంచినఁ బూలదండ కడునెండన్ వాడినట్లుండదే?
మ. కదళీస్తంభమునందు నాళయుతమై కంజాత మింపొందె నం
దుదయంబై పవళించెఁ జంద్రుఁ డచటన్ బ్రోత్ఫుల్లరక్తోత్పలం
బొదవెన్ దత్సుమజాతయై యమున సర్వోర్వీధరంబందుఁ దాఁ
బడి నూఱై గగనంబుఁ గాంచె నిది యేభావంబు భావింపుఁడీ.
చ. పురుషవియోగికామినులు పొక్కుచు దూఱిరి మిత్తిగొంగనున్
ఉరగపుఁగామినిన్ రవికులోదధిచంద్రము డైన రామునిన్
గరువలిసూను నంతట నఖండపరాక్రమఁ డైన కీశునిన్
గరుడుని నింగిమానికముఁ గాంచనగర్భుని మాటిమాటికిన్.
చిత్రకల్పన
సీ. 1. అరిభయంకరచక్ర కరిరక్షసాగర
చాయశ్రీకర్బురసాటియుగళ
2. నాళీకసన్నిభనయన యండజవాహ
వాణీశజనకవైభవబిడౌజ
4. రాజీవమందిరారమణ బుధద్రక్ష
వరజటిస్తుతశౌరి వాసుదేవ
8. భూరికృపాకర బొబ్బిలిపురపాల
పాపభుజంగమ పరమగరుడ
16. దోషశైలేశ శశిద్రక్ష ద్రుహిణహేళి.
కీ. వాక్యము. | అ న్న య్య తో టి వి స్సా ప్ర గ డ కా మ రా జు భా షిం చు హే ళి దా క్షి ణ్య శా లి | |
ఈచాటుపద్యమును బొబ్బిలిపురమున విస్సాప్రెగడ కామరాజకవి రచించినట్లు కీ వాక్యమువలనఁ దెలియుచున్నది. సీసగీతచరణములు తక్కినవి కవి రచించెనో లేదో కాని యెవరు చదివినను ఈపద్యమింతే. ఈపద్యచరణములకు మొదట—వరుసగా 1, 2, 4, 8, 16 అను నంకెలు వేసియున్నవి. కీ వాక్యము 24 అక్షరములఁ గలిగియున్నది.
ఇఁక నిందలి చిత్ర మేమనఁగా ఎవరైన నాంధ్రభాషలోని యొకయక్షరమును దలంచుకొన్నయెడల నీపద్యసహాయమున వారు చెప్పకయే మనము కనుగొనవచ్చును. అయితే ఆ యడుగువారొక కొన్నివిధులకు బద్ధులై యుండవలెను. ఎట్లన:— (1) అచ్చులలో ఆ యొకటిమాత్రమే తలఁచుకొనవలెను. (2) హల్లులలో ఙ, ఞ లు తలఁచుకొనవలదు. (3) గుణితముతోఁ బనిలేదు. (4) న, ణ; ల,ళ; ర,ఱ; ల కభేదము. ఇంతకును కీ వాక్యములో 24 అక్షరములలో దేనినేని కోరుకొనునట్లు చేయుటే దీని భావము.
పైవిధానమునకు లోఁబడి యెవరైన నడిగిరేని, యాయక్షరమును గనుగొనుటెట్లన — ముందు కీ వాక్యమును కంఠతః నేర్చుకొనవలెను. ఆపద్యము మొదటిచరణమును చదివించి విని యందు తలఁచుకోఁబడిన యక్షర మున్నదియు లేనిదియు తెలిసికొనవలెను. అట్లే 1,2,3,4,5 చరణములను వరుసగాఁ జదివించి ఆయక్షర మేయేచరణములలో నున్నదో తెలిసికొనుచుండవలయును. అప్పు డాయక్షరము కొన్నిచరణములం దుంటయుఁ గొన్నిటియందు లేకపోవుటయుఁ దటస్థించును. అప్పు డాయక్షరమున్న పాదములప్రక్కన వేయఁబడియున్నయంకెలను కలుపునది. అప్పుడు 10 వచ్చుననుకొనుఁడు. కీ వాక్యములోని 10వ యక్షరము —డ—గనుక, డ యని చెప్పునది.
