చంద్రగుప్త చక్రవర్తి/పదియవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

పదియవ ప్రకరణము

చంద్రగుప్తుని సమకాలీనులు

చరిత్రమున మహాపురుషు లెప్పుడును నొంటిగఁ దోఁచుటలేదు. పరిస్థితి పరిపక్వము గుదిరినం గాని మహాపురుషు లవతరించుట యరుదు. కాన లోకచరిత్రమున సుప్రసిద్ధములగు పట్టుల నెటఁ బరిశీలించినను కార్య నిర్వహణ ధురంధరులు సమాజములు కల్పించుకొని విచ్చేసిరో నాఁబరఁగుచుంద్రు. చంద్రగుప్త చక్రవర్తికాలము నిట్టిదియే. చంద్రగుప్తుని గంటికి రెప్పవోలె కాచి యాతనికి రాజ్యమును సంపాదించిపెట్టిన చాణక్యుండును, ఆ చాణక్యునకుఁ బ్రశంస నీయుండగు విరోధియయి పరఁగిన రాక్షసుండును, చంద్రగుప్తుఁ డడవుల నిడుమలు గుడుచుచుండ లోకమునంతయు నేకచ్ఛత్రముక్రిందికి దేఁ బ్రయత్నించిన సుప్రసిద్ధ వీరుండగు నలెగ్జాండరును, అలెగ్జాండరునకుఁ దరువాత నాతని కార్యమును గొంతదీర్చి యంతటి వాఁడని పొగడ్తఁగని చంద్రగుప్త చక్రవర్తి రాజ్యము నపహరింపనేతెంచి యాతనిచే పరాజితుఁడయి తనబిడ్డ నాతనికిచ్చి సంధిచేసికొనిన శెల్యూకసును, శేల్యూకసుచే నిర్ణీతుఁడయి చంద్రగుప్తుని యాస్థానమున రాయబారిగ నుండి తన దినచర్య గ్రంథముచే నిప్పుడు హిందూదేశ పూర్వచరిత్ర లేఖనమునకు నాధారభూతుఁడయిన మెగాస్తనీసును మనకు సంస్మరణీయులు. వీరిచరిత్ర దొఱికినంత వఱకు సంక్షిప్తముగ నీ క్రిందఁ బొందుపఱచుచున్నారము.

చాణక్య చరిత్రము

శ్రీమద్రామాయణమునందు అయోధ్యాపురిని దశరధ సుమంత్రులను, కిష్కింధాపురిని సుగ్రీవ హనుమంతులను భారతమునందు ధృతరాష్ట్ర విదురులను, కృష్ణార్జునులను చేర్చి చేర్చి తలఁచుట యెంత ప్రకటమో, అటువలెనే ముద్రా రాక్షసమును చదువువారలకు చాణక్య చంద్రగుప్తులను నంద రాక్షసులను ఏకశ్వాసముతో స్మరించుట సహజము. మఱియు నా చదువరులు చాణక్యవాక్యములను చాణక్య చేష్టితములను పరికించుతఱి, విశ్వామిత్రుని కోపసాహస సామర్థ్యములను, భీష్ముని నీతి ప్రవీణతను, కృష్ణుని శత్రుసంహారమును కపట సూత్రధారిత్వమును, హనుమంతుని స్వామికార్య ధురంధరత్వమును, హనుమద్భీష్ముల బహచర్యనిష్ఠను స్మరింపకమానరు.

విష్ణుపురాణములోను మత్స్య వాయు భాగవత పురాణములందును, బృహత్కథయందుసు చాణక్యుఁడు ప్రశంసింపఁ బడియున్నాఁడు. కామందకములో "పతిగ్రహము చేయనదియు విశాలమునైనదియు నగు ఋషివంశములలో పుట్టిన యశస్వి, అగ్నిసమతేజుఁడు, వేదవిద్వరుఁడు, నాల్గువేదములను ఒక్క వేదము పడువున అధ్యయనము చేసినవాఁడు, ప్రజ్వలన తేజుఁడు, అభిచారవజ్రముతో నందపర్వతమును వేరుతో పడకొట్టిన భూసురుఁడు, శక్తిధరసముఁడు, మంత్రశక్తితో నేకాకిగ కార్యకరణశక్తుఁడు, చంద్రగుప్తునకు ఈ మేదినిని సంపాదించి యిచ్చినవాఁడు, అర్థశాస్త్ర మహాసముద్రమునుండి నీతిశాస్త్రామృతమును చిలికి యెత్తినవాఁడు నైన విష్ణుగుప్తునకు నమస్కరించెదను " 1[1] అని యున్నది.

రాక్షసుఁడు చాణక్యసన్నిధి చేరినపుడు, " ఇతఁడుగదా దురాత్ముఁడు లేక మహాత్ముఁడు కౌటిల్యుఁడు! సముద్రము రత్నములకెల్ల బొక్కసమయినయట్లు సర్వశాస్త్రములకును శరణ్యుఁడైన వాఁడు. వీనియందు మాత్సర్యవశమున గదా ఈతని గుణములకు సంతోషింపక యున్నారము ! "[2] అనుచు పాండిత్య స్తవమును జేసియున్నాఁడు. దశకుమార చరితము, పంచతంత్రము, కాదంబరి, చణ్డకౌశికము, బృహత్కథ, హితోపదేశము, విక్రమార్కచరిత్రము మున్నగు గ్రంథముల

యుదు సమస్తరాజ నీతిశాస్త్రములకును చాణక్యుఁడు గొప్ప ప్రమాణముగ సంగీకరింపఁబడి యున్నాడు. 1[3]

ముద్రారాక్షసమునందు ప్రబలపాత్రముగఁ బ్రజ్వలించుచు, పరిస్ఫుటబుద్దిని, ఆత్మవిశ్వాసమును, యుక్తితంత్రజ్ఞతను, నిరంకుశ నీతిశాస్త్ర ప్రావీణ్యమును, దూరదర్శనమును, నిర్ణీత ఫలప్రాప్తికి వలసిన సర్వోద్యమ పరత్వమును చాణక్యుఁడు వెల్లడిసేయుచున్నాఁడు. ఈ నాటకమునందలి సర్వకార్య వ్యవసాయమును చాణక్యునిదిగనే ద్యోతకపడుచున్నది.

ఇతఁడు “ విఘ్నేర్ముహుర్ముహురపి హన్యమానాః ప్రారబ్ధ ముత్తమగుణా సపరిత్యజన్తి, " 1[4] అను శ్లోకమునకు దృషాంత రూపుఁడన్నను సరిపోదు, విఘ్నముల ఛాయలైనను పొడఁగట్ట నట్టులు భూతభవిష్యద్వర్త మానములను గణితశాస్త్రజ్ఞుల సునిశ్చితతో సమానపఱచి, యుపక్రమించిన యత్నములను పూర్వనిర్ణీత యుపసంహారములకు కొనసాగించుచు ఆయా దేశములలో నా యా కాలములలో అస్ఖలిత జయులై సంచరించిన మహాత్ములలో నొకండు. గ్రీకులలో అలెగ్జాండరు, రోమనులలో సీజరు, ఫినిషియనులలో హానిబలు, యూరోపియనులలో నెపోలియను, అమెరికనులలో వాషింగుటను చరిత్రముల, జదివిన వారల కెట్టి యుత్సాహము పుట్టఁగలదో యట్టియుత్సాహము చాణక్య చంద్రగుప్తుల చరిత్రము జదివినవారికిఁ బుట్టక మానదు. అలక సుందరాదులకైన కొన్ని కొన్ని యపజయములు, చిత్తక్లేశములు కలవు. కాని ఈ చాణక్యునకు, మాత్రమది యేమియు లేదు. " సృషలుని కల్పనాయాసమును నాయొక్క మతి జాగరూకతయు" నని చాణక్యవచనమున చదువరులు తడయ గల్గుచున్నది. కాని, సమస్త విషయములును అతఁడు అనాయాసముగనే నిర్వహించు నట్టులు ఒక్క యుదంతము వెనుక మఱియొక్కటి అనాలస్యముగ వచ్చుటం బట్టి కార్య ప్రహమునందు వేవేగముగ అందఱిని లాగికొని పోవునట్లును తోఁచుచున్నది.

