Jump to content

చంద్రగుప్త చక్రవర్తి/మూడవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

మూఁడవ ప్రకరణము

మగధరాజ్యము నాక్రమించుట

మహాపద్మ నందుని వార్ధకము నందు రాచకార్యము లన్నియు నతని ఎనమండుగురు కుమారులే చూచుచుండిరి. వారు గర్వాంధులు. మంత్రి శ్రేష్ఠుండును అనన్యసామాన్యస్వామి భక్తి భూషితుండును అగు నమాత్య రాక్షసుని బోధలు వినక వారు చాణక్యుఁడను బ్రాహ్మణుని అగౌరవించుటయు నతఁడు నందుల నందఱను సంహరించెద ననియు చంద్రగుప్తునకు రాజ్యము గట్టెదననియు నీ రెండు కార్యము లయినంగాని జుట్టు ముడివేయననియుఁ బ్రతిజ్ఞ చేయుటయు నిదివఱకే వర్ణింపఁబడి యున్నది.

అట్లు రెండుపంతములఁ బట్టిన యాబాపడు మౌర్యుని వెంటఁబెట్టుకొని పోయెను. త్రోవలో చాణక్యునకు అత్యంత స్నేహితుఁ డొకడు నివసించుచుండెను. ఇతనిపే రిందుశర్మ. ఈతఁడును చాణక్యుఁడును ఒక్క గురువునికడ విద్యనేర్చినవారు. ఇందుశర్మ శుక్రనీతి యందును జ్యోతిశ్శాస్త్రమందును అఖండమైన నేర్పుగలవాఁడు. చాణక్యుఁ డతని యాశ్రమమున నిలిచి చంద్రగుప్తున కాతిధ్యమిప్పించి, కుశలప్రశ్న రాఁగనే నందతిరస్కారాది విషయములనెల్ల వెల్లడి చేసి యతని సాహాయ్యము వేడెను.

అందుపై నిందుశర్మ తాను క్షపణకవేషమును దాల్చి నందమంత్రులకు తనయెడ స్నేహవిశ్వాసములు పుట్టునట్లుగ నటించుచు గట్టితనముగల నమ్మకమైన శిష్యులను చారులుగ నియమించి తనకుఁ దెలిసిన వర్తమానములెల్లఁ జాణక్యునకుఁ దెల్పుచు దేశకాలపాత్రములకుఁ దగినయట్టి పనులను సల్పుచు జంద్రగుప్తునకు తోడ్పడుటకు నంగీకరించెను.

నందసంహారము

పిదప చాణక్య చంద్రగుప్తులు పర్వతరాజు నగరునకుఁ బోయిరి. పర్వత రాజ్యమునకు తక్షశిల రాజధానియని కొందఱనుచున్నారు. కాని రాజునకు సింహళ దేశాధిపుఁడనియుఁ బేరుండుటంబట్టి సిమ్లాయను పురియం దతఁడుండుట కలదు కాఁబోలు. చాణక్యుఁడు పర్వతరాజు సన్నిధిఁజేరి చంద్రగుప్తుని యొక్కయుఁ దనయొక్కయుఁ బూనికలను దెలియఁ జెప్పె. పర్వతరాజునకును మగధరాజునకును బద్ధవైరముకలదు. కాని యతఁడు వంచకుఁడు, మిత్రునివలె నభినయించువాఁడు. దండయాత్రకుఁ దగుపాటి సమయము నెదురుజూచు చున్నవాఁడు. చాణక్య చంద్రగుప్తుల వ్యాజమునఁ దన రాష్ట్రమును వృద్ధిఁ బొందించు కొనఁదగిన యదను రాఁజూచి స్వబలమును శత్రు బలమును ఆలోచించుచు నిశ్చిత ప్రత్యుత్తరంబీయ కుండెను. కాని చాణక్యుఁడు గడుసరికావున అతని యాలోచనల నూహించుకొని అతని సంశయములు నశించునట్లు దగినట్టి మంత్ర తంత్రములఁ బన్ని యతని మెప్పించి నందరాజ్యమునం దర్ధభాగము నిప్పించునట్లుగా నొప్పందము సేయించి యెట్టకేల కతని సాహాయ్యమును బడసెను. పర్వతరాజు వెంట నతని సహాయులుగ శక, యవన, కిరాత, కాంభోజ, పారసీక, బాహ్లిక రాజ ప్రభృతులును లేచివచ్చిరి. ఇట్లు ప్రాంతసీమలనుండి దాడి వెడలివచ్చిన మ్లేచ్ఛబలములు బహుసంఖ్యాతములును శౌర్య వీర్య వైర సంయుతములు నైనవి.

