గుసగుస పెళ్ళి/మాటలేనా!!

వికీసోర్స్ నుండి


మాటలేనా!!

పాతపట్నం సివారు పెరుగుపిల్లి అనే ఒక జమీందారీ గ్రామం ఉండేది. ఆవూళ్ళో సిమాలమ్మ అనే ఒక వ్యక్తి ఉండేది. మొదణ్ణించీ ఆవిడ అక్కడే ఉంది. ఆవిడ పుట్టింటారంతా బుగ్గి అయిపోడం, మాటలు ఇంకా సరిగ్గారాని వయస్సులోనే ఆవిడికి అత్తారింటే పెళ్ళవడం, పెళైన పదహారో పండగ ఇదవకుండానే ఆవిడ ఐదోతనంకాస్తా అస్తా యిస్తయిపోవడం లాంటివి కుట్ర జరిగినట్టు జరిగిపోయాయి. మాటొచ్చినప్పుడు పేరంటాళ్ళు “సిమాలమ్మ ఎంతదొడ్డ అయితేం పెట్టి పుట్టద్దూ! బొట్టుపెట్టీ, కాటిక్కాయా ఎరగదుకదా!' అంటూ కళ్ళు తుడుచుగునేవారు. అత్తమామలకి ఇతర సంతతి లేక పోబట్టి, ఆవిడ అత్తారింటికి వెళ్ళిన వెళ్ళడం ఏకవెళ్ళడం అయిపోయి, అక్కడే పాతుగు పోవలిసొచ్చింది. ఆవిడికి పాతిగేళ్ళు వచ్చేదాకా అత్తగారుగ్రహం, ఏసాదింపోసాదిస్తూ, విగ్రహం కంటికి కనపడుతూ ఉండేది. మరి తరవాత ఇహ ఎవరున్నారూ! బిక్కుబిక్కుమంటూ కార్తీక దీపంలాగ మామగారొక్కడూను! ఆకాస్త మామగారూ కూడా వచ్చేప్రాణం పోయే ప్రాణంకింద మంచంమీద ఏణ్ణర్థం ఉయ్యాలా ఊగి, ఆవిడ ముప్పైయ్యోయేటే బ్రహ్మాండం మీద పోయాడు. అప్పణ్ణించి, ఆవిడ, అటూ ఎవరూ లేక ఇటూ ఎవరూ లేక ఘంటస్తంభంలాగ ఒక్కర్తీ నిల్చిపోయింది. బతికున్నజ్ఞాతులు ఎవరూ లేకపోడంచే వారసత్వపు గొడవలు ఆవిడచెవిని పడవలసిన అవసరంపోయింది. ఆవిడ పెంచుకోనూలేదు. ఏటా ఓ ఇరవై కాటాబస్తాల ధాన్యం, ఓ బొద్దుగడ్డీ, గుమ్మంలోకి తెచ్చి ఆవిడ కాళ్లదగ్గిర అప్పగించేవారు. ఆవిడదగ్గిర రెండువేలు చేసే బంగారపు తొడుగుండేది. ఆవిడపేర రెండువేలపైమాట వడ్డీకి తిరుగతూండేది. ఆవిడికి పట్టుమని బంధువులేనా లేరు, ఏ బీరకాయపీచో, ఆవిడ ఇంటిపేరుకి నోట్లల్లోనూ పత్రాల్లోనూ తప్పవాడకమే లేదు. దాని మూలాన్ని ఆవిడికి పురుడు పుణ్యాలూ, కష్టసుఖాలకి రాకపోకలూలాంటి కుటుంబసంబంధమైన తప్పనిసరి మొహమాటపు తగులుబాట్లు కించిన్మాత్రం లేకుండాపోయాయి. ఆవిడికి గవ్వ ఖర్చులేదు. అందులోనూ ఆవిడ స్వతహా ఇరుకుచేతి మనిషి. అవునా, తను దంతసిరితో పుట్టిందిగదా, ఇంతఅన్నోదకాలకి మొహం వాయక్కర్లేదు గదా, ఒహటో రకమైన వసతి కట్టుదిట్టంగా ఖంజాయింపై ఉందిగదా, చెయ్యిములగా పాడిగదా, పరగణా అంత భవంతి స్వంతానికి ఉందిగదా, అల్లాంటప్పుడు తనవేళకి తనయింటో, తనసొమ్ము ఇతరులకి పెట్టదు పోనీ! తను తింటూ ఉండిపోతే రోజులు దొర్లిపోవూ! దేవాసురులుకూడా ఎగిరిగంతెయ్యరూ! మరె! ఆవిడ అల్లా ఉంటుంది! రమ్మంది, తిమ్మన్నబంతికి! అల్లాంటివాళ్ళు అల్లా ఉంటే కావలిసిందేమిటిహ! అపూర్వమైన స్వంతపైత్యం ఏదోఓటి వీధిని పడాలి, వ్యక్తిత్వంలో ఉండే ప్రత్యేకత స్థాపన కావాలి. అందుకని, అంత నిప్పులాంటి మనిషి ప్రజలనోట పడింది.

