చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/మా చిట్టి
స్వరూపం
మా చిట్టి
ప్రొద్దున్నె మాచిట్టి నిద్రలేచింది
నిద్రలేచీ చిట్టి మొగము కడిగింది
గోమయము తెచ్చింది గొబ్బిచేసింది
గొబ్బిచుట్టూ తిరిగి పాట పాడింది.
గొబ్బిదేవీ తల్లి ఓ గొబ్బిదేవీ
చేమంతి పూవంటి చెల్లి నివ్వావే
తామరాపూ వంటి తమ్ము నివ్వావే
మల్లెపువ్వూ వంటి మరది నివ్వావే
బంతిపువ్వూ వంటి బావ నివ్వావే
మొగలిపువ్వూవంటి మగని నివ్వావే.
తలుపుచాటున నక్కి బావ విన్నాడు
పకపకామని బావ పగలబడ్డాడు
ఇదియేమె మరదలా యిట్లు కోరేవు?
మొగలిపువ్వూ వంటి మగని కోరితివి
ముళ్లతో గీరేను నా వళ్లు సుమ్మి!
ఆమాట వినగానె మా చిట్టికపుడు
సిగ్గొచ్చి పరుగెత్తి తల్లిదగ్గరకు.
సంపాదన: చుండూరి రమాదేవి. ఏలూరు.