చంద్రగుప్త చక్రవర్తి/నాలుగవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

నాలుగవ ప్రకరణము

గ్రీకువారితో యుద్ధము

చంద్రగుప్తుఁ డసంఖ్యాకములగు సైన్యములఁ గూర్చుకొని యపరిమిత పరాక్రమవంతుఁడై యదివఱకు పంజాబ్ దేశము నాక్రమించియున్న గ్రీకుసైన్యములఁ బూర్తిగ నోడించి వెడలఁగొట్టెను, కాని ఈ కథా భాగమంతయు సవిస్తరముగ వర్ణించుటకుఁ బూర్వము గ్రీకువా రెవరైనది, వీరీ దేశమున కెట్లువచ్చినది. సంగ్రహముగఁ జెప్ప వలసియున్నది.

సింధునది కావలివైపునుండు సులేమాను హాలా పర్వతములు సరిహద్దుగ బ్రారంభమయి వరుసగ పశ్చిమమున ఆప్గనిస్థానము, బెలూచిస్థానము, పరిషియా ( పారసీకము ) ఆసియాలోని తుర్కి, ఐరోపాలోని తుర్కియను దేశనామములచేఁ బిలువంబడు భూభాగమంతయు మన కథాకాలమునఁ బారసీకముగ నుండెడిది. అట్టి పారసీకమునకుఁ బశ్చిమసరిహద్దు మకడోనియా రాజ్యము. ఈ మకడోనియాకు దక్షిణమున గల దేశముగ్రీసు. అక్కడిజనులే గ్రీకులు. ఇట్లు గ్రీకు మకడోనియా దేశములకును హిందూ దేశమునకును మధ్యనుండినది పూర్వ కాలమున నొక్క ఫారసీకమె. ఇందు దక్షిణ సముద్రమునుండి గెడ్రోష్యా, అరకోష్యా, పరోపమిశదము, బాక్ట్రియానా, సాగ్డియానా క్రమముగ నుత్తరమున వ్యాపించి యుండెను. ఇందు గెడ్రోష్యా, అరకోష్యా, పరోపమిశదములు ఇక్కాలమున బెలూచిస్థానము, ఆప్గనిస్థానము లనఁబడుచున్నవి. బాక్ట్రియానా సాగ్డియానాలు ఇప్పట్ల బొకారా, సమరకండములనియుఁ భారతమున బాహ్లిక మనియు, ప్రకటములై యున్నవి. పరోపమిశద బాక్ట్రియానాలకు నడుమ హిందూకుశ పర్వతములును, బాక్ట్రియానా సాగ్డియానాలకు నడుమ ఉక్ష (Oxus) నదియును నున్నవి. సాగ్డియానా దేశమునకు దక్షిణమున ఉక్షనదియు ఉత్తరమున జాక్సార్టిసు నదియును పాఱుచున్నవి. అరకోష్యాకు పడమట డ్రాంగియానా, పరోపమిశదమునకు పడమట ఆర్యా, బాక్ట్రియాకు పడమట మార్గియానా దేశములు కలవు. గెడ్రోష్యాకు పడమట కార్మానియా, పెర్శిసు దేశములును వీనికుత్తరమున ఎడారియు దీనికుత్తరమున వరుసగ పార్థియ, హుర్కేనియాదేశములు వ్యాపించి కశ్యప (Caspian) సముద్రమును డాయుచున్నవి. పార్థియ, హుర్కేనియలకు పడమటను, కశ్యప సముద్రమునకు దక్షిణ పశ్చిమముల మధ్య దేశము ఉన్నది. మధ్యదేశమునకు దక్షిణమున సూసియానా సీమయున్నది. ఈ దేశములన్నియు గలిసి ఇప్పట్ల పెరిషియా (పారసీకము) అని పఱగుచున్నవి. ఇట్టి భూమికి పడమట టైగ్రిసునది ప్రవహించు చున్నది. టైగ్రిసునది మొదలు సింధునది వఱకును, పారశీక అరేబియాసముద్రములు మొదలు కాకసపర్యతము కాశ్యపసముద్రము జాక్సార్టిసునది వఱకును, వ్యాపించియుండు భూభాగమునకు అతి ప్రాచీన కాలమునందు, ఐరాను అనగ ఆర్యావర్తమని పేరు. ఇందున్నవారికి ఆర్యులని పేరు. ఈ ఆర్యులే క్రమముగా ప్రజాధనబలముల, ప్రబలించి నానా దిగ్దేశములను వ్యాపించి, నేఁటికిని పృథివీతలవాసులలో నత్యంత బుద్ది భుజబలాఢ్యులై విలసిల్లుచున్నారు. అగుంగాక . మనము ప్రస్తుతమనుసరింతము.

