Jump to content

ఘటికాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ఘటికాచలమాహాత్మ్యము

ప్రథమాశ్వాసము

శ్రీలన్ రాజిలు నైమిశమ్మునఁ [1]దపస్విశ్రేణి [2]పౌరాణిక
త్వాలంకారసమేతు సూతుఁ గని పద్మాధీశ [3]సద్మమ్ములన్
శ్రీలీలానిరవద్య మాద్యము మరుత్సేవ్యంబు భవ్యంబుగా
నాలోకించి యొకండు గల్గిన మహత్మా తెల్పవే - నావుడున్.

1


క.

వినుఁ డిందులకు న్నారద
ముని భృగు సంవాద మాత్మ ముద మొదవించున్
మునులార! మీకు నేనది
వినుపింతుం దెలిసినంత విస్ఫుటఫణితిన్.

2


సీ.

శశికరద్రుతసార శశికాంత వాఃపూర
పరితఃప్రపూరితపరిసరంబు
జలచరాశనకేళి జలచరద్విహగాళి
కలరవోద్ధత కలకల ధురంబు
సురమునీశ క్షమాసుర దుర్లభాతిమా
సర ముక్తిమౌక్తిక సరవరంబు
కమనీయ మకరంద కమల కైరవబృంద
పరిలసద్రోలంబ[4]పరికరంబు
ఘటితకిసలయసమజటానిటలపటల
ఫలక తిలకిత శశిసిత భసిత లసిత
రసిత పరమ సమాధిమద్విసర రుచిర
రసఝరభరంబు వొల్చు మానససరంబు.

3


ఉ.

శ్రీకరలీలఁ గంకణపరిష్కృత మంబుధిఠేవ నిత్యము
క్తాకలితంబు రామకధకైవడి జారుమరుత్కుమారవా

ర్తాకర మాదితేయగిరిదారి లసత్సుమనోభివృద్ధి లం
కౌకమురీతిఁ బుణ్యజనతాశ్రయ మా సర మొప్పు నెప్పుడున్.

4


సీ.

కలహంస పరిధూత[5]గరుదువ్యదబ్జస
రాగంబు పటవాసరజము గాఁగ
ఉదబిందు మౌక్తికయుత పత్ర[6]పుటహల్ల
కములు రత్నారాత్రి[7]కములు గాఁగ
[8]కరువలి నెగసి యుప్పరమున నొప్పు పు
ప్పొడితెప్ప యుల్లడ పొలుపు గాఁగ
తేటిపూబోఁడులపాట ముత్తైదువల్
పచరించు సోబానపాట గాఁగ
ఖగవిరావంబు ద్విజమంత్రకలన గాఁగ
[9]రాలుకేసరములు తలఁబ్రాలు గాఁగ
పద్మినీ పద్మినీమిత్ర పరిణయంబు
గరిమదగు నల యంబుజాకరము కరము.

5


క.

ఆమానససరసీతట
భూమిన్ భృగ్వాశ్రమంబు వొలుచున్ తీర్థ
వ్యామోహ గతాగత సక
లామర మౌనీంద్ర సముదయాధారం బై.

6


సీ.

వాలసంచాలనోద్వేలత చమరీమృ
గమ్ములు సమ్మార్జనమ్ము సేయు
తుండసంభృతతీర్థకుండోదకమ్ముల
గలభముల్ [10]కలయంపి గలయఁ జల్లు
పచ్చికస్తురియసల్ దెచ్చి భల్లూకముల్
గోముఖశ్రీఁ బాదుకొనఁగఁ జేయు
కరికుంభ[11]గలిత ముక్తాఫలమ్ములు దెచ్చి
శుకములు రంగవల్లికలు దీర్చు

వెన్ను డాకన్ను తమిఁదమి విడక మున్న
దినదినమ్మును నచట నుదీర్ణ పర్ణ
శాలికామాలి కాళింద సరణి నరణి
మత్కుల కులాంగనలకు సమ్మదము [12]పొదల.

7


మ.

శుకముల్ ప్రామినుకుల్ గుణించు గణియించున్ ధర్మమర్మేతిహా
స కథల్ శారిక లీరికల్ గొనుమనీషన్ శేషభాషావిశే
ష కళాశాస్త్ర ముపన్యసించు [13]పికముల్ సాత్రాజితీప్రాణనా
యక నామాళి వళుల్ పఠించు [14]సతతోద్యద్గీతికాచాతురిన్.

8


క.

ఒక చిత్ర మచటి[15]జటిపా
ళికి మున్ సంజలను గ్రుంకి లేచి సమాధిన్
సకలశకుంతంబులు తా
రకమంత్రోచ్చారణాభిరతి మతిఁ బొదలున్.

9


ఉ.

అమ్మునిబాలకుల్ ఫలదశాదులకై వనిజుట్టుచో నహీం
ద్రమ్ములు చేరి యెండకు ఫణంబులు చాటుగఁ జేయ నంతలో
నెమ్ములు వచ్చి సాములకు నే మొనరించిన నేర మేమి న్యా
యమ్ములె [16]మీపనుల్ దలఁప? నంచు దరిం [17]బురివిచ్చు నీడగన్.

10


మ.

పులు [18]లేదున్ మృగశాబకంబుల హరుల్ పోషించు నత్యాదృతిన్
కలభానీకముఁ గాకముల్ మెలఁగు ఘూకశ్రేణితోఁ బిల్లు లె
ల్కలఁ గాచున్ శిఖికోటి లేఁ [19]జిలువలన్ లాలించు [20]నుత్ఫుల్లబ
ర్హ లసచ్ఛాయలనుంచి యచ్చటియరణ్యానీప్రదేశంబు[21]లన్.

11


క.

ముని హోమానల ధూమము
వినువాకం గ్రుంకి వెడలు విబుధవధూటీ
జనముల నెఱిముంగురులం
దనరున్ [22]సాంబ్రాణి ధూపధారారీతిన్.

12

సీ.

మొకరితేఁటులు మూతిముట్టవు తేనియల్
శ్రీ మధుశాసి కర్పించి గాని
కోకిలమ్ములు చివురాకులు గొఱకవు
శ్రీ వనమాలి కర్పించి గాని
లేఁబచ్చికల్ గబళింపవు హరిణముల్
శ్రీ నీలమూర్తి కర్పించి గాని
ఫల భుజిక్రియలకుఁ జిలుకలు దలఁపవు
శ్రీ మాధవునకు నర్పించి గాని
యితరజంతువులును హరి మతిఁ దలంచి
గాని యే వర్తనములకుఁ బూన వనిన
నా తపోవన హాత్మ్య మభినుతింప
నలవియే వేమొగమ్ముల చిలువ కైన.

13


క.