ఒకయుదాహరణము. కోరుకొనఁబడిన యక్షరము—య—ఇపుడేమి చేయవలెను? ఇది 1,2 చరణములలోఁ దప్ప నిఁక లేదు గనుక—1+2=3. కీ వాక్యములోని మూఁడవ యక్షరము—య—చూచితిరా చిత్రము! కృష్ణురాయబారము
సీ. చరణారవిందము ల్సమ్మతి మది నెంచి
ముమ్మాఱు రాజుకు మ్రొక్కిరనుము
వచ్చినవైరంబు వారింప నూహించి
మాభూము లిమ్మను మనుజవిభుని
ఆరీతి నృపతికి హర్షమ్ము గాకున్న
నేవురి కైదూళ్ళ నెలమి నడుగు
పుడమీశుఁ డామాట కొడఁబడకుండెనా
నడవడి పురికొప్ప నడుపుమనుము
పనులు సేయంగ నెందేనిఁ బంపుమనుము
పంపు పనిసేయ సేవకభటుల మనుచు
ధర్మమార్గంబు వినబుద్ధి దనరదేని
కదలిరమ్మను శ్రీకృష్ణ! కదనమునకు.
మ. పదరుల్ పన్నక ధర్మశాస్త్రగతి భూభాగమ్ము మారాజ్యసం
పద మాకిమ్మను మీయకుండిన మహాబాహాబలస్ఫూర్తిమై
యెదురైరమ్మను వచ్చి మద్బలము దా నేపారఁగాఁ జూచుచో
గదఘాతంబుల నూరువుల్ దెగిపడున్ గంజాక్ష! యింతేటికిన్.
మ. కలహం బేటికి వద్దువద్దనుమిటుల్ గర్వాంధుఁడై మమ్ముఁ దాఁ
జులకం జూచుట నీతి గాదనుమ యీక్షోణీతలంబందునన్
నిలువన్నేఁ డధర్మవృత్తి ననుమా నీ విన్నియుం బల్కినన్
బలవద్వైరమునందు దుర్మరణముల్ ప్రాప్తించునంచాడవే.
ఉ. మానము దప్పి యిట్టు లభిమానము లేక......................
కాలలపాలు చేసి.....................................................తా
బూనెను రాజ్యసంపదలు బోయగుణంబునఁ బాపకర్ముఁడై
హీనత నెంచనేల యిఁక నేష్యము చెప్పితినంచుఁ బల్కుమా
తానును దమ్ములుం బలము ధాత్రిని గూలుదురంచు మాధవా!
చంద్రమండలము
సీ. పాంచజన్యసమాభ పాంచజన్యాలోభ
పాంచజన్యప్రభాభాస మగుచు
సారస్వతవినోద సారస్వతామోద
సారస్వతాభేదసార మగుచు
ప్రాలేయగణగణ ప్రాలేయగణగణ
ప్రాలేయగణగణభ్రాంత మగుచు
తారహారకదంబ తారహారకదంబ
తారహారకదంబధామ మగుచు
నిట్టపుట్ట గట్టు నిట్టాన గన్పట్టు
పుండరీకనండదండరండ
షండఖండ.....చండీశడిండీర
మండలమ్ము చంద్రమండలమ్ము
చలి
మ. చలి! నీవెందుకు మచ్చరించెదవు? నీశౌర్యంబు మూన్నాళ్ళెగా
కలకాలంబును నిల్వఁబోవుగదవే కాకున్న నింకొక్కడౌ
నిలలో బాలుర రోగుల న్మిగులఁగా వృద్ధాళి బాధింతువా
జలజాక్షీకుచశైలమధ్యములఁ బెల్చన్ జొచ్చిగోడాడకే.
మ. చలి! మమ్మేల విదిల్చె దీ వకట! నీశౌర్యప్రతాపోన్నతిం
పలరన్ శాలిసుఖాన్నమాంగరకసూపాద్యుష్ణదివ్యానుభో
క్తలు నవ్యాంచితలై సుతలమేల్కౌగిళ్ళఁ గ్రీడింప వా
రల......బొకటైనఁ బీకఁగలవా? ప్రాడ్భాయిశీతాధమా!
వసంతఋతువు
గీ. జాజి యొక్కటియేకాని సకలకుసుమ
విసరసంపదచో నొప్పె వసుధయెల్ల
విరహినెకాని ధరణిపై వివిధజనుల
సంతసము నందఁజేసె వసంతవేళ.
