చంద్రికా పరిణయము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీలక్ష్మీనరసింహాయనమః

చంద్రికాపరిణయము

ద్వితీయాశ్వాసము

క. అహరీశసుతావీచీ
విహరణరణదంఘ్రికటకవిశ్వాసిపత
ద్గ్రహయాళుపాణిపద్మ
స్పృహయాళుమదాళిజాల శ్రీగోపాలా! 1

తే. చిత్తగింపుము శౌనకాద్యుత్తమర్షి
సమితి కిట్లను రోమహర్షణతనూజుఁ
డిట్లు వేలంబు డిగఁదార్చి,నృపతి హేమ
పటకుటి వసించి యుండె సంభ్రమ మెలర్ప. 2

చ. అలతఱిఁ దద్గిరీంద్రతటికాంచనకాంచనమాలతీలతా
వలయలతాంతకాంతతరవాసనవాసనవానిలాళికల్
మలయ, విభుండు వేడ్కఁ దనమానస మాన, సముజ్జ్జ్వలాత్ము నె
చ్చెలిఁ గని పల్కు స్వర్ద్రుసుమజీవనజీవనభేదనోక్తికన్. 3

ఉ. ఈయగరాజమౌళి మన మిచ్చట నుండుట తా నెఱింగి యా
త్మీయసమగ్రవైభవగతిం దిలకింపఁగ రమ్మటంచు మో
దాయతిఁ బిల్వఁ బంచెఁ బవనాంకురపాళికఁ, జూతమే వయ
స్యా! యచలేంద్రుదివ్యమహిమాతిశయంబు ప్రియంబు పొంగఁగన్. 4

చ. అని జననేత తత్ప్రియసఖాగ్రణికేల్ కయిదండఁ బూని, చ
క్కని తెలిమిన్న మెట్టికలు గట్టిన త్రోవ నగేంద్ర మెక్కెఁ, బా
వనమరుదుచ్చలత్కిసలవారమృషావ్యజనాళిఁ బార్శ్వసీ
మ నలరు మల్లికాయువతిమండలి యింపుగ వీవ నత్తఱిన్. 5

క. అలరారు వేడ్కఁ దద్గిరి
కులరాడ్వైభవముఁ గాంచు కుతలేశ్వరుతో
నలరాచెలి యిట్లను మధు
జలరాశితరంగనినదజయయుతఫణితిన్.

సీ. కరిరాజధీపూరపరిరాజితోదార
హరిరాజిహృతసారశరదపాళి,
నగచారివరజాతమృగచాతురీభీత
మృగచాలనోద్భూతపృథులధూళి,
సకలాజరీగూహనకలావిలీనాహ
పికలాపినీవ్యూహబిలగృహాళి,
లలితాపగోర్మితరలితాసితాబ్జాత
గలితాసవజసాతివిలసనాళి,

తే. మహిప! కనుఁగొను తనుజనుర్మహిమజనన
జనకకలరవకులరవధ్వనితసురభి
భరితఘనరవవనచరతురగవదన
కులజలదచూళి యిమ్మహాకుధరమౌళి. 7

మ. జననాథేశ్వర! కంటె? రత్నకటకాంచత్స్వర్ణమౌళ్యాప్త మై,
యనిశాత్యాశ్రితరాజసింహనిచయంబై, సంవృతానేకవా
హిని యై, చందనగంధవాసితము నై, యీశైలవర్యంబు దాఁ
దనరెన్ నీవిట నొందుమాత్రనె భవత్స్వారూప్యముం గాంచెనాన్. 8

చ. అనుపమధాతుధూళియుతి, నంచితకుంజనిషక్తి నొప్పు నీ
ఘనసితరత్నగండతటిఁ గ్రాలెడుపొన్న నృపాల! కాన్పు తె
ల్లని తొలుగౌరు నెక్కినయిలాధరవైరియె చుమ్ము, కానిచో
నొనరునె దేవవల్లభతయున్, సుమనోభరణంబు దానికిన్. 9

సీ. బహునీలతటులఁ గన్పట్టు సూర్యాకృతుల్
పొందమ్ము లని త్రెంపఁ బూని పూని,
నవవజ్రకటకమండలిఁ దోఁచు నైజమూ
ర్తులఁ బరేభమనీషఁ గ్రుమ్మి క్రుమ్మి,
కురువిందమయపాదసరణిఁ గ్రాలెడు ఘన
మ్ముల వశామతిఁ గేల నలమి యలమి,
గారుడగ్రావశృంగములఁ బొల్చు సురాధ్వ
తటినిఁ బెన్నది యంచుఁ దఱిసి తఱిసి,

తే. యలఘువీథి భయోపబృంహకదురంత
బృంహితార్భటి దిక్కోటి వ్రీలఁజేయు,
సమదవైఖరి నీయద్రి సంచరించు
వనగజశ్రేణి కనుఁగొంటె మనుజవర్య! 10

చ. కలితమణీశరాసఘనకాండభృతిన్, వరవాజిసంగతిం,
బొలుచుసువర్ణకూట మరిభూపవిదారణఁ జూడఁ గాంచనా
చలవిజయప్రయాణపరిసన్నహనాత్మతఁ బూనుటల్ కడుం
దెలిపె మరుద్గతిధ్వనదుదీర్ణగుహాచయభేరికాధ్వనుల్. 11

చ. మనుకులరాజచంద్ర! కనుమా ప్రతిబింబితపర్ణజాలన
మ్రనఖరయుక్తిఁ దోఁచు నలమౌక్తికశృంగనృసింహమూర్తి పెం
పొనరె నధిత్యకాప్రభవితోన్నతవిద్రుమవల్లికల్ పలా
శనజఠరంబు సీర్చి పెలుచం బయి నెత్తు నవాంత్రపాళిగన్. 12

సీ. వదనాంబుజమరీచివారంబు తొలుదొల్త
నృక్షనాయకమానరీతి నొంపఁ,
గలితవీక్షాపాతకలనంబు లంతంతఁ
బుండరీకమదైకభూతి మాన్ప,

సరసోరుయుగవిభాసారంబు మునుమున్న
కదళికామహిమంబుఁ గడకుఁ దేర్పఁ,
గబరికాబంధవైఖరి మించి వేవేగఁ
బరమఘనాఘనస్ఫురణఁ దూల్ప,

తే. నలరి కాంతారమృగనికాయముల నడఁప
నిరతమృగయానువర్తనాపరత నరతఁ
గాంచి యిచ్చటి తటులఁ జరించు చెంచు
చంచరీకాలకలఁ జూడు జనవరేణ్య! 13

చ. నికటఝరీకృపీటసరణిం దనరూపము సూచి భవ్యమౌ
క్తికమయకూటసీమఁ దగుకేసరి తాఁ బ్రతిసింహబుద్ధిఁ గో
పకలనమై వడిన్ దుమికి పైకొని సీర్చి తదంతరస్థర
త్నకులము లంచు నాత్మఁ గొని దారున వెల్వడెఁ గాన్పు మోనృపా! 14

చ. అలఘుపరాగహేమవసనాంచల మించుక జాఱఁ దేఁటిచూ
పుల మరు గెల్చు నీసొబగుపొంకముఁ గన్గొని మోహతాపసం
కలనత నో మహీరమణ! కంటివె యీ వనలక్ష్మి వేఁడియూ
ర్పులు వెడలించెఁ జంపకపుఁబువ్వుల మాఁగినగాడ్పుచాలునన్. 15

చ. అతులఫణీశరమ్యకటకాన్వితమై, నిజమూర్ధభాగసం
భృతమలినాన్యపుష్కరఝరీతిలకం బయి, కాలికానుషం
జిత మయి, దేవసేవ్య మయి చెన్నగు నీకుధరాధిరాజ మో
క్షితివరచంద్ర! కైకొనుట చిత్రమె ధాత్రి గిరీశనామమున్. 16

సీ. అలరుఁదీవియలఁ బాయక మించుక్రొందేఁటి
జోటిమ్రోఁత లొయారిపాట గాఁగ,
స్థలకంజినీకంజములగాడ్పు దారిఁ బైఁ
బర్వుపుప్పొడి పచ్చపావడలుగఁ,

గనకశృంగాగ్రసంగతపాండుకాండదా
నీకముల్ నవపుండరీకములుగ,
నతిచలచ్ఛదయుక్తి నలరురంభాస్తంభ
జాలంబు జయపతాకాలి గాఁగ,

తే. భోగవతికావతంసముల్ పుణ్యతరులు
రాజశార్దూలసంఘముల్ ప్రాంతవీథిఁ
గొలువఁ బేరోలగం బున్నచెలువుఁ బూనె
నీధరాభృద్వరునిఁ గంటె భూధరేంద్ర! 17