ఆ సాధుస్తుత్యాశ్రమ
వాసమ్మున భృగుమునిప్రవరుఁడు వసించున్
శ్రీసఖచరణధ్యానా
భ్యాసకళాకాంతుఁ దాపసావళితోడన్.

14


సీ.

కటికియెండలకాఁకఁ గరఁగి గుబాళించు
గోవజవ్వాజి నెత్తావులకును
కమ్మతమ్ములతావి కానుక [23]సేయుచు
సొలయు చల్లని గాలిసోకులకును
వట్టి మ్రాకుల ననల్ పుట్టింపజాలిన
కిన్నరయువతి సంగీతములకు
బిసకాండములు మేసి కొసరుచుఁ బల్కు జ
క్కవకవ కలయిక కాన్పులకును
కలికిపలుకుల రాచిల్కగముల మధుర
మేదుర రసాలఫల రసాస్వాదములకుఁ
జెదరనీయక యింద్రియశ్రేణి నిలిపి
యతఁడు శ్రీహరి భజియించు నవసరమున.

15

సీ.

శరదంబు దోపరి చపల నాఁ శిరమునఁ
బటుజటాపటలమ్ము పటిమఁజూప
కల్పకశాఖి శాఖామంజరీ లీల
డాకేల మణి [24]కమండలువు మీఱ
నిటలలోచనశైలతట నీరదాకృతిఁ
గటితటి నజినమ్ము కాంతిఁ బెనుప
ఆకృతి దాల్చిన యక్షరావలి యన
శ్రవమున స్ఫటికాక్షసరము దనర
విష్ణునామానుకీర్తిఁ బవిత్రయగుచు
మారుతాహతిఁ దనుదాన మహతి మొఱయ
వచ్చె తనుకాంతినిర్జితపారదుండు
నారదుఁడు భ క్తజనసస్య నారదుండు.

16


క.

ఇటువలె వచ్చిన నారద
జటి కాతిథ్యాదివివిధసత్కృతు లెల్లన్
ఘటియించి మదిని ముదమం
దుటఁగని భృగుమౌని యతనితో నిట్లనియెన్.

17


క.

నారద [25]హృదయాంతరలీ
నారద మోక్షాతిదుర్విధావలివిద్దీ
నారద రుచిజితశారద
నారద హరిచరణభక్త నారదయాఢ్యా.

18


ఉ.

పుష్కరముఖ్యతీర్థములఁ బొల్పగుధర్మము లామహత్త్వముల్
పుష్కలవిష్ణువాసముల పూజ్యవిచిత్రచరిత్రముల్ గుణా
విష్కృతవైష్ణవోత్తమ పవిత్రవిశేషకథల్ మహాత్మ! నా
దుష్కృతముల్ దొలంగ దయతో సకలంబును నాన తియ్యవే.

19


క.

ఎచ్చోటనుండి వచ్చితి
రిచ్చటికి మదీయభాగ్య మేమని పొగడన్
వచ్చు నని పలుకునంత వి
యచ్చరముని [26]యిట్టులనియె నాతని తోడన్.

20

సీ.

ఘనరత్నరాశి కాకరము వియచ్చర
మానినీజనననిదానభూమి
సంతానభూరుహసమితికి నెలవు నా
రాయణ యోగనిద్రాస్థలంబు
వనజవాసినికిఁ బుట్టినయిల్లు దేవతా
విసరమ్మునకు మహానసగృహమ్ము
ద్వీపసంతతికి [27]బెన్ప్రాపు తరంగిణీ
భామినీమణులకుఁ బ్రాణభర్త
కలువనెచ్చెలికానికిఁ గన్నతండ్రి
గట్టుపట్టికి ధృఢవజ్రకవచ మగుచు
వెలయు పగ్గంపుకగ్గంపువిప్పుగంటి
సామినగరంబు ధర క్షీరసాగరంబు.

21


క.

ఆతంక పంకశంకా
పేతంపై నిత్యసత్యహితపూతంబై
[28]శీతాతపసహయోగి
స్ఫీతంబై తెల్లదీవి చెలఁగును దానున్.

22


క.

శ్రీకరమగు నద్దీవిన్
లోకాతీతానపాయనూత్నప్రభమ
స్తోకప్రభావకలితము
వైకుంఠపురంబు సిరుల వఱలు న్మిగులన్.

23


సీ.

హాటక హరినీల ఝాట ప్రదీప్త సా
లములచే నమర సాలములచేత
మందర కుధరోపమానిత సౌధ
తతులచే యోగిసంతతుల చేత
కమలకైరవభాస్వదమృత సరోవితా
[29]నములచే సుర విమానములచేత

రాకాసుధాకర రాజన్ముఖ వధూత్క
రములచే మణిమందిరములచేత
సతత కిసలయ సుమఫలసహితమహిత
వనులచే దివ్యలోకపావనులచేత
వఱలు శాశ్వత లబ్ధాపవర్గయోగ్య
భాగ్యనికరంబు వైకుంఠపట్టణంబు.

24


సీ.

నును గాలిదూదిపానుపు లెన్నియో కాని
యందఱు శయనీకృతాహివరులు
సురలోకివాహినిర్ఝరము లెన్నియొ కాని
యందఱు దివ్యతీర్ధాంబుపదులు
నీట జనించు మానికము లెన్నియొ కాని
యందఱు కౌస్తుభహారయుతులు
చలి వేఁడి వెలుఁగుల సాము లెందఱొ కాని
యందఱు నిందు కంజాప్తదృశులు
ఖగకులాధీశు లెందఱు కలరొ కాని
యందఱును పుల్గురా టెక్కియములవారు
నాఱు వోసిన రీతి నున్నారు ధీరు
లన్నగరియందు కాపురంబున్నవారు.

25


ఉ.

అందొక కేళికామణిగృహమ్మున తారకకాంతకాంతశ
య్యం దగ నిందిరాసరసిజాననఁ గౌఁగిటనాదరించి యా
నందరసాబ్దిఁ దేలుచు ననారతమున్ సనకాదియోగిరా
డ్బృందము గొల్వ నున్న యఖిలేశ్వరభావుని వాసుదేవునిన్.

26


క.

సేవించి తత్పదార్చన
గావిం చిలఁ గలుగునట్టి కమలాధిప లీ
లావాసంబులు జూచితి
నావుఁడు నవి దెలుపుమనిన నారదుఁ డనియెన్.

27


మ.

ఉపధానీకృత హస్తతామరస సంయుక్తోత్తమాంగంబు ప
ద్మపుటాంతర్నివషనన్మద[30]భ్రమరరమ్యంబై విరాజిల్ల భ

క్త పరాధీనత లంక దిక్కు మొగమై కాకోదరాధీశశ
య్య పయిన్ భాసిలురంగధాముని సహస్రాదిత్యభాధామునిన్.