పడమటిగాలి
చ. మృడునయనాగ్నిఁ గ్రోలి డిగి మేచకకంఠముమీఁద వ్రాలి త
జ్జలనిధి బాడబానలము చక్కఁగఁ గ్రోలి రవిప్రభావళిన్
దడదడఁ దోలితోలి బెడిదం బగుమంటల నప్పళించు నీ
పడమటిగాలి మానవులపాలిటిధూళి మహోగ్రకీలయై.
లోభి
క. అంతయుసరి యింతయుసరి
యంతకునకు మద్యపాయి కపహాస్యునకున్
అంతయుసరి యింతయుసరి
చింతింపక యిచ్చు దానచింతామణికిన్.
క. ఇల లోభి నెంత వేఁడిన
వలవని వెత లంతె కాని వాఁ డిచ్చెడినే?
జలమును వెస గిలకొట్టినఁ
గలుగునె నవనీతమాసఁ గాడురికేసా!
క. కలుగక యిచ్చెడి మనుజులు
తలవెండ్రుక లంతమంది తర్కింపంగాఁ
గలిగియు నీయని యధములు
మొలవెండ్రుక లంతమంది మోహనరంగా!
క. పదివేలమంది కిచ్చియుఁ
దుదినొక్కని కీయకున్న దొరకవు కీర్తుల్
పదివేలనోము నోచిన
వదలదె యొకరంకువంక వన్నియసుంకా!
క. పుట్టుకతోడుతఁ గరమునఁ
బుట్టవలెన్ దానగుణము పుట్టకపోతే
యిట్టట్టు నులిమిబలిమిం
బట్టింపనుగాజ? తాళ్ళపలికొండ్రాజా!
క. పెక్కావు లిచ్చుచో నొక
బక్కా వీకుండెనేని పాడికిఁ గఱవా?
పెక్కుదొర లిచ్చుచో నొక
కుక్కలకొడు కీయకున్నఁ గూటికిఁ గఱవా?
గీ. నిండిదరిఁ జేరనీయదు గుండ్లకమ్మ
కలిగి లేదను నర్థికి గంపకమ్మ
మాటలేకాని చొరనీదు మాచకమ్మ
కమ్మత్యాగంబు భువిలోన నమ్మకమ్మ.
మ. కొలిచేదిన్ వగలేకనే; యడిగితే కోపించు టీలేకనే;
చెలుల న్మెచ్చుట కోకనే; విభవముల్ చేకూరుటల్ రూకనే;
బలవంతుం డగు మూకనే; సతి చెడున్ బ్రాణేశుఁ గైకోకనే;
జలదశ్యామల! శంఖచక్రధరకృష్ణా! యాపదుద్ధారకా!
ఉ. అన్నటు లీయఁడేని సభ నాతఁడె పో పెనులోభిదున్న; యీ
దున్నకు రెండుకొమ్ములును తోఁకయు లేమిని మొండిదున్న యీ
దున్నతొ దున్న రెవ్వరును దున్నదుగా మఱి గంగలమ్మ కౌ
దున్నెడువారియిండ్లఁ జెడదున్నెడుదున్నర! యెంచి చూడఁగన్.
సీ. లాలింపఁ జెఱకు బెల్లంబుఁ దానిచ్చునా
చెండాడి పిప్పిగాఁ జేయకున్న?
అడిగినప్పుడు ధాన్య మన్నంబుఁ బెట్టునా
దండి రోఁకట దంచి వండకున్నఁ?
మ్రొక్కివేఁడిన భూజములు పండ్ల నొసఁగునా
మొనసి దండాహతి మోదకున్న?
పొగడిన బంగారమును సొమ్ము లొసఁగునా
గొబ్బుగొబ్బునఁ గాచి కొట్టకున్న?
లండిపోతు శిఖండి గులాము లోభి
తెగువ నొసగఁడు పేరునఁ దిట్టకున్న
దండితనిశాట! భళిర! భూధవునిపేట
బాలగోపాల! గుణజాల! భర్మచేల!
పొగాకు
క. ఖగపతి యమృతము తేఁగా
భుగభుగమని పొంగి పొరలి భూస్థలిఁ బడి తాఁ
బొగచెట్టయి జన్మించెను
పొగద్రావనివాఁడు దున్నపోతై పుట్టున్.
