Jump to content

చర్చ:నా కలం - నా గళం/ఈ-ప్రతి (Epub) కూర్పు పరిచయం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

ఈ-ప్రతి (Epub) కూర్పు పరిచయం

[మార్చు]

వికీసోర్స్ లో తెలుగులోని మంచి పుస్తకాలు యూనికోడ్ రూపంలో అందుబాటులోకి తేవాలన్న ఆశయానికి ఎంతోమంది వికీసభ్యులు గత 10 సంవత్సరాలకుపైగా కృషి చేస్తున్నారు. మొదటి తరంలో పుస్తకం నుండి నేరుగా, ఆధార రూపం చేర్చకుండా శతకాలు, పురాణాలు లాంటి తెలుగు సాహిత్యం చేర్చబడ్డాయి. ఆతరువాత డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా నుండి ఆర్కీవ్.ఆర్గ్ లో చేర్చబడిన, నకలుహక్కులకు కాలం చెల్లిన పుస్తకాలస్కాన్ (బొమ్మ) ప్రతి చేర్చి దానిని యూనికోడ్ రూపాన్ని టైపు చేయబడింది (ఉదా:అర్జున చేర్చిన ఆంధ్రుల చరిత్రము- ప్రథమ భాగము). ఆ తరువాత బొమ్మ రూపం కాని మూలపు కోడ్ గల పిడిఎఫ్ ఆధారంగా పుస్తకం చేర్చే ప్రయత్నం జరిగింది(ఉదా: రహ్మానుద్దీన్ చేర్చిన కురాన్_భావామృతం ). ఆధ్యాత్మిక గ్రంథాలు, ప్రాచీన సాహిత్య గ్రంథాలకంటే ఇటీవలి సాహిత్యం చదువరులకు ఎక్కువ ఆసక్తి కలిగిస్తుంది కాబట్టి అవి వుండే డిజిటల్ మూల రూపంలో (యూనికోడ్ కాకపోయినా) సంగ్రహించితే త్వరగా యూనికోడ్ రూపం చేయటానికి వీలవుతుంది. ఈ విధంగా వికీసోర్స్ మరియు వికీపీడియా ప్రాజెక్టులు త్వరగా అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. దీనికి ఇటీవలి సాహిత్యానికి స్వేచ్ఛా నకలుహక్కులు పొందడం ఒక సమస్యకాగా, మూల డిజిటల్ రూపం పొందడం రెండవ సమస్య. పుస్తక నకలుహక్కుదారులు తమ పుస్తకాలను తొలిముద్రణ తరువాత వీలైనంత తొందరలో స్వేచ్ఛానకలుహక్కులతో విడుదలచేసి దానికి తోడు డిజిటల్ మూలరూపం వికీసోర్స్ సభ్యులకు అందచేస్తే దానిని యూనికోడ్ లోకి మార్చి విశ్వవ్యాప్తంగా వున్న తెలుగు ప్రజానీకానికి వికీసోర్స్ ద్వారా అందుబాటులోకి తేవడం సులభమవుతుంది .