గ్రీకు దేశమునకు హిందూదేశమందలి సింధూనదమునకును అంతరము రమారమి నాలుగు వేల మైళ్లుండును. గ్రీసు దేశస్థులను గ్రీకువారని పిలిచెదరు. వీరిని మన పూర్వులు మేచ్ఛులనియు యవనులనియు వాడియున్నారు. ఈ పదములకు చదువరులు మహమ్మదీయులని యర్థము చేయగూడదు. ఏలయన మేమిప్పుడు వ్రాయుచున్నకథ మహమ్మదు పుట్టుటకు పూర్వము జరిగినది. ఈ వృత్తాంతము జరిగిన తరువాత 900 సంవత్సరములకు మహమ్మదు పుట్టెను. గ్రీకువారు మహా బలాఢ్యులు. మగధదేశముపై నందులు రాజ్యము చేయుచున్నప్పుడు గ్రీసుదేశము దన సామ్రాజ్యములఁ జేర్చుకొని యుండిన మకడోనియాలో ఆలెగ్జాండరను నొక మహావీరుఁడు క్రీ. పూ. 356 వ సంవత్సరమందు జన్మించెను.

అలెగ్జాండరు దండయాత్ర

ఇతఁడు పెక్కు దేశములు జయించి పారసీకదేశమును స్వాధీనపఱచుకొనిన తరువాత హిందూదేశము మీఁదికి దండెత్తి వచ్చెను. ఈతఁడు క్రీ. పూ. 327 వ . సంవత్సరము మేనెల మొదలుకొని క్రీ. పూ. 324 వ సంవత్సరము మేనెల వరకును అనఁగా మూడు సంవత్సరముల కాలము పంజాబ్ సింధు దేశముల యందుండి చిన్న చిన్న రాజ్యము లనేకములు జయించెను, ఇతనికిఁ దమంతట వశులయిన గొప్ప రాజులలో మొదటివాఁడు తక్షశిలా నగరాధీశ్వరుఁడు. తక్షశిలారాజ్యము సింధూ జీలమ్‌నదుల నడుమనుండి పూర్వము మిక్కిలి విఖ్యాతి వడసి యుండెను. బౌద్ద కాలమునందు తక్షశిలా (రావల్ పిండి) నగరము సకల విద్యలకుఁ బుట్టినిల్లై యొప్పెను. అలెగ్జాండర్ సింధునదికిఁ దూర్పున విడిసియుండగనే తక్షశిలారాజగు ఆంభీ అనువాఁడు ఏడువందల గుజ్జములును, ముప్పది యేనుఁగులును, మూఁడువేల బలిసిన ఎద్దులును, పదివేల బలిసిన గొఱ్ఱెలును, కానుకఁగా దీసికొనిపోయి అలెగ్జాండరు శరణుఁజొచ్చెను. ఇట్లు పంజూబు దేశమందలి యొక గొప్పరాజే అలెగ్జాండరుకు వశుఁడైనందున నతని సాహాయ్యమువలన నలెగ్జాండరు పెక్కు స్వదేశీయ రాజుల నోడింపఁ గలిగెను.

