చంపూరామాయణము/పుట122

వికీసోర్స్ నుండి

దద్దయు భక్తిఁ జూడమణి దాను గరంబునఁ దాల్చి మ్రొక్కె శ
శ్వద్దయమానుఁ డైనరఘువర్యునియంఘ్రులకు న్ముదంబునన్.

129


మ.

నిరవద్యప్రభవద్గతాగతముల న్నిస్తీర్ణవిస్తీర్ణదు
స్తరఘోరార్ణవుఁ డయ్యు నభ్రమణివంశ్యగ్రామణీదూత వా
నరసేనాసవిధంబునందుఁ బరమానందాపదేశాపగా
పరిణీమధ్యమున న్మునింగె జనదృక్పాళి విచిత్రంబుగన్.

130


క.

హనుమంతుఁడు కలితమహా, ధనచూడారత్నసన్నిధానముదిత రా
మనృపాయుక్తుం డై చ, య్యనఁ దెలిపెను సతియుదంత మాద్యంతంబున్.

131


ఉ.

నైకనిశాచరీసముదయాన్వహబాధితయై ద్విషత్పురా
శోకవని న్వసించు పరిశుద్ధచరిత్రను సీతఁ జూచితిం
బ్రాకటపూర్వపాతవిపాకముచోత సుపర్ణలోకబం
దీకృతయైన నాగతరుణీమణిఁ బోలినదీనమానసన్.

132


చ.

అసదృశచిత్రకూటవిపినాంతరసీమ నుదీతమైన త్వ
ద్బిసరుహసంభవాశుగవిభీతజయంతదురంతకౢప్తసా
హసమును దెల్చి యెంతయు నుదశ్రుముఖాంబుజ యైనసీత యిం
పెసఁగ నొసంగె మౌళిమణి నిత్తఱి నీ కిది యానవాలుగాన్.

133


గీ.

పోవ నుద్యోగ మొనరించి దేవ యిప్పు, డతులితాశావిశేషపాలితము లైన
సాధ్విప్రాణము ల్మీయభిజ్ఞానముద్ర, చేత ముద్రించి వచ్చితి శీఘ్రముగను.

134


చ.

పటుగుణకారువీటిపురభాస్వదలంకరణప్రసన్న వేం
కటపతిపాదపంకరుహగంధమిళిందమనోవిటంక వేం
కటపెరుమాళ్నృపాగ్రజ యగారచరిష్ణురమాంఘ్రినూపురా
ర్భటిమతికారి గృహ్యకమరాళివిరావ యరాజితజ్వరా.

135


క.

కంఠేకాలపరాక్రమ, శుంఠీనవఖండయోగ శుభవాక్కవిరా
ట్కంఠీరవనుతసద్యః, కుంఠీకృతవిమతయత్న గుణరత్ననిధీ.

136


తోటకం.

అరికాళమహాబిరుదాంక లస, త్కరికాళమహీభృదుదారకులా
భరణా శరణాగతపాలన జి, త్వరతాద్వరిదావనదానఘనా.

137


గద్యము.⁠

ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదసమాసాదిత సరసకవితావిలాస వాసిష్ఠవంశకీర్తిప్రతిష్ఠాసంపాదక తిరువేంగళార్య కలశరత్నాకరసుధాకర జగద్విఖ్యాతకవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతి ప్రణీతంబైన చంపూరామాయణంబను మహాప్రబంధంబునందు సప్తమాశ్వాసము.