క. రావణయుద్ధంబందునఁ
బావనుఁడగు లక్ష్మణుండు బడిమూర్ఛిలినన్
ఆవలఁ బొగచె ట్టుండినఁ
బావని సంజీవికేల పరుగెత్తు? నృపా!
క. పొగఁ ద్రాగనేర్చి భీముఁడు
పగఱన్ బొగరడఁచె నాజి బాహాశక్తిన్
బొగ ద్రావని దుర్యోధనుఁ
డిగిలించెను రణములోన నిహిహీ యనుచున్.
నస్యము
ఉ. నస్యము శీతమత్తగజనాశనహేతువిచారధీరపం
చాస్యము సుప్తిరోగనిబిడాంధతమఃపటలార్కబింబసా
దృశ్యము వేదశాస్త్రపటుదివ్యసుపండితవాగ్విచిత్రసా
రస్యము రాజవశ్య మహిరాణ్మణికైన నుతింప శక్యమే?
ఉ. మట్టపొగాకులో నడుమ మందము గల్గినచోటఁ దీసి తా
పట్టుగఁ బక్వశుద్ధిగను బాగుగఁ గాచి యొకింతసున్నమున్
బట్టనవ్రేల నొత్తి తనబల్మికొలందిగ నల్చి నస్యమున్
బట్టపుఁడబ్బిలో నునిచి ప్రాజ్ఞుల కిచ్చిన భాగ్య మబ్బదే?
సీ. నస్యమా యిది? మరున్నారీశిరోమణీ
కుటకుట్మలముమీఁది కుంకుమంబు
నాసికాచూర్ణమా? నలినరుడ్వనితాధ
రార్పితతాంబూలికాసవంబు
పొడుముగా? వెడవిల్తు పొలతినెమ్మోముపై
కొమరొందు కసటుకుంకుమపుఁదావి
పొక్కుపొడే? యిది...............................
..............................జ్జ్వలరసంబు
సకలజనమానసోజ్జ్వలచరమమార్గ
తత్వమస్యాదివాక్యప్రధానగూఢ
హేతుకంబై చెలంగుచు నింపునింపు
నస్యము గణింప శక్యమే నలువకైన?
సదాశివసద్గురుప్రభూ
ఉ. కారములేనికూర యుపకారములేనిమనుష్యుఁ డాదినోం
కారములేనిమంత్ర మధికారములేనిప్రతిజ్ఞ వాక్చమ
త్కారములేనివేశ్య గుణకారములేని.....లెక్క సా
కారములేనిపాట కొఱగావు సదాశివసద్గురుప్రభూ!
చ. కుదిరికలేని ఖత్తు మదిఁగూటమి చాలనిపొత్తు సుత్తెకున్
మెదుగనిసత్తు ముక్కిడికి మెచ్చులకిచ్చెడునత్తు విత్తఁగన్
బదునున లేనివిత్తు పెనుపల్వకుచేసినయెత్తు మొత్తమై
యదుకునురానిసొత్తు కొఱయౌనె సదాశివసద్గురుప్రభూ!
చ. అగడితలేనికోట జనులందఱుమెచ్చనిమాట దిక్కులన్
బొగడికలేనిపేట ఫలపుష్పసమాజములేనితోట త
న్నగడుకు దీయుపూట యిలుదావిడిపెట్టినబాట రమ్యమై
నెగడదయా! లలాటతలనేత్ర! సదాశివసద్గురుప్రభూ!
చ. రసికులులేనియూరు కవిరాజులకీయనిపేరు నాజిలో
గసరినఁబారుబారు గుఱిఁగాననితీరు బజారుకేఁగుచోఁ
గుసికిరిపడ్డతేరు మిముఁ గోరిభజింపనినోరు గాల్పనా?
భసితవిలేపనాంగ! భవభంగ! సదాశివసద్గురుప్రభూ!
చ. జలములులేనిబావి బుధజాలముముట్టనితావి శుంఠకా
యలపరమైనదీవి మదికాశఘటింపనిమోవి గుత్తలం
జలపరమైనఠీవి తగసత్కవికీయనియీవి యెల్ల ని
ష్ఫలములు పార్వతీశ!మృదుభాష! సదాశివసద్గురుప్రభూ!
ఉ. వేదములేనివిప్రుఁ డరవిందములేనిసరోవరంబు ము
త్తైదువలేనిపెండ్లి హిమధాముఁడులేనినిశీధి మీటినన్
నాదములేనివీణ నరనాథుఁడులేనిపురంబు వ్యర్థమౌఁ
గాదె తలంప స్వామి! శితికంఠ! సదాశివసద్గరుప్రభూ!