వ. వెండియు నీహేమకూటంబు హేమకూట ప్రభాకూట సంధ్యారాగోదయవైఖరీ పరిఫుల్ల్యమాన గిరిమల్లి కావల్లికా ప్రసూనాంబుజాత ప్రవాహ సంవర్ధితం బగుట నాత్మనిదానాభిధానంబునం బ్రసిద్ధిం బొందు నతి మంజుల హింజులపుంజ వలయంబు నడుమం జెలువూను పారిజాతమహీజాత లతానికాయకాయమానం బుల క్రింద నందంబు లగుకురువిందవేదికాబృందంబులపై నిండువేడుక నెమ్మనంబుల మెండుకొన నెచ్చెలి పిండు పసిండిదండియలు వూని సుతి మీట నతికలిత కలనాద కాకలీస్వర విలసనంబున విషమాంబక బిరుదగీతవ్రాతంబులు పాడు తెఱగంటికలువకంటిదంటల నవీన తానసంతానమానంబులం జొక్కి సం జాతపులకప్రరోహంబులం బొలుచు చెలువున నుదారకోరకవారంబులం జూపట్టు నీరంధ్రప్రియాళుప్రతా నంబులవలన నీరంధ్రప్రియాళు ప్రతాన నికుంజగేహంబుల నొక్కయెడ నైన నినభయంబు గానక సుఖం బుండి యాఖండలశిలాగండోపలఫలక ప్రతిఫలి తాధిత్యకాస్థల రమమాణ గరుడమాణవకమూర్తులం గని వెఱ దొరయ నచ్చటం జొరఁబాఱు చిలువదొరల ఫణాతల మణికులభాస్వద్ఘృణిపూరంబులకు నిలువ నోపక వెడలి పఱతెంచు కటికిచీకటి కిన్నరాంబుజముఖీ కదంబక విరచిత నూతన దోహద ధూమంబుల యోజం దేజరిల్ల సద్యస్సముత్పద్యమాన ఫలమిళిత శాఖాకలితంబు లగు దాడిమీ కులంబులఁ దిలకించి యచ్చటి కాశ్రయింపం జనుదమని నిజప్రియజనంబులఁ బిలుచు రాచిలుకచిలుకలకొలకుల కలికిపలుకులు విని యలరు కర్ణికారవారంబులవలనఁ గర్ణికారవార ప్రవాళశ్రేణు లబ్జరాగతోరణ మాలికలును, నిస్తుల గోస్తనీ విలంబమాన ఫుల్లగుచ్ఛంబు లచ్ఛమౌక్తిక వితానంబులును, నమలకకుత్థ్సల నానట్యమాన మత్తాళిపాళిక లభిరూపధూపధూమమాలికలునుం గాఁగ నమరు మందార వీరున్మందిరంబున సంపెంగ తీవ జాళువాగొలుసుల నుయ్యెల లూఁగు సాధ్యమిథ్యామధ్యాజనంబుల చరణపయోజసంయోజనంబు లకు లక్ష్యంబులై తదీయ స్పర్శన వినిర్గతానురాగకందళంబుల యందంబునం జివురించు నశోకానోక హంబులవలన నశోకానోకహకసుమవిసర వర్షిత మరంద ధారాళధారా గౌరవంబునఁ బెనులోయఁ బడిన ధగధగని పగడంపుఁగోనల భుగభుగ వలచు కపురంపుటనంటుల చప్పరంబుల క్రిందం జెప్పరాని వేడుక ముప్పిరిగొన విచ్చలవిడి డాఁగిలిమ్రుచ్చులాడునెడ నెడయనివడి యడర నుదంచిత చంచరీకమాలికల నుల్లసిత పల్లవంబుల నుత్తుంగ నిస్తుల స్తబకంబుల నుజ్జ్వలత్కళికాకులంబుల నుల్లసిల్లు తరుణవ్రతతికలం గల కుడుంగరంగంబులలోఁ దమ్ముఁ దెలియకుండ డాఁగియున్న యన్నులమిన్నల వీక్షింపఁ జరించు సిద్ధరాజ తనూజా సమాజంబుల నిశాత విలోచనాపాతంబుల నపూర్వవిలాసంబుఁ గాంచు తిలకనగతిల కంబులవలనఁ దిలకనగతిలక కుసుమ గళ న్మకరంద సంపర్కంబునం బదనైన ముత్తియంపుదొనల నిండిన సంకుమదపంకంబునం బొంకంబుగా మృదుమృదుత్వగభినవదళంబుల నలినభవునిం గొలువఁ జనిన తమతమ రమణునికై సందేశంబులు లిఖించి చెలుల నంచి పంచశర పంచశరీప్రపంచిత రహణశిఖి శిఖాంచల చంచలిత మానసంబున నడలి బడలి చెలువ మెలుపు కలువదొర రాయరంగులం బఱచిన కలువరేకు జముకాణంబులపయిం బొరలు గంధర్వసౌగంధికగంధిరత్నంబుల సంతాపంబు సన విరి నీరు నించియు, కెంజివురులం గప్పియుఁ, జల్లపుప్పొడులు సల్లియు, నలరుజొంపంబులం బొదివియు, శీతలోపచారంబులు సేయు తత్ప్రియవయస్యాలలామంబులకుం దోడునీడలై, చూడం దగు వాసంతికా జాతంబు లలసవాతపోత ప్రచారంబులం గౌఁగిలింప నవారిత సుమనోవికాసంబునం బొలుపు గాంచు కురువకలతా వలయంబులవలనఁ గురు వకలతావలయ వల్లవపల్లవాధరామండల మధ్యస్థల సందర్శనీయ పురందరశిలాశిఖర నందనందన సంభృత రంజిత వేణుదండాయమాన మానిత కటకవాల వాయజ సూత్రానుబింబంబు లహిరూపంబులుగా నెఱింగి యుప్పొంగి చెంగున నెగసి చరణంబులం ద్రొక్కిపట్టి చంచూపుటంబుల సించి ఱెక్కల నడిచి యేమియుం దేరకున్న విస్మయంబు మనంబు బెరయ విఫల ప్రయత్నంబులై పుడమి వ్రాలు కాంతార మయూర దారకంబులం జొచ్చి కికాకిక కేళి సల్పు గరుడసరోజ ముఖీ నికరంబుల దరస్మిత విలాసంబున సమధిక పథికచేతస్తాప సంవర్ధక ప్రసవామోద పరంపరలఁ జెన్నుమీఱు పున్నాగపూగంబులవలనఁ బున్నాగ పూగ మధుసాల రసాలముఖ్య దివ్యతర్వంతరంబున మంజులకంజరాగ భిత్తిభాగ మరీచిపుంజంబు భాస్వదాతప ప్రాబల్య ఖంజనంబును, శాతకుంభకుంభవిభా డంబరంబు సంధ్యారాగారంభంబును, వలభిన్మణివలభి రుచిరరుచి పూరంబు నిబిడ తిమిర వివర్ధనం బును, ముక్తోల్లోలవిభాసారంబు దారకానిసర్గంబును, భూరిస్తంభ సంగ్రథిత హీరదర్పణ ద్యుతిజాతంబు నిస్తంద్ర చంద్రికా కల్ప నంబునుం గావింప నక్షీణ క్షణదైక విలసనంబునం బొలుచు కేళికాహర్మ్యంబున మిక్కిలి పిక్కటిల్లు మక్కువఁ జక్కెరవిల్తుజగడంబుల మగలఁ జొక్కించి యాత్మీయ పుంభావసంభా వనా సంభూతశ్రమంబు దూలఁ జెంగటి వనుల సంచరించు నాగకన్యావతంసంబుల యాగాఢ నిశ్శ్వాస సమీరంబుల తోరంబగు సిరి నొప్పారు సిందువారంబులవలన సిందువారాది నగవార శిలాతలంబుల నురులు దాల్చియు, నెత్తమ్ము లిమ్ముగాఁ బ్రవహించు సెలయేఱులపై వలలు సేర్చియు, స్వజాతి ద్విజా తుల రాఁబిలుచు పులుగుల దీములు గట్టియు, జిగురుఁగండె లమర్చియు, విచిత్రతరవనపతత్త్రిగోత్రం బులం బట్టుకొను తలంపున మెండైన పొదలనుండి యప్పటప్పటికి వానిం గానఁ దమకించి చెంచెత లెత్తు నెమ్మొగంబు తమ్మిచాయల వసంతసమయ సముదిత సౌభాగ్యమ్మునం బొదలు చామ్పేయ ధాత్రీరుహం బులవలనఁ జామ్పేయధాత్రీరుహ కుసుమగళిత పరాగరాశి మధురసనదీ పులినదేశంబునఁ గపురంపుట నంటి లేయాకుఁ బఱచి మరకత మకరకేతనాహితమూర్తిని నిలిపి తదేక పూజాతాత్పర్యంబున నున్న సద్గుణోత్తములకు విరు లొసంగు నంతరంగంబునఁ బ్రమదావనంబు సొచ్చి ప్రమథమధురోష్ఠీతల్లజంబులు గేల నూది నిక్కి విటపాంతరాభివేష్టిత మల్లికాప్రసూనంబులఁ గోయునెడఁ దత్కరసంయోగంబువలన నిజేష్టఫలలాభంబు చేకూరెనో యన రమ్యఫలంబులం బెంపొందు మాకందంబులవలన మాకందవాసనాభివాసితపవమాన ప్లవమాననీలాశోకరజస్తోమంబు ప్రవర్గ్యోపక్రమనిర్గచ్ఛద్ధూమవర్తనంబునం బర్వ నమందానందకందళితచిత్తారవిందంబులతో ముందుముందుగఁ బఱతెంచు పురందరాది బృందారకవర్గంబుల తనూశ్రమంబుఁ దెరలం జేయు శీతలతర తాపసాశ్రమ నానావిధ వసుధారుహ నివహంబుల చెంతలం దదీయ శాఖాప్రసవముఖ వినిష్ఠ్యూత మధుపాళికం బ్రసవితంబులగు విశారద విటపి పటలంబులవలనను, వలను మిగిలి మేరుకుధరంబునుంబోలె శక్రపురాతిభాసురంబును, హిమవన్నగంబునుంబోలె గోభృత్కార్ముకాన్వితకాళికాతిశోభితంబును, మందరధరంబునుంబోలె వ్యాళాధిరాజపరివేష్టితంబును, ఋశ్యమూకాద్రియుంబోలె హరిజాతికలితంబును, మాల్యవద్గోత్రంబునుంబోలె రామసంచారసంగతంబును, నీలాచలంబునుంబోలె పురుషోత్తమభూషితంబును, గంధమాదనగ్రావంబునుంబోలె మహావరాహపాళికాలింగితంబును, సమామోదసంకలితశ్యామామహితం బయ్యును నసమామోదసంకలితశ్యామామహితంబై, వీనఘనార్భటివిఘూర్ణితమహాబిలం బయ్యును నవీనఘనార్భటివిఘూర్ణితమహాబిలంబై, మరాళికాశ్రితకటకస్థలవనజాతం బయ్యును నమరాళికాశ్రితకటకస్థలవనజాతంబై, సదృక్షరాజసారంగసంతానసంకలితం బయ్యును నసదృక్షరాజసారంగసంతానసంకలితంబై, కాలాహితసుమనోనగభాసమానం బయ్యును నకాలాహితసుమనోనగభాసమానంబై యొప్పుచున్నయది విలోకింపుము. 18

చ. అని లలితోక్తి నాప్రియవయస్యశిఖామణి చిత్తసీమఁ బా
యనిలలితోఁ దదద్రిమహిమాతిశయం బెఱిఁగింప, నప్పు డా
మనుకులరాజమౌళి బిలమండలి చొక్కపుఁదీవెయింటిమేల్
మను కులరాజకాంతతటమార్గములం గనుఁగొంచు నేఁగుచున్. 19

సీ. కట్టెండ వెడఁదకాఁకఁ గఱంగి ప్రవహించు
జవ్వాదిడిగ్గియచాల లోయఁ
బడుచుఁ జొక్కపుఁ గ్రొత్తపటికంపుఁజఱిపజ్జ
బాగైన కెంపురాపణుకువాలు
పొదరుఁ బొన్నల రాలుపుప్పొడియిసుముపైఁ
బగిలి యొప్పెడు వేరుపనసపంటి
నీటికాల్వలఁ బ్రోచి పాటించు జేజేల
మ్రాఁకుతీవలఁ జుట్టిరాఁగ నలరు

తే. దాకపందిలిక్రింద నిద్దంపువేడ్క
దవిలి కోలాట మాడుగంధర్వసతుల
చారు సౌవర్ణకటకసింజా నినాద
కుల ఘుమఘుమాయమాన మౌ కోనఁ గనియె. 20

లయగ్రాహి
మానిత నవీన కిసలానురతి కానఘ పికీనిచయ గానములచే నళినికానీ
కానుగత మానసచరీనిరుపమానరుతిచే నళికులీనవనితానికర నానా
ధ్వానములచే ననిలయానమునఁ బైనిగుడుసూనతతి తేనియలసోన రొదచే నిం
పైన యలకోనఁ గని యానృపతి దా నెనసె మానసతటీ నివిశమాన ముదమంతన్. 21

