గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/జూలై 1928/ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము

వికీసోర్స్ నుండి

గ్రంథాలయ సర్వస్వము.

సంపు. 7 బెజవాడ - జూలై 1928. సంచిక 1.

ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమము.

పూర్వచరిత్ర: కావలసిన అభివృద్ధి.

ఆంధ్రోద్యమము యొక్క ----- నొప్పు ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ పూర్వచరిత్రను సింహావలోకనముగ పరిశీలించినచో అందు కావలసిన యభివృద్ధికి సూచనలు గోచరించుటయే గాక మాతృదేశమును ప్రస్తుతకాలమున కలవరపెట్టుచున్న అనేక సమస్యలకు సమాధానము వచ్చుననుట నిశ్చయము.

ఈ యుద్యమము యొక్క పరమప్రాప్యము ప్రజల జ్ఞానాభివృద్ధి. ఈఫలప్రాప్తికొర కవలంబించవలసిన సాధనవిధానమును గూర్చి భేదాభిప్రాయము లుండుటకు తావులేదు. కావున ఇప్పుడు మనదేశమున పెచ్చుపెరిగిన కులకక్షలు, మతద్వేషములు, రాజకీయ పక్షముల ననుసరించి యుండెడి వైషమ్యములకును స్థానమీయక గ్రంథాలయముల పక్షమున ప్రథమదశయందు జరిగిన కృషియంతయు సర్వజన సమ్మతమై సర్వజన సహకారమును పొంది "సర్వేజనాస్సుఖినోభవన్తు" యను యార్యోక్తికి యుదాహరణమని చెప్పుటకు తగిన విధముగ ప్రవర్తించినది. అందుకే అప్పటి పల్లెటూరు గ్రంథాలయముల యందేమి, బస్తీ గ్రంథాలయముల యందేమి, వేరువేరు అంతరములు గలవారందరు ఏకత్ర సమావేశమై అన్యోన్యాభివృద్ధికి తోడ్పడుచుండిరి. అప్పటికాలము వేరు, ఇప్పటి దినములువేరు. అప్పుడు గ్రంథాల యోద్యమ మంతయు ప్రజాయత్తమైయుండి అందు కొరకు వెచ్చించబడిన ద్రవ్యమంతయు ప్రజలే యిచ్చుచుండిరి. అచ్చటచ్చట నుండు దేశసేవా పరతంత్రులందరును తమ శక్తియుక్తుల నన్నిటిని ఇందుకొరకై ధారవోయుచుండిరి. ఇప్పటికాలమున పూర్వకాలముకన్న ప్రజాసంస్థల సంఖ్య మిక్కిలి హెచ్చినది. దేశసేవకులలో కొందరు ఒక యుద్యమ మందును మరికొందరు మరియుక యుద్యమమునందును అభిమానము కల్గియున్నారు. మనదేశమున "కొత్తో వింత, పాతో రోత" అను సామెతకు ఉదాహరణము చాలవరకున్నది. కాబట్టి ఈకారణము లన్నిటిచేతను గ్రంథాలయసంస్థ పూర్వపు అభ్యున్నతి పదవినుండి జారి వెనుకటిశోభను గోల్పోయినది. కావున ఈయుద్యమము యొక్క పరమస్రావ్యమును గూర్చియు తత్సిద్ధికొర కవలంబించ వలసిన సాధన విధానమును గూర్చియు వర్తమాన దేశకాల పరిస్థితుల కనువుగ నుండునట్లు తిరిగి ఈకాలమున విమర్శించుట ముఖ్యావసర మైయున్నది.

మన మాతృదేవతారాధన కొరకై పలువురు పలువిధముల కృషిచేయుచు భారతజాతికి అభ్యున్నతిని సంపాదించుచున్నారు. ఇందు కొరకెన్నియో సంస్థ లుద్భవిల్లినవి. వీనికన్నిటికి మూలాధారము ప్రజల జ్ఞానాభివృద్ధి. చేతిలో బంగారమున్నచో నగలెన్నియో చేయించుకొనవచ్చును. అట్లే జ్ఞానమును.

మనదేశపు జనులలో నూటికి తొమ్మండుగురుమాత్రము చదువునేర్చినవారు. తక్కినవారందరు నిరక్షరకుక్షులు. ఈతొమ్మండుగురిలో కూడ అత్యల్పసంఖ్యాకులు మాత్రమే విద్యావంతులై తన్మూలమున నిజమగు సౌఖ్యమును పొందగల్గిన వారు. ప్రస్తుతము మనదేశపు విద్యాశాలలును, దొరతనము వారిచే స్థాపించబడిన గ్రంథాలయములును ఈ అత్యల్ప సంఖ్యాకుల జ్ఞానాభివృద్ధికొరకు మాత్రమే ప్రవర్తించుచున్నవి. మిగిలిన జనసామాన్య మందరిని గూర్చియు మన దేశమున ఎట్టి కృషియు జరుగుచుండుట లేదు. వీరల నందరి నుద్ధరించుటకొరకే ధర్మగ్రంథాలయోద్యమ మవతరించినది. మనదేశపు ప్రజలలో చాలమంది ప్రైమరీ పాఠశాల చదువుతో చాలించెడువా రున్నారు. మరికొందరు లోవరుసెకండరీ చదువుతో చాలించుదురు వీ రందరు పెల్లెటూండ్లయందును, బస్తీలందును ఏదియో సామాన్యపు వృత్తుల నవలంబించి జీవించువారై యున్నారు. వీరిలో పెక్కుమంది ధనములేనివారు. వీరికున్న కొద్దిచదువు అనర్థ హేతువుగా నున్నదిగాని లాభించుటలేదు. వీరికన్న ఎక్కువమంది విద్యాగంధ మేమియు లేనివారు. ఈ రెందుతరగతుల వారి జ్ఞానాభివృద్ధిని చేయగల ధర్మసంస్థలు స్థాపించుట ఆవశ్యకర్తవ్యము. ఈసంస్థలుఎవ్వి? వానిని నడుపగలవా రెవరు? వానికి సొమ్ము ఎచ్చటనుండి రాగలదు? అను ప్రశ్నలకు జవాబు నిర్ధారణ చేసికొనవలసియున్నది