ఉ. దుస్తరమైనమూర్ఖునకు దుర్మతివీడఁగ నెంతదెల్పినన్
స్వస్థపడంగఁ బోదొకటి సాదృశమిందుల కుల్లి మోసుకున్
గస్తురిపాదుఁ జేసి తగగంధముఁ బన్నిరుఁ బోసి పెంచినన్
బుస్తుగుణంబుఁ దా విడువబోదు సదాశివసద్గురుప్రభూ!
ఉ. దీపములేనియిల్లు నుపదేశములేనిజపంబు మంజులా
లాపములేనికావ్యము విలాసములేనివిధూటి విక్రమా
టోపములేనిభూపతి పటుత్వములేనియురోజపాళి ప్ర
స్తావములేనిమాటలు వృథాలు సదాశివసద్గురుప్రభూ!
ఉ. ఆఁడది హెచ్చి భర్త కెదురాడఁగ వచ్చినఁ గొట్టవచ్చినన్
గూడదు దానితో నవలఁ గూడి నటించుట; తత్క్షణంబునన్
వాఁడొకజాణయైన భగవత్పదసన్నిధిఁ జేరుమార్గమే
చూడవలె న్మనోజ్ఞమగుచోట సదాశివసద్గురుప్రభూ!
ఉ. పంటకురానిచేలు పతిభావమెఱుంగఁగలేనియాలు నీ
రంటినపాలు దోర్బలపరాక్రమహీనునిచేతివాలు వే
యింటికినీనికేలు భుజియింపక దాచువరాలు ధాత్రిలో
మంటికిపాలు గాక మఱి మన్నన కెక్కునె? సద్గురుప్రభూ!
ఉ. వేచనికందిపప్పు నవివేకునిమెప్పు వికారియొప్పు ము
ల్లాచనిచెప్పు కుర్లుముడికందనికొప్పు పఠాణిచొప్పు మే
ల్వాచవినేచునుప్పు దురవస్థలు చెప్పఁ దరంబుగాదయా
మేచకకంఠ! చక్రధరమిత్ర! సదాశివసద్గురుప్రభూ!
ఉ. ఎన్నఁడుఁ దాతనాఁడుఁ దనయింట నెఱుంగనికల్మిగల్గెనా!
వెన్నున కద్ద మడ్గుఁ గొనవేళ్ళకుముచ్చెలుతొడ్గు నింతలో
మిన్నెగఁ జూచు ధింధిమని మిట్టలు ద్రొక్కుని దేమి చిత్రమో!
పన్నగభూష! సన్మృదులభాష! సదాశివసద్గురుప్రభూ!
భైరవా
చ. చెఱకురసంబుకన్న నునుచేడెలకన్నను తేనెకన్న భా
సురసుధకన్నఁ దియ్యనగుచూతఫలంబుకన్నఁ బాండుశ
ర్కరరుచికన్న ధాత్రి మధురంబయి తోఁచు వివేకియౌ మహా
సరసునితోడిముచ్చటలు సారెకు సల్పుచు నున్న భైరవా!
ఉ. బంధులు తన్ను మెచ్చ జనపాలురు మెచ్చను బ్రజ్ఞలేక కా
మాంధతనుండు ముష్కరున కారయ మేదినియందు నీతియౌ
గ్రంథములేమిసేయు జిగికన్నులవానికిఁ గాక దర్పణం
బంధునకేమిసేయ పగలైనను రాతిరియైన? భైరవా!
ఉ. డంబముమాని మూఢులకుఁ డంకములీయక దేశకాలపా
త్రంబు లెఱింగి యిచ్చినపదార్థము వన్నియకెక్కు ధాత్రిపై
నంబుధినున్న శుక్తికములందునఁ జెందిన స్వాతివాన ము
త్యంబులుగావె? ధన్యులకు హారములై వసియింప భైరవా!
చ. సరసునితారతమ్య మది సాధుఁడెఱుంగును గాని మూఢుఁడే
మెఱుఁగును రంభఁ గూడి సుఖియించుటఁ జూడఁగఁ బాకశాసనుం
డెఱుఁగునుగాని బానిసల నెప్పటికిన్ రమియించుచుండువాఁ
డెఱుఁగునె దేవకాంతవలపించుట యించుకయైన? భైరవా!
