శ్రీమ దుమామహేశ్వరాభ్యాం నమః
చతుర్వేదసారము
|
గురవే నమస్తే గురవే నమ
స్తే గురుమూర్తి ప్రథితగుణాయ!
శ్రీ శంభవే నమస్తే శంభవే నమ
స్తే శంభు సంచారచేతనాయ!
శ్రీ ప్రమథాయ తే శ్రీ ప్రమథాయ తే
ప్రమథావతార తారస్మరాయ!
శ్రీ వృషభాయ తే శ్రీ వృషభాయ తే
వృషభాంశ వీరమాహేశ్వరాయ!
|
|
|
యని నుతించి భవ దపాంగనిర్యద్ఘృణా
మృతరసాబ్ధిఁ దేల మతిఁ దలంచి
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యము ల్రచింతు బసవలింగ!
| 1
|
|
సారంబు గాఁగ "నమో రుద్ర మన్యవే"
యనుచు ఋగ్వేద మత్యర్థి మ్రొక్క
శ్రీకరంబుగ "నమస్తే రుద్ర మన్యవే"
యని యజుర్వేద మత్యర్థి మ్రొక్క
సారంబు "రుద్రాయ తే రస తే నమో"
యని సామవేద మత్యర్థి మ్రొక్క
ముదము దలిర్ప "నమో౽స్తు రుద్రాయ తే"
యని యధర్వణవేద మర్థి మ్రొక్క
|
|
|
శ్రుతులు "యస్మై నమస్తే౽స్తు సోముఁ" డనఁగ
మ్రొక్క నెలకొనుకర్త రుద్రుండె యనుచు
నొప్పు వేదాభివందనీయునకు మ్రొక్కి
వసుధ రచియింతు నీకృతి బసవలింగ!
| 2
|
|
శ్రుతి "శతాయుర్వైపురుష" యనఁ గాలంబుఁ
జని మీఱు మాదిరాజప్రభుండు
నదిగాక శ్రుతి "సర్వమన్యత్పరిత్యజ్య"
యనఁ బరిత్యాగుండు అల్లమయ్య
శ్రుతి "ఏకఏవ రుద్రో" యన రుద్రావ
తారుండు శంకరదాసమయ్య
మఱి శ్రుతి "వృషభసమాహుతి" యనఁగను
బరగు మా బండారి బసవవిభుఁడు
|
|
|
ఆదిగా నఖిలమహాపురాతనభక్త
పాదసరసిజముల భక్తిఁ దాల్చి
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!
| 3
|
|
లీనమంత్రస్థానమానహోబుధసంగ
మైనట్టి సిద్ధరామార్యవిభుఁడు
భువి "బుల్కసోనైవపుల్కసో" యనఁ గుల
శ్రేష్ఠుండు మాదరచెన్నమయ్య
లోలత "నైవచండాలో" యనఁగ గణ
నాథుండు మా శివనాగమయ్య
ధర నిచ్చను "వ్రతమేతచ్ఛాంభవ" మ్మన
శాంభవదీక్షానుసారి నంబి
|
|
|
యాదిగా నఖిలమహాపురాతనభక్త
పాదసరసిజములు భక్తిఁ దాల్చి
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!
| 4
|
|
వావిరి "నాచార్యదేవోభవ" యనంగఁ
బరగిన యాచార్యపండితయ్య
ఘన "కృత్తివాససే" యన గజాజినధర
మదకరి మడివాళ మాచశౌరి
రమణ "దద్విష్ణోఃపరం" బను తన్నిష్ఠఁ
బరగిన షోడ్డలబాచిరాజు
ఏపార "నిర్మాల్యమేవ నేకత" యనఁ
బరమపావన బసవప్రసాది
|
|
|
యాది గాఁగ భువి మహాపురాతనభక్త
పాదసరసిజముల భక్తిఁ దాల్చి
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!
| 5
|
|
అగు "నసంఖ్యాతసహస్రాణి" నా నసం
ఖ్యాత మగు ప్రమథగణసమూహి
యాశ్చర్యగవ్య మీ పాశ్చత్రియై చను
గణుతింపఁ దగు రుద్రగణసమూహి
సారంబుగా "శివాఘోరతనూపాప
కాశినీ" యన భక్తగణసమూహి
తివిరి "నానావ్రతస్తేన ఏవావృత్తి"
గలుగు వీరవ్రతగణసమూహి
|
|
|
యాది గాఁగ భువి మహాపురాతనభక్త
పాదసరసిజముల భక్తిఁ దాల్చి
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!
| 6
|
|
విను "తవపుత్త్రోభవిష్యామి" యనుస్మృతి
దనర రెండవశంభుఁ డనియుఁ జెప్పు
ఘన ద్వితీయశ్శంభుఁ డని నుతింపంగ ధ
ర్మాధర్మవిషయ ధర్మస్వరూపి
నయతను "వృష వృషణం స్పృష్టవ" యనఁగ స
ర్వాంగపవిత్రుఁ గృపైకపాత్రు
ధర "మమ సర్వథా తద్భవే" త్తన నొప్పు
కరుణాసముద్రునిఁ గలితరుద్రు
|
|
|
వినుత వృషభసమాహుతి వేదవృత్తి
నవ్యరుద్రావతారు శ్రీ నందినాథు
వృషగణాధిపుఁ బశుపతి వినుతిఁ జేసి
యెసఁగ రచియింతు నీకృతి బసవలింగ!
| 7
|
|
పశుపతి వృషభంబు పశుపతి పరముండు
యనఁగను జెల్లు శుభాక్షరములు
బసవవాక్యంబు పవర్గతృతీయాక్ష
రము బకారము పకారంబువలనఁ
బరగఁ గుద్దాల తామర సకుఠారముల్
వరుస గుద్దలియుఁ దామరయు గొడలి
యనుక్రియను శషోస్స యను వ్యాకరణసూత్ర
మునఁ జొప్పడు సకారమును శకార
|
|
|
మున నహో వాయు తత్సూత్రమున వకార
మును పకారంబునను దోఁచుఁ బొలుపుమీఱ
బసవనా మంబిదియు లింగభావ్య మగుట
బసవలింగాహ్వయం బొప్పు బసవలింగ!
| 8
|
|
తగ "యస్య వక్త్రస్థితం దేవి" యన నుండు
నెవ్వనిముఖమునం దెల్లప్రొద్దు
రతి బసవేత్యక్షరత్రయం బమరు వి
భ్రాజితబసవాక్షరత్రయంబు
నెసఁగ "వసామితత్రసతత" మ్మనఁగను
నెవ్వారు వచియింతు రెపుడుఁ బ్రీతి
నరయ "సత్యం సత్య" మన సత్య మిది యన
"నాన్యథా" యన ధర నమరియుండు
|
|
|
ననుచు శంభుండు దేవికి నాన తిచ్చె
సిద్ధరామయ్యచే మఱి చెప్పఁబడియె
నిజము గావున లింగసాన్నిధ్యసుఖము
నొసఁగు మూఁ డక్షరంబులు బసవలింగ!
| 9
|
|
మును బకారము లైంగ్యమున "బకారో వామ
పార్శ్వతో" యన వామభాగ మయ్యె
నా సకారము "సకారాంత సద్వాచ్యో" య
నంగ వాచ్యం బుమానాథునకును
నా వకారము బకారభేద మనఁగను
హరునకుఁ దనర వాచ్యార్థ మగును
నా బసవా యను నక్షరత్రయముకు
సాక్షి శివాత్మకసరణి గాన
|
|
|
పశుపతి ప్రమోద మందును బసవ యనఁగ
మంత్ర ముత్తమ మగు రుద్రమంత్ర మవని
ముఖ్యము జపంబు సల్పిన పుణ్యరాశి
ఫలము మూఁ డక్షరంబులు బసవలింగ!
| 10
|
|
తివిరి బకారంబు ధీ వకారంబును
బ్రణుతింప నటుగాన ప్రణవ మదియుఁ
జెలఁగి నకార కించిద్భేద మా సకా
రాకృతి గాన తదంశ మఱియు
సంగతాంతర్గతశృంగ మకారప్ర
కారంబు గాన వకార మదియు
బసవాక్షరంబు లేర్పడ శివునకుఁ బ్రీతి
గాన శివా యనఁ బూనె నవియు
|
|
|
ఓ న్నమశ్శివాయ యనెడి సన్నుతాక్ష
రములఁ జెందును బసవాక్షరత్రయంబు
గాన శ్రీషడక్షరజపానూనఫలము
నొసఁగు బసవాక్షరంబులు బసవలింగ!
| 11
|
|
మహి బకారంబు "బ్రహ్మా శివో మే యస్తు"
అనఁగ నీశానవక్త్రాత్మకంబు
నొగి సకారంబు సద్యోజాత మితి యన
సరణి సద్యోజాతసంభవంబు
వఱలు వకారంబు వామదేవాన్నితి
యనఁగఁ దద్వామదేవాస్యజంబు
శ్రీలింగపద మఘోరే భ్యోథ ఘోరేభ్య
యనఁగ నఘోరలింగాహ్వయంబు
|
|
|
సహజవృషభంబు తత్పురుషాయ యనఁగ
నాదితత్పురుషంబు శుభాభిజాత
మగు సదాశివనామంబు మహితజపిత
ఫలము బసవాక్షరము లిచ్చు బసవలింగ!
| 12
|
|
బా భర్గున విరళబ్రహ్మంబు గావున
నా బకారంబు శివాత్మకంబు
సా శంభు నాకారసంపద గావున
నా సకారంబు గుర్వాత్మకంబు
వా వరదుని వచోవాసన గావున
నా వకారంబు మంత్రాత్మకంబు
నటు గూడఁ ద్రితయసంపుటము గావున బస
వాక్షరత్రయము లింగాత్మకంబు
|
|
|
నట్టి బసవలింగాక్షర మాది నెన్నఁ
బడును గురుమంత్రోచ్చారణఫలము నొసఁగుఁ
గాన బసవలింగాంకితఖ్యాతి శ్రుతుల
వసుధ రచియింతు నతిభక్తి బసవలింగ!
| 13
|
|
బసవన్న శ్రీపాదపద్మముల్ భవవార్ధి
పార మందించు తెప్ప లని తలఁచి
బసవన్న శ్రీపాదపద్మముల్ భవచయ
ధ్వాంత మడంచు దీపంబు లనియు
బసవన్న శ్రీపాదపద్మముల్ రాజిలు
భుక్తిముక్తికి సురభూజము లని
బసవన్న శ్రీపాదపద్మముల్ కల్పభూ
జంబుల ప్రథమబీజంబు లనియుఁ
|
|
|
బ్రస్తుతింప నొప్పు బసవాధినాథుని
పాదసరసిజములు భక్తిఁ దాల్చి
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!
| 14
|
|
బసవన్న మహిమఁ జెప్ప న్విన్నఁ బాయు దు
స్తరనిరంతరమహాతురభయంబు
బసవన్న మతిఁ దలఁప న్విన్నఁ బాయు దు
స్స్వప్నదుశ్శకునదుర్జనభయంబు
బసవన్నఁ బేర్కొన్నఁ బాయు దుర్ధ్వాంతవి
శ్రాంతేంద్రియక్రాంతచింతనంబు
బసవన్న యశ మన్నఁ బైఁగొన్నఁ బాయు భ
వాటవీచ్ఛన్నదేహాశ్రయంబు
|
|
|
బసవ శర ణన్న ముక్తిసౌభాగ్య మెసఁగు
బసవ శర ణన్న విశ్రుతభక్తి చెందు
బసవ శర ణన్న భక్తిసౌభాగ్యమహిమ
యెసఁగు నని మిమ్ము స్మరియింతు బసవలింగ!
| 15
|
|
పరవాదిమదగజప్రబలపంచాస్యంబు
పరవాదిభూధరవజ్రధార
పరవాదిమేఘ నిర్భరపవమానంబు
పరవాదిభూరుహప్రథితపరశు
పరవాదితస్కరపటుతరశూలంబు
పరవాదిజలనిధిబాడబాగ్ని
పరవాదిలతలకు భాస్వల్లవిత్రంబు
పరవాదిభేకిభీకరముఖాహి
|
|
|
దండనాయకబసవఁ డుద్దండశౌర్యుఁ
డతఁడు పరవాదినిర్హరణార్థబుద్ధి
మతము లాఱింటిఁ జర్చించు మహితసూక్తు
లెసఁగ రచియింతు వసుమతి బసవలింగ!
| 16
|
|
భక్తచింతామణి భక్తచూడామణి
భక్తైకనుతుఁడు సద్భక్తియుతుఁడు
భక్తసత్ప్రాణుండు భక్తకళ్యాణుండు
భక్తసంబంధుండు భక్తివిభుఁడు
భక్తవిధేయుండు భక్తసహాయుండు
భక్తకింకరుఁడు సద్భక్తిపరుఁడు
భక్తాంతరంగుండు భక్తాబ్జభృంగుండు
భక్తహృన్మయుఁడు సద్భక్తిచయుఁడు
|
|
|
దండనాథుండు బసవఁ డుద్యద్గరిష్ఠుఁ
డాదివృషభుండు భక్తహితార్థబుద్ధి
మతము లాఱింటిఁ జర్చించు మహితసూక్తు
లెసఁగ రచియింతు వసుమతి బసవలింగ!
| 17
|
|
ఈకృతి రచియించి యీలోకమందుఁ బ్ర
తిష్ఠింతు నీశ్వరాధిక్యమహిమ
నీకృతి పాలించి యీలోకమందు సం
పాదింతు జంగమపాత్రమహిమ
నీకృతి యొనరించి యీలోకమం దను
ష్ఠింతుఁ బ్రసాదసంసేవమహిమ
నీకృతి గావించి యీలోకమునఁ బ్రతి
పాదింతుఁ బటుతరభక్తిమహిమ
|
|
|
నాదివృషభాంశజుఁడు బసవాధినాథుఁ
డిట్టి కృతినాథుకృపచేత నిప్పు డాంధ్ర
భాషఁ బ్రకటింతుఁ బద్యప్రబంధముగను
వసుధ సత్కవిసమ్మతి బసవలింగ!
| 18
|
|
శ్రీరుద్ర జాబాల శ్వేతాశ్వతర బృహ
దారణ్య తైత్రీయ మాది గాఁగ
బ్రహ్మబిందువు పంచబ్రహ్మాత్మగర్భ కా
త్యాయనీ శుక్ల కాలాగ్ని రుద్ర
కాపాల శోషీయ గాల వాజననేయ
శాండిల్య ప్రశ్న సుశంఖ హంస
పవమాన కైవల్య బాష్కల సశివ సం
కల్పనారాయణ కాండవాది
శాఖలం దుపనిషచ్చయమం దధర్వణ
ఋగ్వేద సామము లెంచి మించి
|
|
|
శ్రుతిపురాణాగమములందు శుద్ధవీర
శైవమునకును దగినట్టి సరణు లెల్లఁ
జేర్చి మీకృపవలనను జెడని భక్తి
పదముచేత రచించెద బసవలింగ!
| 19
|
|
పద్యగణాక్షరపరమితోదాత్తాను
దాత్తస్వరాదులు దప్పకుండ
ధాతుశబ్దాళిసూక్తముతోడఁ జేరిన
వాక్యముల్ సంప్రీతి వచ్చియుండ
స్వరవర్ణపదబంధసంధిన్యూనాతిరి
క్తప్రయోగంబులు గలుగకుండ
నిజపదవాక్యార్థనిర్ణయోక్తులతోడఁ
బై యర్థములు దప్పు పడకయుండ
|
|
|
నలరు నుపనిషద్వేదసూక్తులకు భాష్య
మునకు నై ఘంటికంబుల కనుగుణంబు
లగు పురాణస్మృతీతిహాసాగమోక్తు
లెసఁగ రచియింతు నీకృతి బసవలింగ!
| 20
|
|
శ్రుతుల "దామామతి ప్రతిరిష్యతి" యనంగఁ
గల్పార్థ మేకంబుగాను తుష్ట
సంచయ "మాప్నోతి సహసాయతి" యనంగ
శ్రుతులు పురాణోక్తతతులు గాఁగ
శ్రుతిస్మృతులకు విరుద్ధత్వ మున్నఁ ద
త్పార మొల్లరు బుధవరులు గాన
అల శైవ వైష్ణవాదు లనర్హవాక్యమం
చనియెద రితరవాక్యములు గాన
|
|
|
నొగి శ్రుతిస్మృతులకు యుక్తంబుగాఁ బురా
ణాగమాదిసూక్తు లతిశయిల్ల
భాష్యరీతిఁ దేటపఱతు నుద్యద్భక్తి
పథము విస్తరిల్ల బసవలింగ!
| 21
|
|
శ్రుతి కల్పభూజసంచితబీజభావన
"నగ్నిమీళే" యన నాది వెలయు
శ్రుతి సుధాంబుధిమధ్యగతిరత్నభాతి "ని
స్సంగతత్పరు" షనంగ వెలయు
శ్రుతి హేమగిరిశృంగరుచి నంత్యమున "సర్వ
మన్యత్పరిత్యజ్య" యనఁగ వెలయు
శ్రుతి శివక్షేత్రసంతతశాసనస్థితి
నెడనెడఁ బ్రణవమై యిట్లు వెలయు
|
|
|
వేదజన్మభూమి వేదాంతవేద్యుండు
వేదమయుఁడు వేదవినుతకీర్తి
దివ్యలింగమూర్తి భవ్యతేజస్స్ఫూర్తి
భవుఁడె యాదికర్త బసవలింగ!
| 26
|
|
ఆదియౌ ఋగ్వేద మది "యగ్నిమీళేపు
రోహిత" మనఁగ నిరూపితముగ
సర్వాగమోత్తరసరణి "సద్భస్మశ
శాంక" మిది యనంగ సంచితముగ
భాష్యసత్సంహిత పరగంగ "జాతవే
దస్స్థాణు" రనఁగ సంస్థాపితముగ
ధర లైంగ్యమున "జలస్తంభరూపిణి" యనఁ
గడువడి సద్వార్త నుడువఁగాను
|
|
|
నిట్టిధర్మంబు లెల్లను దిట్టముగను
దెలిపెడును నీమహత్త్వంబు తేటవడఁగ
నిర్వికల్పరతిఁ జతుర్వేదసారమున్
వెస రచింతు నేను బసవలింగ!
| 27
|
|
అలరుచు ఋగ్వేద మటు "ఏక ఏవ రు
ద్రోనద్వితీయ" నా రూఢిఁ దగిలి
తగ యజుర్వేదంబు దా "నమస్తేఅస్తు
రుద్రరూపేభ్య" నా రూఢిఁ బొగడ
నిమ్ముగ సామవేదమ్ము "విశ్వాధికో
రుద్ర మహర్షి" నా రూఢిఁ దగిలి
యొగి నధర్వణవేద "మూర్ధ్వబాహవె" యన
"రుద్రస్తువంతి" నా రూఢిఁ దగిలి
|
|
|
పరగ లింగమూర్తి భావవశ్యుం డగు
కలిమి మెఱసి బందికాండ్రఁ జేసి
వంగకాయలట్లు లింగము ల్గాఁ జూచు
ప్రతిభ మీకె యొప్పు బసవలింగ!
| 28
|
|
పొంగారుసమ్మతి "లింగమధ్యే జగ
త్సర్వం" బనంగ శాస్త్రంబులందు
అలరి "లింగాంకితం" బయ్యు "జగద్భరి
తం" బన నారుషేయంబులందు
స్థితిఁ "బ్రళయాంతవ్రజేద్దీపితేనలిం
గ" మనంగ విమలాగమము దలఁప
నరిది శ్రీకొన్నెల నా "లింగ ముచ్యతే"
యనునట్లు శివరహస్యంబులందుఁ
|
|
|
బరగు లింగమూర్తి భావవశ్యుం డగు
కలిమి మెఱసి బందికాండ్రఁ జేసి
వంగకాయలట్లు లింగము ల్గాఁ జూచు
ప్రతిభ మీకె యొప్పు బసవలింగ!
| 29
|
|
శ్రుతి "అహ మ్మేవ పశూనా మధిపతి ర
సావితి" యనఁగ విస్ఫారమహిమ
వర్ణన కెక్క "శర్వాయ చ పశుపత
యే చ నమో" యన నిద్ధమహిమఁ
బ్రబలి "ఇమం పశుపత యే చ తే యద్య
బథ్నామి" యనఁగ నపారమహిమ
వ్యాపితలీల "నుమాపతయే పశు
పతయే నమో" యన నతులమహిమఁ
|
|
|
బరగుఁ గాన శివుఁడె పశుపతి యజహరీం
ద్రాదు లెల్లఁ బశువు లనెడుశ్రుతులు
చదివి చదివి కూళ లది యెట్లకో శివ
భక్తిహీను లైరి బసవలింగ!
| 30
|
|
శ్రుతి "విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖో
విశ్వతో బాహు" నా విమలకీర్తి
యలర "నణోరణీయాన్మహతోమహీ
యా" నన విశ్వతోవ్యాప్తమూర్తి
యొనరఁ దా నభిరతి "నో న్నమో నమ" యన
నతులితమహిమ మహత్ర్పపూర్తి
మహిమ దీపింప "సోమః పవతేజని
తామతీ నౌ" మన ధన్యకీర్తి
|
|
|
శివుఁడె యంచు సకలశిష్టులు పలుకంగ
మ్రోయునట్టి వేదములు దొడంగి
చదివి చదివి కూళ లదియెట్లకో శివ
భక్తిహీను లైరి బసవలింగ!
| 31
|
|
జగతిలోపలను "యస్మా త్పరం నాస్తి" నాఁ
బరమపరునిమీఁదఁ బరము గలదె
యింపారగా "ఏక ఏవ రుద్రోచ్యతే"
యనఁగ రెండవరుద్రుఁ డాదిఁ గలఁడె
కూర్మిమై "సశివ ఏకోధ్యేయ" యనఁగ ధ్యే
యుండు శివుండు వేఱొండు గలఁడె
యిల "అపరస్స మహేశ్వరో" యన మహే
శ్వరుపైని మఱి మహేశ్వరుఁడు గలఁడె
|
|
|
యటులు శంకరుఁడు మహాదేవుఁ డీశానుఁ
డఖిలవేదవేద్యుఁ డభవుఁ డుండ
నితరసురులఁ గూళ లెట్లొకో భజియించి
భవనిమగ్ను లైరి బసవలింగ!
| 32
|
|
ఇంపారగా "పశూనాం పతయే నమో"
యనఁగను బశుపతి యైనవాఁడు
భాతిమీఱ "దిశాంచపతయే నమో నమో"
యనఁగ దిశాపతి యైనవాఁడు
తేజరిల్ల "గణపతిభ్యశ్చవో నమో"
యనఁగ గణాధ్యక్షుఁ డైనవాఁడు
తేటపడ "సభాపతిభ్యశ్చవో నమో"
యనఁగ సభాపతి యైనవాఁడు
|
|
|
ధ్యేయుఁ డనుచును సురులు నుతింపుచుండ
శిష్టజను లెల్ల హరుఁడె పో శ్రేష్ఠుఁ డనఁగ
భవుని మఱి రుద్రసూక్తులు ప్రస్తుతించు
భంగి నెఱుఁగరొ కూళలు బసవలింగ!
| 33
|
|
తెల్లంబుగా "స్మర్య తే న చ దృశ్యతే"
యనుచు వేదములు తథ్యంబు వలుక
సుప్రసిద్ధంబుగా "నప్రాప్య మనసా న
హా" యని శ్రుతి నిశ్చయంబుఁ బలుక
నారూఢముగను "వేదారహస్యప్రోక్త"
మనుచు వేదంబులు నట్లు పలుకఁ
దేటపడఁగ "సత్యతిష్ఠద్దశాంగుళం"
బనుచు వేదంబు లత్యర్థిఁ బలుక
|
|
|
నట్ల శంకరుఁడు మహాదేవుఁ డీశానుఁ
డఖిలవేదవేద్యుఁ డభవుఁ డుండ
నితరసురులఁ గూళ లెట్లొకో భజియించి
భవనిమగ్ను లైరి బసవలింగ!
| 34
|
|
వ్యాసభుజంబు విన్యాసంబు గా దన్నఁ
గాశిని రంజిల్లు గంగ సాక్షి
ఘనతఁ గాశీఖండమున "సర్వజలజాత
ముపహర్తు" మనఁగ సముద్ధతముగ
"నంగుష్ఠతర్జనీభ్యశ్చ భస్మద్వార"
మనఁగఁ దదీయోక్తి సంచితముగ
నెఱి నంది "పూర్వవినిస్రుతాదే" వన
ముల్లోకములు గూడ ముంచినట్టి
|
|
|
గంగ నిరతంబు నీజటాగ్రంబుఁ జొచ్చి
గానరాకున్న మఱి నఖాగ్రంబు విద్రువ
వెలికిఁ బఱతెంచు టెఱుఁగరే వెఱ్ఱిజనులు
భర్గుమహిమంబు దెలియరు బసవలింగ!
| 35
|
|
క్షోణిపై వెలసెడి కేనోపనిష దుక్తి
"ఇద మిద మిద" మని యేర్పఱుపఁగ
నెఱి యజుర్వేదోపనిషది "విషం తృణా
గ్ర మపి న చలతి" నా స్కాందమునను
స్వాధ్యాయనోపనిషత్సూక్తి "నాచల
యతితృణం" బనఁగ గ్రంథాంతరమునఁ
జనవార లైంగ్యంబునను "తృణం వాపి య
క్షశ్చ పశ్యతి" యని గణన సేయఁ
|
|
|
యక్షనాయకుఁ డాదిగా ననవరతము
హరి మునీంద్రులు గరుడులు సురలు పరగఁ
బొగడుచుండు టెఱుంగరే భూమిజనులు
ప్రాకృతులు గాక వేఱొండె బసవలింగ!
| 36
|
|
ధర "గదాభ్యః పూత" యనుచు నా
దిత్యపురాణంబు దివిరి పొగడ
నింపార "నారాయణం పుమానత్యయ"
యని తత్పురాణంబు వినుతి సేయ
మొదల సౌరపురాణమున "రంజితో మేరు
పర్వతో" యనుచును బ్రస్తుతింప
యుక్తి "సంతర్పితే నోక్తం దివౌకస"
యని తత్పురాణంబు వినుతి సేయ
|
|
|
నిన్నివిధముల శ్రుతిపురాణేతిహాస
వాక్యములు మ్రోయుచుండంగ వసుధఁ గూళ
లిది నిజం బని తెలియ రదేమొగాని
ప్రాకృతులు పాపమతు లైరి బసవలింగ!
| 37
|
|
ధరఁ "దృణబిం ద్వన్యథా సహి" యనియెడుఁ
గాదె శ్రీకాళికాఖండసూక్తి
జలజజవాక్యంబు "శంభుభక్త్యా చ స
ర్వేషా" మనంగ సద్వృత్తి గాదె
మొదలఁ "బాశుపతేన ముక్తిర్నృపస్తేన
కాంస్యా" యనంగను గ్రతుఫలంబు
వ్యక్తిఁ గాశీఖండసూక్తి "దాస్యామి స
ర్వేషా" మనంగను విన రదేమొ
|
|
|
దవిలి "విద్యానమృత ఇహ భవతి"యనుచు
వేదపురుషుండు దాఁ జెప్పెఁ గాదె యిట్లు
కాన ముక్తుల కెల్లను గారణంబు
భర్గుపాదాబ్జభక్తియే బసవలింగ!
| 38
|
|
ఒనరు లింగపురాణమున "వేదతేచ దు
రాత్మా" న యన నిశ్చయంబు గాదె
స్కందపురాణాదిసంహితసూక్తి "య
స్స్మరతి పతంతి" నా మఱచి రెట్టు
లననేల సూతగీతిని "యథాస్యాపాన
యో" యన సమబుద్ధి యుడుగ రెట్లు
స్కందపురాణసంగతి "శ్వపచాధమో"
యను సూక్తిఁ దప్పక యరయ రెట్లు
|
|
|
రూఢి మీఱ శ్వేతాశ్వేతరోపనిషది
నట్ల "దేవా ననంతా" ననంగ మఱియుఁ
గడఁగి విష్ణ్వాదులను గరకంఠుఁ బోల్చు
పాపులను జూడఁబోలునే బసవలింగ!
| 39
|
|
స్రష్ట వేధించెఁ "బ్రజాపతిర్వివశా మ
హ"ర్తనా దనఁ గూఁతు నతఁడు గలియ
గర్వింపఁ "గర్తోపకర్తస్యవదనంబు"
ననఁగ బ్రహ్మశిరంబుఁ దునిమివైచె
నొగిఁ "బురాత్మన్యేవ చోష్ట్రత్వ" మన బ్రహ్మ
సుతుని నుష్ట్రముఁ జేసె నతఁడు గ్రొవ్వ
జగతిఁ "ద్రిపురమదశాసినే యస్తేచ"
యనఁగను వేగఁ గట్టలుకఁ దుడిచె
|
|
|
నంగజుఁడు "లలాటస్థహుతాశనె" యన
నంగజుని వ్రచ్చి నిటలనేత్రాగ్నిఁ గాల్చెఁ
గాన నద్వైతులకు జగత్కంటకులకుఁ
బాటు తప్పునే హరుచేత బసవలింగ!
| 40
|
|
శ్రీవీరభద్రుఁ డారిచి యజ్ఞపురుషునిఁ
బఱపుట సూర్యునిపళ్ళు డుల్చి
యగ్నిచేతులును జిహ్వలు గోసివైచుట
భగునికన్నులు దీసి జగతి నూకి
మునులను రోషించి మొదటఁ జంద్రునిఁ బట్టి
ధరణిపైఁ బడవైచి తన్నుటయును
నదితి చన్ముక్కు శారదముక్కు గోయుట
తఱిమి సురలనెల్లఁ దఱుఁగుటయును
|
|
|
మఱియు దీక్షితులను బట్టి మదము దగ న
ణంచి "రుద్యేహతే" యన నధ్వరస్య
యనఁగ మొదలఁ దా "నిదమస్తు" హవ్య మనఁగఁ
బాటు దప్పునె హరుచేత బసవలింగ!
| 41
|
|
మహిని రుద్రుండు "చర్మాంబరో శ్రీభవే"
త్తనఁగ వ్యాఘ్రాసురు నద్భుతముగ
నడఁచె శంభుఁడు "పాదహస్తే యుతం చర్మ"
మనఁగ గజాసురు నతులితముగఁ
జీఱె శరభుఁడు "నృసింహాజినాంబరో"
యన నృసింహాజినం బక్కజముగ
ఖండించె వీరభద్రుండు "సయజ్ఞస్య"
యనఁగ యజ్ఞపురుషు నచ్చెరువుగఁ
|
|
|
గట్టి పట్టి కొట్టి కారించి మించెను
సకలసురులు మునులు సన్నుతింప
క్షితిని "గృత్తివాససే" యను శ్రుత్యుక్తి
ప్రత్యయంబు గాదె బసవలింగ!