ఇంట్లో పనున్నప్పుడు తప్ప ఆవిడ తన వీధి అరుగు ఎడంవేపుది - వదిలేది కాదు. ఇల్లెంతున్నా యజమానికి, ఇంట్లో ఒక్కొక్క స్థలం మరీ స్వస్థలం కనిపిస్తూండి, అక్కడికి చేరుకుంటేనేగాని మనస్సు స్థాయీపడదు. రాత్తెళ్లుకూడా చాలాభాగం ఆవిడ అరుగునే ఆశ్రయించేది. కాని, ఆవిడకల్లో సరేసరి, నిద్దట్లోకూడా ప్రసంగిస్తూనే ఉండేది. ఇక, ఉత్తప్పుడు అడిగారూ! పైగా, పక్కని ఎవరో కళ్ళల్లో వత్తు లెట్టుగుని ఊకడుతూ కూచున్నట్టు, సంబోధనలుకూడా చేస్తూండేది. అయితేంగాక, ఇంతమాత్రాన్నే జనానికి కోపంరాలేదు. వాళ్ళు ఆవిణ్ణి, 'వాగుడుకాయి' అనీ, ఇంకా పొట్టి చేసి, 'వాక్కాయి' అనీ ఆవిడి పరోక్షంలో వ్యవహరించేవారు, తీరిపోయేది కాని, అభ్యాసంవల్లా నిర్భయత్వంవల్లా ఆవిడధోరణి క్రమేపీ తిట్లల్లో పడింది. కొంత కాలానికి ఎల్లాదిగిందీ! వీధమ్మట చరాచరాల్లో ఎవళ్ళేనా సరే, ఎదేనా సరే, నడవ భయం వెళ్ళ భయం, ఉత్తపుణ్యానికి ఆవిడ దులిపి ఝాడించి పారేసేది. పైగా వెధవకర్మం! తన వేడివేడి విమర్శని ఒక్కరవ్వ చల్లారనిచ్చి, దానికి కొంచెం వార్నీసు వెయ్యడంగాని దాన్ని ఎల్లానో సాపుచెయ్యడంగాని లేకుండానే ఆపళంగానే ఎదరపార్టీ మొహంమీద గిరవటెట్టేది. అక్కణ్ణించి క్రిమినలంతపని జరుగుతూండేది, ఆవిడవంక లేని మనిషి అవడంవల్లా, ఆడది ఆవడంవల్లా, సుళువుగా తిట్టడంలో సార్వీసు ఉన్న దవడంవల్లా, కోపం హెచ్చిన కొద్దీ నోటిధాటీ జోరు చెయ్యగల శక్తికలది అవడంవల్లా, విజయం ఆవిడికే దక్కుతూండేది. 'నోటిధాటీ' అంటే అదేదో జపాను సరుకు అనుకోకండి మరి! అప్పట్లో జనం బొత్తిగా పాపిష్టులు కాకపోడంవల్ల ఆవిడికి సంగీతం మట్టుకి అబ్బలేదు గాని ఆవిడిది గబళిశారీరం, త్రిస్థాయి గాత్రం, మందకొడివాళ్ళ మనోవేగానికి రెట్టింపుగా ఉండే వాగ్వేగం. ఆవిడకేకతో, పిల్లి పాలుతాగడం, కాకివాలడం, మరిచిపోతే, చావమా! తోక ముడుచుగొందే కుక్కలు ఆవీధిని వెళ్ళేవి కావంటే, చూసుకోండి మరి ఆవిడ ప్రజ్ఞ! ఒకసారి పరుగుమీద వస్తూన్న ఆంబోతుని ఆవిడతిట్టి మళ్ళేసిన సంగతి