చంద్రికా పరిణయము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి
శ్రీరస్తు

శ్రీ లక్ష్మీనరసింహాయనమః

చంద్రికా పరిణయము

ప్రథమాశ్వాసము

శా.

శ్రీవక్షోజధరస్ఫురద్వర మురస్సీమం బ్రకాశింప శం
పావృత్తిన్ సరసత్వ మొంది సుమనఃపాళి ప్రియాత్మీయస
ద్భావస్ఫూర్తిఁ దనర్చు శ్రీమదనగోపాలాహ్వయోజ్జృంభితాం
భోవాహంబు సమస్తలోకముల కామోదప్రదం బయ్యెడున్.

1


సీ.

అశ్రాంతభువనవిఖ్యాతసద్గోత్రుఁ డై
     కనుపట్టు నేచానకన్నతండ్రి
యలఘుకలాశాలియై సత్ప్రభుత్వంబు
     తో మించు నేయింతి తోడఁబుట్టు
విబుధసంత్రాణప్రవీణుఁ డై నిఖిలైక
     నుతిఁ గాంచు నే మానవతిధవుండు
రహి నాత్మసరసధర్మగుణపాళిస్ఫూర్తి
     నలరించు నేకొమ్మ యనుఁగుపట్టి


తే.

యరయ సత్యాదికీర్తనీయస్వవృత్తి
నెనయుఁ గల్యాణమూర్తి దానేవధూటి
యట్టిసిరి రుక్మిణీరుచిరాభిధాన
చిరతరైశ్వర్యములు గృపసేయుఁగాత.

2


మ.

పలుకుందొయ్యలిమోవితేనియలు శుంభత్ప్రీతిమైఁ గ్రోలి ముం
గలిమోముం బొలయల్కపేర మరలం గావించి, పశ్చాత్తటో
జ్జ్వలవక్త్రంబున నాని తా నధికహర్షం బూని యిష్టార్థము
ల్దలకొ న్ధాత యొసంగుఁ గాత శుభధీలాభంబు మాకెంతయున్.

3

సీ.

రమణీయతరపదార్థప్రకాశనిదాన
     భాస్వత్ప్రసాదసంపద వహించి
పటుసారసానందఘటకైకచాతుర్య
     ఘనకృతాలంకారకలన మెఱసి
యనుకూలకాలకంఠాకుంఠకలనాద
     వలమానమంజులధ్వనుల నలరి
యతివేలకవిజాలకామోదనాపాద
     కారణరసభావగరిమనెనసి


తే.

పరమయతియోగసంస్థానపదమనోజ్ఞ
వైభవోన్నతిఁ దగు సరస్వతి మదీయ
మానసాస్థానమందిరమధ్యవీథి
నిండు కొలువుండుఁ గాత నిష్ఖండలీల.

4


చ.

పలుచఁదనంబు పూని జడభావము నందినవారి మౌళిపై
నిలిపి స్వవిగ్రహైకగతి నిచ్చలు నార్య మహాగుణోన్నతం
గలయఁగఁ జేసి ధూర్తకశిఖామణి వై తని గౌరి యల్గఁగా
నలఘుమృదూక్తి వేఁడు శివుఁడాయతసౌఖ్యము మాకు నిచ్చుతన్.

5


చ.

హిమధరణీధరాగ్రణికి నెమ్మె చిగుర్ప జనించి స్థాణుసం
గమరతిఁ బొల్చి పత్త్రకనికాయవిభూషితయై శ్రుతీష్టవా
క్క్రమశుకముఖ్యసద్ద్విజవిరాజిత యయ్యు నపర్ణ నాఁగ ని
స్సమత రహించు కల్పలత సాంద్రఫలంబులు మాకు నిచ్చుతన్.

6


శా.

శ్రీగౌరీకుచహైమకుంభకలితక్షీరంబులం గ్రోలి త
ద్భాగాసక్తనిజాననం బపుడు తా భావించి ప్రత్యాపత
న్నాగభ్రాంతిని దూఁటఁగా జనని తా నవ్యానురక్తిన్ నగన్
ద్రాగానందముఁ జెందు నగ్గణపతిన్ బ్రార్థింతు వాక్సిద్ధికిన్.

7

సీ.

వనరాశిభంగంబు గనఁజేసె నెవ్వాఁడు
    కరముచేఁ బర్వతో త్కరముచేత;
ఘనవలాహకశక్తిఁ గలఁగించె నెవ్వాఁడు
    రుతముచే వేగమారుతముచేత;
నరిపురవిస్ఫూర్తిఁ బరిమార్చె నెవ్వాఁడు
    హేతిచే నిజనఖహేతిచేత;
తతమహామిత్త్రవర్ధన మూన్చె నెవ్వాఁడు
    క్షణముచే మధురవీక్షణముచేత;


తే.

నవని నెవ్వాఁడు జానకీస్వాత్మసూచ
నాంజనాత్మజవిఖ్యాతి నధిగమించె;
నతని మామకకృతిచమత్కృతికిఁ దలఁతు
మహితధీమంతు హనుమంతు మానవంతు.

8


సీ.

సర్వతోముఖచరత్సారద్విజాలంబ
    వాచానిరూఢిచే వఱలె నెవ్వఁ
డతిపరాశరముదాహతిభారతోజ్జ్వల
    ప్రక్రియావిస్ఫూర్తిఁ బరఁగె నెవ్వఁ
డభిరూపచక్రచిత్తార్హార్థగౌరవ
    ప్రతిపాదనప్రౌఢిఁ బ్రబలె నెవ్వఁ
డవిగతఘనరసవ్యాయతహృదయంగ
    మేరామహోన్నతి నెసఁగె నెవ్వఁ


తే.

డతులితాత్మైక్యభావనాయత్తవాణి
కావిహృతి మించె నెవ్వఁడా ఘనునిఁ బ్రథమ
కవిని గృష్ణునిఁ బ్రథితభారవి మయూర
కవిని గాళిదాసు నుతింతుఁ గౌతుకమున.

9

ఉ.

భారతనామకామృత మభంగురసద్ధ్వనియుక్తి మించ వి
స్ఫారకవిప్రతానముదసాంద్రతఁ దాల్పఁగ నాంధ్రవాఙ్మహా
ధార ధరాతలంబున నుదారతఁ దాల్చు రసాధరాంచితా
కారవిధారులం ఘనులఁ గాంతవచస్థ్సితికై నుతించెదన్.

10


చ.

లలితరసోపబృంహణములం గనఁబో దరసజ్ఞవృత్తిచే
మెలఁగి పదార్థకత్రయవిమేళన మెంచదు కాణరీతిచేఁ
జెలఁగి ప్రసాద మెన్నఁడును జేకొన దంచితదోషరూఢిచే
వెలసినయట్టి దుష్కవికవిత్వము నెంతురె ధీరపుంగవుల్?

11


వ.

అని యిష్టదేవతావందనంబును, సుకవిజనాభినందనంబును, గుకవినిందనంబును గావించి, యేనొక్క మహాప్రబంధనిబంధనంబున కుద్యోగించి యున్నఁ దత్పుణ్యరాత్రంబున.

12


సీ.

పరువంపుననగుంపు బలితంపుజిగిపెంపుఁ
     గని యొప్పు పాణియుగ్మములతోడఁ,
జెలువందు నరవిందములయందములు చింద
     ననువొందఁ గల కన్నుఁగొనలతోడ,
జగడంబు గనునంబుముగయంబుజగడంబు
     మేలంబులాడు నెమ్మేనితోడఁ,
దులకించు బలుమించుఁ దలఁకించు నెఱమించు
     గమి మించు హేమాంశుకంబుతోడ,


తే.

మారుఁ బలుమాఱు గేరు మైతీరుతోడ,
సోము నలయించు నెమ్మోముగోముతోడఁ,
బరఁగు మాపాలిమదనగోపాలమూర్తి
యంచితస్ఫూర్తి సాక్షాత్కరించి పలికె.

13

చ.

అనఘ తటాకముల్ వనచయంబులు భూసురకోటిపాలనం
బును వసుగోపనంబు హరిభూరినికేతనముల్ ఘటించి వే
తనయమహోదయంబునను ధన్యత నొందిననీకు సత్కృతిన్
గననికొఱంత యేల యది గ్రక్కునఁ గూర్పుము మాకుఁ బ్రీతిగన్.

14


తే.

వృత్త మే మన్నఁ ద్రేతయం దేము దశర
థాత్మజత్వము గని యున్ననమితరక్తిఁ
జాల మెప్పించె ధరణి సుచంద్రవృత్త
మతని చరితంబు వివరింపు మనఘచరిత!

15


వ.

అని యంతర్హితుం డయ్యె, నంతఁ బ్రభాతం బగుటయు నేనును గాల్యకృత్యంబులు నిర్వర్తించి, విద్వజ్జనంబుల రావించి, పుండరీకాక్షసాక్షాత్కారప్రకారంబు వివరించిన వారు నమందానందులై సత్కులప్రసూతుండవు, సద్గుణగరిష్ఠుండవు నగు నీకు నిట్టిమహోత్సవంబు లేమద్భుతంబు లవధరింపుము.

16


సీ.

పద్మాహితకరప్రభాభాసమానంబు
     సురవాహినీభూతిశోభితంబు
కవిమండలగవీనికాయాతిగేయంబు
     జగదేకపావనాచారయుక్త
ముజ్జ్వలత్సదనీకయోగావలంబంబు
     చారుపుష్కరపదసంగతంబు
ఘనసర్వమంగళాకాంతరూపఖ్యాత
     మనుగతానంతరత్నాంచితంబు


తే.

చెలఁగు నట్టివిష్ణుపదం బశేషభువన
మండలైకాభిపూర్ణతామహిత మగుచు
నింద్రియజ్ఞానవిషయతాతీతవృత్తి
యగుచు శ్రుతినివేద్యగుణాశ్రయంబు నగుచు.

17

చ.

వికలితపంకజాతనవవిభ్రమమై, ఘనగోధ్రతాభిభూ
తకమఠనాథమై, యరుణధామవిభాసితమై, ద్విజోత్తమ
ప్రకటితహార్దయోగభరభావుకమై, ధరయందుఁ బద్మనా
యకకుల ముద్భవించె నటనాత్మజనుష్పదతుల్యవైఖరిన్.

18


క.

ఆసంతతిఁ జాపకళా
వాసవి చెన్నొందె సింగవసుధేంద్రుఁడు ఘో
రాసిమహోరాశిమహో
ద్భాసిహుతాశావలీఢపరవంశకుఁ డై.

19


సీ.

నిజకటకాశ్రితద్విజపోషణమున నె
     వ్వని సార్వభౌమత ఘనత గాంచుఁ
బరమహాహీనసద్బలవిభేదనలీల
     రమణ నెవ్వని నరేంద్రత్వ మలరు
గంధాంకకైరవకాండలుంటాకధా
     మమున నెవ్వని యినత్వము సెలంగు
జాగ్రద్ఘనాఘనసాంద్రమదాపహ
     శక్తి నెవ్వని మహేశ్వరత వొసఁగు


తే.

నతఁడు వొగడొందు జయశాలి, యహితసాల
కీలి, యతిదీప్తినిర్ధూతహేళి, యమర
విసరసన్నుతనయకేళి, యసమసుగుణ
విజితభువనాళి, శ్రీసింగవీరమౌళి.

20


చ.