28


సీ.

ఉపధానిత కరస్థితోత్తమాంగోత్తుంగ
ముకుట రత్నప్రభల్ రకముఁజూప
బ్రహ్మపేటీపుష్కరక్రోడ మదభృంగ
దంగంబు శృంగారభంగిఁదనర
రమ వంతునకు వచ్చు క్షమ లీల కప్పుడా
ల్మచ్చ పేరురమున ఱచ్చ సేయ
కౌస్తుభ గ్రైవేయ కనకకుండలహార
కేయూరకాంతులు క్రేళ్ళు దాట
సహ్యకన్యాతటోత్తాలసప్తసాల
రంగదామ్నాయశృంగైకరంగగేహ
శేషశయ్యను బవళించి [31]శ్రితులమనుచు
రవిసహసప్రభాదాము రంగధాము.

29


గీ.

అచటి కీశానహరిదంతలాగ్రవీథి
నందమైతగు తిరువాళురందధామ
మునను మునివాహనాహ్వయ మునివరేణ్యు
మనుప [32]వెలసిన యా జనార్దనుని ఘనుని.

30


గీ.

తపసిబృందంబు వెఱఁగొందఁ దపము సేయు
నల పరాశరమౌనిఁ గృతార్థుఁ జేయ
నవని సాక్షాత్కరించిన యసురహరుని
శ్రీసతీపతిఁ దంజాపురీనృసింహు.

31


క.

శ్రీమద్రంగమునకు మూఁ
డామడను గవేరజాతటాంచిత నంబి
ల్నామపురిం గనఁదగు శ్రీ
ధాముని సౌందర్యనాథు దైవతనాథున్.

32

క.

అరుదుగఁ గరంబనూరను
పురవరమునఁ బురహరాబ్జభూసుత్రాముల్
పరివేష్టింపఁగ నిలిచిన
యురు కరుణాపాంగసీము నుత్తమనామున్.

33


క.

తిరు[33]వెళ్ళరపురి శ్వేతశి
ఖరిపై నొర పైన దివిజకాంతలు గొలువన్
వర వైభవంబులును బొ
ల్చు రమాధవుఁ బుండరీకలోచనదేవున్.

34


క.

తెల్లముగఁ గుంభఘోణపు
రోల్లస దవిలాశ రెండు క్రోసుల నేలన్
బుళ్ళన్ [34]బుదకుడి నుండెడు
బల్లిదు రఘునాథు హృత కబంధ విరాధున్.

35


గీ.

ఉర్వి రంగస్థలమునకు యోజనమునఁ
బూర్వహరిదంచలమున నపూర్వమహిమఁ
దివిరి తిరుపేర్నహర్పుర దివ్యధామ
మందుఁ దగు పద్మనయను ననంతశయను.

36


గీ.

కుంభఘోణంపు వాయు దిక్కోణ భూమి
నమిత వైభవసామగ్రి నమరు [35]నాద
నూరఁ బ్రహ్లాదముఖులను గారవించు
జిష్ణు యోగీంద్రయోగవర్దిష్ణు [36]విష్ణు.

37


గీ.

కుంభఘోణంపు తూర్పునఁ గొమరు మీఱు
[37]తిరువళందూరఁ బావక దేవునకుఁ బ్ర
సన్నుఁడై యున్న దేవతాసార్వభౌము
వనజనయనుని గోపికావల్లభునిని.

38


క.

పరికించి కుంభఘోణ న
గరి కాగ్నేయాశఁ గడుఁ బ్రకాశించు చిరు

ప్పురి నున్న శేషపన్నగ
వరదున్ ఫణితల్పశాయి వైభవదాయిన్.

39


క.

వర విభవములన్ సిరిచి
ర్పురమునఁ [38]బురహరసురేశ్వరుల్ భజియింపన్
ధరకుంబ్రత్యక్షంబౌ
గిరిభరణసహిష్ణు బాలకృష్ణున్ జిష్ణున్.

40


క.

చొక్కుణ్ణూరు పురంబున
నక్కౌశిక యజ్ఞవేది యం దుద్భవమై
రక్కసులఁ దునిమి దాసుల
యక్కరఁ దీరుచు జనార్ద నాహ్వయ మూర్తిన్.

41


చ.

ఘనమగు కుంభఘోణమునఁ గాంచనపుష్కరిణిన్ జనించు కాం
చన జలజాత నాయికను సన్నుతవైఖరిఁ బెండ్లియాడి కాం
చనమునికిం బ్రసన్నుఁ డగు [39]సారసపాణిని శార్ఙపాణి [40]
న్మునివరమస్తకోపరి సముజ్జ్వలపాణిని దేవతాగ్రణిన్.

42


క.

తిరుకండియూరు నాఁదగు
పురవరమున దనుజసమితిఁ బొలియింప సురో
త్కరముల మనుప న్నిలిచిన
నరరక్షాచణుని నాదినారాయణునిన్.

43


సీ.

తిరువిణ్ణహర్పుర దివ్యధామంబున
విలసిల్లు జగదీశు వేంకటేశు
తిరుకణ్ణపురవరాంతక విమానమ్మున
నిలుచు చతుర్భాహు నీలదేహు
తిరుమంగయాళ్వారు నరయు [41]తిర్నగరి నృ
హరిని లక్ష్మీశు నారాయణాఖ్యు
తిరు వాలిమణవాళ దివ్యనామమున శో
భిలు నాగపట్టణ వేంకటేశు

తిరుణరయ్యూర దనరారు ద్విభుజ పరిఘు
పంకజ నికేతనాధీశు వేంకటేశు
మహిమ [42]నొప్పు నందిపుర విణ్ణహరనగరిఁ
జేరియున్న జగన్నాథు శ్రీసనాథు.

44


క.

తిరువిందళూర సకలా
మర పరికరముల్ తపస్సమాధి భజింపం
గరుణామతి వారలకున్
వరములొసంగిన [43]సుగంధివననాథు హరిన్.

45


సీ.

చిత్రకూటమ్మునఁ జెందమ్మి కొలని చెం
తం దనరారు గోవిందరాజు
శ్రీరామవిణ్ణహరీ పుర మేలు స
ద్భావుఁ ద్రివిక్రమ దేవదేవు
తిరుకూడలూర్పురాధిపు నుపమాతీతు
వర దయాంబుధిరాజు వరదరాజు
[44]ఖలసంహరుని తిరుక్కణ్ణంగుడి వసించు
శ్రీసౌఖ్య వర్దిష్ణుఁ జిన్నికృష్ణు
గరిమఁ తిరుకణ్ణమంగాఖ్య కటక మేలు
భక్తవత్సలదేవు దివ్యప్రభావు
హనుమమనుపం గపిస్థలమ్మునను [45]వెలయు
నింద్రశాత్రవవరదు గజేంద్రవరదు.

