చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/నా ఆత్మ కథ

వికీసోర్స్ నుండి
ముఖచిత్రం

మీకు నేను ప్రతిరాత్రీ ఒకేవేళకు కనిపించను. అప్పుడప్పుడు అసలురాను. అందువల్ల నేను మంచివాడిని కానని అనుకొనేరు. తల్లితండ్రులంటే నాకు భయభక్తులున్నాయి. చదువుసంధ్య లేకుండా నేను అల్లరిచిల్లరిగా తిరగటం లేదు. నిజంగా నాకధతెలిస్తే ఇలా ఎందుకు జరుగుతున్నదో మీకే తెలుస్తుంది. నామీద మీకు అంత అపనమ్మకం ఉండదు. నాకు ప్రతిరోజూవచ్చి మీతో ఆడుకోవాలనేఉంది. మీకు ఎన్నోకధలు చెప్పాలనీ ఉంది. కాని ఏమిచెయ్యను?

చాల ఏళ్లకిందట, - లక్షలు, కోట్ల సంవత్సరాల క్రిందట, అప్పటికి మనిషి ఇంకా పుట్టలేదు; జంతువు పుట్టలేదు; చెట్టు పుట్టలేదు; నీళ్లుకూడాలేవు. అప్పుడు మా అమ్మ నన్ను కన్నది. మా అమ్మను మీ రెరగరూ? మీ రుంటున్నది మాఅమ్మ ఒళ్లోనేగా. భూదేవి మా అమ్మ, మా అమ్మ సూర్యునికూతురు. మా అమ్మ చిన్నప్పుడు మాతాత సూర్యుడిలాగా ఉండేదట. నేనుకూడా ఎరుగుదునుగా; నా చిన్నతనంలో మా అమ్మ ఎలా ఉండేదని! నా కళ్లుకూడా సరిగా చూడ నిచ్చేవికావు. మా అమ్మ పుట్టినప్పటి నుంచి గిరగిరా గిరగిరా మా తాత చుట్టూ బొంగరాలు తిరుగుతూ ఆడుకొంటూ వుండేది. ఆనాటి ఆటలే మా అమ్మకు ఆచారమైపోయింది. ఏదన్నా మానుతుందేమోకాని మా అమ్మ ఆ అలవాటు వదిలిపెట్టదు.

ఇలా ఉండగా నేను పుట్టాను. పుట్టి కాలు వచ్చింతరువాత ఒకచోట ఎలా కూచుంటాము. కాలుచేతులు ఊరుకోనిస్తాయా? నేనూ మా అమ్మకొంగు వదిలిపెట్టకుండా ఆమెచుట్టూ అల్లాబిల్లీ

తిరిగేవాణ్ణి. చుక్కలు ఎంతో ప్రేమతో పిలిచేవి కాని నేను మా అమ్మను వదలిపెట్టేవాణ్ణికాను. చుక్కమ్మలు నన్ను ఎగతాళిచేసేవి. నేను ఆడంగి వాడిననీ, అమ్మ కొంగు వదిలి పెట్టననీ. ఆ రోజుల్లో నేను మాతాత సూర్యుడిలాగా వుండేవాణ్ణి. అందుకని అందరూ నన్ను ఎత్తి ముద్దులాడ పిలిచేవాళ్ళు. మా అమ్మకు నన్నుచూస్తే ఎంతో సంతోషం. నా ఆటపాటలకు మురిసి చక్కని అద్దం ఇచ్చింది.

మీకు అద్దంఇస్తే ఏం చేస్తారు? ముఖం చూచుకోరూ? నేనూ ఆపొరపాటే చేశాను. అద్దంలో చూచుకున్న కొందికి నాముఖం నాకే ఎంతో అందంగా కనిపించసాగింది అలా చూచుకొంటూ వుంటే ఇక ప్రపంచములో మరోటి అందమైనది ఉన్నట్లే కనిపించేది కాదు. అందువల్ల ఎప్పుడూ అదేపనిగా నన్ను నేను అద్దంలో చూచుకొనేవాణ్ణి. మా అమ్మ చివాట్లు పెడుతూవుండేది. నేను వింటేగా? ఇలా చేయగాచేయగా కొన్నాళ్ళకు నాకాంతి అంతా పోయింది. ముఖం మాడిన అట్ల పెనంలాగా అయిపోయింది.

నాకు పుట్టెడు ఏడుపు వచ్చింది. చుట్టూచూచాను. చుక్కలు మిలామిలా మెరుస్తున్నాయి. ఎదురుగాచూచాను

మాఅమ్మ జ్యోతిలాగా వెలిగిపోతున్నది. మాఅమ్మకు ప్రక్కగా చూచాను. మా తాత ఎలావున్నాడని? చూడటానికి కళ్లు చాలకుండా ఉన్నాయి. నన్ను నేను చూచుకొన్నాను. నాఒళ్లు నాకే కనిపించలేదు.