అలెగ్జాండరు సింధు నదముమీఁద ఓహింద్ అను స్థలము నొద్ద నావలతో వంతెనకట్టి దాఁటి తక్షశిలా రాజ్యమునకు వచ్చి అచ్చటి రాజువలన మిక్కిలి గౌరవమందెను. అట నుండి యాతఁడు తక్షశిలా సైన్యములనుగూడ వెంటఁబెట్టుకొని పోరస్ రాజ్యముమీఁదికి దండెత్తివెళ్లెను. జీలమ్ చీనాబ్ నదుల నడుమ పోరసులను పౌరుష పథాను లప్పుడు రాజ్యము చేయుచుండిరి. గ్రీకు చరిత్రకారులు ఈ రాజుల పేరు పోరస్ అని వ్రాసిరి. ఈ పదము పౌరవపదద్యోతక మని కొందఱును పురుషోత్తమ పదద్యోతక మని మఱికొందఱును వ్రాసి యున్నారు. అప్పటి పౌరవరాజు హూణుఁడగు నలెగ్జాండరును జీలము నదియొద్ద తన చతురంగసేనతో నెదురించెను. ప్రస్తుతము చిలియాన్ వాలా యనఁబడు మైదానమునకుఁ బశ్చిమమునఁ బదునాల్గుమైళ్ళ దూరమున నదియొడ్డున ఘోరమైన పోరుగలిగె. ఇంటిగుట్టు లంకకుఁ జేటన్నట్టు లీ యుద్ధములోఁ దక్షశిలా రాజులు తమ స్వదేశస్థుఁడగు పురుషోత్తమునికి సాహాయ్యము చేయుటకు మాఱుగ దేశఘ్నులై తమ సైన్యముతో నలెగ్జాండరు పక్షమునఁ బోరిరి. అందువలనను, బురుషోత్తముని రధంబులు నదియొడ్డు బురదలో దిగఁబడినందునను అతని యేనుంగులు తిరుగఁబడి యతని సైన్యమునే నాశనము చేసినందునను అలెగ్జాండరు సైన్యములు పురుపోత్తముని సైన్యములకంటె నెక్కుడుగా నున్నందునను, అతనికిఁ బరాభవము గలిగి యలెగ్జాండరునకే జయము గలిగెను.

అలెగ్జాండరు పంజాబు దేశములోను, సింధు దేశములోను, రెండు సంవత్సరముల కాలముండెను. అంతలో నుత్తర పంజాబులోని తక్షశిల ( డేరిషహాన్ ), నికాయా (మాంగ్), దక్షిణ పంజాబులోని అలెగ్జాండ్రియా, ( వుచ్), సింధు దేశములోని పాటల ( హైదరాబాద్ ), అను స్థలముల రాజులను దనకు నంకితులఁ జేసికొనియెను. తన సైన్యములోఁ గొంతభాగ మచ్చటచ్చట నుంచెను.

ఆతనికి హిందూ దేశమంతయు జయింపవలెనను కోర్కె యుండెను గాని యతని సైన్యములు బియాస్‌నది దాఁటుటకు సమ్మతింపక తిరుగఁబడినందున నాతఁడు క్రీ. పూ. 325 లో మరలి పోవలసినవాఁ డాయెను. తాను పంజాబు దేశములో సంపాదించిన రాజ్యమును కాపాడుటకు నధికారుల నియమించి వెళ్ళెను.

చంద్రగుప్తుఁ డలెగ్జాండరును జూచుట

ఇట్లు మన కథానాయకుడగు చంద్రగుప్తుఁడు చిన్న వయస్సులో నుండఁగా పంజూబు దేశమంతయు గ్రీకుదేశస్థులచే నాక్రమింపఁబడియె. నందవైరము కారణముగ చంద్రగుప్తుడు పాటలీ పురమునుండి పలాయితుఁడై పంజాబు ప్రాంతమున దిరుగుచు నలెగ్జాండరుని దండుఁజొచ్చి యాతని దర్శించునట్లును నందులు సర్వజన విరోధులుగావున వారినోడఁగొట్టి మగధము నాక్రమించుట మహాసులభ కార్యమని గ్రీకు యోధశ్రేష్ఠునకు నేష్య భారత చక్రవర్తి మంత్రోపదేశ మొసఁగినట్లును, యేదో యొక కారణమువలన అలెగ్జాండరునకు. చంద్రగుప్తునిపై నాగ్రహముప్పతిల్లి యతనిని బట్ట నాజ్ఞయిడ నతఁడు పర్వత ప్రాంతము లోనికిఁ బారిపోయినట్లును ఫ్లూటార్‌కు వ్రాసి యున్నాఁడు. ఈ మాటయే నిజమైన యెడల చంద్రగుప్తుఁ డిరువదియైదేండ్ల వయస్సును మించనివాఁడుగా నున్నప్పుడు అలెగ్జాండరు. మన దేశము మీఁదికి దండెత్తి వచ్చెనని మన మూహింపవచ్చును. గాని అలెగ్జాండరుతో నీతనికిఁ భోరేల కలిగెనో మన మూహింపలేకున్నాము,