46


క.

భరతాద్యనుజులు సీతా
తరుణీమణి గంధవాహతనయుఁడు గొలువం
[46]దిరువెళ్ళియన్ గుడి నగరి
వెరవొప్పఁగ నేలు [47]దేవవిభు రాఘవునిన్.

47


సీ.

తిరుణాంగ[48]పత్తనాంతరసీమ [49]మాణిమా
దక్కోవెలఁ దిరువెళ్ళక్కొళంబు

తిరుమణిక్కూడవణ్పురుషోత్తమములు శం
బొజ్జె కోవెలయును బురుడు లేని
యల్ల [50]పాత్తంపల్లి యరిమేయవిణ్ణహ
రము కావళంబాడి యమితవిభవ
మహము వైకుంఠ విణ్ణహరంబు నాతిరు
త్తేవనార్తోహము సేవకనిధి
యగుతిరుత్తెత్తియంబలంబనఘవచ్చి
దా మహామహిమారీతిఁదనరి భక్తిఁ
గొలుచు దాసుల కోర్కు లీఁ[51]గోరి ధరిణిఁ
దనరు నేకాదశోజ్జ్వలధామములను.

48


క.

విలయాంబుధిమగ్న మహా
వలయంబు సముద్ధరించు వరకీర్తియె యు
జ్జ్వలమూర్తిఁ బ్రవర్తిలెనా
నలరెడు శ్రీ[52]కృష్ణదేహు నాదివరాహున్.

49


సీ.

నతజనాధారు మన్నారు కోవెల యేలు
ప్రజసంచరిష్ణు శ్రీ బాలకృష్ణు
పాపనాశనపురీ భర్మహర్మ్యంబున
వసియించు నత రాజు వరదరాజు
నలపాండ్య నలధర నలహర్తిరుమలయన్
వీటవసించు శ్రీ వేంకటేశు
తిరుకోటియూర నిందిరఁ గూడి వర్తిల్లు
కృష్ణావినుతభావుఁ గృష్ణదేవు
విపుల[53]విభుతఁ దిరుమ్మెయివిణ్ణపురము
నెలమిఁ బాలించు సత్యగిరీశు నీశు
మునులతోఁ దిరుపుళ్ళానిపురినిసలిల
ధామ దీక్షాసమున్నిద్రు రామభద్రు.

50

సీ.

దళితాఘమగు తిరుతంగాల్పురమ్మున
శ్రీయుక్తుఁడైన నారాయణవిభు
మునినుతుండై తిరుమోహూర్పురి వసించు
ఖండిత [54]చండాఘుఁ గాలమేఘు
నల దక్షిణమధురాస్థలమున భక్తపా
లకుడైన కూడల[55]వకియనాము
శ్రీమించు కురువిత్తురీ పురంబున నతి
ప్రేమ దాసులఁ బ్రోవు కృష్ణదేవు
గరిమ శ్రీవిల్లిపుత్తూర సురలు మునులు
సన్నుతులు సేయఁ జెన్నారు మన్న[56]వారు
నగణితైశ్వర్యమునఁ దిరునగరి యేలు
నాదిలక్ష్మీసనాథు నయ్యాదినాథు.

61


సీ.

తులవెళ్ళిమంగాళాద్భుతపట్టణంబున
విలసిల్లు నయ్యరవిందనేత్రు
శ్రీవరమంగపురీనాథు నతసాధు
నమృతాంబునిధితనయాసనాధుఁ
తెందిరుర్పే[57]ర్పురియందుఁ జెన్నొందు పు
రందరస్తుతుఁ [58]గేశినేందసంజ్ఞు
వైకుంఠపట్టణ [59]వాస్తవ్యు భవ్యవై
కుంఠసంధాత వైకుంఠనేతఁ
గూర్మిమీఱఁ దిరుప్పుళిగుడి పురమ్ము
భూరివైభవమున నేలు భూమిపాలు
మంగపట్టణ మణిమంటపాంగణమున
నలరు నతదేవు విజయాన నాఖ్య దేవు.

52


సీ.

నగవుఁజూపులఁ గుళిందనగరి నున్న వ
ర్ణితశౌర్యు శ్రీ నవనీతచౌర్యు

తిరుకురుంగుడి మహాపుర సౌధవీథిక
వజలు బృందారకవైరివైరి
పాలితసూరిఁ ది[60]ర్కోలూరిపురి హాస
ధవళాస్యు భక్తనిధాను శౌరి
న య్యనంతపురంబునం దహిశయ్యపై
మీఱు మురారిఁ జాణూర వైరి
సాధుజనయిత్రి[61]వన్పరిసర ధరిత్రి
వలను మీఱ వసించు శ్రీవత్సవత్సు
నా [62]తిరుక్కాత్కర పురంబు నాదరించు
నఖిలభక్తనిధాను నప్పాభిధాను.

53


సీ.

తిరుమూడికలమను దివ్యస్థలంబునఁ
గ్రీడించు నల పుండరీకనేత్రు
సుర లెన్నఁ గుట్టనాడ్తిరుపుళియూర్పుర
మున వసియించు నపూర్వనాధు
తిరుచెంగణూ ర[63]ను పురవరమ్మున నొప్పు
దివ్యభూవాస్తవ్యు దేవ సేవ్యు
నలువగొల్వ గఁ [64]దిరుణావై నగరిని వ
ర్తిలు ధీరనుతభావు దేవదేవు
వార్తకెక్కిన తిరువణ్ణ[65]వార్నగరిని
నున్న నతజనమందారు మన్ననారు
[66]నుతి యొనర్పనగు తిరువందూర్పురమున
నాత్తనరసఖ్యు నల ప్రవాళాధరాఖ్యు.

54


సీ.

అల తిరు[67]వత్తూర మను [68]పత్తనంబున
హరిశయ్యఁ దగు కేశవాభిధామ
నుత్త [69]చుక్కొండ నా నొప్పు పత్తనమున
నలరెడు నల య[70]నన్యగతినాథుఁ

బూని తిరుక్కుడిస్థానంబునవసించు
[71]నలనరసఖ్యు నారాయణాఖ్యుఁ
తిరువారనెడు పురవరమునఁ గ్రీడించు
పాలితజిష్ణు శ్రీ బాలకృష్ణు
వినుతి సేయంగఁ [72]దిరుమందివెళ్ళనగరి
దేవపతికొల్వ నున్న శ్రీ దేవనాథు
నా తిరుక్కోవలూర్నగరాగ్రసౌధ
వీథి సర్వస్వతంత్రుఁడై వెలయు కృష్ణు.

55


క.