కరు లరిసంవృతాత్మకటకంబులు, విష్ణునిబద్ధవిగ్రహుం
డురగవిభుండు, కూర్మవరుఁ డుద్ధతభూభృదుదీర్ణమూర్తి, భూ
ధరము లరాతికాండగణదారితగాత్రము లంచు మేదినీ
తరుణి వరించె సింగవసుధావరు నప్రతిమానవిక్రమున్.

21

సీ.

అరిపురభేదనాయతదోర్బలస్ఫూర్తి
     నతరాజవర్ధనవితతకీర్తిఁ
గనదహీనాంగదకలితబాహాలీల
     ఖండితాహితఘనాఘనవిహేల
సద్గణరక్షణక్షమచరణాసక్తిఁ
     బటుచంద్రకోటీరభానిషక్తిఁ
దతసర్వమంగళాంచితగాత్రరుచిపాళి
     నచలధర్మోన్నతప్రచయకేళిఁ


తే.

బ్రకటదుర్గాధినాయకభావభూతి
వైరిదర్పకదాంబకవహ్నిహేతి
నవనిఁ బొగడొందె “సర్వజ్ఞుఁ” డనఁగ సింగ
ధరణిభృన్మౌళి తీవ్రప్రతాపహేళి.

22


తే.

అర్థిసాత్కృతసురభి, పరాళిసురభి,
సుగుణవల్లీప్రకాండైకసురభి, కీర్తి
జితసురభి, శౌర్యసురభి నా సింగనృపతి
పరఁగఁ దద్వంశమును గాంచె “సురభి”సంజ్ఞ.

23


క.

ఆరాజదన్వయంబున
ధీరాగ్రణి పెద్దశౌరి దీప్తాసి[1]మహ
స్స్ఫారాహతధారాహత
వీరాహితగోత్రుఁ డగుచు వెలసెన్ ధరణిన్.

24


సీ.

ఏమాన్యు నతిభీమభీమప్రతాపంబు
     తాపంబు శాత్రవతతికిఁ గూర్చు
నేవీరు ఘనసారహితకీర్తికాండంబు
     కాండంబు నెల్లెడ నలమి పొల్చు

నేరమ్యునతిభూరి భూరినికాయంబు
     కాయంబు నర్థుల కబ్బఁ జేయు
నేరాజు నుత్సాహధీరాంతరంగంబు
     రంగంబు నీతినర్తకికి నెన్న


తే.

నతఁడు ధృతిమంతుఁ, డతిదాంతుఁ, డమలకాంతుఁ,
డశ్వరేవంతుఁ, డవితమహాదిశాంతుఁ,
డంగనాత్మాంబురుహభృంగదంగజితజ
యంతుఁ డగు పెద్దవసుమతీకాంతుఁ డెసఁగు.

25


క.

రాజులలో శ్రీదాంబుద
రాజులలో నెంచఁగా విరాజిలు బహువీ
రాజులచే, దానకళా
రాజులచేఁ బెద్దనృపతి రహిఁ బెద్ద యనన్.

26


తే.

అతనిసతి వల్లభాంబ నా నలరుఁ గన్న
యిల్లు తనమన్నయిల్లు భాసిల్ల, నగుచు
గన్న యిల్ పల్చఁ జేయుచు మన్న యిల్ మ
హాపకీర్తియుక్తముఁ జేయు నబ్జపాణి.

27


క.

ఆ కాంతయందుఁ బెద్ద
క్ష్మాకాంతుఁడు గాంచె మల్లశౌరిని, విలస
న్నాకాంతరమాకాంతర
సాకాంతరమావిశేషు, సజ్జనపోషున్.

28


సీ.

తన కలావిభవంబు తన కలావిభవంబు
     కరణి సుదృగ్జాతి వఱలఁ జేయఁ
దన దానమహిమంబు తన దానమహిమంబు
     గతిని బ్రత్యర్థిసంఘములఁ బెంపఁ

దన సుమనోవృత్తి తన సుమనోవృత్తి
     లీల సదాసవహేలఁ గూర్పఁ
దన మహామిత్రాళి తన మహామిత్రాళి
     పగిది నానావనీభరణ మూనఁ


తే.

దనరు విషమాద్రిజిహ్మగస్తబ్ధరోమ
మత్తమాతంగకఠినకూర్మప్రసంగ
విరసవసుధావధూభోగపరవిహార
శాలిభుజకేళి మల్లభూపాలమౌళి.

29


మ.

అరిచక్రిధ్వజఖండనప్రబలబాహాభూతి దుశ్శాసనా
తిరయోన్మూలనపాండితీమహిమచే దీవ్యన్మహాభీమసం
గరకౌతూహలవృత్తి మించె లలనాకంజాతబాణుండు మ
ల్లరసేంద్రుండు నిజాసిశంబదళితేలాభృన్మహాపక్షుఁడై.

30


సీ.

తా నెంతపుణ్యజనీనుఁ డైనఁ దనధ
     నంబు సూడ మహావరంబ కాదె
తా నెంతరా జైనఁ దన వసుస్పర్శనా
     డంబరం బెంచ జడంబ కాదె
తా నెంతవారికిదా పైనఁ దనజీవ
     నంబు సంప్రాప్తపంకంబ కాదె
తా నెంతఘనవృత్తి దాల్చి మిన్నందిన
     విపులమౌ తనయీగి విషమ కాదె


తే.

యనుచు రారాజు రేరాజు నబ్ధిరాజు
నంబుదంబును నిరసించు ననఘదాన
మహిమ నాహిమగిరిసేతుమహితకీర్తి
పాళి సుగుణాళి మల్లభూపాలమౌళి.

31

మ.

అలమల్లక్షితిభృద్వతంసము సపక్షాభిఖ్యఁ జెన్నొంది రాఁ
జలముల్ మాని ప్రతీపవార్ధిరశనాజానీంద్రు లొక్కుమ్మడిం
గలితోద్యచ్ఛతకోటిసాధనబలఖ్యాతుల్ దిగం ద్రోచి స్వ
స్థలసౌఖ్యంబులు గోర కందిరి వనస్థానస్థితిం జిత్రతన్.

32


క.

ఆ మల్లనృపతి చెన్నాం
బామానినియందుఁ గాంచె మల్లక్షితిపున్
వ్యోమగవీసోమగవీ
రామగవీశాచ్ఛకీర్తిరాజన్మూర్తిన్.

33


సీ.

తన యశశ్ఛద్మజీవనజాతమునకుఁ దో
     యదపథంబు మధుప్రియంబు గాఁగఁ
దన కలాదంభనర్తకికి వేలాగోత్ర
     పరివృతాచల చారుఖురళి గాఁగఁ
దన ప్రతాపవ్యాజదావవహ్నికిఁ దార
     కాసంతతుల్ స్ఫులింగములు గాఁగఁ
దన ధర్మకైతవధారాళవల్లికిఁ
     గాంచనాచల ముపఘ్నంబు గాఁగఁ


తే.

దన మహోదారతోపధివనదతతికిఁ
గాండరుహజాండకోటు లఖండకరక
కాండములు గాఁగ బింకోలుగండబిరుద
కాంతుఁ డిల నేలె మల్లభూకాంతుఁ డెలమి.

34


మ.

అరు దై మల్లధరాధినాయక సముద్యద్భూరిధారాధరం
బరిరాడాశుగభేదశక్తిఁ బటు మిత్రాలోకమోదప్రదో
త్తరలీలావిభవాప్తి శత్రువనితాతాపాస్పదస్ఫూర్తిచే
ధరఁ దార్చుం బరవాహినీవితతి కుద్భ్రాజత్కబంధాఢ్యతన్.

35

సీ. రాజచంద్రులు గాని రాజచంద్రులు గారు
తర మూన్ప నరిదానదానపటిమ,
నచలేశ్వరులు గాని యచలేశ్వరులు గారు
సరి సేయ ధృతిసంగసంగరముల,
నినకుమారులు గాని యినకుమారులు గారు
కదియింప రుచికాండకాండకలన,
గోపాత్మజులు గాని గోపాత్మజులు గారు
పాటి వాగనుభావభావగరిమ,

తే. ననుచు జగ మెన్నఁ బొగడొందు హారిమండ
లాగ్రఖండితరిపుమండలప్రవీర
కాండనిర్భిన్నమార్తాండమండలాంత
రుండు పెదమల్లనాయకాఖండలుండు. 36

ఉ. పూనిక బాలచాపలముఁ బొందు నిభప్రకరంబు, గుడ్లలోఁ
గూన బిలేశయాధిపుఁడు, గూర్మము సూడ శిరంబు నిల్ప లే,
దానగపాళియున్ నడవనైనను నేర దటంచు మేదినీ
మానిని సేరె నౌర పెదమల్లమహీను నహీనయౌవనున్. 37

శా. ఆమల్లక్షితినాథరత్నకరదీవ్యన్మండలాగ్రాంశుమ
ద్ధామస్థేమ రణాగ్రసీమ నరిగోత్రశ్రేణులం దూల్చు ను
ద్దామప్రౌఢిమఁ గేతువుం దునుము నుద్యత్పుండరీకంబులన్
భూమిన్ వ్రాల్చు సురాళి గన్గొనఁ బురాభూతేతరప్రక్రియన్. 38

తే. ఆ ధరాధిపుసతులు లింగాంబ, కొమ్మ
మాంబికయు, నలచిన్నలింగాంబ, వేంక
టాంబ, మల్లాంబ నా మించి రాత్మనాథ
సేవనాయత్తచిత్తతాస్థేమ, నందు. 39

సీ. పాశ్చాత్యజడరాశిఁ బ్రాపించి నర్మద
యగుచు వర్తిలు రేవ నతకరించి,
రాగభూయిష్ఠాత్మ రహి సర్వతోముఖ
వర్తన గల సరస్వతిని గేరి,
బహులపంకోదితపద్మోదయంబున
మలిన యై తగు నర్యమసుత నాడి,
నీచోపసర్పణనియతభంగావాప్తి
వెలవెల నౌ జాహ్నవిని హసించి,

తే. సాధుభాషానుగతిఁ జారుచరితయుక్తి
నిత్యనిర్మలచిత్తత నిరుపమాన
కాంతిసంక్రాంతి నుప్పొంగుఁ గవిజనాంత
రంగరంగద్గుణాలంబ లింగమాంబ. 40

సీ. ఆ లింగమాంబికయం దరాతిబలప్ర
భేదనచణు మల్లభిదురపాణిఁ,
దారకాత్మభయప్రదప్రభావిస్ఫూర్తి
నతిశక్తియుతు వేంకటాద్రిగుహునిఁ,
జినలింగమాంబయందు నవీన
పంకజాతార్దను లింగనృపాబ్జవైరి,
వేంకటాంబికయందు విపులవనీపాల
నక్షముఁ జినలింగనరపసురభి,

తే. బహుళశార్వరపాటనపటువిహారి
నంతరస్థాపితాబ్జనేత్రాంచితాను
భావుఁ జినమల్లభూపాలపద్మహితుని
గాంచెఁ బెదమల్లమేదినీకాంతుఁ డెలమి. 41

ఉ. అందును వేంకటాద్రివిభుఁ డచ్యుతసాయకనాయకాగ్రిమ
స్పందనిపాతితారిపురసంతతియై, కమలాధిపాంచితా
మందమహాశయాంకుఁ డయి, మాన్యగణావనలోలచిత్తసం
బంధపరీతుఁడై, జగతి భాసిలె నౌర బుధుల్ నుతింపఁగన్. 42