ప్రతిజ్ఞాభంగకారి గాఁగల దయా దాక్షిణ్యముల కెడ మియ్యక , అప్రతిగ్రహణ వ్రతంబును మఱపింపఁగల రాజకీయాభిమానాడంబరకాంక్షలఁ గలనైనను తలఁపక, జీర్ల కుడ్యపు పర్ణశాలయందు త్రేతాగ్ని సంరక్షణావిహిత కర్మల పరిపాలించుకొనుచు బ్రహ్మణ వృత్తిపరుఁడై రాజనీతి ధురంధరత యందు తన్నీతియు క్తమార్గము నవలంబించుచు, బ్రాహ్మణ క్షాత్రధర్మముల సమ్మేళన పఱచికొని, చాణక్యుఁడు శాంతాశ్వ ఉగ్రాశ్వములఁ బూన్చిన శకటంబుం ద్రోలు సారధివలెఁ బ్రవర్తించె. “ఇక్కాలమందును బ్రాహ్మణాది జాతిజన్యులు స్వస్వధర్మముల పరిపాలించుకొనుటకు వీలులేక, ఆ ధర్మములు శాస్త్రములయందు మాత్రము సుస్థిరములై నెలకొని యుండఁగ, దినదినానుభవమునందు మిశ్రాచారపరులై యుండఁ జూడమె? నిత్యకర్మానుష్ఠానములు త్రేతాగ్నిహోత్రక్రియలు గ్రామవాసములలో సహితము అంతర్ధానములై నవి గదా ?" యందు రే? మహమ్మదీయ ప్రభుత్వమునందు శ్రుతిస్మృతుల యదార్థానుష్ఠానము లెట్లుండెనో తచ్చరిత్రకారులు చెప్పగలరు. తత్పూర్వమునందున చాణక్యుఁడు ఇప్పటి వారింబలె వేషధారి బ్రాహ్మణుఁడనుట బొత్తిగ ననాదరణీయము. వారి నిష్ఠ లెల్లయు బౌద్దజైనుల వ్యాప్తిని ఆటంకపఱుచుటకు చాణక్య ప్రభృతులైన బ్రాహ్మణులు పన్నిన కుట్రయని ముద్రా మంజూషమునందు చాణక్య వాఙ్మూలముగ చెప్పఁబడియున్నది. కొందఱు పశ్చిమఖండపు పండితులు నిట్లే యూహించిరి. కాని ఇయ్యది శంకనీయమని టెలాంగుగారి యభిప్రాయము. నాల్గవ శతాబ్దమునందు బౌద్ధనిగ్రహము చేసినట్లు తెలిసెడి గుప్త వంశపు రాజుల చెయిదమును చాణక్యునిపై నారోపించిరేమొ? బౌద్దనిగ్రహకథకు చోటియ్యక మెగా స్తనీసు దినచర్య వారిని గుఱించిన ప్రశంసయే చేయకున్నది. కావున బౌద్ధ జైనుల యాధిక్యతకు అశోకవర్ధనుని కాలమే మొదలని యూహింపవలసి యున్నది. అథవా బౌద్ధులవంటి వారిని నిగ్రహించుటకు వారిని మించిన సుశీలతానుష్ఠానము యుక్త మార్గముకాని కేవల రాజస తామస భూయిష్టమైన రాజ ద్రోహాది కార్యముల వంటిదికాదని జ్ఞప్తి నుంపవలసియున్నది. మనము నిర్ణయింపగలదెల్ల నేమనఁగ, చాణక్యుని యభిప్రాయము స్వధర్మువును రక్షించుకొనవలసినది ; క్షత్రియ కృత్యములలో ఫలసంప్రాప్తికిఁ గావలసిన మార్గ మేదియైనను నీతియుక్తమె యగు. రాక్షసుఁడు చంద్రగుప్త నాశనమునకై చేసిన కూట ప్రయత్నములును అటువంటివిగనే యున్నవి. కావున ఆకాలపు రాజమాత్య కులములవారి యభిప్రాయమున నీతిస్వరూప మమ్మెయిని భావింపఁబడి యుండె ననవలయు. . 'చాణక్యవటువు' అన్నపదము రాక్షస రాక్షసపక్షపాతుల వైరహేశనములనేకాక చాణక్యుని వయస్సును రాక్షసుని వయస్సుకంటె మిక్కిలియు తక్కువయని గాన్పింపఁ జేసెడిని. కొందఱి యభిప్రాయము చొప్పున చంద్రగుప్తుడు సర్వార్థసిద్ధికి మనుమఁడే యయిన నందు లతనికి పిన్నతండ్రులు కావలెను; అట్టి నందుల శైశవమునుండి కాపాడినవాఁడును మధ్యవయస్సు దాఁటినవాఁడుగను, చాణక్యుడు మధ్యవయః ప్రవిష్టుఁడుగను ఉండవలయును. *[5]

చాణక్యుఁడు పరిపూర్ణముగ దుష్టాత్ముఁడాయనిన, రాక్షసుని సామర్థ్యమును, స్వామిభక్తిని శ్లాఘించువాఁడుగ నున్నాడు. అటువంటి యమాత్యుని సురక్షితునిగ చంద్రగుప్త సాహాయ్యమునకు కూర్చి యుండనియెడల ముద్రారాక్షసమునకును ముద్రామంజూషమునకును అవకాశాస్పదతలే లేకపోయి యుండును. మిత్రునికై ప్రాణత్యాగ, మానత్యాగ, క్షేమత్యాగ, కుటుంబ త్యాగములకు అవలీలగఁ దెగించిన చందనదాసుని శ్లాఘించి కార్యార్థము కారాగృహాది పీడలకు లోఁబఱచినను, కడపట నతని లోకములకెల్ల అగ్రశ్రేష్ఠిగా నియమించు చున్నాఁడు. చంద్రగుప్తుడు వృషలుండైనను, ప్రాచీనక్షాత్రకుల జనిత పరిపాలిత రాజ్యమునకు, సింహాసన సదృశపార్థివ సాంగత్యమునుబట్టి అభిషేకము చేసినవాఁడు.

అర్ధరాజ్యదానమున కొప్పుకొని పర్వతకేశ్వరుని పిలిపించినవాఁడు విషకన్యకద్వార యాతనిని చంపినది చూచిన, "పూర్వ ప్రతిజ్ఞయగు నందరాజ్య సర్వస్వమునకును చంద్రగుప్తాభిషేకమునకు భంగము గల్గెడిని. మఱియు నా పార్వతుఁడు అర్ధరాజ్యాలాభముతో దృప్తిఁబొందక అడియాసపడి స్వరాజ్యబలమును గూర్చికొని చంద్రగుప్తార్ధ రాజ్యమును కబళించు నట్టియని యతధర్ముండు. కావున అతని సామీప్యమున ప్రతిజ్ఞా సర్వస్వ భంగమునగు" నని యూహించి ఇట్టి సందిగ్ధమున, పర్వతకుని తొలఁగించుట సునీతియే అనియు అందున కుపాయము, రాక్షసుఁడె చూపఁగా దాని నంగీకరించుటయే భగవదాజ్ఞ యనియు నూహించెఁబోలు. వైరోచకుని యభిషేకమునకును అదేన్యాయ మనుటతోఁగూడ కూటతోరణమునుండి చంద్రగుప్తుని తప్పించుటయు నధికముఖాంతరమాయే. రాక్షస గ్రహణమునకై చేసిన యుపాయము పంచరాజ నిగ్రహమునకును మలయ కేతు సంయమనమునకును సాహాయ్యమగునట్టులు గావించిన బహుఫదాయక నీతిబీజము, ద్విపక్ష సేసలకును అనగత్య జీవనష్టము లేక యుండునట్లును భూలుబ్ధులైన మూలకంటకులు మాత్రము నివారింపఁ బడునట్లును, వేయఁబడుట మహామేథావియు, మహాజనోపకారియు నగువాని కర్మగా శ్లాఘింపఁదగినది. ♦[6] రాక్షసుని భేదించుటకు తానాలోచించినపుడెల్ల వీర రసంబగు ఆత్మశ్లాఘనవచనంబుల నేకాంతమునన భాషించినవాఁ డైనను రాక్షసమిత్రంబగు చందనదాసుని యెదుట “అస్యచ్చ, నందమివ విష్ణుగుప్త" అనుచు ఆత్మస్తుతి విషయముగ అర్ధోక్తి యందు లజ్జను నటించుటయు "సర్వంమే. — అని యర్ధోక్తి యందు లజ్జను నటించుచు (వృషలస్య వీరభవతా సంయోగ మిచ్చోర్నయః" అను నదియు చాణక్యుని సభావినయమును ద్యోతక పఱుచున్నవి. ఇట్టి స్వస్తుతియందు లజ్జిగలవాని నైజము ఎంతటి నీతినమ్రతయో తేటపడుచున్నది.