అలకాంచితమై తనరెడు
నల కాంచి పురిన్వరించి యధ్వరవేదీ
స్థలి వెలసి కరినగంబున
నిలిచిన శ్రీ వరదరాజు నిరుపమ తేజున్.

56


క.

ఆ కాంచికా పురమ్మున
శ్రీకర వేగవతి సుప్రసిద్ధాంబువులన్
లోకములు మెచ్చ జనులకు
వే [73]కావించిన రమేశు వేగవతీశున్.

57


సీ.

పరమేశ విణ్ణహర్ప్రాంత కాంచీస్థలి
నున్న జోళా[74]ధీశుఁ జిన్నికృష్ణు
నట దిరుప్పాడహం బనునెడ వసియించు
పార్థసారథినాముఁ బద్మనేత్రు
[75]నత్తిరుతంగస్థలావాసమునఁబొల్చు
దీపప్రభావాఖిలప్రదీపుఁ
[76]గామాక్షిబిలరతింగళ్ తుండధామధా
ముఁ దదీయినాము సంపూర్ణకాము

నచటనె వెళుక్కు మను చోట నధివసించు
శ్రితజనావనకృతరంహు శ్రీనృసింహు
నంద [77]తిరువరసరమున నలరు నఘ వి
దారిఁ జోళహరందాభిధానశారి.

58


గీ.

వరుసఁ గారహకల్పనూర్పురమనంగ
దీనుల నిధానమయిన కార్వాన మనగ
వరలు జగదేకనిశ్చలవైభవముల
నలరు శ్రీహరిధామములందమరయ.

59


శా.

వీక్షామాత్ర ఫలప్రదంబయిన యావీక్ష్యావనా[78]ఖ్యాత పు
ణ్యక్షేత్రంబున శాలిహోత్రమునిహర్యబు రక్షింపు ప్ర
త్యక్షంబై నిటలేక్షణుండు నుతిసేయన్ వీరకోటీ రథా
ధ్యక్షుండై తగు వీరరాఘవు సమిత్కాండోల్లసల్లాఘవున్.

60


సీ.

అలకాంచిచేరువ నష్టభుజంగమ
నిలయధరాధ్యక్షు నీరజాక్షు
తిరునిన్నయూర్పుర దివ్యసౌధమ్మున
వివిధ భోగనివేశు వేంకటేశు
లీలఁ దిరుప్పక్కులీ గ్రామమున నున్న
విజయా[79]ఖ్యరామవోర్వీతలేశు
నత్తిరునిర్మలాఖ్య పురంబు నేలెడు
వైరివారణసింహు నారసింహు
తిరువదవ్వంద[80]పట్టణస్థితి వసించు
నాది భూదారమూర్తిఁ బద్మానువర్తి
నత్తిరుకడమల నున్న యమరలోక
మాన్యు నాపల్లిగొండ పెర్మాళ్లదేవు.

61


క.

ఎక్కుడు తపమునఁ దనువుల్
[81]చిక్కఁగ ఘటికాచలాఖ్యశిఖరిస్థలిపై

[82]నెక్కొను సప్తర్షులకున్
దక్కిన యక్కారుకణ్ణి నరహరమూర్తిన్.

62


సీ.

పాదాబ్దరజమునఁ బాషాణపుత్రిక
వనితఁగాఁ జేయు పావనత ఘనత
హరశరాసవిభేద మవనిజాకల్యాణ
మునకు నుంకువ సేయు భుజబలంబు
మున్నీరు బాణాగ్రమున నాణిముత్తెంబు
భాతిగా నుంచిన పాటవంబు
వరశస్త్రశిఖిని రావణముఖా సురకోటి
శలభముల్ గాఁ జేయు శౌర్యమహిమ
తొలఁక లక్ష్మణ భరత శత్రుఘ్న వాయు
జార్కజ విభీషణాదులు నఖిలఋషులు
గొలువ వైదేహితోఁ గూడ నల యయోధ్య
రాజిలు దయాతిసాంద్రు శ్రీరామచంద్రు.

63


క.

ఆనందమయ విమానం
బానందమగరిమదాన నలరారు యశో
దానందతపఃఫలమగు
[83]నానందహారి నంజనాచలశౌరిన్.

64


గీ.

తిర్వలిక్కేణి దివ్యమందిర చరిష్ణుఁ
గృష్ణనామ రధాలంకరిష్ణుఁ గృష్ణు
నల [84]యహాబలపర్వతాధ్యక్షుఁ డైన
శ్రీయుతా[85]యతవక్షు శిక్షితవిపక్షు.

65


సీ.

చిప్పకూఁకటిరేఁక నొప్పు నౌఁదలమీఁద
చలిదిచిక్కము వింతచెలువుఁ గులుక
వ్రేతలవలపుఁ గొల్పెడు దిస్స మొలహత్తి
గచ్చకాయలతిత్తి ఱచ్చసేయ

మువ్వంక మురువుతో మురళియూదెడు నిండు
సొగసు గోముల[86]చుక్క సొక్కఁ జేయఁ
జిరుతనవ్వులడాలు చేనున్నవలమురి
గలమురిపెమునకుఁ గళుకు[87]నింప
[88]భైమిదక్షిణదిక్తటప్రాంతభూమి
సకలదివిజులతోడ సాక్షాత్కరించి
పుండరీకుని మనిచిన పాండురంగ
విఠ్ఠలాధీశుఁ గోటిరవిప్రకాశు.

66


సీ.

యాదవశిఖరి నత్యాదరంబున నున్న
రసికుఁ[89]జళ్ళఁపిళ్ళరాయశౌరి
హాళి సాలగ్రామ శైలంబున వసించు
నా స్వయంవ్యక్తు దీనాధినాథు
నైమిశకాననభూమి భక్తావన
మానితరంహు జ్వాలానృసింహు
నంత శ్రీరంగాంతరాఖ్యధామమ్మున
శ్రితజనావన[90]కల్పు శేషతల్పు
బదరివనమున నర్జునప్రాణసఖిత
నఖిలము [91]నెఱుంగుచున్న నారాయణాఖ్యు
నా ప్రయాగస్థలమ్మున నతులవిభవ
మహిమఁ గనుపట్టు శ్రీ మధుమాధవాఖ్యు.

67


క.

[92]తిరుపేరుత్తిరుమణియ[93]మం
దిరసీమన్ శ్రీధరాసతీసేవితుఁడై
చరణా[94]నతజనులకు నిహ
పరఫలములఁ గరుణనొసఁగు బాలముకుందున్.

68


సీ.