సీ. పటుపుండరీకసంకటగృహశ్రేణికల్
పటుపుండరీకసంకటము లయ్యెఁ,
బృథులాచ్ఛభల్లవిస్తృతచత్వరమ్ములు
పృథులాచ్ఛభల్లవిస్తృతము లయ్యె,
వితతసాలకదంబవృతలసద్వేశ్మముల్
వితతసాలకదంబవృతము లయ్యె,
ఘనచక్రిఖడ్గిసంగతరాజవీథులు
ఘనచక్రిఖడ్గిసంగతము లయ్యె,

తే. వేంకటాద్రిక్షమానేతృవిపులబాహు
దండకోదండనీరదాఖండచండ
శరపరంపరఁ బరహంససముదయంబు
వెఱచి చనునెడఁ దత్పురవితతినెల్ల. 43

క. ఆతనితమ్ముఁడు లింగ
క్ష్మాతలపతి వొగడు గనియె సమదారినృప
వ్రాతమనోబ్జాతఘనో
ద్భూతరజస్సైన్యవిజితభువనుం డగుచున్. 44

మ. పరగోత్రాభృదనీకముం గదిసి, శుంభత్సైన్యగర్జాసము
త్కరఘోరాకృతి నంటి, తచ్ఛిరములం గల్పించెఁ గీలాల ము
ద్ధురవేగోగ్రతదాశుగప్రతతికాదుర్వార మై, లింగభూ
వరుఖడ్గచ్ఛలవారిదంబు సుమనోవర్ణ్యాతిచిత్రక్రియన్. 45

తే. అతని యనుజుఁడు చిన్నలింగావనీశుఁ
డలరు నైజమహోభానుఁ డఖిల శార్వ
రాళిఁ దూల్చియు, నరివధూపాళి కాత్మ
రమణ విరహంబుఁ జేయఁ జిత్రప్రశస్తి. 46

సీ. లాటాంతరమున కేలలితవిగ్రహుగుణ
శ్రేణి వినూతనచిత్రరచన,
వంగమండలికి నే వరకలాశాలిప్ర
తాపంబు సూడ రత్నంపుబరణి,
కాశ్మీరమునకు నేకల్యాణనిధికీర్తి
వారంబు మహనీయవజ్రపేటి,
యాని చోళమునకు నే యమనశీలునియాజ్ఞ
యలరారు తెలిముత్తియంపుజల్లి,

తే. యతఁడు వొగడొందు జగములనరినృపాల
మకుటతటకోటికాహితమణికలాప
రాజినీరాజితాంఘ్రినీరేజశాలి
చాపజితశూలి చినలింగభూపమౌళి. 47

క. అతని యనుజుండుచినమ
ల్లతరుణనీరేజశరుఁడు లలి నొప్పె మహో
న్నతగాయకనుతసాయక
హతనాయకఘటితసౌరహరిణేక్షణుఁ డై. 48

సీ. ఈ ధన్యు హేతి ధారాధరం బగుఁ
గాని చో రాజహంసాళి సోలు టెట్టు?
లీ నరేశ్వరుశౌర్య మైనతేజమ
కానిచో లోకతమములు దూలు టెట్టు?

లీ రాజు పాణి మందారశాఖియ
కాని యెడ సుమనశ్శ్రేణు లడరు టెట్టు?
లీ మహేంద్రునికీర్తి కౌముది యగుఁ
గాని యెడఁ గువలయమోద మెసఁగు టెట్టు?

తే. లనుచు విబుధులు నుతియింతు రమరశైల
కందరాసంచలద్దేవకామినీజ
నాభిగీతనవీన“చౌహస్తిమల్ల”
బిరుదనిస్తంద్రుఁ జినమల్లధరణిచంద్రు. 49

ఉ. ఆయనుజుల్ భజింప విమలాత్ముఁడు ముమ్మడిమల్లమేదినీ
నాయకుఁడుర్వి నేలెను గనత్పదపీఠమసారసారభా
మేయకలిందజాజలవిమిశ్రితపాదపునర్భవప్రభా
వ్యాయతజహ్నుజావినతివారితవిద్విడశేషదోషుఁ డై. 50

సీ. ఉన్నతకూటసంపన్నవర్తన యైన
సంతతేరాధరసమితి రోసి,
యెల్లకాలము జిహ్మవృత్తి వర్తిలునట్టి
శేషునిపొం దపేక్షింప మాని,
యళిపేయమదయుక్తి కలిమిఁ దూఁగు దిగంత
కరిమూర్తులను డాయ నరుగు టుడిగి,
యలఘుజడాసక్తిఁ దల యెత్త వెఱచు మ
హాకమఠస్వామినంట వెఱచి,

తే. చెందె భూకాంత యాత్మనిస్సీమభూమ
సకలగుణరత్నభూషితాశావధూటి
కాశ్రవణకోటి ఖరతరఖడ్గపాటి
తవిమతకరోటి మల్లభూధవకిరీటి. 51

మ. ఘనభేరీవరభూరిభాంకృతిజరేఖాసంధి లేఖాలయం
బునకున్ మల్లనృపక్షతక్షితిపరాట్పూగంబు లేఁగన్ ఘనా
యనముం జేరె మహాబిలాఖ్యఁ దురగవ్యావిద్ధయుద్ధోచితా
వని పెంపొందెఁ దదీయరత్నతతి పర్వన్ రత్నగర్భాభిధన్. 52

సీ. తగ మహావిగ్రహమగు కిరాతశ్రేణిఁ
బ్రత్యగ్రదళితవిగ్రహముఁ జేసె,
విప్రమోదాపహవృత్తు లౌయవనుల
విప్రమోదావహవిధులఁ జేసె,
ఘనపద్ధతిక్రమగర్హణు లగు శాత్ర
వుల ఘనపద్ధతి మెలఁగఁజేసె,
నిష్ఠురధర్మగరిష్ఠులౌ నహితుల
నతులసుధర్మాభియుతులఁ జేసె,

తే. ననుచు దరవారిపరిదారితారిహస్తి
మస్తనిస్తులనిర్గళన్మౌక్తికముల
సేసఁ జల్లుచు జయలక్ష్మిసేరెనౌర
వీరమల్లక్షమాపాలువిమలశీలు. 53

శా. ఆలోచింప దధీచిదానము మహావ్యర్థంబు, దోషాకరుం
డాలేఖావళి కిచ్చు నీగి యొక తోయం బై కలామాత్ర మై
చాలం దక్కువ యొక్కపక్షమున, నెంచన్ మించుఁ గా మల్లభూ
పాలగ్రామణిసాతి సద్గుణతతిన్ భావించుచో నెంతయున్. 54

సీ. ద్విజరాజు వెఱఁ గంద వివిధకలాపాలి
పచరించుఁ దత్తఱపాటు లేక,
యలమహానటుఁ డెన్న నతులశృంగారవ
ర్తనఁ జూపు నింతైన శ్రాంతి లేక,

తారాళు లీక్షింపఁ దరుణామృతరసాభి
హరణంబు గావించు నరుచి లేక,
యచలాధిపునిచెంత నధికగహ్వరవిహా
రశ్రీలఁ బూను భారంబు లేక,

తే. మల్లభూపాలు ముమ్మడిమల్లశౌరియట
కీర్తికాంతామతల్లి పంకేజజాండ
కాండగర్భాతిభారసంక్రాంత యయ్యుఁ
దత్తదనుకూలఖేలనాయత్తవృత్తి. 55

తే. ఆధరాధీశసతులు చెన్నాంబ, తిరుమ
లాంబ, మల్లాంబిక, యనంతమాంబిక యన
నాతతాత్మీయసద్గుణస్యూతసుకవి
సూక్తిముక్తాకదంబ లై యొప్పి రందు. 56

సీ. తాఁ జంచలాత్మ యై తనుగన్న వారికి
బలుసుళ్లు దెచ్చు నబ్జాతపాణిఁ,
దతరజోగుణయుక్తి దానవద్ద్విపముల
నంటు గంధోదగ్ర యైన భూమి,
నొకమూలఁ బడియుండి యుచ్చసింహాసన
మంది తాఁ జండిక యైన గౌరి,
గురుఁడు వాక్రువ్వ నక్షరవిగ్రహముఁ బూని
నిక్కి రాజాస్థాని కెక్కు వాణిఁ,

తే. బరిహసించుచు జనయితృభవనకీర్తి
దాయివర్తన సాత్త్వికధర్మనియతి
భర్తృచిత్తానుసృతిఁ బూజ్యపటలసేవఁ
జెలఁగు సద్గుణనికురుంబ చెన్నమాంబ. 57

శా. ఆవామామదనుండు మల్లవసుధాధ్యక్షుండు దచ్చెన్నమాం
బావామేక్షణయందు రామవిభునిన్, మల్లావనీవల్లభున్,
శ్రీవాసేక్షణ నిన్ను మల్లమయెడం గృష్ణాధిపున్ మేదినీ
రావుం గాంచె నచంచలప్రమదసాంద్రా! మాధవక్షోణిపా! 58

క. అం దగ్రజుండు యువతీ
కందర్పుఁడు రామధరణికాంతుఁడు వెలసెన్
మందరబలబంధురభుజ
మందరధరమథితవైరిమహిపాంబుధి యై. 59

సీ. ధర్మనిర్మథనంబుఁ దాఁ జేసి జనకజా
పాణౌకృతిక్రీడఁ బ్రబలఁడేని,
నవరజక్షిప్తరాజ్యాతిభారుం డయి
వనచరవర్తన వఱలఁడేని,
సతతసుగ్రీవానుషక్తాత్ముఁ డై దావ
మున మఖవత్సూనుఁ దునుమఁడేని,
నురుగోవిహారాత్తపరజీవననిధి యై
యలపుణ్యజనభర్త నడఁపఁడేని,

తే. సాటి యనవచ్చు రాముఁడు సాధుసుకృత
కేళి సర్వంసహాభారశాలి త్రాత
సాగ్నిసంతానపాళిసాధ్వవననిత్య
శీలి యగు రామభూపాలమౌళికెపుడు. 60

మ. శరజాతంబు దృణీకరించి, రజనీజానిం గలాభంగ మై
పరవం జేసి, యధఃకరించి యలసర్పస్వామి, రామక్షమా
వరుకీర్తిచ్ఛట సత్యలోకమునకున్ వాగ్దేవితోఁ జెల్మికై
కర మేఁగన్ సురధేనువాస్య మటుగాఁ గావించె మధ్యేసృతిన్. 61

క. ఆ రామునట్లు వెలసెన్
క్ష్మారామారమణుఁ డగుచు మల్లాధిపుఁ డా
సారాయతధీరాశుగ
వారాహతవైరిదానవద్ద్విపకులుఁ డై. 62

సీ. కురులపట్టునకు నేయురుకలానిధియాజ్ఞ
దరుణచంపకగర్భదామకంబు,
మధురోపకంఠసీమకు నేమహాభాగు
తతగుణశ్రేణి ముక్తాలలంతి,
కరహాటకటకభాగమున కేరాజుతీ
వ్రప్రతాపం బబ్జరాగఘటన,
మద్రమధ్యమున కేమాన్యుకలాపాళి
గమనీయమేఖలాకలకలంబు,

తే. లలవిదేహదేశమున కేలలితమూర్తి
కీర్తి గర్పూరచర్చికాస్ఫూర్తి, యతఁడు
“రాజచేకోలగండాం”కరాజితుండు
మల్లభూపాలచంద్రుండు మహిఁ జెలంగె. 63