తే. ఇట్టు లక్కోన నెనసి తదీయ చిత్ర
మహిమ మెంతయుఁ గాంచుచు మనుజనేత
తళుకుఁ బ్రాఁగెంపు మెట్టులదారి డిగ్గి
యాత్మహితుతోడ నొయ్యన యరుగ నచట. 22

చ. పగడపుఁగంబముల్, తళుకుఁబచ్చలబోదెలు, కెంపుదూలముల్,
జగమగఱాలదెంచికలు, చక్కని నీలపుఁబల్కచాల్, మెఱుం
గగు తెలిమిన్నలోవయును, నచ్చపు బంగరు పేరరంగునం
దగఁ గనుపట్టు నొక్క వికసన్మణిమండప మప్డు దోఁపఁగన్. 23

చ. కనుఁగొని యానృపాలరతికాంతుఁడు విస్మయ మంతరంబులో
నెనయఁగ నోవయస్య మన మిచ్చట నిల్తమె కొంత ప్రొద్దటం
చనువుగ మందయానమున నమ్మణిమండపమౌళిఁ జేరి, యం
దొనరఁగ రత్నపీఠి ముదమొప్ప వసించె, వసించు నంతటన్. 24

సీ. ఒకమణిపుత్రిక యొయ్యారమునఁ జేరి
కపురంపు వలపుబాగా లొసంగె,
నొక సాలభంజిక యుదిరిపువ్వుల కెంపుఁ
బావడ నేరు పేర్పడఁగ వీచె,
నొక వసుప్రతిమ యింపూన్చు తెల్లని తావిఁ
బొదివించెడు కలాచి పూని నిలిచె,
నొక చొకాటపుబొమ్మయొయ్య నొయ్యన పొన్న
విరిచాలు గూర్చిన సురటి విసరె,

తే. నిటులు పాంచాలికామణిపటల మూడి
గము లుచితరీతి దార్ప, నా యమరకేళి
మండపశ్రీ నుతించుచు మనుజభర్త
దండఁ జెలి గొల్వ సుఖలీల నుండె నంత. 25

చ. కరు లిల వ్రాల, శంబరనికాయము దూలఁ, దరక్షులోకము
ల్వెఱఁ బరువంద, మత్తకదళీచయముల్ బెగడొంద, గండకో
త్కరములు స్రుక్క, ఋక్షసముదాయము నెవ్వగఁ జిక్కఁ, గీశము
ల్తరుతతి నీఁగ, సూకరకులంబులు డాఁగ, మహాద్భుతంబుగాన్. 26

సీ. అఖిల జంతు నిఖాదనారూఢిమైఁ బోలె
నతివివృతంబైన యాస్య మమర,
నాశేభములఁ జీర్పనట్టి సిబ్బితిఁ బోలె
నతి గన్నఖరసంతతి వెలుంగ,

స్వమృగహింసావిహారము గాంచురతిఁ బోలెఁ
దలపై నెగయు వాలదండ మొనర,
నిగుడు కోపాంకురనికరం బగుటఁ బోలె
సితకేసరముల కెంజిగి చిగుర్ప,

తే. వక్రదంష్ట్రలు శతకోటి వాదు గెలువ
వర్తులపుఁ గన్నుగవ భానువాసిఁ గేర,
ఘుటఘుటార్భటి ఘనకోటిపటిమ దెగడ
నొక్క సింగంబు వడిఁ బొదనుండి వెడలె. 27

క. వెలలి జిఘృక్షాగౌరవ
కలనన్ లంఘింప నృపతి గన్గొని నిజని
స్తుల చంద్రహాసధారం
దలఁ ద్రెవ్వఁగ నేసె నద్భుతంబుగ నంతన్. 28

మ. క్షితినాథేంద్ర శితాసిసంహతిభవాసృగ్వ్యాప్త తత్సింహరా
జ తనూదీధితిసంధ్యలో వెడలు భాస్వన్మూర్తి నా నొక్కమా
నిత తేజస్తతి దోఁచె నంత నచట న్వీక్షింప నయ్యెన్ రమా
పతి నా పూరుషరూప మొక్కటి జగత్ప్రస్తుత్య దీవ్యద్ద్యుతిన్. 29

చ. అది గని యానృపాలుఁడు మనోంబురుహంబున విస్మయాంకురం
బొదవఁగ నుండఁ, గిన్నరత నూనుచుఁ, దత్పురుషావతంస మా
యుదధిగభీరుఁ జేరి, వినయోన్నతి, ‘భానుకులాయ, శత్రువ
ర్యదమనపణ్డితాయ, భవతేఽస్తు నమో’ యని మ్రొక్కె, మ్రొక్కినన్. 30

తే. ఆదరంబునఁ గెంగేల నతని నెత్తి
దండఁ గూర్చుండఁ గావించి ధరణిభర్త
తత్కథా శ్రవణైక ముదాయుతాత్మ
నప్పురుషమౌళిఁ గాంచి యిట్లనుచుఁ బలికె. 31

చ. అకలుషరూపశోభివి, మహామతిశాలివి, కిన్నరత్వబో
ధకశుభపాళి, విట్టి విబుధస్తుతివృత్తిఁ జెలంగు నీకు ని
త్యకటుతరేభవైరిరమణాకృతి యేగతిఁ జెందె, నెట్లు త
ద్వికృతి యడంగెఁ, దెల్పఁగదవే విన వేడుక వుట్టె నియ్యెడన్. 32

క. అను జనపతి వాక్యము మది
కనివారితమోద మొసఁగ, నాఘనుఁడు పునః
పున రవనతి ఘటియించుచుఁ
దనకథ వివరించె ని ట్లుదారమృదూక్తిన్. 33

సీ. కలిమితొయ్యలిదాల్పుబలుసామిపొక్కిట
మనుతమ్మి యేవేల్పుఁ గనిన తల్లి,
మినుకుఁజాల్తుద దెల్పు మిన్న లోఁ గాంచుజో
గులటెంకి యేవేల్పుకలికి వీడు,
చిలుకుముద్దులవీణెచెలియగాఁ దగు చాన
బొమ్మరిం డ్లేవేల్పు నెమ్మొగంబు,
లీరేడుజగములవారలఁ బుట్టించు
తీరువ యేవేల్పు పారుపత్తె

తే. మట్టి పెనువేల్పు హరిహయ హవ్యవాహ
హరిజ హరిరిపు హరిణాంకగురుపరిబృఢ
హరిణహయ హయముఖరాజ హరులు గొలువ
హాళిఁ బేరోలగం బుండు నవసరమున. 34

చ. కొలువున నిల్చి భక్తివిధిఁ గొల్చు మహామనువర్ణదేవతా
కులములలో నజత్వ మొనగూర్చు మహామనువర్ణదేవతా
వళు లొకకొన్నిపర్విన నవజ్వలనోజ్జ్వలకీలికాప్లుతిం
గళవళ మందఁ గాంచి, యలకంజభవుండు ప్రియోక్తి నిట్లనున్. 35

చ. కటకట సర్వలోకశుభకాంక్ష లొసంగుచు నిచ్చ మించు మీ
కిటులభజింపరాని యవిహీనవిపత్తిక సేరె నెట్లు, త
త్పటిమ హరింతుఁ దెల్పుఁ డన పద్మజుని న్మనువర్ణదేవతా
పటలము మ్రొక్కి యిట్లనియెఁ బాయని దైన్యము మోముఁ జెందఁగన్. 36

శా. ఆరమ్యాగమమార్గగద్విజశరణ్యం బై యిలం బారిజా
తారణ్యంబు సెలంగు, నయ్యటవి బ్రహ్మత్వంబు రాఁ గోరి దు
ర్వారాత్మద్రఢిమాప్తి మామకజపవ్యాపారపారంగతుం
డై రాజిల్లు తపస్వి యొక్కఁడు వసంతాభిఖ్య నింపొందుచున్. 37

చ. కనఁ డితరంబు, దా వినఁ డొకానొక విప్రవరోక్తిఁ, బల్కఁ డిం
పున నొకమాట, నిట్టి దమభూషితుఁడై ముని నిశ్చలాంతరం
బెనసి యతృప్తికృజ్జపసమేధనవైఖరి మించుఁ, దత్ప్రవ
ర్తన మిటు లయ్యె, దీని నొకదారి నడంపఁగఁ జూడు మిత్తఱిన్. 38

చ. అన వనజాసనుం డలమహాయతి యెంతకుఁ జొచ్చె నౌర! స
జ్జనవినుతాజభావగతిఁ జక్కగ నొందెడివాఁడె , యెట్టు లై
న నొక నవాంతరాయము వెనంగఁగఁ జేసెద నంచుఁ జింతతోఁ
దనరఁగ నుండ, నప్పు డగదారి విరించిగుఱించి యిట్లనున్. 39

చ. యతి యన నెంత! తన్మనుజపైకసమాధి యనంగ నెంత, త
ద్వ్రత మన నెంత! యియ్యెడ ముదంబున విఘ్నము దార్తు రిమ్మరు
త్సతు లఖిలేశ! యిట్టి సురతామరసేక్షణ లుండ, లోకసం
తతినుతశక్తి మించు రతినాయకుఁ డుండ, విచారమేటికిన్? 40

సీ. ఏలదే? బంటుగా నీమేనకాకాంత
యచలగాధికుమారు నంతవాని,
నేఁచదే? సొబగుచే నీధాన్యమాలిని
వింతగా శాండిల్యు నంతవాని,

నెమ్మెతోఁ గలయదే యీయూర్వశీవామ
హాళిమై జాబాలి యంతవాని,
నెనయవే వరుసతో నీవేల్పుచెలిచాలు
లలమండకర్ణజు నంతవాని,

తే. నిట్టి సురసుందరులు గల్గ నింతపనికి
మనములోఁ జాలఁ జింత నీవెనసె దేల?
వీరిలో నొక్కవెలఁది నమ్మారుఁ గూర్చి
పంచు మీకార్య మిపుడె ఫలించుఁగాని. 41

చ. అన నమృతంపుఁదేట జత యందిన యాసురరాజుమాట చ
య్యన శ్రుతిపర్వమై మదిని హర్షమహాపగఁ బొంగఁ జేయ , ‘నీ
పని కిది కార్యమౌర’ యని పల్కువెలందిమగండు కంతుఁ బి
ల్వ ననిలుఁ బంచి, వేల్పునవలాతలమిన్నల నంతఁ గాంచినన్. 42

సీ. వెలవెల నై తోఁచె నలచంద్రకళ యత్య
తులతమశ్శ్రీఁ బొందఁగలనె యనుచుఁ,
దల యెత్త లేదయ్యె నలరంభ ధీరకుం
జరము సెన్కిన మనఁజాల ననుచుఁ,
దెలివి వాయఁగఁ బొల్చె నలతార హంసుని
గొడవఁ బోయిన మహంబడఁగు ననుచు,
శ్యామలలో నీఁగె నలమాధవి ధరిత్రి
ఘనులగోసృతి నిల్వఁగలనె యనుచు,

