చంద్రగుప్త చక్రవర్తి/తొమ్మిదవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

తొమ్మిదవ ప్రకరణము

కొన్ని యాచారములు

రజస్వలానంతర వివాహములు

చాణక్యుఁడు అర్థశాస్త్రమున శిక్షాస్మృతి వ్రాయుచు రజస్వలానంతర కన్యలయెడ ద్రోహబుద్ది చూపువారలకొక విధమగు దండనను విధించుచున్నాడు. ఒక్కెడ కన్య రజస్వలయయి ఏడుమాసములు చెల్లినచో యామె కృపకుఁ బాత్రుడగుట తప్పుకాదని విధించుచున్నాడు. రజస్వల యయినపిదప మూఁడు సంవత్సరములు అవివాహితగ నుండు కన్యను సజాతి పురుషుఁడు అనుభవింపవచ్చును. మూడు సంవత్సరములకు పైఁబడియుండినయెడల తండ్రికిఁ జెందవలసిన విభూషణము లా కన్య స్వాధీనమున నుంచుకొనదేని ఆమెను విజాతీయుఁ డయినను అనుభవింపవచ్చును. శుద్ధచరిత్రలేని కన్యయని కన్యాస్వీకారము చేసిన తరువాత బయల్పడినచో నట్టి కన్యను త్యజింపవచ్చునని మఱియొక్కెడ లిఖింపఁబడియున్నది. అట్టి సందర్భముల శుల్కమును స్త్రీధనంబును వరునకు ఇచ్చి వేయవలసినదనియు కన్యాదాత జరిమానాకుఁ బాత్రుఁడు గావలసినదయు శాసింపఁబడినది. శుల్కమును గుఱించి వ్రాయుచు నింకొకపట్టున చాణక్యుఁడు తల్లిదండ్రు లిరువును పరలోకవాసులయి యుండునెడ కన్యయే శుల్క1[1] స్వీకారము చేయవచ్చునని నిర్ణయించుచున్నాఁడు. వాఖ్యాన మవసరము లేకయే పై విషయములు చంద్రగుప్తుని కాలమున రజస్వలానంతర వివాహములు సాధారణములని చాటుచున్నవి. రజస్వలానంతర వివాహములు సాధారణమను సిద్ధాంతము తేలిన పిదప బాలురకుగాని బాలికలకుగాని “అతిబాల్య వివాహములు” నాఁబరగు ననుచిత శృంఖల బంధనము దటస్థించు చుండలేదని వేరుగ వ్రాయవలయునా?

పునర్వివాహములు

“భార్యవలన పురుషునకు సజీవసంతానముగాని మగబిడ్డలుగాని కలుగకున్నను లేక సంతానమే లేకపోయినను అతఁడు మఱియొక్క ర్తెను బెండ్లాడుటకు ఎనిమిది సంవత్సరములు ఆగవలెను. భార్య మృతశిశువును గనినచో పదేండ్లు వ్యవధి కావలెను. ఆమె యాడుబిడ్డలనే కనుచుండిన పండ్రెండు సంవత్సరములు చూడవలెను. తరువాత పుత్రులు గావలెనను వాంఛపొడమినచో నతఁడు మఱియొక స్త్రీని వివాహ మాడవచ్చును. ఈ నియమములను దిరస్కరించువాఁడు భార్యకు స్త్రీధనమును శుల్కమును ఇచ్చివేసి ఇంకను నధికముగ ధనమునిచ్చి ప్రభుత్వమువారికిఁ గొంత జరిమానా ఇచ్చుకొనవలెను. వివాహకాలమున శుల్కాదుల స్వీకరింపనివారికిఁ గూడ నీ విధముగా శుల్కా.దుల నిచ్చి తగురీతిని వృత్తిని కలిగించి పురుషుడు పుత్రకాముడై ఎందఱ స్త్రీలనైనను వివాహము చేసికొనవచ్చును. " స్త్రీలు పుత్రులఁ బడయుటకు సృష్టితులు" అను వాక్యము లర్ధశాస్త్రమునఁ గానవచ్చుటవలనఁ జంద్రగుప్త చక్రవర్తి కాలమున బురుషుఁడెందఱ భార్యలనైనను పెండ్లాడుటకు స్వాతంత్రము గలవాఁడై యుండెనని విశదమగు చున్నది.