చ. అనుపమమల్లికార్జునయశోంచితుఁ డైన కుమారమల్లనా
వనిపతి డాయఁ బూని రిపువారము లంత నుపాంతవాహినీ
ఘనతరవారులన్ మునిఁగి గ్రక్కునఁ గాంతురు సౌరసుందరీ
జనకుచకుంభకూటతటసాంద్రమృగీమదసారసంగతిన్. 64

సీ. శ్రీ నంద దనుచు సామైనమే నూనుఁ జా
యల మెచ్చ దనుచు బల్వలపు నెఱపుఁ
దనపదంబునఁ జేరదనుచు వెల్వెలఁబోవుఁ
జెఱఁగు ముట్టదనుచుఁ జెందు మఱపుఁ

దలముఁ జూడ దనుచుఁ దాఁ గలంగు నిజాప
ఘనము నంట దనుచుఁ గల దొలంగుఁ
గటక మొల్ల దనుచుఁ ఘనదానరతిఁ బూనుఁ
గనుదోయిఁ గప్పుకోదనుచు రోఁజు

తే. శూలి సౌరాగ మాశరత్కాలఘనము
ముసలి జడధీనుఁ డుగ్రమౌళి సురవార
ణంబు శేషుండు వారిచందంబుఁ జూచి
గేరు మల్లావనీపాలుకీర్తికన్య. 65

తే. ఆధరాధీశు పిమ్మట నఖిలభూమి
భరము నీవు ధరించితి కిరికులేంద్ర
కమఠవల్లభకులశైలకరటి సంస
దురగనాథులతోడఁ బెన్నుద్ది వగుచు. 66

సీ. బంధురవనకదంబములపాలుగఁ జేసె
ఘనతరపుండరీకముల నెల్ల,
శిఖరిశిఖాశ్రేణిఁ జేరంగఁ బురికొల్పెఁ
గలితసారంగసంఘముల నెల్ల,
ఘోరమహాబిలకోటి నుండఁగఁ జేసెఁ
బ్రబలపరాశుగపటలి నెల్లఁ,
గమలేశ్వరాధీనగతిఁ బొసంగఁగఁ జేసెఁ
దతవైజయంతికావితతి నెల్లఁ,

తే. దన్నునవి యెల్ల మఱచినఁ దాను మఱవ
కాత్మనృపచిహ్నములు దాఁచు నందునందు
శత్రునృపకోటి నీధాటిఁ జకితవృత్తి
పరఁగి చనువేళ మాధవధరణిపాల. 67

చ. అనలమ హీన మై యెసఁగె నౌర త్వదుద్ధతశౌర్యలక్ష్మిచే,
ధనదుఁడు వొందెఁ దా ధర హితస్థితిఁ దావకదానవైఖరిం
గని, యచలవ్రజంబును ముఖస్ఫుటవర్ణవియుక్తిఁ గాంచె నీ
ఘనతరధైర్యవైభవము గన్గొని, మాధవరాయ చిత్రతన్. 68

సీ. తాఁ గుంభినీశతఁ దగి ముఖ్యరుచి నెల్లఁ
బరశిలీముఖకోటిపాలు చేసెఁ,
దా ధరాధీశతఁ దనరి శృంగము నెల్ల
ఘనగండకాండసంకటముఁ జేసెఁ,
దా భోగిరాజతఁ దాల్చి పదం బెల్ల
సాంద్రాహిభీతిజర్జరముఁ జేసెఁ,
దా భూమిదారత ధరియించి పురమెల్ల
బహుళదుష్కీర్తిదుర్భరముఁ జేసె

తే. ననుచుఁ గరిరాజి గిరిరాజి
నాహరిపతి, గిరిపతి నిరాకరించి యిద్ధరణికాంత
సెందె నరిభేదవైభవాంచితు నభీతుఁ
గీర్తిసంపన్నుమాధవక్షితిప నిన్ను. 69

మ. భవదీయోగ్రచమూపరాగపటలాభ్రశ్రేణి యాదోనిధా
నవిషంబుల్ వడిఁ ద్రావ జన్యవసుధానవ్యోరుడోలాధిరూ
ఢవిపక్షక్షితినాథు నూఁచు బలఝాటస్థేమ చిత్రంబు మా
ధవరాయేంద్ర త్వదీయహేతి వెలికిందార్చున్ యశఃక్షీరమున్. 70

సీ. ముకుళితపాణు లై వికవిక నగువారి
స్వీయాంకసంగతిఁ జెంద నీదు,
తల నిల్పికొనఁ బూని తహతహపడువారి
ననురాగయుక్తి డాయంగఁ బోవ,

దడుగు వెట్టఁగ లేక వడఁకు చుండెడివారి
స్థిరమహాధారాప్తిఁ జేర్పఁ జనదు,
తృణగర్భ మగుమోము దెఱచు చుండెడువారి
నెద మీఱ ముఖమంటఁ గదియ దింత,

తే. మనుపదో మహస్సూనులఁ
బెనుపదో న
వీనకీర్తిసంతాన మివ్విపుల నౌర!
తావకీనాసిలక్ష్మి చిత్రప్రశస్తి
వితతగుణసాంద్ర! మాధవక్షితిమహేంద్ర! 71

మ. ధరణిన్ మాధవరాయ తావకబలోద్యద్రేణుపాళీకృతో
ద్ధురభావత్కమహోగ్నిబుద్ధి ప్రమ యై తోఁపంగ నాన్వీక్షకీ
వరు లవ్యాప్తము ధూళి తద్బలమునం బాటిల్లు ధూమధ్వజా
కరధీ యప్రమ యంచు నెంచుట లిఁకం గైకొందురే యెంతయున్. 72

సీ. శారదనారదసాదృశ్యము వహించి
హంసమండలి నందమందఁ జేయు,
బుధవరప్రహ్లాదబోధకశ్రీఁ బూని
భూరిహరిచ్ఛాయఁ బొలుపు మీఱు,
సామోదపుండరీకాఖండరుచిఁ గాంచి
సర్వజ్ఞమతికి దోషము ఘటించు,
ననుపమానఘనార్జునాభిఖ్య నలరారి
పాండురాజవిభూతిఁబరిఢవిల్లు,

తే. నందనందనపాదారవిందభక్తి
వాసితాశ్రయ శ్రీమాధవక్షితీశ
తావకఖ్యాతికాంత యతాంతమగు ని
జానుకూల్యంబు దెల్లమై యతిశయిల్ల. 73

సీ. భూరిప్రకంపనస్ఫూర్తి గ్రక్కున లేచి
పటుతరరథచక్రభంగ మూన్చి,
పరమస్తకోద్దేశపదవికి నెగఁబ్రాఁకి
తద్ఘనాఖ్యామృతధారఁ గ్రోలి,
యతనుసంగరమాప్తి యంటువాయఁగఁ జేసి
యాత్మైకచింతనాయతిఁ దవిల్చి,
యచలయోగస్థేమ మలవడఁగాఁ దీర్చి
కన్నుల నీరొల్కఁగా ఘటించి,

తే. సురుచిరాహారముల్ మాన్పి, పరమశక్తి
భవదసిభుజంగి జటిలతాపదవిహార
విభవములఁ గూర్చెఁ బరహంసవితతి కెల్లఁ
దనర మాధవరాయ! సత్సాంపరాయ! 74

తే. విబుధశిక్షితుఁడవు, శాస్త్రవిదుఁడ, వఖిల
కావ్యవేదివి, ఘనతార్కికవ్యవహృతి
నెఱుఁగుదువు, నీ కసాధ్యమే యింపు మీఱఁ
గృతి వినిర్మింపుము మాధవక్షితిప యనిరి. 75

వ. అనిన నేను బరమానందకందళితహృదయారవిందుండ నై. 76

షష్ఠ్యంతములు


క. భాషాధిప శేషాహిప
భాషాభూషాయితాత్మపటుగుణతతికిన్
దోషాచరదోషాచర
దోషాచరచక్రకలితదోర్బలభృతికిన్. 77

క. కోపాయితపాపాయత
భూపాయితదనుజమథనపూజితమతికిన్
గోపాలనగోపాలన
గోపాలననిబిడరతికి గోహితకృతికిన్. 78

క. కమలాసజనకనాభికిఁ
గమలన్మోహాంధతమసకమలాంకునకుం
గమలాలయకమలాలయ
కమలాలయశయనభృతికిఁ గాంతాకృతికిన్. 79

క. శరణాగతపరిరక్షణ
చరణప్రవణాత్మచిత్తసరసీజునకున్
నరకాహితనరకాహిత
నరకాహితబాణతతికి నరసారథికిన్. 80

క. శ్రీవాసజ్జటప్రోలీ
భావుకపత్తనవిహారపటుశీలునకున్
గోవర్ధనగోవర్ధన
గోవర్ధనవృష్టిహృతికి గోపాలునకున్. 81

వ. అర్పితంబుగా నాయొనర్పం బూనిన “చంద్రికాపరిణయం” బను మహాప్రబంధంబునకుం గథాక్రమం బెట్టి దనిన. 82

కథాప్రారంభము



ఉ. శ్రీ నిరు వొంది నైమిశము సెన్నగు నందు నిజామలాశయా
లానదృఢావబద్ధకమలావరదంతులు శౌనకాది మౌ
నీనులు సూతజుం బలికి రేనృపుఁ డేలె ధర న్నిరీతిగా
నానృపుఁ దెల్పు మన్ననతఁ డాయతకౌతుకపూరితాత్ముఁ డై. 83

శా. సారాక్షీణకలాకలాపనిధి యై, చక్రప్రియంభావుక
శ్రీరమ్యాకృతి యై, దినేశకులలక్ష్మీమూల మై, యిద్ధరా
భారం బూనె సుచంద్రసంజ్ఞ నొకభూపాలాగ్రగణ్యుండు ద
చ్చారిత్రంబు వచింతు నంచుఁ బలికెన్ జంచద్వచోవైఖరిన్. 84

సీ. వరగుణసన్మణివ్రాతసంలబ్ధిచే
శ్రితమహీభృద్వర్యవితతిచేత,
విచరద్ఘనాఘనప్రచయవిస్ఫూర్తిచే
విమలచక్రిప్రచారములచేతఁ,
బటువేగవన్మహాభంగకాండములచే
ఘనవాహినీసముత్కరముచేత,
సాంద్రనానావనచక్రసంప్రాప్తిచే
నసమరాజీవనేత్రాళిచేత,

తే. నలరులచ్చికిఁ బుట్టినిల్లన ననర్ఘ్య
శైలరిపునీలమయసాలసామజేంద్ర
కలితసితపద్మకచ్చంద్రకామినీక
లాపరుచిరంబు శ్రీ విశాలాపురంబు. 85

సీ. వరణాబ్జరాగభావ్యాజబాలాతపా
నిశజృంభితవియద్ధునీసలిలము,
సౌధవజ్రచ్ఛవిచ్ఛలచంద్రికావియో
జితలేఖకేళివేశ్మతలసరము,
స్వస్తికనీలత్విషామిషఘనదత్త
కేకాస్వనస్వనత్కృతకనగము,
రథ్యావలభితార్క్ష్యరత్నశోభాకూట
యవసార్పితామోదకార్కరథము,

తే. భర్మకేతుపటాంచలపవనగళద
నంతకుహనమధురసాఫలాళిఖాద
నాశయోత్పతదతులకీరాభిరామ
గోపురము మించు నిల విశాలాపురంబు. 86