| 42
|
|
"క్రియకరోదేవవికీర్తితోయకరో సు
సతరవ" త్తన సూతసంహితులను
"క్రీడనకాయేవ క్రీడనకా" యను
కాళికాఖండసూక్తములు మఱియు
"యస్యకింకథ నైవ" యాదిత్యసూక్తి త
త్సూక్తిని "నైవప్రసూతి" యనఁగఁ
దవిలి మును "శుకవ"త్తనఁ "బ్రళయోదయో"
యనఁగను నీశుక్రీడార్థ మైన
|
|
|
పశువు లుష్ట్రంబు లశ్వముల్ బంట్లు సురులు
క్రీడ సల్పును శంభుండు చూడఁ జూడఁ
జచ్చి పుట్టెడువారలు శంభుసరియె
బ్రహ్మవిష్ణ్వాదిదేవతల్ బసవలింగ!
| 43
|
|
పొడువకుండఁగ నోడుఁ బొడువంగ నోడు శి
వాజ్ఞను మీఱి యహస్కరుండు
వీవకుండఁగ నోడు వీవంగ నోడు శి
వాజ్ఞను మీఱి మహానిలుండు
కాలకుండఁగ నోడుఁ గాలంగ నోడు శి
వాజ్ఞను మీఱి హుతాశనుండు
కురియింపమికి నోడుఁ గురియింప నోడు శి
వాజ్ఞకు వెఱచి వజ్రాయుధుండు
|
|
|
చంపకుండఁగ నోడును జంప నోడు
మృడునియాజ్ఞను మీఱియు మృత్యుదండ
ధర విధాత లోడుదురట "ధావతి" యని
పరగ శ్రుతు లిట్టులను మ్రోయు బసవలింగ!
| 44
|
|
గిరిజేశునకు "నతఃపర" మున్నదే "నాస్తి
లింగాత్పరం" బని లీల మ్రోయ
మృడునకు సరి గలఁడే "నభూతో నభ
విష్యతి" యనుచు సద్వృత్తిఁ బలుక
హరుఁడు సాధారణుం డనఁగను గూడునే
"సోంత్యజో" యనఁగను సూక్తి యెఱిఁగి
భవు నొరుం బోల్పఁ బాపంబు గాదె "పతంతి
యమశాసనే"యన నట్ల మఱియు
|
|
|
శ్రుతి శిరస్సమూహి "పతిరేకయాసీ" త్త
నుచు వచింప దుర్గుణులు మదించి
యితరసురులఁ బట్టి పతితులు సన్ముక్తి
బాహ్యు లగు టదేమి బసవలింగ!
| 45
|
|
"కాచ మన్యం"చనా గాజుఁబెంచికలు ర
త్నము లుండ నేరు దుర్నయునిఁ బోలు
"గూపం ఖనతి" యన గూపంబులట్ల జా
హ్నవిని దలంచు దుర్నరునిఁ బోలుఁ
"బూజ్యం త్యజే"త్తనం బో నోడ యుండంగ
వడరూది నిలిచిన వదరుఁ బోలు
ధర "సురగా" యన సురధేను వుండంగ
గొడ్డు పితుక నేఁగు కుమతిఁ బోలు
|
|
|
నట్ల "చర్మవదాకాశ" మనఁగఁ గనియు
సరణి గవయంగఁ గోరెడు జడునిఁ బోలు
నిన్నుఁ గొల్వక యొరుఁ గొల్చు నీచమతులు
వసుధ శ్రుతులు చెప్పెడుఁగాదె బసవలింగ!
| 46
|
|
కారణోక్తుల "న గురోరధికం న గు
రోరధికం" బని రూఢిఁ బొగడ
నిల "గురురూపో మహేశ్వరో" యనుచు స
ర్వాగమోత్తరములు నర్థిఁ బొగడ
మఱి "గురురూపం సమాదాయ" యనుచుఁ గ్రి
యాతిలకంబు నత్యర్థిఁ బొగడ
వారక "నాస్తి తత్త్వం గురోః పర" మని
యారుషేయంబులు గోరి పొగడ
|
|
|
శ్రుతులు "నాచార్యదేవో భవతి" యనంగ
సకలభుక్తిముక్తిప్రదాయకుఁడు గురుఁడు
శివుఁడు గురుమూర్తి పరసదాశివుఁడ యనుచుఁ
బ్రస్తుతించెడు గురుమూర్తి బసవలింగ!
| 47
|
|
దీపితమతి "నద్వితీయోస్తి కుత్ర చి"
త్తనుచు శ్రీలైంగ్యంబు వినుతి సేయ
మతి "శతరుద్రీయ మధ్యగా" యనుచు న
య్యజ్ఞవైభవఖండ మర్థిఁ బొగడ
కారణాగమము "మంత్రై రుపమంత్రై ర
నేకథా" యనుచును నియతిఁ బొగడ
నయ్యాగమంబు "విద్యాజపతో ఆప్ను
యాచ్ఛివం" బనుచు నత్యర్థిఁ జదువ
|
|
|
ధరను "యదజనాత్తదా" యని శాస్త్రంబు
లను నమశ్శివాయ యనుచు శ్రుతులు
భక్తి మ్రొక్కఁ బరగు పంచాక్షరస్వరూ
పంబు శివుఁడు గాదె బసవలింగ!
| 48
|
|
శ్రీశివధర్మోక్తిఁ "గ్రీడమానోపి యః
కుర్యా" త్తనంగ నకుంఠితముగ
మఱి "పాంసవఃక్రియామానోపిశృంగంబు
శయనం" తదీయోక్తిసంగతముగ
లైంగ్యంబునందు "బాలానాం చ భజ శివ"
మ్మనుచుఁ "గృత్వా" యన నంచితముగ
నాసౌరమున "మృణ్మయం చాపి సంభవ
త్వే భూభుజ" యనఁగ వితతముగను
|
|
|
ఇసుక లోష్టంబునను మంటి వసుధ లింగ
మూర్తిఁ గావించి కొల్చిన ముక్తి యగును
బాలురకు నన్నఁ బ్రత్యక్షభవ్యలింగ
భజనఫల మెన్న శక్యంబె బసవలింగ!
| 49
|
|
తివిరి ఋగ్వేద "మస్థితయతి సాలభ్య
తేభ్యో" యనంగ సత్క్రియ దలిర్ప
నా యజుర్వేద "మింద్రాయతి సప్తాశ్వ
తేభ్యో" యనంగ భక్తియుఁ దలిర్పఁ
దవిలియు వాయు "యథా దైవతా" యని
"యజ్ఞ ముపచరతి" యనుచుఁ బొగడఁ
దాను వెండియు "యోగదైవతా" యనుచును
"యజ్ఞ ముపచరతి" యనుచుఁ బలుక
|
|
|
హింస గావించి పడయు నా యింద్రపదవి
వాయుసూక్తిని "తద్దళం వా" యనంగఁ
బుడిసెఁ డుదకంబు పైఁబోసి పువ్వుఱేకు
భర్గుఁ బూజింపఁ జాలదే బసవలింగ!
| 50
|
|
ఐశ్వర్య మర్థించి యమరులు "శ్రుతి మరి
తోత్తధయం" తనాఁ దొడరి కొలువ
సన్మునీంద్రులు క్రియాసఫలత కర్థించి
"జయజయా" యని భక్తినియతిఁ బొగడ
యతివరుల్ మోక్షార్థులై బ్రహ్మలోకప
దాన్వేషు లగుచు నత్యర్థిఁ గొలువ
నిత్యపూజానిష్ఠ మృత్యుహరముగా "య
జా మహే" యని భక్తజనులు గొలువ
|
|
|
నర్భకుల్ గర్భదుఃఖాపహరణముగను
"త్వం ప్రపద్యే" యనుచును జిత్తమునఁ గొలువ
నభిమతార్థంబు లొసఁగు లింగార్చన ప్ర
భావ మెంచరు కూళలు బసవలింగ!
| 51
|
|
నలి లైంగ్య మనుపురాణము "సూకరో" యన
నొగి గణత్వము నొందె నొక్కపంది
తనర శివరహస్యమున "విదీపో గత
ప్రాయో" యనఁగ ముక్తి వడసె దొంగ
ఆ హరప్రాసాద మనుసంహితను జెప్పి
యొగి మోక్షమును జెందె నొక్కరాజు
ముక్తి వడసెఁ గరి ముక్తిఖండమున "నా
థా యనాథా" యను తత్త్వమునను
|
|
|
లింగసాహస్రతయును సత్సంగతోక్తి
విభుధవర్గంబు చెప్పినవిధము భస్మ
ధరునకును మున్ను సద్గతి దనరెఁగాదె
భక్తి నే మని చెప్పుదు బసవలింగ!
| 52
|
|
తప్పక భృగుసంహితను "యః శివేతి స్మ
రే త్కించి" దనుచు సత్క్రియఁ దలిర్ప
ఘనమైన విష్ణువాక్యము "శివమే వాను
చింతయే" త్తనుచు సంస్మృతిఁ దలిర్ప
సతతంబు శ్రీభాగవతపురాణంబున
"శివ శివే" యంచును జెలఁగి మ్రోయ
మున్ను కూర్మపురాణమున "శివ ఇత్యక్ష
రద్వయం" బనుచుఁ బురాణవితతి
|
|
|
చెలఁగి యిట్లు మ్రోయు "శివ శివ శివదేవ"
యనుచు శ్రుతులుఁ బొగడునట్లు గాన
శివునిఁ దలఁచుమాత్ర సిద్ధించు నపవర్గ
పదవి యొండు లేల బసవలింగ!
| 53
|
|
తగఁ "గ్రిమికీటపతంగోపి" యనుచు నా
శివరహస్యంబునఁ జెప్పెఁ గాన
యేపార "నరక సయేవ పశుత్వం చ"
యను సంహితోక్తుల నమరుఁ గాన
పరికింప "జన్మస్య పాక మధ్యా" యని
వాయువీయంబున వఱలుఁ గాన
ప్రకటింప "మానుషారాక్షసా" యనుచు న
నామయంబును గడు నర్థి మ్రోయఁ
|
|
|
బరగు శ్రుతి "భవామ శరదశ్మత" మటంచుఁ
జాటుఁ గాన సకలసౌఖ్యములకు
నిక్క మేకలింగనిష్ఠాపరత్వాను
భవసుఖంబు పదము బసవలింగ!
| 54
|
విభూతి రుద్రాక్ష లింగధారణ మాహాత్మ్యము
|
విశ్రుతాధర్వణాదిశ్రుతిసంధాన
మున సమర్థించు విభూతిభాతి
రూపింపఁ గాలాగ్ని రుద్రాద్యుపనిషచ్చ
యమున రక్షావగాహము ఘనంబు
తివిరి శాతాతపద్వితయవిజ్ఞానేశ్వ
రాదిస్మృతులు క్షార మనుచుఁ జెప్ప
బ్రహ్మకూర్మాదిపురాణముల్ గుమిగూడి
క్రమమున భస్మధారణముగుణము
|
|
|
సన్నుతించు జాబాలాదిశాఖలందు
భసితమును దప్పక ధరించుఫలము దివిరి
యిట్టిసూత్రములఁ దెలిసి యెలమి మీఱ
భాష్యసూక్తులు గాన్పించు బసవలింగ!
| 55
|
|
చర్పింప శివధర్మశాస్త్రంబు దా "స్నాన
మాగ్నేయ మాచరే" త్తనుచుఁ బొగడఁ
బ్రకటింప వాయుపురాణంబు "భస్మనా
చత్రిపుండ్రక" మని సంస్తుతింప
సంధిల్ల లైంగ్యంబు "సర్వతీర్థావగా
హంబు భూతిస్నాన" మనుచుఁ జదువ
నలి భవిష్యత్పురాణమున "భసితతను
మాపురా" యనుచు సమాఖ్య సేయఁ
|
|
|
జను పురాణయుక్తిశాఖోపనిషదాగ
మాదిధర్మములును మహితవృత్తి
వినుతి సేయుచుండ వేదురు లాభూతి
బాహ్యు లగు టదేమి బసవలింగ!
| 56
|
|
తనర శ్రీలైంగ్యంబునను "మస్తకే వాపి
ధారయే" త్తనుచు నాదట నుతింప
నిపుణత వెలయ వాయుపురాణమునను "రు
ద్రాక్షధారణ" యన నతిశయిల్లఁ
బ్రతిభతో స్కాందపురాణంబునను "మృణ్మ
యం చాపి రుద్రాక్ష" మనుచుఁ జెప్ప
నాదిశివపురాణమందును "శ్వాపి వా
మృతి" యని యర్థిమై మేళవింప
|
|
|
మూలసంహితలును మొగి వేదములు గూడ
విశదముగను మ్రోయ వేదురులును
శ్రుతిహితంబు గాఁగ రుద్రాక్షలను గర్మ
ఫలమె దాల్పకునికి బసవలింగ!
| 57
|
|
రుద్రాక్షధారులు రూఢిమైఁ బ్రమథులు
తత్స్వరూపములు వేదములు ఋషులు
వసువులు బ్రహ్మలు వరరుద్రు లర్కులు
గరుడులు హరి పురోగమపురారు
లష్టతనువులు శాస్త్రాగమకర్తలు
సావిత్రి గాయత్రి శక్తిచయము
దానవుల్ మానవుల్ తపసులు యోగులు
సిద్ధులు సాధ్యులు శ్రేష్ఠబుధులు
|
|
|
నల పురాణయుక్తి నట్లె "వేదాధార
యంతి" యనుచు శ్రుతులు నలర భవులు
శ్రుతిహితంబు గాఁగ రుద్రాక్షలను గర్మ
ఫలమె దాల్పకునికి బసవలింగ!
| 58
|
|
నియతిఁ బ్రహర్షంబుమెయిఁ "బ్రాణలింగం ధ
రేత్సుధీ" యనుచు సారెకును బలుక
నర్థిమై "ధారయే ద్యస్తు హస్తేన లిం
గాకార" మనుచు నస్తోకలీల
నవిరళప్రీతిమై "శివలింగధారణం
కుర్యా" త్తనుచు నతిధైర్యలీల
నొనర "వక్త్రాధార్య నోచ్ఛిష్ట మితి నిశ్చి
తం" బనుచుఁ బురాణతతి నుతింప
|
|
|
సొరముగ "శివాతనూరఘోరపాప
కాశిని" యనుశ్రుతులు గలుగునట్ల
చదివి చదివి దుష్టజనులు గొందఱు లింగ
బాహ్యు లగు టదేమి బసవలింగ!
| 59
|
|
వావిరి "క్రియత దైవానుసాన్నిధ్యాన్న
తే ప్రకృతి" యని యుద్దీపితముగ
నిర్వికల్పానూననియతి శ్రుతి "నభవ
తోలింగ" మనుచును ధ్రువము గాఁగఁ
దాత్పర్యమునను "సత్తామాత్రద్వితయచే"
త్తనుచుఁ బురాణచయము కథింపఁ
బ్రాణపద్ధతి "నీశ్వరేణ వినా భావ
సంబంధ" మనుచును సంగతముగ
|
|
|
మఱియు నొగి "శివాభిమర్షణో" యనుచును
బొంగి వేదములు చెలంగి మ్రోయఁ
జదివి చదివి దుష్టజనులు గొందఱు లింగ
బాహ్యు లగు టదేమి బసవలింగ!
| 60
|
|
లీల విష్ణుం డింద్రనీలంపులింగంబు
ననయంబు దనసజ్జయందుఁ డాల్పఁ
గమలాసనుఁడు చంద్రకాంతలింగంబును
ననయంబు దనసజ్జయందుఁ దాల్పఁ
దామరసఖుఁడు దాఁ దామ్రలింగంబును
ననయంబు దనసజ్జయందుఁ దాల్పఁ
దారాధిపతియు ముక్తామయలింగంబు
ననయంబు దనసజ్జయందుఁ దాల్ప
|
|
|
నింద్ర యమ వరుణ ధనేంద్రు లంబుజరాగ
వజ్ర మరకతాది వర్ణలింగ
ములు ధరించి కొలువ మూఢు లెల్లను లింగ
బాహ్యు లగు టదేమి బసవలింగ!
| 61
|
|
కృష్ణేశ్వరుం డని కృష్ణుండు గొల్చుట
మహి విష్ణువాదులు మఱచిరయ్య
బ్రహ్మేశ్వరుం డని బ్రహ్మయుఁ గొలుచుట
యేకాత్మవాదు లె ట్లెఱుఁగరయ్య
దేవేశ్వరుం డని దేవతల్ గొలుచుట
కర్మవాదులు దీనిఁ గానరయ్య
సర్వేశ్వరుం డని సన్మునుల్ గొలుచుట
శూన్యవాదులు దీనిఁ జూడరయ్య
|
|
|
దివిజ దనుజ మనుజ నివహంబు తమ తమ
పేళ్ళమీఁద నీశుపేరు మోపి
యిలఁ బ్రతిష్ఠ సేయు టిదియంతయును జగ
త్ప్రత్యయంబు గాదె బసవలింగ!
| 62
|
|
ఒనర ఋగ్వేదంబు నొగి "రుద్రశంతమే
భీ" యని యతులగంభీరలీలఁ
జను యజుర్వేదంబునను "తవ రుద్రప్ర
ణీతా" యటంచు విఖ్యాతలీల
నిల సామమున "నఘోరేభ్యో" యటంచును
దవిలి మ్రోయను మహోదాత్తలీలఁ
గన నధర్వణవేదమునను "రుద్రేణాత్త
మశ్నంతి" యనుచు సమగ్రలీల
|
|
|
మ్రోయ నఖిలవేదమూలంబు లింగప్ర
సాద మనుచు విషము శంకరునకు
నర్పితంబుఁ జేసి యారగించినయట్టి
ప్రతిభ మీకె యొప్పు బసవలింగ!
| 63
|
|
ఒనరంగ వాతూలమున "నుపభోగాయ
భూరితో" యనుచు సంపూరితోక్తి
నలి భవిష్యత్పురాణమునఁ "బ్రసాదోద
కాదితం చైవ" సంపాదితోక్తి
సంధిల్ల వాయవ్యసంహితను "నివేది
తం చ దేవా" యను సంచితోక్తి
మును కాళికాఖండమువ "నివేద్యం చాపి
భక్షయే" త్తను పరిభ్రాజితోక్తి
|
|
|
మ్రోయు బహుపురాణమూలంబు లింగప్ర
సాద మనుచు విషము శంకరునకు
నర్పితంబుఁ జేసి యారగించినయట్టి
ప్రతిభ మీకె యొప్పు బసవలింగ!
| 64
|
|
ముద మంది శివధర్మమున "నిర్మలత్వాచ్చ
నిర్మాల్య" మనుచు వినిశ్చయముగ
నయ మొప్ప స్కాందమునం "ద్రివిధం చార్పి
తం చైవ" యని విశ్రుతముగ నలరి
ఘన మాశివరహస్యమున "నిష్టలింగస్య
యద్దత్త" మనుచు విఖ్యాతముగను
మొదలను శ్రీలైంగ్యమున "యదాహారాయ
కల్పితం" బనుచు నఖండలీల
|
|
|
మ్రోయు బాహుపురాణమూలంబు లింగప్ర
సాద మనుచు విషము శంకరునకు
నర్పితంబుఁ జేసి యారగించినయట్టి
ప్రతిభ మీకె చెల్లు బసవలింగ!
| 65
|
|
మేనకాత్మజకు నీశానసంహితయందు
"యది భుంజతే" యని హరుఁడు చెప్పె
శివుఁడు దా లలితభైరవమున "నిర్మాల్య
ధారణం" బని చెప్పెఁ దనసుతునకు
వ్యాసుఁడు శైవంబునందు జైమినికి "దే
వోపభుక్తం" బని యొనరఁ జెప్పె
హరివంశమున వజ్రి కానారదుఁడు చెప్పెఁ
బూని "ప్రసాదభోగేన" యనుచు
|
|
|
నిట్లు పలుకును మఱి పురాణేతిహాస
చయనిరూపితలింగప్రసాదభుక్తి
చదువులకుఁ జర్చలకు నేల సంభవించు
భర్గుకృప లేనిజడునకు బసవలింగ!
| 66
|
|
బ్రహ్మహత్యాదులు పరిహృతం బగుఁ "బాత
కాపహ" మనుచు నిరూపితముగ
నఖిలరోగహరణ మగు "విషదష్టైశ్చ
యాతత" యన జగత్ఖ్యాతముగను
సారూప్య మగుఁ "దత్ప్రసాదోపభోగేన
సారూప్య" మనఁగ నిస్సంశయముగఁ
గలుగు శివైకసుఖము "సుప్రసాదేన
పరశివస్స్వయ" మన భాసురముగ
|
|
|
సర్వభువనములకు జనకుం డనంగను
సురులు మునులు వొగడ సుస్థిరముగ
నీప్రసాదమహిమ నెఱుఁగఁజాలరు భువి
భక్తజనసుసంగ బసవలింగ!
| 67
|
|
ఒనర రుద్రపురాణసూక్తి "భుంక్తే శ్రద్ధ
యాన్వితం" బనుచు సమన్వితముగ
నా క్రియాతిలకంబునందున "భక్తగ
ణోచ్చిష్ట" మనుచు నత్యురుతరముగ
శివపురాణమునఁ "గించిద్విషగహసినీ
నీహై" యనంగ వినిర్మితముగ
నైరంతరంబును గోరి "గణప్రసా
దీ" యంచు నిబ్భంగి మ్రోయు శ్రుతులు
|
|
|
దగిలి సకలప్రసిద్ధసాదంబుఁ గొనఁగఁ
జెప్పలేదె "తేనసహభుంజీత" యనుచు
మఱియు భక్తప్రసాదంబుమహిమ వేద
పారగులు తాము దెలియరే బసవలింగ!
| 68
|
|
ధీయుతంబుగ మహాదేవస్యపాదోద
కవిధిఁ జెప్పును నుపక్రమము మీఱ
శ్రీకరంబుగఁ జెప్పు శ్రీశంభుపాదోద
కము శుభం బనుచుఁ ద్రికాలములను
రూపించు శ్రుతులను "రుద్రతీర్థం చ పి
బంతి" యారూఢబాహ్యాంతరముల
సత్యంబుగా "ఋతం సత్యం పరబ్రహ్మ"
మని వేదవాక్యముల్ వినుటఁ గాదె
|
|
|
యిటులు వేదజాల మేకమై ఘోషింప
విబుధు లట్టివేదవిధము లెల్ల
నెఱిఁగి యెఱిఁగి పార్వతీశుపాదోదక
బాహ్యు లగు టదేమి బసవలింగ!
| 69
|
|
పావనం బగును శ్రీపార్వతీశ్వరు మదిఁ
గోరి పాదాంబువుల్ గొనినమాత్రఁ
జెందుఁ గామ్యాభీష్టసిద్ధిప్రదాయక
మనఁగఁ బాదాంబువుల్ గొనినమాత్రఁ
దూలుఁ బాపము పాశజాలము పరిహార
మనఁగఁ బాదాంబువుల్ గొనినమాత్ర
ననునయింపఁగ "గళా నర్హంతి షోడశ"
యనఁగఁ బాదాంబువుల్ గొనినమాత్ర
|
|
|
నను పురాణయుక్తి చను "దశపూర్వద
శాపరా" యనంగ నట్ల శ్రుతుల
నెఱిఁగి యెఱిఁగి దుష్టు లీశుపాదోదక
బాహ్యు లగు టదేమి బసవలింగ!
| 70
|
|
నురుచిరంబుగ "గతం శూద్రస్య శూద్రత్వ"
మనుచు రహస్యంబులందు మ్రోయుఁ
జతురతరముగ "సచండాలవంశజో"
యనుచు నాగమములు నట్టె మ్రోయుఁ
జోద్యంబుగా "నంత్యజో వాధమోపివా"
యని శైవశాస్త్రంబులందు మ్రోయు
రూపితంబుగ "శ్వపచోపి మునిశ్రేష్ఠ"
యని యారుషేయంబులందు మ్రోయుఁ
|
|
|
గాన భక్తుఁ డగ్రగణ్యుఁ డంత్యజుఁ డైన
శ్రుతులు నమ్మరేనిఁ జూడుఁ డనుచుఁ
దగిలి నాగమయ్య తనువున నమృతంబు
పరగ వెడలలేదె బసవలింగ!
| 71
|
|
మునుకొని యితిహాసమున "సరుద్రో నాత్ర
సంశయ" యనుచుఁ బ్రశంస సేయు
మహితమౌ రుద్రాగమమ్ముల "తేనైవ
తు సరుద్ర" యనుచు నత్యుక్తిఁ బొగడు
రూపింప శాస్త్రముల్ "రుద్రలోకాత్పరి
భ్రష్టా" యటంచును బ్రణుతి సేయు
సత్యంబుగా నాదిసంహితలను "రుద్ర
మిహ భూతలే" యని యిల నుతించుఁ
|
|
|
గాన భక్తుఁ డగ్రగణ్యుండు హీనవం
శజుఁ డనంగరాదు చదివి చదివి
దవిలి నాగమయ్య తనువున నమృతంబు
పరగఁ గాంచలేదె బసవలింగ!
| 72
|
|
మును వీరభద్రీయమున "న యథాపూర్వ
భావనా" యనెడు సంబంధ మెఱిఁగి
ధర "లింగభేదకృతస్మేరపూరుషో
నరకం వ్రజే" త్తను న్యాయ మెఱిఁగి
చను కారణాగమమున "శివలింగశి
లాబుద్ధి" యనిన మూలం బెఱింగి
"ద్వాదశలోహముద్రాజ్జాత మౌలింగ"
మనిన తదీయాగమార్థ మెఱిఁగి
|
|
|
మొదల భక్తునిపూర్వంబు వెదకువాఁడు
పిదప లింగంబుపూర్వంబు వెదకువాఁడు
గాన జంగమలింగంబు హీనుఁ డనెడి
పాపమున కెద్ది నియతమో బసవలింగ!
| 73
|
|
మొదల శైవపురాణమున "శ్వపచోపి మ
మ ప్రియో" యనఁగ సమంచితముగ
మును పటు శ్రీలైంగ్యమున "మత్ప్రియశ్చతు
ర్వేది" యనుచుఁ జెప్పు విపులముగను
నొనరంగ నాస్కాందమున "శ్వపచో లింగ
పూజకో" యనఁగ విరాజితముగ
నెఱి "శ్వపచోపి మునిశ్రేష్ఠ యస్తు లిం
గార్చనే" యనఁగ నట్లతులితముగఁ
|
|
|
దప్ప కిటులు శ్రుతులు తర్కించి పొగడంగ
నలరుఁ గాన శ్వపచుఁ డైన భక్తి
పరుఁడె యుత్తముండు పరికించి చూడంగఁ
బశుపతిప్రియుండు బసవలింగ!
| 74
|
|
ధృతి "వస్త్రమాత్రం యదృచ్ఛయా" యనుచు నే
ర్పడ వస్త్రదానంబుఫలముఁ జెప్పు
మహి "సువర్ణం చాణుమాత్రకం" బనుచు నే
ర్పడ స్వర్ణదానంబుఫలముఁ జెప్పు
నేమింప "గోష్పాదభూమిమాత్రం" బనఁ
బరగిన భూదానఫలముఁ జెప్పు
నుపమింప "ధేనుబహూపయోధర" యనఁ
బరగ గోదానంబుఫలముఁ జెప్పు
|
|
|
లింగసారంబునందలి లైంగ్యధర్మ
మట్లు గావున నిత్యలింగార్చనునకు
నర్థిమై దానములు సేయునతఁడు సెందు
ఫలము శక్యమె గణుతింప బసవలింగ!
| 75
|
|
సంధిల్ల శివధర్మశాస్త్రంబు "తత్ఫలం
శివయోగినో" యని చెప్పుఁ గాన
సఫలత "సప్రమాణఫలార్థిభ్యో" యని
చెలఁగి శాస్త్రము నుతి సేయుఁ గానఁ
జిత్రంబుగా నందు "తత్రభుంక్తే మహా
దేవో" యనుచుఁ బ్రీతిఁ దెలుపుఁ గాన
స్కాందంబునందు లైంగ్యంబునఁ "దద్దాన
మణ్వపి చాక్షయం" బనెడుఁ గాన
|
|
|
నతిశయించునట్లు శ్రుతులు "తేనానంత"
యనుచు మ్రోయుఁ గాన నధముఁడైన
నతఁడు పూజ కర్హుఁ డతఁడు పాత్రుఁడు శివ
భక్తుఁ డతఁడు గాఁడె బసవలింగ!
| 76
|
|
అనయంబు వాయవ్యమునను సంభాషణ
ముత్తమం బనుచు సదుత్తరముగఁ
బొందుగ లైంగ్యంబునందు సంభాషణ
ముక్తి యటంచు సమ్మోదితముగ
సత్యంబు శివధర్మశాస్త్రంబునందు శై
వానంద మనుచును నతులితముగ
నొనర విష్ణుపురాణమున "సకృ త్సంభాష
ణా దపి" యనుచు సంపాదితముగ
|
|
|
మ్రోయునట్టి వేదంబుల నాయతముగ
"తేన సహసం వసే" త్తనుదానభక్తి
పరులతో నాచరించు సంభాషణముల
ఫల మెఱుఁగ నల్పులతరంబె బసవలింగ!
| 77
|
|
ప్రఖ్యాతిగా "శివభక్తస్య దర్శనం"
బనుచు శ్రీలైంగ్యంబునందు మ్రోయ
నవ్యంబుగా "దర్శనా దపి" యని శివ
ధర్మంబులెల్ల నుదాత్తత నన
నాదట "శివదర్శనా దపి తోషా" య
నియు భృగుసంహిత నెమ్మి మ్రోయ
నొనర విష్ణుపురాణమున "దర్శనా చ్ఛివ
భక్తస్య" యని ప్రీతిఁ బలుకునట్ల
|
|
|
పరగ శాస్త్రములను బ్రకటింప సద్భక్త
దర్శనంబు శంభుదర్శనంబు
గాన భక్తజనులఁ గన్నంత నగు మోక్ష
పదవి యొం డదేల బసవలింగ!
| 78
|
|
తారకబ్రహ్మంబుఁ గోరి శ్రీకాశిలోఁ
జచ్చినఁగాని మోక్షంబు లేదు
యనురక్తిఁ గేదారమున నుదకముఁ ద్రావఁ
గలిగినఁగాని మోక్షంబు లేదు
"పాశమోక్షా" యనఁ బాశుపతవ్రత
గామికిఁగాని మోక్షంబు లేదు
శ్రీపర్వతంబున శిఖరాగ్రశృంగంబు
గాంచినఁగాని మోక్షంబు లేదు
|
|
|
మ్రొక్కఁగన్నఁ జాలు "ముక్తికిలేప్సితా"
యనఁగ భక్తవరులఁ గనినమాత్ర
శ్రుతులలోన నింతసులభ ముండఁగ మోక్ష
పదవి కించ యేల బసవలింగ!