మూడులక్షల సైన్యపు వ్యూహములను మగధాధీశుని యేకచ్ఛత్రాధిపత్యమును, మహాపద్ముని ధనజనాదివై భవము లను, చూచిన చంద్రగుప్తుని కనులకు అలెగ్జాండరుని 50,000 సైన్యమును పేదఱికమును చులకనయై తోఁచెనో ? అలెగ్జాండరు చంద్రగుప్తుల పరస్పర మర్యాదోపచారములలో హెచ్చు తక్కువలు కానిపించెనో ? గాంగేయసీమకు రాక స్వదేశ ప్రయాణోన్ముఖుఁడైన గ్రీకు వీరునిజూచి మౌర్యుఁడు పరిహసించెనో ? సాయమిచ్చి గాంగేయ భూమిని బొసఁగ గూర్చిన యెడ, తనకు భవ్యతం జూపమని తెల్పిన మౌర్యునిపై నలెగ్జాండరు కిని సెనో ? సామాన్య సంభాషణయందే చంద్రగుప్తుని స్వసామ్యతాగౌరవ భావంబుల కలెగ్జాండ రోర్వక పోయెనో ? "చింత్యము.

చంద్రగుప్తుఁడు స్వతంత్రుఁడగుట

పైని వర్ణించినట్లు గ్రీసు దేశీయుఁడగు నలెగ్జాండరు పంజాబు దేశంబునఁ గొంత రాజ్యము సంపాదించి, వాని రక్షణార్థమై కొందఱ సైనికుల నటనట నునిచి వెడలినతరువాత వారిని వెడలిగొట్టి యా రాజ్యమును దా నాక్రమించు కొన వలెనని చంద్రగుప్తుఁడు ప్రయత్నములు చేయఁ దొడగెను.

మహావీరుడగు నీతఁడు సమయమునుకనిపట్టి వాయువ్య ప్రాంతమందలి యుద్ధప్రియులగు భటులను నరాట్టులను గూర్చుకొని శేషించిన గ్రీకుదళముల విదళీకరించి సైన్యబలమును నానాఁటికి వృద్ధిజేసికొని ప్రాంతసీమల కెల్ల నధికారియాయెను. (క్రీ.పూ. 322) అరాట్టులు, *[1] అనఁగ, పంజాబు నివాసులును దొంగలును దోపిడికాండ్రును అని భారతమునందు దూషింపఁ బడియున్నారు. కతేయులు నటులనే దూషింపఁబడియున్నారు. కాని ఈ అరాట్టుల సీమలు ప్రజాసభ పాలితములై, రాజుల కధికారమియ్యక స్వతంత్రజనపూరితముగ నున్నట్లు తోఁచెడిని.

మహమ్మదీయ చరిత్రమునందు అక్బరు చెల్లాచెదరుగ నున్న దేశభాగములనెల్ల తన యాజ్ఞయం దిమిడ్చికొని చక్రవర్తిత్వఁ బడసినట్లు అతనికి 1900 సంవత్సరములకు మునుపు చంద్రగుప్తుఁడు చెల్లాచెదరుగనున్న సామంత ప్రభుత్వముల నెల్ల ఏకాజ్ఞాచక్రమునకు వశపజచుకొని మగధాధీశుఁడాయె ననవచ్చును.

చంద్రగుప్తుఁ డిట్లు గ్రీకు వారిని వెడలఁగొట్టి, పంజూబు దేశమంతయు నాక్రమించుకొని, నందుల నోడించి, మగధరాజ్యము సంపాదించి, హిందూదేశమున కంతకును దానుయేక చ్ఛత్రాధిపతిగ నుండఁదలఁచి సైన్యముల మిక్కిలి యభివృద్ధి చేసెను. అతనియొద్ద నాఱు లక్షల కాల్బలమును, ముప్పదివేల స్వారులును, తొమ్మిదివేల గజంబులును నుండెను, ఈప్రచండ సైన్యంబుతో నాతఁడుత్తర హిందూ దేశ మందలి యన్ని రాజ్యములను గెలిచి, నర్మదా హిమాలయములు దక్షిణోత్తరపు టెల్లలుగను బూర్వపశ్చిమ సముద్రంబు లాయా దిక్కుల యెల్లలుగను గల యార్యావర్తంబున కంతటికిని ప్రథమ చక్రవర్తి యయ్యెను.