చ. కలిమినెలంతకై నలువగాంచిన మేటివిచిత్రశక్తి రా
జిలఁ బరరాజభీకరతఁ జెన్నలరన్ సృజియించినట్టి యు
జ్జ్వలజలజంబు నాఁగఁ బురి వజ్రమణీవరణం బగడ్త య
న్కొలఁకున నొప్పుఁ దేఁటిసొబగుం గని పైగగనంబు దోఁపఁగన్. 87

మ. పురసాలంబు నిజాఖ్యపెంపు గననో భూరిప్రవాళాప్తము
న్వరనీలాళిసమావృతంబు పరిఖానవ్యాలవాలామృతాం
తరసందృశ్యము నై చెలంగుఁ బొగ డొందన్ దానిపెంగొమ్మ ల
బ్బుర మై రాజపతంగయోగకలనంబుల్ రేవగల్ గాంచుటన్. 88

చ. అనఘహరిప్రతానయుతి నబ్జకరానికరాప్తి భోగిరా
డ్జనపరిలబ్ధి విప్రవరసంతతియుక్తిఁ బురం బనారతం
బును దెలిదీవికన్న సిరిఁ బూని మనం గని రక్తిఁ జేరి ని
ల్చిన కలశాబ్ధి నా విమలజీవనఖేయము వొల్చు నెంతయున్. 89

మ. అరు దై చూడఁబడున్ మహీస్థలి విశాలాధీశలోకేట్కృత
స్ఫురణం బొల్చుపురోర్వికిం బరిఖ యంభోరాశి నాఁ దామ్రర
త్నరుగాలోకనిషక్తి శక్రమణిభాధ్వాంతాళియుక్తిన్ మనో
హరవప్రాంతర మెప్పుడున్ మెఱయ లోకాలోకసామ్యంబునన్. 90

సీ. వెలయింప నేరఁ డుజ్జ్వల‘చంద్రికా’రూఢి
రవి‘ప్రభా’సంసక్తిఁ బ్రబలుఁ గాని,
కనఁడు ‘కావ్యా’శయగౌరవం బగభేది
యురు‘కల్పతరు’లబ్ధి నొనరుఁ గాని,
దఱియ నోపఁడు ‘పక్షధర’వరోద్ధతి శేషుఁ
డసమ‘లోచన’యుక్తి మసలుఁ గాని,
ప్రతిఘటింపఁ గలంగుఁ ‘బ్రాభాకరస్ఫూర్తి’
కబ్జారి ‘కౌముది’ నలరుఁ గాని,

తే. యనుచుఁ దత్సదినత్వగవాధిపత్వ
కుండలిత్వద్విజేశత్వగుంఫనములు
పరిహసింతు రప్పురి నధీత
సకలసుగ్రంథతతు లగ్రజన్మపతులు. 91

మ. అతులాత్మప్రతిభానిరస్తకమలాధ్యక్షాత్మజుల్ త్రాతచ
క్రతతుల్నిర్మలధర్మహేతులునమస్కారప్రియుల్ నిత్యసం
భృతవిశ్వంభరు లంచితోదయు లదోషైకక్రముల్ మింతు రూ
ర్జితతేజోయుతిలోకబంధు లన ధాత్రీనాయకుల్ దత్పురిన్. 92

మ. అలఘుశ్రీయుతి సద్గణావనవిహారారూఢి లేఖస్తుతా
చలధర్మాదృతిఁ బ్రాపితాసమనిధిచ్ఛాయాప్రహృష్యత్సుహృ
త్తిలకాసక్తి ననారతంబుఁ బురి నెంతే మించు నర్యేశమం
డలి స్వానంతగుణప్రవృద్ధిగరిమ న్రాజిల్లు నౌ నౌ ననన్. 93

చ. పురమణి హాలికోత్తములు వూన్చిన ధాన్యపుఁ దిప్ప లర్కభూ
విరుచిశిఖాళిఁ బైపయిని వేఁగఁ దదభ్యుదయాదితంత్రమౌ
హరిపద మంతికస్థలగతాంచితదివ్యధునీతరంగశీ
కరనికరంబులం బొదివి గ్రక్కునఁ జల్వ ఘటించు నిచ్చలున్. 94

మ. అలితోద్యత్కదళీకలాపములు, మేఘావాప్తపాదాన్వితం
బులు, దంతాంతరశోభిహేమవలయంబుల్, ధాతురేఖాసము
జ్జ్వలతావత్కటకాంతముల్, మదగజవ్రాతంబు లవ్వీటిర
థ్యల నిచ్చల్ చరియించు, జంగమకుభృత్సామ్యంబు సంధించుచున్. 95

చ. ధర హరి కెక్కుడన్న మహితక్రమ మూని, యహీనకాండభా
స్వరగతి నొంచు పెంపుఁ గని, వాజికులేశత నొంది, యెంతయున్
హరిహయమానహారి యగునట్టి తరంబు వహించి, సైంధవో
త్కరము, సెలంగు వీట, నిజతార్క్ష్యసమాఖ్య యథార్థతం దగన్. 96

మ. వరవర్ణక్రమభాసివాహయుతి, భాస్వచ్చంద్రచక్రాప్తి వీ
టి రథశ్రేణి వహించియున్, గడునఖండీభూతవిస్ఫూర్తిచే
నరుదై పొల్చుట నొక్కొ, కేరు, గిరికన్యాధీశచక్రాంగవై
ఖరి, నుద్యద్వలభీ విలంబిత మణీఘంటాళి ఘాణంఘణిన్. 97

చ. స్థిరసుమనోవితానములచే, ననిమేషవిలోలలోచనో
త్కరములచే, ననర్ఘమణికామయకూటచయంబుచే, సిరిం
గరము పొసంగు వీటి నవకాంచనసౌధపరంపరల్, మరు
ద్గిరివరవైఖరిం బొలుచు దివ్యపథం బధరీకృతంబు గాన్. 98

మ. అవడీనానిల వాసనాజనిత హార్దాప్తిం, బురిన్ భర్మహ
ర్మ్య వితానాశ్రిత యోషిదాస్యములఁ జేరంబోవు దివ్యాపగా
బ్జవస ద్బంభరపాళి, కుద్గమనజశ్రాంతిం దొలంచున్, విలా
స వనీ సాలలతాంతగంధ లహరీసారంబు మధ్యేసృతిన్. 99

మ. పుర చామీకరసౌధ చత్వర మణీపుత్రీ ముఖాంభోజముల్,
శరజాసాలయ కుడ్యబింబితము లై, చక్కం గనన్, దోఁచు ని
ర్భరదర్శార్కకరాభిచర్విత నిశారాణ్ణిర్మిమిత్సాప్తవా
గ్వర సంయోజిత చంద్రకారణచయవ్యాప్తిన్, విజృంభించుచున్. 100

చ. అతులశుభాగమక్రమము స్వాశ్రిత భూరికలస్వన ద్విజే
శతతులు దెల్ప, వీటిమణిసౌధము, లాజిర హర్మ్యలక్ష్మిపైఁ
జతురత నించుసేస, గృహచత్వర వీథిక లొంది, జాలకా
రతిఁ దగుచాన లెల్లఁ దొరరాజిల ఱువ్వెడు మొగ్గచాలునన్. 101

మ. తరుణుల్ వీటిశిరోగృహాళి నిసి ముక్తాకంతుకం బాడుచోఁ,
గరకంజంబున జాఱి, బంతి, కడ కేఁగన్, దత్సృతిం జేరు చం
దురుఁ, దద్బుద్ధి గ్రహించి, గోర్పఁగఁ, దదస్తోకాహతిన్ గందెఁగా,
కురుమాలిన్యము సత్కులాధిపతి కెట్లొందున్? మదిం జూడఁగన్. 102

సీ. భవ్యతారారూఢిఁ బదనఖంబులు మించఁ
దొడలు రంభారీతిఁ దొడరి యెంచ,
మేనావరస్ఫూర్తి మెఱుఁగుఁజన్ను లెసంగ
నాసల్ తిలోత్తమోన్నతిఁ బొసంగ,
హరిణీవిలాసత నక్షియుగ్మము వొంద
నళికముల్ చంద్రకలాత్మఁ జెంద,
నతనూర్వశిస్ఫూర్తి నలరి వేణిక లెచ్చఁ
దనులు హేమైకవర్తనను మెచ్చ,

తే. నహహ! నిర్జరనీరజాస్యావితాన
హారి సౌందర్యసంగతైకైకమాని
తావయవకాంతి సంపత్తి, నడరినిల్చు
సిరుల, నలరుదు, రబ్జకంధరలు వీట. 103

మ. అనిశాశేషఋతు ప్రసేవిత పురీంద్రారామపంక్తుల్, గళ
ద్ఘన సూనౌఘ పరాగపూగములఁ దోడ్తన్ సేతువుల్ దీర్చి, కీ
ర నికాయాస్యనికృత్త పక్వఫలనీరంబుల్ తగ న్నించు, నొ
య్యన పోషింపనొ! నందనాఖ్య మను నాకాక్రీడ మెల్లప్పుడున్. 104

సీ. జాలకమాలికాజాలంబు లెత్తుట
నుదుటుముత్యపుఁబేరు లొసఁగు మనుట,
సరసబంధూకగుచ్ఛముఁ జూపి కప్పుట
నలప్రొద్దు గ్రుంకఁగావలయు ననుట,
దళముగాఁ గెందమ్మిదళములు గూర్చుట
నీ మీఁద ననురక్తి నెగడె ననుట,
చికిలి సంపెఁగననల్ సెలిమిచే నిచ్చుట
గుఱుతు చంపకలతాకుంజ మనుట,

తే. తెలుపకయ తెల్పి, కడునేర్పు దేటపడఁగ
నలరుబొంకులఁ జెలఁగించి, యఖిలకమన
పాళి తమదండకై యాసపడఁగఁజేసి
విరులు విల్తురు, కుసుమలావికలు వీట. 105

చ. అలనగరాధిమౌళి సరసాగ్రణు లెంచఁ జరించు చల్లవీ
వలి తను భృంగకోటి గొలువన్ విటనేత యనంగ సొంపుమై
నలరెడి పద్మినీతతుల యందపుఁదావులు సెంది, యుబ్బుచుం
గులుకుఁ జిగుర్చుఁ, గన్నెలతకూనల మేల్వల పూని చొక్కుచున్. 106

సీ. సేసకొప్పుల నమర్చిన మొల్లమొగడచాల్
సరిగరుమాలపైఁ జక్కఁ దోఁప,
వలెవాటు వైచిన సుళువుఁ జెందిరకావి
వలిపముల్ పదపల్లవముల జీర,
నెలవంక రేఖలు నెలకొన్న పేరుర
ములఁ జిల్కతాళులు తళుకుసూపఁ,
జెలువంబు నెగడఁ దీర్చిన క్రొత్తకస్తూరి
పట్టెల మేల్తావి మట్టుమీఱఁ,

తే. జెక్కుఁగవ ముత్తియపుటొంట్లజిగి వెలుంగఁ
బలుకుఁగప్రంపువీడెంబు వలపు నిగుడ,
నలరువేడుక వెనువెంటఁ జెలులు నడవ
వేడ్కఁ జరియింతు రనిశంబు విటులు వీట. 107