ఎరుగున్న వాళ్ళున్నారు. మరోమాటు, ఒక పెద్ద రౌడీలాంటి మీసాల్దారు తనకి భయం ఏమిటనుకుని ఆవీధిని ఓ కిర్రుజోడు తొడుక్కుని. కిల్లీ ఉమ్ముకుంటూ వెడుతూంటే, ఆవిడికి చికాకేసి, 'నీ మీసాలకిర్రుమండింది గదరా, నీ ఉమ్ము అంటించిరి గదరా!' అని జమిలిగా తిట్టేసరికి, అంతెత్తు మనిషీ నిలవా లేక, అడుగూ సాక్క, మాటా తోచక కేవలం 'సేమియా' అయిపోయాడని చెబుతారు. అక్కణ్ణించి, ఆవిడ ఎదటపడి ఆగలేని అసమర్థులంతా ఆవిడమీద అసూయ పెంచుగుని, ఆవిడతిట్లని గురించి చాటుగా ప్రచారం మొదలెట్టారు. సిమాలమ్మ తిట్టడవుప్రజ్ఞ దేశంలో మోగిపోయింది. ఆవిడికి అదొహజబ్బు అని చాలామంది అన్నారు. ఆవిడికి ఆజబ్బు కుదిర్చి ఖర్చులేని దేశోపకారం టూకీగా చేసేసి వీలైనంతపేరు లాగాలని కొందరు యత్నంచేశారు. మంచిదో చెడ్డదో ఏదో ఓపేరు గలవాణ్ణి తిట్టడమో, అధవా వాడిచేత తిట్టించుకోడమో జరిగితే, తమరికిగూడా అమాంతంగా కొంత పేరేనా సుళువుగా వస్తుందని భ్రమించే జనం ఉంటారు. ప్రస్తుతం పోటీ తిట్లపోటీ గనక ప్రతీవాడూ అభ్యర్థిగా నిల్చి చూశాడు, తిట్టుకి తొంభైదాకా తిట్టాలేమోగనక గట్టివాళ్ళుకూడా కొందరు చొరబడ్డారు. ఉపన్యాసకులు, ఉపాధ్యాయులు, విదూషకులు, పురోహితులు, వక్తలు, ఆవిణ్ణమించాలని వెళ్ళేవారుగాని, ఆవిడే మరి నాలుగాకులు ఎక్కువ చదివేది. బళ్ళవాళ్ళూ, బండపని చేసేవాళ్లూ, కోపం వచ్చిన పోలీసులు కూడా ఆవిడ తిట్టినంత సభ్యంగానూ స్వచ్చంగానూ తిట్టలేక తమ అపజయం ఒప్పేసుగున్నారు. తెర వెనకనించి ఉరిమినట్టు జంతువుల్లాగ కుయ్యగల ఒకరిద్దరు ముతగరకపు విద్యార్థులకికూడా ఆవిడ యెదుటనోరు లేవలేదు. కొంతమంది గడేకార్లూ, చిలక్కొట్లూ, ఏజెంట్లూ, జప్తులవాళ్లూ, వసూళ్లవాళ్లూ కూడా ప్రయత్నించి, ఆవిడ తిట్లప్రవహంలో మొదటకొట్టుకుపోయి, మధ్య ములిగిపోయి, చివరకి తేలిపోయారు. 'హరి' అనే వరకూ ఆవిడిదే పై చెయ్యిగావును - (కాదు! పైనోరు గావును) ఆవిడప్రభ అల్లా వెలగవలిసిందేగావును, తిట్టగలవాళ్ళది రాజ్యంగావును, అనుకుంటూ లోకులు నిరాశలో పడి పోయారు.