కౌటిల్యుఁడను పేరఁబరంగిన ఈతని కౌటిల్యము ఇతనికి మాత్రము సహజమా? అని విచారించితిమా, తన యనుజుఁడు లక్ష్మణునిచే సేవయందుచున్న శ్రీరాముఁడు సుగ్రీవ విభీషణులను అనుమోదించుచు వారి. అగ్రజులయిన వాలి రావణులపై నభియోగము గావించిన కౌటిల్యమును, వాలి సుగ్రీవులు పోరు చుండు తఱి చెట్టు చాటుననుండి వాలిని ఏసిన కౌటిల్యమును, పూతన హననము మొదలుకొని దుర్యోధన సంహారము వఱకును కృష్ణుఁడాచరించిన కౌటిల్యమును, భీష్మద్రోణ కర్ల హననమునకై యాచరింపఁ బడిన శిఖండి యుధిష్ఠి. రార్జున కౌటిల్యములును, ఒకొక్క యుద్ధమునందును అలెగ్జాండరు వినియోగించిన కౌటిల్యమును, సీజరు అగస్టసుల కౌటిల్యమును, మహమ్మదు ఘోరి అల్లాఉద్దీను బాబరు ఔరంగజేబుల కౌటిల్యమును, క్లైవు హేస్టింగ్సు కౌటిల్యమును, నెపోలియనుని కౌటిల్యమును, బిస్మార్కు కౌటిల్యమును, ఈసమస్త కౌటిల్యుల క్రౌర్యమును జూడఁజూడ ధర్మాసక్తులకుఁ బూర్ణముగ గర్హణీయంబయిన కౌటిల్యము రాజనీతియందు తఱుచుగఁ గన్పట్టు చున్నదని చెప్పవలసి యున్నది. ఇదియెంతయు విచారకరము.

"చాణక్యుని ఆంతరంగ జీవితము అతిశ్లాఘనీయము. తీవ్ర నిత్యాచారానుష్ఠానములను యావజ్జీవ బ్రహ్మచర్యావ లంబనమును వినాయించి తక్కిన యంశములయందెల్ల తాత్కాలికుఁడగు అరిస్టాటులు పేరుగల అలెగ్జాండరుని గురువువంటి ఉగ్ర శిక్షకుఁడు. అతనియింట సమస్త అలంకారాడంబరములును వర్జితములు. అతఁడు జితేంద్రియుఁడును సుఖదుఃఖ ఉదాసీనుండును, చిరంజీవియై మనియుండి వార్ధక్యమున ప్రాచీనాచారానుసారముగ అరణ్యనివాసియాయె. ఈ ప్రసిద్ధ మహాత్ముని చరిత్రము చూడ నతి మహోన్నత దశ యందును సర్వసంగ పరిత్యాగమునకు ప్రమాణమైయుంచె. గావుననే బ్రాహ్మణభావ మట్టిదై యుండవలెనని శాసించినవాఁడు. సార్వభౌమాధి కారైశ్వర్యములు అతని యాజ్ఞయం దిమిడి యున్నను వానినన్నిటిని తాత్త్వికౌదాసీన్యముతో చూచువాఁడు. అతని సమస్త కృత్యములును పరిశీలింప సమస్త కలా శాస్త్రాధికారియు, కల్పనాకౌశల సంపన్నుఁడును అరిస్టాటులు వలెనే సర్వశిష్యులను తన ఫక్కీ ననుసరించు నట్లు వాంఛితముల నియమింప యత్నించినవాఁడునునై కనుపట్టుచున్నాఁడు." |[7] చాణక్యునకు 'బండదంతుఁడ' నియు హేళన నామమును గలదఁట! అదియేల యనఁగ నతని యమ్మ ముంబంటిని పీకికొను మన్నందున మాతృవిధేయతకు కొఱఁత లేక యట్లుగావించి కొనెనట! కాఁబట్టి ఈ మాతృభక్తియందు అరిష్టాటులుకంటె నతని శిష్యు నలెగ్జాండరుకంటె మిక్కిలియు శ్లాఘనీయుఁ డని యెంచఁదగినవాఁడు. ..

రాక్షసుఁడు

చంద్రగుప్త చాణక్యులకుఁ దరువాత రాక్షసుఁడే ముఖ్యపురుషుఁడు అయినను ఇతనిచరిత్ర వ్రాయుటకుఁ జారిత్రక మగు నాధారము లెవ్వియుఁ గానరావు, ముద్రారాక్షస కథ వ్రాయునెడల మూఁడవ ప్రకరణమున రాక్షసుని బుద్దిచాతుర్యమును స్వామిభక్తిని వెల్లడిపఱచు నంశములు పేర్కొనఁబడినవి. ఇదివఱకు చాణక్య చరిత్రము వ్రాయుటలో నతని వయస్సును గుఱించి కొంత చర్చించినారము. ఇతఁడు నందవంశమునకు మొదటినుండియు మంత్రియైపరఁగి ఆ మైత్రిచే నా వంశమును నిలువఁ బెట్టుటకు మహాసాహసమునఁ బ్రయత్నించిన ననన్య సామాన్య స్వామిభక్తుఁడు. విధివశమున నాతని పన్నుగడ లెవ్వియును ఫలించినవిగావు. కష్టపరంపర లెన్ని డీకొనినను ఆలుబిడ్డలు ఇడుమల గుడుచుచున్నను దనకెంత యపాయము వాటిల్లినను వెనుదీయక కార్యముసాగినంతకాలము ధైర్యముతో స్వామికై పరిశ్రమ సల్పిన మహావీరుఁడుగదా ఇతండు. చాణక్యుఁడే ఇతనిని గుఱించి.

“కొందఱు ద్రవ్యకాంక్షమెయి
           గొల్తురు రాజుల ద్రవ్యమున్నచోఁ
గొందఱు రాజు లాపదలఁ
           గూరిననాఁడు భవిష్యదాశచే
నుందురు వీడకుండ; నిటు
           లుర్వికిఁ బాసిన రాజులందు నీ
చందము భక్తిఁ జూపఁగల
          సాధులు మాత్రము దుర్లభుల్ గదా!"

అని నుడివియున్నాఁడు. ఇంతకంటె నెక్కుడు వ్రాయుటకు వీలులేకుండుట కెంతయుఁ జింతిల్లవలసి యున్నది.హ్

అలకసుందరుఁడు

ఇతఁడె అలెగ్జాండరునాఁ బరఁగువాడు. ఈతనిని చంద్రగుప్తుని సమకాలికుఁడుగ నెన్నుట యంత సమంజసము గాకున్నను సెల్యూకసు రాజ్యముతో నితనికి విశేషసంబంధము గలదగుట చేతను. ఇతఁడు భారతవర్షముపై దండెత్తివచ్చి నప్పుడు చంద్రగుప్తు డీతనిని సందర్శించినట్లు చెప్పఁబడియుండుట చేతను ఈతని చరిత్ర యప్పటి పాశ్చాత్య ప్రపంచ పరిజ్ఞానమునకు ముఖ్యతమ మగుట చేతను నిట నది సంక్షిప్తముగ వర్ణిత మగుచున్నది.[8] ఇతఁడు గ్రీసుదేశమున కుత్తరమునందలి మెకడోనియా, రాజ్యమునకుఁ బ్రధమచక్రవర్తి నాఁజను ఫిలిపునకు పుత్రుఁడు. తల్లిపేరు ఒలింపియసు. అలకసుందరుఁడు జన్మించిన ముహూర్తము సుముహూర్తము. ఫిలిపున కప్పుడు మూడు శుభవార్త లొక్కట వచ్చిచేరెను. అతనిసేనాని మహాయుద్ద మొక్కింట విజయము గొనుటయు, అశ్వము పందెమున గెలుపు నందుటయు, అలకసుందరుఁడు పుట్టుటయు నొక్కనిమేషమున నాతని వీనులకు విందుగొలిపెను. ( క్రీ. పూ. 355 సం! జూలై మాసము 6వ తేదీ) నాఁటినుండి యలకసుందరుఁడు గారామునఁ బెరుగుచుండె. ఆతనికి మొదటి నుండియు దేహము పై విశేషాభిమానము లేకుండెను. ఎల్లప్పుడును నుత్త మాదర్శముల యెడనె అతనికి దృష్టి నిలుచుచు వచ్చెను. గ్రీసుదేశమున సుప్రసిద్ధములయి ఎల్లయౌవనులకు నాదరణా స్పదములయిన ఒలింపియా పందెములకు నితనిని బురికొల్పిన “నాతోఁ బ్రతిఘటింపఁ గిరీటధారులే తేరినచో నేను పందెమునకుఁ బోవుదు” సనియె నఁట. ఫిలిపు నూతనముగ విజయము నందెననియు గొంతరాజ్యమును గైవసము చేసికొనెననియు వినినప్పుడెల్ల నలకసుందరుఁడు సంతసించుటకు మాఱుగ తన ప్రతాపమును ప్రకటించుటకు నవసరములు దగ్గుచు వచ్చునే యని చింతించు చుండెనఁట!