మ. అకలంకాంబుజపాళికా సుఖిత భృంగాళీ తనూకాంతిదం
భ కళిందప్రభవానుషంగ శిఖిదామా తాండవాపాదనో
దక భంగోత్కర ఘర్షణక్రమ సముద్గచ్ఛ త్పయోబిందు శీ
తకరీభూత పతంగ గంగ, దనరుం దత్ప్రాంతదేశంబునన్. 108

మ. విలసత్సారణికానుయాయి విబుధద్వీపిన్యనర్ఘామృతం
బుల ముక్కారును బండు శాలులు పురీభూదేవపాళీకృతో
జ్జ్వల నానావిధయజ్ఞ తన్నవహవిస్సంభుక్తి బర్హిర్ముఖా
వళు లెల్లప్డు నమర్త్యభావ మజరత్వం బూని మోదింపఁగన్. 109

చ. అనువనసారణీతటయుగాంబుజబృందమరందపూరము
ల్గనిమలు నిండి యానదిజలంబులతోఁ బ్రవహింపఁ బై పయిన్
జను నళిపంక్తి బొల్పెసఁగు సాగరనీరముఁ ద్రావి దప్పిచే
ననిశము మేఘమాలిక తదంబుకదంబము గ్రోలఁ జేరె నాన్. 110

ఉ. పున్నమరేలఁ గాఁపువిరిబోఁడులు కాంచనకందుకంబులం
జెన్నగు చంద్రకాంతతటసీమల వజ్రపుబిల్లదొంతి నే
య న్నెరయంగఁ జాలినరయంబున మార్చి గ్రహింతు రింపుతో
నన్నది నిర్మలోర్మికల నందిన పూర్ణసుధాంశుమూర్తులన్. 111

సీ. కమనీయకామినీగానంబు కమనీయ
కామినీగానంబు గలిసి మెఱయఁ,
జక్రాంగచక్రనిస్వనములు చక్రాంగ
చక్రనిస్వనములు చక్క బెరయ,
బహులహర్యాళికార్భటికలు బహులహ
ర్యాళికార్భటిక లైక్యంబు నొంద,
సారంగరాజఘోషంబులు సారంగ
రాజఘోషములు మిత్రత్వ మూనఁ,

తే. గలితవాహినికాకలకలము నిత్య
కలితవాహినికాకలకలము బెరయ,
నప్పురపుఁజెల్మిచేఁ బోలె నమరతటిని
చెంత శుచిజీవనస్థితిఁ జెలఁగు నెపుడు. 112

క. ఆరాజధాని కధిపతి
యై రాజిల్లును ‘సుచంద్రుఁ’ డను రాజు, మహో
దారగిరీశోరుదరీ
వారవరీవృత్యమానవైరివ్రజుఁ డై. 113

సీ. తనచారుకీర్తిసంతానవల్లరికి స
జ్జాలముల్ సజ్జాలలీల నెనయఁ,
దననిత్యదానాంబు వనజాలయమునకుఁ
బుష్కరం బతినీలపుష్కరముగఁ,
దనఖడ్గపుత్ర్యభిధానకాదంబిని
కరిరాజు లరిరాజు లై తలంకఁ,
దననవ్యధామసాంద్రద్యోతమునకు ఖ
ద్యోతుండు ఖద్యోతరీతిఁ బూనఁ,

తే. దనభుజాభోగిరాడ్భోగమునకు ధరణి
చక్ర మెంతయుఁ జక్రప్రశస్తి బెరయ,
వెలయు నభిరామసౌందర్యవిజితమదన
శక్రసుతచంద్రవిభుఁడు ‘సుచంద్ర’విభుఁడు. 114

చ. అలఘుమహంబునం, గువలయప్రియకారినిజోదయంబున
న్లలితవసుచ్ఛటావితరణంబున, నిస్తులలక్షణంబునం,
గలితచకోరదృఙ్నవసుఖప్రదరూపమునం, గడున్ విరా
జిలు నలరాజు గైకొనఁగఁ జెల్లదె ధాత్రి సుచంద్రనామమున్. 115

సీ. పుణ్యజనప్రియమున మించు నేరాజు
ప్రబలు నేరా జవిపక్షగుప్తి,
నైకసహస్రాక్ష్యవాప్తకుం డేరాజు
సకలాశ లేరాజు చక్కఁ బ్రోచు,

బహువజ్రభూషల భాసిల్లు నేరాజు
దనరు నేరాజు సత్కవిహితాత్మఁ,
బరదేవహరణచాతురి నొప్పు నేరాజు
బలయుక్తి నేరాజు పరిఢవిల్లుఁ,

తే. జెలఁగు నేరాజు నిచ్చ యశృంఖలైక
లక్ష్ము లొప్పారఁ దను ఘను ల్భక్తిఁ గొలువ,
నహహ యారాజు దనరు దివ్యప్రణుత్య
మానితగుణాంశపరిజితామర్త్యరాజు. 116

మ. పరిసంవర్ధిత చంద్రనాగకులరాట్పద్మామృతం బై నిరం
తరముం బొల్చు తదుర్వరాధిప సముద్యత్కీర్తివారాశి పం
కరుహాజాండము నిండుటల్ నిజ మటుల్ గా కున్నచోఁ బుష్కరా
న్తరసీమం గనుపట్టునే తరణిమణ్డల్యేకసంచారముల్. 117

చ. అలఘుసమిత్తలంబున మహామహిమంబునఁ బొల్చు నాకుభృ
త్కులమణిదోఃప్రతాపశిఖికూట మిభశ్రుతివీజనానిలం
బులఁ గడుఁ బర్వినం గరఁగుఁబో యని కాదె యజాండసీమకున్
వలగొనఁ జేసె ధాత యనివార్యజలావరణంబు నేర్పునన్. 118

సీ. గురుతరత్వచిసారగుల్మోత్కరమ్ములు
సరసవిహారమందిరము లయ్యె,
ఘనకందరాముఖోద్గతఝరీజాలంబు
కేళికాదీర్ఘికాపాళి యయ్యెఁ,
గటకశోభితతతగ్రావకూటంబు లు
ద్భ్రాజదాస్థానవితర్దు లయ్యె,
నభినవశతపర్వికావృతాధిత్యకల్
కలితప్రసవతల్పకులము లయ్యె,

తే. సంతతము నాటవికవరసముదయంబు
లభిమతవయస్యవర్యచయమ్ము లయ్యె,
మలయ నగవీథి నమ్మహీవలయనాథ
చంద్రశాత్రవగోత్రాతలేంద్రతతికి. 119

మ. ఇల సజ్జాలకభాసమాన మగు నాపృథ్వీశు కీర్త్యాఖ్య ని
ర్మల హర్మ్యేంద్రమునం దదీయ నవధామ వ్యాజ మార్తాండమం
డల రోచుల్ ప్రసరింప నచ్చటఁ గన న్రాజిల్లు వేధోండమ
ణ్డలు లెంతేఁ ద్రసరేణుబృందసమత న్సంధించి యెల్లప్పుడున్. 120

సీ. ఆత్మకిరాతత్వమత్యుత్సవముఁ బూన్ప
వనచరావృతిఁ గూర్మవర్యుఁ డలరు,
ననిశంబు దర్వీకరాప్తిఁ జేకొని మహా
ప్రజ్ఞుఁ డై కుండలిరాజు దనరుఁ,
బరపద్మినీసుసంపర్కంబుఁ జేసి దృ
ప్తుం డయి దిక్కరీంద్రుండు ప్రబలు,
బహ్వబ్దసంగతిఁ బడసి యెచ్చటఁ జరిం
పఁగ నోపక కులాద్రిభర్త నిల్చు,

తే. గహనముల నొక్కఁ డై దంష్ట్రికాంతుఁ డడరు
ననుచు నిరసించి సత్కులు, నమలరూపు,
ననఘగుణు, నాత్తయౌవను, నలఘుసంప
దాఢ్యు రాకొమరునిఁ జెంది యవని యలరు. 121

మ. కనుఁజాయన్ సిరి వాయ కెప్పుడుఁ జెలంగన్, సమ్ముఖం బంది పా
వని వాగ్భామిని యొప్పఁ, గీర్తి శుచిభావం బూని సేవింప, మే
దిని బాహాంతరసంగతిం బొదల, ధాత్రీభర్త దాక్షిణ్యవ
ర్తనసత్ప్రీతి వహించి మించు సురవర్యస్తుత్యనిత్యోన్నతిన్. 122

వ. సకల జగచ్ఛాసన పాండితీ ధురంధరుం డగు నా రాజశేఖరుం డొక్కనాఁ డాత్మీయసేవాసమాయాత నానాదిశాధినాయక మనోమహోత్పలోల్లాస సంపాదకవిభావిభాసిత చంద్రమకుటాలంకృతోత్తమాంగుండును, గరుణారసపరిపూరితాపాంగుండును, నఖిలభువనవిజిగీషుప్రసవేషుయోజితరసాలశరాసనాంతరదృశ్యమాన కోకనదపలాశాదభ్రవిభ్రమద భ్రూమధ్యవిరోచమాన శిఖిశిఖాంచిత విశేషకవిశేషుండును, వదనేందు నిర్గత చంద్రికాయిత దరహాస భూషుండును, మహాభోగ మణిగణ సముపే తాహీనాంగద శోభిత బాహుండును, నతనుభూతి భాసమాన దేహుండును, ననవధి కైక సద్ద్యుతి యుక్త హార విభూషిత గళుండును, శారద ఘన ప్రభా జయకృత్త్యసితాంశుక సంవేష్టిత నితంబతలుండును, హరివిరోచన సంతతి రసాధీశరాజ వరమకుటవాటికా ఘటిత సరోజ రాగమరీచి రాజి నీరాజిత చరణ కుశేశయుండును, ధీరగ ణాలో కామోదదాయి శృంగారాతిశయుండును నగుచుఁ గలిత మహారజతకూట స్తంభవారంబులం, గమ నీయ కాంచన వితాన గుచ్ఛ ప్రభాంకూరంబులం, గలకంఠికాజన గానామృ తాసారంబులం గర మొప్పు కలధౌతాగారారాజ దాస్థానభవనరాజంబునం గనత్తరాహిరిపుమణిమయ భద్రాసనంబున సుఖాసీనుండై, యహిత మహాబల విధ్వంసన శంసనీయ సామర్థ్య ధురీణుండు గావున నిజపరాభూతి కారణ దారుణ సమీరణ సముత్సారణంబు గోరి తనకు విన్నవింపం జేరిన మేఘమండలంబుడంబున నొక్క విబుధ కుధర కుచారత్నంబు వట్టిన మేఘడంబరంబు గనకఝల్లరీ శంపావల్లరీ భాసురం బై యేపు సూప, నరిభేద నోదార కరకాండ మండిత రాజసాహాయ్యంబును, నతిదీప్రతర ప్రకాశాన్విత సదనీక సాంగత్యంబును నధిగమించి విజృంభించు నిశాధిదేవతతో జగడంబు చరింప నోపక పట్టువడిన యంబుజాప్తబింబంబు తీరున నొక్కహరినీలకుంతలావతంసంబు వూనిన యభిరూప జాతరూప హంసరూప ధూప కరండంబు వలనఁ జాలుగా వెడలు సామ్రాణి ధూప ధూమమాలికలు తదంతర సంస్థాయి రమారమణ తనూతల వినిర్య దభిరామ శ్యామ ధామాళికల మోహంబు నివ్వటిల్లఁ జేయ, నిరంకుశ పంకజరాగకంకణ క్రేంకార పూర్వకంబుగా నొక్క రాజకీరవాణీలలామ వీచు ధవళవాల వ్యజనంబు లనుపమాన పవమాన మృదుయాన కలనానద్యమాన గగనగంగా తరంగడోలికావీథి నుయ్యల లూఁగు నవదాతపత్రంబులకు సగోత్రం బులై వైచిత్రిఁ జిత్రింప, విశాల విలోచన శతపత్త్రపత్త్ర విలసనంబును విమలభుజామృణాల సౌందర్యంబును వినీల భ్రమరక సౌష్ఠవంబును విరంజిత కింజల్కమాంజుల్యంబును బూని సరసగణ్యలావణ్య వైభవంబున నలరు పద్మినిపై మోహంబు వూని పౌర్వకాలిక వైరంబు డించి ప్రియంబు వచింపఁ జేరి తత్కరకమల లాలితం బగు శీతాంశుమండలంబుదండి నొక్కభుజంగభుఙ్మందయానామతల్లి దాల్చిన కర్పూర కలా చిక నయనామోదవీచికం జేకూర్ప, మహానంది గోరాజకుమారముఖ్యులు సెంతలం గొలువ నపూర్వ విభవంబునం బేరోలగం బుండు నవసరంబున. 123