శల్యూకస్‌ను జయించుట

అట్లు పంజాబునుండి వెడలఁగొట్టఁబడిన గ్రీకువారికి శల్యూకస్‌నికేటర్ అను రాజుగలఁడు. ఇతఁడు మొదట నలెగ్జాండరు నొద్దనున్న గొప్ప సేనానులలో నొకఁడు . అలెగ్జాండరు కాలధర్మము నొందిన తరువాత సెల్యూకన్ కొన్ని దినముల వఱకు నితర సేనానులతోఁ బోరాడి ఆసియా ఖండములోని పశ్చిమ భాగమునకును మధ్య భాగమునకును రాజై బేబిలోన్ పట్టణమందు క్రీ. పూ. 312 వ సంవత్సరమున పట్టాభిషిక్తుఁ డయ్యెను. అతని రాజ్యము యొక్క తూర్పుసీమ హిందూ దేశము నంటియున్నందున గ్రీకుపతాకమును మఱల పంజాబు దేశములో నిల్పనెంచి దానిపై దాడి వెడలి వచ్చెను. (కీ. పూ. 305 ) అప్పటికి చంద్రగుప్తుఁడు సింహాసనమెక్కి పదునైదు సంవత్సరములయి యుండెను. అతఁడు పంజాబు సింధు దేశములను, గుజరాతు దేశమును జయించి వశపరిచి కొని యుండెను. సెల్యూకసు సింధునది దాఁటుట నడ్డగింపక చాణక్య చంద్రగుప్తులు అత్యంత చాతుర్యముతో అతని సైన్యమునెల్ల తమ సైన్యములతో చుట్టి ముట్టడించుకొని బంధించి వేసిరి.

ఇట్టి యవసరమున సెల్యూకసు యుద్ధముఁజేసి సోలిపోయి శరణాగతుఁ డాయెనని కొందఱును, యుద్ధముసేయుటకు వెఱచి తన దుర్బలము నరసి వీర్యముకంటే వివేకము మేలని నిశ్చయించి చంద్రగుప్తునకు శరణాగతుఁడాయెనని మఱికొంద ఱును వ్రాసియున్నారు. కాని సెల్యూకసు శరణువేడుటయు చంద్రగుప్తుఁ డభయమిచ్చుటయు జరుగుటకు బూర్వమే తమ చేతఁజిక్కిన మకడోనియా సైన్యములపై మాగధసైన్యములు కసిదీర్చుకొనె ననుటకు సందియము లేదు. (క్రీ. పూ. 303)

చంద్రగుప్తుడు శల్యూకసుతో నొడంబడిక చేసికొని, గెడ్రోషియా అరకోషియా అనబడు అప్గానిస్థాను బెలూచిస్థాను దేశముల నూడఁబీకికొనియెను. ఇప్పటి యాంగ్లేయులు పశ్చిమోత్తర సామంత సీమలందు పర్వత రక్షితమై, పరశత్రువుల కభేద్యమై యుండు సరిహద్దులు తమ చేతఁ జిక్కుపడవలెనని యత్నించిరి. మోగలరాజులును యత్నించిరి. కాని వీరి కేరికిని సాధ్యము కాలేదు. ఇట్టి సరిహద్దులు 2200 సంవత్సరములకు మునుపె మనదేశపు చారిత్రక చక్రవర్తియగు చంద్రగుప్తుని యఱచేత నిమిడియుండెనన్న మన కెంతటి యశఃకరము నానందకరముగ నున్నది!