ఇట్టి తేజోవంతుఁడగు నీ బాలుఁడు కార్యములయందుఁ దన ప్రతిభను జూపకుండువాడుగాఁడు. ఫిలిపులేని సమయమున పారసీక దేశమునుండి కొందఱు రాయబారులాతని నగరమునకు విచ్చేసిరి, . అప్పు డలకసుందరుఁడు వారి కుచితమర్యాదతో స్వాగతమిచ్చి వారినుండి ఆయా దేశముల స్థితిగతులను, వ్యాపారములను అందలి మార్గములను బ్రభుత్వ పద్దతులను సరసికొనియెను. దీనికిఁ గొంత కాలమునకుఁ దరువాత నలకసుందరుని బుద్దిని ధైర్యమును వెలువఱచు విశేష మొక్కటి దటస్థించెను. ఫిలిపునకు క్రొత్తగుఱ్ఱ మొండు బహుమానముగ దొఱకెను, దానిని స్వాధీనపఱచుకొని స్వారిచేయుట కెవ్వరికిని సాధ్యముగాలేదు. పెద్దవారలపాటు లన్నింటినిం జూచుచుండిన బాలుఁ డలకసుందరుఁడు "అరరె! వీరు దీనిని స్వాధీనము చేసికొన లేకున్నా రే" యని యొకటి రెండుమారులు తండ్రికి వినవచ్చు తెఱంగున గొణంగెను. అంత ఫిలిపు దన కుమారుని పొగరునకు నచ్చెరువంది యశ్వముపై నతనిని స్వారిచేయ నియోగించెను.

అంత నలక సుందరుఁడు గుఱ్ఱపునీడ దాని ముందు రానట్లు త్రిప్పి దాని నధిరోహించి డౌడు విడువసాగెను. అది కని ఎల్లరుం బ్రశంసించిరి.

అరిస్టాటిలు నా సుప్రసిద్ధుఁడగు గ్రీకు తత్వవేత్తకడ అలకసుందరుఁడు విద్యాభ్యాసము చేసెను. నైజశక్తింజేసియు గురు ప్రభావంబునను నతఁడు పదునారు వత్సరంబుల వాఁడగు సరికి ఫిలిపువలన మెకడోనియాకుఁ దానులేని సమయములఁ బ్రతినిధిగ నేమింపఁ బడియెను. తండ్రి యొక దండయాత్రకుఁ బోయియున్న సమయమున మెడారిజాతివారు తిరుగుబాటు నొనర్చిరి. బాలుం డయ్యును అలకసుందరుఁడు వారిపై నెత్తి పోయి వారిం బరాజితులఁజేసి తనపేర నొక పట్టణమును గట్టించెను. తరువాత తండ్రి తోడం గూడ యుద్ధభూమికి వెడలి కెరొనియా యుద్దమని పేరుగాంచిన సమరమున ముఖ్యుఁడై పనిచేసెను. ఫిలిపు కుమారుని మిక్కిలి గౌరవముతోఁ జూచుచువచ్చెను.

అయిన నియ్యది బహుకాలము నడచినదిగాదు. వయసు చెల్లినవాఁడే యయినను ఫిలిపు మోహావేశముచే రెండవ భార్యను బెండ్లియాడెను. దానివలన గృహకల్లోలములు కలిగి అలకసుందరుఁడు దేశత్యాగియయి తలదాచుకొనవలసి వచ్చెను. ఒక స్నేహితుని మధ్యవర్తిత్వముస నతఁడు మరల తండ్రికడ స్నేహభావముతో వచ్చి చేరెను. పిదపఁ గొంత కాలమునకు నన్యాయము ననుభవించి క్రుద్దుండయిన పౌరుడొక్కఁడు ఫిలుపును దుదముట్టించెను. అలకసుందరుఁడు సింహాసనము సధిష్టించె. ( క్రీ. పూ. 335) వెన్వెంటన ఫిలిపు సామ్రాజ్యమున నెల్లెడల తిరుగుబాటులు దలసూపి రాజ్యవిచ్చేద మగునట్లు గాన్పించెను. గ్రీకు పట్టణములగు ధీబ్సు ఆథెన్సులు యుద్ధమునకు సమకట్టెను. అలకసుందరుఁ డందఱ సాహసమున నెదిర్చి పరాజితులఁ గావించెను. గ్రీకుపట్టణ రాజ్యములెల్లయు నితనిని తమ నాయక శిఖామణిగ నెన్నుకొని అప్పుడు దమకును పారసీక ప్రభువగు డెరయసునకును నడచుచుండిన విగ్రహమువ కీతనిని నియమించిరి. రమారమి యీ కాలప్రాంతమున నొక విచిత్రమగు నుపాఖ్యానము జరిగినట్లు తెలియుచున్నది. గ్రీకు పట్టణములు అలకసుందరుని తమనాయక శిఖామణిగ నెన్నుకొను సమయమున దేశముయొక్క పదిచెరంగుల యందలి ప్రముఖులెల్లరును విచ్చేసి యుండిరి. సైనోపునగరమునకుఁ జేరిన 'డయోజనిసు' అను తత్వశాస్త్రవేత్త మాత్రము రాఁడయ్యె. ఏలరాకుండెనో చూచివత్తము గాకయని యలకసుందరుఁడు పయనమైపోయెను. ఆ సమయమున డయోజనిసు సూర్యరశ్మిలో పరుండియుండెను. జనులు గుంపుగ వచ్చుటం జూచి యతఁడు తలయెత్తి చూచెను. అంత నలకసుందరుఁ డాతని సమీపించి "అయ్యా! తమకు నే నెవ్విధముననైన నుపయోగపడఁ గలుగుదునే” యని యడుగ "నీవు సూర్య రశ్మి కడ్డము నిలువకున్నఁ జాలును" అని ప్రత్యుత్తరమిచ్చెనఁట! అది విని యలకసుందరుఁ డాతని స్వాతంత్రమునకుఁమెచ్చి "నేనలక సుందరుఁడు గాకుండిన డయోజనసు నగుట కాస చేసియుందు" నని పలికెను. దీనింబట్టి యలకసుందరుఁ డెంత నమ్రతగలవాఁడో చదువరు లెఱుంగఁ గలరు.