సీ. స్వకటాక్షవిశ్రమస్థానన్నరశ్రేణి
యెడఁబోలె వరభూతి యొడల నొప్పె,
హృదయసారసవీథి యెడఁబోలె నలినాక్ష
సంభృతి కంధరాస్థలి నెసంగె,
మహితశిష్యోదితామ్నాయాళియెడఁబోలె
నలఘుజటారేఖ తలఁ జెలంగె,
నాత్మసంరచితాధ్వరావళియెడఁబోలె
సత్త్రాటకస్ఫూర్తి చక్షు లూనె,

తే. ననుచు నెమ్మది నద్భుతంబడర నఖిల
జనములు నుతింప నరుదెంచె సమ్మదంబుఁ
బూని సుకలానిరస్తోడుజాని సుగుణ
మణినికరఖాని శాండిల్యమౌని యపుడు. 124

మ. మునిరా జి ట్లరుదేర ద్వాస్థ్సితజనామూల్యోక్తి వైచిత్రి మే
ల్కని తోడ్తో నెదు రేఁగి, భక్తి వినతుల్ గావించి తోడ్తెచ్చి, నూ
తనచామీకరపీఠి నుంచి, యల గోత్రాకామినీకాముకుం
డనువొందన్ ఘటియించె నాదమికిఁ దా నాతిథ్య మప్పట్టునన్. 125

క. విమలాసనమునఁ బతి యతి
కమలాసనలసదనుజ్ఞిక వసించి, మహా
సుమనోరసారుహోద్య
త్సుమనోరససూక్తిఁ దపసితో నిట్లనియెన్. 126

శా. మౌనీ సేమమె మీకు, మంగళమె యుష్మచ్ఛాత్రరాట్పాళికిం,
నానాసూననవప్రసూనములు సిందన్ మించునే యాశ్రమా
గానీకంబు, లనంతరాయకలనన్ యజ్ఞాళు లీడేఱునే,
శ్రీ నొప్పారునె మీ మహోటజము నిర్వేలాసురానీకతన్. 127

చ. యతికులచంద్ర! సత్కువలయప్రియ మై తగు నీదురాక మ
ద్వితతమనస్థ్సతాపగతి వేగ యలంప గలంప సంతతో
ద్ధతతరపంకజాతములఁ దావకపాదనిషేవణాసమా
దృతి మను నాశుభాళి గనునే ధరఁ దక్కిన రాజచక్రముల్. 128

చ. కరము మదీయపుణ్యలతికన్ సఫలత్వముఁ బొందఁ బూన్చి యో
సురభిచరిత్ర! నీ విటకు సొంపుగఁ జేరితి శక్యమే భవ
ద్వరసుమనోహితత్వఘనవైఖరి సన్నుతిఁ జేయ నీదయా
పరిణతిఁ గాదె యుత్కలికఁ బాయక భవ్యతరుల్ సెలంగుటల్. 129

మ. ఘనతాత్పర్యము నాపయి న్నిలిపి వేడ్కన్ వచ్చి తస్మత్పురా
తనభాగ్యంబునఁ జేసి యోతపసి రత్నశ్రేణులో భూమియో
ధనమో ధేనువులో కరీంద్రములొ రథ్యవ్రాతమో యిష్టవ
స్తునికాయం బనివార్యభక్తి ఘటియింతుం దెల్పవే సత్కృపన్. 130

మ. అని యాభూపతి వల్క, యోగిమణి చిత్తాంకూరితానందుఁ డై
యినవంశోత్తమ! తావకీనకృప మాకెల్లప్పుడున్ సేమ, ము
ర్వి నితాంతైకమహోమహోన్నతభవాదృఙ్మిత్రసాంగత్యవ
ర్తన నిచ్చ ల్మనుమాకుఁ జేకుఱునె జాగ్రద్దుష్టదోషావళుల్? 131

తే. అనిశము సమస్తలోకరక్షైకదీక్ష
నలరు నీకృప సకలేష్టమంది మించు
మాకుఁ గోరిక యొక్కింతమాత్ర యైనఁ
గలదె భవదవలోకనాకాంక్ష దక్క. 132

మ. సకలారాతివిదారణంబు, సుమనస్త్ర్సాణంబుఁ గావించి, ధా
ర్మికులం దెక్కుడ వై, జగత్ప్రియత ధాత్రీకాంత! నీవొప్ప మౌ
నికులశ్రేష్ఠులతో నిరీతి మఘముల్ నెగ్గించుచున్ మేము వే
డుక వర్తిల్లుదు, మాశ్రమాళి సురకోటుల్ నిచ్చ హర్షింపఁగన్. 133

మ. జపముల్ సాగఁగ, వేదపాఠములు నిష్ప్రత్యూహతన్ మించఁగాఁ,
దపముల్ పూర్ణత నొంద, జన్నములు నిత్యంబుం బ్రకాశింపఁగా,
నృప! యుష్మన్మహిమం జెలంగుదుము నిర్వేలప్రసూనప్రసూ
నపటల్యంచితసాలజాలయుతసన్మాన్యాశ్రమాస్థానికన్. 134

చ. భవదవలంబనంబున నపాయము గానక యిన్నినాళ్లు మా
నవకులచంద్ర! సౌఖ్యకలనం దనరారితి మట్టిమాకు స
త్సవనవినాశకంబు, మునిజాలమనఃప్రమదాపహారకం
బవు నొకకార్య మబ్బె నిపు డాదృతిచే నది చిత్తగింపవే. 135

వ. అని వెండియు నయ్యతీంద్రుం డాసుచంద్రమహీశచంద్రునితో నిట్లనియె. 136

సీ. ఘనవైరిమకుటముక్తాజయశ్రీకపి
లావాచనాపాదిలలితశరుఁడు,
భుజబలవ్యాఖ్యాతృభూభృద్భిదాస్యాను
బింబవత్స్వారత్నపీఠతటుఁడు,
రణభేరికాభాంకరణపరిప్రాపిత
హరిదంష్ట్రిలోకేశపురవరుండు,
ప్రతిదినాభ్యుదితకార్శ్యజ్ఞాపితప్రతి
మాన్యతాకామరీమహితగృహుఁడు,

తే. ప్రబలు నాత్మచమూప్రతిప్రస్థితీక్ష
ణేహికాప్తిపునఃపునరీషదున్న
మన్ముఖసుమేరుకందరాక్ష్మావసన్మ
హాసురుండు తమిస్రాభిధాసురుండు. 137

చ. అనుపమధేనుకాహితత నంది చరించు మునివ్రజంబులం
బెనుపుఁ, గడున్ మహాసవకృపీటభవాళులఁ దూలఁజేయుఁ, జ
య్యనఁ గలఁచున్ బహూదకచయంబుల, వ్రాల్చు ధరిత్రి శ్యామలం
జనవర! దానవద్ద్విపము సాంద్రమదస్ఫురణంబు హెచ్చఁగన్. 138

సీ. హరిహయాస్యాతతస్ఫురణ దూలఁగఁ దార్చి
శుచిధామమహిమంబుఁ జూఱ వుచ్చి,
చటులమహాకాలపటిమంబు దిగఁద్రోచి
నానాశరచ్ఛటాశ్రీ నడంచి,
కమలవరప్రభౌఘంబు మాయఁగఁ జేసి
ఘనమరుత్పురసాలగరిమ ముంచి,
ప్రచురసోమావలేపం బెల్లఁ గరఁగించి
పంచాస్యశక్తిఁ బోపడ నొనర్చి,

తే. యిట్టు లాపూర్వదేవవంశేశ్వరుండు
విశ్వ హరిదీశ విజయాప్తి వెలయు నాత్మ
చండదోర్దండమండలమండలాగ్ర
జనితసత్కీర్తిదీప్తిప్రచారమూర్తి. 139

మ. నవసంగ్రామధరాహృతంబు లగు నానాలేఖనాగాన్వయే
భవితానమ్ముల సాధ్యరాడ్రథములం బ్రాంచత్తురంగాస్యర
త్నవిమానంబుల నొప్పఁ జేసి హిమగోత్రాభృద్దరీరాజధా
న్యవతంసంబున మించు నాతఁ డసురేంద్రానీకకోటీయుతిన్. 140

చ. అలదనుజేశ్వరుండు మృగయాపరమానసుఁ డై, నిశాచరా
వళులు భజింప మౌనికులవర్యమహోటజరాజిఁ జేరి దా
బలిమిని దాపసేంద్రతతిఁ బట్టి వధించుఁ, దదూర్జితాధ్వర
జ్వలనము లార్పఁ జేయు ననివారితశోణితవారిధారలన్. 141

తే. ధీరచక్రంబుల నడంచు, సారసవన
హననసృతిఁ బొల్చు, భూరిదోషానువృత్తి
నెనసి చెలరేఁగు, నాదానవేంద్రుఁ డవని
నవియ కావె తమిస్రనిర్వ్యాజగతులు. 142

చ. ధరణిపచంద్ర!తద్దనుజదౌష్ట్యమునన్ సకలర్షినాయకా
ధ్వరములకున్, మహాజపితృవారజపంబులకున్, వ్రతివ్రతో
త్కరములకుం, దపస్విసముదాయతపంబులకున్, సురేంద్రదు
స్తరవిఘ్నముల్ వొడమసాగెఁ జుమీ బహుకాల మెంతయున్. 143

చ. అనుపమతైక్ష్ణ్యసంచితగవాళి సురారి హరింతు, మైన మా
యనఘమహాతపోర్జితమహంబు వ్యయం బగు నంచుఁ దన్మతిం
గనము; గవాళి నయ్యసురకాంతు హరింపుము భూప! యైన నీ
యనఘ మహాతపోర్జితమహం బలఘుత్వము నొందుఁ గావునన్. 144

మ. అఖిలాస్త్రైకవిధానశాలివి, సపత్నాధీశమాయాతమి
స్రఖరాంశుండవు, జన్యభూవిహృతిసారజ్ఞుండ, వీ వౌట స
ర్వఖలధ్వంసనదక్ష! యాదనుజు సంగ్రామోర్వి బాణోద్భవ
చ్ఛిఖిఁ గూల్పం దగు దీవె, పూనుము మనస్థ్సేమంబుఁ దద్వృత్తికిన్. 145

