చతుర్వేదసారము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

ప్రసిద్ధవీరశైవకవి యగు పాల్కురికి సోమనాథుఁడు రచించిన పద్యకృతులలోఁ జతుర్వేదసారము చాల ప్రఖ్యాతమైనది. సోమనాథుఁడే పండితారాధ్యచరిత్రావతారికలో నీకృతి రచియించినట్లు తన్ను భక్తులు ప్రశంసించినట్లు చెప్పినాఁడు.

"వరవీరభక్తి సవైదికంబుగను
విరచించితివి చతుర్వేదసారమున”

ఈ గ్రంథమున శివపారమ్యము, వీరిశైవతత్త్వము, శ్రుతిస్మృతిపురాణేతిహాసములనుండి ప్రమాణములతో సమర్థింపఁబడినవి. సోమనాథుఁడు సోమనాథభాష్యములో నిట్టివిషయములను సంస్కృతభాషలో వివరించియున్నాఁడు. అట్టివి మఱికొన్ని యిందుఁ దెలుఁగులో సీసపద్యములలోఁ జెప్పఁబడినవి. ఈ సీసపద్యము లన్నియుఁ దేటగీతులతో నాటవెలఁదులతో, బసవలింగ! అను మకుటముగల యెత్తుగీతులతో వెలయుచున్నవి.

ఇందులో మొదట బసవశబ్దవ్యుత్పత్తి (వృషభ, పశుపశబ్దములనుండి పుట్టినదని) నిరూపితమైనది. తరువాత బసవనామోచ్ఛారణమహిమ, శివాధిక్యము; విభూతిరుద్రాక్షలింగధారణమాహాత్మ్యము, ప్రకృతిపురుషనామములు, విష్ణుభక్తులు శివభక్తు లగుటకుఁ గారణము, చరలింగస్తుతి, శీలలక్షణము, శివానుభవము మున్నగు వీరశైవమతవిషయములు విపులముగాఁ దెలుపఁబడినవి.

ఈగ్రంథమువలన సోమనాథుని వేదవేదాంగపరిజ్ఞాన మెంతయేని ప్రస్ఫుట మగుచున్నది. మఱియు నన్నయభట్టు భారతములో

సీ.

ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని
                      యధ్యాత్మవిదులు వేదాంత మనియు

నీతివిచక్షణుల్ నీతిశాస్త్రం బని
                      కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని
                      యైతిహాసికు లితిహాస మనియుఁ
బరమపౌరాణికుల్ బహుపురాణసముచ్చ
                      యం బనియును గొనియాడుచుండ


ఆ. వె.

వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
పరగుచుండఁ జేసె భారతంబు.

(ఆది 1-31)

చెప్పినట్లుగా సోమనాథుఁ డీకృతిలో నిట్లు చెప్పియున్నాఁడు.

సీ.

వైదికు లిది శుద్ధవైదికం బని యెన్న
                      శాస్త్రజ్ఞు లిది ధర్మశాస్త్ర మనఁగఁ
దార్కికు లిది మహాతర్కం బనంగఁ బౌ
                      రాణికు లిదియె పురాణ మనఁగ
నాగమవిదులు దివ్యాగమం బిది యనఁ
                      దంత్రజ్ఞులు లిది వీరతంత్ర మనఁగఁ
భక్తవారం బిది భక్తి మార్గం బన
                      ముక్త్యర్థు లిది మహాముక్తిద మన


ఆ. వె.

కవులు భువిని నిదియె కావ్యం బనంగ స
జ్జనుల కెల్ల మిగుల సంతసముగ
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!

(22 పద్యము)

పండితారాధ్యచరిత్రరచనమునాఁటికి సోమనాథుఁడు చతుర్వేదపారగుఁడు. కావుననే యీ గ్రంథము రచించు నధికారము గలిగియున్నాఁడు. సోమనాథునికి ముందు వెలసిన ప్రసిద్ధశైవాచార్యుఁడు హరదత్తాచార్యుఁడు రచించిన చతుర్వేదతాత్పర్యదీపిక దీనికి మార్గదర్శకము కానోపును.

ఇందులోని సీసము లన్నియు సమతావిలసితము లయి సోమనాథుని కవితావైశద్యమును బ్రకటించుచుండును. భక్తాగ్రేసరుఁ డగు బమ్మెర పోతరాజు "మందారమకరంద" అను పద్యమునకు నిందులోని పద్యమే మూలము. ఆ రెండింటి నీదిగువ నిచ్చుచున్నాఁడను,

సీ.