పురుషోత్తమస్థానమున నిండుకొలువుండు
శ్రీ జగన్నాథు లక్ష్మీసనాథు

వైకుంఠ[95]మున భాగవతులతో వసియించు
కువలయశ్యాము వైకుంఠనాము
కలశపాథోధిసంగత సితద్వీప ప్ర
సిద్ధసౌధనిల[96]యి శేషశాయి
మధురాపురీ హేమ[97]మందిరాంతర రత్న
మయసౌధవాసు రమావిలాసు
మరి [98]తిరున్వేలివిఖ్యాత వరతరా[99]ఖ్య
మైన తిర్వారయిప్పాడి నలరు శౌరి
శ్రీసతీయుక్తుఁ బట్టాభిషిక్తు ద్వార
కాపురీధాము భక్తరక్షణలలాము.

69


సీ.

తీర్థయాత్రావృత్తిఁ తిరుగుచు సేవింపఁ
గాఁగంటి నదియునుగాక మఱియు
ననఘ! శమ్యాప్రాస మను నాశ్రమమున స
త్యవతి[100]నందనుఁడే సుతటినిచెంత
నాగమవ్యాకరణాష్టాదశపురాణ
రమ్యార్థ[101]తరము భారతము సేసె
నాసరస్వతి నర్ణవాభ్యర్ణమునఁ జేర
నరుగు తుంగతరంగ నభ్రగంగ
రవిజ నంద విపాశ వేత్రవతి రేవ
సరయువు మలాపహారి భీమరధి వృద్ధ
గంగ కృష్ణయు కావేరి తుంగభద్ర
వేగవతి యాదిగాఁగల వివిధనదుల.

70


గీ.

పుణ్యతీర్థములైన త్రిపుష్కరములు
ద్వారవతి వారణాసి యవంతి మాయ
మధుర కాంచి యయోధ్య నా నధిక పాప
హరములై వార్త కెక్కిన పురవరములు.

71

క.

ధాత్రీతనయారాఘవ
గోత్రావరలిఖితచిత్రకూటంబై వై
చిత్రిఁదగు చిత్రకూటము
పాత్రతరంబైన పంచవటియును భక్తిన్.

72


క.

కనుఁగొనివచ్చితినన నతఁ
డనఘా! యీ నూటయెనిమిదగు తిరుపతులన్
దనరు సుచరిత్రములు పా
వన పూజ్యస్థల కథాప్రభావము కరుణన్.

73


క.

ప్రకటింపుచు నడుమ నొకిం
చుక ఘటికాచలము మహిమ సూచించితి రు
త్సుకతన్ హరి యాశైలము
నకు వేంచేయుటకు కారణం బెయ్యదియో?

74


క.

వేడుక యయ్యెడు తద్గిరి
చూడామణికథ వినంగ సుర[102]ముని! యబ్జ
క్రోడప్రోద్భవనందన!
యీడితమృదువచనరచన నెఱిఁగింపఁగదే.

75


మ.

అనుడున్ ధన్యుఁడనైతి నియ్యెడ మహాత్మా! యాత్మభూనేతకై
నను వాగ్దేవతకైన వేదములకైనం బన్నగస్వామికై
నను వాచస్పతికైన నా కుధరమున్ వర్ణింపశక్యంబుగా
దనినన్ మాటలు వేయు నేమిటికి శక్యంబౌనె మాబోంట్లకున్.

76


ఆ.

సనక జనక జనకుఁ డనురాగమున రమ
కానతీయ నేతదచలచరిత్ర
మేను వింటి [103]నొప్ప నదిమహాఘచ్ఛటా
దారణంబు ముక్తికారణంబు.

77


సీ.

సంచితాద్యఘ సమిత్సమితికిఁ గార్చిచ్చు
హరివైభవస్వర్ణ మొదయ మచ్చు

సకల [104]సత్వపురాణసారాంశముల హెచ్చు
కైవల్యరమఁ [105]బ్రీతికలువవచ్చు
విష్ణుస్థలమణుల వెల [106]దీర్చు బలుబచ్చు
శ్రీలతాంగి వసించు మేలుమచ్చు
సాధుసమాగమజ్ఞానవిద్యకు నచ్చు
వివిధజన్మార్థముల్ వెరఁజు ముచ్చు
సనక జనకాది సురవర [107]చయము మెచ్చు
విపులతర నవవిధభక్తి [108]వెదకవచ్చు
పుణ్యసౌధవితానంబుపూలకుచ్చు
వినుము దానిమహత్త్వమెంతనఁగవచ్చు.

78


క.

కావున విను ధన్యులకు ర
మావరచరణాబ్దభక్తి [109]మలయున్ వెలయున్
శ్రీవైభవంబు నఘము
ద్రావిద్రావణవిధాయి ధర్మస్పృహయున్.

79


సీ.

[110]ఆరామనామ జపామోదమేదుర
హృదయారవిందులై పొదలువారి
శౌరి కథాసుధాసారంబు తోరంబు
గా వీనుదోయిళ్ళఁ ద్రావువారి
పద్మారమణపాద పద్మార్హణాశస్త
హస్తారవిందులై యలరువారి
తీర్థపాదపదాబ్జతీర్థసం[111]సేవన
మున పావనాంగులై తనరువారి
వారిజోదరచిహ్నముల్ వరలువారి
ధీరమతులై ముకుందుఁ గీర్తించువారి
దూరమునఁజూచి పరువెత్తు దురిత[112]మతులఁ
గెడపు [113]కాసరవాహను కింకరాళి.

80

క.

హరికథలు వినఁగ నొల్లని
దురితాత్ముం డిందు నిరయదోషదశాకా
తరహృదయుండై యందున్
నిరవధి[114]గా ఘోరనిరయ నీరధిఁ గ్రుంకున్.

81


సీ.

శౌరిగేహమునకుఁ జనఁగఁ జాలని కాలు
కాలు కాదది మరకాలుగాని
పురుషో త్తమునిదివ్యమూర్తిఁ జూడనియక్షి
యక్షికా దల్లగవాక్షిగాని
అచ్యుతుచరితంబు లాలకింపని చెవి
చెవి కాదు రాట్నంపు చెవియగాని
నరసఖుఁ గీర్తింపఁ జొరలేని నాలుక
నాల్క కాదది కొండనాల్క గాని
దానవారాతి పూజకు రాని కరము
కరము కాదది ఘోరాఘకరముగాని
హరిపదోదకమునఁ దోఁగనట్టిరూపు
రూపు కాదది చిత్రంపురూపుగాని.

82


గీ.

కమలలోచన [115]భక్తసాంగత్య మెప్పు
డబ్బు నప్పుడె వికసించు [116]నార్యు తలఁపు
బిసరుహాప్తునిరాక నింపొసఁగ విరియు
బిసరుహంబును బోలె [117]తామసవిదూర.

83


శా.

సంగంబెన్నఁగ నెన్నిచందముల వర్షంబైనచోఁ జూడ నా
సంగంబున్ విడఁగూడ దార్యసహవాసశ్రీకరంబైన ని
స్సంగుల్ సంగమహౌషధంబగుటఁ దత్సంగంబు భక్తిప్రధా
నాంగంబై కమలామనోహరుని నత్యామోదిఁ జేయుంగడున్.