ఈ సంస్థలు ఏవ్వి? యనునది మొదటిప్రశ్న.

పల్లెటూండ్ల వెంటను బస్తీల వెంటను వెళ్ళి ప్రజల కవసరమగు యంశములనుగూర్చి వారికి తెలియు విధమున యుపన్యసించగల సంచార భొధకులుండుట మొదటి యవసరము. వీరి యుపన్యాసములకు సాధకముగా నుండుటకు చులకనభాషలో వ్రాసిన కరపత్రముల ప్రచురించుటయు, మ్యాజిక్కులాంతరు సహాయమును చేకూర్చుటయు అవశ్య కర్తవ్యము.

ఇట్టి ప్రయత్నము నీమధ్య మన ఆంధ్ర విశ్వవిద్యాలయము వారు ఉద్యమించిరి గాని అది ఫలోన్ముఖమైనట్లు కనుపడదు. ఆంధ్ర గ్రంథాలయోద్యమ పక్షమున ఈపని ప్రారంభించి సాగించినచో మన ప్రజలయందు దట్టముగా వ్యాపించియున్న అజ్ఞానము నశించును. ప్రజల యజ్ఞానమునే యాధారము చూచుకొని వారివలన అన్యాయముగా ప్రాతినిధ్యమును సంపాదించు యుపద్రవము ఈమూలమున నిర్మూలము కాగలదు. ప్రజల యార్థికస్థితిని బాగుపర్చుకొను మార్గములు ఈమూలమున ప్రజల కలవడును. పరదేశముల స్థితిగతులును, అచ్చటి ప్రజలు అభివృద్ధి జందెడి సాధనములును ఈవిధానము ననుసరచి ప్రజలకు బోధించి ఆవిధముగ వారల నభివృద్ధికి దేవచ్చును. వెనుకటి తరగతివారికన్న కొంత విద్యాగంధము కల్గి తమంతట తాము విద్యాభివృద్ధి చేసికొనలేనివారు మరియొక తరగతివారు. వీరి యుపయోగము కొరకు తగిన కూడలి స్థానములందు తాత్కాలికపాఠశాలలు పెట్టవచ్చును. వీటిని ప్రతిదినము సామాన్య పాఠశాలలవలె నడుప నవసరములేదు. వారమునకు గంట మొదలు రెండు గంటలవర కుంచిన చాలును. ఆయాప్రాంతముల నుండు విద్యార్థుల యవసరములను బట్టియు అభిరుచులను బట్టియు బోధానాంశములను మార్చవచ్చును.

ఇక తమంతట తామే జ్ఞానాభివృద్ధి చేసికొన గలవారు మరియొక తరగతివారు. వీరల యుపయోగముకొరకు సంచార గ్రంథాలయ పేటికలును స్థాయి గ్రంథాలయములును స్థాపించవలసి యున్నది.

ఈ సంస్థలు నడుపువారెవరు?

తాత్కాలికపు పాఠశాలలను నడుపుటకు ఆయాప్రాంతములందు స్థాపించబడియుండు సెకండరీ పాఠశాలలయందలి ఉపాధ్యాయులు మిక్కిలి యుపకరింతురు. సంచారోపన్యాసకులను పంపుటయు కరపత్రములను ప్రచురణచేయుటయు, తాత్కాలిక పాఠశాలలో జరుగు విద్యాభ్యాసమును తగుపద్ధతుల నడుచునట్లు చేయుటయు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముయొక్క విధిగా నుండవలెను. అందు కనుబంధముగ జిల్లాసంఘము లుండవలెను. సంచార గ్రంథాలయ పేటికలను స్థాపించి గ్రామములవెంట త్రిప్పుట లోకలు బోర్డుల మూలమునను మ్యూన్సిపాల్టీలవల్లను జరుపవచ్చును.

పూర్వమువలె కేవలము ప్రజలనుండి ఈసంస్థకు ద్రవ్యము చేకూరదు. మరియు అనధికారులు మాత్రమే నడుపు సంస్థకు నిరంతర కృషి యుండవలెనన్న కొన్ని కట్టుదిట్టము లుండవలెను తప్పక వచ్చెడి ద్రవ్యాదాయ ముండవలెను. స్థానిక ప్రభుత్వమునుండియి స్థానిక స్వపరిపాలనా సంఘములనుండియు వచ్చెడి వార్షికవిరాళములచే ఈ గ్రంథాలయసంస్థలు నడుపుట యవసరము. కేవలము అప్పుడప్పు డిచ్చు యథేచ్ఛాదానముల మీదనే ఈసంస్థలు ద్రవ్యముకొరకై యాధార