రాకామలజ్యోత్స్నఁ ద్రావ నిచ్చలు గన్న
                      నాచకోరంబుల కరుచి యగునె
సహకారపల్లవచయములు దొరకిన
                      జాతికోయిలలకుఁ జప్ప నగునె
క్షీరాబ్ధిలోపలఁ గ్రీడింపఁగల్గిన
                      భువి రాజహంసకుఁ బుల్ల నగునె
విరిదమ్మివాసనవెల్లి ముంచినఁ గ్రోలు
                      షట్పదముల కనాస్వాద్య మగునె


ఆ.

బహుళతరదయార్ద్రభావప్రభావన
మహిమఁ దనరు జంగమంబు రాఁగ
నతులభక్తిపరుల కాహ్లాదకర మగుఁ
బరిహృతాభిషంగ బసవలింగ!

చతుర్వేదసారము (155 పద్యము)

సీ.

మందారమకరందమాధుర్యమునఁ దేలు
                      మధుపంబు వోవునే మదనములకు
నిర్మలమందాకినీవీచికలఁ దూఁగు
                      రాయంచ సనునె తరంగిణులకు
లలితరసాలపల్లవఖాది యై చొక్కు
                      కోయిల సేరునే కుటజములకుఁ

బూర్ణేందుచంద్రికాస్ఫురితచకోరక
                      మరుగునే సాంద్రనీహారములకు


గీ.

నంబుజోదరదివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరులఁ జేర నేర్చు
వినుతగుణశీల! మాటలు వేయు నేల.

(భాగవతము సప్తమస్కంధము.)

సోమనాథుఁడు దీనిని బ్రబంధ మని పేర్కొనినాఁడు.

సీ.

ఈకృతి రచియించి యీలోకమందుఁ బ్ర
                      తిష్ఠింతు నీశ్వరాధిక్యమహిమ
నీకృతిఁ బాలించి యీలోకమందు సం
                      పాదింతు జంగమపాత్రమహిమ
నీకృతి యొనరించి యీలోకమందు ని
                      ష్ఠింతుఁ బ్రసాదసంసేవమహిమ
నీకృతిఁ గావించి యీలోకమునఁ బ్రతి
                      పాదింతుఁ బటుతరభక్తిమహిమ


గీ.

ఆది వృషభాంశజుఁడు బసవాధినాథుఁ
డిట్టికృతినాథుకృపచేత నిప్పు డంధ్ర
భాషఁ బ్రకటింతుఁ బద్యప్రబంధముగను
వసుధ సత్కవిసమ్మతి బసవలింగ!

పలువురుకవులు ప్రబంధశబ్దమును కూర్పు, రచనము అనునర్థమున వాడియుండుటచేఁ బూర్వోక్త మయిన సోమనాథుని యుదాహరణములో విశేష మేమియు లేదు. ఇంతకన్నఁ బద్యము లన్నియు "బసవలింగ” అనెడి యేకమకుటముతోఁ గూర్పఁబడుటచే దీనిని శతకగణములో గణించుటయే సమంజసముగఁ గాన్పించును.

సోమనాథుఁ డీగ్రంథమువలన నీశ్వరాధిక్య, జంగమ, ప్రసాద, భక్తి మహిమలను వ్యాప్త మొనరించినాఁడు. కావుననే యీతని కంకితముగా "అన్యవాదకోలాహలము” అను శతకమును రచించిన యీతని శిష్యప్రశిష్యుఁ డాకృతిలో—

"మీరు చతుర్వేదసారంబు చేసిన
                      మహితపాండిత్యసమ్మతి నుతించి”

అని యీగ్రంథమును బ్రత్యేకముగఁ బ్రశంసించినాఁడు.

ఛందోవిశేషములు

సోమనాథునికవితలోఁ గాననగు ఛందోవిశేషములు కొన్నిటి కీచతుర్వేదసారముకూడ నాదర్శముగానున్నది. వ్యస్తపదగతరేఫసంయుక్తాక్షరమునకుఁ బూర్వమందుండు వర్ణమును గురువుగనే గాక తేల్చి పలికి లఘువుగాఁగూడఁ జేసికొనుట పూర్వలాక్షణికసమ్మత మనుట పలువురకుఁ దెలిసిన విషయమే. ఈవిధిని సోమనాథుఁడు కొన్నియెడలఁ బ్రత్యేకశబ్దమధ్యస్థరేఫసంయుక్తాక్షరపూర్వవర్ణవిషయమునఁ గూడఁ బాటించుట యొకవిశేషము. అట్టి విందలిపద్యములలో నెడనెడఁ గాననగును. మచ్చునకు 134 పద్యమున "రుద్రపశుపతి బ్రహ్మరూపుఁ గొనఁడె” అనుప్రయోగము చూడుఁడు.