నాకు పట్టరాని యేడుపు వచ్చింది. పోయినకాంతి ఎలా తిరిగి సంపాదించటం? ఆలోచించాను, ఏమీ పాలుపోలేదు. దిగాలుపడి కూర్చున్నాను. అప్పుడే ఆకాశంలో చుక్కమ్మ కిటికీ మిలమిల లాడింది. చప్పున ఒక ఉపాయం తోచింది. అక్కడనుంచి ఒక్క గంతులో పోయి చుక్కమ్మ ఇంటి తలుపు తట్టాను. ఆమె తలుపు తీయకుండానే "ఎవరది, ఎందుకొచ్చావు" అని కిటికీలోనుంచే గద్దించింది.

"నేనే, చుక్కమ్మా, చందమామను. కాస్త వెలుగు పెట్టవూ?" అన్నాను.

"ఫో, ఫో! ఇప్పుడు కావలసివచ్చానేం నేను? నల్లటి అట్ల పెనంమొహమూ నువ్వూ?" అని కసిరింది.

మీ అక్కయ్య బొమ్మ యియ్యక కరిసితే ఎలావుంటుంది? నాపనీ అంతే అయింది. కాళ్ళీడ్చుకొంటూ ఇంకొక చుక్కమ్మ యింటికి వెళ్ళాను.

"ఇక్కడ మాకే లేకపోతే నీ మొహానికెక్కడ ఇవ్వమంటావు, వెలుగు ?" అని మూలిగింది ఆమె. తతిమ్మా చుక్కమ్మలూ యిలాగే అన్నాయి. ఇక ఏమిచేసేది? బావురుమని ఏడ్చాను.

అప్పుడే మాతాత సూర్యుడు జఞాపకం వచ్చాడు. వెంటనే ఒక్కగంతులో మా తాతయ్య యింటిముందు వచ్చిపడ్డాను. కాని లోపలికివెళ్ళటం ఎట్లా? తలుపు తీదామంటే చేతులు కాలిపోవూ? అంతగా మా తాతయ్య యిల్లు వెలిగి

పోతున్నది. నేను ఏడుస్తూ అక్కడే నుంచున్నాను. అంతలో మా తాతయ్య ఏడుగుఱ్ఱాల బండిలో వస్తూ నన్ను చూచాడు.

"నాయనా ఎందుకోయి ఏడుస్తున్నావు? నాకు చెప్పవూ? నీకేమి తక్కువ," అన్నాడు.

"తాతయ్యా, నాలోని మంటలన్నీ ఆరిపోయాయి. వెలుతురంతా పోయింది. నాకన్నా చుక్కలే బాగున్నాయి. ఈ మాడుచెక్కముఖంతో మీఅందరిమధ్య ఎలావుండేది? తాతయ్యా, తాతయ్యా! నాకు కాస్త వెలుగివ్వవూ," అని జాలిగా అడిగాను.

తాతయ్య ఆలోచించి ఆలోచించి చివరికి అన్నాడు: "నువ్వుచాల పెద్దపొరపాటు చేశావురా. మీ అమ్మ యిచ్చిన అద్దం సరిగా వాడుకోలేక చెడిపోయావు. ఆ అద్దం పెట్టిచూస్తే ఎన్నిరంగులు కనిపించేవి! ఎంతప్రపంచం కనిపించేది? ఎన్నివిచిత్రాలు కనిపించేవి! సరే జరిగిందేదో జరిగింది. ఇకమీదనన్నా నేను చెప్పినట్టుచెయ్యి. నీ అద్దం ఉంది చాశావూ? దానిమీద ఎప్పుడూ నాకాంతి పడుతూ ఉండేటట్టుగా పట్టుకో. ఆ అద్దంమీది వెలుతురు నీ ముఖానికి తిప్పుకో. అప్పుడు నీముఖం తెల్లగా ఉంటుంది." అన్నాడు.

అప్పుడు నాకు ఎంత సంతోషం కలిగిందనుకొన్నారు. నాటినుంచి మా తాతయ్య చెప్పినట్టు చేస్తున్నాను. ఆయన వెలుగును నా అద్దంలోపట్టి నావైపుకు తిప్పుకుంటూవుంటాను. నాముఖం మళ్ళీ ప్రకాశించ మొదలుపెట్టింది. అయితే అప్పుడప్పుడు మాఅమ్మ నా అద్దానికి మా తాతయ్యకు అడ్డం వస్తుంది. అందువల్ల మీకు సరిగా వేళకు కనిపించలేక పోతున్నాను. అంతేగాని మరేమీ లేదు.