చంద్రగుప్తుఁడు సెల్యూకసును అంతటితో వదలిపెట్ట లేదు. అతని కుమారిత సుందరియు, యువతియు, నిపుణయునై యున్నందునను, తనకు మహిషినష్టమై యున్నందునను, యవను లటుమీఁదట శత్రుత్వము పాటింపకుండునట్లు దగుపాటి వస్తువును విశ్వాస స్థానమం దుంపవలసి యున్నందునను, యాదవ పాండవులయు విరాట పాండవులయు వియ్యంబులు వోలె నా కాలమునందు వియ్యంబు నెయ్యంబునకు ఆధారముగ భావింపబడినందునను, చాణక్య మంత్రాలోచన నంగీకరించి చంద్రగుప్తు డామెను తనకు భార్యగ నామె తండ్రి సమర్పించు నట్లు చేసెను. అటుపిమ్మట నా గ్రీకునాయకుఁడు తనకు 500 ఏనుఁగులు కావలయునని వేడ, ఒక గజగమనకు మూల్యముగ 500 గజముల నియ్యవచ్చునను వాడుక నమసరించి చంద్రగుప్తుడు మామకు బహుమానమంపెను. నాఁడు చంద్రగుప్తుని వలనఁ బడిన బాధలు మనస్సున నాటుకొనినందున గ్రీకులు ఈ దేశముపై దాడి వెడలుట కలలోనైనను దలంపరయిరి. కాని గ్రీకుదొర కుమారిత గాన, చంద్రగుప్తుని మహిషికిఁ బరివారములుగ ననేక గ్రీకులు పాటలియందు నివసించుచుండిరి. సెల్యూకసు తన రాష్ట్రపు పశ్చిమ ప్రాంతమున అంతిగోనసు అను పగతుఁడొకఁడు లేచి యభిద్రవించుట విని క్రీ.పూ.303వ సంవత్సరమున బయలుదేరి వెడలెను. కాని తనకు రాయబారిగ మెగాస్తనీసు అనువానిని నియమించి పాటలీపురమున నుండుమని నిలిపె. ఈ మెగాస్తనీసు పరివారములును, ఆ గ్రీకుసాని పరివారములును, మౌర్యసేనయం దమరియున్న శిల్పులును, చేతిపనివాండ్రును గలిసి యొక్క గ్రీకుపేటయే పాటలీపురమందున్న ట్లూహింపదగియున్నదని రిసుడేవిడ్సుని అభిప్రాయం. ఇందువలన మనదేశపు జనులకు శిల్పాదికృత్యములు తెలియవని భావముకాదు. *[2] మనవారినేర్పును గ్రీకులును గ్రీకుల నేర్పును మనజనులును నేర్చియుందు రందము. అలెగ్జాండరునకు పూర్వము భరతవర్షమును గుఱించి పశ్చిమ ఖండవాసులకు నిర్ణీతజ్ఞానము లేక యక్షరక్షాది లోకములవలె పుక్కిటి పురాణములకు విషయమై యుండెను. లోక మంతటిని జయింప నాసక్తుఁడై వచ్చిన అలెగ్జాండరు అక్కాలమందు గ్రీకులకు ఋషిస్థానముననున్న అరిస్టాటిలుని శిక్షయం దుంపఁబడి విద్యావినీతుఁడై పెరిగినందున, దానాక్రమింపఁగల సమస్త దేశముల చరిత్రభూగోళాది వివరములఁ జక్కగవ్రాయ గలయట్టి గ్రీకువిద్వాంసులను తోడ్కొని వచ్చెను. అట్టి పలంపరా ప్రాప్తబుద్దితో మెగాస్తనీసు తానున్నంత కాలము విన్నవియు కన్నవియు నౌ విషయముల దినచర్యగ వ్రాసికొని పోయెను.

అ దినచర్యలో పాటలీపుత్ర నిర్మాణాది వివరములును, చంద్రగుప్త రాజ్యభారాది వివరములును, ఆ కాలమున నతడు అవలోకింపగల్గిన మతవర్ణాశ్రమాచార వ్యవహారాది వివరములును, దక్షిణ హిందూస్థానము మున్నగు తాను గనని ప్రదేశములను గుఱించి దా వినినయట్టి వివరములును, వంచన లేక లిఖించియున్నాడు.