2014 పిభ్రవరిలో విజయవాడలో జరిగిన తెలుగు దశాబ్ది ఉత్సవాలలో శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారు 2012 లో ముద్రించిన తమ ఆత్మకథను స్వేచ్ఛానకలుహక్కుల లైసెన్స్ తో విడుదల చేశారు. దీని డిజిటల్ రూపం మూలపు పేజీమేకర్ ప్రతి మరియు దాని ముద్రణతీరులోని పిడిఎఫ్, వారి పుస్తకానికి డిటిపి చేసిన విశ్వాటైప్ ఇన్సిట్యూట్ ద్వారా అందచేశారు. ఈ మూల పిడిఎఫ్ ప్రతిని అనూఖతులు వాడి పేజీమేకర్ 6.5 లో చేశారు. దీనిలో దీపం జయ కృష్ణ ప్రమీల, పూర్ణ, పూర్ణ బోల్డ్, రజనీ బ్రష్, టైమ్స్ రోమన్, వాసవి, Zapf dingbats ఖతులు వాడారు. ప్రధాన పాఠ్యంలో ఒకటి రెండు మాత్రమే వాడారు. మొదటగా ముద్రణ తీరులోని పిడిఎఫ్ ను చదివేక్రమంలోని పేజీలుగా గల పిడిఎఫ్ రూపానికి బ్రిస్ అనే స్వేచ్ఛా సాఫ్ట్వేర్ తో మార్చడం జరిగింది. దీనిలోని పాఠ్యాన్ని నకలు చేసి ఈ మాట వారి యూనికోడ్ కన్వర్టర్ లో అను(రహ్మతుల్లా) రూపం ఎంచుకొని యూనికోడ్ లోకి మార్చటం జరిగింది. ఈ మార్పు లో దోషాలు కొంత ప్రోగ్రామ్ ద్వారా మిగతావి ఫ్రూప్ రీడ్ ఎక్స్ టెన్షన్ ద్వారా మానవీయంగా సరిచేయబడ్డాయి. దీనితో బాటు పేజీమేకర్ నుండి బొమ్మలన్నిటినీ పొందడం వాటిని కామన్స్ లో ప్రవేశపెట్టి పాఠ్యపు పేజీలలో చేర్చడం జరిగింది.

ఈ-రీడర్ లో చదివే వారికోసం ఈ-పబ్ తీరు లో మరియు దానినుండి తయారు చేసిన పిడిఎఫ్ తీరులో ఈ వికీసోర్స్ లోగల కృతిని అందచేస్తున్నాము. దీనికొరకు వికీసోర్స్ లో పుస్తకాల తయారీ ఎక్స్ టెన్షన్ వాడి ఈ-పబ్ రూపం పొంది ఆతరువాత కేలిబర్ లో ఈ-పబ్ రూపం తీర్చిదిద్దబడింది. దీనికొరకు సిగిల్ అనే ఇంకొక ఈ-పబ్ సాఫ్ట్వేర్ కూడా వుపయోగపడింది. అయితే ముందు ముందు ఈ ప్రక్రియని సులభతరం చేయడానికి పేజీమేకర్ లో నుండి పొందిన మూలపు పాఠ్యాన్ని యూనికోడ్ లోకి మార్చే వుపకరణం చేసుకోగలిగితే బాగుంటుంది. వికీసోర్స్ లో వుండే సాఫ్ట్వేర్ తో నేరుగా ఈ-ప్రతి చేయటానికి వీలువుండడంతో వికీసోర్స్ కూర్పుకి కొన్ని సవరణలు చేయటం జరిగింది. ఈ పుస్తకం స్ఫూర్తితో మరిన్ని ఇటీవలి పుస్తకాలు త్వరగా యూనికోడ్ రూపంలోకి మార్చబడి ఆ తదుపరి ఈపబ్ రూపంలో వెతకడానికి మరియ ముందు ముందు కంప్యూటర్ గొంతుతో చదవగలిగే తెలుగు పుస్తకాలు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను.

దీనికి మూలకృతి అందచేసిన శ్రీ తుర్లపాటి కుటుంబరావు గారికి, మూల రూపం అందచేసిన శ్రీ రవికిశోర్, విశ్వాటైప్ ఇన్సిట్యూట్ గారికి మరియు వారంరోజులపైగా యూనికోడ్ లో మార్చినప్పుడు వున్న దోషాలను దిద్దుటకు సహకరించిన వికీ సభ్యులందరీకీ ముఖ్యంగా రవిచంద్ర, పాలగిరి,రాజశేఖర్ గార్లకు కృతజ్ఞతలు.

అర్జునరావు చెవల

నా కలం -నాగళం వికీసోర్స్ ప్రాజెక్టు సంధానకర్త

3 మార్చి 2014