క. అని పల్కన్ నృపతి దయా
ధుని సిల్కం బలుకువాలుదొరలం గడుఁ బా
యని యల్కం దూల్చు పలా
దునిఁ జుల్కం జేసి నియమితో నిట్లనియెన్. 146

చ. పుడమినృపాలు రబ్బురముఁ బూన, బలంబులతోడ నీదువెం
బడి నరుదెంచి రాత్రిచరబంధునిఁ గూల్చెద, నంత యేల యి
య్యెడ నలదానవుం డనఁగ నెంత, భవత్కృప వాఁడు నా కసా
ధ్యుఁడె, హరి గాచియున్న, హరుతో రణమేదిని కేఁగుదెంచినన్. 147

మ. దనుభూభారవిముక్తి గోతలము సెందన్, గోతలాప్తిన్ సుప
ర్వనికాయం బెనయన్, సుపర్వయుతి శశ్వత్సద్వితానంబులుం
దనరం, బాయని సద్వితానముల నానామౌనిగేహంబు లె
చ్చ, నవాస్త్రావళిఁ గూల్తుఁదత్సురరిపుస్వామిన్ రణాస్యంబునన్. 148

తే. యమికులమహేంద్ర! యిది కార్య మనుచు నొక్క
శిష్యుఁ బనిచిన వచ్చి, యాశీవిషోప
మాశుగాళి సురారాతి నవనిఁ గూలి
చెదను, మీ రింతపనికి విచ్చేయఁదగునె. 149

చ. అని విభుఁ డమ్మునీశు వినయంబునఁ బూజన మూన్చి, భక్తిచే
ననిచి, నిజాప్తమంత్రిజనతైకవచోగతి సమ్మదం బెదం
దనరఁగ, నాత్మదివ్యపృతనానికరంబుల రా ఘటించి, తా
నెనపె జయప్రయాణనియతైహికమానసవీథి నంతటన్. 150

మ. గళదర్కంబుఁ, బనీపతత్కుజము, రింఖద్గోత్రగోత్రంబుఁ, జా
చలదుర్వీవలయంబు, ఫక్కదఖిలాశాకంబు, భిద్యన్నభ
స్థ్సలమేఘౌఘము, భ్రశ్యదృక్షము, రణత్పద్మాసనాండంబు నై
యలరెం దన్మహిపాలజైత్రగమబంభారావ మప్పట్టునన్. 151

సీ. సితకాండజాతసంగతి విరాజిల్లుటఁ
జక్రాంగ మగుటకు సందియంబె,
చారుసూనవితానసంయుక్తి వెలయుట
స్యందనం బగుటకు సందియంబె,

వరవైజయంతికాపరిషక్తి నొప్పుటఁ
జక్రి దా నగుటకు సందియంబె,
సుకరయుగాదికాంగకలబ్ధిఁ దనరుట
సద్రథం బగుటకు సందియంబె,

తే. హరిభయంకరభూరిధామాప్తి మనుట
జగతి నిది తార్క్ష్యమగుటకు సందియంబె
యనఁగఁ బొగడొందు రత్నశతాంగ మప్పు
డధిపుకనుసన్నఁదెచ్చె నియంత యొకఁడు. 152

చ. తొడవులు మేటిమేనిజిగితో నిగుడం, గుడివంకఁ గెంపురా
పిడియము దోఁప, బంధునృపబృందము లందఱు నివ్వటిల్ల వెం
బడి నెడ యీక రాఁ, దళుకుబంగరుఁజేల యొకింత జీరఁగా,
వెడలె హజార మానృపతి విప్రయుగంబును దృష్టి నాఁగుచున్. 153

చ. కొలు విపు డబ్బె నంచు బలుకోర్కి మహీశులు నిల్చి కొల్వుమ్రొ
క్కులు ఘటియించి రప్పతి కకుంఠకలధ్వనివేత్రు లంగరా
ట్కులుఁడు పరా కితం డతఁడు కోసలనేత పరా కితండు కే
రలుఁడు పరా కతండు కురురాజు పరా కని యుగ్గడింపఁగన్. 154

మ. నృపరత్నంబు వినీతసూతతిలకానీతప్రియస్యందనం
బపు డిం పెచ్చఁగ నెక్కి యొప్పె మఘవాశాద్రిం గనం బొల్చు పూ
ర్ణపయోజారి యనన్, బుధావళి నవానందంబుచేఁ జూడ, న
భ్రపదం బాఁగుచు వాహినీశ్వరమహాభంగార్భటుల్ హెచ్చఁగన్. 155

వ. ఇట్టు లాలోకమిత్రుం డహీన భూరి ప్రగ్రహ ప్రకాండ పరిస్యూతంబును, నఖిల సన్మణి ప్రకర వర్ణనీయ ప్రభా భాసమా నైక చక్ర సముపేతంబును, నాశుగ మార్గాతి క్రమణ చణ వేగవ దసమావదాత తురంగ సంయోజితంబును, నమర వినుతాభిరామ ధామారుణ సారథి విభ్రాజితంబును నై విరాజిల్లు శతాంగరాజం బారోహించి, యాత్మీయ భక్తిభావ సంసక్త చిత్తంబున నడరు చక్రకాంత చక్రంబులం గటాక్షించుచు నని వార్య రసవిశేష విలసిత పద్మినీ సందోహంబుల కామోదంబుఁ గూర్చుసొంపునం బెంపొందుచు, నఖండ రాజమండల తేజోగౌరవంబు నిజ తేజో మహిమంబున సంపాదించుచు, నక్షీణ దస్యు వీక్షణ సమ్మద విక్షేపకాక్షుద్ర కరకాండ చండిమంబునఁ జూపట్టుచు, నఖర్వ శార్వర మాహాత్మ్య నిర్వాప ణోల్లాసంబున వెడలె నయ్యెడ. 156

చ. హరిభయకృద్రయాన్వితములై, యభిరూపకలాపజాతభా
స్వరత వహించి, చూడఁదగు వాజివరంబుల నెక్కి రాజశే
ఖరతనయౌఘ మేఁగె మహికాంతుని వెంబడి దివ్యశక్తితో
నరు దగు తారకాత్మదరదాత్మసమాఖ్య బుధుల్ నుతింపఁగన్. 157

చ. తనుపులకాలిమేలు పయిఁ దార్చిన బంగరుజూలుచాలు చ
క్కనికటిసీమలం దనరు గైరికరేఖలడాలు సాలఁ గ
న్గొన ముద మూన్ప భద్రకరికోటులు వెల్వడె రాజువెంటఁ జ
య్యనఁ బదమేఘగాళితతు లందుకజాలకయుక్తిఁ బూనఁగన్. 158

మ. అమరెం దత్సృతి నేఁగు నీలమయచక్రాంగంబు లింద్రావరో
ధముఁ దప్పించుక ధాత్రిఁ జేరిన సముద్యత్పుష్కలావర్తము
ఖ్యమహామేఘకులంబులో యనఁగఁ జక్కం గాండధారావిశే
షములుం, భూరిమణీశరాసనవిభాజాతంబులుం జూడఁగన్. 159

చ. అనఘవిసారపాళియుతి, నంచితశుభ్రశరాప్తిఁ, బుండరీ
కనిచయలబ్ధి, నాగవరకాండనిషక్తిఁ, గనం బొసంగువా
హిని యల యంశుమత్కులమహీశ్వరు వెంబడి నేఁగఁ జొచ్చె న
భ్రనది భగీరథానుసృతి భవ్యరయస్థితి నేఁగుచాడ్పునన్. 160

చ. కలితమృదంగతుంగరవగర్జ, నటత్త్రిదశీతనుప్రభో
జ్జ్వలచపలాళి యంబుధరవర్త్మమునం దగ నాధరేంద్రుపై
నలరెడు మానసంబున మహాశరజాతవినాశ ముర్వరం
దెలుపు ప్రసూనవృష్టి జగతీధరశత్రువు నించె నయ్యెడన్. 161

చ. అలయజరాపగన్ రవికులాధిపుపార్శ్వగవాహపాశ్వని
స్తులగతిజైలధూళివితతుల్ విరళోదయ గాఁగ ఘటింపఁ ద
ద్బలవిచరద్గజేశకరపాళి నిజామితశీకరాంబుమం
డలిని రసోదయస్థితిఁ బెనంగఁగ నెంతయుఁ దార్చెఁ జిత్రతన్. 162

చ. అతులితవైజయంతయుతి, నంచితసాగరజాతదంతిసం
గతి, ఘనచక్రిసంభృతి, నఖండితవైభవదేవనాయకా
యతిఁ, దనరారు నానృపబలాళి యెసంగె ధరిత్రి జంగమ
స్థితిఁ జరియించులేఖపురిచెల్వునఁ జూపఱ కింపు నింపుచున్. 163

ఉ. ఆతఱిఁ గాన రాజిలె మహాప్రతికూలభిదానిదానవి
ద్యోతితకాండమండితచమూదధిశేఖరమధ్యవీథి ము
క్తాతివిభాసితం బగు శతాంగవరేణ్యముపైఁ దదుర్వరా
నేత సితాంతరీపమున నీటువహించిన విష్ణుపోలికన్. 164

తే. అపుడుసదనీకమధ్యగుం డగుచు నలధ
రారమణమౌళి నేత్రపర్వంబుఁ గూర్చె
విమలనక్షత్రలోకసంవృతి ధరిత్రిఁ
జేరినట్టి సుధాసూతి చెలువుఁ బూని. 165

క. జననాథుఁడిట్లు సేనా
జనసంవృతుఁడగుచు నరిగె సమ్మిళదళినీ
నినదవనీసునదధునీ
కనదవనీధరవరాళికం గనుఁగొనుచున్. 166

చ. అలపతి గాంచెఁ జెంత ఘనహైమగుహాగృహవాసికిన్నరీ
కులమణివల్లకీసమనుకూలమనోహరగీత్యుపాంగదు
జ్జ్వలసురసాలజాలసుమవల్లరికావిచరన్మిళిందని
ర్మలరవభగ్నపాంథజనమానకవాటము హేమకూటమున్. 167

చ. కనుఁగొని తన్మహీభృదుపకంఠమునన్ నిజరాజధానిపొ
ల్పున సుమనోనికాయపరిభూషిత యై, కలకంఠికామణీ
జనయుత యై, కనత్కనకసాలసమన్విత యై పొసంగు చ
క్కనివని వేడ్క వేలము డిగన్ ఘటియించె జనేంద్రుఁడయ్యెడన్. 168

మ. తనుభానిర్జితమార, మారరిపుకాంతాచిత్తసంసార, సా
రనిరస్తాఘకవార, వారణభిదారాజద్బలోదార, దా
రనివేశాయితసూర, సూరసితభారమ్యాక్షివిస్తార, తా
రనిభఖ్యాతివిసార, సారసభవప్రస్తుత్యనిత్యోదయా! 169

క. శరణాగతశుభకరణా!
కరణాతీతాత్మవివిధకార్యాచరణా!
చరణానతాసుహరణా!
హరణాయితసత్స్యమంతకాభాభరణా! 170

పృథ్వీవృత్తము


ధరాధరమచర్చికాధర !ధరారిముఖ్యోదయ
ద్దరాపహమహత్తరాదర! దరస్వనోత్సేకితా
శరప్రకరనిష్పతచ్ఛర! శరప్రభూతాలయా
వరాంకకలనప్రభావర! వరప్రదానుగ్రహా! 171

గద్యము
ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకలాకళత్ర
రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ
మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయం
బను మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము

  1. ‘మహస్సార’ అని పాఠాంతరము