ఆతఁడు పాటలీయందున్న రెండు వత్సరముల లోపలనే ఎంతయో వ్రాసి స్వదేశమునకు పుస్తక రూపముగ జ్ఞానమును కొనిపోయెను, అందలివర్తమానములను గ్రీసు ఇటలీ దేశస్ధులగు చరిత్రకారులు తమ తమ చరిత్రములలో నెక్కించుకొని. సరితప్పులను తమ చిత్తమువచ్చినట్లు విమర్శనములలో కలిపి వ్రాసియుంచిరి. ఇట్టివగు ఈ చరిత్రాంశములే మన హిందూదేశపు చరిత్ర వృత్తాంతముల కాలనిర్ణయములను గూర్చుటకు ఆధారములాయెను. భారతీయుల నాగరికతయు, చరిత్రయు శ్రుతి స్మృతి పురాణేతిహాసముల మూలమున దొఱకగల యట్టివి అత్యంత ప్రాచీనములును 5000, 10,000, 20,000 మొదలు గాగల సంవత్సరముల భూతకాల వ్యాప్తములయినను, కాలనిర్ణయ పట్టికా రూపమున పేర్చి వ్రాయనందునను, అద్భుత విచిత్రములను అతిశయోక్తులుగ కలిపిరచించినందునను చరిత్ర దృష్టికి నవి అవిశ్వసనీయములయి యున్నవి. కావున మనదేశపు గత 2500 సంవత్సరముల వృత్తాంతముల పట్టికకు ఈ మెగాస్తనీసుని దినచర్య సమస్త చరిత్ర కారకులకును అనివార్యమైన , యాధారముగ నున్నది. ఈతఁడు సాండ్రొకోట్టను, " అని పేర్కొని యుండు నామము మొదట అనర్ధ నామముగనే యుండెనుగాని, చంద్రగుప్త పదము ఆ గ్రీకుని నోట నట్లు మాఱినదని సరు విల్లియమ్ జోన్సుఅను నొక పాశ్చాత్య విద్వాంసుఁడు వాఖ్యానమియ్యగనే, అందుండి చరిత్ర జ్ఞానాగ్ని రేగి ఇదమిత్థమ్మని తెలియని హిందూ చరిత్రపు వార్తాంగారము లెల్ల రగులుకొనెను. -

అటువంటి అగ్ని దాయకుఁ డీ మెగాస్తనీసు. అటువంటి అగ్ని యీ చంద్రగుప్త ( సాండ్రొకోటను) నామము. కావున నవనందులను చితియందు దగ్ధమగునట్లు చేసిన యా చంద్రగుప్తుని పేరు, ఈ భరతక్షితి దిగంతములకు వ్యాపించిన ప్రథమ చక్రవర్తి యశో౽గ్నిగను, భారతచరిత్రాంధకారమును కొంత మట్టునకైన తొలఁగించుచు, పురాణాతిశయోక్తి గహనంబును భస్మీకరించునట్టి దావానలంబుగను ప్రజ్వరిల్లుచున్నది.

చంద్రగుప్తుడు పూర్వమే కోసలరాజ్యమును కబళీకరించి యుండె. అతఁడు స్వయముగ పంజాబును సింధు దేశమును జయించెను. పంజాబులో సైన్యశిథిలత రాఁగనే చెదరువడియున్న సైన్యమంతటిని నాతండు తన మూలబలముగా చేసికొనెను. అనంతరము గుజరాతును జయించి అచ్చట నొక రాజ ప్రతినిధిని నియమించినట్లు రుద్రదాముని శిలాశాసనము నేఁటికిని తెల్పుచున్నది. దీనికి పూర్వమే ఇతఁడు అవంతి అనగా ఉజ్జయినిదేశమును ఆక్రమించి వశపఱచుకొని యుండెను.

ఇమ్మెయిని రాజ్యా రూడుఁడై న చంద్రగుప్తునకు విశ్రాంతికి సమయము దొరికినదిగాదు. వృషలజనన కలంకమునకు విషయభూతుండు. కావునను, ధననందునిచే పరపీడింపఁబడిన ప్రజలపై యధిరూఢుండు కావునను, నందకులాభిమానుల కూటోపజాపములకు లక్ష్యుండు కావునను, ఉన్నత జాతి సంభూత సామంత రాజుల అవజ్ఞా విరోధంబులకును, అలెగ్జాండరు పాశ్చాత్య సేనానాయకుల యభియోగంబునకును ఆస్పదుండు కావునను, స్వయంభారత సర్వస్వ విజయకాంక్షి గావునను, జయింపఁబడిన రాష్ట్రముల సమాధానపఱచి పరిపాలనా సంవిధానములయందు సంస్కారలక్షణ దృష్టినైజము గలవాఁడు గావునను ఒక్కయొడ కూర్చొనుటకుగాని నిలచుటకుగాని తృటికాలము పరుండుటకుగాని వ్యవధిలేక , సదా దుష్టనిగ్రహ శిష్టపరిపాలనమునందే జీవితకాలమంతయు గడప వలసినవాఁ డయ్యెను. చారిత్రక విషయముల కవిశ్వసనీయములగు పురాణేతిహాసాది విషయముల నటుండనిచ్చిన భరతఖండ చక్రవర్తులయం దీతఁడే మొదటివాఁడుగఁ గన్పించుచున్నాడు. సేనలు నడుపుట, శత్రువుల నాక్రమించుట, నూతన దేశముల నార్జించుట, న్యాయముల దీర్చుట, నగర పంచాయతులు గ్రామపంచాయతులు నియమించుట, శిల్పముల వృద్ధిపరచుట, విదేశీయుల విచారించుట, జనన మరణముల గణించుట, వ్యాపారముల విమర్శించుట, చేతిపనుల బెంచుట, బాటలు వేయుట, వంతెనలు కట్టుట, ఓడలు నిర్మించుట, రాజపురుషుల నియోగించుట, చారదృష్టి చూచుట, చౌర్యఘాతకాదుల ఖండించుట, పన్నులరాఁబట్టుట, కాలువలు చెరువులు బావులు త్రవ్వించుట, నీళ్లువిడుచుట, నేలకొలుచుట, పంట లెక్కించుట, ద్యూత మద్యాది దుఃఖముల విమర్శించుట, మున్నగు సర్వ రాష్ట్రనిర్వాహ విషయములందును వేగన్నుల చూపుతో జాగ రూకుఁడై , ఆత్మరక్షణార్థము ఆహార, విహార, శయ్యా, ఆసన, భాజన, ఔషధ, బంధు, కళత్ర, మిత్ర, పుత్రాదులనెల్ల అనిమీలిత నయనుఁడై పరిశోధించుచు ఇరువది నాలుగు వత్సరములు రాజ్యమేలెను.