ఇఁక స్త్రీ పునర్వివాహములను యోజంచిన

"భర్తగతించిన వెనుక భార్య ధర్మకామయయి జీవింప నెంచుకొనిసచో యామె స్త్రీధనమును శుల్కమును ఆమెకిచ్చి వేయ వలసినది. పేరునకుమాత్ర మాయమకిచ్చియుండి నిశ్చయమున కయ్యవి యామె స్వాధీనమున నుండనియెడల నవ్వానికగు వడ్డీతోడంగూడ నవి చెల్లింపఁబడవలెను.

"ఆమె కుటుంబకామయయి పునర్వివాహము ఆశించెనేని ఆయమకు భర్తగాని మామగాని ఇచ్చియుండిన సొమ్ము ఈయఁబడవలయును.” అనియు

"భర్త హ్రస్వప్రవాసమునకుఁ బోయియుండిన యెడల బహ్మక్షత్రియవైశ్యశూద్ర స్త్రీలు అతనికయి యొక్క సంవ త్సరము వేచియుండవలయును. సంతానము గలవారయిన పక్షమున సంవత్సరమునకంటె నెక్కుడు వేచియుండవలెను. “భోజనాదులకు వసతులున్న యెడల రెండింతల కాలము వియోగము భరింపవలెను. భుక్తికి జరుగని స్త్రీలను జ్ఞాతులు నాలుగు లేక ఎనిమిది సంవత్సరములు సంరక్షింపవలెను. పిదప వివాహకాలమున వారికి దత్తము చేయఁబడిన ఆస్తినిచ్చి పునర్వివాహము చేసికొన నియ్యవలెను.

"భర్త బ్రాహ్మణుఁడయి అధ్యయనార్థము దేశాంతరస్థుఁడయియున్న సంతానరహితయగు స్త్రీ, పదిసంవత్సరము లతనికయి వేచియుండవలయును. సంతానవతి యయిన యువతి పండ్రెండు సంవత్సరములు గడుపవలయును.

"భర్త క్షత్రియుఁ డయినచో భార్య ప్రాణమున్నంత కాలము వేచి యుండవలయును. కాని వంశ విచ్చిన్నమును దొలఁగించుట కొఱకు సవర్ణుఁడగు ద్వితీయభర్తను స్వీకరించినను నపవాదము నందదు”

"భర్త దీర్ఘప్రవాసమునకు వెడలినను, సన్యాసియయినను, మృత్యువునందినను సంతానవిరహితయగు భార్య ఏడు మాసములు వేచియుండవలెను. సంతానసమేతమైన పక్షమున నొక్క సంవత్సరము వేచి యుండవలెను. ఈ కాలపరిమితి దాఁటిన పిదప స్త్రీ తనభర్త కనిష్ఠసోదరుని లేకున్న తనభర్త గోత్రములోని వానిని పునరుద్వాహమున స్వీకరింపవచ్చును. " అని అర్థశాస్త్రము వక్కాణించుటం బట్టి పురుషులకుం బలె స్త్రీలకును చంద్రగుప్తుని కాలమున పునర్వివాహ విషయమున స్వాతంత్ర్య ముండెనని తెల్లమగుచున్నది,

దాంపత్యవిమోచనము.

చంద్రగుప్తుని కాలమున మనమిప్పుడు మనదేశమున విననైన వినని యొక యాచార ముండెడిది. ఆ యాచారము దాంపత్య విమోచనము. భార్యాభర్తలు పరస్పరము స్నేహభావము కుదుర్చుకొనలేనిచో విధ్యుక్తముగ జరిగిన వివాహం బైనను నిర్బంధము గాదనుట యీ యాచారముయొక్క ముఖ్య ప్రయోజనము. ఇట్టి యచార మిప్పుడు విశేషముగఁ బాశ్చాత్య దేశములయందు ప్రబలియున్నది. అమెరికారాష్ట్రమునందు మితిమీరిపోయి యున్నది. చీటికి మాటికి భార్యాభర్తలు న్యాయస్థానముల కెక్కి యొకరిపై నొకరు అభియోగములనుదెచ్చి వివాహ బంధమును ద్రెంచుచున్నారు. ఇట్టి యనర్థముల కాకరమగు నీ యాచారము పలువురిచే ఖండింపఁబడు చున్నది. అయిన నిది చంద్రగుప్తుని కాలమున నేపగిది వ్యవహారము నందుండెనో కనుంగొనిన యెడల విభేదము తేట పడఁ గలదు.