రేఫసంయుక్తాక్షరపూర్వవర్ణవిషయమునఁ బాటింపఁబడు నీపాక్షికవిధిని గొందఱు కవులు అంతస్థములు (Semi vowels) లోని యితరవర్ణములయిన య, ల, వ, లతో సంయుక్త ములయిన యక్షరముల ముందుండు వర్ణవిషయమునఁ గూడఁ బాటించియున్నారు. సోమనాథునికిఁ గూడ నిది సమ్మతమే యని తోఁచును. "శ్రీ రుద్ర జాబాల శ్వేతాశ్వతరబృహదారణ్య" అను 9వ పద్యమున వకారసంయుక్తమయిన 'శ్వే' యనునక్షరమునకుఁ బూర్వమున్న జాబాలశబ్దమందలి లకారమును దేల్చి పలికి లఘువుగాఁ జేసికొననిచో గణభంగ మగునుగదా!

అఖండయతి, రేపద్వయయతిప్రాసమైత్రి సోమనాథునకు సమ్మతమనుటకు దృష్టాంతములు క్వాచిత్కముగ నీగ్రంథమునను జూపవచ్చును.

ఆంధ్రమున వీరశైవవాఙ్మయమునకు సంబంధించిన యీమహాకృతిని శైవగ్రంథములు పెక్కు సంపాదించి ప్రకటించిన మా మిత్రులు కీర్తిశేషులు శ్రీ గంగపట్టణపు సుబ్రహ్మణ్యకవిగారు తొలుదొలుత 1914 సంవత్సరమున బందరులోని భైరవముద్రాక్షరశాలలో ముద్రించి ప్రకటించినారు. ఆముద్రణము బాగుగాఁ బరిష్కృతము గానందున నందుఁ బెక్కుదోషములు దొరలినవి. దీనికిఁ దాళపత్రప్రతులు ప్రాచ్యలిఖితపుస్తకాలయమునఁ గూడఁ దక్కువగానున్నవి. ఇందు శ్రుతిస్మృత్యాదిప్రమాణముల నుదాహరించుటలో సోమనాథుఁడు వానిని బూర్తిగా నొసంగక కుదించి యలఁతియలఁతితునుకలుగాఁ బేర్కొనుటచే వానిసుష్ఠుస్వరూపమును లేఖకులు సరిగా గ్రహింపఁజాలకుండుటచే వ్రాతప్రతులలో లేఖకదోషము లెక్కువగా దొరలినవి. మఱియు "శివానుభవసూత్రవివరము” అనుశీర్షికతో 202-297 వఱకు నున్నపద్యములు చాలవఱకు శివానుభవజ్ఞానము లేనివారికి దురవగాహము లవుటచే నందులోఁ గూడఁ బలుతావులఁ గవిపాఠములు మఱుఁగువడి లేఖకులవ్రాఁతలలో నపపాఠములు దొరలినట్లు కాననగును. ఇట్టి చిక్కులతోడను దోషములతోడను గూడిన వ్రాఁతప్రతులఁబట్టి యీగ్రంథమును లెస్సగాఁ బరిష్కరించి ముద్రించుట దుస్తర మని చెప్పనక్కఱలేదు. అయినను సాధ్యమయినంతవఱకుఁ బండితపరిష్కరణము గావింపించి గ్రంథపునర్ముద్రణము

నిర్వహింపఁ గీర్తిశేషులు మామిత్రులు భాషోద్ధారక వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారు సంకల్పించిరి. సోమనాథుని యనుభవసారమును గూడఁ బరిష్కరింపించి వారింతకుమున్ను నాతోడ్పాటుతోఁ బ్రకటించిరి. కాని యీగ్రంథముద్రణమును గావింపక ముందే వా రస్తమించుట జరిగినది.