చంద్రగుప్త రాజ్యవిస్తారము

క్రీ. పూ. 322 మొదలుకొని 303 వఱకు అనగా చంద్రగుప్తుఁడు. మొదట గ్రీకువారిని పంజూబు దేశమునుండి వెడలఁగొట్టినది మొదలు శల్యూకస్ నికేతర్ నోడించి అతనితో సంధిచేసికొను కాలమువఱకును చంద్రగుప్తుడు ఉత్తరమున ఆఫ్‌గనిస్థానము బెలూచిస్థానముల వఱకును, పూర్వమునను పశ్చిమమునను సముద్రము వఱకును గల రాజ్యమును జయించి యేకచ్ఛత్రాధిపత్యముతో నేలి హిందూదేశముయొక్క మొదటి చక్రవర్తియనిన బిరుదును సంపాదించుకొనెను,

మైసూరు గెజటీయరు లేఖకుఁడగు రైసుగారినుడువున, శికర్పూరు తాలూకా బందనిక్కె గ్రామపు శిలాశాసనము (12-వ శతాబ్దములో ) కుంతలదేశమును మౌర్యుల మాగాణముగా వర్ణించు చున్నది. ఇయ్యది భీమావేదవతులకు నడుమ సహ్యాద్రులవఱకును శివమొగ్గ, చిత్రదుర్గము బళ్లారి, ధార్వాడ బీజాపురము, బొంబాయి, హైదరాబాదు సీమల భాగములను వ్యాపించిన దేశమనియు తెలిసెడిని. ఈదక్షిణదేశమును జయించినవాఁడు చంద్రగుప్తుఁడో లేక ఇతని కొడుకగు బిందుసారుఁడో తెలియకున్నది. మైసూరు సీమలోనే శ్రవణ బెళగొళమునందలి శిలాశాసనము చొప్పున చంద్రగుప్తుఁడు అచ్చట జైనమతావలంబకుఁడై మరణమొందినట్లుగాన బడియెడి. కాని ఇది యింకను చింత్యము.

పదునాఱు సంవత్సరములలో నింత విశాల రాజ్యమును నిర్మించి, దానిని మిక్కిలి జాగ్రత్తతోఁ గాపాడిన ఈ రాజును భూమండలములో శూరాగ్రేసరులని ఘనతవహించిన ఫిలిప్పు అలెగ్జాండరు, హ్యానిబలు, నెపోలియను మొదలయిన మహాసేనానాయకులలో నొక్కనిఁగా నెంచవలెనని యుకానొక పాశ్చాత్యుఁడు వ్రాసియున్నాఁడు.

  1. *అరాట్టులు, అరాష్ట్రులు అను పదములకు గ్రీకు చారిత్రకులును చోరార్థమునం దుపయోగించి యున్నారు.
  2. *శిల్పములు మున్నగువాని యందు హిందువుల నేర్పరి తనమునకు మెగాస్తనీసు వలసినంత దృఢసాక్ష్య మిచ్చినాఁడు.