తే. నిట్టు లనిమేషకాంత లహీనభంగ
వృత్తి సంధించి చలియింపఁ జిత్తమందు
వే యెఱిఁగి చిత్రరేఖ యన్వేల్పుచెలువ
నలువకు జొహారు గావించి నిలిచె నపుడు. 43

చ. నిలిచి యవార్య యౌవన వినిర్మల సుందరభావ సత్కళా
కుల జని తైక దర్పమును గూడిన చేడియ గాన ముందు దాఁ
దెలియక ధాత కిట్లను సతీమణి, ‘దేవ! భవన్మనోహితం
బలర నొనర్తు, నన్ను దయ నంపుము నిర్జరు లెల్ల మెచ్చఁగన్.’ 44

చ. మరుఁడు సహాయుఁ డై బలసమగ్రతతో వెనువెంట రాఁగ, స
త్వరగతి ధాత్రి నొంది, యలతాపసుఁ జేరి, భవత్కృపాపరి
స్ఫురితకలావిలాసములఁ జొక్కపువేడుక నిక్కఁ జేసి, బం
ధురనిజశక్తి నిచ్చటికిఁ దోకొని వచ్చెద నేలి బంటుగన్. 45

సీ. జలపానసంరక్తి సడలించి మోవితే
నియ గ్రోలుతమిఁ జాల నింప వచ్చు,
తొలుపల్కుఁజదువులు వొలియించి రతికూజి
తంబులు నడపుటల్ దార్ప వచ్చు,
ధ్యాననైశ్చల్యంబు దలఁగించి వలఱేని
కలహంపుఁజింతలోఁ గలప వచ్చు,
యతివేషవైఖరి నడఁగించి విటపాళి
యెంచుమేల్ సొగసు చేయింప వచ్చు,

తే. నొంటి దిరుగుట మాన్పి యింపొనరు సఖులఁ
గూడి విహరించుతెఱఁగు వే కూర్ప వచ్చు
నాత్మచాతురి నేమి సేయంగరాదు
తపసి నివ్వేళ ననుఁ బంపు తమ్మిచూలి. 46

చ. తొలకరిచూపు లిం పొసఁగుధూపము లై పయిఁ బర్వఁ, గంధరో
జ్జ్వలకలనిస్వనం బుడుకచాల్ రొద యై విన వేడ్కఁ దార్పఁ, బూ
విలుగలవేల్పురాసివము వేగమె మౌనికి రేఁచి, మత్కుచా
చలయుగరంగవీథి ఘనసంభ్రమతన్ నటియింప నూన్చెదన్. 47

సీ. వలఱేని మనములో మొలపించు క్రొంజూపు
తూపులధైర్యంబు దూల్ప నేనిఁ,
దలఁపుల నెవ్వేళ తలఁగక యూరించి
కెరలుమేల్కళలఁ జొక్కింపనేనిఁ,
గౌఁగిట నలమి చొకాటపుఁగూటమిఁ
గలయంగఁ బేరాసఁ గొలుపనేనిఁ,
దులకించుమోహంపువలఁ జిక్కి వెనువెంటఁ
బాయక తిరుగంగఁ జేయనేనిఁ,

తే. బలుకువాల్దొర నివ్వేల్పుపడఁతు లెల్ల
వినుతి సేయంగ విటునిఁ గావింపనేని,
నజరకులమునఁ బుట్టితినంచు నిచ్చ
పలుకఁగా సిగ్గు గాదె? యబ్జాతజన్మ! 48

చ. అనఁ దెఱగంటికొమ్మ పలుకాత్మమనఃప్రమదంబు గూర్ప న
వ్వనరుహసూతి యాదరణవైఖరి నిట్లను, ‘నోనెలంత! ది
వ్యనికర వర్ణ్య విభ్రమకలాప్రవిమోహిత సర్వలోక వై
తనరెడు నీకు ధాత్రి నొకతాపసు లోఁబడ నూన్చు టబ్రమే? 49

ఉ. చొక్కపునీటునం, గలలసొంపున, చారువిలాసవైఖరిం
జక్కఁదనంబునం, సరసచాతురి, నీసురయౌవతంబులో
నెక్కువదాన వౌట చెలి యిచ్చ ఘటించితిఁ గాక దీని కీ
తక్కినవారిచే నగునె? తార్పఁగ నీదృశకార్య మెంతయున్. 50

సీ. ననబోఁడి యతులఘనస్ఫూర్తిఁ దూలింపఁ
జాలదే? నీనీలవాలకాంతి,
లీలం దమీశావలేపంబు విదళింపఁ
జాలదే? నీయాస్యజలజదీప్తి,

వనజానన యహీనమునిప్రౌఢిఁ గలఁగింపఁ
జాలదే నీరోమపాళికాంతి,
ముదిత సత్తాపసముజ్జృంభణముఁ బెంపఁ
జాలదే నీపదోజ్జ్వలనఖాళి,

తే. యచలవక్షోజపరమహంసౌఘమహిమ
నడఁపఁ జాలదె నీమందయానలీల
యగుటఁ దల్లక్ష్మి చెలు వందునట్టి నీకు
పడఁతి యొకమౌని నిల మోహపఱచు టెంత. 51

చ. అలవిరివింటిదంట ముదమారఁగ నీ వెనువెంట రా, ధరా
స్థలివడిఁజేరి, యామునియుదారతపఃక్రమ మెల్ల మాన్చి, యు
జ్జ్వలగతి వచ్చునీకుఁ జెలువా యొనగూర్తు వహింప నీసురా
బలలు శిరోనతిం బవలుపంజులు చెంద్రికపావడన్ రహిన్.’ 52

తే. అని యనేకవిధంబుల నాదరంబు
దొలఁక రంభాదినిర్జరీకులము లాత్మఁ
గలఁకచేఁ గుంద నప్పల్కుకలికిమగఁడు
చెలిమి నాచిత్రరేఖతోఁ బలుకునపుడు. 53

సీ. ననసేసకొప్పు నొందిన యొంటిపొరచెంద్ర
కావిరుమాల వింతై వెలుంగ,
రతికౌఁగిలింతఁ దోరపుఁజిక్కు గన్న మొ
గ్గలసరుల్ పేరెదఁ జెలువుమీఱ,
నెలవంకరేఖల నిలిచి పైఁజెదరుక
ప్పురపుగందపుఁదావి బుగులుకొనఁగఁ,
గలికిగోణమ్ముపైఁ గట్టిన క్రొత్తగే
దఁగిఱేకువంకి యందముగ మెఱయఁ,

తే. జిలుకకోయిలమూఁకలు సేరి నడవఁ
గలువఱేఁ డామనియుఁ బార్శ్వముల రహింప,
శారికలు నైజజయవిద్యచయముఁ జదువ
వేడ్కఁ జనుదెంచె నపుడు పూవింటిజోదు. 54

మ. వలరా జ ట్లరుదేర, నానలువ దీవ్యద్రత్నసింహాసన
స్థలి నొయ్యన్ డిగి చేర వచ్చి, నతి నొందం బాణిచే నెత్తి, య
ర్మిలితోఁ గౌఁగిటఁ గూర్చి, యంత రతినారీభర్తతో నందదు
జ్జ్వలపీఠిన్ వసియించెఁ, జెంగటనె నిల్వం దద్బలవ్రాతముల్. 55

చ. ఘనవినయాత్మ నున్నయలకంజశరుం దిలకించి యవ్విరిం
చనుఁ డనురక్తి దోఁప చతురానని నొక్కటి యై రహించు తి
న్ననిమధురోక్తిఁ బల్కు, ‘రతినాయక! నిన్గనుగొన్న నామదిన్
మనిచెఁ బ్రమోదసంతతి రమాపతిఁ గాంచినదారి నియ్యెడన్. 56

చ. సరసతరాసమాస్త్రములు సంతతజీవికశింజినీలతా
స్ఫురితశరాసనోత్తమముఁ బూని తలంపఁగ మేటి వై సుమా
కరసఖ నీవు రాజిలఁగఁగాదె సమస్తజగజ్జనుల్ పర
స్పరపరివైమతీగతులు బాసి ప్రియప్రమదాప్తి నుబ్బుటల్. 57

సీ. మునిభామకై యింద్రుఁబెనుఁగోడిగా లస
ద్ధృతిఁ దూల్చి మించిన దిట్టతనము,
నొక్క కాత్యాయని నొందంగ సెగకంటి
పౌరుషం బరచేసి ప్రబలునేర్పు,
హంసాఖ్యఁ దగు కైరవారిపితృప్రసూవి
[1]సంపర్కగతిఁ గూర్చి యొప్పుచలము,
గురుపత్నిఁ గలయ సత్కులనేత యగువాని
సతతంబుఁ గుందించు చతురవృత్తి,

తే. నఖిలభువనాభినవ్యమహాద్భుతౌఘ
కల్పనానర్గళస్ఫూర్తి గాంచి వెలయ,
మాదృశుల కెన్న నలవియె మంజుకంజ
బాణజితలోకజాల, శంబరవిఫాల! 58

చ. కనుగలవిల్లు వూని కడుగాటపుసంపెఁగమొగ్గముల్కిచాల్
గొని కలనాదసైన్యములుఁ గొల్వఁగ వీవలితేరి నెక్కి నీ
వనికి రమాకుమారక! భుజాంచితశక్తిఁ గడంగ డాఁగఁడే
ఘనకరవీరసూనదరిఁ గాలవిరోధి భయావిలాత్ముఁడై.’ 59

క. అని వినుతిపూర్వకంబుగ
మనసిజునిం బలికి యపుడు మఱియు నతనితోన్
తనకార్య మెల్లఁ దేటగ
వనజాసనుఁ డిట్లు వలుకు వరమృదుఫణితిన్. 60

శా. ‘వింటే మన్మథ! మత్ప్రభుత్వమున కుర్విం బుట్టు విఘ్నావళిన్
గెంటం దార్చుచు మామకాత్మహితభంగిన్ మించు నీ వుండుటల్
కంటం గానక బ్రహ్మభావమున కాకాంక్షించి యొక్కండు పెన్
గొంటే యౌ ముని దెచ్చినాఁ డిటఁ దపఃకుల్యాధ్వసంచారితన్. 61

చ. ముని యజభావ మందఁ దపముల్ గడుఁ జేసినఁ జేయుఁగాక, పా
వన మనురాజజాతజపవైఖరి మించిన మించుఁ గాక, ని
త్యనియమవృత్తిఁ దాలిచినఁ దాలుచుఁ గాక, విచారమేల నో
మనసిజ! నాకు నీవు బలుమక్కువతమ్ముఁడ వై చెలంగఁగన్. 62

చ. హరి సకలాధిపత్యము సుమాశుగ! మా కొనగూర్చె మున్ను త
త్పరిభవకార్యసంహృతియుఁ దత్పరిపాలనమున్ ఘటింపఁగా
నిరతముఁ గర్త వీ వగుట నేర్పున నీ విలఁ జేరి తన్మునీ
శ్వరతప మెల్లఁ దూల్పఁ దగు సారమహామహిమంబు లెంచఁగన్. 63