చాణక్య చంద్రగుప్తుల యాలోచన మూలమున, మ్లేచ్ఛబలములు రెండు భాగములుగ వీడి, పూర్వభాగము గండకీ ప్రాంతముచేరి పాటలిని ముట్టడింపఁబోవ పర్వతరాజుచే నడపఁబడిన మూలబలము గంగా శోణాసంగమము వైపు నడచెను. నందులు తమ సైన్యముల నడపుకొని సరయూసంగమున శత్రువునకై వేచియుండఁగా, ఇందుశర్మ తంత్రములఁ బన్ని నందుల విడఁదీసి చాణక్యుని వలయందుఁ జిక్కించెను. అంత నితఁడు వీరి నందఱను సంహరింపించి మొదటి ప్రతిజ్ఞను నెరవేర్చుకొనెను.

మంత్రి రాక్షసుఁడు

నందమంత్రులలో ప్రముఖుఁడును ప్రచండధీబలదోద్బలములు గలవాఁడు నొకడుండెను. ఇతనిపేరు రాక్షసుఁడు రాజ్య నిర్వహణమునందు మనుష్యులలో నితనికి సమాను డక్కాలమున లేనందున, అట్టి అమానుష ప్రజ్ఞా శౌర్యములకు రాక్షసుఁడని బిరుదుఁ బడసియుండెను. స్వామిభక్తి పరాయణుఁడగు నీతఁడు తన యనుపమేయ సాహసంబుతో పగతురు సైన్యములఁ బలు సోలించి కూలించి నందుల శ్లాఘనను బడసెను గాని నంద నాశ, వృత్తాంతము సేనలయందుఁ బర్వఁగనే పర్వతరాజు బలముల కుత్సాహాధిక్యమును పాటలీబలములకు దైన్యాధిక్యమును రాక్షసునకు శోకవిహ్వలతయు నుప్పతిల్లె.

నందసంహార మయినను మంత్రి రాక్షసుని ప్రతిభా విశేషమునకును స్వామిభక్తికిని వెఱచి చంద్రగుప్తుఁడు పాటలీ నగరమునఁ బ్రవేశించినవాఁడు కాఁడు. మఱియు చాణక్యుఁడు తన రెండవ పంతమగు చంద్రగుప్త పట్టాభిషేకమును జెల్లించుట కుపాయముల నాలోచించుచు పాటలీ బ్రవేశ ప్రయత్నమందు నుద్యుక్తుఁ డయ్యెను. కావున జయరాత్రిని పర్వతు బలములు పురికి దూరమున శిబిరములయందు విడిసియుండెను.