భర్తపై విద్వేషముగలిగిన స్త్రీ, ఏడుమాసముల కాలము అలంకారాదుల పొంతఁబోక కాలము గడుపవలెను. తరువాతఁ దనకు భర్తయిచ్చిన నగలను శుల్కమును సంపూర్ణముగ నాతని స్వాధీనముచేసి ఆతనికి మరియొక భార్యను స్వీకరింప ననుమతినియ్యవలెను. భర్త భార్యపై విద్వేషము కలవాఁడయినచో భార్యను భిక్షుకుల 1[2] గృహములనో బంధువుల యింటనో పోషకులయింటనో శరణమంద ననుజ్ఞ నీవలెను. పురుషుఁడు తన భార్య పై అన్యాయముగ నేరముమోపి ప్రత్యక్షసాక్షులచేఁ గాని నిర్థారణ కాఁజాలని దుష్కార్యముల నామె కారోపించిన యెడల నతఁడు పండ్రెండు పణములు అపరాధము నిచ్చుకొను చుండెను. భార్య భర్తయందు విద్వేషము కలదైనను అతని యిష్టము లేక వివాహబంధ వినిర్ముక్త కాఁ జాలదు. ఇదే విధముగ భర్తయు భార్య కిష్టములేనిచో వివాహ బంధమును ద్రెంచుకొనఁగూడదు. కాని పరస్పర విద్వేషముండిన యెడల దాంపత్యవిమోచనము కల్పించుకొనవచ్చును. భర్త భార్య వలన అపాయము కలుగుసని భయమంది అభయాతిశయంబుచే విమోచనము గోరుపక్షమున నాయమకు చెందవలసిన సర్వస్వమును నతఁడిచ్చి వేయవలెను. భార్య భర్తవలన అపాయమునకు జడిసి ఆ యపాయమునుండి తప్పించుకొనుటకు విమోచనమును ఆశించినచో నామె యేవిధమగు ధనమునకు గాని ఆస్తికిగాని హక్కుగలదికాదు.

ఈ దాంపత్య విమోచనాచారము మొదటి నాలుగు తెఱంగుల వివాహములకును నిషేధింపఁబడియున్నది. బ్రాహ్మము ప్రాజాపత్యము, ఆర్షము, దైవము అనునియ్యవి ఆ నాలుగు తెఱంగులు. సాలంకార కన్యాదానమునకు బ్రాహ్మమని పేరు.2[3] శుల్కాది విరహితంబుగఁ గన్యాదానం బొనర్చుట ప్రాజాపత్యము నాఁబరగు.1[4] ఒకటి లేక రెండు జతల యావులం గొని కన్యనిచ్చుట ఆర్షమనంబడు 2[5] యజ్ఞమున ఋత్విక్కునకుఁ గన్యాదానము సేయుట దైవము3[6] అనంబడియెడి, రజస్వలానంతర వివాహములు సామాన్యములయి యుండినందున నీ నాలుగు విధముల యుద్వాహములయందును కన్యకకు కన్యయొక్క తలిదండ్రులకును వారివారి స్వాతంత్ర్యంబుల నుపయోగించుకొని తమలోఁ దామాలోచించుకొని వధూవరులకు సౌఖ్యావహంబగు విధంబున వివాహములు నడుప వీలుండెను. ఈవివాహము లిట్లు ఆలోచితములయి లోభాదిదుర్గుణవ్యాపార విదూరంబులగుటచేత వీని విషయమున విమోచన విధులు అనావశ్యకము లయ్యెను. తక్కుంగల వివాహము లన్ననో చూడుఁడు,