గ్రీకు పట్టణములచే నాయకశిఖామణిగ నెన్ను కొనఁబడి ఆలకసుందరుఁడు డెరయసుపైకి వెడలెను. ఇప్పుడు మనయందువలె నక్కాలమున గ్రీకులు మున్నగు జాతులవారియందుఁ గూడ శకునములయెడ నెక్కుడు నమ్మక ముండెడిది. ఆనమ్మకములవలన నిప్పుడు మనకుఁ గార్యభంగము గలుగునట్లే వారికిని గార్యభంగ మగుచుండెడిది. అలకసుందరుఁడు మాత్రమట్టి నమ్మకముల యాటంకమునకు నిలిచినవాఁడుగాఁడు. శకునములు దన్ననుసరించునట్లు చేసెనేగాని తాను శకునముల ననుసరింపఁ డయ్యె. ఇట్లు మహాశక్తితోఁ గార్యములుసలిపి శత్రువుల భూమింజొచ్చి వారిని రణరంగంబున నోడించి వారి దేశమునందు విశేషభాగము నాక్రమించుకొని యుద్ధములందు దొరకిన కొల్లను గ్రీకుపట్టణములకు బహుమానముగా నని పెను. గార్డియ మను పట్టణమును స్వాధీనము చేసికొనినప్పు డచ్చటి జనులొక రథమును జూపి దానికాడికి వైచియుండిన ముడిని విడఁదీసిన వాఁడు లోకంబునంతయు నేకచ్ఛత్రాధిపతిగ నేలునని నుడివిరి. అంత అలకసుందరుఁడు కత్తిదూసి యా ముడిని భేదించి వైచెనని చెప్పుదురు. ఇప్పటికిని ఆంగ్లేయభాషయందు “గార్డియను ముడిని విప్పుట" యనిన గొప్పచిక్కును వదలించుట యని యర్థము. ఇంచుమించుగ నీ గార్డియను ముడిని విడఁదీసిన కాలముననే అలకసుందరుఁడు జబ్బుపడియెను. అతని రుగ్మతకుఁదగు మందులిచ్చువారు లేరైరి అప్పుడు ఫిలిపు అనువాఁ డొకఁడు సాహసించి ఔషధం బియ్యవచ్చెను. కాని అతఁడు కపటియనియు డెరయసుపక్షపాతి యనియు నాతనిచేతి యౌషధమును గొనవలదనియు నలకసుందరున కొకమిత్రుఁడువ్రాసెను . అలకసుందరుఁ డది చూచికొని ఫిలిపు మందుగిన్నె చేతి కందిచ్చిన తరుణమున నా యుత్తరము నాతనికిచ్చుచు మందును ద్రావివైచెను. ఫిలుపును విభ్రాంతి చెందెను. అప్పుడు ఫిలువు అలకసుందరుల డెందములఁ గొందలము గొనిన భావము లూహ్యములేగాని వర్ణనీయములుగావు. కొంతసేపటికి అలకసుందరుఁడు మందువలన నారోగ్యము పొందువడఁ దన మెకడోనియనుల కమందానందము గలిగించుచు డెరయసును సంపూర్ణముగ నోడింప బయలుదేరెను. అజాగ్రత్త వలన డెరయసు ఇఱుకుప్రదేశమున యుద్ధము చేయవలసి వచ్చినందున అలకసుందరుని సైన్యము కొద్దియేయైనను సునాయాసముగఁ బారసీకులను దోలివైచెను. డెరయసు మాత్రము తప్పించుకొని పోయెను. అతని భార్యయు తల్లియు మఱియిద్దరవివాహితలగు కన్యలును నలకసుందరునిచేఁ జిక్కిరి. వారి కీతఁడు గనుపఱచిన మర్యాదవలన నితఁడు డెరయసునకే సంస్తవనీయుఁ డయ్యెను. ఆ యువిదలకు అలెగ్జాండరు రాజ వనితలకం దగు సదుపాయము లన్నియు నమర్చెను. పురుషు లెవ్వరును వారి యంతికముల కడకు పోఁగూడదని శాసించి వారి కేలాటిలోపమును రానీక కాపాడెను. డెరయ సొక్కరుఁడు లేఁడనుటఁ దక్క వారికి డెరయసునగరమునకంటె అలకసుందరుని నగరముననె నెక్కుడు సౌఖ్యము గల్పింపఁబడెను. పట్టువడిన కొన్ని మాసములకు డెరయసుభార్య గర్భస్రావమువలన మృతినొందెను. తన యుదారహృదయమును డెరయసునెడఁ జూపుటకు వీలులేకపోయెనే యని వగచుచు నలకసుందరుఁ డామెకు మహా విభవముతో నుత్తరక్రియలు జరిపించెను. ఇదివిని డెరయసు వికలమనస్కుఁడయ్యె. కాని అతనిభార్యతో గూడ పట్టువడి ఆమెయొద్ద అలెగ్జాండరువలన సేవకుఁడుగ నియమింపఁబడి ఆమె మరణానంతరము దప్పించుకొనిపోయి డెరయసుం జేరియుండిన కొజ్జాటిరియ ననువాఁడు అలెగ్జాండరు యొక్క నైర్మల్యముం బ్రశంసించి నమ్మకమగు సాక్ష్యముపలికి డెరయసు మనముం దేర్చెను. అలెగ్జాండరు శుద్ధచరిత్రుఁడని వాఁడు నొక్కినొక్కి వక్కాణించి యున్నాఁడు.

ఈదుఃఖము వాటిల్లిన కొంతకాలమునకే డెరయసునకు నలెగ్జాండరుతో ఘోరయుద్ధము సంప్రాప్తించి అపజయము కలిగెను. నాఁటితో పారసీక సామ్రాజ్య మంతరించె. అలెగ్జాండరునకు గ్రీసు మొదలు భరతవర్షము వఱకుఁగల ఆసియా ఖండంబును ఈజిప్టుదేశమును లోఁబడిపోయె. అచిరకాలంబుననె డెరయసు పరలోకప్రాప్తిఁ జెందెను. అతని కళేబరంబును రాజపురుషుని కళేబరమునకుం దగినరీతిని మర్యాద దప్పకుండ సమ్మానించి ద్రావకములో నునిచి ఆతని తల్లికి నివేదించునట్లు అలెగ్జాండరు ఏర్పాటులఁ గావించెను. డెరయసుతోఁ బోరు సల్పుచుండిన కాలమున నలకసుందరుఁడు చూపిన కొన్ని గుణములు ప్రశంసనీయములయి యతని స్వభావమును దెలియఁ జేయుచున్నవి.

అరెస్టను అను సేనాని యొక్కఁడు శత్రువులలో నొక్కరుని జంపి వాని శరీరముం గొనితెచ్చి అలకసుందరునకు సమర్పించి "అయ్యా! మా జాతిలో నిట్టిసమర్పణకు బంగారు గిన్న బహుమానము" అనియెనఁట. అంతట అలకసుందరుడు. "వట్టిగిన్నె ఏల? నిండుగిన్నె నిచ్చెద" నని యొక బంగారు గిన్నెకు సారానించి అందిచ్చి అతనిని గౌరవించు తెఱంగునఁ దానును ద్రావెను.

ఒకదివసము హీనజన్ముఁ డొకడు మెకడోనియను కంచరగాడిదెపయి రాజుగారి ద్రవ్యమును వేసికొని బొక్కసము నకుఁ దోలుకొని పోవుచుండెను. మార్గమధ్యమున నా మోయు పశువు పడిపోయెను. అంతట నాసేవకుఁడు ద్రవ్యపుమూటలను వీపునవేసికొని మోయలేక మోసికొని పోవుచుండెను. అప్పుడు వానిని అలకసుందరుఁడు చూచుట తటస్థించెను. వెంటనే సంగతులు తెలసికొని అలెగ్జాండరు "మిత్రమా! నిలువుము. ముందునకు సాగిపోవలదు. అది నీ సొమ్ము. నీయింటికిఁ గొనిపోయి నీవే యుపయోగించుకొనుము" అని నియోగించెను. ఆహా ! ఒక్క నిమిషంబున దారిద్ర్యమునుండి లేవఁదీసి మహైశ్వర్యవంతునిగఁ జేసిన అలెగ్జాండరునెడ నా దరిద్రుఁ డెంత భక్తివిశ్వాసములు గలవాఁడయ్యెనో మనమెఱుంగఁ గలమా? అలెగ్జాండరింతటి యుదారవంతుఁ డనియైన మన మిప్పుడు లెక్క వేయఁగలమా?

ఒక సందర్భమున నలెగ్జాండరు సైన్యము మిక్కిలి విరివియగు నిర్జలప్రదేశముగుండ ప్రయాణము సలుపవలసి వచ్చెను. కొందఱు మెకడోనియనులు మాత్రము ఒక ఏటికడ బుడ్లలో నీరు నించుకొని తమ వాహనములపైఁ దెచ్చుకొనుచుండిరి. అలెగ్జాండరునకు విశేషము దప్పిపుట్టెను. అప్పుడు వారిలో కొందఱు శిరస్త్రాణంబున నొక్కట నీరునించి అతని కిచ్చిరి. అతఁడు దానిని బుచ్చుకొని ఎవ్వరికిఁగాను గొనివచ్చుచుండిరని యడిగెను. వారు "మా బిడ్డలకొఱకు కొనివచ్చుచున్నారము. మా ప్రభువు జీవించినచో నిప్పటి బిడ్డలు పోయినను మాకు బిడ్డలకుఁ గొదవయుండ" దనిరి. ఈ లోపల నలకసుందరుఁడు చుట్టుఁజూడ సైనికులనేకులు దలలువాంచి అతని చేతిలోని నీటివైపునఁ జూచుచుండిరి. అది గమనించి అతఁడు "నేనుదకమును ద్రావినయెడల నావలెనే పిసాసాపీడితులగు నీ సైనికులు అధైర్యపడియెదరు" అనుచు నీటిని వెనుకకు నిచ్చివేసెను. అతని యౌదార్యమునకుసు త్యాగమునకును మెచ్చి సైన్య మెల్లయు నొక్క పెట్టున మిక్కిలి తెగువతో ద్రోవనడచెను.