ఉ. ఇల్లు భుజంగమైనఁ దనయిష్టుఁడు వైరికి మర్మమిచ్చినన్
గల్లనిజంబు నేర్పరుపఁ గానక భూపతి చంపవచ్చినన్
దల్లి విషంబుఁ బెట్టినను తండ్రి ధనాఢ్యుల కమ్మఁజూచినన్
వల్లభుఁ డొల్లకున్న నిఁక [1]వారల కెవ్వరు దిక్కు భైరవా!
నీతి, హాస్యము
ఉ. దానములేనిసంపదలు; ధాన్యములేనిగృహంబు శిష్టసం
తానములేనివంశమును తాలిమిలేనిజపంబు నాత్మవి
జ్ఞానములేనివిద్యయుఁ బ్రసన్నతలేనినృపాలుసేవయున్
వానలులేనిసస్యములు వన్నెకు నెక్కవు ధర్మనందనా!
ఉ. సారములేనివంట సరసత్వమెఱుంగనియీవిఁగొంట భూ
సారములేనిపంట పనిసల్పనిబానిసయింట నీరు వి
స్తారములేనికుంట పురుషార్థములేనిధనంబులుంట యోం
కారములేనిగంట కొఱఁగావుర ద్వారకవేంకటేశ్వరా!
ఉ. దానములేనిహస్తములు ధర్మగుణంబులులేనిబుద్ధియున్
గానఁగరానికన్నులును కాయలుకాయని వృక్షజాతముల్
కూనలులేనిగేహమును క్రొన్నెలలేనినిశాసమూహమున్
వేనలిలేనికాంతయుఁ బ్రవీణతఁ గాంచునె? వేంకటేశ్వరా!
ఉ. దాతకు లోభి కీడు వసుధావరునొద్దను చాడికీడు దు
ర్జాతినినమ్మఁగీడు పనిసల్పనిబానిస కీడు నూరిలో
ఘాతుకుఁడుంట కీడు రసికత్వమెఱుంగనియీవి కీడయా
పాతకనాశ! భక్తజనపాలక! వేంకటశైలనాయకా!
ఉ. అంగనలేనియిల్లు చతురంగబలంబులులేనిరాజు ని
స్సంగుఁడుగానిమౌని జనసమ్మతిలేనిప్రధాని కామినీ
సంగతిలేనియౌవనము శాంతములేనితపంబు స్త్రీలకున్
ముంగరలేనిభూషణము మోదమటే? భువి రాఘవేశ్వరా!
ఉ. మాటలచేత దేవతలు మన్ననఁ జేసి వరంబు లిచ్చెద
ర్మాటలచేత భూపతులు మన్ననఁ జేసి సుఖంబు లిచ్చెద
ర్మాటలచేతఁ గామినులు మన్ననఁ జేసి సుఖంబు లిచ్చెద
ర్మాటలు నేరకున్న నవమానము న్యూనము మానభంగమున్.
మ. రసవాదంబులు పెక్కు నేర్చిన మహారాజేంద్రులన్ గెల్చినన్
వెస సన్మంత్రము లుచ్చరించిన మహావిద్య ల్ప్రసంగించినన్
అసహాయంబగు శూరత న్గనినఁ దానంబోధి లంఘించినన్
నొసటన్వ్రాసినవ్రాలు కన్నఁగలదా నూఱేండ్లు చింతించినన్.
చ. గురువులరాక దాసిమృతి గుఱ్ఱఁపుదాడియు వానవెల్లువల్
పొరుగున నప్పుబాధ చెవిపోటును దొమ్మరులాట యింటిలో
వరసతిగర్భవేదన వివాహము విత్తుట యల్లునల్కయున్
గఱవు దరిద్ర మాబ్దికము గల్గె నొకప్పుడు కృష్ణభూవరా!
ఉ. నిన్నటిరేయి నేఁ గలను నీకుఁ బ్రయాణ మెఱుంగకుండ నే
తిన్నఁగ నిద్రలేచి కడు దీవ్రముగాఁ జనుదేర నీవు నా
కన్నను మున్నుగా నచటఁ గన్పడవచ్చితి దుర్ఘటంబ! నీ
వెన్నున బండలెత్త నట విస్తరలో నిడినట్టిసర్వసి
ద్ధాన్నము తట్టివేసితి వహా! గ్రహచారమ! దుర్విచారమా!