84


క.

దానముల జఁప తపో ధ
ర్మానూనాచార సూనృతాధ్యయనములన్

నానాటం దెల్లమిగాఁ
గానందగు విష్ణుభక్తికలితాత్ములకున్.

85


క.

హరిచరణాంబుజభక్తికి
గర మాకరమగుచు నేడుగాఁ నాజన్మాం
తరకృతసుకృతము కతముగ
దొరకె [118]న్నీదర్శనంబు దురితవిదూరా!

86


ఉ.

నావుడు వెండియున్ భృగువు నారదుఁ గన్గొని మౌనిచంద్ర! యిం
కా విన నెమ్మదిన్మిగులఁ గౌతుక మయ్యెడు సాధుసంగమ
శ్రీవరవైభవంబు సుధచిల్కెడుపల్కుల నానతిచ్చి న
న్పావనచిత్తుఁ జేయు మని పల్క నతం [119]డను నాతపస్వితోన్.

87


మ.

సరయూతీరమునందు నొక్కపురరాజం బుగ్రభాస్వత్ప్రభా
పరయూధప్రతిరోధకృన్మణిమయప్రాసాదహర్మ్యాంకమై
పరరాజోత్కరదుర్నిరీక్ష్యపరిఘాప్రాకారనిశ్శంకమై
మెరయున్ ధాత్రి నయోధ్యనాఁ బ్రకటమై మిత్రాన్వయాధారమై.

88


ఉ.

ఆ నగరాధినేత ధవళాంగుఁడు నాఁజను రాజశేఖరుం
డానతరాజరాజమకుటాంచితనూత్నచిరత్నరత్నభా
భానువిభానుయోగయుగపద్వికచ న్నిజపాదపద్ముఁడై
యీనిఖిలావనీధుర ధరించె నుదంచితబాహుపీఠికన్.

89


గీ.

కరము సపరికరముగ సంగరముఁ దొరఁగి
కరములు మొగిడ్చి పగతురు కరము లొసఁగి
[120]కని మని భజింప విక్రమఖని యతండు
నిండుకొలువుండి [121]యొక్కనా డుండినటుల.

90


సీ.

మాణిక్యమకుటంబు మాటి మస్తకమందుఁ
[122]బిట్ట యీఁకల నెట్ట ముట్టిపడియె

తారహారముల కుద్యాపనం బొనరించి
[123]యెఱచి పోఁచలదండ లురమునిండె
అంగుళీయకముల కపజయంబు ఘటించి
జిగురుఁగండెల కేలఁ దగులు కొనియె
జాళువా పైఠాణి [124]శాలువుఁ దొలఁగించి
గదురుతోల్కటిసీమఁ [125]గదురుకొనియె
నక్కటా! యిది [126]యేమి యున్నటుల యుండి
యనుచుఁ బెనుఖేదమున సభాజనముజూడ
[127]మేటి చీకటు లీను నెమ్మని తోడ
భూతలాధీశనేత కిరాతుఁడయ్యె.

91


చ.

ఇటువలెనుండి పూర్వకృత మెట్టిదియో సదయోదయత్వ వి
స్పుటహృదయంబు వోయి పెనుబోయ[128]తనంబున బంధుకోటులన్
భటులఁ దొఱంగి ప్రాణి నిధనంబున కుద్యుతుఁడయ్యె నాతఁ డ
క్కట! జటివర్య! యెవ్వరికిఁ గాల మలంఘ్యముగా గణింపఁగన్.

92


క.

ఈలీలఁ గిరాతదశా
భీలుండై యతఁడు పురము వెలువడి క్రూర
వ్యాళీమృగపాళీఖగ
తాళీయుత మయినకోనఁ దానొకరుఁడున్.

93


క.

తిరుగుచు జంతువుల తలల్
దఱుగుచు దరుగుల్మలతలు తనకిరవులుగాఁ
బరఁగుచు నొకనాడు వశి
ష్ఠఋషి తపోవనముఁ జేరఁజనఁ గ నె మునియున్.

94


చ.

కనుఁగొని వీనిరాక కిటఁ గారణ మేమొకొ? మామకాశ్రమం
బని యిది [129]వీ డెఱుంగఁడొకొ? యౌర! భయంబరి రాఁబనేమి మా
[130]వనికి కిరాత కీట మని వచ్చిన కోపమడంచి యా తపో
ధనమణి దివ్యదృష్టి గని తద్దశ తద్దయుఁ బ్రేమనిట్లనెన్.

95

శా.

భూమీశా! యొకనాఁడు నీవు [131]మృగయుల్ మున్నాడ వేటాడ వి
శ్వామిత్రాశ్రమవాటి కేఁగి మృగహింసాసక్తి వర్తింపఁ[132]గా
నా మౌనీంద్రుఁడు శాపమిచ్చె నిటుగా నై తే మరేమింకిటన్
సేమం బౌనని పల్కుమాత్ర నతఁడుం జెన్నొందెఁ బూర్వాకృతిన్.

96


మ.

నరమాంసాశనవృత్తి వర్తిలెడు ఘంటాకర్ణుఁ[133]డన్ దుర్ణయుం
డరవిం[134]దాతుక్షవిపక్షతాగతమహాహంకారుఁ డాజన్మపా
పరతుం [135]డెక్కటి కృష్ణుఁగన్గొని ఖలవ్యాపారముల్ వీడ డే-?
యరుదా సాధుసమాగమంబున శుభం బౌటల్? జటిగ్రామణీ!

97


క.

విను మిన్నియు నేఁటికి మ
జనన[136]కథాకథనమేప్రశస్తోత్తరమై
యనఘా! తగునిందుల కని
వినిపించెం దత్కథానువృత్తం [137]బిటులన్.

98


ఆశ్వాసాంతము

మ.

శ్రితదేవాగమ! వాగమానితసుధాక్షీదసారోదయో
ర్జితకల్లోలనికాయ! కాయజసునాశీరాత్మభూమాధవ
స్మృతికృద్విగ్రహ! విగ్రహతృటితదాక్షిణ్యక్షణప్రేక్షణా!
శతమన్యుప్రతిమాన! మానదమహోజాగ్రగ్రహాధీశ్వరా!


క.

సదనోదరమూర్తి రమా
సదనోదరపాణిచరణసరసిజపూజా
విదితాదితముదితాత్మక!
సుదతీజనతానవీన [138]సురభిళబాణా!

మాలిని.

సరసగుణసమాజా! సన్మృగేంద్రస్ఫుటౌజా!
పరభటకృతపూజా! బంధుగీర్వాణభూజా!
తరుణ[139]తరణితేజా! ధారుణీరాజరాజా!
భరణసుకవిభోజా! భాగమాంబాతనూజా!