అలెగ్జాండరు భరతవర్షముమీదికి దండెత్తి వచ్చుట మున్నగు విషయములు నాలుగవ ప్రకరణమున వ్రాయఁబడినవి. మరల నిచ్చట వ్రాయుట అనవసరము. -

డెరయసు మరణానంతరము అలెగ్జాండరు దనరాజ్యము నందు సంబంధములును బాంధవ్యములును నుండిన రాజ్యస్తైర్యమున కనుకూలమగునని తలఁచి పౌరవాత్య పద్దతులను అవలంబింప మొదలిడెను. భరతవర్షమునుండి తిరిగి పోవుచు సూసాపట్టణముకడ మహావైభవమున రోక్సానా యను పారసీక కన్యను జేపట్టి పెండ్లియాడెను. తన మిత్రులకును బంధువులకును గ్రింది యధికారులకును అనేకులకుఁ బూర్వదేశముల యందలి కన్యలను వివాహమున నిప్పించెను. 9000 వివాహములు జరిగెను. తాను ఉడుపులు మున్నగు ఇతర విషయములను గూడ పౌరవాత్యపద్ధతులనే అనుసరించుచు వచ్చెను.

భరతవర్షమునుండి దిరిగిపోవుచు నతఁడు బాబిలోను వద్దకు వెళ్లునప్పటి కాతనికిఁ జలిజ్వరము సంభవించి మృతుఁ డయ్యెను. ( క్రీ. పూ. 323)

అలెగ్జాండరు అంతిమదశయందు విశేషము త్రాగుడు వలన కొందఱను అన్యాయముగ జంపినట్లు చెప్పఁబడుచున్నది. ఎట్టివారికిని గళంకము లుండును గదా!

సెల్యూకసు

అలెగ్జాండరుచేఁ జయింపఁబడి కొంతకాల మాతని పాలనకు లోనయియుండి ఆతని మరణానంతరము చెల్లాచెదరయి పోయియుండిన రాజ్యశకలములను, జంద్రగుప్తుఁడు భరతఖండమును ఏకచ్ఛత్రాధిపత్యము గ్రిందికిఁ దెచ్చుచుండిన కాలముననే, ఏకచ్ఛత్రాధిపత్యమునకుఁ దేఁ బ్రయత్నించి జయము వడసి చంద్రగుప్తుని నెదిర్చి నిలువలేక అతనికిఁ బుత్రికనిచ్చి మైత్రిచేసికొనిన మహావీరుఁడు ఈ సెల్యూకసు.

ఇతఁడు క్రీ. పూ. 358-354ల మధ్యకాలమున జనన మందెను. ఇతఁడు రమారమి ముప్పదిసంవత్సరముల వాఁడయి ఆసియా మీఁది కెత్తి పోవనున్న అలెగ్జాండరు సైన్యమునఁ జేరువఱకుంగల ఇతని జీవిత చరిత్రము మనమెఱుంగము. క్రీ. పూ. 326.వ సంవత్సరమున నితఁ డలెగ్జాండరు సైన్యములోని ముఖ్యాధికారులలో నొక్కఁడయి కన్పట్టుచున్నాఁడు. ఆప్గఘనిస్థాన ప్రాంతము నందలి పర్వతప్రదేశమున నలకసుందరుని బ్రీతుంజేయుటచేత నతనికడఁ బ్రధానాధికారిగ నేమింప బడెను. అలెగ్జాండరు, టాలమీ, పర్డిక్కాసు, లాసిమేకసులతో భరతవర్షముంజొచ్చి పురుషోత్తముతోడి పోరున నితఁడు పేరు మగండయి . వెలసె. అందువలన నలకసుందరున కీతనిపయి ననురాగము చెన్నువహించి నట్లగుపించుచున్నది. సూసాపట్టణమున క్రీ. పూ. 324 వ సంనత్సరమున జరిగిన మహావైభవోపేత వివాహములలో నలెగ్జాండరు వివాహమునకు రెండవ దీతనిదె యయి యొప్పెను. పారసీక ప్రభువులలో నలెగ్జాండరు మామయు నీతని మామయు సమానౌన్నత్యము గల ప్రముఖులు.

బేబిలోనున క్రీ. పూ. 323 లో నలెగ్జాండరు పరలోక గతుఁడయిన పిదప నాతని రాజ్యమంతయు నరాజకముగాఁ జొచ్చెను. ఫ్రిజియాక్షత్రపుఁడగు అంటిగోనసును, ఫిలిపుసేనానియగు ఆన్టిపేటరును. ఈజిప్టుక్షత్రపుఁడగు టాలిమీయును, మెకడోనియా ప్రతినిధియగు క్రెటరసును స్వతంత్రరాజులము గాఁగలుగుదుము గదాయని పన్నుగడలకు ప్రారంభించిరి, కొలఁది కాలముననే రోక్సానాకు కొమరుండుపుట్టె. పర్డిక్కాసు ఆ చిన్ని యలెగ్జాండరునకు సహపాలకుఁ డయ్యెను. ఇతర క్షత్రపులతోఁ జేరియుండిన సెల్యూకసునకును వెన్వెంటనే రాజ్యభాగ మబ్బియుండునుగాని ఏ కారణముననో అతఁడు సహపాలకుని రక్షక సైన్యమున (Companions) కధ్యక్షుఁడుగ నుండనియ్యకొనెను. అయిన నిది బహుకాలము జరిగినదిగాదు. క్రీ. పూ. 321 లో ఆన్టిగోనసు సహపాలకుని యాజ్ఞ నుల్లంఘించుటంజేసి వీ రిద్దఱకును విగ్రహము ప్రారంభ మాయెను. క్షత్రపు లందఱును ఆన్టిగోనసుతోఁ జేరిరి. పర్డిక్కాసు విగ్రహమును నడుపుచు సైన్యముతో నీజీప్తుఁ జొచ్చెను. అతని సైన్యము లోడిపోయి యతఁడు ప్రాణము లర్పింపవలసి వచ్చెను. బహుకాలముగ సంగతులను గమనించుచుండిన "సెల్యూకసు సమయము చూచుకొని సహపాలకుని దిగనాడి క్షత్రవుల పక్షముసఁ జేరిపోయెను. . సహపాలకుఁడు పర్డిక్కాసు మడిసిన పిదప ఆన్టిపేట రాతని స్థానమునకు నియమింపఁబడియెను. అట నతనికిఁ గొన్ని చిక్కులు దటస్థించెను. సైనికులలోఁ గొందఱకు నాతఁడు ఇయ్యవలసిన ధనమిచ్చుటకు సందర్భము లతనికి వ్యతిరేకము లయ్యను. అంతట వారతనిని శిలావర్షమున నొప్పించి చంపఁ జూచిరి. ఆ తరుణమున వారినుండి యాతనిని సెల్యూకసు దప్పించె. కృతజ్ఞతఁ జూపుటకు నతఁడును సెల్యూకసునకు బేబిలోనియా ప్రభుత్వమిచ్చి యని పెను., ఇదియు సెల్యూకసునకుఁ జాలకాలము దక్కినదిగాదు. ఆన్టిగోనసు మహాబలవంతుఁ డగుటయు అతనికిని "సెల్యూకసునకును వైరము గలుగుటయుఁ దటస్థించెను. ఎంతఁ బ్రయత్నించినను ఆన్టిగోనసును నమాధాసపఱుచుట యసాధ్యమయ్యెను. క్రీ. పూ. 317 లో సెల్యూకసు ఈజిప్తునకుఁ బారిపోయి టాలమి శరణుఁజొచ్చెను. 316 లో రాజవంశము పేరైనను లేక పోవుటయు ఆన్టిగోనను ప్రజల ప్రభువగుటయు సంభవించె. అంతట నితర క్షత్రపులు- ఈజిప్తు న టాలమీయును, అతనికడఁ జేరియుండిన మన సెల్యూకసును, మెకడోనియాయందు కసాండరును లాసి మేకసును-ఆన్టిగోనసు నెడ నీర్ష్యగలవారయి యాతనిపై వైర మూని క్రీ. పూ. 315 నందుఁ గొన్ని సమాధానము లడిగిరి. దానిపయి వారికిని అతనికిని విగ్రహముపుట్టె అందు 315 మొదలు 312 వఱుకును సెల్యూకసు టాలమీ సేనానులలో నొక్కఁడుగఁ బనిచేసెను. కాని యా సంవత్సరము ప్రారంభ మగునప్పటికి సెల్యూకసున కదృష్టము పట్టుటకుఁ ప్రారంభించెను, ఆన్టిగోనసు మెకడోనియాపై కెత్తిపోవ నుండెను. ఆ దాడి నాటంకపఱచి యతని విఫలమనోరధునిఁజేయ సెల్యూకసు ఉపాయము వెదకి ఆతని కుమారుని పరాజితుంజేసి యతని సైన్యములను 'గాజా' యుద్ధమున నుఱుమాడించెను. అంతటితో ఆన్టిగోనసు తనచేసిన ఏర్పాటుల నెల్ల యు మార్చుకొను వాఁడాయెను. సెల్యూకసు శకము ప్రారంభమయ్యె. టాలమీ 800 పదాతులను, 200 స్వారులనుఇచ్చి సెల్యూకసును బేబిలోనియా స్వాధీన పఱుచుకొనుమని పనిచెను. ఇంత స్వల్ప సైన్యముతో నేమి చేయవచ్చునని కొందఱు సెల్యూకసుతో వాదింపఁ జొచ్చిరి. కాని అలెగ్జాండరు దృష్టాంతమును జూపియును, వీరపురుపోచిత ధర్మముల నుపన్యసించియు, శకునముల గనుపఱచియు సెల్యూకసు దనబలములఁ బురికొల్పి మార్గమువ జయము గొనుచు బేబిలోను చేరి ఆన్టిగోనసు పక్షమువారిని పరాజితుల నొనర్చి యానగరమును వశపఱచుకొనెను. నాఁడె సెల్యూకసుల సామ్రాజ్య జన్మదినము. నాఁటినుండియు సెల్యూకసు తన స్థానమును బలపఱచుకొనఁ జొచ్చెను అచిర కాలముననే ఆన్టిగోనసు తన క్షత్రపుఁ డగు 'నికనరు' ను 10,000 పదాతులతోను, 7000 అశ్వికులతోను సెల్యూకసు పైకి ననిపెను. ఇతని సైన్యమున 3000 కాల్బంబులును, 400 స్వారులును నుండిరి. అయినను సెల్యూకసు ప్రతిభవలన నీ చిన్న సైన్యము నికనరును సంపూర్ణముగ నోడింపఁ గలిగెను. ఈ దెబ్బతోడనే ఆన్టిగోనసునకుఁ బశ్చిమమునఁ దొందరలు చూపట్టెను. అయినను వెనుదీయక ఆన్టిగోనసు తనకొమరుని డెమిట్రియసును బేబిలోనియామీఁదికి గొప్పదండుతో నని పెను. ఆ దండు కొల్ల గొట్టుటతప్ప మఱి యేవిధమయిన ఫలమును గొనిరాదయ్యె. సెల్యూకసు మెల్ల మెల్లఁగ ఆన్టిగోనసు పక్షపాతులను పరాజితులఁ జేసి మరల బేబిలోనియాను స్వాధీన పఱచుకొనెను. రెండవమా రితఁడు ఈ నగరమును కైవసము చేసికొనినది మొదలు క్రీ. పూ. 302 వఱకు తొమ్మిది సంవత్సరములకాల మేమిజరిగెనో మన మెఱుంగుట కాధారములు గానరావు. 302 లో సెల్యూకసు లాసిమేకసులకును ఆన్టిగోనసునకును ఇప్సను అను స్థానమున యుద్ధము జరిగెను. అన్టిగోనసు హతుఁడయ్యె. సెల్యూకసునకు పాలెస్టను మొదలు భరతభండమువఱకుఁగల రాజ్యము సర్వస్వాతంత్ర్యములతో నబ్బెను. పాలెస్టను సెల్యూకసునకును ఈజిప్తు క్షత్రపుఁడగు టాలమీకును వివాదకారణమయ్యే. కాని టాలమీ సెల్యూకసునకు కష్ట కాలమున సాయము చేసినవాఁడు గావున నా వివాదము అప్పుడు విగ్రహము కాదయ్యెను.