చ. అనఘ కలాకలాపిని యనల్పవిలాసిని చిత్రరేఖ పే
రను దగు నీవధూనికరరత్నము నీవెనువెంట రాఁగ, వే
చని ధరఁ జేరి, యానియమిచంద్రుతపం బెడలించి, వానిఁ దూ
ల్ప నిజశక్తి నేతదబలాపరిచారకుఁ జేయు మంగజా! 64

చ. అలికవిలోచనోగ్రతపమంతయు ము న్నడఁగించినట్టి నీ
బలము చలంబు దివ్యశరపాండితి నేఁడును జూపి, మౌని ని
చ్చెలువ కధీనుఁ జేయు మిఁకఁ జెప్పెడి దేమి రతీశ, సర్వముం
దెలిసిననీకు దీనఁ దగ నిల్పుము మద్భువనాధిపత్యమున్.’ 65

ఉ. నా విని నల్వఁ జూచి, రతినాయకుఁ డిట్లను, ‘వాగధీశ! యి
ట్లీవు వచింపఁగాఁ దగవె, యీఘనకార్యభరంబు నాది గా
దే, విబుధుల్ నుతింప జగతీస్థలిఁ జేరి, మునీంద్రు దేవరా
జీవదళాక్షితో నెనయఁజేసెద, మానుము వంత నెమ్మదిన్. 66

చ. అళితతిపోటుఁగూఁత లెగయం, బెనుమావులు డిగ్గి చిల్కరౌ
తులు నడవన్, మహాబలము దోడ్తన చుట్టికొనం, దపస్వి ని
శ్చలధృతి సాలమండలము చయ్యన లగ్గలు వట్టి పట్టి యీ
నెలఁతయురోజదుర్గతటి నిల్పెదఁ దత్పటుహృన్మహీవిభున్’. 67

చ. అన మరుఁ బల్కునం బ్రమదమంది విరించి సువర్ణచేలముల్
ఘనమణిభూషణంబు లలకంతునకున్ సురకాంతకుం బ్రియం
బెనయ నొసంగి, యంత రజనీశ వసంత సమీర తామ్రలో
చనవర ముఖ్యమారబలసంతతి నాదృతి సేసి యిట్లనున్. 68

సీ. తెఱవ నవ్వుల యోగిధృతిఁ గలంపకమున్న
నెఱయు వెన్నెలలు పైనింప వన్న,
నెలఁత కేలను మౌనికళ లంటకయమున్న
చిగురాకు నెమ్మొనఁ జేర్ప వన్న,

సకిపైఁట యతి చొక్కఁ జక్క వీవకమున్న
ప్రబలు చల్లఁదనానఁ గ్రమ్మ వన్న,
చెలిపాట యమివీనులలరఁ బాడకమున్న
కలనాదభంగిక ల్తెలుపవన్న,

తే. యోకుముదమిత్ర, యోచైత్ర, యోసమీర
యోపికాధీశ మీనేర్పు లొనరఁ జూపి,
పడఁతి కాజడదారి లోఁబఱప రన్న
మన్మనోభీష్టకార్యంబు మనుపరన్న. 69

చ. అని నిజమిత్త్రవర్యనిచయంబుల నీగతిఁ బల్కి యమ్మరు
ద్వనధరవేణికామణి విధాత రహిం దన కొప్పగించి పం
చిన విరివింటిజోదు పికసేనలతో సురవారిజాక్షితో
ఘన మగు వేడ్క వొంగఁ దదగారము వెల్వడి వచ్చె నంతటన్. 70

సీ. చిలుకతత్తడిరౌతుచేతితియ్యనివింట
గాఢకృపీటజకాండ మెగసె,
నుడురాజు పఱతెంచునెడఁ బుండరీకంబు
వికలత్వమున నిరావీథిఁ ద్రెళ్లె,
కరువలి కడ్డమై వెఱఁ గూన్చె నలఘన
పద్యనవ్యాత్మభీప్రదమహాహి,
యామని రాఁగఁ జయ్యన విగతచ్ఛదం
బుగఁ జూడఁబడె నప్డు పురుషకాళి,

తే. నిర్జరవధూటికావామనేత్రసీమ
జడిగొని పరిప్లవత్వంబు సరగఁ దోఁచె,
ని ట్లశకునంబు లేపున నెన్ని యున్న
వానిఁ జూడక యధికగర్వంబుతోడ. 71

మ. అలసత్యాధ్వము డిగ్గి యప్డు తప మొయ్యన్ దాఁటి దీవ్యజ్జన
స్థల మాపిమ్మట నొంది యంతట మహస్థానంబునుం బొంది వే
ల్పులరావీ డట వేడ్క డగ్గఱి భువర్లోకేంద్ర మవ్వేళఁ జే
రి లలిం గంజశరుండు దా దొరసె ధాత్రిన్ మేరుమార్గంబునన్. 72

చ. ధర నిటు లొంది, యంత సముదారగిరీనపురీఝరీదవో
త్కరముల నెల్లఁ గన్గొనుచుఁ, గాముఁడు వింధ్యముఁ జేరె నందుఁ బ
ద్మరిపుసుతోర్మిజాంబుకణమండలపుష్పితనీపనిత్యభా
స్వర మగు పారిజాతవనవర్యము గన్నుల కింపుఁ గూర్పఁగన్. 73

చ. గురుజవశక్తి వచ్చి యొకకోయిలవేగరి తద్వసంతభూ
సురతిలకాశ్రమం బిదియచు మ్మని తెల్పఁగఁ గంతుఁ డందు ని
ర్జరసతితో, నిజాప్తవరజాలముతో వసియించెఁ దత్ప్రసూ
నరసకులార్ద్రమారుతమునన్ స్వతనూశ్రమ మెల్లఁ బాయఁగన్. 74

చ. చెలు వగు మైత్త్రిఁ గోయిలవజీరులఁ దుమ్మెదకమ్మగట్టుమూఁ
కల గొరువంకరాదొరలగాటపుఁజిల్కలకాల్బలంబులన్
నలినకలంబవీరబలనాథుఁడు చైత్రుఁడు తద్బలోచితో
జ్జ్వలలతికాకుటీపటలిఁ జక్కగఁబాళెము డించె నయ్యెడన్. 75

సీ. చిగిరించు నెఱకెంపుచివురాకుగమి కట్టు
నట్టి కౌసుంభాంబరాళిఁ బోలఁ,
జాలఁ దోఁచిన నూత్నజాలకశ్రేణి మేల్
హురుమంజిముత్తెపుసరులఁ బోల,
నళు లెక్క నరదోఁచు తెలిపూలచాలు కై
శ్యములఁ జేర్చిన గర్భకములఁ బోల,
నలరుగుత్తుల నిండ నలరు పుప్పొడి గుబ్బ
కవలపై నలఁదుగందవొడిఁ బోల,

తే. సరసశృంగారవైఖరి ధరణిఁ బొదలు
లతిక లయ్యెడ వీక్షించుకుతుక మొసఁగెఁ
జైత్రకాంతాగమనదిష్టసముచితౌజ్జ్వ
లీపరిభ్రాజదుత్తమాలీల నొంది. 76

ఉ. డాసె సుమాళిఁ దుమ్మెదమిటారి, దమిం జివు రాని కోయిలల్
మ్రోసె, రసాలకేసరసమూహసుగంధము దిక్తటంబులం
బూసె మెకంబు నెక్కుదొర, మున్మును పైకొను కాఁకచే ధృతిం
బాసె వియోగి, యోగివనపాళిక నామని యాక్రమింపఁగన్. 77

చ. మునివన మంతయుం దనచమూపతి యత్తఱి నాక్రమింప, మిం
చినబలదర్పగౌరవముచే విషమాశుగవీరశేఖరుం
డని కిదె చుమ్ము వేళ యని యాప్తమతిం బికమంత్రి దెల్పఁ, జ
య్యన వెడలెన్ రసాలవిశిఖాసము సూనశరాళిఁ బూనుచున్. 78

సీ. అరిరాజచిత్తభీకరకరకాండప్ర
చండిమ మనురాజమండలంబు,
క్రొందళంబులఁ జాలఁ గూర్చుక హరివితా
నములతోఁ జైత్రసేనావిభుండు,
కన్నుల నెఱమంటఁ గ్రక్కుచుఁ గలరుతుల్
బెరయ నానావనప్రియబలంబు,
కనకరజోరేఖఁ గనుపట్టు వరగంధ
పటిమ రాజిలు మహాబలకులంబు,

తే. తొలుదొలుతఁ దీవ్రవిస్ఫూర్తిఁ దొడరి నడవఁ,
జిలుక మేల్పక్కిపై నెక్కి, యలరువింటి
దంట, యమ్మౌనిఁ గదిసె దుర్దాంతశారి
కాళి యాత్మైకబిరుదపద్యములు చదువ. 79

చ. అపుడు రణోత్సుకుం డగు సితాంబుజసాయకుకంటిసన్నఁ గీ
రపటలి, చల్లగాడ్పు, తొవరాయఁడు, కోయిలపౌఁజు, చైత్రుఁ, డ
చ్చపుఁదెలిఱెక్కపుల్గు, లని సల్పఁగఁ జాలుదు నేనె నేనె యం
చపరిమితాగ్రహస్ఫురణ నమ్మునిఁ జుట్టిరి సత్వరంబుగన్. 80

సీ. శైత్యవత్కరకుంతచటులధారారేఖ
శమినేత నాటించెఁ జలువమిన్న,
తళుతళు క్కన వేగ జళిపించి మావిక్రొం
దళపుఁ గత్తిని మౌని నఱకె సురభి,
కడుఁ జంచరీకసంఘము మ్రోయ ఘనజాల
కంబుల యతి మొత్తె గడుసుగాడ్పు,
కటురజోగ్నికణాళి గ్రమ్మఁ జెందొవమందు
తిత్తుల మునిఁ గప్పె హత్తి యంచ,

తే. యిట్టు లాదిట్ట లందఱుఁ జుట్టుముట్టి
గట్టితన ముట్టిపడ నురుక్షాంతికవచ
ధారి జడదారి నొప్పించి ధైర్యలీల
నడఁప లేకున్కి గని మరుం డపుడు గడఁగి. 81

చ. చనని నవాగ్రహస్ఫురణఁ జక్కెరవిల్తుఁడు తేజి బోరునన్
మునిపతిమీఁద నూకి కడుముట్టక మ్రోయుగొనంబు తుంటవిం
ట నొనరఁ గూర్చి చంద్రఋతునాథులు గన్గొని యౌర! మేలు మే
లనఁ బరితేజితాబ్జముకుళాస్త్రపరంపర నించె నుద్ధతిన్. 82

చ. మదనబిసప్రసూనశరమండలి యాజడదారిసామిపే
రెద వడిఁ దాఁకునత్తఱిఁ దదీయపరాగము చిందుటల్ స్తవా
స్పద మయి వొల్చె తద్విశిఖజాలసమాహతిభిన్నమౌనిరా
జదృఢరమేశ భక్తికవచస్ఫుటచూర్ణమనీష దార్చుచున్. 83

