గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/జూలై 1928/దాసు త్రివిక్రమరావు గారు

వికీసోర్స్ నుండి

మనదేశ చరిత్రయం దీ సందిగ్ధ తరుణమందు గావలసినది గ్రంథాలయముల మూలమున జ్ఞానజ్యోతియొక్క ప్రకాశము.

దాసు త్రివిక్రమరావు గారు

అఖిలభారత ధర్మగ్రంథాలయ సంఘమునకు సంయుక్త కార్యదర్శియగు దాసు త్రివిక్రమరావు ఎల్. ఎల్. బి. బార్ - ఎట్- లా గారు హాలండుదేశమున జరుగబోవు అంతర్జాతీయ యువక మహాసభకు ఆంధ్రదేశ పక్షమున ప్రతినిధిగా పోయియున్నారు. ఆసందర్భమున వారిని అభినందించుటకు గాను బెజవాడయందు అఖిలభారత గ్రంథాలయ సంఘముయొక్కయు - ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముయొక్కయు - బెజవాడ యందున్న రామమోహనధర్మగ్రంథాలయము, దుర్గామల్లేశ్వర ఆంధ్రగ్రంథాలయము, కార్మిక గ్రంథాలయముల యొక్కయు ఆదరణక్రింద సభ సమావేశ మయ్యెను. ఫలాహారములైనపిమ్మట ఆంధ్రవిశ్వవిద్యాలయ వైసుఛాన్సిలరు కట్టమంచి రామలింగారెడ్డిగారి అధ్యక్షతక్రింద గొప్పసభ సమావేశమైనది. అధ్యక్షులు శ్రీత్రివిక్రమరావుగారిని అభినందించుచు వారి వైదుష్యమును దేశసేవాపరతంత్రతను, స్వార్థ పరిత్యాగమును, నిర్మాణదీక్షతను, సర్వతోముఖవిజ్ఞానమును ప్రశంసించిరి. జరుగనున్న మహాసభకు ప్రతినిధిగా యుండి భారతవర్షముయొక్క సందేశమును అచట ప్రకటించి మాతృదేశమునకు నానాజాతీయ సభ్యతయందు అర్హస్థానమును సంపాదించుటకు తగిన సమర్ధత త్రివిక్రమరావుగారికి అన్నివిధముల యున్నదని రెడ్డిగారు కొనియాడిరి. శ్రీ సూరి వెంకటనరసింహశాస్త్రిగారిచే చదువబడిన వినతిపత్రమును శ్రీ త్రివిక్రమరావుగారు అందుకొని, ఆమూలమున అఖిలభారతగ్రంథాలయ సంఘమువారును స్థానిక గ్రంథాలయ సంఘములవారును తమ కిచ్చిన గౌరవమువలన తానువిస్మితుడ నైతిననియు, అందులో తననుగూర్చి చెప్పబడిన యంశములకు తాను అర్హురుగా యుండునటుల కృషిచేయుటయే తన జీవితపర మార్థమనియు చెప్పి తన ఇతరదేశపర్యటనలో ఆయాదేశముల యందలి దర్మగ్రంథాలయోద్యమ విజృంభణను గూర్చి జాగ్రతతో పరిశీలించి, తన్మూలమున మాతృదేశమునకు హితోధికలాభమును జేకూర్చుటకు ప్రయత్నించెద నని విన్నవించిరి. వీరు తిరిగి వచ్చిన పిమ్మట ఆయాదేశములందు వారు సంపాదించిన అనుభవముల వలన భారత ధర్మగ్రంథాలయోద్యమునకు గొప్ప చేయూత దొరకగలదు.

గ్రామ గ్రంథాలయములు.

గ్రామములే దేశమునకు ఆయువుపట్టులు. పట్టనములయందలి జనులు ఎంత విద్యాధికులైనను, ఎంత నాగరికులైననూ దేశ మభివృద్ధి గాంచనేరదు. పట్టణవాసులతోబాటుగ పల్లెలయందుండు జనులుకూడ అభివృద్ధిపథము ననుకరింప గలిగిననేగాని జాతియొక్క వికాసము సంపూర్ణము గానేరదు. ఇది నిర్వివాదాంశము. కాని పల్లెలయందుండు జనులు విజ్ఞానులగుటకు గల మార్గమేమి? అక్కడక్కడ కొన్ని పల్లెలయందు ప్రారంభవిద్యను ఒసగునట్టి పాఠశాలలు గలవు. వానియందు కొంతమంది బాలురు విద్య నభ్యసించెదరు. కాని ఫలితమేమి? ఆకొద్దిమంది అభ్యసించునట్టి స్వల్పవిద్యయైన జాతీయ వికాసమునకేమైన దోడ్పడుచున్నదా?

అక్కడక్కడ గ్రామములందున్న పాఠశాలలయందు కొందరు ప్రారంభవిద్యను జదివెదరు. పిమ్మట ఏమిచేయుదురు? ఆస్వల్పవిద్యను ' కచేరీలకెక్కుట ' కు గావలసిన తరిబీతునందు వినియోగించెదరేకాని, పిమ్మట జ్ఞానాభివృద్ధిని జేసికొనుట కెంతమాత్రమును వినియోగింపరు. అందుచేత పిల్లలకేగాని పెద్దలకుగూడ జ్ఞానాభివృద్ధిని జేసికొనుటకుగాను గ్రంథాలయములు అత్యవసరములు. పాఠశాలలందు చదివిన విద్యయొక్క శేషమును వారిచట ప్రారంభించెదరు. ఇంతేగాక, మన పల్లెలయందు చదువుకొనజాలని జనులుగూడ విశేషముగ గలరు.