| 79
|
|
వ్యక్తంబుగా "శివభక్త మహం వ్రజే"
త్తన శివధర్మంబునందు మ్రోయ
నచ్చెరు వంద "గృహం దేవమందిరం"
బనుచుఁ దత్సూక్తంబునందు మ్రోయ
సత్యంబుగాఁ "దత్రసన్నిహిత శ్శివ"
యని వాయవీయంబునందుఁ బల్క
భ్రాజితం బగుఁ "దత్రయోజనపర్యంత"
మని తత్పురాణంబునందుఁ దెల్ప
|
|
|
నట్లు రూపించి శ్రుతులు నిరంతరంబు
"తేన సహనం విశే" త్తనుఁ గాన భక్త
జనగృహాంగణముల కెన్న సరియె ధాత్రిఁ
బరగుచుండెడు క్షేత్రముల్ బసవలింగ!
| 80
|
|
వ్యక్తంబుగా "శివభక్తా ననశ్యంతి"
యనుచు శ్రీస్కాందంబునందు మ్రోయుఁ
దథ్యంబు గాఁగ "మద్భక్తా" ననశ్యంతి
యనుచు నా సౌరంబునందు మ్రోయుఁ
బరమార్థముగను "మే భక్తా ననశ్యంతి"
యని శివధర్మంబునందు మ్రోయుఁ
బనివడి "న క్షయం భవతి శ్రీలింగపూ
జా" త్తనుచును శైవసరణి మ్రోయు
|
|
|
నట్లు "మృక్షీయమామృతా" త్తనుచు శ్రుతులు
మ్రోయుఁ గాన విష్ణు విరించి ముఖ్యసురులు
ప్రళయజన్మప్రయుక్తులు భక్తజనులు
ప్రళయజన్మనిర్ముక్తులు బసవలింగ!
| 81
|
|
మహి యెల్ల నెఱుఁగంగ మత్స్యకేశ్వరు లంక
హరి మత్స్యరూపంబునందుఁ గొల్వ
మున్ను దాను సముద్రమునఁ గూర్మనాథుని
హరి కూర్మరూపంబునందుఁ గొల్వ
నొనర గంగాతీరమున వరాహేశ్వరు
హరి వరాహాంగంబునందుఁ గొల్వ
సేతువందున మఱి శ్రీలింగమూర్తిని
హరి రామజన్మంబునందుఁ గొల్వఁ
|
|
|
దవిలి యూర నూర శివమహాసల్లింగ
మూర్తి నాదివిష్ణుమూర్తి గొల్వ
యితరు లేలొకో మహేశ్వరుఁ గొలువక
భవనిమగ్ను లైరి బసవలింగ!
| 82
|
|
స్రష్ట దాఁ గౌమారసర్గబ్రహ్మకుఁ బుట్టి
శంభుఁ గొల్వఁడె బ్రహ్మచర్యవృత్తి
వృషలికి నుదయించి విషకంఠుఁ గొల్వఁడే
నారదుం డనఁ దపోధీరవృత్తి
నిల నరనారాయణులు నాఁగలింగరూ
పములఁ గొల్వరె కళాప్రౌఢి మెఱసి
కపిలుండు దా సాంఖ్యకర్తృత్వ మాశించి
వరతపోనిష్ఠఁ గొల్వండె శివుని
|
|
|
యిట్టు తా ధర విష్ణుండు పుట్టి కూర్మి
నెసఁగఁ గులదైవ మనుచు భజించి మఱియు
మఱచి మదియించి రుద్రుచే మడియుటయును
భాగవత మిట్లు పల్కదే బసవలింగ!
| 83
|
|
అదితికి నవరజుం డనఁ బుట్టి యింద్రున
కనుజుండు గాఁడె వామనుఁ డనంగ
సత్యవతికిఁ బరాశరుఁ డనుమునికిని
వ్యాసుఁ డనన్ గొడు కయ్యెఁ గాదె
మేరుదేవికి నాభిమేదినీపతికిని
వృషుఁ డను జనుఁ డుద్భవించెఁ గాదె
యనసూయ యనుసతి కత్రియ న్మునికి ద
త్తాత్రేయుఁ డనఁ గొడు కయ్యెఁ గాదె
|
|
|
యిట్టు తా ధర విష్ణుండు పుట్టి కూర్మి
యెసఁగఁ గులదైవ మనుచు భజించి మఱియు
మఱచి మదియించి రుద్రుచే మడియుటయును
భాగవత మిట్లు పల్కదే బసవలింగ!
| 84
|
|
శర్వుఁ గొల్వఁడె యష్టషష్టితీర్థములందుఁ
బృథుఁ డనఁ బుట్టి యీ పృథివిమీఁద
మోహినీదేవికి మొదల ధన్వంతరి
నాఁ బుట్టి కొల్వఁడె నాగభూషు
నింద్రానుజుం డన నీశు భజింపఁడే
యసురాపహరణకార్యార్థమునను
గృష్ణుఁ డనఁగఁ బుట్టి కృష్ణేశుఁ గొల్వఁడే
శ్రీకాశియందు విశిష్టభక్తి
|
|
|
యిట్టు తా ధర విష్ణుండు పుట్టి కూర్మి
యెసఁగఁ గులదైవ మనుచు భజించి మఱియు
మఱచి మదియించి రుద్రుచే మడియుటయును
భాగవత మిట్లు పల్కదే బసవలింగ!
| 85
|
|
హరి దేవకికిఁ బుట్టె ననుపురాణము విండ్రు
హరి పుట్టె నీశున కనుట వినరు
హరి మ్రొక్కెఁ గొంతికి ననుపురాణము విండ్రు
హరి మ్రొక్కె నీశున కనుట వినరు
హరి బుద్ధపదవర్తి యనుపురాణము విండ్రు
హరి శైవపదవర్తి యనుట వినరు
హరి చచ్చె బోయచే ననుపురాణము విండ్రు
హరి చచ్చె శరభుచే ననుట వినరు
|
|
|
హరియుఁ గ న్నిచ్చె నరునకు ననుట విండ్రు
హరియుఁ గ న్నిచ్చె నీశున కనుట వినరు
జ్ఞానహీనులు మూర్ఖు లజ్ఞానరతులు
పాపమతు లెట్టిదుష్టులో బసవలింగ!
| 86
|
|
హరి వీరశైవుఁ డన్నందుకు మఱియు గ
ర్భాదానఖండమే ప్రథమసాక్షి
హరి వీరశైవుఁ డన్నందుకు దననేత్ర
కమల మొసంగినక్రమము సాక్షి
హరి వీరశైవుఁ డన్నందుకు శంకరు
చేతఁ బొందిన శివగీత సాక్షి
హరి వీరశైవుఁ డన్నందుకు శ్రీసాంబుఁ
డనెడిపుత్త్రునిఁ బడసినదె సాక్షి
|
|
|
యిన్నిసాక్షులుఁ గాకయ పన్నుగాను
ధ్యేయుఁ డని శంభుఁ బూజించుతెలివి సాక్షి
కాని సద్ధర్మములను నిక్కం బటంచుఁ
బలుక నొల్లరు కూళ లో బసవలింగ!
| 87
|
|
ఆదిమూలం బైన యమృతంబుఁ ద్రచ్చుచో
ఫణివిషజ్వాలకుఁ బాఱనేల
పదునాల్గుభువనంబు లుదరంబులో నున్నఁ
బగతుఱచే బాధ పడఁగనేల
విశ్వమంతయుఁ దానె వేలుపై నెగడినఁ
గొడుకుఁ జంపఁగఁ జూచి కొఱలనేల
తా నగ్రదైవమేఁ దనకర్మముుల వాయ
శివప్రతిష్ఠలు పూని సేయనేల
|
|
|
యిట్టి వన్ని చదివి యిలఁ గమలాక్షుండె
దైవ మనుచు మిగులఁ దలఁచి తలఁచి
యభవు మఱచి కొంద ఱైహికాముష్మిక
భ్రష్టు లగు టదేమి బసవలింగ!
| 88
|
|
తగిలి వరాహావతారంబుఁ జెప్పుదు
రది కార్తికేయుచే నణఁగె ననరు
నరసింహుఁ డుగ్రదానవుఁ జంపె నందురు
మఱి శరభేశునిమహిమ వినరు
వ్యాసుండు చే యెత్తె నని పల్కుచుందురు
కని నందికేశుండు తునిమె ననరు
ఘనుఁడు త్రివిక్రముఁ డనుమాటలే గాని
వీఁపు పెళ్ళున శూలి విఱిచె ననరు
|
|
|
ఏమి చెప్ప భక్తిహీనపౌరాణికు
లైన దుష్టమానవాధములను
జూడరాదు వారిఁ జూడ దోషము భక్తి
పరుల నంటు మిగుల బసవలింగ!
| 89
|
|
గుడిగుడిఁ దప్పక వడిఁ గోలుపడగలై
క్రాలెడు వ్యాసునికరముఁ జూచి
వీరభద్రునిమ్రోల వినతుఁడై మేషంబు
తలఁ దాల్చియున్నట్టి దక్షుఁ జూచి
యేనాఁట నేయూర నేవీథి నేగుడి
హరుఁడు దాఁ బూజార్హుఁ డగుటఁ జూచి
యెల్లవారును జూడ నేఁటేఁట నూరూర
గ్రామోత్సవంబులక్రమముఁ జూచి
|
|
|
యిదియుఁ గాక "ఏక ఏవ రుద్రో" యంచుఁ
బల్కుశ్రుతులఁ జదివి పరగఁ జూచి
భవునిఁ గొల్వ కేల ప్రాకృతు లిటు పర
బ్రహ్మదూరు లైరి బసవలింగ!
| 90
|
|
అఖిలంబు విష్ణుమయం బైన నడవులఁ
బడి యాలిఁ గోల్పోయి యడలనేల
మూల మింతకునైన వాలిసుగ్రీవు లే
ర్పఱుపంగ లేక దా భ్రమయనేల
పుడమియంతయు రెండె యడుగులు నగునేనిఁ
గడఁగి దా లంకకు నడువనేల
వనధియంతయు నమ్ముమొనకుఁ దే నేర్చినఁ
గపులు తోడుగ వార్ధిఁ గట్టనేల
|
|
|
యట్టు లెఱిఁగి యెఱిఁగి హరి దైవ మనుచును
సభలఁ గూర్చి మధ్యఁ జదివి చదివి
యభవు మఱచి కొంద ఱైహికాముష్మిక
భ్రష్టు లగు టదేమి బసవలింగ!
| 91
|
|
ఒండేమి విష్ణుని కుత్పత్తి గలుగుట
కును జయదష్టమిదినము సాక్షి
శార్జ్గికి సంసారసంగతిదుస్థితి
సిద్ధమై యునికికి సీత సాక్షి
యచ్యుతునకుఁ గూలు టది తెల్ల మనుటకు
భువిఁ జరుం డనియెడుబోయ సాక్షి
హరి కిట్టిభవము లనంతంబు లగుటకు
మత్స్యకూర్మాదిజన్మములు సాక్షి
|
|
|
యతఁడు శివునిశిష్యుఁ డగుటకు రామేశ్వ
రాదిసుప్రతిష్ఠ లవియె సాక్షి
యట్టివిష్ణువునకు నభవు నక్షరుఁ బరా
త్పరునిఁ బోల్ప నగునె బసవలింగ!
| 92
|
|
భృగునిశాపంబునఁ దగిలి జన్మించుట
పట్ట మప్పుడె దిశాపట్ట మగుట
నడవుల కేఁగుట జడలు ధరించుట
మారీచుమాయల మరులుకొనుట
యాలిఁ గోల్పోవుట వాలిఁ జంపుట తారఁ
దెచ్చి సుగ్రీవున కిచ్చుటయును
గోఁతులఁ దోడుగాఁ గూర్చుట బలమెల్లఁ
గడచినవారికిఁ గట్టువడుట
|
|
|
రావణుని వధించి బ్రహ్మహత్మ హరింపఁ
గోరి రామనాథుఁ గొలుచుటయును
హరికిఁ బౌరుషములె యవియెల్ల శ్రేష్ఠంబె
వసుధఁ బుణ్యకథలె బసవలింగ!
| 93
|
|
ఎన్న గృహాంతర్బహిర్వ్యాపకులలోన
నందఱుఁ గర్తలే యరసిచూడ
నెన్న గ్రామాంతర్బహిర్వ్యాపకులలోన
నందఱుఁ గర్తలే యరసిచూడ
నెన్న దేశాంతర్బహిర్వ్యాపకులలోన
నందఱుఁ గర్తలే యరసిచూడ
నెన్న లోకాంతర్బహిర్వ్యాపకులలోన
నందఱుఁ గర్తలే యరసిచూడ
|
|
|
నట్ల "వ్యాప్త నారాయణో" యనఁగ వ్యాప
కులకుఁ గలదె కర్తృత్వంబు గలదె హరికి
నెలమి శ్రుతియు "జగత్పతయే" యనంగ
భర్గుఁడే జగత్పతి గాక బసవలింగ!
| 94
|
|
కడఁగి "రుద్రాయ మఖఘ్నాయ" యన వీర
భద్రుఁడె పో మఱి రుద్రుఁ డనఁగఁ
గడఁగి "యింద్రాయ మఖఘ్నాయ" యన సాక్షి
యగు నింద్రు మఖహర్త యనఁగ నగునె
నలి "నగ్నయే మఖఘ్నాయ" యనంగ న
య్యగ్ని మఖాంతకుం డనఁగఁబడునె
వెలయ "నమో విష్ణవే" యన శైవపం
చాక్షరి భాగవతాదులందు
|
|
|
విష్ణుఁ గూర్చినయుక్తులు వినుతులు మఱి
యనుమతింపఁగ నవి శంకరునకుఁ గాదె
"ఓ న్నమో బ్రహ్మణే" యనుసూక్తములను
భర్గునకు మ్రొక్కు వేదముల్ బసవలింగ!
| 95
|
|
ధీ యజుర్వేద "మాదిత్యవర్యం తమ
సః పరస్తా" త్తని చాటుచుండు
మఱి యుపనిషది "సమస్తసాక్షిం తమ
సః పరస్తా" త్తని చాటుచుండు
రహిని "దద్విష్ణోః పరం" బని లైంగ్యంబు
సౌరాదిసూక్తులు చాటుచుండు
నెఱయఁ దా నారాయణీయవాక్యము "తమ
సః పరస్తా" త్తని చాటుచుండుఁ
|
|
|
గాన "తమసః పరం" బనఁ గాంచుశబ్ద
మర్థ మదియు "విష్ణోః పరం" బనుచుఁ బొగడఁ
బరగ విష్ణునికంటెను బరమమైన
పదము శంభుండు చర్చింప బసవలింగ!
| 96
|
|
కారణాగమమున "నారా సరో రుద్ర"
యనుట నారాయణుం డనఁగఁ బరగెఁ
బొదలి లైంగ్యమున "నాపూర్వతేభి" యనంగఁ
జనుట నారాయణుం డనఁగఁ బరగె
శ్రీస్కాందసూక్తులఁ జెలఁగి "ఆపో నరా"
యనఁగ నారాయణుం డనఁగఁ బరగె
నదియుఁ గాక "విపక్షి" యనఁగఁ దార్క్ష్యాగతిఁ
జనఁ బక్షివాహనుం డనఁగఁ బరగె
|
|
|
"విష్ణు లుప్తా" యనంగను విష్ణువునకుఁ
బరశివ పరతత్త్వాదిక వ్యాపకత్వ
మున్నదే విష్ణునామాదు లెన్నిచూడఁ
బరమతత్త్వవాచక మెద్ది బసవలింగ!
| 97
|
ప్రకృతిపురుషనామములు
|
ఆది "నుమాసహాయం పరమేశ్వరం"
బనునట్లు వేదంబులందుఁ గలిగె
నట్టు "లుమాసహాయం పరమేశ్వరం"
బనుక్రియఁ గూర్మాదులందుఁ గలిగె
ధరఁ "బరమేశ్వరోంధకరిపు" రనుభాతి
నరయ నిఘంటువునందుఁ గలిగె
నిల "శంకరః పరమేశ్వరో" యనఁగ ని
మ్మాడ్కి సహస్రనామములఁ గలిగె
|
|
|
నిల మహేశ సర్వేశ విశ్వేశ ముఖ్య
మైననామముల్ పరమేశుఁ డనఁగఁ బరగు
నీశునకుఁ గాక యెందైన నితరసురుల
కెసఁగ నున్నవే చూడంగ బసవలింగ!
| 98
|
|
రూపింప నారాయణోపనిషత్తు "మ
హేశ్వరో" యనఁ గూళ లెఱుఁగ రెట్లు
రూఢి వెలుంగ శ్రీరుద్రోపనిషది "వి
శ్వేశ్వరో" యనఁ గూళ లెఱుఁగ రెట్లు
వర్ణనఁ దనరఁ గైవల్యోపనిషది "స
ర్వేశ్వరో" యనఁ గూళ లెఱుఁగ రెట్లు
మానుగా నందు "నుమాసహాయః పర
మేశ్వరో" యనఁ గూళ లెఱుఁగ రెట్లు
|
|
|
ఇల మహేశ సర్వేశ విశ్వేశ ముఖ్య
మైననామముల్ పరమేశుఁ డనఁగఁ బరగు
నీశునకుఁ గాక యెందైన నితరసురుల
కెసఁగ నున్నవె శ్రుతులలో బసవలింగ!
| 99
|
|
మొదల శ్రీఋగ్వేదమునఁ "బురుషం కృష్ణ
పింగళం" బనఁగను సాంగముగను
ఆ యజుర్వేదంబునందుఁ "దత్పురుషాయ
విద్మహే" యనఁగను విస్తరముగఁ
జను తదీయోపనిషత్సూక్తములఁ "బురు
ష కపిలవర్ణ సుశబ్దపూరు
షాఖ్యద నిర్ణయం" బనఁగ మూలంబుగా
సార "ముత్తమపురుషా" యనంగ
|
|
|
భవుఁడు పురుషుండు విష్ణుండు ప్రకృతి యట్టు
లగుటను నటు "విష్ణుర్యోని" యంచుఁ జెప్పు
శంకరుం డధిపతి యని చదివి చదివి
ప్రాకృతులు దీని నెఱుఁగరు బసవలింగ!
| 100
|
|
"రామరూపరతాచ్ఛరధి" యనంగను స్కాంద
సరణి రాముండు దా శరధిఁ జొచ్చె
వెండియు రాముండు విష్ణుపురాణోక్తి
"విలయం గతో" యన విలయ మొందె
"వ్యక్తంచ మానుషం" బనఁగఁ గృష్ణపురాణ
మునఁ గాదె కృష్ణుండు ముక్తుఁ డయ్యెఁ
బాళి నొక్కఁడు "బలభద్రోపి నంత్యజే"
త్తనఁ గాదె బలభద్రుఁ డడవిఁ బడియె
|
|
|
బుద్ధుఁ డనువాఁడు వేదవిరుద్ధుఁ డయ్యెఁ
గల్కి యనువాఁడు జగదపకారి యయ్యె
విష్ణునవతారముల్ గూడ విరళ మయ్యెఁ
బ్రమథవర్గంబుచేఁ గాదె బసవలింగ!
| 101
|
|
ఈరేడులోకంబు లిమ్ముగాఁ దనలోనఁ
దవి లిడుకొన్నట్టి దైవ మండ్రు
ప్రబలుఁడై తనసతి రావణుఁడు హరింప
నేలోకములనుండి యేఁగె చెపుమ
చక్రి కెన్నటికిని జావు పుట్టుక లే ద
నాదిమూలం బండ్రు సాదరముగఁ
దవిలి యా పదియవతారముల్ తా నటు
పుట్టుక చావక యెట్లు వచ్చె
|
|
|
భవుఁడె దైవ మనుచుఁ బాటించి యేప్రొద్దు
ధాటి మీఱ శ్రుతులు సాటిచెప్పఁ
బరగఁ జదివి చదివి ప్రాకృతు లేలొకో
భక్తిబాహ్యు లైరి బసవలింగ!
| 102
|
|
హరి యజ్ఞపురుషుండు హరుఁడు యజ్ఞేశ్వరుం
డనినవాక్యం బెర్గరయ్య నరులు
హరియు జగత్కర్త హరికి భవుఁడు కర్త
యనినవాక్యం బెర్గరయ్య నరులు
హరి విశ్వమయుఁడు శంకరుఁడు విశ్వాధికుం
డనినవాక్యం బెర్గరయ్య నరులు
హరి ప్రకృతి తదీయపురుషుండు శంకరుం
డనినవాక్యం బెర్గరయ్య నరులు
|
|
|
బుధులు నిర్వచింపఁ బొలుచుఁ "దద్విష్ణోః ప
రం" బనఁగను శ్రుతి శిరఃప్రసూక్తి
విన రదేమొ శివుఁడు విష్ణునికన్నను
బరమపద మనంగ బసవలింగ!
| 103
|
|
ధరలోన విష్ణువే దైవ మటంచును
జెప్పిన వేదంబు లొప్పు టెట్లు
చనునె ఱంకాడ "యోషాచార" యనుచు వే
దంబులు చెప్పినఁ దప్పు గాదె
సుర ద్రావఁ గూడునే శ్రుతి సురాపానము
నొప్పిన నది మఱి తప్పు గాదె
పశుపతి రుద్రుండు "పశుమా లభే" త్తన
నరయంగ మఱియుఁ ద ప్పగును గాదె
|
|
|
యట్ల విష్ణ్వాదులను శ్రుతులందుఁ జెప్పె
హరికి దాసుండు వ్యాసుఁ డటండ్రు గిరిజ
పతికి దాసుం డటంచును బల్క రేమి
భర్గుమహిమంబుఁ దెలియరు బసవలింగ!
| 104
|
|
నందికేశుఁడు చేయి నాచికొన్నను విష్ణుఁ
బాసి వ్యాసుఁడు శివదాసి గాఁడె
క్షువుఁడు దధీచిచేఁ గూలఁగా సరసిజాం
బకుని విడిచి భర్గుబంటు గాఁడె
భామలఁ గోల్పోయి పర్వతనారదుల్
హరి నొల్ల కీశుకింకరులు గారె
శ్రీవాసుదేవుండు గోవిందు విడిచి యా
ఖండేందుధరునిభక్తుండు గాఁడె
|
|
|
ధరను వీరు శివునిదాసులై కేశవు
విడిచి శైవు లైరి వివిధగతులఁ
గాన శివుఁడె యాదికర్త యౌటకు వేఱె
ప్రత్యయంబు లేల బసవలింగ!
| 105
|
|
వ్యాసుండు హరి కర్త యన నటు త్రెళ్ళుట
విష్ణువాదులు వాని విడువవలదె
తానె బ్ర హ్మన బ్రహ్మతలను బోఁ జిదిమిన
బ్రహ్మవాదులు నెడఁ బాపవలదె
యద్వైతమతి నుష్ట్ర మయ్యెను మునికుమా
రుం డని యది యొల్లకుండవలదె
కర్మంబు నూఁది లింగము గోలుపడ్డ భ
ట్టాచార్యుమతముఁ గాదనఁగవలదె
|
|
|
తొల్లి శివుని విడిచి దుర్మార్గవర్తులై
యెనసి చెడ్డవారి నెఱిఁగి యెఱిఁగి
యున్నవారుఁ జెడుట యుక్తియే యీశ్వర
భక్తి నాత్మ లేక బసవలింగ!
| 106
|
|
బోధాయనస్మృతి "నాధి కుర్వంతి త
ద్గంగా" యనంగ నెఱుంగ రెట్టు
లజ్ఞాను లెఱుఁగక యం "దయోనిప్ర" నాఁ
జనుశ్రుతి యెన్నఁడు చదువ రెట్లు
నలి గౌతమస్మృతి యలరి "భిన్నాంకయే"
త్తనెడివాక్యంబులు వినరె యట్లు
యిల "నాంకయే న్నదహే ద్విప్ర" యనుచు య
మస్మృతి యనునది మఱచి రెట్లు
|
|
|
ఆదిరూపంబులందు దూష్యంబు లైన
శంఖచక్రాదిలాంఛనసమితిఁ దాల్చు
వారిమాటలు నమ్మి శ్రీవామదేవు
భక్తి మఱచి నటింతురు బసవలింగ!
| 107
|
విష్ణుభక్తులు శివభక్తు లగుటకుఁ గారణము
|
ఏర్పడ సూతసంహిత "నకుర్యా న్న చ
ధారయే" త్తనఁగ "నధార్య" మనఁగ
మును వామనపురాణమునను "దేహే న చ
ధారణం" బనఁగ "నధార్య" మనఁగ
ఆ పరాశరసూక్తు లటు "నదహేచ్ఛంఖ
పూర్వకై" యనఁ దప్పు పొందు ననఁగ
యజ్ఞవైభవమున "నాధి కాది నచలాం
ఛిత" యన దుర్గతిఁ జెందు ననఁగ
|
|
|
శంఖచక్రాదిలాంఛనసమితిఁ దాల్చు
నట్టివారలతో మాట లాడఁదగదు
శ్రుతు లిటుల "అర్ధచంద్రం చ శూల" మనఁగఁ
బ్రాకృతులు దీని నెఱుఁగరు బసవలింగ!
| 108
|
|
స్కందసూక్తులఁ "జిదాకారేణ శస్త్రేణ
భిద్యతే" యన నివి పెట్టఁదగునె
ధరియింతురే పరాశరపురాణము "మను
ష్యః పాపకర్మిణ" యనఁగఁ గ్రమము
లలి "నూర్ధ్వకం వర్తులం చార్థసార్థకం"
బనుచు శాంభవమార్గ మలరి మ్రోయ
నొగి సూతసంహిత "నోర్ధ్వపుండ్రం చ ల
లాటే" యనంగఁ దాల్పంగఁదగునె
|
|
|
ఆదిమునులచే దూష్యంబు లైన యూర్ధ్వ
పుండ్రములు దాల్చు నపగతపుణ్యరతుల
నైహికాముష్మికవిరహితార్థమతులఁ
బ్రాకృతులఁ గాంచఁ బోలునే బసవలింగ!
| 109
|
|
ఆది వేశ్యాపుత్రుఁ డయ్యు వసిష్ఠుండు
శివభక్తిచేత విశిష్ఠుఁ డయ్యె
బోయెతకడుపునఁ బుట్టినవ్యాసుండు
శివభక్తిచేత విశిష్టుఁ డయ్యె
వ్యాధుఁ డైయుండియు వాల్మీకుఁ డనుముని
శివభక్తిచేత విశిష్టుఁ డయ్యె
నజ్ఞుఁడౌ మాతంగుఁ డనెడుచండాలుండు
శివభక్తిచేత విశిష్టుఁ డయ్యె
|
|
|
మఱి యధమయోనుల న్బుట్టి మహిమ నెగడి
పూర్వములు వీడి జగమునఁ బూజ్యు లైరి
శ్రీమహాదేవుకరుణచే శ్రేష్ఠు లగుచు
బ్రాహ్మణోత్తము లైరి పో బసవలింగ!
| 110
|
|
తగ "దురితక్షయార్థం పరమేశ్వర
ప్రీత్యర్థ" మని యాచరింపఁ బ్రణవ
రతి "దురితక్షయార్థం పరమేశ్వర
ప్రీత్యర్థ" మని యెల్లక్రియలు నడుపఁ
బ్రతి "దురితక్షయార్థం పరమేశ్వర
ప్రీత్యర్థ" మని సంధ్యఁ బ్రీతి సేయఁ
దగ "దురితక్షయార్థం పరమేశ్వర
ప్రీత్యర్థ" మని హవిఁ బ్రీతిఁ బెట్టఁ
|
|
|
దానఁ బ్రీతుఁడై యట్ల తత్కర్మఫలము
లిచ్చు శ్రీశంకరుం డుండ నితరసురులఁ
గొలుతు రేలొకొ భవవార్ధిఁ గూలఁదలఁచి
ప్రాకృతాధము లెల్లను బసవలింగ!
| 111
|
|
ఘనశ్రుతి "పరమలింగాయ నమో" యనఁ
"బరమలింగం" బన హరుఁడు గాఁడె
పరికింపఁగా "నమః పరమాత్మనే" యనఁ
"బరమాత్ముఁ" డనఁగ నా హరుఁడు గాఁడె
చర్చింపఁగా "ఋతం సత్యం పరబ్రహ్మ"
యనఁ "బరబ్రహ్మంబు" హరుఁడు గాఁడె
యట్ల "ఉమాసహాయః పరమేశ్వర"
యనఁ "బరమేశుండు" హరుఁడు గాఁడె
|
|
|
తివిరి పరశివలింగమూర్తికిని గాదె
మొదలఁ బరశబ్ద ముత్కృష్టపదము గాన
యిట్టి పరమేశనామ ముపేంద్రముఖ్య
భవనిమగ్నుల కున్నదే బసవలింగ!
| 112
|
|
ఉపనయనాది "రుద్రోపదిష్టము నాభ్యు
దేకం పిబ" వ్యక్త మెసఁగఁ జేసి
శ్రీనందికేశ్వరప్రీత్యర్థ మని నంది
ముఖమున నిష్టార్థమును విధించి
యా ప్రణవాదిగాయత్రిప్రదానంబు
శివు భర్గు ప్రార్థనఁ జేసి పడసి
అగ్నిహోత్రాదుల నగు "భూతిమేదావి"
యనుచు సర్వాంగంబులందుఁ దాల్చి
|
|
|
రుద్రవేష్టి యౌ సత్క్రియారూఢి శూద్ర
జన్మనిర్వృత్తిఁ బొంది ద్విజన్మ మంది
వేదవిదుఁ డౌట బ్రహ్మ సద్విధిఁ జరించె
బ్రాహ్మణుం డౌటకే గదా బసవలింగ!
| 113
|
|
ఓంకార మను బీజ ముత్పత్తియై మఱి
యెవ్వనితేజమం దిమిడియుండె
వెన నజాండము లెల్ల విషవహ్ని నెరియునాఁ
డెవ్వనిమాహాత్మ్య మెఱుఁగవచ్చె
వీరభద్రుఁడు దక్షుఁ జేరి చంపిన నెవ్వఁ
డడ్డమై తప్పించి యతనిఁ గాచెఁ
దానె బ్ర హ్మన బ్రహ్మతలఁ ద్రుంచివైచిన
మీఱి నాఁ డెవ్వండు మెలఁగఁగలిగె
|
|
|
ఆదికారణుఁ డవ్యయుం డార్తవరదుఁ
డభిమతార్థప్రదాయకుం డప్రమేయుఁ
డాగమాతీతుఁ డై నట్టి హరుని నెఱిఁగి
వసుధ శివు నమ్మ రేలొకో బసవలింగ!