గాంధర్వము : యియ్యది కన్యాపురుషు లొండొరులను జూచుకొనినంత మాత్రనఁ బెండ్లి చేసికొనుట. 4[7] ఇట్టి వివాహము భ్రమ కాకరంబుగదా. వినికిడి మాటలవలనను ఆకస్మిక దర్శనము వలనను ఒక్కరినొక్కరు ప్రేమించిన నా ప్రేమ కొన్ని సందర్భముల గ్రమక్రమముగ క్షీణించి దాని స్థానమున నసహ్యత నా దేశంబగుట సర్వజనవిదితము. అట్టి సందర్భముల బంధవిమోచనమునకు మార్గము లేకపోయిన ననర్థములు వాటిల్లును గదా!

ఆసురము:1[8] ఈ తెగ పెండిండ్లు నేఁటికిని మనదేశమునఁ గానవచ్చుచు మన సంఘాభివృద్ధికి వేరుపురువులై పరిణమించు చున్నవి. ధనాశాపిశాచము పీడింపఁ గన్యాశుల్కము పుచ్చుకొని తలిదండ్రులు మాంసవిక్రయ మనియైన వెనుదీయక తాము గడుపార కన్న బిడ్డలను అమ్మివేయుటను మన ధర్మకర్తలు ఒక విధమగు వివాహముగ వర్ణింపక తప్పనందుల కెంతయుఁ జింతిల్లవలసి యున్నది. అయిన వారిడిన పేరు మాత్రము ఈ వినాహముల నెంతవఱకు ఖండింపవలెనో యంతవఱకును ఖండించుచున్నది. ఇట్లు దుష్టమగు వివాహంబు గావున దీనికి విమోచనం బవసరమని వేరుగఁ జెప్పఁబనిలేదు. కులగోత్రములను స్థితిగతులను రూపారూపంబులను ఆరోగ్యా నారోగ్యంబులను యౌవన వృద్దాప్యంబులను యోగ్యతా యోగ్యతలను విచారింపక భర్తను గట్టిపెట్టిన నాతఁడు దుర్మార్గుఁడో షండుఁడో యైన భార్య యేమిచేయవలయును? అతనిం బరిత్యజింప వలసినదేగదా! ఈ కన్యాశుల్కాచారపు దుష్ఫలంబులను మాన్పుటకు నిప్పుడు మనదేశంబుస దాంపత్య విమోచన స్మృతియొండు చంద్రగుప్తుని కాలంబునందువలెఁ గల్పించిన శ్రేయోదాయకం బగునని తోఁచెడిని. రాక్షసము : యుద్ధమునందు కన్యయొక్క బంధువుల నోడించి కన్య నెత్తుకొని పోవుటకు రాక్షసమని పేరు. 1[9] రుక్మిణీ కృష్ణుల వివాహ మీ తెఱంగుది. పూర్వము ఈ విధమగు వివాహములయందు కన్యాపురుషులకుఁ బరస్పరానురాగము విస్పష్టముగఁ గానఁబడుచున్నది. అది యుండినను గాంధర్వ వివాహముతో నిదియును సామ్యముకలదియే కాన దీనను భ్రమాదుల కాస్పదంబుగలదు. ఒక వేళ నిందు కన్యక కనురాగము లేకుండుటయుఁ దటస్థింపవచ్చును. అప్పుడిది గాంధర్వంబున కంటె దూష్యంబయ్యెడు. కావున నిద్దానికిం గూడ విమోచనస్మృతి.

పైశాచము : ఇది వివాహములయం దధమము. కన్య కిష్టములేకయే ఆమె నిదురించుచుండఁగనో మైమఱచి యుండఁగనో మనోవికలత్వమంది యుండఁగనో ఆమెపైబడి వరుఁడు ఆమెను లోఁబఱచుకొనుట పైశాచ మనంబరగు. ఇద్దానిని వివాహవిధులలో మన ధర్మకర్త లేల చేర్చిరో తెలియ రాకున్నది. 2[10] ఈ బంధమునకు విమోచన మవసర మని వేరుగ వ్రాయవలెనా ! వట్టి విమోచన మొక్కటియెగాక కామాంధకార సంజనితదు శ్చేష్టాలంకృతుండయి ఈ విధమగు వివాహంబు నాశించువరునకు నుచితంబగుఁ గఠిన శిక్షాస్మృతియుం గూడ యత్యంతావశ్యకంబె. అయిన చంద్రగుప్తుని కాలంబున నా శిక్షాస్మృతి మాత్ర ముండినట్లు గానరాదు.