చ. వరజవశక్తిచేఁ బలుకువాల్దొరపేరెదఁ దాఁకి, తాఁకునం
బరిహృతకుట్మలాత్మ మగు మారునితామరమొగ్గముల్కి ని
బ్బరముగఁ బర్వఁ, దద్రసము భాసిలె తన్మునిధైర్యజీవనో
త్కరములు పీల్చి వెగ్గలముగాఁగఁ గడున్ వెడలించుపోలికన్. 84

చ. అచలసమాధియోగగతి నందిన యమ్మునిఁ జెందదయ్యె న
వ్యచలనరేఖ, యప్పు డసమాశుగకాండము పర్వినం గరం
బచలసమాధియోగగతి నందిన యమ్ముని నెట్లు చెందు న
వ్యచలనరేఖ యెంత యసమాశుగకాండము పర్వినన్ మహిన్. 85

మ. తనకంజాతశరంబు లిట్లు మునిచంద్రస్ఫీతతేజంబుచే
వనవీథిన్ వికలత్వ మొందఁ గని, దుర్వారావలేపక్రమం
బున నాకంతుఁడు కేలుదోయిఁ గొని నేర్పుల్ మీఱఁ బూమొగ్గనే
జను దద్వక్షము గుప్పునం బొడిచె నోజం, జైత్రుఁ డౌనౌ యనన్. 86

చ. దళ మగు రోస మెచ్చఁ దనతత్తడి నోరగఁ బోవఁ జేసి ని
స్తులపథికాసృగక్త మనుసొంపున, రోహితదీప్తిజాతముల్
గలయఁగ మించు నూతనపలాశసుమం బను బాగుదారచేఁ
జలమున నయ్యతిన్ నఱకె, సారససాయకవీరుఁ డంతటన్. 87

చ. మునిపతి కేమిటన్ జుఱుకుముట్టకయుండినఁ, గాంచి, తేజి చ
య్యన డిగి, యప్డు నైకనిశితాయుధజాతము పూని మిక్కిలం
గనుఁగొనలన్ రుషానలశిఖాతతి పర్వ, మరుండు చంద్రచం
దనపవమానముఖ్యవృతిఁ దా నడచెన్, యతిమీఁది కుద్ధతిన్. 88

క. నడచి యళిఘంటికాధ్వని
యడరఁ, బరాగాగ్నికణచయంబులు వెడలం
గడు నమరురాగసుమ, మను
బెడిదం బగు శక్తి వైచె, భీకరలీలన్. 89

ఉ. దాన నొకింతయున్ విధృతిఁ దాల్పని యాదమినేతఁ జూచి, త
త్సూనశరుండు బీరమున శూరత యుట్టిపడంగ నయ్యెడన్
మానితపారిజాతసుమనఃకలికాగద కేల నెత్తి, య
మ్మౌనిని మోఁదె దివ్యకుసుమప్రతతుల్ మరుదాళి నింపఁగన్. 90

ఉ. అందుల కింతయుం జలనమందనిపెంపున కబ్బురం బెదం
జెంది, ప్రసూనకోశతటిఁ జెల్వగు గేదఁగిఱేకుఁజిక్కటా
రంది, యనూనరోషగతి నమ్మునిఁ గ్రుమ్మె మరుండు శాంకరా
మందమనోధృతిక్షపణమాన్యభుజాబలరేఖ హెచ్చఁగన్. 91

చ. సరసబలంబు గొల్వ సుమసాయకుఁ డంతటఁ బోక మౌని డా
సి రమణ మొగ్గ యన్ గుదియఁ జేకొని మొత్తి ప్రవాళ మన్మహా
పరశువుఁ బూని వే యడిచి బాగగు మంకెనవంకిఁ బట్టి ప
ల్తరములఁ గ్రుమ్మి యార్చె హిమధాముఁడు గన్గొని మెచ్చ నయ్యెడన్. 92

తే. ఇట్టు లమ్మారుఁ డమ్ముని నెనసి యని ఘ
టించు నవ్వేళ నిది వేళయంచుఁ దలఁచి
చిత్రరేఖావధూటి విచిత్రరీతి
శమి కనతిదూరమున సఖీజనము గొలువ. 93

సీ. తిలకాళిఁ దిలకించుఁ జెలి పెండ్లితఱిఁ గాంచు
తెఱఁగు తపస్వికిఁ దెలుపుకరణి,
గోఁగుచెంగటఁ బల్కుఁ గోమలి ప్రియములు
పలుకుటల్ దపసికిఁ దెలుపుకరణి,
మావిపైఁ గరముంచు మగువ కళాస్థాన
మలముటల్ మౌనికిఁ దెలుపుకరణిఁ,
గ్రోవిఁ గౌఁగిటఁ దార్చుఁ గుముదాక్షిపరిరంభ
కలనంబు యోగికిఁ దెలుపుకరణి,

తే. నిట్టు లప్పారికాంక్షి కహీనమదన
తంత్రవిజ్ఞానగరిమను దరుణి దెలుప
వల్లి దోహదచర్య దైవాఱ నపుడు
హాళి దళుకొత్తఁ దద్వనీకేళి సలిపె. 94

సీ. దమి దీన నైనఁ జిత్తము బయల్పఱచునో
యని సంచరించు నభ్యర్ణపదవి,
ముని దీననైన నూతనరక్తిఁ దాల్చునో
యని పాడుఁ దేనియల్ చినుకుపాట,
శమి దీననైన నిశ్చలభావ ముడుపునో
యని పొదల్ దూఱు లతాళి గదల,
యతి దీననైన ధైర్యముఁ బాయఁ జేయునో
యని పల్కు సఖుల నొయ్యారి పలుకు,

తే. నియమి దా దీననైనఁ గన్విప్పు నొక్కొ
యని మసలు దండ రాసాప్తి నాళియుక్తి,
నైన నానాతి చిత్రచర్యానిరూఢిఁ
దాపససమాధివైఖరి దఱుఁగ దయ్యె. 95

ఉ. ఆయతిలోకమౌళిహృదయంబు బయల్పడ కున్కి గాంచి యా
తోయజనేత్ర యాళితతితో మునిసన్నిధిఁ జేరి జాళువా
కాయలవీణె గైకొని తగన్ శ్రుతిఁ గూర్చి యొయార మెచ్చఁగా
నాయెడ నేర్పు మించ గమపాదికపుంఖణ మూన్చి వేడుకన్. 96

సీ. ఘనమార్గవిభవంబు వనితవేణినె గాదు
శ్రుతిపర్వరాగసంతతి నెసంగె,
సమతాళవిస్ఫూర్తి సతిగుబ్బలనె గాదు
నవ్యగీతప్రతానముల నెనసెఁ,

గలహంసవైఖరి చెలిగతులనె గాదు
సరసప్రబంధపుంజమునఁ దోఁచెఁ,
బల్లవంబులపెంపు పడఁతికేలనె గాదు
సొగసైనపదపాళి సొంపు పూనె,

తే. ననుచు వనదేవతాజనం బభినుతింప
రక్తివిధమును దేశీయరాగగతియుఁ,
జిత్రతరమంద్రరాగజశ్రీలు వెలయ
నింతి మునిచెంత వీణె వాయించె నంత. 97

ఉ. చెన్నగుజాళువాయొళవు, చిన్నరికెంపులమెట్లు, నీలపు
న్వన్నియ నొప్పు కాయలు, నవంబగు వజ్రపుకర్వె, పచ్చలం
బన్నినయట్టిమేరువును, బాగగుతంత్రులు మించ నొప్పు మే
ల్కిన్నర చెంతఁ జేరి యొకకిన్నరకంఠి యొసంగ నయ్యెడన్. 98

మ. సరసత్వంబునఁ గేల నూని యల యోషామౌళి చక్కన్ రిరి
మ్మరిగామారి యటంచు రిప్పనిమగామమ్మారి యంచు న్విభా
స్వరనానానవరక్తిఁ దానతతి మించన్ గౌళ వాయించి, ని
బ్బరపు న్వేడుకఁ జేయుపంతువిధముల్ పల్కించె నప్పట్టునన్. 99

మ. బళిరే మైసిరితీరు, నిల్కడలు సేబా, సయ్యరే పేరణీ
కలనం, బౌర పదాళికాభినయవైఖర్యంబు, మజ్జారె కో
పులవైచిత్రి, యహో వినిర్మలకరాంభోజాతవిన్యాస, మం
చలివేణుల్ వినుతింప సల్పె నటనం బాకొమ్మ తత్సన్నిధిన్. 100

క. ఈలీల నన్నివిద్యలు
వేలుపుతొవకంటి చూపి విపులసమాధి
శ్రీలాభగౌరవంబున
శైలాభం దెమలకున్నశమిఁ గాంచి రహిన్. 101

చ. అనుపమకాంచిరమ్యతటహాటకకింకిణికాఝణంఝణ
ధ్వని చెలరేఁగ, నానియమిదండకుఁ జేరి, యొయార మెచ్చ న
వ్వనిత తపోధనేంద్రపదవారిజయుగ్మము కేల నంటి, యొ
య్యనఁ దలఁ జేర్చి, నూత్నమధురామృతపూరసమోక్తి నిట్లనున్. 102

సీ. తెఱగంటిదొరలకుఁ దీఱలేనివిరాళి
మొనపుచక్కఁదనానఁ దనరుదాన,
కులుకుచిత్తరువుబొమ్మలకు జీవమునించఁ
గలపాటవగ నేర్చి యలరుదాన,
రంభాదికనిలింపరామలఁ దలవంపఁ
జేయు నాట్య మెఱింగి సెలఁగుదాన,
హరిగిరిశాదిదివ్యసభాళి బిరుదు లె
న్నైనఁ జేకొని నిచ్చ నడరుదాన,

తే. “పలుకుతొయ్యలి” వీవంచు నలువ మెచ్చ
నలఘుసాహిత్యవిద్యాప్తి వెలయుదాన,
“చిత్రరేఖా”సమాఖ్య రాజిల్లుదాన
నిన్ను సేవింపవచ్చితి నియమిచంద్ర! 103

క. అనునెడ నమ్మునికులమణి
కనుఁగవ నర విప్పి కాంతఁ గన్గొని యంతన్
బునరనవధికసమాధిక
లన నక్షులు మోడ్చి నిశ్చలతచే నుండన్. 104

ఉ. కాంచి తపస్విచిత్తగతి గాంచఁగ లేక యయారె మామకా
భ్యంచిత శాంబరీమహిమ కయ్యతి లోఁబడు నంచు నెంచి త
త్కాంచనగాత్రి యాళిజనతాయుతి మిక్కిలి చెంతఁజేరి నే
త్రాంచలసీమ నవ్వు వొలయన్ మునిఁ బల్కె నవోక్తిచాతురిన్. 105

సీ. జవరాలినునుగుబ్బచన్నులఁ జేరుట
వసుధాధరస్థలీవసతి గాఁగ,
నతివరత్యంతశ్రమాంబులఁ దోఁగుట
నమరాపగావగాహనము గాఁగ,
తెఱవకెమ్మోవిక్రొందేనియ ల్గ్రోలుట
నిరుపమామృతపానసరణి గాఁగ,
కొమ్మతో రతికూజితమ్ములు నొడువుట
సరసాగమాంతాళిచదువు గాఁగఁ,