విష కన్యక

ఇంతలో రాక్షసుఁడు నందుల కుచితమైన తర్పణము చాణక్య చంద్రగుప్త పర్వతేశ్వరాదుల సంహారమె యని నిశ్చయించుకొని, అది ముగించుటకు యుద్ధోపాయ మక్కరకు రానందునఁ దగిన మాయోపాయములను తన యావచ్ఛక్తితో బన్నెను. అందు మొదటిది విషకన్యా ప్రయోగము. చిఱుత ప్రాయమునుండి యొక యాఁడుపిల్లను రాక్షసుఁడు సాఁకుచు వచ్చెను. దీనికిఁ గ్రమక్రమముగ నల్పమాత్రలనుండి యెక్కిం చుచు నధికమాత్రల పర్యంతము జీర్ణమగునట్లుగా విసము మెసవించు చుండెను. ఈ చిన్న దిపుడు నవ యువతిగను జగన్మోహనాంగిగను నుండె, జీవసిద్ధియను పేరఁబరంగుచు తనయొద్ద నాశ్రితుఁడుగ, విశ్వాస పాత్రుఁడుగ, దైవజ్ఞసూత్రుడుఁగనున్న క్షపణక వేషధారి నిందుశర్మను బిలిచి యతనిని బలువిధములఁ బొగడి యొక సందేశమునకు నియ్యకొలిపి విషకన్యక నొప్పగించి చంద్రగుప్తునకుఁ దన క్షమార్పణాస్వాగత సూచకమగు కానుకగా నా చిన్న దానిని జేర్చుమని వేడెను. అట్టి సందేశ సమర్పణములతో నా జీవసిద్ధి చాణక్య సన్నిధిఁ జేర నితఁడును రాక్షసాపేక్ష నూహించి చంద్రగుప్తునకు పర స్త్రీ కాంక్ష లేమిని దెలిపి పర్వతేశ్వరుని సంశ్లేషంబునకు కొనిపోవునట్టి యుపాయమును చేయింప, బుద్ధిహీనుఁడును కామా తురుఁడును నగు నాపర్వతేశుడు ఆకన్యకను స్వీకరించి విషస్ప్రష్టుఁడై మృతినొందెను. ఇట్లు చాణక్యుడీ యుక్తివలనఁ జంద్రగుప్తుని ప్రాణములను దక్కించుటయే కాక నందరాజ్యములో భాగమడుగకుండఁ బర్వతేశ్వరునిఁ గూడ సంహరించెను.

భాగురాయణుఁడు

పర్వతరాజు కొమారునిపేరు మలయకేతువు. తండ్రి మరణముచే భీతిఁబడుచున్న మలయకేతువు నొద్దకు సేనాపతి భాగురాయణుడువచ్చి పర్వతేంద్రుఁడు చాణక్యునిచేఁ జంపింపఁ బడెననియు మలయకేతువు తక్షణమే స్వదేశమునకుఁ బారి పోవని యెడల వాఁడు గూఁడ అర్ధరాజ్యమెగఁగొట్టఁ దలఁచిన చాణక్యునిచేఁ జంపింపబడుననియుచెప్పి చంద్రగుప్తచాణక్యుల మీఁద దనకు భక్తిలేనందున మలయకేతువునే యాశ్రయించి మనుదమని నిశ్చయించి వచ్చినట్లు దెలిపి, యతని యెడ గొలు వమరియుండి చంద్రగుప్త పరమున మలయకేతువును వంచించెను. మలయకేతువు ఆమాటలనమ్మెను. భాగురాయణుండును అత్తెఱంగుననే సలుపుచు మలయకేతువును తోడ్కొని పర్వతరాజ్యంబుఁజేరి యతని కమాత్యుఁడుగ నమరియుండెను.