| 114
|
|
తప్పక నిత్యంబు "తత్సవితుర్వరే
ణ్య" మని ప్రాణాయామ మాచరించి
తప్పక నిత్యంబు "తత్సవితుర్వరే
ణ్య" మని ముమ్మాఱు దా నర్ఘ్య మెత్తి
తప్పక నిత్యంబు "తత్సవితుర్వరే
ణ్య" మని గాయ త్రనయంబుఁ జెప్పి
తప్పక నిత్యంబు "తత్సవితుర్వరే
ణ్య" మనుచు హవ్యకవ్యములు వెట్టి
|
|
|
ప్రణవమూర్తి భర్గుఁ బరితృప్తిఁ జేసి త
త్ఫలము నీశుచేతఁ బడసి యితర
సురులఁ గొల్వ భక్తి సుస్థిరంబై క్రియా
ఫలము సఫల మగునె బసవలింగ!
| 115
|
అశుచినిరసనము
|
ఆదిని విశ్వదేవార్పితాన్నమునందుఁ
బ్రాణాహుతులు పెట్టఁబడునెయేని
ఆపితామహరుద్రరూపార్పితాన్నంబు
ప్రాణాహుతులు పెట్టఁబడునెయేని
భవ్యమహాదిత్యభావార్పితాన్నంబు
ప్రాణాహుతులు పెట్టఁబడునెయేని
బ్రహ్మార్పణం బైన పరమామృతాన్నంబు
ప్రాణాహుతులు పెట్టఁబడునెయేని
|
|
|
అట్ల విష్ణ్వర్పితాన్నంబు లగునయేని
శివుప్రసాద మెటులు దా నిషేధ మయ్యెఁ
దవిలి "హరభుక్త శేషం దదాతి" యనఁగ
బ్రాహ్మణు లెఱుంగ రేమొకో బసవలింగ!
| 116
|
|
శ్రుతిరత్న మైన యజుర్వేదసూక్తంబు
పలుమాఱు "నో మితి బ్రహ్మ" మనఁగ
నేపార నారాయణోపనిషత్తు "స
ద్బ్రహ్మపదాప్నోతి పరమ" మనఁగ
నెఱయంగ లైంగ్యోపనిషదియందును "నమృ
తం బ్రహ్మయోనిం తథా" యనంగ
వెలయ నధర్వణవేదసూక్తియును "ప
శ్యంతి సూరయొ" నాఁగ సాంగమైన
|
|
|
స్కాంద పారాశ రాదిత్య సౌర లైంగ్య
కూర్మ బ్రహ్మపురాణసంకులమునందు
రుద్రసాకారసిద్ధాంతరూపణంబు
బ్రహ్మ మని చెప్పఁబడు గాదె బసవలింగ!
| 117
|
|
విశ్రుతంబుగ యజుర్వేదంబు "రూపమి
వాస్య" యనుచు నిశ్చయంబు పలుక
వినుతింప "రూపతత్త్వే తథా సేవాం చ
హో చ యే" త్తనఁగ హంసోపనిషది
నెఱయంగఁ దత్త్వోపనిషది దా "సోహ మా
త్మా" యటంచును మనమారఁ బొగడ
తథ్యంబు సూతగీతయు ధర "కారుణ్య
వన్మూర్తి" యనుచుఁ గేవలము చదువ
|
|
|
మఱియు మానవాద్యఖిలనిర్మలపురాణ
ములును సర్వోపనిషదర్థములును జేర్చి
మంగళజ్యోతిరాకారలింగమూర్తి
భజనమే బ్రహ్మ మని చెప్పు బసవలింగ!
| 118
|
|
మున్ను యజుర్వేదమున "ఋతం సత్యం ప
రబ్రహ్మ" యనఁ బరబ్రహ్మ శివుఁడు
రమణ నధర్వశిరస్సూక్తి "తత్పరం
బ్రహ్మేతి" యనఁ బరబ్రహ్మ శివుఁడు
చాటు బ్రహ్మోపనిషత్తు "నతత్పరం
బ్రహ్మేతి" యనఁ బరబ్రహ్మ శివుఁడు
అదియును "నద్వితీయం పరమాత్మ త
ద్బ్రహ్మేతి" యనఁ బరబ్రహ్మ శివుఁడు
|
|
|
"ఏక ఏవ రుద్రో" యన నేక మగుట
నియతిఁ దలపోయలేకయే నిఖిలమైన
వేల్పులను గొల్చి చెడుదురు వివిధగతుల
బ్రహ్మ శివుఁ డని తెలియరు బసవలింగ!
| 119
|
|
అసమపరాశరీయంబున "బ్రాహ్మణో
భగవా" నన శివుఁడు బ్రాహ్మణుండు
తప్పక యా "క్షత్రియః పరమో హరి"
యనఁగను క్షత్రియుం డచ్యుతుండు
విస్తరింపఁ "బితామహస్తు వైశ్యశ్చ" నా
నొనరంగ ధరను వైశ్యుండు బ్రహ్మ
లక్షింపఁగా "వృషలస్తు పురందరో"
యనఁగ శూద్రుండు దా నమరవిభుఁడు
|
|
|
యట్ల సామంబు "బ్రాహ్మణోస్మ్యహ" మనంగ
శివుఁడు శ్రేష్ఠుండు హరి విరించియును హరియు
నట్లు క్షత్రియ వైశ్య శూద్రాదు లనఁగ
భర్గుసము లౌదురే వీరు బసవలింగ!
| 120
|
|
శ్రుతియట్ల సూతసంహిత "పరబ్రహ్మ శాం
భవ" మటంచును శివుఁ బ్రస్తుతింప
రమణ మానవపురాణము "ఋతం సత్యం ప
రబ్రహ్మ" యనుచుఁ గీర్తనలు సేయ
నిల "సత్పరబ్రహ్మ ఈశాన" యనుచు నా
దిత్యపురాణంబు దివిరి పొగడ
రహి "ఏక మేవ పరబ్రహ్మ" యనుచును
గూర్మపురాణంబు గూర్మిఁ బలుకఁ
|
|
|
గాఁ బరబ్రహ్మ యని నిరాకారపదము
రుద్రసాకారసిద్ధాంతరూపణంబు
బ్రహ్మ యగు రుద్రు భజియించుభక్తిపరుని
బ్రహ్మవే త్తను శ్రుతి యెందు బసవలింగ!
| 121
|
|
పరగ దధీచిశాపము "తమసా విష్ణు
తేజసా" యనియెడుఁ దేజ మలర
మును గౌతమునిశాపమున "భగవన్ వేద
బాహ్యస్త" మని యశుభంబు గాఁగ
మునుకొని భృగుశాపమున వేదమత మిటు
లీనం బటంచును లెస్స గాఁగ
మున్ను వ్యాసునిశాపమున "నరకాస్తే న
సంశయో" యనియెడుసరణి గాఁగ
|
|
|
నట్ల శాప మంది యవనిలోఁ బలుదేవ
తలను గొల్చి మిగులఁ దత్తఱపడి
శంభుభక్తి లేక శైవుల మనుచును
బల్కఁ దగునె చూడ బసవలింగ!
| 122
|
|
పద్మభవుఁడు మున్ను "పాదరజస్స్పర్శ"
యని కాశికాఖండమున నుతింప
విధి "శుకవత్తవ విశ్వేశ" యని శర
భాధ్యాయమును మనంబారఁ బొగడ
నలి శివయోగి "శ్రీనైవాశ్చ" యనుచు సూ
ర్యపురాణమునను బల్ ప్రణుతి సేయ
నొనర వాయుపురాణమున "దేవదేవాయ
బ్రహ్మణే" యని నల్వ ప్రస్తుతింపఁ
|
|
|
బాటివేదములను బ్రహ్మాధిపతి యని
చాటుశ్రుతుల నజుఁడు సన్నుతింప
భవునిఁ గొలువ కేల ప్రాకృతు లా పర
బ్రహ్మదూరు లైరి బసవలింగ!
| 123
|
|
ఒక్కఁడు పుట్టించునో జీవరాసుల
నొక్కనియందుఁ దా నుదయ మగునొ
యొక్కండు చంపంగ నొక్కఁడు సేయునో
యొక్కండు జీవంబు లోలి నిడునొ
కాయంబు జీవుండు గదియునో జీవుండు
కాయంబు లొందునో గలిసి యగునొ
కాయంబు లాదియో కర్మంబు లాదియో
కాయకర్మంబు లొక్కటనె యగునొ
|
|
|
యనెడుధర్మ మిట్టు లొనర "సోమః పవ
తే" యటంచు సూక్తి మ్రోయుచుండుఁ
గాన శివుఁడె యాదికర్త యౌటకు వేఱె
ప్రత్యయంబు లేల బసవలింగ!
| 124
|
|
రాజసగుణమునఁ బ్రబలి "భవాయ న
మో" యనఁ బుట్టించు మొదటికర్త
సాత్త్వికగుణమునఁ జాలి "మృడాయ న
మో" యన రక్షించు మొదటికర్త
తామసగుణమునఁ దగిలి "హరాయ న
మో" యన హరియించు మొదటికర్త
త్రిగుణంబులను బాసి నెగడి "శివాయ న
మో" యన సుఖియించు మొదటికర్త
|
|
|
యాది నొక్కరుఁడు మహాదేవుఁ డనఁగను
మ్రోయునట్టి వేదములు దొడంగి
చదివి చదివి దుష్టజను లెట్లు మఱచి స
ద్భక్తిరహితు లైరి బసవలింగ!
| 125
|
|
ఈక్షింప శ్రుతులు "సంరక్షితాం సృష్టించ
జయ" యన నచ్ఛైకశాసనముగఁ
జనుచుండు మఱి "సురక్ష్యతరాంశ్చ లోకాంశ్చ
లోకపాలాంశ్చ" నాఁ బ్రాకటముగఁ
దవిలి "యథాదేవతా స్సృష్టి" యనఁ "బశ
వోభి" యనంగను శోభితముగ
మును "పశవః సృష్టి" యనఁగ "బ్రహ్మాదయః
పశవో" యనంగ నపారితముగ
|
|
|
నట్ల "యున్మేషనిమిషచయ" మన ధరను
భవుఁడు గను దెఱవంగ నుత్పత్తి యగుట
హరుఁడు గన్మూయఁ జెడెడుబ్రహ్మాండకోట్లు
బ్రహ్మవిష్ణ్వాదిదేవతల్ బసవలింగ!
| 126
|
|
ఉత్తరం బెద్ది పూర్వోత్తరమీమాంస
లవియు నన్యోన్యదూష్యములు పూర్వ
మీమాంసమునను "గిల్మీషే గురుండు" నా
నాయతం బగు నంద యట్లగాక
పూర్వమీమాంసయుఁ బొరి భాస్కరీయంబు
నొసరెడు దా సాంఖ్యయోగములును
మదియించు నుదయమీమాంసప్రయుక్తిని
నుదయించు మీమాంసయుక్తిఁ దుడిచి
|
|
|
కవులు మునులు వైదికంబులు సూతప్ర
దాత శూలి బహుమతంబు లవియు
నిదియుఁ దలఁప దథ్య మీశ్వరుం డొక్కఁడే
బ్రహ్మ మనఁగఁ జెల్లు బసవలింగ!
| 127
|
|
స్వేచ్ఛాప్రచారంబు ప్రచ్ఛన్నబౌద్ధంబు
హాస్యైకహేతు వన్యాయసరణి
అజ్ఞానతరము మహాజనదూష్యంబు
పాతకావాస మప్రస్తుతంబు
సత్క్రియాహీనంబు సర్వప్రమాణదూ
ష్యంబు నా లోకాయతంబు నెలవు
విద్వన్విముఖము నాత్మాద్వైత మట్టి మా
యావాద మైన వేదాంతమార్గ
|
|
|
ముత్తమాశ్రమ మే యసద్వృత్తి నాస్తి
కులును యుక్తిదూరులును గైకొండ్రుగాక
వేదవిహితశివాచారవృత్తి నడుచు
భక్తిపరులును గైకొండ్రె బసవలింగ!
| 128
|
|
జైమినికృతపూర్వమీమాంసకులు నుచి
తార్థంబు తా దైవ మని తలంచి
కర్త లేఁ డని కర్త కర్మంబ యని "స్వర్గ
కామో యజే" త్తని కర్మకాండ
భాట్టశాస్త్రం బను భాష్యంబు సేయ భ
ట్టాచార్యులింగ మి ట్లంతరింపఁ
బొరి మహిమ్నమున "ముఖరయతి మోహాయ
జగతా" మనుచు ధర్మశాస్త్రమతము
|
|
|
దొడరుఁ దాను కాన దూష్యంబు లగుచును
మేలు గాని వాని నేల చెప్పఁ
గాక మున్ను వేఱె కర్మవాదం బట్ల
పడయఁగలరె ముక్తి బసవలింగ!
| 129
|
|
ధర "నవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ
యోగం" బటంచును నొగిఁ దనర్చి
యిలను దా నొక "జ్ఞాన మేవ మోక్ష" యనియు
నఱిముఱి భక్తి హాస్యంబుఁ జేసి
యది గొన "కాత్మాహ మిద మగ్రనే" త్తను
ధ్యానయోగంబు నుదాత్తపఱిచి
తగ "సచపూజ్యో యథాహం" బనెడి భక్తి
యోగంబు ముక్తికి బాగు గాఁగ
|
|
|
భర్గు ననయంబుఁ బూజించుభక్తు లొల్ల
రానిధర్మంబులును గొన్ని పూని సల్పి
జగతిఁ జను భట్టవేదాంతసాంఖ్యములును
వసుధలో దూష్యములు గావె బసవలింగ!
| 130
|
|
అక్రమాభ్యాసయోగక్రియారంభంబు
సతమైన లింగావసక్తి కెనయె
కమలషట్కధ్యానగౌణమార్గము ముఖ్య
లింగావధానసల్లీల కెనయె
కల్పితానంతరకాలానుభవరతి
శివప్రసాదామృతసేవ కెనయె
సహజకేవలనిజస్పర్శనాకర్ణ్యంబు
శివకథామృతరససిద్ధి కెనయె
|
|
|
తనదుప్రాణంబు బ్రహ్మరంధ్రమున విడుచు
నదియు ముఖ్యలింగైక్యసౌఖ్యమున కెనయె
హస్తిమశకాంతరము గాదె యభవుపాద
భక్తికిని యోగయుక్తికి బసవలింగ!
| 131
|
|
తనువ యిహాబద్ధమున నిర్మలం బైన
వాంఛ భౌతికచిహ్న వాయవలదె
యుతమహాముద్రానుగతయోగమతిఁ దన్ను
మఱచిన గుణములు మఱవవలదె
ముద్రితఖేచరీముద్రాంతమున నమృ
తంబు గల్గిన మరణంబు గలదె
కోమలం బాజ్యోతికుంభమధ్యాంతర
మునఁ దోఁపఁ దద్రూపముక్తి గలదె
|
|
|
మొదల యోగము నిత్యత్వమునకు విహిత
మయ్యెనేనియు మును సనకాదిమునులు
యోగసిద్ధిని నిత్యులై యుండి రెట్లు
భక్తినిష్ఠులపగిదిని బసవలింగ!
| 132
|
|
గతి "లింగమధ్యే జగత్సర్వ" మను మధ్య
కలితాంబరము మహాకాశ మనుచుఁ
బూని "యణోరణీయా" ననఁ జైతన్య
తత్త్వంబ యథ్యాత్మతత్త్వ మనుచు
రతి "లింగబాహ్యా త్పరం నాస్తి" యనఁ బాహ్య
శూన్యంబ యదియ తా శూన్య మనుచు
నెఱయంగ "బ్రహ్మేతి నిశ్చితం" బన లింగ
భావంబ యది పరబ్రహ్మ మనుచు
|
|
|
రూఢిగా "నేక ఏవ రుద్రో" యటంచు
భోగిభూషణు సద్భక్తి యోగనిరతి
నార్యు లర్చింతు రెడపక యతులమహిమఁ
బ్రణుతి సేయును శ్రుతులును బసవలింగ!
| 133
|
|
ధాత తా "నహ" మని తలఁ గోలుపోవఁడే
రుద్రపశుపతి బ్రహ్మరూపుఁ గొనఁడె
శివదూషణముఁ జేసి చెడిరి కొందఱు ఋషుల్
గడుశ్రేష్ఠుఁ డాయె మార్కండమౌని
క్రొవ్వి సనత్కుమారుండు నుష్ట్రంబయ్యె
లింగైక్యనిష్ఠచే భృంగి వెలసె
సనకాదిమునులు బుద్ధిని వికలత నొంద
సిద్ధరాముఁడు శైవసిద్ధిఁ బొందె
|
|
|
వనజజునికంటె మునులకంటెను సనత్కు
మారుకంటెను యోగసమాధికులను
నధికు లున్నారె యోగక్రియాతిశయత
భక్తి మాలి తూలిరి గాక బసవలింగ!
| 134
|
|
ఇల యోగమర్యాద లెఱిఁగినంతనె కడు
నీశుతత్త్వంబు వహించ నౌనె
కలిత మభ్యాసయోగక్రియామాత్రచేఁ
గాలవంచనశక్తి గలుగు టెట్లు
తవిలి జపసమాధితర్పణమాత్ర స
చ్చరితార్థసంపద లెఱుఁగ నౌనె
రతి రాజయోగకర్మజ్ఞానమాత్రన
యజరామరత్వ మింపార నౌనె
|
|
|
శంకరాచార్య భాస్కరాచార్య ముఖ్యు
లత్రిశక్తిగౌతమకపిలాదు లైన
పూర్వఋషు లెల్ల సంసిద్ధఁ బొందినారె
భక్తిసత్క్రియాపరులట్లు బసవలింగ!
| 135
|
|
యోగ మజ్ఞానసమున్నతబీజంబు
యోగంబు దుర్వృత్తిసాగరంబు
యోగ మద్వైతదురుక్తులనిలయంబు
యోగ మహంకృతి కునికిపట్టు
యోగంబు ముక్తివియోగైకహేతువు
యోగంబు హానిప్రయుక్తి శక్తి
యోగంబు దురితసంయోగైకకార్యంబు
యోగంబు విభ్రాంతియోగవృత్తి
|
|
|
యోగ మె ట్లన్న శివునిభక్తోపయోగ
కారణంబై చెలంగు సాకారమూర్తు
లాదిగా లింగమూర్తి నహర్నిశంబు
ప్రణుతి సేయుచుఁ గొల్వరే బసవలింగ!
| 136
|
|
సరి "శివరూపసూక్ష్మాంతరపర" మను
నది శివరూపత్రయంబునందు
రతి "న సుధామతే రధ్వర" స్యనఁ గాంతు
రాస్థూలతత్త్వ మజాదిసురులు
ఒనర యోగులు "సూక్ష్మయోగి భి" రనఁ గాంతు
రాసూక్ష్మతత్త్వ మష్టాంగనియతి
యర్థిఁ "దా మకృతస్య" యనఁగ భక్తులును ద
త్పరమలింగంబురూపంబుఁ గొలుతు
|
|
|
రట్లు "దృశ్యశ్చ నా న్యథా" యనఁగ మఱియు
నట్ల "భక్తిమానవ వేద్య" మనఁగ మఱియు
యోగు లైనను లింగాంగయోగసరస
పదవి గానంగ శక్యమే బసవలింగ!
| 137
|
|
మహి "నిజవర్ణ సమాధిభిరన్య" య
నంగ భక్తికి సమానంబు గలదె
"యోగప్రవృత్తాంత యోగే నతుపరా" య
నంగ భక్తికి సమానంబు గలదె
మఱి "నతవర్ణ సమాధిభిరన్య" య
నంగ భక్తికి సమానంబు గలదె
నలిని "మంత్రా ధ్యయనై శ్చనతుశివా" య
నంగ భక్తికి సమానంబు గలదె
|
|
|
జపములును దపములు యోగసాధనములు
మంత్రతంత్రాదినియమసమాధివిధులు
ధ్యానములు సాంఖ్యయోగనిదానములును
వసుధ శివపూజ కెన యౌనె బసవలింగ!
| 138
|
|
శుద్ధలింగార్చనోత్సుకలీలఁ గాక య
భ్యాసయోగములఁ బాపములు చెడునె
లింగావధానకల్పితమనోరతిఁ గాక
ధ్యానమార్గము శివుఁ గాన నగునె
ప్రాణలింగైక్యసంబంధసంగతిఁ గాక
వాయుధారణ ముక్త్యుపాయ మగునె
ధృతిఁ బశుపాశుపతిజ్ఞానమునఁ గాక
యద్వైతవిధులు నిత్యత్వ మగునె
|
|
|
నియమితాచారసద్భక్తినిష్ఠఁ గాక
భ్రాంతియోగంబులను ముక్తి భవ్య మగునె
లింగనిష్ఠాగరిష్ఠవిలీనవృత్తి
కెసఁగ సమ మౌనె యోగంబు బసవలింగ!
| 139
|
|
శివుఁడు నిస్సంసారి జీవుండు సంసారి
తజ్జీవునకు శివత్వంబు గలదె
శివుఁడు నిర్మలదేహి జీవుండు మలదేహి
తజ్జీవునకు శివత్వంబు గలదె
శివుఁడు దా నిష్కర్మి జీవుండు దుష్కర్మి
తజ్జీవునకు శివత్వంబు గలదె
శివుఁడు దా నిత్యుండు జీవుం డనిత్యుండు
తజ్జీవునకు శివత్వంబు గలదె
|
|
|
యరసిచూడఁ బర్వతపరమాణుమాత్ర
తరమునకు నంబరంబును ధరణికైన
యంతరంబులు గలుగు జీవాత్మ కెట్లు
పొసఁగుఁ బరమాత్మయోగంబు బసవలింగ!
| 140
|
|
ఒడయుల నల్లంతఁ బొడగని కడగంటఁ
జూచునే కన్నారఁ జూచుఁగాక
యుచితక్రియాదుల కోర్వక వెనుకకు
వీఁగునే రతి నెదు రేఁగుగాక
కులమద ధనమద బలమదాదులఁ బేర్మి
నిక్కునే చాగిలి మ్రొక్కుఁగాక
యడిగినభావదేహార్థంబు లెడల వం
చించునే కూడ నర్చించుఁగాక
|
|
|
యాడునే వందనముఁ గొనియాడుఁగాక
నడుపునే నేర్పు ప్రీతియే నడుపుఁగాక
తుడుచునే క్రియ భక్తిమై నడుచుఁగాక
పరమభక్తిప్రశస్తుండు బసవలింగ!
| 141
|
|
దర్పితవిధిఁ గ్రియాద్వైతవంచనమును
బొందునే శివపూజఁ జెందుఁ గాక
సతతతదీయపూజాపుణ్యఫలము లా
శించునే మఱి నియమించుఁగాక
కృతఫలాన్యాయానుగత మగుభుక్తికిఁ
బాఱునే భక్తి నేపారుఁగాక
వీరభక్తిస్థలాచారవిధముఁ బొల్లు
వఱపునే భక్తియే నెఱపుఁగాక
|
|
|
జీవితము శైవవృత్తికిఁ జిక్కుఁగాక
బొంకునే యెప్డు రెండాడఁ గొంకుఁగాక
వదలునే శైవక్రియలచేఁ బొదలుఁగాక
పరమభక్తిప్రశస్తుండు బసవలింగ!
| 142
|
|
మొదల హరుం డని పిదప నరుం డని
చూచినఁ గల్గునే శుద్ధభక్తి
మొదలఁ జాగిలి మ్రొక్కి పిదపఁ జాగిలి నిక్కి
మలసినఁ గల్గునే మహితభక్తి
మొదల సద్గురుఁ డని పిదప దుష్కరుఁ డని
పల్కినఁ గల్గునే భక్తి యుక్తి
మొదల శిష్టుం డని తుది నికృష్టుం డని
భావింపఁ గల్గునే పరమభక్తి
|
|
|
మొదల దానియై దీనత్వమునఁ జరింపఁ
గల్గునే త్రిలోకైకవిఖ్యాతభక్తి
మొదల దాసియై సోహత్వమునఁ జరింప
నసమసద్భక్తి గల్గునే బసవలింగ!
| 143
|
|
మాట నిశ్చయమును మనసునఁ గృఛ్రయుఁ
గలిగినఁ గలుగునే కలితభక్తి
మాటల వెఱపును మనసున నేర్పును
నెఱపిన నెఱయునే నియతభక్తి
మాటల వివరము మనసున వైరము
బరగినఁ గల్గునే పరమభక్తి
మాటల వలపును మనసున సొలపును
బొలసినఁ గలుగునే లలితభక్తి
|
|
|
మాటలందుఁ బొందు మనసునఁ గుందును
మాటలందు రసము మనసు గడుసు
మాటలందు దృఢము మనమున శఠమును
నెసఁగుచుండ ఫలమె బసవలింగ!
| 144
|
|
కార్యంబు లేమిని గల్పించుకొన కవ
సరము గా దనక యుత్సవము చెడక
త్రోపు సేయక చూచు చూపు దప్పక రేపు
మా పన కంతలో మఱుగు వడక
లేమిఁ జూపకయ దాలిమిని దా నుండక
యొఱపులఁ బోపక కఱకుఁ బడక
విధము దప్పక యసద్వృత్తిని బలుకక
నేరమిఁ జూపక నెనరు విడక
|
|
|
కోరి జంగమంబుఁ గొనియాడునతఁడు స
న్మార్గుఁ డతఁడు భక్తిమతియుతుండు
లోకమాన్యుఁ డనుచు వీఁక నుతింతురు
భక్తజనులు బుధులు బసవలింగ!
| 145
|
|
రాకకు బెదరక పోకకుఁ జెదరక
యుత్తరం బియ్యక వృత్తిఁ జెడక
పట్టినఁ గదలక ముట్టినఁ దొలఁగక
సందడింపుచుఁ బోక జడ్డువడక
పొగడినఁ బొదలక తెగడిన వదలక
యెగ్గుమాట వినక తగ్గువడక
బొంకులం గట్టక టొంకుల న్బెట్టక
కర్మంబు లాడక కర్మి గాక
|
|
|
కోరి జంగమంబుఁ గొనియాడునతఁడు స
ద్వృత్తి యతఁడు భక్తివిస్తరుండు
లోకమాన్యుఁ డనుచు వీఁక నుతింతురు
భక్తజనులు బుధులు బసవలింగ!
| 146
|
|
వారి మనోదివ్యపూరితమేళన
నల్లనఁ దనమనం బుల్లసిల్ల
వారి పాదామరభూరుహచ్ఛాయావి
హారకీలితరతి నంగ మలర
వారి భాషామృతవారిధిక్రీడాను
కూలలోలతఁ బల్కు లోలలాడ
వారి యాజ్ఞామేరుతారాద్రిసీమా౽వి
లంఘనక్రియరీతి లక్ష్య మమరఁ
|
|
|
గోరి జంగమములఁ గొనియాడునతఁడు స
ద్వృత్తి యతఁడు భక్తివిస్తృతుండు
లోకమాన్యుఁ డనుచు వీఁక నుతింతురు
భక్తజనులు బుధులు బసవలింగ!
| 147
|
|
ఎఱుకచే సద్భక్తిపరులను గూడక
గౌరవస్థితి చెడఁ గోరువారు
తనయాడినట్టు లాడనిజంగమము నెట్టి
ప్రభువునైనను మీఱి పలుకువారు
లింగార్చనము సేయుసంగతి నైనను
యద్వైతవాదంబు లాడువారు
శివలింగపూజలు శేఖరంబుగఁ జేసి
యంగభోగములకై యలరువారు
|
|
|
జంగమయ్యకు లే దని చని భుజించి
మీఱి భక్తిని జెడి బొంకువారు తమ్ము
మిగులఁ గైవారములు సేయ మెచ్చువారు
భక్తిగోష్ఠికిఁ బాత్రులే బసవలింగ!
| 148
|
|
తగ నగ్ని నాధారముగఁ జేసి యంబుధి
తనివార నుదకంబు ద్రావునట్లు
భూరుహం బవని నాధారముగను జేసి
యింపార నీరు గ్రహించునట్లు
వారక వత్తి నాధారంబుగాఁ జేసి
తవిలి దీపము నెయ్యి ద్రావినట్లు
యాతనాదేహంబు నాధారముగఁ జేసి
యాత్మ దా సౌఖ్యంబు లందునట్లు
|
|
|
నెసఁగ జంగమమూర్తి పంచేద్రియములు
నట్ల యాధారముగ సముద్యత్సుభక్తి
హరుఁడు భోగించు భోగంబు లవధరించు
భక్తజనహితార్థంబుగా బసవలింగ!
| 149
|
|
తల్లి తప్పక యౌషధమ్ముల సేవించి
శిశువులరోగముల్ చెఱచునట్లు
గోవును బిండఁగఁ గొదమను గొన సంత
సిలి జనులకుఁ బాలు చేపినట్లు
చెఱువులజలములఁ బెరుగుసస్యంబులఁ
గర్షకులకుఁ గొల్చు గలుగునట్లు
జలములు పత్తిరి శంభుండు గైకొని
భక్తులదురితము ల్వాపునట్లు
|
|
|
దాన తనుమనోధనము లుద్ధతి గ్రహించి
యెలమి మోక్షంబు భక్తుల కలరఁజేసి
లీల నోలాడు జంగమలింగములను
బ్రమసి కలిసినఁ దగు భక్తి బసవలింగ!
| 150
|
|
తాలవృంతములలో గాలి యున్నదె కొంత
విసరంగ విసరంగ నెసఁగుఁగాక
చెలఁదిలోపలఁ దంతువులు గొన్ని యున్నవే
యల్లంగ నల్లంగ నలరుఁగాక
శిలలలోఁ బ్రతిశబ్దములు గల్గియున్నవే
పలుకంగఁ బలుకంగఁ బలుకుఁగాక
చెలమలోపల నొక్కజలనిధి యున్నదే
ముంపంగ ముంపంగ నింపుఁగాక
|
|
|
యట్లు నిర్వంచకుఁడు గానిహరుని భక్తి
పరునిముందట నున్నదే పసిఁడిప్రోఁక
కడఁగి సేయంగఁ జేయంగఁ గలుగుఁగాక
భక్తిమాహాత్మ్యమున మఱి బసవలింగ!
| 151
|
|
చారుతరం బగుహారంబు దా నెంత
పొం దాసపడు కొల్కిపూన యెంత
భూరితరం బగుభేరి దా నదియెంత
ధ్వనియించు వాదనదండ మెంత
విపులతరం బగువీణె దా నదియెంత
కారణం బగుజీవగఱ్ఱ యెంత
స్ఫురతరం బగుబొమ్మ మఱియుఁ దా నదియెంత
సుగతిమై నాడించుసూత్ర మెంత
|
|
|
యట్లు శ్రుతి "యసంఖ్యాత సహస్ర" యనఁగ
నసమతర మగుభక్తిమాహాత్మ్య మెంత
వారు గొనియాడు శివభక్తిపరునిభక్తి
భావితార్థంబు నదియెంత బసవలింగ!