తే. దలఁపఁ బద్మాంబకాభిఖ్యదైవతంబు
మసలక దయారసంబున నొసఁగు సు మ్మ
ఖండితానందగరిమ నిక్కలన మనుము
వట్టి యీఖేదకనివృత్తి గట్టి మౌని. 106

సీ. పరమకాశ్యాకృతిఁ బ్రబలదే నియమీశ
సోమమండలదాస్యరోమవల్లి,
యనవద్యమధురాత్మ నలరదే మునికాంత
జలరుహేక్షణమధుస్రావిమోవి,
పురుషోత్తమస్థేమఁ బొసఁగదే యతిచంద్ర
యచలకల్పోరోజ యలఘునాభి,
శ్రీరంగవైఖరిఁ జెలఁగదే దమివర్య
కనకజాతీయాంగి కన్నుదోయి,

తే. యగుట నిత్యపవిత్రరూపాప్తి నడరు
కలికితోఁ గూడి యుండినఁ గాక కలదె
యతనుసుఖరాశి యిట్టి మహాఘదాయి
ఘోరకాంతారమహి నున్నధీరముఖ్య. 107

మ. ఉరురామైకగుణానువర్ణనమొ, కాంతోచ్చైస్తనాగస్థలీ
పరివాసంబొ, సతీవరాంఘ్రిభజనాప్రాశస్త్యమో, సౌదృశో
త్కరసేవాగతియో, ప్రియారుణకరాత్యాలోకనంబో, మదిం
గర మూహింపఁగ నిట్టి నీతప మనంగా నేమి మౌనీశ్వరా! 108

మ. చెలిటెక్కుల్ గని, కొమ్మపాట విని, యోషిన్మౌళి నెమ్మోముతా
వులమే లాని, నెలంతమే నలమి, పూవుంబోఁడికెమ్మోవితే
నెలచా ల్గ్రోలి, సమేతరాక్షసుఖ మెంతేఁ గాంచఁగా లేక మి
క్కిలి యాత్మాధిగతైకహృత్సుఖనిషక్తిన్ మౌని! కాంక్షింతురే. 109

సీ. సుమసౌకుమార్యాప్తి నమరునీనెమ్మేను
ఘనపంచశిఖికీలఁ గంద కున్నె?
నెలపుల్గుపెంపూని యలరునీకనుదోయి
సూర్యదర్శనసక్తి స్రుక్కఁబడదె?
తమ్మియందమ్మూని తనరునీనెమ్మోము
శుచిభసితచ్ఛాయ సొగసెడయదె?
తళుకుకెంజిగురాకు సొలపూనునీయంఘ్రి
సూచిపై మెట్టిన సొంపు సెడదె?

తే. యకటకట నీవొకిం తైన యంతరంగ
మునఁ దలంపవుగాని సద్భోగయోగ్య
భావమున మించు నీయట్టి భవ్యమూర్తి
కీదృశమహాతపోగ్లాని నెనయఁదగునె? 110

మ. అసమజ్వాలశిఖాళి వ్రేఁగిన నిరాహారంబు గైకొన్న, శీ
తసరిద్వారులఁ గ్రుంకియున్న, భుజగీతంద్రీపరిధ్వంసిసా
హసవృత్తిం గయికొన్న, నీ కతనుకల్యానంద మెట్లబ్బు? భ
వ్యసితాంభోరుహలోచనాంఘ్రియుగసేవం దక్క! యోగీశ్వరా! 111

సీ. మాతంగయుతదావమహికన్నఁ గొంచమే
వరవిప్రవృతకేళివనధరిత్రి,
ఘనపంకమయశైవలినికన్న నల్పమే
యమలహంసాంచితాబ్జాకరంబు,
శైలాటగృహదగచ్ఛటకన్నఁ దక్కువే
సద్వితానోద్యోతసౌధపాళి,
యనిశ మిరాశనంబునకన్న నింద్యమే
పుణ్యసుదృక్కృతభోజనంబు,

తే. కాన నీకాన నీవృత్తిగరిమ మెల్ల
మాని నే మానితప్రీతిమహిమఁ గొల్వ
మౌని యిమ్మౌనిలింపసద్మంబుఁ జేరు
దాన మోదానపాయత దాల్తు విపుడు. 112

చ. పలుమఱు వట్టిపల్కు లిఁకఁబల్కఁగ నేల యతీంద్ర, త్వత్సము
జ్జ్వలతరరూపయౌవనరుచావరవిభ్రమకౢప్తమోహ నై,
బలుతమి నిన్నుఁ జేరి ధృతిఁ బాసిన నన్ రతిఁ జొక్కఁజేయు ము
త్కలికల నీకధీనగతిఁ దాల్చితి సూనశరుండు సాక్షిగన్. 113

చ. అని మునిరాజునిశ్చలత నాత్మవచోర్థచయోరరీకృతిన్
మనమున నిశ్చయించి యలమత్తమతంగజయాన యేమి వ
చ్చిన నిఁక వచ్చుఁ గాక యని చిక్కనిధైర్యము పూని యేలు న
న్ననుపమరక్తి నంచు దమిహస్తముఁ బట్టి కళం దెమల్చినన్. 114

క. ఆతఱి నాయతివర్యుం
డాతతముగఁ దెఱచె లోచనాబ్జములు మనో
భూతప్రతిఘోజ్జ్వలన
స్ఫీతజ్వాలద్విలోలజిహ్వాంచలుఁ డై. 115

వ. ఇవ్విధంబున నవ్వాచంయమిసార్వభౌముండు తత్పద్మినీహృత్పద్మ సాధ్వసాపాదన చమత్కారి దినాంత సంధ్యాయమాన కోపరసశోణిమధురంధరంబు లగు నేత్రపుష్కరంబులు విప్పి, చెప్పరాని యాగ్రహభంగిఁ జెంగట నున్న యక్కురంగలోచనామణిం గనుంగొని, తోఁకఁ ద్రొక్కిన పెనుజిలువచెలు వున దీర్ఘం బగునిట్టూర్పు సడలించుచు, ‘నో నిలింపచాంపేయగంధి యగంధమహాంధకజిత్పరిపంథి మదాంధకార సంబంధంబునఁ గన్నుగానక మానక నిగుడుమనస్థైర్యంబున దవంబులు చేరి వనంబుల దినంబులుగడుపుచు నమలయమలక్ష్మీసాంగత్యంబున నున్న నన్ను నూరకయె పెచ్చుపెరుఁగు తెచ్చు కోలువలపునఁ బచ్చవిల్తుకయ్యంబునకు నెయ్యం బుంపు మని మదీయకరంబుఁ బట్టఁజెల్లునే, యైన నది యేమి సేయం జను నియ్యెడ నీ వేలుపుఁదొయ్యలితనంబు దూలి యియ్యవని మనుజవనిత వై పుట్టి, సుదోషాకరసమాఖ్యం దగు నొక్కయిరాపుం జెట్టవట్టి యుండెదు గాక’ యని శపియించె నపుడు. 116

సీ. తనక్రొందళములమన్నన చెట్లపాలుగాఁ
జనియె సూనశ్రీల నెనసి మధువు,
తనతరోగరిమ మెంతయు ధూళిపాలుగా
నరిగె వడంకుచు నసదుగాడ్పు,
తనమహస్ఫూర్తి తొల్తనె యగ్నిపాలుగాఁ
బఱచె వెల్వెలఁ బాఱి పద్మవైరి,
తనపాత్రవృత్తి తోడ్తనె మింటిపాలుగా
నడఁగెఁ గొమ్మలఁ బికాద్యభ్రగాళి,

తే. తనపురారాతిభీకరోదగ్రవిగ్ర
హస్ఫురణ భూతిపాలుగా నతనుఁ డేగె,
చాపశతజాతములు వనస్థలిని వైచి
యమ్మహామౌని కోపాప్తి నడరు నపుడు. 117

క. ఈరీతి మునీశ్వరవా
గ్భూరీతిభయార్తచంద్రకుసుమాస్త్రపికీ
కీరీతిరోహితతఁ గని
నారీతిలకంబు వెఱపునన్ మదిఁ గలఁగన్. 118

ఉ. అయ్యతివర్యుఁ జేరి వినయంబున నంఘ్రుల వ్రాలి పల్కు, నో
యయ్య! భవత్ప్రభావగతి నాత్మ నెఱుంగక ప్రాజ్యగర్వసా
హాయ్యమునన్ ఘటించితి మహాగము నైన దయాత్మఁ బ్రోవవే
యియ్యెడ నీకు నే ననఁగ నెంత త్వదుక్తి మరల్చి నెమ్మదిన్. 119

చ. కటకట నిర్జరీత్వ ముడుగన్ ధర మర్త్యవధూటికాత్మ నే
నెటులు జనింతు, నైన మఱి యేగతి దుష్టసమాఖ్యఁ బూని స
త్పటలవినిందనీయగతిఁ దాల్చినవాని వరించి యోర్తు, నా
వటముగ నీదుమాట మునివర్య మరల్చి దయాత్మఁ బ్రోవవే. 120

చ. అనువనితాప్రియోక్తిఁ గరుణాయతనాయితమానసాబ్జుఁడై
మునికులముఖ్యుఁ డిట్లను “నమోఘము మద్వచనంబు లైన నే
ర్పున నిఁక దాని కన్యగతిఁ బూన్తుఁ బయోజదళాక్షి!” యంచుఁ బా
వననిపుణత్వరూఢి దయివాఱ యతీశుఁడు పల్కు వెండియున్. 121

చ. “సరసిజగంధి! వింటివె! ‘సుచంద్ర’సమాఖ్య రహించుభూపతిం
బరిణయ మందు మంచు నలభవ్యవచస్తతి కర్థమౌట ను
ర్వర ఘనరాజవంశమున రాజిలి జిష్ణువిరోధిభేదనా
దరు నినవంశమౌళిమణిఁ దన్వి వరించి చెలంగె దెంతయున్.” 122

తే. “అఖిలభూమిధురాభరణాఢ్యు నాధ
రాభుజునిఁ జెట్టవట్టి దుర్వారవిభవ
సంగతి శతసహస్రవత్సరము ధరణి
నలరి యంత భవద్రూపమందె” దనిన. 123

చ. విని ప్రమదప్రవాహపరివేష్టితమానస చిత్రరేఖ యం
త నలమునీశుపాదనలినంబులకుం బ్రణమిల్లి యాఘనుం
డనుప హితాళిపాళియుతి నాస్థలి నల్లనఁ బాసి యాత్మకాం
చనమయకేళికానిలయసంస్థలిఁ జేరె రయంబు మించఁగన్. 124

