చల్లగా నున్న దీ సుప్రశాంత వేళ
స్వరూపం
చల్లగా నున్న దీ సుప్రశాంత వేళ
చల్లగా సాగు నీ సుప్రశాంత పథము
బయలుదేరుము దూరంపు బయనమునకు
వలదు తడయగ, ద వ్వేగవలయు నేడు.
నవన వోల్లాస మధుర గానంబు వలదు
ప్రవిమ లానందచంద్రికల్ పనికిరావు
అల్ల నల్లన గొంతెత్తి యాలపింపు
పరమపద శాంతిపూర్ణ నిర్వాణ గీతి.
ఒక్క టొకటె యదృశ్య మౌ చుక్క లెల్ల
అల్ల నల్ల నాశలుకూడ నంతరించె;
తిమిరమో దివ్యతేజమో తెలియకుండ
నాకసం బటు వెర గయ్యె లోక మెల్ల.
వెడల లేక వెడల లేక వెడలు చెలికి
వీడ్కొలుపు లిచ్చు జాలిగా విహగకులము
ఆపుకోలేక పొరలు సంతాప మెల్ల
తరళ తుహినాశ్రుధారల తరులు గురియు.
ఎన్నడును లేని రీతి తోతెంచె నేమొ
మెల్లమెల్లన మాంద్యము చల్లదనము
కలిగి నునులేతగాలులు కవికుమార!
ఎచటి కేగుచు నుంటివో యేమొ నేడు!