రాక్షసుని మాయోపాయములు

ఇట్లు పర్వతకుఁడు చచ్చిపోవ, మలయకేతువు పాఱిపోవ, చాణక్య చంద్రగుప్తులు పాటలీపురియందు జయఘోషముతోఁ బ్రవేశించిరి. రాక్షసుఁడు నందున కీయకొనన ట్లభినయించుచుఁ బ్రవేశించిన సైన్యములపై తన సైన్యములద్రోలి పెక్కు శత్రువుల సంహరించెను. నందపక్షమే జయించినట్లు జయఘోషములఁ జేయించి చంద్రగుప్త పట్టాభిషేకమునాటంక పఱచెను. సర్వార్థసిద్ధిని భద్రపఱచిన యెడల స్వీకారపుత్రుని ద్వారా నందవంశమును నిలుపవచ్చునని, అతని సురంగమార్గమున నగరునుండి వెడలిపోయి తపోవనంబున నుండుమని వేఁడి పంపెను. తనకు అత్యంత ప్రాణసఖుండగు చందనదాసుని వశమున గర్భిణియగు స్వపత్నిని పుత్రసమేతముగ నిలిపి కాపాడుమనియెను. తనకార్యస్థుని శకటదాసునివశమున రహస్యములగు ధనకోశముల నప్పగించి నందపక్షబలంబునకై యుక్తరీతినెల్ల వ్యయంబు సేయఁబనిచెను. సూత్రధారదారువర్మను పిలిచి రాజభవనపు పూర్వద్వారమును కనకతోరణాదులతో నలంకరించి అందు యంత్రమును నిలిపి దానిని చంద్రగుప్తుఁడు ప్రవేశించునపుడు సడలించి వాని తలపైఁ ద్రోయించి చంప నియమించెను. పట్టపుటేనుఁగు మావటికాని బర్బరకునిపిలిచి సవారిని మంచి యదనుజూచి కనకదండికలో దాఁచిన కత్తిని డుస్సి వెనుక నుండు చంద్రగుప్తుని పొడిచి చంపుమనియెను. రాజ వైద్తుఁడౌ అభయదత్తుని రప్పించి యోగచూర్ణము గలిపిన యోషధముతో చంద్రగుప్త మరణమును సంపాదించుమని ప్రేరేపించెను. రాజ శయనాధికారియగు ప్రమోదకుని బంచి చంద్రగుప్తుఁడు మై మఱచి నిదురించుతఱిని సానకత్తితో సంహరించు మనియెను. రాజగృహముయొక్క అంతర్భిత్తి సురంగమునందు బీభత్సకాది ఘాతుక సమూహమును వేచియుండ నేర్పఱచి శయనమందు చంద్రగుప్తుని బ్రహరింపింప దిట్టముచేసెను. ఈప్రకారము రాక్షసుఁడిన్ని సందిగ్ధసమయములందు చంద్రగుప్త సంహారమునకై యతిచతురతరోపాయములఁ బన్నినను నందొక్కండైన నతనికి సుఫలప్రదంబు గాక పోయెను.

సర్వార్ధసిద్ధి తపోవనం బరిగినది విని చాణక్యుడు నమ్మకమైన ఘాతుకులఁ బనిచి యతని శిరము దునిమించెను. ఇట్లు విషకన్యక మూలమున బర్వతరాజ మరణమును, చాణక్య ప్రయత్నమున సర్వార్ధసిద్ధి మరణమును విని, రాక్షసుఁడు తనకిఁకఁ బాటలియందు నిలుకడ తగదనియెంచి సురంగమార్గమున నగరు వదలి పర్వత రాజ్యమునకు నడచెను. నడచిపోయి మలయకేతువు నాశ్రయించి తన నందభక్తియు మృతనంద తర్పణ ప్రతిజ్ఞయు విప్పి చెప్పెను. పర్వతేశ్వరునకు ఉచిత తర్పణము శత్రుసంహార రూపమున మలయకేతువు ఆచరింప వలసిన యగత్యమును గట్టిగ బోధించెను. రాక్షసునివంటి యమాత్య శ్రేష్ఠుఁడు తోడై యుండఁదనకు తప్పక జయము కలుగునని నిశ్చయించి అతఁడు తన సైన్యముల నెల్ల సన్నద్ధ పఱచి యుద్ధమునకు బయలుదేరెను. అతనికి కశ గాంధార యవనక శచీన పూణకౌలూతాది రాజులు తోడ్పడిరి.