అందుచేతఁ గృష్ణాజిల్లా విజయవాడ తాలూకా వల్లూరిపాలెము వాస్తవ్యులు, భక్తవరులు, వీరశైవులు శ్రీ చలవాది రాచయ్యగారు విశేషముగఁ బరిశ్రమించి చేకూర్చిన విరాళములతో నీగ్రంథమును నేనే యిప్పు డిట్లు చేతనైనంతవఱకుఁ బరిష్కరించి ప్రకటించితిని. అనుభవసారమునకు దీనికిఁ గూడఁ బరిశుద్ధమయిన వ్రాతప్రతు లెవరియొద్దనైన నున్నచో దయతో వానిని బంపిన యెడల వానినిగూడఁ బరిశోధించి భావిముద్రణమున నింతికంటెఁ బరిశుద్ధముగ వెలువరింపనవునని మనవి చేయుచున్నాను. పూర్వముద్రణములోఁ బలుతావుల ఛందోభంగములుకూడఁ గాననగును. "ఛందోభంగం నకారయేత్" యని శాస్త్రకారులశాసనము. కావునఁ గవిహృదయము, పద్యార్థము సరిగా గ్రహింపరానితావుల నర్థముమాట యెట్లున్నను ఛందోభంగ మయినను గలుగకుండునట్లు నేను స్వతంత్రముగఁ గొన్నిసంస్కరణములు గావింపవలసి వచ్చినది. గ్రంథవిస్తరభీతిచే వాని నిట వివరింపనైతిని. ఈ గ్రంథముద్రణమునకు సహకరించిన మహనీయులకుఁ బ్రోత్సాహకులు శ్రీ చలవాది రాచయ్య, రాచంశెట్టి బసవనాగయ్యగారలకుఁ బరమేశ్వరుఁ డాయురారోగ్యాభ్యుదయములఁ బ్రసాదించుఁ గావుత మని ప్రార్థించుచున్నాఁడను. సోమనాథుని లఘుకృతులనన్నిటిని గలిపి యొకసంపుటముగాఁ బ్రకటించుటకుఁ గూడ శ్రీ రాచయ్యగా రుద్యమించినారు. భక్తులు భాషాభిమానులు వారికి సర్వవిధములఁ దోడ్పడెదరుగాక !

ఈగ్రంథపరిష్కరణమున నాతోపాటు శ్రమించియు, ప్రూపులఁ జూచుటలో నతిశ్రద్ధ వహించియు మిత్రులు, శ్రీపతిముద్రణాలయాధికారులు, విద్యావినయసంపన్నులు, శ్రీ తోకల బుచ్చిరాజుగారు నాకు మిక్కిలి తోడ్పడిన సౌజన్యమునకు నాకృతజ్ఞతాభివందనముల నర్పించుచున్నాను. పరమేశ్వరుఁడు వారి కన్నివిధముల శుభంకరుఁ డగుఁగావుత మని యభిలషింతును.