గద్య.

ఇది శ్రీమత్పరమపదనాథనిరవధికకృపాపరిపాకపరిచిత సరసకవితాసనాథ తెనాలిరామకృష్ణకవినాథ ప్రణీతంబైన ఘటికాచల[140]మాహాత్మ్యంబను మహాప్రబంధంబునందు ప్రథమాశ్వాసము[141]

  1. తపద్వి. తా.
  2. వారాణిక. తా.
  3. పద్మ. తా.
  4. పరిసరంబు. ఆ.
  5. గరుడయత్మంజనురాగంబు. తా.
  6. పట. తా.
  7. కలును. తా.
  8. తరువుల నెగసి....యుల్లెడ పూ.ము.
  9. వ్రాలు. తా.
  10. కలయంబ.
  11. కలిత. పూ. ము. తా.
  12. మొదవ. తా.
  13. బకముల్. పూ. ము.
  14. సవతో
  15. బేటి పటరికమున్. తా.
  16. మా.
  17. బారివచ్చు. తా.
  18. లేడున్. తా.
  19. జలువలున్ తా.
  20. నద్భుల్ల జర్హ. తా.
  21. నన్. తా.
  22. సామ్రాణి. తా.
  23. సేయించు. పూ.ము.
  24. కమండలము. తా.
  25. హృదయాతరళి. తా.
  26. యిట్లనియె. తా.
  27. పెంబ్రాపు. తా
  28. సితా.........స్థితంబై. తా.
  29. ఈ పాదము తాళపత్రమున లేదు.
  30. రమణ. తా.
  31. శ్రీతు. తా.
  32. వలసిన. పూ. ము. తా.
  33. నేళ్వర. తా.
  34. స్రధకుడి. తా.
  35. 1 యాద. తా.
  36. 2 జిష్ణ. తా.
  37. తిరువందళూర. పూ. ము.
  38. పురహారప్రశహశురేశ్వరుల భజియింపన్. తా.
  39. సాదర. తా.
  40. త. తా.
  41. తర్వారితిర్ణహరిలక్ష్మీశ. తా.
  42. నచ్చిందిపురివిణ్నహరినగరిజె. తా.
  43. సుగంధవన. పూ. ము.
  44. ఖలనసంహారుని. తా.
  45. వేలయ. తా.
  46. తిరువెళ్ళియకుదినగరము.
  47. దేవి.
  48. పట్టణాంతర. తా.
  49. ను మణిషూడ. తా.
  50. పాంతం.
  51. గోరు. తా.
  52. ముష్ణఁగీహు. తా.
  53. విభుతతి.....రుమ్మెయిణ్ణిపురవరమ్ము. తా.
  54. చండౌఘ. తా.
  55. శఘియ. తా.
  56. నారు. తా.
  57. పురి. తా.
  58. మకరమ్మనోజ్ఞు. తా.
  59. వాసవ్య. పూ.ము.తా.
  60. క్కోళూరి. తా.
  61. వణ్పరి శా. తా.
  62. తిరుక్కౌర్కెర. తా.
  63. వసత్యల్పన........స్తవ్యు. తా.
  64. తిరుణనాయి. తా.
  65. వాన్నగరిని. తా.
  66. నుతిగనుతమ....రు. తా.
  67. వాట్టార. తా.
  68. పట్టణంబున. తా.
  69. చుక్కోడ. తా.
  70. సస్య. తా.
  71. నతలసషూఖ్యు. తా. పాదము పూర్తిగా లేదు.
  72. గరిమఁదిర్వెళ్ళినగరి. తా.
  73. కాన్పించిన: కౌన్వీంచిన. తా.
  74. ధీను. తా.
  75. నాతిరు. తా.
  76. కౌమగతిం గళ్తుండధామ. తా.
  77. తిర్పూర ....న. తా.
  78. ఖ్యాన. పూ. ము తా.
  79. ఖి. పూ. ము తా.
  80. వత్తనస్థితి. పూ. ము.
  81. స్రుక్కగ. తా.
  82. నెక్కును. తా. పూ. ము.
  83. నానంద కథా విధారి. తా.
  84. మ. తా.
  85. యుత. తా.
  86. చొక్క. తా.
  87. నించ. తా.
  88. నైమి. తా.
  89. శళ్ళవిళ్ళ. తా.
  90. తల్పు. పూ. ము.
  91. నెరుగనున్న. తా.
  92. తిరుపెరు తిపురిమణి. తా.
  93. మందిరమున. పూ. ము.
  94. సుత. తా.
  95. వరభోగ. పూ. ము.
  96. నీలాయి. తా.
  97. మందికాంతర తా.
  98. తిరువ్వెలిధి. తా.
  99. ద్య. తా.
  100. నకదనుఁడు యె తటని తా.
  101. రతము. తా.
  102. వర. తా.
  103. గొప్పనిది. తా. గొప్పమిది. పూ. ము.
  104. సత్య. పూ. ము.
  105. నెతికల్వవచ్చు. తా.
  106. దీర్ప. తా.
  107. శయము. పూ. ము. తా.
  108. వేదిగ. తా.
  109. మరయన్. పూ. ము.
  110. శ్రీ. తా.
  111. సేచన. పూ.ము. సంచనమున. తా.
  112. వతుల; తా.
  113. కాసార. పూ.ము. తా.
  114. కాగార. తా.
  115. భక్తి. పూ. ము.
  116. నార్య. తా.
  117. తామరసవిదుర. తా.
  118. ని. తా.
  119. డును. తా.
  120. రని.
  121. యొకనాడునుండునటుల. తా.
  122. బట్టియీ కేలనట్టె తా.; బట్టియీకలనట్టె పూ. ము.
  123. యొరచి. పూ. ము. తా.
  124. శాలదూలగ జేసి. తా. శాల్వఁదూలఁగ జేసి
    పూ. ము. సాలుఁదూలఁగజేసి అనియు సవరింపవచ్చును.
  125. గుదురు. పూ. ము.
  126. యేమొ యన్న తా. పూ. ము.
  127. జడ. తా.
  128. వనంబున తా.
  129. వీడెరుంగునొకొ. తా.
  130. ఫనికి. తా.
  131. మృగముల్. తా.
  132. జూపా. తా.
  133. డున్. తా.
  134. దాక్షివిపేక్ష. తా.
  135. డెక్కడ. తా.
  136. జానకథనమె. తా.
  137. బటులన్. తా.
  138. బటులన్. తా.
  139. తరుణి. తా.
  140. మహత్వంబను. తా.
  141. గమనిక: ఈ ఆశ్వాసాంతపద్యములు పూర్వముద్రణమున లేవు.