ఎనిమిది విధముల వివాహములను జర్చించి పైనివ్రాసిన విషయములు వాకొనిన పిదప చంద్రగుప్తుని కాలమునఁ బ్రచారమునం దుండిన దాంపత్యవిమోచన చట్టముయొక్క లాభా లాభము లిట్టివని మా చదువరులకుఁ బ్రత్యేకించి నివేదించుకొనఁ బనిలేదు.

చంద్రగుప్తుని కాలమున మఱియొక చిత్రము కలదు. ఆస్తి విభాగములు చేసికొనుటకు హక్కుదారు లెల్లరును యుక్తవయస్కు లయియే యుండవలెను. యుక్తవయస్కులు గాని హక్కుదారులుండి వారికి యుక్తవయస్సు రాకముందే విభాగములుగ తీర్మానము చేయఁబడినచో వారికి అప్పులతో సంబంధము లేకుండెను. ఆస్తికి మాత్రము వారు హక్కుదారులే గాని అప్పులకు వారు ఉత్తరవాదులు గారట! 1[11]

  1. 1. ఈ శుల్కము నిప్పటి కన్యాశుల్కముగదా యని యెంచఁబోకుఁడి. ఆపత్కాలమున స్త్రీలకు ఉపయోగవడుటకయి వివాహసమయముల వరుఁడు ఇచ్చు ద్రవ్యరూపమగు ఆస్తికి శుల్కమని పేరు. ఆభరణరూపముగ నొసంగు ఆస్తికిని వృత్తిరూపముగనిచ్చు ఆస్తికిని స్త్రీధనమని పేరు. శుల్కమునకును స్త్రీధనమునకును భార్య సంపూర్ణస్వతంత్రురాలు. దుర్భిక్షములను, దానధర్మములకును, రోగనివారణార్థమును, ఆపత్సమయములను నీ శుల్కమును స్త్రీధనమును వినియోగించుకొనుటకుఁ గొంతవఱకు భర్తకునుగూడ స్వాతంత్ర్యముండెడిది ఇప్పటి శుల్కచ్చాయయు నచ్చటచ్చటఁ గానవచ్చునదిగాని ఈ విషయ మింకను శోదనీయము.
  2. 1. వైరాగ్యవంతులగు స్త్రీలు.
  3. 2. బ్రాహ్మోవివాహ ఆహరావదీయతే శ క్త్యలంకృతా (యాజ్ఞవల్క్య1-58)
  4. 1. "సహోభౌచరతాంధర్మమితి వాచానుభాష్యచ కన్యాప్రదావమభ్యర్బ్యం ప్రాజాపత్యో విధిఃస్మృతః " మనుస్మృతి 3 . 30.
  5. 2. ఆదాయార్షస్తు గోద్వయం — యాజ్ఞవల్క్య 1-58.
  6. 3. యజ్ఞ వ్య ఋత్విజే దైవ:- - - యాజ్ఞవల్క్య 1 - 58
  7. 4. గాంధర్వః సమయాన్మిథ:-- యాజ్ఞవల్క్య. 1.81,
  8. 1. అసురో ద్రవిణాదానాత్ యాజ్ఞవల్క్య 1-81, మనుస్మృతి 3 - 33
  9. 1. రాక్షసోయుధ్ధహరణాత్ : యాజ్ఞవల్క్య 1-61, మనుస్మృతి 3-33
  10. 2. మస్తాం మత్తాం ప్రమత్తాం హరహోయత్రోపగచ్చితి వపాపిష్ణోవివాహానాం పైశాచశ్చాష్ట మో ఆధమః మనుస్మృతి 1-34
  11. 1. అర్థశాస్త్రము పు. 3. అ. 5.