చాణక్య ప్రయత్నములు

చాణక్యుఁ డీవినోదములను చూచుచు నూరకుండెనా? లేదు లేదు. రాక్షసుని ప్రయత్నముల నన్నిటిని జారులచేఁ దెలిసికొనుచు నాతని మాయోపాయముల కన్నిటికిని ప్రతి మాయోపాయములు పన్నుచు చంద్రగుప్తునకు నెట్టి యాపద రాకుండఁ గాపాడుచుండెను. తనకు పరమమిత్రుఁడగు పర్వతరాజు ఘాతమునకై రాక్షసుని పనుపున విషకన్యను దోడ్కొని పోయెనని నేరము మోపి జీవసిద్ధిని గ్రామమునుండి వెడలఁ గొటైను. ఇందుమూలమునఁ దిరిగియు రాక్షసా శ్రయము జీవసిద్ధి కనుకూలించినట్లును, ఇట్టి యనుకూలమున చంద్రగుప్తుని పరమున వేగు చూచుటకును, రాక్షస మలయ కేతువులకు వైరము కల్పించుటకును, జీవసిద్దికి సందుదొరికెను. మఱియు నీ యుపాయము వలన పర్వతరాజు నొద్దకు విషకన్యను బంపినవాఁడు చాణక్యుడన్న యపవాదము తొలఁగి ఆ కన్యను రాక్షసుఁడే బంపెనన్న జనశ్రుతి పుట్టెను.

చాణక్యుఁడు పట్టణమునందంతటను తన చారుల నంపి నందపక్షపాతు లెవ్వరెవ్వ రెచ్చటనున్నది కనుగొనుచుండెను. ఒక చారునివలన నమాత్య రాక్షసుని భార్యాపుత్రాదులు పాటలీపురములోనే యొక సెట్టి ఇంటనున్నారని తెలిసికొనుటయే గాక రాక్షసుని చేతిముద్రికయు సంపాదించెను. ఆ ముద్రికా సాహాయ్యము వలన నాతఁడు కొన్ని కాగితములు సృష్టించి మలయకేతువునకును రాక్షసునకును వైరము కలుగునట్లు చేసి వారి దాడిని వ్యర్ధపుచ్చెను. ఇట్లు రాక్షసుఁడు చేసిన పరశిక్షణోపాయముల కెల్ల చాణక్యుఁడు తగుపాటి ప్రతివిధానముల నేర్పఱచి రెప్పవాల్పక చంద్రగుప్తుని రక్షించుచుండెను. నందాదు లందఱు మృతినొందినను వారియెడ భక్తి విశ్వాసములు గలవాఁడై వారి శత్రువుఁడైన చంద్రగుప్తు నెట్లయిన సంహరించి తన మృతస్వాములకు తృప్తింగలుగఁ జేయవలెనని యమాత్య రాశుసుఁడు పట్టు విడువకుండెను. అమాత్య రాక్షసునివంటి మంత్రి చంద్రగుప్తుని కబ్బినయెడల నతఁడసామాన్య వైభవ శాలియగునని యెంచి రాక్షసున కెన్నియో యాశలు చూపి చాణక్యుఁ డతని వశపఱచుకొన నెంచెనుగాని యా స్వామిభక్త పరాయణుఁడు లోఁబడిన వాఁడు కాఁడు. తుదకు నీ క్రింది యుపాయముచే రాక్షసుని వశపఱచుకొనెను,