ఉ. ఆలలితాంగి యొక్క భవికాహమునన్ “క్షణదోదయా”ఖ్య పాం
చాలవసుంధరాపతికి “శ్యామ” యనం బొగడొందు సుందరీ
మౌళియెడన్ జనించె, నలమానవభర్తయు భూరిహర్షభూ
షాకలితాత్ముఁడై యునిచె “చంద్రిక” యన్శుభనామ మింతికిన్. 125

మ. తనకార్యంబున కీగతిం జని యమర్త్యస్త్రీలలామంబు పా
వనమౌన్యుక్తి నిజాదివర్ణరహితత్వం బూని ధాత్రిం జనిం
చిన వార్తన్ విని చింత నొంది మదిఁ దత్స్నేహంబుతో దివ్యచి
హ్ననికాయంబులు గల్గఁ జేసె నవలా కబ్జాసనుం డెంతయున్. 126

ఉ. ఆసరసీరుహాక్షి కఖిలాద్భుతదాయివిపంచికాకలా
భ్యాస మొనర్పఁ జెంతఁ దగునట్టి ననుం “గుముదాఖ్యుఁ” గాంచి ప
ద్మాసనుఁ డంపఁ బూర్వసమయామితమైత్త్రి ధరిత్రిఁ జేరి యు
ద్భాసితతద్రహస్యగతిఁ దన్వికి నేర్పితి నేర్పు పెంపునన్. 127

తే. అంత నొకనాఁడు శారదాకాంతవలన
వింతరాగంబు లొకకొన్నివిని ముదమున
వాని నన్నింటి నారాజవర్యసుతకుఁ
దెలిపెద నటంచుఁ బుడమి కేతెంచు నపుడు. 128

సీ. కనుదోయి కింపూన్చు కలికికుంకుమబొట్టు
దార్చిననెమ్మోముఁదమ్మిదాని,
నీటుగాఁ దీర్చిన కాటుకరేఖచే
నొప్పారు విమలాక్షియుగముదాని,

నునుపు లౌ తొడలనిగ్గున వింతవగ దోఁచు
నవ్యచీరాచ్ఛాదనమ్ముదానిఁ,
బసపుచాల్పూఁతచేఁ బచ్చదామరపెంపు
దలఁకించు పాణిపాదమ్ముదాని,

తే. జలదనికటస్థలి రహించు చపలవోలెఁ
బర్ణదళశాలపొంతఁ జూపట్టుదాని,
నొక్క మునికాంత నీయద్రిచక్కిఁ గాంచి
చాల వైచిత్రి నెమ్మది సందడింప. 129

చ. కళ గలమోము, కెంపుసిరి గాంచినపల్దెర, తేనె లొల్కు ప
ల్కులు, బిగువైన చన్నుఁగవ, కుందనపుంజిగి నేలు ముద్దుచె
క్కులు గల యీచెలిం బ్రియపుఁగూర్మివగ న్ననవిల్తుపోరునం
గలయక యున్నచోఁ దలఁపఁగల్గునొకో నవసౌఖ్యమం చొగిన్. 130

ఉ. తాపసరాట్కుమారసమతాకలితాకృతి నాత్మవిద్య మా
యాపటిమన్ భరించి, తదుదారనవచ్ఛదశాలఁ జేరి, యు
ద్దీపితభక్తిఁ దన్మునిపితృప్రముఖానవరక్షమీశరా
జీపదపద్మము ల్వినతిచేయుచు నంతటఁ దత్కథాగతిన్. 131

తే. ప్రొద్దు గడపుచు నుండ మత్పూర్వకర్మ
గౌరవమ్మున నమ్మునికాంతుఁ డచటి
కుట్టిపడ్డట్లు కన్నూడినట్టు లపుడు
వేగమున వచ్చెఁ దత్సభ వెఱఁగుపడఁగ. 132

ఉ. వచ్చిన నమ్మునీశుఁ గని వారక గుండియ వ్రీల నంత నే
నచ్చటఁ దెచ్చుకోలు ధృతి నయ్యతితో శపనోక్తిజాలకం
బెచ్చఁగఁ బెద్దప్రొద్దు కలహించితి నప్డు పరస్పరోగ్రఘో
షోచ్చలితాత్మతన్ సభ యహో యని యబ్బుర మూని నిల్వఁగన్. 133

క. ఆయతిపతి యాయెడ మ
న్మాయాగతి నెల్లఁ దెలిసి న న్గాంచి మనో
భూయఃపరికందళితమ
హీయఃప్రతిఘారసాప్తి నిట్లని పలికెన్. 134

శా. ఓరీ కిన్నర! యిట్లు పాపమతివై యుద్వృత్తి మౌనీశ్వరా
కారం బూని మందగనైకరతికాంక్షాయుక్తిచే మీఱి యౌ
రా రాఁ జెల్లునె యిప్డు నీవు పవిధారారూపశాపోక్తి దు
ర్వారేభాహితమూర్తివై పొడమరా వైళంబె యియ్యద్రిపైన్. 135

చ. అని ముని శాప మిచ్చిన భయంబు మనంబున నిండి యుండ న
య్యనఘుని పాదపద్మముల నయ్యెడఁ జయ్యన వ్రాలి భక్తిచే
కొని యిటు లంటి, నో నియమికుంజర! మీరు మహాగసుండ నై
నను ననుఁ బ్రోవ రయ్య కరుణాసదనం బగు మానసంబునన్. 136

మ. వనజంతూత్కరహింసనోగ్రతరదుర్వ్యాపారసంలబ్ధి మే
దినిఁ గన్పట్టు మతంగజారివరమూర్తిం బూని వర్తింప నో
ర్తునె యయ్యో మునివర్య యిప్డు నవకారుణ్యంబు నాపై ఘటిం
చి ననుం బ్రోవవె? పాపవే? మదుపలక్ష్యీభూతశాపోక్తికన్. 137

తే. అన దయామయమానసుం డగుట మౌని
మామకీనోక్తి నిజ, మైన మయుకులేంద్ర!
వర్షపంచకము హరీంద్రభావ మూని
యంత నీరూప మందెద వనుచు ననిచె. 137

చ. అనిచిన నేను నమ్మునికులాగ్రణికిం బ్రణమిల్లి మన్మనో
మనసిజశాంబరీకులచమత్కృతి యెంతకుఁ దెచ్చె నంచుఁ బా
యని పెనుచింతతోఁ గలఁగ నాంతర మేనటు వాసి యీవినూ
తనమణిమండపోత్తమము దారునఁ జేరి వసించి యున్నెడన్. 138

సీ. కురువిందరుచి నాజిఁ గుదియించు రదరాజి
వక్రతాశాతతావళిత మయ్యె,
నెలపుల్గుకవడంబు గలఁచునేత్రయుగంబు
వృత్తతాహరితతాయత్త మయ్యె,
నంబుదావళినీలి నడఁచుశిరోజాళి
ఖర్వతాశోణతాకలిత మయ్యె,
నలరుతామరగోము నలయించునెమ్మోము
వివృతతా విపులతాభివృత మయ్యె,

తే. నహహ! యని పశ్యదఖిలవాహాస్యవితతి
విస్మయం బూన బుధవర్ణ్యవిమలరూప
గౌరవంబున మించు మద్గాత్ర మపుడు
భీమకంఠీరవాకృతిస్థేమ గనియె. 140

వ. ఇట్టు లతులనాగవిదళనవ్యాపార నవీనశతమఖకరవాలాయమాన ఖరనఖరంబులును, నక్షీణమృగ క్షతజకటాజ్యధారా సముజ్జ్వల జ్జఠరజ్వలన సమున్నత జ్వాలాయమాన రసనాకిసలయంబును, నమందతుంద కారామందిర బందీకృత స్వభృత సారంగకులీన సారంగవిమోచనలాలసా విలసనోత్త మాంగ రాజసదన వదనద్వారాశ్రిత చంద్రరేఖాయమాన వక్రదంష్ట్రాయుగంబును, నాత్మీయహరి తానుబోధక భాస్వద్విరోచనమండలాయమాన నిస్తులలోచనద్వయంబును, నలయప్రభావోరరీకృ తాఖిలజంతు నికృంతన తంతన్యమాన చాతుర్యపృష్ఠేకృత కీనాశపాశాయమాన దీర్ఘవాలంబును, నతిఘనఘనాఘనస్థైర్య సమున్మీలనశీల నిబిరీసనిశ్వాసమారుత ప్రచారకారణ మహాబిలాయమాన నాసారంధ్రంబును, గల సింహాకారంబు నివ్వటిల్ల నుల్లంబు జల్లు మన మదాప్తజనంబులు చెంతల నిలువ లేక యెల్లెడల కుం జన సకలజగద్వార పారావారగిళనపానసమ ర్థాక్షుద్రక్షుధోదన్యా పరి క్షుభితమానసంబు పక్షీకరించి యనేకకాంతారజంతుసంతానంబుల మెక్కుచుఁ, దదీయాసృక్పూ రంబు గ్రోలి సొక్కుచు, దుష్టవర్తనంబున నింతకాలం బిచ్చటఁ దిరిగి తిరిగి భవత్కరహేతిధారామాహా త్మ్యంబునఁ బూర్వరూపంబు గంటి, నీవలన మంటి నిన్ను నేమని సన్నుతింతు నని యత్తురంగవద నుండు వెండియుఁ బ్రణామంబులు గావించి యవ్విభుండు నయభాషణంబుల నుపలాలింప నానం దించె నప్పుడు. 141

తే. వరకలాసాంద్రుఁ డైన యావసుమతీశ
చంద్రు నలగోనికాయప్రచారమహిమ
కుముదుఁ డతిమంజులామోదసమితి నలరె
పుష్కరచరాళి వైచిత్రిఁ బొందుచుండ. 142

మ. కలితారాతివిరామ, రామరుచిసంగప్రస్ఫురద్భామ, భా
మలవక్త్రాహతసోమ, సోమనుతశుంభద్భూరిసంగ్రామ, గ్రా
మలసద్వేణుసకామ, కామకలిసంపల్లాలసశ్యామ, శ్యా
మలరోచిశ్చయవామ, వామనతనూమాన్యత్రిలోకీక్రమా! 143

క. సత్యాహితాంతరంగా
సత్యాశయపుండరీకచంచద్భృంగా,
సత్యాత్మకగుణసంగా
సత్యాలయయోగియోగసంతతరంగా! 144

ఉత్సాహ వృత్తము
కరివరాంగబహులభంగకరణసంగతగ్రహా
చరరథాంగ! హరిశతాంగజనక! రంగదద్రిజాం
తరసుమంగళాబ్జభృంగ!తతపతంగమందిరా!
పరభుజంగరిపుతురంగ!ప్రబలరంగభూషణా! 145

గద్యము
ఇది శ్రీమదనగోపాలప్రసాదసమాసాదితోభయభాషాకవిత్వకలాకళత్ర
రేచర్లగోత్రపవిత్ర సురభిమల్లక్షమాపాలసత్పుత్ర కవిజనవిధేయ
మాధవరాయప్రణీతం బైన చంద్రికాపరిణయం
బను మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము

  1. ఇచ్చటి యతి ప్రమాదపతితము కావచ్చును