| 152
|
|
భార్య యొక్కతెకన్నఁ బండ్రెండుమాడలు
కాసువీసము గురుకలశమునకు
సతులకైనను మణిసరులు మఱియును వి
భూతి వీడ్యముకైనఁ బోక యొకటి
విందులకైనను వివిధపక్వాన్నంబు
లొడయులకైన ము న్నున్నయట్టు
లెలమి నల్లురకును దొలిచూలుపడ్డలు
ముదిగొడ్డు జంగమమునకునైనఁ
|
|
|
దమకు బిడ్డలకైన మంచములు మఱియు
భక్తబృందంబుకైనఁ జాపయు నరుగులు
ననిశ మ ట్లిచ్చి భక్తుల మని మదింప
భక్తిపరు లనఁగ నగరె బసవలింగ!
| 153
|
|
రాకామలజ్యోత్స్న ద్రావ నిచ్చలుఁ గన్న
నా చకోరంబుల కరుచి యగునె
సహకారపల్లవచయములు దొరకిన
జగతి కోవెలలకుఁ జప్ప నగునె
క్షీరాబ్ధిలోపలఁ గ్రీడింపఁగలిగిన
భువి రాజహంసకుఁ బుల్ల నగునె
విరిదమ్మివాసనవెల్లి ముంచినఁ గ్రోలు
షట్పదముల కనాస్వాద మగునె
|
|
|
బహుళతరదయార్ద్రభావప్రభావన
మహిమఁ దనరు జంగమంబురాక
యతులభక్తిపరుల కావశ్యకం బగుఁ
బరిహృతాభిషంగ బసవలింగ!
| 154
|
|
పాదపంబున కొక్కఫల మైన భోగింపఁ
గలుగునే తత్ఫలార్థులకుఁ గాక
గోవులకును బాలు కొణిగెఁ డైనను ద్రావఁ
గలుగునే తత్పోషకులకుఁ గాక
యిండ్లకు నీడ లొకించుకం తైనను
గలుగునే తన్నివాసులకుఁ గాక
నదులకు నడ్డెఁ డైనను నీరు ద్రావంగఁ
గలుగునే తత్సేవకులకుఁ గాక
|
|
|
యట్లు దమ్ము భక్తి నర్చించువారల
కభిమతార్థసిద్ధు లలరుఁ గాక
జంగమమున కర్థసంపద లే దని
పలుక నెట్లు వచ్చు బసవలింగ!
| 155
|
|
ఆడఁబోయినతీర్థ మదియుఁ దా నెదురుగా
వచ్చుట తనభాగ్యవశము గాదె
చని వెదకెడితీఁగ తనకాళ్ళఁ జుట్టుట
యదియు నాకస్మికపదము గాదె
పొరిఁబొరి సాధింపఁ బోవునిధానంబు
బరగఁ బొందుట భాగ్యఫలము గాదె
అనయము మనమునఁ దనతలంచుతలంపు
తలకూడు టది యొక్కఫలము గాదె
|
|
|
మొదల సద్గురుప్రతిబింబమూర్తి యైన
జంగమం బేఁగుటకు మహోత్సవ మెలర్పఁ
బొంగి భోగింపఁ దనభక్తిఁ బూజ సేయఁ
బడయునతఁ డుత్తముం డండ్రు బసవలింగ!
| 156
|
|
భువికిఁ జీకటి యైన రవిఁ గోరు లోకంబు
రవికిఁ జీకటి యైన రక్తి గలదె
ఆఁకలి గొన్నవా రన్నంబు గోరంగ
నన్నంబు నాఁకొన్న నన్న మెద్ది
నో రెండి తెరువరి నీరుకందువ కేఁగ
నీరమునకు దప్పి చేర నెద్ది
శీతంబు గొనువారు చిచ్చుఁ గాయఁగఁ గోరఁ
జిచ్చు శీతము గోరఁ జేర నెద్ది
|
|
|
యట్లు జంగమ మర్థించి యరుగుదేరఁ
దగిలి భక్తుండు తనదరిద్రతయు నెన్న
వెండియును నయ్య తాన యెటుండు నెట్లు
బ్రతుకు నేక్రియ వర్తించు బసవలింగ!
| 157
|
|
నరులచే నొల్ల రన్యద్రవ్యమును భక్తి
మతులు తా మాశ్రయమదనిరూఢి
నొక్కింతధన మాస లెక్కసేయరు భక్తి
మహిమాన్వితులు ధనమదనిరూఢి
బలియురు కుల మూఁది కలియరు భక్తి స
న్మార్గవర్తులు కులమదనిరూఢి
వెడ నేమములు వాంఛ విడుతురు భక్తి స
మ్మతులు దా మాచారమదనిరూఢి
|
|
|
వెలితి యెఱుకలవికృతంపువేషములను
గ్రొవ్వి విడుతురు శివభక్తి గుణవిదులను
వికలమతులు విద్యామదవేషములను
బద్దు లాడినఁ గొఱఁతయే బసవలింగ!
| 158
|
శీలలక్షణము
|
భవులు చూచినఁ గాదు "హకము ల్వర్జయే
దుదకాదిక" మ్మను సూక్తి దనర
భవు లంటరా దనుఁ బరగఁ "బదార్థాని
వర్జయే" త్తను నాదివచన మునికి
యింటిబిడ్డలు దాసు లిండ్లలో భవు లుండ
రాదు "చండాలవర్జయ" యనంగ
ననిశము "నాసనా దర్చనా ద్భోజనా
త్సంగా" త్తను పురాణసంహితలను
|
|
|
జాటుఁ గావున సచ్ఛివాచారపదము
తప్పకుండ నడుచు శివధార్మికులకు
నైహికాముష్మికంబు లేపారు శ్రుతులు
"భద్ర మశ్ను తే" యనఁగను బసవలింగ!
| 159
|
|
ఆత్మేశునకును దా నర్పించఁదగు "స్వయ
మే వార్పయే" త్తనుభావ మునికి
నొం డర్పితంబు సేయుడు నగుదోషంబు
మును "కిల్బిషం భవే" త్తనుటఁజేసి
కూడ దలింగియై కొనుప్రసాదంబు "శ్వ
మాంసం రుధిర" మనుమాట యెఱిఁగి
చన "దుపవాసాది సంభవే" త్తని శైవ
సంహితలందునఁ జాటుఁ గాన
|
|
|
సరవితోఁ దాము సచ్ఛివాచారపథము
దప్పకుండ నడుచు శివధార్మికులకు
నైహికాముష్మికంబు లేపారు శ్రుతులు
"భద్ర మశ్ను తే" యనుఁ గాన బసవలింగ!
| 160
|
|
వినరాదు పరలోకవిధులు సేయుట "యకు
ర్యాదౌర్ధ్వదైహికం" బనఁగ నిట్లు
భక్తులకును నట్లు పండుగ ల్దమలోన
నెనయ "కుర్యా" త్తన నెలమి మిగుల
లేదు సూతకము పుత్రాదులయందుఁ "బు
త్రాదేర్విశేషిత" యనఁగ నిట్టు
లతనియర్థంబు "దద్యాత్సతుసంతతో"
యనఁగ నన్యులకు ని ట్లర్హ మగునె
|
|
|
ఇట్లు శుద్ధశివాచార మీడ్యచరిత
దప్పకుండ నడుచు శివధార్మికులకు
నైహికాముష్మికంబు లేపారు శ్రుతులు
"భద్ర మశ్ను తే" యనుఁ గాన బసవలింగ!
| 161
|
|
తొడరి బ్రహ్మాండసూక్తుల "శ్రితకే సూత
కే తథా" యన నెద్ది సూతకంబు
మును నందికేశ్వరంబును "యథా ధారోన
సూతకం" బన లేదు సూతకంబు
చెంద దేయెడలను స్కాందంబునందును
"సూతకం నహి" యన సూతకంబు
గలదె "సూతక సూతకాచరజస్వలా"
యన శైవసంహిత నట్టిస్త్రీలుఁ
|
|
|
బురుషులును శివు భజియింపఁ బొంద రెందు
సూతకం బనుచుఁ బురాణసూక్తి మ్రోయు
నట్ల "పద్మమివాంభసి" యనఁగ శుద్ధ
భక్తిపథ మిట్టిదియ కాదె బసవలింగ!
| 162
|
|
చన దన్న సమయమిశ్రము "సర్వభక్షిత
వాయసో" యను సూక్తి మ్రోయుఁ గాన
భక్తిహీనం బైన బ్రతుకఁగూడదు "భక్తి
హీన నాశంకరి" నా నెఱింగి
శ్రద్ధారహిత మగు సత్క్రియ వృథ "యవ
శ్యం శ్రద్ధయా వినా" యనుటఁ జేసి
మీఱఁ గాఁ దాచార మితి "శివాచారం న
లంఘయే" త్తన నవిలంఘ్యలీలఁ
|
|
|
జాటుఁ గావునఁ దచ్ఛివాచారపదము
దప్పకుండ నడుచు శివధార్మికులకు
నైహికాముష్మికంబు లేపారు శ్రుతులు
"భద్ర మశ్ను తే" యనుఁ గాదె బసవలింగ!
| 163
|
|
ప్రాణలింగిని "శరీరం న దహే" త్తన
దహనంబుఁ జేసినఁ దప్పు వచ్చు
"నిర్మలం క్షిత్యాం వినిక్షిపేల్లింగిన"
మనఁగ నిక్షేపంబ యాదిమతము
చనదు గాల్పంగఁ దా "జ్ఞానాగ్నిపాకస్య
పచనం యథా" యనంబడినయొడలు
ధరను నిక్షేపింపఁ దగు "జీవమానే య
థా తథా" యనెడుపదంబుఁ గూర్చి
|
|
|
యిట్టి శుద్ధశివాచారహితచరిత్ర
దప్పకుండ నడుచు శివధార్మికులకు
నైహికాముష్మికంబు లేపారు శ్రుతులు
"భద్ర మశ్ను తే" యనఁగను బసవలింగ!
| 164
|
|
జ్ఞానోత్తరంబునఁ జను "లోకధర్మాఖ్య
మాచరే" త్తనెడు నగోచరముగ
నలి సూతసంహితోక్తులను "తమత్యంత
మాశ్రిత్య" యనుచుఁ దా విశ్రుతముగఁ
బ్రీతి సౌరమునందు "ధాతానియంతివై
కర్మ" యంచును ధర ఖ్యాతి దనరఁ
గలయంగ సౌరసూక్తులయందు "మాతృకా
స్తేసుత" యనుచు నాదీపితముగ
|
|
|
మ్రోయు లౌకికాచారంబు వాయఁడేని
శాస్త్రములు నన్యసంస్తుతుల్ చదివెనేని
పూర్వసూతకక్రియలందుఁ బొందెనేని
పాతకుఁడు వాఁడు గాఁ డెట్లు బసవలింగ!
| 165
|
|
కరి తుర గాందోళ వరరథారూఢులై
పోవువారును మోచిపోవువారు
నిష్టార్థ మర్థుల కిచ్చుచుండెడువారు
దిరిపెంబు మనువుగాఁ దివురువారుఁ
గడుమంచికుడుపులు గుడుచుచుండెడువారుఁ
గూడు లేకయ మదిఁ గుందువారు
నంగనాకేళి ననంగుఁ బెన్గెడివారు
వనితావియోగులై వనరువారు
|
|
|
అయ్య నిన్నుఁ గొల్చునయ్యలు, కొలువని
కొయ్యలే గదయ్య జియ్యదేవ!
వినుతనిర్మలాంగ! విరహితవ్యాసంగ!
పటుదయాంతరంగ! బసవలింగ!
| 166
|
|
మహితశివాచారమార్గానువర్తులై
నడుచువారును దప్పి నడుచువారు
జంగమారాధనల్ సల్పుచుండెడువారు
నోలి దుర్భవవార్ధిఁ గూలువారు
సిద్ధప్రసాదసంసిద్ధిఁ బొందెడువారు
నర్పితానర్హులై యణఁగువారు
భక్తిసంపదఁ దేలి ప్రఖ్యాతు లగువారుఁ
బాయనినిందలఁ బడెడువారు
|
|
|
అయ్య నిన్నుఁ గొల్చునయ్యలు; కొలువని
కొయ్యలే గదయ్య జియ్యదేవ!
వినుతనిర్మలాంగ! విరహితవ్యాసంగ!
పటుదయాంతరంగ! బసవలింగ!
| 167
|
|
శివశివా! కర్ణుండు గవచ మిచ్చియుఁ జెడె
వస్త్ర మిచ్చియు దాసి వరము వడసె
అక్కట! ఖచరేంద్రుఁ డంగ మిచ్చియుఁ జెడె
వ్రే లిచ్చి మంచయ్య విజయుఁ డయ్యె
కటకట! శిబి తనకండ లిచ్చియుఁ జెడె
మృగమాంస మర్పించి మెఱసె నెఱుకు
చెల్లబో! బలి భువి నెల్ల నిచ్చియుఁ జెడె
చోళుఁ డొక్కూ రిచ్చి సుగతిఁ బొందె
|
|
|
నట్ల లింగవిముఖ మగు దానధర్మప
రోపకారవిక్రమోద్ధతములు
నిష్ఫలంబు గాక నెట్టన శరణుల
భక్తియుక్తి కెనయె బసవలింగ!
| 168
|
|
జూదంబునను మూర్ఖు సోమార్ధధరుఁ గూడె
జూదంబునను బాండుసుతులు సెడిరి
మృగయాత్ర నొకచెంచు మృడుపురంబున కేఁగె
మృగయాత్ర రాముండు వగను జెందె
విషయసంగతి నంబి విశ్వేశుఁ బలికించె
విషయసంగతి బ్రహ్మ విరళ మయ్యె
హింసఁ దెలుఁగుజొమ్మఁ డీశ్వరు మెప్పించె
హింసచే మాండవ్యుఁ డెక్కెఁ గొఱ్ఱు
|
|
|
తథ్య మట్లు గాక ధర "నధర్మాధర్మ
తాం వ్రజే" త్తను శ్రుతి దప్పునయ్య!
పరమభక్తియుక్తిపరు లెట్లు నడిచిన
బద్ధ మదియుఁ గాదె బసవలింగ!
| 169
|
|
ఱాల వైచినసాంఖ్యఁడే లోకనుతుఁ డయ్యె
మల్లెలు వైచినమరుఁడు మడిసె
పాదంబునను దన్ని పరగెఁ గన్నప్పఁడు
పాదంబుఁ గన హరి పంది యయ్యె
మేలంబు లాడి యమ్మేన శివు న్గనె
నుతిఁ జేసి వేదము నొగిలె శక్తి
భువిమీఁద నడిపించి భోగయ్య వెలసెను
మోచి తెచ్చిన దశముఖుఁడు చెడియెఁ
|
|
|
దలఁప నిట్లు శివుఁడు వలచుట పుణ్య మొ
ల్లమియుఁ బాప మెన్నఁ గ్రమములందు
నిట్టు లౌట లేల నెఱి నిజంబుగ జగ
త్ప్రత్యయంబు గాదె బసవలింగ!
| 170
|
|
ఘనుఁ డీశుఁ డన్న బాణున కిచ్చెఁ జేతులు
గా దన్న వ్యాసునికరముఁ ద్రుంచె
దైవంబు హరుఁ డన్నఁ దలలు వంకయ కిచ్చెఁ
దాఁ గర్త ననుబ్రహ్మతలయుఁ ద్రుంచె
నమ్మిన చోళునినాఁతికి ము క్కిచ్చె
ధిక్కరించినవాణి ముక్కుఁ గోసె
నుతికి మె చ్చిచ్చెఁ గన్నులు కాళిదాసికి
గర్వమాడిన భగుకనులు పొడిచె
|
|
|
దండి కిచ్చె మేను దనకును శర ణన్న
మరు ననంగుఁ జేసె మాఱుకొన్నఁ
గాన శివుఁడె యాదికర్త యౌటకు వేఱె
ప్రత్యయంబు లేల బసవలింగ
| 171
|
|
మును బ్రహ్మహత్య చేసినయరియమరాజు
తనువుతో లింగంబుఁ దనరఁ జొచ్చెఁ
జని భ్రూణహత్య చేసినవీరచోళుఁడు
బొందితోడుత శివపురికి నేఁగెఁ
జెచ్చెఱఁ బితృవధ చేసిన యాకాట
కోటఁడు రజతాద్రికోటఁ గొనియెఁ
జేకొని శిశువధ సేసిన చిఱుతొండఁ
డేడువాడలతోడ నీశుఁ గలిసెఁ
|
|
|
దగనిక్రతువు సేసి దక్షుండు దల కోలు
పడియెఁ బుణ్యపాపఫలము లెన్నఁ
గర్మవాదు లెల్లఁ గసిమసి యైరి స
ద్భక్తిమహిమ లేక బసవలింగ!
| 172
|
|
భృగుకూర్మిపత్నికిఁ దెగినఁ దప్పునఁ బది
సారులు పుట్టుచుఁ జచ్చుచుండెఁ
జెలికాండ్రతప్పును జేకొన్న తప్పునఁ
దనయాలిఁ గోల్పోయి ధరను దిరిగె
మున్ను బలిని గట్టి మొనసినందుకు దశ
కంఠునిసుతునిచేఁ గట్టువడియెఁ
గౌరవాదుల కులక్షయము సేయుటఁ జేసి
ధరఁ గులక్షయ మయ్యెఁ దనకు నెపుడు
|
|
|
నెఱుఁగకుండ వాలి నేసినతప్పున
నేటు వడియె నొక్కయెఱుకుచేతఁ
గాన విష్ణుఁడాది కర్మవశ్యులు గారె
భక్తిపరులు గాక బసవలింగ!
| 173
|
|
కలఁ డన్నఁ జేపట్టె నిల నక్షపాదు లే
దన్నభట్టాచార్యు నటులునూఁకె
భక్తి సేయఁగ నుండె బాణునికడ భక్తి
దూరుఁ డైనసనత్కుమారుఁ జెనకెఁ
బ్రణుతి చేసినను మల్హణుకోర్కె నెఱవేర్చె
నిందించుదక్షుని నీఱుసేసె
మఱుఁగు సొచ్చినఁ గాచె నెఱయ మార్కండేయు
మీఱిన నరసింహుఁ జీరి తునిమెఁ
|
|
|
దలఁచుమాత్ర శ్వేతు ధన్యునిఁగాఁ జేసె
మఱచినట్టిమునులమద మడంచెఁ
గాన శివుఁడె యాదికర్త యౌటకు వేఱె
ప్రత్యయంబు లేల బసవలింగ!
| 174
|
|
సిరియాలుచేరువఁ జరియించు నయ్యేడు
వాడలవా రీశుఁ గూడఁ జనిరి
సామవేదులతోడి సంగతిఁ జేకొన్న
పురములు కైలాసమునకుఁ జనియె
దక్షుఁ గూడి సురలు దక్షులై యెంతయు
భంగపడరె వీరభద్రుచేత
భళ్ళాణుఁ గూడిన భక్తు లెల్లను గిరి
పతిపురి కేఁగిరి కుతుకమునను
|
|
|
భక్తు లైనవారు పలువిధంబుల శంభుఁ
గొలిచి రజతశైలనిలయు లైరి
జగతి నట్ల "కర్త సంసర్గయా" యను
పలుకు తప్పదయ్య బసవలింగ!
| 175
|
|
శ్రుతులకుఁ దాఁ గాక పతి నని ముఖమునఁ
దాల్చిన పద్మజుతలయుఁ బోయెఁ
దా దిక్కు రెండువేదములకుఁ గా కని
పోయిన సోమకుపొట్ట వ్రచ్చెఁ
దాఁ దెత్తుఁ గాక వేదము లని వెనుకొన్న
మాధవుం డటు మున్ను మత్స్య మయ్యెఁ
దాఁ గాక వేదముల్ దగిలి భాగింపంగఁ
గల నన్న వ్యాసునికరముఁ దునిమె
|
|
|
మొదల నఖిలవేదములును "శివోమాంశ్చ
పితరొ" యనఁగఁ గర్త శ్రుతుల కెల్ల
శివుఁడె యనక యిట్లు చెడుదురె యా హరి
బ్రహ్మ మొదలుగాఁగ బసవలింగ!
| 176
|
|
ఆగమంబులు దైవ మందురు శబరరు
ద్రునివెన్కఁ గుక్కలై చనియె నండ్రు
ఆమ్నాయములు మూల మండ్రు దధీచిశా
పముచేతఁ దచ్ఛక్తి వాసె నండ్రు
శ్రుతులు ఘనం బండ్రు సోమకుం డనువాఁడు
దొంగిలి కొనిపోయి మ్రింగె నండ్రు
ఆది వేదము లండ్రు వ్యాసునిచేత ని
ప్పాట విభాగింపఁబడియె నండ్రు
|
|
|
సంతతంబు ద్విజులు స్వాధ్యాయపరు లయ్యు
నిశ్చయార్థ మెఱుఁగనేర రెందు
నట్లు గా కధర్ము లగుశాపసహితుల
పలుకు లిటులు గావె బసవలింగ!
| 177
|
|
మహియెల్ల నెఱుఁగ బ్రాహ్మణుల నారాధించి
పరశురాముండు దా శరధిఁ జొచ్చె
ధరయెల్ల నెఱుఁగంగ ధరణీసురుల కిడి
గౌతము గోహత్యఁ గట్టువడియె
నఖిలంబు నెఱుఁగంగ నగ్రజన్మునకు దా
నము సేసి బలి బంధనమునఁ బడియెఁ
ద్రిజగంబు లెఱుఁగంగ ద్విజులకోరిక సల్పి
జలజాప్తసుతుఁడు తి త్తొలువఁబడియె
|
|
|
విప్రుఁ దండ్రిఁ జంపి వెయ్యేల చండుండు
ధాత్రి శివుప్రసాదపాత్రుఁ డయ్యె
మేలె గాక "మన్నిమిత్తం కృతం" బను
పలుకు తప్పునయ్య బసవలింగ!
| 178
|
|
దక్షునకును మహాధ్వరఫలంబునఁ దొంటి
తల వోయి మేషంబు తల చెలంగె
రహి సగరుని మఖారంభఫలమ్మున
నన్మునిచేఁ జావు సంభవిల్లె
నహుషభూవల్లభునకు యజ్ఞఫలమున
నప్పుడే సర్పత్వ మతిశయిల్లె
మున్ను ధర్మజునకు జన్నంబుఫలమున
బంధుక్షయంబు నాపదలు వచ్చె
|
|
|
సామవేది క్రతువుభూమి ముప్పదియాఱు
పురములు గొని శివునిపురికి నేఁగెఁ
బ్రతిభఁ గ్రతుఫలంబు భక్తికి సాటియే
పటుదయాంతరంగ! బసవలింగ!
| 179
|
|
రాజసూయసహస్రరాసు లిట్లేణాది
నాథుభక్తికి సరి నాఁగఁ దగునె
నరయాగలక్షలు సిరియాలుసెట్టి కృ
త్యమునకుఁ బ్రతి యని యాడఁదగునె
యశ్వమేధసహస్ర మైనఁ గెంబావిభో
గయ్యభక్తికి నెన యనఁగఁదగునె
యలపౌండరీకయాగార్బుదములు నిరు
వత్తుభక్తికి సాటి వచ్చు టెట్లు
|
|
|
బహుసువర్ణయాగపద్మమహాపద్మ
వితతి చెన్నబసవవిభునిమహిమ
తలఁపఁగలుగువారి ధన్యత్వమున కెట్లు
ప్రతి యనంగవచ్చు బసవలింగ!
| 180
|
|
దేవయజ్ఞము గుణాతీతుండు మాదర
చెన్నయ్యగారికి సిద్ధమయ్యె
పితృయజ్ఞ మబ్ధిగంభీరుఁడై విలసిల్లు
ఛోళభూవిభునకు సులభ మయ్యె
భూతయజ్ఞము మహాపురుషరత్నము చెన్న
బసవప్రసాదికిఁ బాలుపడియె
బ్రహ్మయజ్ఞము చాలఁ బరమయోగీశ్వరుఁ
డా కిన్నరయ్యకు నచ్చువడియె
|
|
|
మును మనుష్యయజ్ఞ మనఘుండు సిద్ధరా
మయ్యకుఁ గడు సాంగ మయ్యెఁగాక
జడుల కేల మిగుల సమకూఱు, భక్తివి
భ్రాజితాంతరంగ! బసవలింగ!
| 181
|
|
అన్నదానము సేయ నన్యులశక్యమే
శూరుండు కరికాలచోళుక్రియను
వస్త్రదానము సేయ స్వల్పులశక్యమే
ధన్యుండు దేవరదాసిపగిది
ప్రాణదానము సేయ పరులవశంబె మ
హాత్ముండు ముసిడిచౌడయ్యభాతి
కన్యదానము సేయఁగా నొరులకు నౌనె
లాలితకీర్తి భళ్ళాణుమాడ్కి
|
|
|
యట్ల కడఁగి యమ్మహాధర్మములు సేయ
హరి విరించి వాసవాదులకును
దరమె సేయ నవ్విధమున మహోదార
పటుదయాంతరంగ! బసవలింగ!
| 182
|
|
ప్రతిలేని గజదానచతురత మడివాలు
మాచయ్యగారికి మహిమ వెలసె
శస్త్రవిద్యాదానశక్తి యీక్షితిలోనఁ
గల్లిదేవయ్యకు నుల్లసిల్లె
కొమరారు నభయదానము సకలేశ్వర
మాదిరాజయ్యకు మానమయ్యె
యవిరళంబుగ శరణాగతదానంబు
కిన్నరబ్రహ్మయ్య కెన్నఁబడియె
|
|
|
నేల యిన్ని చెప్ప నెల్లవ్రతము లెల్ల
దానములును నెల్లధర్మములును
గర్ములకును నెట్లు గలుగును శివభక్తి
భావకులకుఁ గాక బసవలింగ!
| 183
|
|
"సత్యం వద" యనెడి శబ్దంబు కుమ్మర
గుండయ్యయందు నొక్కనియెఁ గాదె
"ధర్మం చర" యనెడి తత్త్వంబు సిద్ధరా
మునియందుఁ దాఁ దుదిముట్టెఁ గాదె
మొగి "నహింసా పరమోధర్మ" యన దేవ
దాసియయందుఁ దాఁ దనరెఁ గాదె
"బ్రహ్మచరామి" యన్ పల్కు మా యల్లమ
దేవునియందు సంధిల్లెఁ గాదె
|
|
|
యవ్వి తత్త్వవిదుల కగును దురాత్ముల
కెట్టిదుష్టజనుల కెట్టివ్రతుల
కిట్టిమహిమ లున్నవే సముద్యద్భక్తి
భావకులకుఁ గాక బసవలింగ!
| 184
|
|
మఱి "కులిశః కుసుమతి" యనువచన మే
ణాదినాథుండు ప్రఖ్యాతి చేసె
నలి "దహన స్తుహినతి" యనువచనంబు
పిళ్ళనైనారు దాఁ బెంపుచేసె
తెల్లంబు "వారాన్నిధిః స్థల" త్యనుమాట
వాగీశనయనారు వఱలఁజేసె
తివిరి "శత్రుర్మిత్రతి" యనెడువాక్యంబు
సింధుభళ్ళాణుండు చెలఁగఁజేసె
|
|
|
రమణ ముసిడిచౌడరాయండు "విషమవ్య
మృత" తనియెడుమాట మెఱయఁజేసె
నిట్టిమహిమ గలుగునే యన్యులకు భక్తి
భావకులకుఁ గాక బసవలింగ!
| 185
|
|
శ్రుతివిరుద్ధమె "పితరోమాతరవ్రత"
యనఁ దండ్రి వధియించు టాగమోక్తి
నిలఁ బరోక్షమె "యజే దేకం విరూపాక్ష"
మనఁ బుత్త్రు వధియించు టాగమోక్తి
దుష్టమార్గమె "తత్ర తుష్యామి సువ్రతే"
యన మాంస మర్పించు టాగమోక్తి
ప్రతిబద్ధమే "శరీరం గృహిణీ చైవ"
యన నాతి నిచ్చుట యాగమోక్తి
|
|
|
యిదియు వేదబాహ్యమే పురాతనగణ
చరిత మట్ల గాఁగ శర్వుకృపకు
హేతు వయ్యె నుపమ లింకేటి కూరకే
పటుదయాంతరంగ! బసవలింగ!
| 186
|
|
హరుఁడు దేవికి బసవాక్షరత్రయమహ
త్త్వమ్ముఁ జెప్పిన పురాణమ్ము లెఱిఁగి
వసుధపై వృషభంబు బసవనామముఁ దాల్చి
యుదయించె ననఁగ వేదోక్తు లెఱిఁగి
ప్రభువాది గాఁగఁ బురాతనభక్తులు
బసవనుతులు సేయుభాతి యెఱిఁగి
యవిరళసద్భక్తనివహంబు బసవఁ డు
త్తమలింగ మని యాత్మఁ దలఁచు టెఱిఁగి
|
|
|
యట్ల యోజింతు నర్చన లచ్ఛభక్తి
మదిని భావింతు మఱియు సమ్మతము దనర
నిన్ను నిలుపుదు మది నెప్డు నీవె నాకుఁ
బ్రాణ మనుచును మది నమ్మి బసవలింగ!
| 187
|
|
నుతులు సేయుదు నమస్కృతు లాచరింతుఁ గై
వారంబు సేయుదు గారవింతు
వినుతింతు భూషింతు వెలయింతు గణుతింతు
నంకింతు భంగింతు ననునయింతుఁ
బాడుదుఁ జదువుదుఁ బ్రణుతింతు బోధింతుఁ
బ్రస్తుతు లొనరింతు విస్తరింతు
వర్ణింతుఁ గీర్తింతు వడిఁ బ్రశంసింపుదుఁ
బ్రార్థన సేయుదుఁ బరిఢవింతు
|
|
|
నెయ్య మొదవ నిన్ను నీతిగా మద్వాక్స
మూహిఁ బూన్తు వృషసమాహితాఢ్య!