ఉ. అద్దిర! సింబవోగణము నర్జనుఁడెక్కుక శిద్దిరాజుపై
యిద్దెముసేయనడ్డెముక యేటుకునేశ; గనేశునెక్కిరా
సుద్దులిబీసనుండొదర సోద్దెముగాఁగను రాభరావణా
యిద్దెము సూస్తినంచు వచియించును మూర్ఖుఁడు సంగమేశ్వరా!
ఉ. [2]“నల్లనిదేంది? బేరి!” “మృగనాభిర గొల్లడ!” “దాన్ని దిందురా?”
“అల్లటు గాదు, స్త్రీలు చనులందునఁ బూతురు!” “పూసినంతనే
జల్లునఁ జేపు వచ్చి తెగజాఱున?” “కాదు సుగంధ మబ్బు” “మా
పిల్లకు కాస్త పెట్టు” మన బేరియుఁ గస్తురి మూసెఁ గ్రక్కునన్.
క. ఏనాఁటి యగ్రహారమొ
మీనాఁటికి కండ్రికాయె మీపనిదీరన్
మానాఁడు మాన్యమాయెను
నానాఁటికిఁ దీసికట్లు నాగంభొట్లూ!
క. లింగాలగురివిశెట్టికి
గంగాధరుఁ డేమిగతులు కల్పించెనయా?
బంగారువంటి కోమటి
సంగీతమువల్ల బేరసారము లుడిగెన్.
క. వంకాయవంటి కూరయుఁ
బంకజముఖి సీతవంటి భామామణియున్
శంకరునివంటి దైవము
లంకాధిపువైరివంటి రాజును గలఁడే?
విధవలు
సీ. పోఁకలు నమలుచు నాకులు చేఁబూని
సున్న మడుగువాఁడు శుద్ధవిధవ
ఇద్దఱు నొకచోట నేకాంతమాడంగ
వద్దఁ జేరెడువాఁడు వట్టివిధవ
ఆలితోఁ గలహించి యాఁకలి గాదని
పస్తుపండెడువాఁడు పంజివిధవ
దారిద్ర్యములనుండి తనపూర్వసంపద
లూరకతలఁచువాఁ డుత్తవిధవ
ఇట్టివిధవలఁ గడఁద్రోచి యెసకమెసఁగఁ
గావుమీ వేడ్క విబుధులఁ గమలనాభ!
పాహి శ్రీపార్థసారథి! పరమపురుష!
తిరుమలద్దంకి మల్లికేశ్వరగిరీశ!
సీ. వారకాంతలయిండ్ల వాసంబుఁ జేయుచు
మగువ కేడ్చెడువాఁడు మడ్డివిధవ
అన్నదమ్ములతోడ నాలికై ద్వేషించి
కడఁగితిట్టెడువాఁడు బడుగువిధవ
కట్న మిచ్చెద నని కాల మందీయక
గోళ్ళు గిల్లెడువాఁడు కొంటెవిధవ
చదువుఁజెప్పినకూలి జఱుపుచు నీయక
మిటకరించెడువాఁడు మేటివిధవ
ఇట్టివిధవలఁ గడఁద్రోచి యెసకమెసఁగఁ
గావుమీ వేడ్క విబుధులఁ గమలనాభ!
పాహి శ్రీపార్థసారథి! పరమపురుష!
తిరుమలద్దంకి మల్లికేశ్వరగిరీశ!
సమస్య:—కామిగాఁడు మోక్షకామిగాఁడు
సీ. నిపుణత్వమున రాజనీతి యెఱుంగక
నేల నేలెడువాఁడు బేలగాని
సంగీతసాహిత్యసరసత నెఱుఁగక
కృతిఁ జెప్పువాఁడు దుష్కృతుఁడు గాని
కుశలుఁడై యింతులకోరిక ల్దీర్పని
విషయాతురుండు దుర్విటుఁడు గాని
మాధవశ్రీపాద మగ్నతఁ జెందక
ముక్తిఁ గోరెడువాఁడు రక్తి గాని
అతిదయాభిషక్తి యతులితమగు యుక్తి
యంగనానురక్తి యచలభక్తి
పరతఁ గాంచకున్నఁ బతిగాఁడు కవికాఁడు
కామిగాఁడు మోక్షకామిగాఁడు