రాక్షసుని వశీకరణము

చందన దాసుఁడను సెట్టి పాటలీపురమున కలఁడు. అతఁడు రాక్షసునకు పరమమిత్రుఁడు. రాక్షసుఁ డూరువిడిచి వెళ్ళినప్పుడు తన భార్యా పుత్రాదుల నీతని యింటనే విడిచి వెళ్లెను. ఈ సంగతి తెలిసికొని చాణక్యుఁడు రాక్షస భార్యా పుత్రాదులను తన స్వాధీనము చేయుమని చందనదాసుని నిర్భంధ పెట్టెను కాని యాతడు మిత్రద్రోహముచేసిన వాడు కాఁడు. అందుకాతనికి నురిశిక్ష విధంపఁబడెను. ఈసమాచారం తెలిసి తనకొఱకై తన మిత్రుఁడు చంపఁబడుట న్యాయము కాదని తలఁచి రాక్షసుఁడు తన ప్రతిస్పర్ధియయిన చాణక్యుని స్వాధీనమయి తనను జంపి తనమిత్రుని విడువ వలసినదనికోరెను. కాని "నీవు చంద్రగుప్తుని మంత్రిత్వము నొప్పుకొనిన యెడల నీ మిత్రుని రక్షించెద ” మని చాణక్యుడు చెప్పగా విధిలేక రాకుసుఁడు అందునకు నొప్పుకొనెను. ఈ సమాచారమంతయు క్రీ. పూ. 322వ సంవత్సర ప్రాంతమున జరిగియుండును. అమాత్యరాక్షసుని సాహాయ్యము వలనను చాణక్యుని మంత్రపు సాయమువలనను చంద్రగుప్తుఁ డరిభంజకుఁడై తనరాజ్యమును భరతఖండమం దంతటను వ్యాపింపఁ జేయుటయేగాక హిమాలయ పర్వతమున కావలనుండు దేశమును గూడ సాధించెను,

చరిత్రాంశములు

రాక్షసుని వశపఱుచుకొనినప్పుడే మలయ కేతువును గూడ వశపఱచుకొని యాతనిచే చంద్రగుప్తునకు సామంత రాజుగా నుండున ట్లొప్పించుకొని చాణక్యుఁ డాతని రాజ్యము నకు నాతని బంసివేసెను. ఈ మలయకేతు వెవ్వఁడై యుండ నోపు ? ఇతనిచే నడుపఁ బడిన మ్లేచ్ఛయవన కాంభోజూది సైన్యములనఁగ నెవ్వి? ఈ ప్రశ్నలకుఁ బండితులనేకులు పెక్కు రీతుల ప్రత్యుత్తర మిచ్చుచున్నవారు. మలయకేతువు తండ్రి పర్వతరాజని చెప్పఁబడియున్నది. అందుచే నాతఁడు హిమాలయ గిరికందర ప్రాంతమున వసించువాఁడని తోఁచుచున్నది. చంద్రగుప్తుని కిట్లు సాయము చేసిన సైన్యములు గ్రీకు సైన్యములని కొందఱు యూరోపియనుల యభిప్రాయము. కాని గ్రీకు చరిత్రకారు లందఱును చంద్రగుప్తునకు గ్రీకు సైన్యములు సాయముచేసినట్టు వ్రాసియుండనందున పై యభిప్రాయము సరియైనది కాదని కీర్తిశేషులైన కాశీనాథ త్ర్యంబక తెలంగుగారి యభిప్రాయమై యున్నది. పిలిప్పాస్ అను గ్రీకుక్షాత్రపుని హిందువులు చంపిరని కర్ టియస్ మొదలైన గ్రంధకారులు వ్రాసినందున ఈక్షాత్రపుఁడే పర్వతరాజ నామముతో హిందూ గ్రంధములందు వర్ణింపఁబడి యుండ నోఫునని తలంప వచ్చును. తరువాత చంద్రగుప్తునిచే నోడింపఁబడి యాతనితో సంధి చేసి కొనిన శల్యూకస్ అనువాఁడే మలయకేతువైనఁ గావచ్చును. కాని ఇది యిట్లని నిశ్చయముగాఁ జెప్పవీలులేదు. హిమాలయపర్వత సమప్రదేశములందును దరులందును పార్వతీయ జాతులవారనేకు లిప్పటికిని వాసము చేయుచున్నారు. అట్టివారు గొందఱు చంద్రగుప్తునకు సహాయులు వచ్చి యుందురు. అప్పుడా ప్రాంతముల గ్రీకువారును కొందఱుండినందున వారును నీ సైన్యములో చేరినను చేరియుండవచ్చును. .