యుష్మదీయపదపయోజాతయుగముపై
భక్తికారణాంగ! బసవలింగ!
| 188
|
|
లీలమై సద్గురులింగమూర్తివి గాన
కడువడి మ్రొక్కులకర్త వీవె
సంగతంబుగఁ బ్రాణలింగాంగుఁడవు గాన
పూజలు గైకొనుప్రోడ నీవె
జంగమప్రాణానుసంగివి గావున
నారాధనల కాశ్రయంబు నీవె
భాస్వన్మహాప్రసాదస్వరూపివి గాన
భోగానుభోగోపయోగి వీవె
|
|
|
పరమభక్తియుక్తిభావానుగతుఁడవు
విగతకల్మషుండ వగుటఁ జేసి
మదిని నిన్ను నమ్మి మఱి నిన్ను వినుతింతుఁ
బటుదయాంతరంగ! బసవలింగ!
| 189
|
|
బసవయ్య నీస్తుతు లసలార విను భక్త
గణసంస్తుతులు విను గ్రాహకుండ
బసవన్న నీనుతుల్ వాయక పఠియించు
భక్తులఁ బ్రణుతించు పాఠకుండ
బసవయ్య నీస్తుతుల్ భక్తితోఁ గొనియాడు
భక్తులఁ గొనియాడు భక్తిపరుఁడ
బసవయ్య నీస్తుతుల్ పచరించుభక్తులఁ
బ్రచురింపఁ బాల్పడు భక్తిపరుఁడ
|
|
|
నిలను భక్తుల కీశుచే నీప్సితార్థ
భూరిసంపద లిప్పించు భూరిమహిమ
వినుచుఁ జదువుచుఁ గొనియాడి విస్తరించు
వాఁడ న న్నిటు కరుణించు బసవలింగ!
| 190
|
|
బిడ్డలఁ జీరెడు ప్రియ మెంత యనుచు నీ
పేరు నాలింగంబుఁ బెట్టినాఁడ
నోలి నాఱొమ్మున మాలిమి నుండిన
దైవ మనుచు నిన్నుఁ దాల్చినాఁడ
నిల నీకు వ్రే లిచ్చు వల పెంత యనుచు నా
దేహ మంతయు నివేదించినాఁడఁ
బద్యముల్ చెప్పుట పరమశ్రేష్ఠం బని
పద్యముల్ విరచించి ప్రబలినాఁడ
|
|
|
నట్లు గాన "దాస్యమాహుశ్చతుర్విధం"
బనిన వేదసూక్తి కగ్గలముగ
నెఱయఁ దక్కినట్టి నీదాసిఁ జు మ్మయ్య!
పటుదయాంతరంగ! బసవలింగ!
| 191
|
|
తగిలి నీపాదపద్మములు నాశిరమున
నచ్చొత్తఁగా మనం బుచ్చిపాఱ
నలి నీగుణాంకముల్ నాజిహ్వతుద నాఁటి
కొనఁగఁ గోరికలత కొనలువాఱ
రమణ నీనామాక్షరములు నాయురమున
వ్రాయవే వీఁపున వఱలివెలుఁగ
నర్థి నీమూర్తి నాయంతరంగంబున
నే నిల్పవే మది నెలవుగొనఁగఁ
|
|
|
దివిరి నీప్రసాదదృష్టిపైఁ దగ వెల్లి
గొలుపవే ప్రమోద మలుఁగువార
నిర్జితాభిషంగ! నిత్యగుణోత్తుంగ!
పటుదయాంతరంగ! బసవలింగ!
| 192
|
|
నాయయ నాజియ నాయన్న నాతండ్రి
నామనోనాయక నాప్రియుండ
నాదాత నాభ్రాత నారాజ నాస్వామి
నాయిలువేలుప నావిభుండ
నాకర్త నాభర్త నానాథ నాదేవ
నాగురులింగమా నాగురుండ
నాయాప్త నాయాత్మ నామిత్ర నావర్తి
నాప్రాణలింగంబ నాహృదీశ
|
|
|
నీవ నాకు దిక్కు నీవ నా"మాతాపి
తా" యనంగ నొండుతలఁపు లుడిగి
కరుణఁ జూడు మయ్య శరణార్థిఁ జు మ్మయ్య
భక్తి యొసఁగు మయ్య! బసవలింగ!
| 193
|
|
పశుపతి విటు "పశుపాలాభిగామినో"
యనఁగ నాతలఁపు నీయదియ గాదె
ధర నీయవియె గావె "త్వత్ప్రయుక్తఃకరో
మ్యహ" మనఁగా నాశుభాశుభములు
ధర ధర్మ మిట్లు "భృత్యాపరాధస్స్వామి
నోదండ" యన నీకె కాదె సిగ్గు
క్షమియింపు "మపరాధశతసహస్రాణి" నా
వెండియు నాయందు వెదకఁ గలదె
|
|
|
బసవ దండనాథ! భక్తజనావన!
భవసమూహిదూర! భద్రకీర్తి!
బసవ! బసవమూర్తి! బసవన్న! బసవయ్య!
బసవ! బసవరాజ! బసవలింగ!
| 194
|
|
నీబంట నీపట్టి నీకింకరుండ నీ
పరిచారకుండ నీప్రాఁతవాఁడ
నీశిష్యవరుఁడను నీకవీశ్వరుఁడ నీ
పౌరాణికుండ నీపాఠకుండ
నీయోగి నీతొత్తు నీయడిగఱ్ఱ నీ
దాసానుదాసుండ నీనుతుండ
నీవర్తి నీపాదనీరేజనుతుఁడ నీ
శిష్టహితుండ నీయిష్టమతిని
|
|
|
దలఁప శరణ "మన్యథాశరణం నాస్తి"
యనుచు నమ్మినాఁడ నాదరించి
కరుణఁ జూడు మయ్య శరణార్థిఁ జు మ్మయ్య!
భక్తి యొసఁగు మయ్య! బసవలింగ!
| 195
|
|
పూర్వంబు మఱచి యపూర్వంబు ప్రొద్దుగాఁ
జెలఁగి చరించెడు సిద్ధబసవ!
దక్షిణాతీతనితాంతజంగమభక్తి
సీమగాఁ జరియించు సిద్ధబసవ!
పశ్చిమదిశ మాని భక్తప్రసాదంబు
సీమగాఁ జరియించు సిద్ధబసవ!
యుత్తరం బది లేక యురుశివాచారంబు
సీమగాఁ జరియించు సిద్ధబసవ!
|
|
|
పరమభక్తవరుల వరగృహాంగణములు
సీమగాఁ జరించు సిద్ధబసవ!
యొం డెఱుంగ నాకు నురుతరంబుగ దిక్కు
దెసయుఁ గావె నీవు బసవలింగ!
| 196
|
|
ఓ భక్తిభండారి! యో ముక్తసంసారి!
యో గుణోద్దామ! యో యోగధామ!
యో కరుణాకర! యో కాలకంధరో!
దానైకశీల! యో గానలోల!
యో జంగమప్రాణ! యో నిత్యకల్యాణ!
యో ప్రమథేశాంశ! యో ప్రశాంత!
యో దండనాయక! యో యిష్టదాయక!
యో సద్గుణధురీణ! యో ప్రవీణ!
|
|
|
భక్తభయవినాశ! పాలితయక్షేశ!
యో శుభప్రకాశ! యో యధీశ!
అవధరింపుమయ్య! యక్కటా యను మయ్య!
భక్తి యొసఁగు మయ్య! బసవలింగ!
| 197
|
|
అయ్య! నీధర్మమే! యాదివృషభమూర్తి!
జియ్య నీధర్మమే శివవిలాస!
భవ్య! నీధర్మమే! ప్రమథసంగాసంగ!
దేవ! నీధర్మమే! దివ్యమహిమ!
స్వామి! నీధర్మమే! సచ్చిదానందాత్మ!
నాథ! నీధర్మమే! నవ్యరూప!
దివ్య! నీధర్మమే! త్రిజగదేకారాధ్య!
విభుఁడ! నీధర్మమే! విషవిదళన!
|
|
|
అవధరింపు మయ్య! యక్కటా యను మయ్య!
కావు మయ్య! నన్నుఁ బ్రోవు మయ్య!
కరుణఁ జూడు మయ్య! శరణార్థిఁ జు మ్మయ్య!
భక్తి యొసఁగు మయ్య! బసవలింగ!
| 198
|
|
ప్రభుగుణస్తోత్రైకపాత్రుండు బసవయ్య
శ్రీపాదములయందుఁ జిక్కినాఁడ
మాదిరాజయగారి మనుమండు బసవయ్య
శ్రీపాదములయందుఁ జిక్కినాఁడ
మడివాలు మాచయ్య మదకరి బసవయ్య
శ్రీపాదములయందుఁ జిక్కినాఁడ
కుమ్మరగుండయ్య తమ్ముండు బసవయ్య
శ్రీపాదములయందుఁ జిక్కినాఁడ
|
|
|
భక్తితోడ నీదు పాదపద్మంబులు
నమ్మి వెతల నెల్లఁ జిమ్మి మిగుల
భవభయంబు వాయు బంటను నీభక్తి
కెసఁగఁ జిక్కినాఁడ బసవలింగ!
| 199
|
|
మాదిరాజయ్య వాఙ్మయదృశ్యమై శివ
భక్తసభల నట్ల పరగుచుండ
బాచిదేవుని వచఃపద్ధతి దివ్యమై
భక్తసభల నట్ల పరగుచుండ
కల్లిదేవుని మహాకథనంబు కెనయుఁగా
భక్తసభల నట్ల పరగుచుండ
బసవ నీగీతప్రబంధంబునకుఁ బోలి
భక్తసభల నట్ల పరగుచుండ
|
|
|
సకలభక్తవచనసంగతిఁ దేటయై
భక్తసభల నట్ల పరగుచుండఁ
జేయు మయ్య! నిన్నుఁ బాయక వేఁడెద
వసుధ నాదుకృతియు బసవలింగ!
| 200
|
|
ఆది శబ్దబ్రహ్మ మనుచును నక్షరా
త్మక మని శబ్దశాస్త్రములు వలుక
నవి నూకి భట్టవేదాంతశాస్త్రంబు ల
న్యోన్యపథ్యంబులై యొప్పుచుండ
నవి నిరసించి సాంఖ్యంబును యోగశా
స్త్రంబును దమలోనఁ జర్చసేయ
నిన్నియుఁ గా వని యిదమిత్థ మనుచు స
ర్వప్రమాణంబు లీశ్వరుగుఱించి
|
|
|
న్యాయవృత్తిఁ బరగు న్యాయవైశేషిక
మతఁడె బ్రహ్మ మనుచు శ్రుతులఁ గలిసి
వినుతి సేయుచుండ వేఱొండుదైవంబు
వసుధలోనఁ గలఁడె బసవలింగ!
| 201
|
|
రమణ శ్రీలైంగ్యపురాణంబునందు "న
రకప్రాప్నుయా" త్తనుఁ బ్రకటితముగఁ
జర్చింప శివధర్మశాస్త్రము నట్లు "త
ద్విధ నరకం" బని విశ్రుతముగ
"తదవశ్యభోజన దానకుర్వంతియే
నరకం వ్రజే" త్తనఁ బరగునట్లు
స్కాందంబునను మఱి "కశ్చాచరత్యాది
దాతా" యని పురాణతతుల నట్ల
|
|
|
మ్రోయు శ్రుతులు "ప్రత్యవాయో" యనెడుఁ గాన
భర్గుభక్తి లేనిబ్రాహ్మణులకు
దాన మిచ్చునట్టి దాతకు నరకంబు
పాటుదప్ప దయ్య బసవలింగ!
| 202
|
శివానుభవసూత్రవివరము
|
ఆత్మఁదానవ్యక్తమందుఁ బ్రాణము పుట్టుఁ
బ్రాణమునందు సంభవము మనసు
మనసున వాగ్వృత్తి జనితమౌ వాగ్వృత్తిఁ
బ్రభవించు శబ్దప్రపంచ మట్ల
యాత్మాది భూతాది యందంగ ముదయించు
నంగంబునం దింద్రియములు వొడము
నింద్రియంబుల జనియించు విషయము ల
వ్విషయంబులను సంభవించుఁ గోర్కు
|
|
|
లర్పితంబు లగుచు నారోహి నవరోహి
నాత్మఁ దోఁచు నణఁగు నదియు నవియు
నాత్మయును దదర్పితాదులయందు ను
ద్భవముఁ జెందుచుండు బసవలింగ!
| 203
|
|
పశువు దా జీవాత్మ పాశ మంతర్దేహ
బంధ మా పశుపాశపతి గురుండు
పశువు పుట్టిన సప్తదశలింగజాతి కం
తర్దేహి పాశబంధంబుఁ ద్రుంచి
పాంచభౌతికబహిఃప్రకృతి పూర్వము వుచ్చి
ప్రాణంబు వాక్ప్రచారత లయించి
ప్రాణలింగాంగసంబంధ మధిష్ఠించి
యం దాత్మఁ దప్పక హత్తుకొల్పి
|
|
|
యాత్మయును బ్రాణలింగనిరంతరాత్మ
యాత్మ దా ఘనతరము సుఖాంచితాను
భూతి స్వామి భృత్యజ్ఞానరీతి నట్ల
యొసఁగుమీ ప్రసాదంబును బసవలింగ!
| 204
|
|
ఆరాధ్యదేవు నిజాంశమౌ భావగ
ర్భముననై యిష్టలింగము సృజింప
సత్కృపాచార్యుఁ డాసత్కృపాహస్తగ
ర్భమునఁ బ్రసాదదేహము సృజింపఁ
దద్దేశికేంద్రుఁ డాత్మశ్రుతిప్రాణగ
ర్భమునఁ బ్రాణప్రదానము సృజింపఁ
దద్గురుమూర్తి స్వతంత్రప్రసాదగ
ర్భమున శుద్ధప్రసాదము సృజింప
|
|
|
భావలింగంబు ప్రాణంబు ప్రకృతిఁ గూర్చి
దాని కసమప్రసాదచైతన్య మొసఁగి
యట్టి చరలింగమూర్తి యౌ నాప్రసాది
కెసఁగ గౌరవ మొసఁగిన బసవలింగ!
| 205
|
|
ఆత్మ జాగ్రదవస్థమై స్థూలభూతన
చ్చైతన్య మగుచు విఖ్యాతి నుండు
నాత్మ కంఠమున స్వప్నావస్థమై సూక్ష్మ
భూతచైతన్యవిస్ఫూర్తి నుండు
నాత్మ సుప్తావస్థ నటనాభితలమునఁ
జైతన్యశూన్యవిశ్రాంతి నుండు
నాత్మ సర్వావయవాన్విత మగుచుఁ దు
ర్యావస్థమై యట్ల యణఁగి యుండుఁ
|
|
|
జను నవస్థాంతరనిమిత్తజనితకర్మ
ములు తదారంభదేహసంభోగవేళ
నర్పితముఁ జేసి పొందు సుఖాతిశయము
నెసఁగుచుండుఁ బ్రసాదాత్మ బసవలింగ!
| 206
|
|
అలరు జాగ్రదవస్థ నఖిలేంద్రియములు ని
వేదించి పొందుఁ బ్రసాది కర్మ
వితతులు స్వప్నావగతములై తల లెత్తఁ
గాఁ దదీయోపభోగప్రసక్తిఁ
గదలని భూతసూక్ష్మములచే నారంభ
మైన యంతర్దేహ మంగవింపఁ
దత్కర్మపటలముఁ దగ సమర్పించి స్వ
ప్నమునఁ బొందుదు రీఘనప్రసాది
|
|
|
కలల నున్మేషకరగతి క్రమము లగుట
నవియు నర్పించి పొందు నిరంతరప్ర
సాది పొందంగ నేర్చునే జడత నుడిగి
భ్రమయు వెఱపును మఱచియు బసవలింగ!
| 207
|
|
అనుదినపూర్వనిద్రార్పితశివలింగ
గర్భముద్రితసుఖాక్రందనేంద్రి
యములు సద్గురుకృపాయత్తరాజసగుణ
సన్నిధి నాయుషస్సవనవేళఁ
బ్రభవించి నియమితప్రాణలింగస్పర్శ
నాంతరంబులను దినాంతరంబు
కలయ సద్గురుసాత్వికప్రసాదైక్యసు
స్థితిపదార్థక్రియార్పితసుఖంబు
|
|
|
లొసఁగుచుఁ దదీయసుగుణతామసగుణప్ర
సాదసమరససహితభావాదిలింగ
గర్భమున విశ్రమముఁ బొందఁగాఁ బ్రసాది
కెసఁగ నుపచారములు నొప్పు బసవలింగ!
| 208
|
|
అది దైవ మాచార్యుఁ డధ్యాత్మ మైనట్టి
యది భూత మగు పరమాత్మలింగ
మాపరమాత్మ జీవాత్మసంగతి కుపా
దానంబు ప్రాణ మాధార మనఁగ
నాప్రాణమును సంగమం బగు నత్ప్రాణ
మాత్మ ప్రాణనిరూఢి యట్టిత్రిపుటి
యందు సద్గురునివాక్యార్థంబు నమ్మి మా
యామలవ్యతిరిక్త మగుచు నాత్మ
|
|
|
ప్రాణలింగాంగమథనసంబంధలీలఁ
దనరఁ బ్రాణాంగములు ప్రసాదములు గాఁగ
మానసేంద్రియములు నంద మగ్నములుగ
నెసఁగుసుఖ మల్పులకు నెద్ది బసవలింగ!
| 209
|
|
అది దైవ మాచార్యుఁ డది భూత మిష్టలిం
గార్పితశబ్ద మధ్యాత్మ మదియు
నది దైవ మాచార్యుఁ డది భూత మిష్టలిం
గార్పితస్పర్శ మధ్యాత్మనేత్ర
మది దైవ మాచార్యుఁ డది భూత మిష్టలిం
గాత్మస్వరూప మధ్యాత్మదేహ
మది దైవ మాచార్యుఁ డది భూత మిష్టలిం
గార్పితరుచ్య మధ్యాత్మదేహ
|
|
|
మదియు ఘ్రాణ మధ్యాత్మనిర్మాల్యగంధ
మట్టు లది భూత మది దైవ మాగురుండు
అగు ప్రసాదాదిబుద్ధేంద్రియాత్మవిషయ
భరితసుఖ మల్పులకు నెద్ది బసవలింగ!
| 210
|
|
అది దైవ మాచార్యుఁ డది భూత మిష్టలిం
గార్పితకలిత మధ్యాత్మవాక్కు
అది దైవ మాచార్యుఁ డది భూత మిష్టలిం
గార్పితదాన మధ్యాత్మపాణి
అది దైవ మాచార్యుఁ డది భూత మిష్టలిం
గార్పితాలాప మధ్యాత్మపాద
మది దైవ మాచార్యుఁ డది భూత మిష్టలిం
గార్పితసహిత మధ్యాత్మపాయు
|
|
|
వదియును నుపస్థ యిష్టలింగార్పితంబు
మఱియు నుత్సర్జనక్రియల్ దొరలుచుండఁ
బరగఁ గర్మేంద్రియాత్మకగురుప్రసాద
భరితసుఖ మల్పులకు నెద్ది బసవలింగ!
| 211
|
|
వినియెడుశ్రోత్రముల్ వినుటయు వినఁబడు
శబ్దజాలంబుఁ దచ్ఛ్రవణసుఖము
పొందెడుత్వక్కును బొందుటయును బొందు
స్పర్శంబులు తదీయసంగసుఖము
కనియెడునేత్రముల్ కనుటయుఁ గాంచురూ
పములు సద్వీక్షణాస్పదసుఖంబు
ఆనెడు జిహ్వయు నానుటయును నాను
రసము తదీయాచరణసుఖంబు
|
|
|
మూర్కొనందగు ఘ్రాణంబు మూరుకొనుట
మూరుకొనుగంధమును దత్సముదితసుఖము
నర్పితముఁ జేసి పొందు మహాప్రసాది
కెసఁగుసుఖ మల్పులకు నెద్ది బసవలింగ!
| 212
|
|
షట్స్థలాంతైకవింశత్సహస్రస్వరా
ర్పణము ప్రాణక్రియార్పణమువలన
శ్వాసనిశ్వాసాంగపోషణార్పణమపా
నవ్యాన మరుదర్పణంబువలనఁ
దనుజేష్టధాతువర్ధనముఖార్పణము దా
నసమానపవనార్పణంబువలన
నిష్ఠీవనోన్మేషనిమిషార్పణంబులు
నాగకూర్మసమర్పణంబువలన
|
|
|
క్షుత్పిపాసాదిపరిశిష్టగుణసమర్ప
ణము కృకరదేవదత్తధనంజయార్ప
ణముల నగు దశప్రాణార్పణముల నతని
కెసఁగు లింగార్పణమునన బసవలింగ!
| 213
|
|
అజినశిరోజశల్యస్నాయుముఖకర
ణార్పణబుద్ధిసమర్పణమున
లాలాస్రమూత్రశుక్లస్వేదమజ్జాము
ఖార్పణము మనస్సమర్పణమున
క్షుత్పిపాసాఖ్యసుషుస్తిసంయోగము
ఖార్పణతేజస్సమర్పణమునఁ
గలితనాసాశ్వాసగమనాగమననిరో
ధార్పణ వాయుసమర్పణమునఁ
|
|
|
గామముఖ్యమోహాదిసంకలితభయస
మర్పణమ్ము నాకాశసమర్పణమున
నట్టిభూతార్పణంబు నాత్మార్పణమున
నెసఁగు మీప్రసాదంబులు బసవలింగ!
| 214
|
|
తలపించు మనసును దలఁచుటయుఁ దలంచు
తలఁపులు మఱి సముద్గతసుఖంబు
పలికించు వాక్కును బలుకుటయును బల్కు
పలుకులు తత్సముద్భవసుఖంబు
చరియించు కాయంబు చరియించుట చరింపఁ
దగు సముచ్చయసముద్గతసుఖంబు
చేయు కర్మంబులు సేయుటయును జేయ
నగుచెయ్వులును దన్నితాంతసుఖము
|
|
|
చెలఁగి చెల్లించు నాత్మయుఁ జేతనమును
చేతనాధిష్ఠితక్రియాతీతసుఖము
నర్పితముఁ జేసి పొందును ద్యత్ప్రసాది
కెసఁగుసుఖ మల్పులకు నెట్లు బసవలింగ!
| 215
|
|
మున్ను పల్కిన పల్కుచున్న పల్కఁగఁ గోరు
చున్న వక్తవ్యసముదితసుఖము
మున్ను ముట్టిన ముట్టుచున్న ముట్టఁగఁ గోరు
చున్న స్పర్శవ్యసముదితసుఖము
మున్ను చనిన చనుచున్న చనఁగఁ గోరు
చున్న గంతవ్యసముదితసుఖము
మున్ను సల్పిన సల్పుచున్న సల్పఁగఁ గోరు
చున్న కర్తవ్యసంయోగసుఖము
|
|
|
మున్న యెఱిఁగిన యెఱుఁగుచునున్న యెఱుఁగఁ
గోరుచున్న సుబోధ్యప్రచారసుఖము
ప్రబలు నాంతర్యసుఖసమర్పణముఁ జేసి
యెసఁగఁ జెందుఁ బ్రసాదియు బసవలింగ!
| 216
|
|
అచలేంద్రియము శ్రోత్ర మవ్విషయము చంద
మది యింద్రియప్రథమార్పణంబు
నచలేంద్రియము నేత్ర మది గనువిషయంబు
లవి యింద్రియద్వితీయార్పణంబు
నచలేంద్రియమ్ము త్వక్కు చరించువిషయము
లవియ యింద్రియతృతీయార్పణంబు
నచలేంద్రియము ఘ్రాణ మవ్విషయంబులు
నవి యింద్రియచతుష్టయార్పణంబు
|
|
|
రసన యచలేంద్రియంబు చరంబు విషయ
మదియు నటుగూడఁ బంచేంద్రియార్పణంబు
చెందుకొలికియుఁ దా నిచ్చి చెందుకొలికి
నెసఁగ నెఱుఁగఁ బ్రసాదియౌ బసవలింగ!
| 217
|
|
అచలేంద్రియము వాక్కు వచనము దగఁ జరం
బది యింద్రియత్వదీయార్పణంబు
అచలేంద్రియము పాణి యచలంబు తత్క్రియ
యది యింద్రియత్వదీయార్పణంబు
అచలేంద్రియము పాద మచరంబు తత్క్రియ
యది యింద్రియత్వదీయార్పణంబు
అచలేంద్రియము గుహ్య మచర మయ్యానంద
మది యింద్రియత్వదీయార్పణంబు
|
|
|
మనసు నచలేంద్రియంబు సంస్మరణ మచర
మదియు నటుగూడఁ బంచేంద్రియార్పణంబు
చెందుసుఖమును దా నిచ్చి పొందుసుఖము
నెసఁగువాఁడు ప్రసాదియౌ బసవలింగ!
| 218
|
|
సర్వాంగములు లింగసన్నిహితంబుగ
లింగంబు నయ్యంగసంగతముగ
ప్రాణంబు లింగానుబంధంబు గాఁగ నా
లింగంబు ప్రాణానుసంగతముగ
లీల నింద్రియములు లింగసంగంబు నా
లింగంబు నింద్రియసంగతముగ
సన్మనంబును లింగసన్నిహితంబుగా
లింగంబుఁ దన్మనస్సంగతముగ
|
|
|
నట్టు లన్యోన్యసౌహృదాహ్లాదభరిత
సమరసానందసత్సుఖసహితహితస
మాహితాన్యోన్యగర్భవిహరణకేళి
నెసఁగువాఁడె ప్రసాదియౌ బసవలింగ!
| 219
|
|
నీనేత్రలింగసన్నిహితమై నేత్రంబు
లర్పించు రూపలతాంతములను
నీశ్రోత్రలింగసన్నిహితమై శ్రోత్రంబు
లర్పించు శబ్దలతాంతములను
నీఘ్రాణలింగసన్నిహితమై ఘ్రాణంబు
లర్పించు గంధలతాంతములను
నీయంగలింగసన్నిహితమై త్వక్కు దా
నర్పించు స్పర్శలతాంతములను
|
|
|
నీదుజిహ్వయు లింగసన్నిహిత మగుచు
భజన సేయుచు సత్పూజపత్రపుష్ప
మట్ల దాల్చును నిర్మాల్య మాప్రసాది
భక్తి నయనేంద్రియంబుల బసవలింగ!
| 220
|
|
ముఖ్యరూపార్పణోన్ముఖ మగు లింగస
న్నిహితనేత్రంబులు నిన్నుఁ జొచ్చి
ముఖ్యగంధార్పణోన్ముఖ మగు లింగస
న్నిహితనాసికమును నిన్నుఁ జొచ్చి
ముఖ్యశబ్దార్పణోన్ముఖ మగు లింగస
న్నిహితకర్ణంబులు నిన్నుఁ జొచ్చి
ముఖ్యరసార్పణోన్ముఖ మగు లింగస
న్నిహితరసజ్ఞయు నిన్నుఁ జొచ్చి
|
|
|
ముఖ్యసంస్పర్శనార్పణోన్ముఖతలింగ
సన్నిహితమౌ శరీరంబు నిన్నుఁ జొచ్చి
యర్పితముఁ జేసి పొందు సుఖానుభూతి
నెసఁగువాఁడె ప్రసాదియౌ బసవలింగ!
| 221
|
|
ముఖ్యవాగర్పణోన్ముఖ మగు లింగస
న్నిహితవాగ్వృత్తియు నిన్నుఁ జొచ్చి
ముఖ్యమనోర్పణోన్ముఖ మగు లింగస
న్నిహితమానసమును నిన్నుఁ జొచ్చి
ముఖ్యక్రియార్పణోన్ముఖ మగు లింగస
న్నిహితపాణిస్థితి నిన్నుఁ జొచ్చి
ముఖ్యమాత్మార్పణోన్ముఖ మగు లింగస
న్నిహితసత్కర్మము నిన్నుఁ జొచ్చి
|
|
|
వ్యక్తసన్మానసార్పణోద్యుక్తలింగ
సన్నిహితమానసంబును నిన్నుఁ జొచ్చి
యర్పితముఁ జేసి పొందు సుఖానుభూతి
నెసఁగువాఁడె ప్రసాదియౌ బసవలింగ!
| 222
|
|
వసువర్ధననిమిత్తవాగ్గమనోత్థలా
లాతతు ల్భాండంబు లంటెనేని
భిస్సటోత్కటరసోపేతపాకంబుఁ బ
చనవహ్ని యాహుతిఁ గొనియెనేని
ధరఁ బరదేవతాపరలింగబాహ్యవ్ర
తభ్రష్టులును మఱితాకిరేని
మశకపిపీలికామక్షికాముఖజంతు
చికురాద్యుపహతులు చెందెనేని
|
|
|
రంధ్రనీరంధ్రభాండవిరచితమేని
యవి నిషిద్ధపాకాన్నముల్ భవసమర్ప
ణార్హములు గావు చూడ ననర్హ మగును
భవము గాదె దలంపఁగ బసవలింగ!
| 223
|
|
ద్రవ్యశ్రవణసంస్మరణదర్శనస్పర్శ
నాదిరుచ్యంతరూపార్పణంబు
పిండితముద్గలపృథుకబళాభ్యంత
రాన్వితభక్ష్యభోజ్యార్పణంబు
శాకరసద్రవ్యషడ్రససూపోద
నాన్యోన్యపరిమిశ్రితార్పణంబు
తత్పదార్థాన్వితతత్ఫలావృతలలి
తాభినియుక్తిసమర్పణంబు
|
|
|
భక్ష్యభోజ్యలేహ్యపానీయచోష్యము
ఖానుభవకలాసమర్పణంబు
కొలికి యెఱుఁగకున్నఁ గూడునె లింగాను
భవగుణాఢ్యుఁ డగునె బసవలింగ !
| 224
|
|
మశకభృంగపతంగమక్షికస్పర్శ మా
ర్జాలమూషికముఖాసక్తదృష్టి
వీరవ్రతాచారవిరహితవ్రాత్యాది
ధర్మాన్వితాద్వైకకర్మదృష్టి
పంక్తిభోజనయుక్తపరిజనస్వకుటుంబి
భార్యాప్రసాదాన్నపానదృష్టి
వాక్క్రియామానసవ్యాప్తవిజ్ఞాపనా
సావధానేతరసత్వదృష్టి
|
|
|
చేత నుపహతంబు చెందని మఱి యన్య
మిశ్రితంబు గాని మీఁదు పూని
శుభతరప్రసాదసువిధాని గాక గో
ప్యప్రసాది యగునె బసవలింగ!
| 225
|
|
పాకశాకములలోఁ బడు నాని తీపులు
ఖండితస్వరములు గదియనీక
ద్రవ్యాకృతులు దగఁ దల్చి లోఁజాలక
నడపాటురూపులు సుడియనీక
నానాన్నపానపునస్స్పర్శనభ్రాంతి
పొందిడి చేముట్టి పొసఁగనీక
తద్వీచి కబళింపఁ దనుఁ జొచ్చి కడువడిఁ
బోవు నోరూరులఁ బొరలనీక
|
|
|
మనసు నింద్రియవృత్తిచే మరగనీక
చిత్త మింద్రియములచెంతఁ జేరనీక
నీకు నర్పించి భోగించునియతి లేక
యెసఁగునె ప్రసాదసౌఖ్యంబు బసవలింగ!
| 226
|
|
ద్రవ్యముల్ బంధించుతఱి మఱి
వానిపై నత్తి గావించక రిత్తనోరు
నమలక పెదవులు నాకక యుమియక
చప్పరించక లాల దప్పిగొనక
చిఱుదగ్గు దగ్గక జిహ్వ సారింపక
పెదవులు దడపక యుదరనీక
గ్రుక్కిళ్ళు మ్రింగక బిక్కుఁ బిల్వక యాత్మ
జీవసంయోగముఁ జెడఁగనీక
|
|
|
పరగ నర్పించి సంభ్రమపడక దుడుకు
పడక పరికించకయ నిజాపాదిగుణము
నెద్ది చూపక వర్తించుబుద్ధిమంతు
నెసఁగును బ్రసాదసౌఖ్యంబు బసవలింగ!