సెల్యూకసు రాజ్యవిస్తారము పెంపునందిన ఆ 303 వ సంవత్సరముననే అతఁడు భరతవర్షము పయికెత్తివచ్చి చంద్రగుప్తునిచేఁ బరిభవమంది పుత్రికనిచ్చి సంధి చేసికొనెను,

సెల్యూకసు బలవంతుఁ డగుట చూచి తక్కుగల క్షత్రపు లతనిపై విరోధమూనిరి. టాలమీ లాసి మేకసు లొక్కండై రి. కొంతకాలము ఆన్టిగోనసు కుమారుఁడు డెమింట్రియసు సెల్యూకసుతోడఁజేరి, కొంతకాల మెదిరించి, కొంత కాలములోఁబడి పలుపాట్లఁబడి క్రీ. పూ. 283 లో విషము పుచ్చుకొని చచ్చెను. అతనితోటి సంబంధములలో సెల్యూకసు ఉదారుఁడుగను, దయార్ద్రహృదయుఁడుగను, ధైర్యశాలిగను గన్పట్టుచున్నాఁడు. డెమిట్రియసు పలుత్రోవలఁ ద్రొక్కి తుట్టతుదకుఁ జిక్కి. సెల్యూకసుచే రాజపురుపోచితమగు చెఱయం దుంచఁబడెను. అప్పుడు లాసిమేక నతనిని జంపిన రెండు వేల టాలెంటులు ఇచ్చెదనని సెల్యూకసునకుఁ దెలియ పఱచెను. దానిపై సెల్యూకసు మండిపడి అట్టి దుష్కార్యము తగదని లాసిమేకసునకు విశదీకరించుచుఁ బ్రత్యుత్తరమిచ్చెను.

ఒకతఱి ప్రజలు కొందఱు డెమిట్రియసు పక్షము వహించియుండిరి. అతనికిఁ గొంచెముగ విజయము కలిగి యుండెను. బలములఁ జేర్చుకొని అతఁడు కొంత యనారోగ్యము దటస్థించినను లెక్క. సేయక పితూరీపోట్లాటలు జరుపు చుండెను. అట్టి సమయమున సెల్యూకసు డాలునొక్కటిని మాత్రము చేతఁబట్టుకొని యొంటరిగా డెమిట్రియసు విడిసి యుండిన యడవిఁజొచ్చి యచ్చటి యుద్ధభటులను దనపక్షమునకు రావలసినదని చీ రెనఁట! ఆహా! ఎంతసాహసము! ఎంత ధైర్యము ! !

ఇంత యాత్మవిశ్వాసము గలవాఁడు గావుననే దైవము గూడ నతనికిఁ దోడయ్యె. లాసిమేకసు టాలిమీలరాజ్యములలో నంతఃకలహములు పొడఁగట్టె. క్రీ. పూ. 281 న లాసిమేకసు సెల్యూకసుచే యుద్ధమున మడిసె. టాలమీ రాజ్యమున కర్హుండగు కెరౌనసు టాలమీ ఈతనివద్ద శరణుజొచ్చియుండె. అట్లగుట చేత నలెగ్జాండరు రాజ్యమున నీజిప్తుదప్పఁ దక్కిన భాగంబుల కీతఁడు సర్వాధికారి యయి ఈజిప్తు యువరాజును దన వశ వర్తునిగఁ జేసికొని యడ్డులేక యలరారె. ,

సెల్యూకసునకు ఆంటియోకసు నాఁబడు పుత్రుఁడు గలఁడు. సెల్యూకసు డెమిట్రియసు బిడ్డను స్ట్రాటొనిసె అను నామెను బెండ్లియాడి యుండె. ఆంటియోకసునకు నామెపయి యనురాగము గలిగెనఁట. అంతట సెల్యూకసు పుత్త్రుని యందలి ప్రేమచే నాయమ నాతనికిచ్చి వారిద్దఱను అర్థ రాజ్యమున కధికారులను జేసి పంపియుండెను. (క్రీ. పూ. 293) నాఁటి నుండియు వారల కీపౌరవాత్యదేశములను ఇచ్చివైచి తాను తన తండ్రి తాతల దేశమగు మెకడోనియాయందు కడపటి దినములు గడపవలయునను నుద్దేశము కలిగినట్లు గానుపించెడు. ఆ యుద్దేశమును నెఱవేర్చుకొను కొఱకు సెల్యూకసు క్రీ. పూ. 281 లో మెకడోనియాకుఁ బ్రయాణ మయ్యెను. వెన్వెంటనె కెరౌనసు టాలమీయుఁ జనియె మధ్య మార్గమున నీ కెరౌనసుయొక్క. విశ్వాసఘాతుకముచే సెల్యూకసు అకాల మరణము నందెను.