ఇట్లు

కాకినాడ,

భక్తజనవిధేయుఁడు,

28-1-62

బండారు తమ్మయ్య

————

ప్రకాశకునివిజ్ఞప్తి

విమర్శకాగ్రేసర, ఐతిహాసికసమ్రాట్, ధర్మభూషణ, ఇత్యాదిబిరుదాంకితు లగు శ్రీ పండిత బండారు తమ్మయ్యగారు నిస్స్వార్థముగఁ జిరకాలమునుండి సాగించుచున్న శైవవాఙ్మయసేవను గుర్తించని యాంధ్రు లుండరు. వారి విమర్శవ్యాసములు పలుపత్రికలలోఁ జిరకాలముగఁ బ్రకటితము లయినవి. ప్రఖ్యాతాంధ్రవీరశైవకవిసార్వభౌముఁడు పాలకురికి సోమనాథుని ద్విపద బసవపురాణమును, అనుభవసారమును, శ్రీనాథుని భీమేశ్వరపురాణమును భాషోద్ధారక వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారు తమ్మయ్యగారిచేతనే పరిష్కరింపించి వారిపీఠికలతోఁ బ్రకటించియుండుట పలువు రెఱింగియేయుందురు. సోమనాథుని లఘుకృతులు పంచప్రకారగద్య మొదలగు వాని నెన్నింటినో తమ్మయ్యగారే ఆంధ్రపత్రిక సంవత్సరాదిసంచికలు, ఆంధ్రసాహిత్యపరిషత్పత్రికసంచికలు మున్నగువానిలోఁ బ్రకటించియున్నారు. సోమనాథుని లఘుకృతులనన్నిటి నొకప్రత్యేకసంపుటముగఁ బ్రకటించు నావశ్యకతను గుర్తించి నేను శ్రీ తమ్మయ్యగారి నిందుఁ గూర్చి యర్థింపఁగా నీకార్యము నింతకుమున్నే యాంధ్రసాహిత్యపరిషత్పక్షమున నిర్వహింపఁ దాము సంకల్పించితి మనియుఁ గాని యింతవఱ కది జరుగలేదనియు నిట్టి ప్రత్యేకసంపుటమును వెలువరించుట యావశ్యకమే యనియు వారును నన్ను హెచ్చరించిరి. కాని సోమనాథుని కృతులలోఁ బేరెన్నికఁగన్న చతుర్వేదసార మొకసారి యిదివఱలో 1914 సంవత్సరమున నేదోవిధముగ ముద్రిత మగుటయేగాని యింతవఱకు మరలఁ బరిష్కృతమయి, ప్రకటితము కాలేదనియు, లఘుకృతులసంపుటమునకు ముందుగా నీచతుర్వేదసారమును. బ్రకటించుట మంచిదనియు సూచించిరి. అందుపయి నేను నామిత్రులు కొందఱతో సంప్రతించి వారి నీసత్కార్యనిర్వహణమునకయి ప్రోత్సహింపఁగాఁ బరమేశ్వరప్రేరణమున భూరివిరాళములతో వా రిందుకుఁ దోడ్పడిరి. ఆమహనీయుల నామము లిందుఁ బ్రకటితము లయినవి. వారి సాహాయ్యమూలముననే యీగ్రంథ మిట్లు ప్రకాశమొందఁగల్గినదని మనవిచేయుచున్నాను. భక్తావనతత్పరుండగు పరమేశ్వరుండు నిరంతర మీపుణ్యపురుషుల కవిరళాయురారోగ్యైశ్వర్యాభ్యుదయములఁ బ్రసాదించుఁగావుత మని ప్రార్థించుచున్నాను. ఈసందర్భమున నాతోపాటు కృషియొనర్చిన శ్రీ రాచంశెట్టి బసవనాగయ్యగారికి నాకృతజ్ఞతాభివందనములు. ఆరోగ్యము లేక దెబ్బదవపడిలోఁ గృశించుచున్నను సహజభాషాభిమానమతాభిమానములను సోమనాథునియెడఁ గల సమధికభక్తిని బురస్కరించికొని విశేషశ్రమతో నీగ్రంథమును బరిష్కరించి ప్రకటించిన శ్రీ తమ్మయ్యగారికి దీర్ఘాయురారోగ్యముల ననుగ్రహించి యుమామహేశ్వరులు సోమనాథుని లఘుకృతులసంపుటముగూడఁ ద్వరలో వారి పరిష్కరణముననే ప్రకటితమగు భాగ్యమును ఘటించుఁగాత మని ప్రార్థించుచున్నాను.

వల్లూరుపాలెము

ఇట్లు, భక్తవిధేయుఁడు,

1-2-1962

చలవాది రాచయ్య

కఠినపదములకు అర్థములు

పద్యము

పదార్థములు


1

అపాంగము = కడకంటిచూడ్కి; నిర్యత్ = వెడలు; ఘృణ = కృప.


14

ధ్వాంతము = చీకటి.


16

పంచాస్యంబు = సింహము; పరశువు = గొడ్డలి, లవిత్రంబు = కొడవలి, భేకి = ఆడుకప్ప.


105

నాచికొను = హరించు.


150

జంగమలింగము = చరించుశివుఁడు = శివభక్తుఁడు.


151

చెలఁది = సాలెపురుగు; ప్రోక = రాశి.


152

జీవగఱ్ఱ = జీవనౌషధము, తంబుర, వీణ మున్నగువాని దండములో శ్రుతి హెచ్చించుటకుఁ దగ్గించుటకు నమర్చు పిడి.


153

పడ్డలు = గోవులు.


158

బద్దులు = అసత్యములు.


173

తెగినతప్పున = హాని కలిగించినదోషమున.


182

పూన్తు = పూజింతును.


192

అలుఁగువార = ప్రవహింప.


194

ప్రాఁతవాఁడ = భృత్యుఁడ; అడిగఱ్ఱ = పాదసేవకుఁడు.


207

అంగవింప = అతిక్రమింప.


209

ఉపాదానము = కారణము.


213

కృకర, దేవదత్త, ధనంజయములు = ఉపవాయుభేదములు.


214

లాల = చొంగ; అస్రము = రక్తము; మజ్జ = ఎముకలందలి చమురు.


220

లతాంతములు = పుష్పములు


223

భిస్సట = మాడినయన్నము; చికురము = వెండ్రుక


256

సిక్థము = మెతుకు.


259

మొదవు = గోవు.


299

వైనతేయుండు = గరుత్మంతుఁడు, గద్ద


301

పాంసువు = ధూళి.

————