| 227
|
|
శుద్ధాన్నపానముల్ శోధించి శోధించి
స్వామికి వడ్డించుచట్టువంబు
భవ్యమై విలసిల్లు భస్మసంస్పర్శగాఁ
బ్రాణేశునకు నిడుపళ్లెరంబు
కర్తకుఁ దద్రుచుల్ కడిచేసి కడిచేసి
కుడుపుతన్మానసాంగుళపుటంబు
నాదునాలుక నాల్క నాదునాలుక నాల్క
నాదునాలుక నాల్కనాఁ జరించి
|
|
|
పొసఁగఁ దద్రుచులెల్లను బొందుపఱిచి
సంతసిలి నిన్ను మనమున సంస్మరించి
యసమబుద్ధిని నిష్టలింగార్పణాది
వసతిఁ గనినఁ బ్రసాదియౌ బసవలింగ!
| 228
|
|
లింగసాన్నిధ్యంబు లింగాంకితంబేని
స్వామిభృత్యత్వంబు చర్యయేని
సతతపుణ్యోద్యుక్తి సముచితక్రియయేని
యింద్రియస్పర్శంబ యిష్టమేని
అవధానసవిధాన మభ్యర్హితంబేని
విషయస్వతంత్రత విషయమేని
కలితప్రసాదభోగ మ్మనుశ్రుతమేని
నినుఁ జొచ్చి యునికియ మనికియేని
|
|
|
నట్టిపూజకునకుఁ గడు దిట్టమైన
ఫలము గల్గును దప్పక సలలితముగ
గాథ సెందక తా భవాంబోధి విడిచి
పరమసుకృతంబుఁ జెందఁడె బసవలింగ!
| 229
|
|
ఇప్పుడే శబ్దంబు లిచ్చి నీ కది నీవ
తెచ్చి శ్రోత్రములచే నిచ్చి యిచ్చి
యిప్పుడే స్పర్శంబు లిచ్చి నీ కది నీవ
తెచ్చి దేహంబుచే నిచ్చి యిచ్చి
యిప్పుడే రుచ్యంబు లిచ్చి నీ కది నీవ
తెచ్చి రసజ్ఞచే నిచ్చి యిచ్చి
యిప్పుడే వాసన లిచ్చి నీ కది నీవ
తెచ్చి ఘ్రాణంబుచే నిచ్చి యిచ్చి
|
|
|
యిప్పు డెవ్వియుఁ దలఁపఁగ నిచ్చి యట్టి
యెడను మదిఁ దృష్ణఁ గొనకయ గడన చెడక
యెంతయును నర్పణముఁ జేసి యింపు మీఱ
నెసఁగక ప్రసాదఫల మౌనె బసవలింగ!
| 230
|
|
చూపక చూడక చూపక చూచిన
కనులపండువుగను గలక లేక
వినుపింపక వినక వినుపింప వినినను
వీనులకును మఱి వెఱపులేక
అంటింప కంటక యంటింపకుండిన
చేతుల దండిగా భీతి లేక
యానింప కానక యానింప కానిన
జిహ్వకు దట్టమై చింత లేక
|
|
|
వీఁక మూరుకొనక వీఁక మూర్కొనిన ఘ్రా
ణంబు పండువుగ భయంబు లేక
యన్నివిషయములను బన్నుగాఁ దెలిసిన
వాఁడుపో ప్రసాది బసవలింగ!
| 231
|
|
ఆరాధ్యదేవున కర్థార్పణముఁ జేసి
కర మర్థి లింగజంగమముఁ బడసి
నలి దేశికునకుఁ ప్రాణసమర్పణం బాదిఁ
గావించి ప్రాణలింగంబు వడసి
మొదల శ్రీగురులింగమునకు శరీరార్ప
ణముఁ జేసి కడుఁ బ్రసాదమును బడసి
యాచార్యవిభునకు నాత్మార్పణముఁ జేసి
భవ్యజీవన్ముక్తిఁ బడసి యట్ల
|
|
|
చనక ప్రాణంబు నర్థంబుఁ దనశరీర
మును నిజాత్మ వంచింపక మొదలుఁ జుట్టి
మగుడఁ గాక తత్తనులాభమానసునకుఁ
బొసఁగను బ్రసాదసుఖ మబ్బు బసవలింగ!
| 232
|
|
శ్రీగురుమూర్తి కర్పించినతను వన
ర్పితభోగమునకునై పెట్టెనేని
ఆరాధ్యదేవున కర్పితం బైన ప్రా
ణం బనర్పితవిధి నడిచెనేని
ఆరాధ్యదేవున కర్పితం బైన మా
నస మనర్పితముగా నెసఁగెనేని
తద్దేశికేంద్రార్పితం బైన సర్వార్థ
ము లనర్పితములుగాఁ బొలసెనేని
|
|
|
అరసిచూడ నీవును మఱి యాప్రసాది
యును బ్రసాదోక్తిభక్తుల మనుచు మఱియుఁ
జెలఁగి యర్పింప భోగింప సిగ్గు గాదె
భక్తవత్సల! సదయాత్మ! బసవలింగ!
| 233
|
|
ఆత్మ స్వతంత్రలింగానర్పితం బను
కాలాహి కాహుతి గాకయుండ
నంగ మయ్యంగలింగానర్పితం బను
దండపాణ్యుద్వృత్తిఁ దాఁకకుండఁ
ప్రాణంబు ప్రాణలింగానర్పితం బైన
మానసార్పితమున మగ్న మగుచు
దంభోళిహతిచేతఁ దలఁగక యుండ శై
లంబుభాతిని నిబ్బరంబు గాఁగ
|
|
|
నయ్య భవదీయగర్భాబ్ధిశయ్య నునిచి
సావధానార్పణంబుల నవధరించి
నీదుభవ్యప్రసాదంబునియతిఁ గనక
బ్రతుకు గలదె ప్రసాదికి బసవలింగ!
| 234
|
|
దేశికసాంగోపదేశమంత్రంబు ప్ర
సాదము శబ్ద మాశ్రయము గాఁగ
నారాధ్యదేవు శ్రీహస్తమస్తకయోగ
మది ప్రసాదస్పర్శ మాది గాఁగ
నాచార్యవిభుని కృపావలోకనకుఁ బ్ర
సాదావలోకనాస్పదము గాఁగ
సద్గురులింగప్రసాదానుభూతికి
ఘనతరం బైనట్టి జనని గాఁగ
|
|
|
నాప్రసాదికి నాదిగా నట్లు చనక
గురుచరేశ్వరసాదసంస్మరణ గాక
యితర మయినట్టి వేఱె సద్గతులు మఱియు
బ్రతుకు గలదె ప్రసాదికి బసవలింగ!
| 235
|
|
స్వామి నీ నేత్రప్రసాదదీపప్రభా
సంగతి నేత్రపతంగ మడఁగు
స్వామి నీ శ్రోత్రప్రసాదసుషిరనాద
సంగతి శ్రోత్రభుజంగ మడఁగు
స్వామి నీ నాసాప్రసాదచంపకగంధ
సంగతి నాసికాభృంగ మడఁగు
స్వామి నీ కాయప్రసాదయోగస్పర్శ
సంగతిఁ గాయమతంగ మడఁగు
|
|
|
బరమపావన! మీ ప్రసాదరసభుక్తి
యాప్రసాదజిహ్వ యను మత్స్యం బడంచుఁ
గాన యితరదుర్విషయంపుక్రాంతి నణఁచు
భక్తివిషయేంద్రియంబులు బసవలింగ!
| 236
|
|
ననుఁగాని విననికర్ణములు గదా యని
శ్రోత్రప్రసాదంబుఁ జొనుపకున్న
ననుఁగాని పొందనితనువు గదా యని
కాయప్రసాదంబు గ్రమ్మకున్న
ననుఁగాని చూడనికనులు గదా యని
నేత్రప్రసాదంబు నెఱపకున్న
ననుఁగాని యాననినాల్క గదా యని
జిహ్వప్రసాదంబు చేర్పకున్న
|
|
|
"గంధ మన్యథా" యనఁగ నీఘ్రాణ మిదియ
యనుచు ఘ్రాణప్రసాదంబు నినుపకున్న
నీవు నావాఁడు వీఁ డని ప్రోవకున్న
బ్రతుకు గలదె ప్రసాదికి బసవలింగ!
| 237
|
|
నీకు వాహనములై నీలోనఁ జరియించు
మచ్చికఁ గనులు సమర్పణముగ
నీకుఁ బాదములునై నీలోన నడుచు న
య్యడుగుల కడుగు ల్సమర్పణముగ
నీకుఁ బర్యంకమై నీలోన శయనించు
నూర్పుకూర్పులును సమర్పణముగ
నీకు గద్దియ యయి నీలోనఁ గూర్చుండు
మాటకు మాట సమర్పణముగఁ
|
|
|
బంచభోజనాకృతినుండి పంచవిషయ
మానితసుఖార్పణముగ నీలోన మఱియు
నణఁగు చిత్తప్రసాదదేహస్థుఁ డొండు
బయటిసుఖములు దలఁచునే బసవలింగ!
| 238
|
|
లింగపీఠం బగు నంగంబు ప్రాణేంద్రి
యము మజ్జనము చేసి యలవరించు
గంధపుష్పాదులు ఘ్రాణేంద్రియం బద్ది
యెక్కించి ధూపంబు లిచ్చు వరుస
నేత్రేంద్రియం బది నీరాజన మిడఁగ
రసనేంద్రియం బొగి రసము లిచ్చు
వాగింద్రియము నిన్ను వర్ణించు శ్రోత్రేంద్రి
యము వినుపించు గుణాంకనములు
|
|
|
నట్ల యిష్టలింగార్చనం బాచరించి
చను తదీయప్రసాదాత్మసౌఖ్య మొంది
యవిరళేంద్రియస్వాధీనుఁ డగుఁ బ్రసాది
భక్తినియతేంద్రియంబుల బసవలింగ!
| 239
|
|
లోపంబు లేక విజ్ఞాపింపకున్నఁ ద
ద్విజ్ఞాపనము నీవు వినకయున్న
నంటినరూపంబు లర్పింపకున్న నీ
వటులు నేత్రేంద్రియ మంటకున్న
నానక రుచు లవధానియై యీకున్నఁ
బూని తద్విషయాదు లానకున్న
నవియును నినుఁ బోల్చి యనుభవింపకయున్న
నీవు నిట్టులు గరుణింపకున్న
|
|
|
నాప్రసాదియు నీవ నా కనకయున్న
నేను నీ కని నీవును బూనకున్న
సమము గాక యిరువురదోషంబు కలిమి
బలిమి నర్పించుఁ గైకొన బసవలింగ!
| 240
|
|
వినఁగనేరఁడు నీవు వినిపింపక ప్రసాది
వినిపింపకయ నీవు విన వతండు
ముట్టనేరఁడు నీవు ముట్టింపక ప్రసాది
ముట్టింపకయు నీవు ముట్ట వతఁడు
చూడనేరఁడు నీవు చూపింపక ప్రసాది
చూపింపకయ నీవు చూడ వతఁడు
నాననేరండు నీ వానింపక ప్రసాది
యానింపకయును నీ వాన వతఁడు
|
|
|
దావి గొన రట్ల నీవు నతండు గాన
వ్రతులు నిరువురు నన్యోన్యవర్తనముల
చంద మెఱుఁగక యిరువురు పొందువడక
యెసఁగునె ప్రసాదసుఖములు బసవలింగ!
| 241
|
|
వినుపింపకయ తాను వినఁగరా దెవ్వియు
వినకయ వినుపింప వినఁగరాదు
చూచి చూపకయున్నఁ జూడఁ గా దెవ్వియుఁ
జూడక చూచియుఁ జూడఁదగదు
ముట్టి ముట్టింపక ముట్టరా దెవ్వియు
ముట్టక ముట్టింప ముట్టఁ గాదు
మూర్కొని యీకున్న మూర్కొన్నఁ గాదు మూ
ర్కొనక యిచ్చినను మూర్కొనఁగరాదు
|
|
|
యారగించి యీకుండిన నారగింప
కిచ్చినఁ గొనంగరాదు పంచేంద్రియాదు
లైనవిషయముల్ చేకొని యవధరింప
కెసఁగఁగఁ బ్రసాదిధర్మంబు బసవలింగ!
| 242
|
|
చూడ కర్పించినఁ జూడ్కులఁ దనియవు
చూచి యర్పించినఁ జూడ వీవు
ముట్ట కర్పించిన మును చెందనీయవు
ముట్టి యర్పించిన ముట్ట వట్లు
వినక యర్పించిన వీనులఁ దనియవు
విని సమర్పణ సేయ వినవు నీవు
నాన కర్పించిన నాజిహ్వఁ దనియవు
యాని యర్పించిన నాన వట్లు
|
|
|
ఘ్రాణమును సమర్పించువేడ్కయు మనమున
నింద్రియముల నమ్మఁగఁజాల కెట్టు లనక
పొందకయుఁ బొంది పొందించు పొందు స్వాను
భవసుఖం బల్పులకు నెద్ది బసవలింగ!
| 243
|
|
తననేత్రములుఁ దనమనసు నేత్రములు నీ
నేత్రంబులందు నిర్ణీత మయ్యెఁ
దనశ్రోత్రములుఁ దనమనసు శ్రోత్రములు నీ
శ్రోత్రంబులందు విశ్రుతము లయ్యెఁ
దనఘ్రాణమును దనమనసు ఘ్రాణములు నీ
ఘ్రాణంబునందు సంక్రమణ మయ్యెఁ
దనజిహ్వయును దనమనసు జిహ్వయును నం
గము భవజ్జిహ్వాంగకలిత మయ్యెఁ
|
|
|
గాన తత్సమర్పణ మానుఁగాక యనుచు
ననక నినుఁ జొచ్చియును సోహ మనక యలరు
నవ్యయాతీతుఁ డై న దివ్యప్రసాది
కెసఁగుసుఖ మల్పులకు నెద్ది బసవలింగ!
| 244
|
|
నీకు నర్పించియు నిను ముట్టఁ దను ముట్ట
ముట్టింప ముట్టింప ముట్టు నవియు
నీకు నర్పించియు నిను వినఁ దను విన
వినుపింప వినుపింప వినెడి యవియు
నీకు నర్పించియు నినుఁ జెప్పఁ దనుఁ జెప్పఁ
జెప్పింపఁ జెప్పింపఁ జెప్పు నవియు
నీకు నర్పించియు నినుఁ జూడఁ దనుఁ జూడఁ
జూపంగఁ జూపంగఁ జూచు నవియు
|
|
|
నర్పితముఁ జేసి తననిజాపాంగసాంగ
ములను బ్రత్యంగములు దాల్చి ముట్టినట్లు
తలఁచి యర్పించు నిన్నును దన్ను స్వాను
భావసూక్ష్మప్రసాది దా బసవలింగ!
| 245
|
|
అధిపు నుద్దేశించి యర్ఘ్యోదకము లిచ్చు
తఱి మీఁదుపోవునె త్రావకున్న
భూతేశునకు దివ్యపుష్పముల్ పెట్టుమా
త్రానఁ బోవునె మీఁదు తాల్పకున్న
కర్త నుద్దేశించి గంధంబుఁ జదిమిన
ప్పుడు మీఁదుపోవునె పూయకున్న
స్వామి నుద్దేశించు శాకపాకములు ని
వేదన యౌనె యర్పించకున్న
|
|
|
ననుచుఁ బొందుగ శైత్యాదు లన్నివిషయ
మిశ్రితేంద్రియములచేత మీఁదుపోవ
ముట్టునే నీవు ముట్టకమును ప్రసాది
పట్టునో యిచ్చునొ కొనునొ బసవలింగ!
| 246
|
|
శబ్దక్రియార్పణాసక్తి సల్లింగక
ర్ణములఁ బ్రసాదికర్ణములఁ జొచ్చి
రూఢక్రియార్పణారూఢి సల్లింగనే
త్రములఁ బ్రసాదినేత్రములఁ జొచ్చి
స్పర్శార్పణక్రియాభ్రాంతి సల్లింగకా
యమునఁ బ్రసాదికాయంబుఁ జొచ్చి
రససమర్పణకళారమణ సల్లింగర
సజ్ఞఁ బ్రసాదిరసజ్ఞఁ జొచ్చి
|
|
|
యాసమర్పణభావమం దేకదృష్టి
నిలిసి తద్విషయమ్ములు సలలితముగఁ
దెలిసి వర్తించువానికి ధీసయుక్తి
కెసఁగు ముక్తిసుఖంబులు బసవలింగ!
| 247
|
|
అన్యోన్యకాయస్థమై పరకాయప్ర
వేశస్థితి నొడళ్లు వీడుపడక
ప్రాణప్రతిష్ఠానుబంధలీలాచార
విస్ఫూర్తిఁ బ్రాణముల్ వీడుపడక
యర్పితతనుకృతాయతసంగతిఁ బ్రసాద
వివిధోదనాదులు వీడుపడక
భరితావధానానుభవనిరంతరరతి
విషయేంద్రియంబులు వీడుపడక
|
|
|
పరశివవిభూతి సుఖపరంపరవితాన
విలసితోద్దామభావముల్ వీడుపడక
సమయగతలింగ లింగప్రసాదమథన
మెసఁగునె ప్రసాదభావన బసవలింగ!
| 248
|
|
అగు నిర్వురకును నన్యోన్యేంద్రియంబు ల
న్యోన్యభాజనములై యవధరింప
నగు నిర్వురకును నన్యోన్యేంద్రియంబు ల
న్యోన్యహస్తంబులై యాదుకొనఁగ
నగు నిర్వురకును నన్యోన్యేంద్రియంబు ల
న్యోన్యవక్త్రంబులై యనుభవింప
నగు నిర్వురకును నన్యోన్యేంద్రియంబు ల
న్యోన్యేంద్రియంబులై యనుమతింప
|
|
|
నగు నిరువుర కన్యోన్యేంద్రియముల మిశ్ర
మముల నన్యోన్యగర్భగేహములు గాఁగఁ
దివుట లింగంబుఁ దత్ప్రసాదియు మథించు
భావసూక్ష్మంబు లెట్టివో బసవలింగ!
| 249
|
|
శబ్ద మోగిరము ప్రసాది శబ్దంబు ప
ళ్ళెరము యుష్మచ్ఛోత్రలింగమునకు
స్పర్శ మోగిరము తత్సర్వాంగగతియుఁ బ
ళ్ళెరము తృతీయాంగలింగమునకు
ధర్మ మోగిరము తద్ఘ్రాణంబు దాను ప
ళ్ళెరము భవత్ప్రాణలింగమునకు
రస మోగిరంబు తద్రసనాంగ మదియుఁ బ
ళ్ళెరము నీ రసనాంగలింగమునకుఁ
|
|
|
జూపు తా నోగిర మ్మది రూపు మీకు
నయనలింగంబు గాఁగ మనంబుచేత
నర్పణముఁ జేసియును నింద్రియములు తనకుఁ
బళ్ళెరము గాఁగ భోగించు బసవలింగ!
| 250
|
|
గురులింగజంగ మాకుంఠితోపాస్తిఁ బా
ల్పడు స్వామిభృత్యసంబంధితనువు
సహజైకలింగనిష్ఠామహిష్ఠతఁ బాలు
పడు వీరభక్తిసంబంధిమనసు
విరచితానుశ్రుతాచరణైకభావన
సంధిల్లు శరణసంబంధిబుద్ధి
బాహ్యాంతరార్పితగ్రాహ్యప్రసాదసం
బంధమౌ నింద్రియపంచకంబు
|
|
|
ప్రాణలింగప్రమథనసంబంధి యమరుఁ
బ్రాణలింగైక్యసుఖతమాంగాత్మమధ్య
సర్వసంబంధి లింగప్రసాది యనఁగఁ
బడును షట్స్థలసంబంధి బసవలింగ!
| 251
|
|
నీవు చూడఁగఁ జూచు నీవు నూకఁగ నూకు
చూపులు రూపులు రూపవితతి
నీవు మూర్కొనఁ గొను నీవు నూకఁగ నూకు
ఘ్రాణంబు ఘ్రాణదుర్గంధచయము
నీవు వినఁగ విను నీవు నూకఁగ నూకు
శ్రవణముల్ శబ్దాదిశబ్దచయము
నీ వానఁగా నాను నీవు నూకఁగ నూకు
రసనయు రసము నీరసమునట్ల
|
|
|
నీవు పొందంగఁ బొందును నీవు నూక
గరిమ దక్కఁగ నూకును గఠినములను
నిష్టలింగప్రసాదమ్ము నెఱుఁగువాని
కెసఁగు సిద్ధనిషిద్ధముల్ బసవలింగ!
| 252
|
|
గంధ మైనను నీవు గంధింపకున్న దు
ర్గంధంబు గాక సుగంధ మగునె
రూప మైనను నీవు రూపింపకున్న న
రూపంబు గాక సురూప మగునె
శబ్ద మైనను నీవు చని వినకున్న న
శబ్దంబు గాక సుశబ్ద మగునె
రుచ్య మైనను నీవు రుచియింపకున్న న
రుచ్యంబు గాక సురుచ్య మగునె
|
|
|
యట్టులే యుండఁగా నెవ్వఁడైన నా ప్ర
సాది తెలియఁడె మఱి సుగంధాదిచయము
నేల పొందఁడు సద్గంధ మెఱిఁగినట్టి
ప్రాణలింగాంగి జగమున బసవలింగ!
| 253
|
|
కాని దుర్గంధముల్ కా వని తెలియఁగా
నంతనే పొందు ననర్పితములు
కాని కుశబ్దముల్ కా వని తెలియఁగా
నంతనే పొందు ననర్పితములు
కాని కురూపముల్ కా వని తెలియఁగా
నంతనే పొందు ననర్పితములు
కాని నీరసములు కా వని తెలియఁగా
నంతనే పొందు ననర్పితములు
|
|
|
అయిన గంధాదులైనఁ గా వని యెఱుంగు
నంతలోననె పొందు ననర్పితములు
కా వనంగఁ గొననగును గైకొనంగ
భావసంశుద్ధి గాదె యో బసవలింగ!
| 254
|
|
అయిన సుగంధాదు లర్పింపఁ గాని య
నర్పితదోషంబు నది యొకండు
గైకొనరాని దుర్గంధాదు లానిన
యపవిత్రదోషంబు నది యొకండు
పొందక పొందెడు పొందెఱుంగక పొందు
నజ్ఞానదోషంబు నది యొకండు
నవుఁ గా దనుట భ్రాంతి యగుచుఁ దా నటు పొందు
నద్వైతదోషంబు నది యొకండు
|
|
|
నిన్నుఁ బొంది వర్తింపక దన్ను మఱచి
మఱవ కర్పితములు నిష్ఠ మరగియున్న
నాస్వయంకృతదోషంబు లవియు నాల్గు
నెసఁగ నిటు పొందవు ప్రసాది బసవలింగ!
| 255
|
|
భవదభిషేకాంబుపార్శ్వధారోపరి
సలిలపరంపరాసలిలసమితి
భవదీయపూజనాప్రసవపార్శ్వోపరిఁ
బ్రసవపరంపరాప్రసవచయము
యుష్మదర్పితసిక్థయుక్తపార్శ్వాంతర
సిక్థపరంపరాసిక్థవితతి
యుష్మదీయసమర్పితోద్యద్రసక్రాంత
రంజితసద్రసప్రకరమునను
|
|
|
స్వామి నిను ముట్టినదియ ప్రసాద మౌఁ బ్ర
సాదమిశ్రిత మదియ నివేదితంబు
గాఁగఁ గై కొని తక్కుముఖ్యప్రసాది
భావసూక్ష్మం బదెట్టిదో బసవలింగ!
| 256
|
|
శ్రోత్రప్రసాదంబు శ్రోత్రంబునకుఁ దక్క
నన్యేంద్రియముల కనర్పితములు
నేత్రప్రసాదంబు నేత్రంబునకుఁ దక్క
నన్యేంద్రియముల కనర్పితములు
ఘ్రాణప్రసాదంబు ఘ్రాణంబునకుఁ దక్క
నన్యేంద్రియముల కనర్పితములు
జిహ్వాప్రసాదంబు జిహ్వకునే తక్క
నన్యేంద్రియముల కనర్పితములు
|
|
|
అట్ల నీప్రసాదంబు నా ప్రసాది
త్వక్కునకుఁ జెందియు ననర్పితంబు గాఁగఁ
జను తదేకప్రసాదికి ఘననియమము
భక్తివిషయేంద్రియములకు బసవలింగ!
| 257
|
|
అసమర్పిత మనర్పితాన్నపానాదిసం
యుతభోగి ఘనకిల్బిషోపభోగి
తావకమాత్రాన్నధవళార్పితసుభోగి
యతఁడు మిశ్రితప్రసాదైకభోగి
అర్పితార్పితభోగి యఖిలేంద్రియజ్ఞాన
సర్వస్వతంత్రప్రసాదభోగి
యుభయార్పితద్వయాభ్యుదఫలగ్రసనవి
సరభోగి సూక్ష్మప్రసాదభోగి
|
|
|
అర్పితానర్పితప్రక్రియాక్రియాఫ
లాఫలార్పితలింగగర్భాబ్ధిపూర
మౌప్రసాదైకమూర్తి మహాప్రసాది
పరమసమ్మార్జితవిషాది బసవలింగ!
| 258
|
|
అంగలింగానర్పితాన్నపానాదులు
ముట్టినఁ దప్పని ముట్టకైన
ఆత్మలింగానర్పితాన్నపానాదులు
ముట్టినఁ దప్పని ముట్టకైన
మహితసల్లింగసమర్ప్యద్రవ్యాదులు
ముట్టి సహింపక ముట్టకైన
నిష్టలింగసమర్పితేతరవస్తువుల్
ముట్టి యెఱుంగక ముట్టకైన
|
|
|
ముట్టకుండినఁ జాలుఁ జే ముట్టి నీవ
పెట్టఁగల్గుప్రసాదంబు లెట్టులైన
నవిరళేంద్రియములకు సమర్పితముగఁ
బరువడి గ్రహింపుచుండును బసవలింగ!
| 259
|
|
నీకు శుద్ధాన్నపానీయాదు లర్పింప
శుద్ధప్రసాదసంసిద్ధి కలిగి
శుద్ధప్రసాదసంసిద్ధార్పణము చేసి
తత్ప్రసిద్ధప్రసాదంబు వడసి
తత్ప్రసిద్ధప్రసాదము సమర్పణ చేసి
సుప్రసాదాత్మైకసుఖము వడసి
సుప్రసాదాత్మైకసుఖసమర్పణ చేసి
భరితసుఖాతీతపథము వడసి
|
|
|
యాసుఖాతీతపథము లయ్యర్పణములుఁ
దన్ను నర్పించి తన్నె కా నిన్నుఁ బడసి
యీప్రసాది మహార్పితం బౌ ప్రసాది
నెసఁగ నేమని వర్ణింతు బసవలింగ!
| 260
|
|
తాను ముట్టక పదార్థములైన నర్పింప
నవి నీవ చే ముట్టి యవధరింపు
తను ముట్టనీక తద్ద్రవ్యమ్ము లర్పింప
నవియు ముట్టఁగ నేర్చి యవధరింపు
తాను నీలోఁ జొచ్చి తత్సమర్పణ సేయ
నతని నీలో నుంచి యవధరింపు
తనలోన నిను నిడి తత్సమర్పణ సేయ
నతని నీలో నిడి యవధరింపు
|
|
|
తత్ప్రసాదార్పణము చేసి తన్ను నీకు
నర్పణము సేయ నీవును నందుఁ జొచ్చి
యాప్రసాదంబు నిడఁ దన్మహాప్రసాద
మెసఁగ నర్పించుఁ దప్పక బసవలింగ!
| 261
|
|
ఇతరవాహనముల నెట్టు లర్పించును
దా వాహనం బైన తత్ప్రసాది
గమకింప మఱి పాదుకము లెట్టు లర్పించుఁ
దాఁ బాదుకము లైన తత్ప్రసాది
యొండుపీఠములఁ గూర్చుండ నె ట్లర్పించుఁ
దాఁ బీఠ మైయున్న తత్ప్రసాది
శయనింపఁగా వేఱె శయన మె ట్లర్పించుఁ
దా శయ్య యైయున్న తత్ప్రసాది
|
|
|
గాన యర్పించి యర్పింపకయును దండ
నణఁగియుండును భావలింగార్పణంబు
కొలికి యెఱిఁగి యర్పించి కైకొనుప్రసాది
భావసూక్ష్మం బదెట్టిదో బసవలింగ!
| 262
|
|
నీకు నిషిద్ధాన్నపాకాదు లర్పింప
నతనిని వివిధభవాబ్ధి నణఁతు
శుద్ధాన్నములు తనక్షుత్పిపాసార్థమై
యర్పింప నుభయకర్మాబ్ధిఁ ద్రోఁతు
తా ద్రవ్యములు యుష్మదర్చోపచారార్థ
మర్పింప సుకృతకర్మాబ్ధిఁ దేల్తు
వవియు సాక్షాద్భవదభ్యవహారార్థ
మర్పింప నీదుగర్భార్థి మనుతు
|
|
|
వట్లు గా కర్పితనిరూపితాభిమతసు
ఖానలులు భవదీయసుఖార్థముగ స
మర్పణము సేయఁ ద్వత్ప్రసాదాంచితాను
భవసుఖాంబుధి నోలార్తు బసవలింగ!
| 263
|
|
అగుఁ బ్రసాదంబు వస్త్రాభరణాదులు
నర్పితావధి సయోగాంత మగుట
అగుఁ బ్రసాదము పాదుకాసనశయ్యలు
నర్పితావధి సయోగాంత మగుట
అగుఁ బ్రసాదము వాహనాందోళికాదులు
నర్పితావధి సయోగాంత మగుట
అగుఁ బ్రసాదమ్ము శస్త్రాస్త్రదండాదులు
నర్పితావధి సయోగాంత మగుటఁ
|
|
|
దద్వియోగసమర్పణాంతస్తదీయ
దర్శనస్పర్శనాన్వితధారణాంత
సుఖపరంపర లర్పించు సుప్రసాది
కెసఁగుఁ ద్వత్ప్రసాదసుఖంబు బసవలింగ!
| 264
|
|
అర్పితార్హము లగు నన్నపానాదుల
కును శుద్ధి గావించు కొలికి యెట్టు
లభిమంత్రజలముల నగు శుద్ధి యందమా
యామంత్ర మేమిట నయ్యె శుద్ధి
ఆప్రసాదము ముట్ట నగు శుద్ధి యందమా
మును ప్రసాదముఁ గాని ముట్టఁదగదు
ఆద్రవ్యశుద్ధి చేయఁగ వేఱె యాయింద్రి
యములు ప్రసాదేంద్రియంబు లవును
|
|
|
గాన భాండపాత్రస్థము ల్గాకమున్న
తత్పదార్థవిశుద్ధియౌ దారిఁ గోరి
యవియె తగఁ దెచ్చి యర్పించి యనుభవించు
భావ మెఱుఁగఁ బ్రసాదియౌ బసవలింగ!