అతనిచే స్థాపితమయిన రాజ్యము బహుకాలము జరిగి చరిత్రమున ప్రసిద్ధిగాంచెను,

మెగాస్తనీసు

మెగాస్తనీసును గుఱించి మనకు విశేషము తెలియదు. ఇతని గ్రంథమును లేదు. ఇతని తరువాతి గ్రీకు గ్రంథకారు లీతనివని కొన్ని కొన్ని వాక్యములు అనువాదించి యుండుటం బట్టి లోకమున కితని చరిత్ర తెలియకున్నను ఇతర విషయముల చరిత్ర పరిస్ఫుటముగఁ దెయవచ్చుటకు వీలు కలిగి యున్నది.

కొందఱు మెగాస్తనీసు పారసీకుఁ డనియు నలెగ్జాండరు వెంట వచ్చినవాఁ డనియు ననుచున్నారు. కాని యవి వట్టి యూహలు,

ఇతఁడు క్రీ. పూ. 302 లో సెల్యూకసుచే చంద్రగుప్తుని యాస్థానమున రాయబారిగ ననుపఁబడెను. ఇతఁడు పంజాబులలోని నదులను బేర్కొనుటచే నామార్గముగఁ బాటలీపు త్రముం జొచ్చినట్లూహింపఁ దగియున్నది. ఆ పట్టణమున నితఁడు బహుకాలము నివసించెను. దానికి బూర్వ భాగమందుండు భరతవర్షమును ఇతఁడు సమక్షముగఁ జూచి యుండలేదు. కొంద ఱీతఁడు చంద్రగుప్తుని తోడంగూడ దేశమును జుట్టుచుండె నందురుగాని దాని కాధారము గానము, ముఖ్యముగ బ్రాహ్మణులనుండి విని సర్వమును నితఁడు వర్ణించి యున్నాఁడు. దేశభాషలు చక్కఁగఁ దెలియమింజేసి వినుట యొక్కటి యర్థము చేసికొనుట మఱియొక్కటియయి. ఈతఁడొక కొన్ని యద్భుతముల వ్రాసె ననుటకు సందియములేదు. కాని కొందఱు వాదించు, విధంబున నితఁడు గపటికాఁడు. భాషలు దెలియమిం జేసియు, హైందవపద్ధతులను గ్రీకు అనుభవములతో విమర్శించుటం జేసియుఁ గొన్ని లోపములు గల్గిన వనుట సమంజసము. ఇంతియగాక ఇతని సంపూర్ణగ్రంథము లేని దీతని దూర నేరికి దరంబు? తరంబైనను అదెట్టి న్యాయంబు? తెలిసినది తెలిసినవఱకు దేశమును గుఱించియు, భూస్థితిని గుఱించియు, శీతోష్ణస్థితిగతులను గుఱించియు, పశుపక్ష్యాదులను గుఱించియు, జాతిమతములను గుఱించియు, ఆచారవ్యవహారములను గుఱించియు, రాజ్యాంగ పద్దతులను గుఱించియు విషయమును సేకరించి లిఖంఛియుంచి భారతవర్ష ప్రాచీన చరిత్రాంశములఁ బెక్కింటికి నాధారభూతుఁడైన ఈ మెగాస్తనీసు మనకు సంస్మరణీయుండు గాఁడే!

  1. 1. వంశేవిశాలవంశానా మృషీణామివభూయసాం |
       అప్రతిగ్రాహకాణాంయో బభూవభువివి శ్రుతః ||
       జాతవేదా ఇవార్చిష్మా న్వేదాన్వేదవిదాంవరః |
       యౌ౽ధీతవాన్సుచతుర శ్చతురో౽స్పేక వేదవత్ ||
       యస్యాభిచారవజ్రేణ వజ్రజ్వలన తేజసః |
       పపాతమూలత,శ్రీమా న్సుపర్వానందపర్వతః ||
       ఏకాకీమంత్రశక్త్యాయః శక్ఃతశక్తిధరోపమః |
       అజహారనృచంద్రాయ చంద్రగుప్తాయ మేదినీమ్ ||
       నీతిశాస్త్రా మృతంధీమా నర్థశాస్త్ర మహోడదేః |
       యఉద్దథ్రేనమస్తస్మై విష్ణుగుప్తాయ వేధనే ||

  2. కరః పర్వశాస్త్రాణాం రత్నానా మివసాగరః |
       గుణైర్నపరితుష్యా మో యస్యమత్సరిణోవయమ్ ||

  3. 1. నీతిశాస్త్రము మనదేశమునందు మొట్టమొదట నుత్పన్నమయినది. సంస్కత గ్రంథావళియం దత్యంత ప్రాచీనమయినది. చాణక్యుని నీతిసారము స్వజాతీయశాస్త్రము లన్నిటిలోను అత్యంత బహుజనాదృత మయినది,

    ఇటీవల రెండుమూడు సంవత్సరములక్రిందట మైసూరు రివ్యూనందు మ-రా-రా-శ్రీ. ఆర్. శ్యామశాస్త్రులుగారు. బి. ఎ. చాణక్యకృత అర్థశాస్త్రమునందు ఒక భాగమును ఇంగ్లీషునందు భాషాంతరీకరించుచు వచ్చిరి. ఇయ్యది ప్రాచీన గ్రంథ ప్రతిగా ననేక పండితుంచే నంగీకరింపఁబడి యున్నది. చాణక్య రచిత శాస్త్రములును అందు రూపముగ నతఁడు వడసిన బిరుదులును ఈ దిగువ శ్లోకమునందు గూర్చియున్నవి.

    వాత్సాయ నోమల్లనాగః కౌటిల్యశ్చణకాత్మజః |
    ద్రావిలః వక్షిలస్వామి విష్ణుగుప్త శ్చాంగులశ్చనః ||

    ఇందు వక్షిలనామమున అతఁడు. నైయ్యాయికుఁడనియు, కౌటిల్యు బేర రాజతంత్రజ్ఞుఁడనియు, జ్యోతిశాస్త్రమునందు విష్ణుగుప్తుఁడనియు. కామసూత్రములు యందు వాత్స్యాయనుం డనియు నీతి శాస్త్రమునందు చాణక్యుఁడనియుఁ బ్రసిద్దిఁ గాంచియున్నాడు. మల్లనాగనామము అతని యుద్ధవీరత్వమును. ద్రావిలనామము రణరంగ ప్రాముఖ్యతను ప్రకటించుచున్నవి. అంగుల నామము గణితశాస్త్ర నిపుణతను తెలిపెడిని కాఁబోలు. పాఠాంతరము త్రికాండ శేషమునందు అంసుల అని యున్నందున విశాలభుజుఁడు దృఢగాత్రుఁడని సూచించుచున్నది,

  4. 1 శా.ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై
          యారంభించి పరిత్యజింతు రురువిఘ్నాయత్తులై మధ్యముల్
          ధీరుల్ విఘ్నవిహన్యమాను లగుచున్ ధృత్యున్నతోత్సాహులై
          ప్రారబ్దార్థము లుజ్జగింపరుసుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్.

  5. *"భోఅమాత్యరాక్షస, విష్ణుగుప్తో౽హమభివాధమే" అనువాక్యమును బలుకుచు చాణక్యుడు రాక్షసునకు నమస్కరించుటయె యాతవి న్యూచనయ స్కతకుఁ జాలినంత యాధార మయ్యెడిని,
  6. ♦కర్లయిలమ గొప్పచరిత్ర తత్త్వజ్ఞుఁడు ఫ్రాన్సుదేశపు నెపోలియన్ జర్మనుదేశపు ఫ్రెడరిక్కు చక్రవర్తుల తారతమ్యములఁ బరిశీలించుచు, ఇరుతెగలకును ప్రాణనష్టము ఆనావశ్యకముగ హెచ్చక కార్యసాధకమైన పరాజయమె జయతుల్య మని భావించిన ఫెడరిక్కుని కోమలతయే. అత్యంత ప్రాణనష్టముతో జయ సంపాదనము చేసిన నెపోలియనుని క్రౌర్యముకంటె మిక్కిలి శ్లాఘనీయంబని అభిప్రాయ పడుచున్నాఁడు.
  7. 1 భువనచందదత్తు.
  8. ఇయ్యది. ఈ క్రింది శ్లోకమునకు శతావధానులుఁ దిరుపతి వేంకటేశ్వరకవుల భాషాంతరీకరణము.

    ఐశ్వర్యాదనపేత మీశ్వరమయంలో కోర్థతః సేవతే
    తంగచ్ఛంత్యనుయే వివత్తిసుపునస్తే తత్ప్రతిష్ఠాశయా
    భర్తుర్యేవ్రలయేపి పూర్వసుకృతాసంగేనవిః సంగయా
    భక్త్యాకార్య ధురంవహంన్తి బహవ స్తేదుర్లభాస్త్వాదృశాః