| 265
|
|
రూపార్పితవ్రతారూఢియుఁ బాడియుఁ
గరికాలవిభునంద కానఁబడియె
రుద్రార్పితక్రియారూఢంబు గూఢంబు
చెన్నయ్యయందునఁ జెప్పఁబడియె
కడికడి కర్పించు గతియును మతియును
జౌడన్నయందునఁ జూడఁబడియె
సహభాజనక్రియాసక్తియు భక్తియు
వీరచోళునియందు వినఁగఁబడియె
|
|
|
నానరేంద్రువ్రతంబు నాయయ్యజిహ్వ
యాగణాధీశుహస్త మాయప్పమతియుఁ
గూడ నొక్కటియైన భక్తునకుఁ గాక
యెసఁగ నితరుల కౌనె యో బసవలింగ!
| 266
|
|
తా నెర్గి యర్పించుద్రవ్యరూపము భేద
మెఱుఁగ కర్పించిన యెఱుఁగు దీవు
తా నెర్గి యర్పించుద్రవ్యసురుచి భేద
మెఱుఁగ కర్పించిన నెఱుఁగు దీవు
తా బాహ్యమున నర్పితము సేయురూపంబు
లంతరార్పణ సేయ నంటె దీవు
తా నంతట సమర్పితము సేయు రుచులను
బాహ్యార్పణము సేయఁ బడయు దీవు
|
|
|
అంద రూపనిరూపపదార్థరుచియు
నొప్పు నేకాంతరార్పణం బొల్ల వీవు
గాన పరికింపఁ దత్సమజ్ఞానభేద
మెసఁగ నెఱుఁగ బ్రసాదియౌ బసవలింగ!
| 267
|
|
నానాస్వరూపప్రధానార్పణము దాన
గానప్రధాన మంగమున కాది
యా నిరూపాంగసమర్పణ మైనట్టి
యంగము తత్ప్రధానార్పణంబు
తత్ప్రధానాంగవిధానత నంగేత
రప్రధానవిధానరహితయుగళి
యాప్రధానము ప్రాణ మంగ మంగము ప్రధా
నార్పణాంగప్రధానాభిరతికి
|
|
|
నాప్రధానరూపము లుభయార్పణంబు
లానిరూపసుఖంబు లేకార్పణంబు
గాన యుభయార్పణము పరిజ్ఞానమతికి
నెసఁగుఁ దత్ప్రసాదసుఖము బసవలింగ!
| 268
|
|
భవదీయమృష్టంబు భాండావశిష్టంబు
గుండ భోగింప నేగురుఁడు చెప్పె
యుతవిషామృతసమస్థితి ననర్పితము మి
శ్రితమును గడు సమర్పితము గాదె
అన్యదైవాన్యమంత్రాన్యమార్గాన్యోన్య
సంకరదోషము సమము గాదె
తమలింగమునకు మీఁదట మఱి వడ్డింప
నండ్రు లింగమునకే యలఁతి వచ్చు
|
|
|
నంతరార్పణమే కాని వింత లేక
మొదవుక్షీరంబులోపల మొదవు చిక్క
నగునె సద్బాహ్యపోషణ మైనలింగ
పరమకృపఁ బొందినఁ బ్రసాది బసవలింగ!
| 269
|
|
దేవ రీక్షింపుచో దృష్టిగోచరము లౌ
విమలార్పణముల సిద్ధములరూపు
లయ్య వడ్డింపుచో హస్తాన్వితంబు లౌ
సిద్ధోదనాంతరసిక్థవితతి
జియ్య యందిచ్చుచో జిహ్వావగతము లౌ
కబళాంతరాళసిక్థముల రుచులు
స్వామి వడ్డించుచో సద్భావయుతము లౌ
నిద్ధేంద్రియజ్ఞాన మిష్టసుఖము
|
|
|
లర్పితములలో నీదుతృష్ణార్తిభయజ
రారుజాదిఘోరాస్త్రశస్త్రములు దాల్చి
జోక చెడకయ తస్కరలోక మెల్ల
వెస జయింపఁ బ్రసాదియౌ బసవలింగ!
| 270
|
|
వీనులచేత నీ వీనులచేతికి
నందించు శబ్దంబు లా ప్రసాది
కన్నులచేత నీ కన్నులచేతికి
నందిచ్చు రూపంబు లా ప్రసాది
ఘ్రాణంబుచేత నీ ఘ్రాణంబుచేతికి
నందిచ్చు గంధంబు లా ప్రసాది
నాలుకచేత నీ నాలుకచేతికి
నందిచ్చు రసషట్క మా ప్రసాది
|
|
|
చేఁతచేతను దన్పు నీ చేతిచేఁతఁ
దన్పుచే స్పర్శ లందిచ్చుఁ దత్ప్రసాది
యవధరించు నీవు గొనెడు నాప్రసాద
మసదృశేంద్రియమ్ములఁ దాను బసవలింగ!
| 271
|
|
శబ్ద మర్పించుచో శ్రవణంబు లటుగూడఁ
జేతులై యర్పణ సేయఁడేని
రూపు లర్పించుచోఁ జూపు లన్నియుఁగూడఁ
జేతులై యర్పణ సేయఁడేని
గంధ మర్పించుచో ఘ్రాణ మంతయుఁగూడఁ
జేతులై యర్పణ సేయఁడేని
రసము లర్పించుచో రసన యంతయుఁగూడఁ
జేతులై యర్పణ సేయఁడేని
|
|
|
పరగ లింగాంగసంయోగభావ మొప్పఁ
జెలఁగి విషయాదు లర్పణ సేయఁడేని
మానసేంద్రియరసములు పూనెనేని
యెసఁగునె ప్రసాదసౌఖ్యంబు బసవలింగ!
| 272
|
|
స్వామి! త్వదీయప్రసాదివీనులకు నీ
వీనులు వీనులై వినికి యొసఁగు
సదయాత్మ! యుష్మత్ప్రసాదికన్నులకు నీ
కన్నులు కన్నులై కాన్పు లొసఁగు
శరణవత్సల! నీ ప్రసాదిరసనకు నీ
రసనయు రసనయై రసము లొసఁగు
కర్త! నీదుప్రసాదిఘ్రాణంబునకును నీ
ఘ్రాణంబు ఘ్రాణమై గంధ మొసఁగు
|
|
|
స్పర్శనము లట్ల మఱియు నర్పణముఁ జేసి
పొందు మీఱఁగ సచ్చిదానందరూప
మందు నెలకొని పాదారవిందవినుతుఁ
డసదృశేంద్రియవ్యాప్తియౌ బసవలింగ!
| 273
|
|
అన్యలింగప్రసాదానుభూతంబు త
త్సంపుష్టరూపప్రసాది చూడ్కి
అన్యలింగప్రసాదానుభూతంబు త
త్సంపుష్టగంధప్రసాది ఘ్రాణ
మన్యలింగప్రసాదానుభూతంబు త
త్సంపుష్టశబ్దప్రసాది వినికి
అన్యలింగప్రసాదానుభావంబు త
త్సంపుష్టభావప్రసాది మనసు
|
|
|
స్పర్శలును రసములుఁ ద్వక్కు దర్శనాదు
లవి నిరూపంబు లభ్యంతరార్పణములు
గాన తత్తత్సమర్పితాదానభేద
మెసఁగ నెఱుఁగఁ బ్రసాది యౌ బసవలింగ!
| 274
|
|
అంగీకృతప్రాణలింగాంగకరచర
ణాదినిరూపితభేద మెఱిఁగి
సాంగవల్లింగనానాంగసమర్పిత
ప్రీతి లింగోదకభేద మెఱిగిఁ
శీతలోదకసముచితపునఃపునరర్పి
తాదిప్రసాదవిభేద మెఱిఁగి
ఆత్మసంభవమగ్నహర్షావహమహార్హ
జలసమర్పణసంవిసర్జనముల
|
|
|
భేద మెఱిఁగి తత్తత్ప్రసాదోదకముల
ధర్మమర్మంబు లెల్లను దగ నెఱింగి
కర్మసముదాయమును దాను గడకుఁ ద్రోసి
వెసఁ జరింపఁ బ్రసాది యౌ బసవలింగ!
| 275
|
|
అర్ఘ్యోదకంబును నర్పితోదకమును
నన్యోన్యక్రియలకు నర్పితములు
మహనీయస్నానసమ్మజ్జనోదకములు
నన్యోన్యక్రియలకు నర్పితములు
హస్తోదకాంఘ్రిసమర్పితోదకములు
నన్యోన్యక్రియలకు నర్పితములు
గండూషపానీయకలితోదకంబులు
నన్యోన్యక్రియలకు నర్పితములు
|
|
|
నవి ప్రసాదంబులో నర్పణావధాన
మర్హ మె ట్లన్న నాభరణాదు లట్ల
గాన యర్పణములచేత గ్రహణభేద
మెసఁగ నెఱుఁగఁ బ్రసాది యౌ బసవలింగ!
| 276
|
|
సద్గురులింగప్రసాదేష్టలింగప్ర
సాదసంసేవనాశ్రాంతరతులు
జంగమలింగప్రసాదేష్టలింగప్ర
సాదసంసేవనాశ్రాంతరతులు
త్రివిధప్రసాదసాదైకవిశ్వాససు
ఖాన్వితకలితవిశ్రాంతరతులు
సకలార్చ్యలింగప్రసాదసేవనములు
గలుగునె పెక్కులింగంబు లనిన
|
|
|
లింగఁ డొక్కండు గాఁడె భక్తాంగకోట్లఁ
దోఁచు నె ట్లన్న నొక్కచంద్రుండు గాఁడె
యంబుకుంభంబులను దోఁచు నట్లు గాన
యెసఁగు బహులింగరూపముల్ బసవలింగ!
| 277
|
|
షట్త్రింశతత్త్వమై సకలనిష్కళదేహ
మది ప్రసిద్ధంబు గుర్వంగ మగుచు
నాసద్గురువునిష్కళాంగంబు దా లింగ
మది శుద్ధ మగు సకలాంగ మగుచు
నాసద్గురుని సత్కళాతీతునిసుకరం
బదియు మహాప్రసాదాంగ మగుచు
నాసద్గురుని ప్రసాదైక్యసంసేవనా
భావంబు మిగుల సద్భావ మగుచు
|
|
|
నాది గౌరవాచారలింగానుభూతి
నలరుచున్నట్టి సత్ప్రసాదానుకళల
నతిశయం బయి వెలుఁగు మహాప్రసాది
పరమశివుఁ డనఁదగునయ్య బసవలింగ!
| 278
|
|
ముట్టక ముట్టించు ముట్టి యర్పించు న
ద్యతనకాలోచితద్రవ్యవితతి
ముట్టి యర్పించుచు మును ముట్ట కర్పించు
సంతసం బందఁ బ్రసాదచయము
ముట్టించి ముట్టు దోర్ముఖమున నదియును
ముట్టి సమర్పించి ముట్టఁ బుట్టు
ముట్ట నింద్రియముల ముట్ట కర్పించు నె
ట్లన్నఁ దత్తత్సుఖానంద యగుచుఁ
|
|
|
గాంత కాంతునిఁ బుత్త్రునిఁ గౌఁగిలించు
విధము దోఁచెను భావంబు వేఱె యైన
నట్ల ముట్టియు ముట్టఁడు ద్యత్ప్రసాది
భావశుద్ధి దా నెట్టిదో బసవలింగ!
| 279
|
|
అన్యతృణోదకాద్యసమర్పితసమేయ
కాయంబు లింగోదకములఁ గడుగు
ద్రవ్యమిశ్రితసికతాద్యసమర్పిత
గతజిహ్వ లింగోదకములఁ గడుగుఁ
దత్తన్ముఖానర్పితాంతనిత్యాకీర్ణ
కర్ణముల్ లింగోదకములఁ గడుగు
నణురేణుధూమ్రముఖ్యాసమర్పితయుతా
క్షరములు లింగోదకములఁ గడుగు
|
|
|
ఘ్రాణమును నట్ల యాకస్మికంబునందుఁ
గడుగును సమర్పితాదిపంకంబు గడుగు
నాప్రసాది లింగస్పర్శ యనుజలముల
మసలక ప్రమోదవశుఁ డౌచు బసవలింగ!
| 280
|
|
అర్పితరూపసమాప్తి యౌనంతకు
భువి భోక్త వీవయై యవధరింపఁ
దద్ద్రవ్యరససమాప్తం బగునంతకు
ననుభోక్త వీవయై యవధరింపఁ
దద్ద్రుచులును సమాప్తం బగునంతకు
ననుభోక్త వీవయై యవధరింపఁ
దత్సుఖంబులు సమాప్తం బగునంతకు
ననుభోక్త వీవయై యవధరింప
|
|
|
నాప్రసాది జిహ్వాదుల నాననీక
పరిసమాప్తంబు గాఁగ నర్పణము సేయు
నునికికిని మెచ్చి మఱి కథోక్తిని బ్రసాద
మెసఁగ నీలోన నుంచును బసవలింగ!
| 281
|
|
ఆత్మలింగానర్పితైకాక్షరోచ్చార
మది యసౌఖ్యంబులకుదురు గాన
ప్రాణలింగానర్పితాణుమాత్రస్పర్శ
యది జరారుజలకుఁ గుదురు గాన
అంగలింగానర్పితాంఘ్రికవిన్యాస
మది పునరావృత్తికుదురు గాన
ఇష్టలింగానర్పితేచ్ఛాప్రవర్తన
మది సత్ప్రవర్తనకుదురు గాన
|
|
|
చనుతదీయాన్యతానుసజ్జననకర్మ
ముల కనర్పితద్రవ్యానుభోగరతుఁడు
కాన సర్వార్పితప్రసాదానుభోగి
ప్రాప్తుఁడే తదాపదలకు బసవలింగ?
| 282
|
|
పాపంగ వలవదే భాండాదిసంగతి
కటమున్నె పూర్వద్రవ్యాశ్రయంబు
లర్పింప వలవదే యవికలేంద్రియముల
నానకమున్నె పదార్థచయము
భోగింప వలవదే పొందంగఁబడు షడ్ర
సములకుమున్నె ప్రసాదసుఖము
తనియంగ వలవదే తనుమనఃప్రాణసం
తృప్తికిమున్నె తదీయభుక్తి
|
|
|
గఱికొనంగ వలదె మఱవక మున్నె మ
హాప్రసాదసత్సుఖాబ్ధిలోన
నట్లు గూడ దేహ మాప్రసాదానుసం
పత్తిఁ గూడ వలదె బసవలింగ !
| 283
|
|
అవికలేంద్రియభుక్తు లర్పితం బయ్యెఁబో
తనుగుణావళు లర్పితముగ వలదె
తనుగుణావళు లర్పితం బయ్యెఁబో నిజాం
తఃకరణం బర్పితముగ వలదె
తనివి దీఱంగ నంతఃకరణం బర్పి
తం బయ్యెఁబో ప్రసాదరసగర్భ
నిర్భయాత్మకసతాంతర్భరితంబు మ
హాప్రసాదంబు దా నర్పితాను
|
|
|
భవము పొందెడివారికి భక్తుఁ డగుచుఁ
ద్రివిధలింగైక్యభావంబుఁ దెలిసి యాత్మ
నిర్వికల్పసమాధిని నెగడుచున్న
వాఁడె ప్రాసాది యగు భువి బసవలింగ!
| 284
|
|
అనువు మీఱఁగ ననుదినవర్ధమానగ
తాస్థినఖరచికురార్పణముగఁ
జర్మకీలాలమాంసస్థూలసూక్ష్మాంగ
దర్పాంగగణశోషణార్పణముగ
సమధాతుజనిత విషమధాతుజనిత ని
జారోగ్యరోగసమర్పణముగఁ
గాలానుగతసహగమనసంయోగస
మాగమములు వివిధార్పణముగ
|
|
|
నఖిలధనధాన్యవస్త్రవిద్యావిభూష
ణాదిసంపదసేవలు నవ్యయములు
నర్పితము చేసి వర్తించు నాప్రసాది
పరగు సర్వప్రసాదినా బసవలింగ!
| 285
|
|
భవికృతకూపప్రవాహతటాకాది
భస్త్రికమండలుభాఁడవారి
భవిజనారంభసంభవధాన్యనికరత
దారామకుల్యాలతాంతపాళి
భవిజనస్పర్శనపల్లవకందము
ఖౌషధప్రముఖపదార్థసమితి
భవిదృష్టిపతనాన్నపానాదిబహుపాక
తైలప్రభృతిరసద్రవ్యచయము
|
|
|
భవికృతాంబరాదులు మఱి భాండభాజ
నాదులు నిషిద్ధవస్తుచయము లభవస
మర్పణానర్హములు తదీయప్రసాది
కెసఁగునె ప్రసాదసౌఖ్యంబు బసవలింగ!
| 286
|
|
లోకనిషిద్ధాన్నపాకాదు లెల్ల సం
స్కారకృతాన్నపాకములసమమె
గాన సంస్కారకృతానర్హములు వాని
పూర్వాశ్రమం బెట్లు పుచ్చవచ్చు
సంస్కారకృతపాకశాకాదికములు సం
స్కారితదర్శనస్పర్శనాది
దర్శనస్పర్శనాత్మక మైనవిషయాదు
లవియెల్ల నిరసన మమరఁ జల్పి
|
|
|
భవివితానక్రియాశుద్ధి పరగఁజేసి
భవివిసర్జనుఁ డై నట్టి భక్తుఁ డెపుడు
సిద్ధలింగసూక్ష్మాచారశుద్ధివలన
భావశుద్ధిని బడయును బసవలింగ!
| 287
|
|
సమధిగతార్ఘ్యసద్గురుజాతప
విత్రేష్టలింగసుక్షేత్రమంద
కేదారవిధియుఁ బ్రసాది పరీక్షించి
కర మొప్ప నంతటఁ గర్షకుండు
వర్తించురీతిని వల నొప్పఁ గేదార
మందున ఫలితంబు పొందువడఁగ
ఫలములు యుష్మదర్పణ మాచరింపుచుఁ
బ్రతిముహూర్తము క్రొత్తపంట యైనఁ
|
|
|
దత్స్వయంకృషిప్రాప్తతత్తత్ప్రసాద
ఫలనిరంతరభోగసంప్రాప్తుఁ డగుచు
నన్యకృషిఫలాదులు ముట్టఁ డాప్రసాది
వెసఁ గళాప్రౌఢి యెట్టిదో బసవలింగ!
| 288
|
|
చరియించు తద్వ్రతాచారప్రవర్తన
లర్పించు నీమనంబంద యుండి
ముట్టు నానాకందమూలాన్నపానాదు
లర్పించు నీకరంబంద యణఁగి
పొందు నానావస్త్రభూషణమాల్యాదు
లర్పించు నీయాత్మయంద యణఁగి
పాయు నానాకర్మబాష్పకణాదులు
నర్పించు నీబుద్ధియంద నిలిపి
|
|
|
యట్ల స్వప్నావగతభవదప్రసన్న
సుఖము లర్పించుచును హుతముఖునిఁ జేసి
యాప్రసాదియుఁ దత్ప్రసాదాంచితాను
భవసుఖం బందు నీయందు బసవలింగ!
| 289
|
|
విహితావిహితములౌ విధినిషేధక్రియ
లవి రెండు నీకు సమర్పణముగ
నందు సముద్భవం బగు పుణ్యపాపంబు
లవి రెండు నీకు సమర్పణముగ
నందు సంభూతంబు లగు శుభాశుభచేష్ట
లవి రెండు నీకు సమర్పణముగ
నందు సంజనితంబు లగు సుఖదుఃఖంబు
లవి రెండు నీకు సమర్పణముగఁ
|
|
|
దత్పరంపరాజనితకృత్యముల మీఱు
భుక్తియుక్తులు రెండు సంసక్తముగను
జనఁ దదీయఫలానపేక్షప్రసాది
కెసఁగు సిద్ధప్రసాదంబు బసవలింగ!
| 290
|
|
హానివృద్ధులును జయాపజయంబులు
నాదియౌక్రియలు నీ కర్పణముగ
నాపదసంపదల్ హర్షాదు లిటులు లో
పాలోపములును నీ కర్పణముగ
నిందాస్తుతులు కర్మనిష్కర్మములును గా
ర్యాకార్యములును సమర్పణముగ
మానావమానముల్ హీనాదికంబులు
నవియెల్ల నీకు సమర్పణముగఁ
|
|
|
గామనాకామములును రాగములు ద్వేష
ములును గ్రియ లెల్లఁ దత్తత్ప్రముఖ్యదశలు
నర్పణము గాఁగ ము న్నున్న యాప్రసాది
కెసఁగునే భవబంధముల్ బసవలింగ!
| 291
|
|
ఘనతరం బై నట్టి గంధవస్త్రాభర
ణాదులు నీకు సమర్పణముగ
చూపులు రూపులు శ్రుతులును మతియుఁ బా
యనిరీతి నీకు సమర్పణముగ
వాసనలును శ్వాసవర్గంబు లవియు ధ
ర్మాధర్మములును నీ కర్పణముగ
రసములు రసనాగ్రరసములుఁ బాటలు
నాటలుఁ జదువులు నర్పణముగ
|
|
|
వీను లాలించుటలుగూడ వివిధవిషయ
సుఖము లర్పించి కైకొను సుప్రసాది
పంచభూతాదికృత్యముల్ బహువిధములఁ
బరిణమించంగఁ దా నేర్చు బసవలింగ!
| 292
|
|
తలఁ పనర్పితవిధిఁ దారునే భవదంఘ్రి
శతపత్రకీర్ణకౌశలమువలనఁ
బలు కనర్పితవిధిఁ జిలుకునే భవదభి
ధానామృతరసపాత్రంబువలన
భావం బనర్పితపద్ధతిఁ బొలయునే
తద్భావమదనోత్సవమున మునిఁగి
ప్రాణం బనర్పితపథమునఁ జనునె త్వ
త్ప్రాణలింగైక్యసంపదలఁ బొదలి
|
|
|
తన్నుఁ జూపునె యసమర్పితములఁ బొదలు
తావకాగతప్రాణమధ్యమున నణఁగి
యింద్రియంబుల నర్పింప నిచ్చసేయఁ
బాల్పడునె త్వత్ప్రసాదియు బసవలింగ!
| 293
|
|
మదనవికారంబు మదిఁ బుట్టునప్పటి
తలఁపు లర్పించెడికొలది యెఱిఁగి
రమణి యావేళను రతి వుట్టి యాడెడు
మాటల నేర్పరివాట మెఱిఁగి
యంగసంగతిఁ జుంబనాలింగనాదుల
తీపు లర్పించెడితెలివి యెఱిఁగి
తమకించుపొందుచేఁ దన్నెఱుంగనియట్టి
సుఖము లర్పించెడిసూక్ష్మ మెఱిఁగి
|
|
|
పరగ నంతరంగ బహిరంగముల యాత్మ
విషయగతులసహిత వివర మెఱిఁగి
యర్పణంబు సేయు నతఁడు ప్రసాదాంగి
పటుదయాంతరంగ! బసవలింగ!
| 294
|
|
శాకమిశ్రమము విస్తారంబు నర్పించు
పాకమిశ్రక్రియాప్రకృతియట్ల
పాకమిశ్రము పొందుపడఁగ నర్పించును
రసమిశ్ర మర్పించు రమణ యట్లు
రసమిశ్ర మవధానరతి రస మర్పించు
రుచిమిశ్ర మైనట్టి రూప మట్లు
రుచిమిశ్ర మాత్మానురూప మర్పించును
వివిధమిశ్రార్పణవిహిత మట్లు
|
|
|
విషయమిశ్ర మాత్మవిభుఁ జొచ్చి యిచ్చుఁచో
తత్ప్రసాదము నవధాన మమర
వెలయ మిశ్రమైన వివిధాన్నరసములు
పరిగ్రహించు టెట్లు బసవలింగ!
| 295
|
|
రాదు పూర్వం బన రాదు పూర్వము వచ్చు
నగుద్రవ్యతత్పూర్వ మణఁగు టెట్లు
ముట్టియు నిడరాదు ముట్టక యీరాదు
ముట్టక ముట్టించు ముట్టు టెట్లు
రుచు లెఱుంగఁగరాదు రుచు లెఱుంగుట గాదు
రుచు లర్పణము సేయ రూప మెట్లు
సోఁకరా దర్పించి సోఁకరా దొల్లక
గంధదుర్గంధసంబంధ మెట్టు
|
|
|
లిచ్చికొనఁగరాని యీరాని వాహనా
సనవిధార్పణములచంద మెట్లు
మిగులఁ బొందఁగలుగుఁ దగవస్త్రభూషణ
భావ మెట్లు కలుగు బసవలింగ!
| 296
|
|
త్రాసునందున మఱి బేసి లేకయ యొక్క
చందమై తూకంబు పొందినట్లు
యుక్తంబుగా నుంచి యొకదిక్కు నేయంగ
నున్నదిక్కున నేఁత యొనరునట్లు
సరి ధనుర్ధరుఁడు లక్ష్యం బేయ బాణంబు
తోడ్తో నరేంద్రుండు దోఁచునట్లు
పిలుచుచు నిద్రించఁ బేర్కొన్ననైన య
క్షరములతోన మేల్కాంచినట్టు
|
|
|
లసమశబ్దాదివిషయసుఖానుభూతి
శ్రోత్రముఖ్యేంద్రియంబులు సోఁకునప్పు
డతిశయంబుగఁ దత్ప్రసాదానుభవము
భవ్య మగురీతిఁ దా నెట్లు బసవలింగ!
| 297
|
|
జగమునఁ గొందఱు శైవుల మంచును
బల్కుచుందురు మఱి పాటిగాను
వివరంబుగా సప్తవిధశైవభేదంబు
లెఱుఁగనేరరు గురుతరముగాను
వృత్తి శైవం బగు బత్తి వైష్ణవ మగుఁ
ద్రికరణశుద్ధి లే దెంచిచూడఁ
గీర్తింపఁగా శివగీతలు చదువరు
తగ భగవద్గీత లగణితం బ
|
|
|
టంచుఁ బల్కుచు నుందురు పంచముఖుఁడు
ఘనతమీఱిన భగవంతుఁ డనెడుబుద్ధి
దోఁప దేమందు వైష్ణవతుల్యు లవనిఁ
బరశివప్రసాదు లెట్లొకో బసవలింగ!
| 298
|
|
ఆకసమునఁ గడుజోకను జనుదెంచు
వైనతేయునిఁ జూచి మానుగాను
ద్వారకాపురివాస! కారుణ్యసాగర!
ధీయుతపోష! కృష్ణా! యటంచుఁ
బొగడుదు రఱిముఱి జగదుపకారి యౌ
వృషభేశుస్మరణ గావింప రెపుడు
మోదంబు మీఱఁ బ్రహ్లాద విభీషణ
యనుచు స్మరించెద రనుదినంబు
|
|
|
నీదుభక్తులఁ జూడరు నీస్వరూప
మిట్టి దన్నను మఱి చెవిఁ బెట్ట రహహ!
యట్టివారిని భువి శైవు లను టదెట్లు
వసుధ వారు ప్రసాదులే బసవలింగ!
| 299
|
|
దహనకార్యము ధర ధర్మం బటందురు
ఖననంబు ధర్మంబు గా దటండ్రు
ఏభూత మాదియౌ నీభూమి స్థూలశ
రీరాదులకును మాతృకయు నెద్ది
యట్టిభూతంబున గుట్టుగా దాఁగుట
కన్నను దహనంబు మిన్న యగునె
శంకరుం డన నొప్పు షణ్మతోద్ధారకుం
డును సమాధియ ధర్మ మనెను గాదె
|
|
|
పూని యెన్నఁడు మఱి ముట్టరానివారు
దాఁకి కాల్పఁగ శల్యముల్ దాఁచి నీటఁ
గలుపువారలు మేము శైవుల మటంచుఁ
బల్కువారు ప్రసాదులే బసవలింగ!
| 300
|
|
భవదీక్షణాంచల ప్రస్తుతనియతఘృ
ణారసపూరవిహారరతులు
భవదీయగురుపాదపద్మరజస్సము
ద్భూతానుభావవిఖ్యాతినుతులు
భవదంఘ్రిసరసిజప్రస్తుతపాంసుస
ముత్తంససీమానుమోదయుతులు
భవదనుభూతివిస్ఫారసుఖామృత
రుచిరసర్వేంద్రియారూఢమతులు
|
|
|
సేయు నీస్తవంబు చెవులార వినువారి
వ్రాయువారిఁ జదువువారి విస్త
రించువారి నతిసమంచితముగఁ బ్రోవు
పటుదయాంతరంగ! బసవలింగ!
| 301
|
ఇది శ్రీమ ద్బసవేశ్వరప్రసాదలబ్ధకవితాధురీణ భృంగిరిటిగోత్ర శ్రీమ త్పాల్కురికి సోమనాథప్రణీతం బగు చతుర్వేదసారము.
సోమనాథునిగూర్చిన కొన్ని ప్రాస్తావికస్తుతులు
శ్లో. |
ఆదౌ భృంగిరిటిః, పురాకృతయుగే నామ్నానుకేశీప్రభుః।
త్రేతాయాం వరవీరశైవశరణ శ్రేష్ఠోమునిః పాణినిః।
ద్వాపారే శివమంత్రసిద్ధికలిత స్సానందనామాంకితః।
ఏవం భక్తహితార్థతః కలియుగే పాల్కుర్కి సోమేశ్వరః॥
|
|
ఉ. |
శ్రీభసితత్రిపుండ్రకపరీతవిశంకటఫాలు, జాటజూ
టీభరధారు, నిర్మలపటీపటలావృతదేహు, నక్షమా
లాభరణాభిరాము, బసవాక్షరపాఠపవిత్రవక్త్రుఁ, జి
చ్ఛోభితచిత్తుఁ బాల్కురికి సోమయదేశికుఁ బ్రస్తుతించెదన్.
|
|
మ. |
వరసర్వజ్ఞశిఖామణిన్, బ్రథితసద్వారప్రమోదాకరున్
నిరతోద్యచ్ఛివధర్మసంచరుఁ, గళానీకాంచితావాసు, భా
స్వరలింగాన్వితదేహు, సర్వవిబుధవ్రాతామృతాధారు, భా
సురపాదుంగళితారిఁ బాల్కురికివంశ్యుం గొల్తు సోమాహ్వయున్.
|
|
(అత్తలూరి పాపయామాత్యుఁడు)
ఉ. |
తేనియసోనలం జిలుకు తేటగు జానుతెనుంగుఁబల్కులన్
వీనులఁ దన్పుకబ్బముల నిక్కపు దేసితెనుంగుఁగైతకున్
బ్రాణము వోసిసట్టి బుధవంద్యుని, శ్రీబసవేశచింతనా
సూనృతచిత్తుఁ బాల్కురికి సోమకవీంద్రుని సంస్మరించెదన్.
|
|