కాలం జరిగింది. జరక్కుండా కూచోంది అదొక్కటేగా! ఆవిడిమీది కంట్రకత్వం పడింది. ఆవిడికీ కుంచం నిండింది. ఒకనాడు పొద్దున్న తొమ్మిదింటికి ఆవిడ అరుగుమీద చతికిలబడింది. క్రితం నాడు పక్క ఊరు తీర్థాని కెళ్ళి రాత్తిరి ఇంటికి చేరుకునే సరికి ఆవిడికి పులకారం వచ్చినట్టుండి వొళ్లంతా పచ్చిపుండైంది. ఉదయం అషీషూ లేచి, అత్తీసరు పడేసి, తరవాత ఎదో యింత వడియాలపచ్చిపులుసు చేసుకోవచ్చు కదా అనుకుని, మడిగానే ఆవిడ అరుగుమీదికి వచ్చింది. ఒక ఎరకలాడు ఆవీధంట వచ్చాడు. వాడు, మొలకి గోణం, తలకి పొణకంతపాగా, చెవలకి తమ్మెట్లూ, ఎడంచెవికి బావిలీ, ముక్కుకి కాడా, చేతులికి వెండిమురుగులూ, కుడిదండకి కడియం, చేతులో నక్క పిల్లి కర్రా, జనపనారతాడు చుట్టా, నోట్టో రూళ్ళకర్రంత ఉండి వెంటిలాగ రాజుతూన్న పొగచుట్టా, మీసాలచెప్పులూ వగైరాతో మహ అట్టహాసంగా వచ్చాడు. ఒకవిశేషం. వాడిచుట్ట రెండుమూడు నెల్లు వరసని కాల్చుగునే బాపతుది. దాని పొడుగుమూలాన్ని అది వాలిపోయి, జ్వాలా తోరణంలా ఒకసారే తగులబడిపోకుండా, వాడు దానిమధ్య ఒక నూకల తాడు ముడేసి, నోట్లో ప్రతిష్ఠించినప్పుడు అది మట్టంగా ఉండేలాగు ఆతాడు అవతలకొస పట్టిగెళ్ళి తలపాగాకొంగుకి కట్టేశాడు. పళ్ళగంపచుట్టూ మూగినట్టు జనం వాణ్ణి మూగికొందరూ, వెంటాడించి కొందరూ వచ్చారు. సిమాలమ్మకి కొంచెం ఆశ్చర్యం వేసింది. “ఏవడ్రా ఇన్నాళ్ళకి ఇల్లా తెగించి రాగలిగాడూ!” అని. కానీ, అల్లాంటివాణ్ణి తిట్టి, సాగనంపగలిగితేనే తన వాగ్జన్మకి సాఫల్యం అనిన్నీ, అంత గొప్ప తరుణంలాంటిది మళ్ళీ మళ్ళీ తనకి దొరకకపోవచ్చనిన్నీ, ఆవిడికి అనిపించి, ఆవిడ తనమనస్సులో ఉన్న తిట్ల దస్తరాలు తిరగేసి, కొన్ని ముఖ్యమైనతిట్లు కేటాయించి ఏరి, నూరి, చిన్న చిన్న కట్టలుగా కట్టి, ప్రయోగించడానికి తగ్గస్థితిలో పెట్టింది. వాడు ఆవిడిల్లు సమీపించాడు. అసలు వాడు తాడిచెట్టులో సహం ఉన్నాడు. వాడికర్ర వాడు నిఠాగ్గూ పట్టుగున్నప్పుడు అది వాణ్ణి దాటిపోయి, తాడిదన్నేవాడి తలదన్నే వాణ్ణి జ్ఞాపకం చేసింది. వాడువచ్చేసి సరసరా ఆవిడింటి గుమ్మాలు ఎక్కేసాడు. వొఠ్ఠికిరాతపుముండావాడొచ్చాడే అనుకుని ఆవిడ కొద్దిగా నిర్ఘాంతపోయి లేచినిలబడి దవడలు నొక్కుగుని, “అయ్యో! అజ్జో! అచ్చో! నీతాడు తెగా, నీదుంపతెంపా, నీవేరుతవ్వా! నేను మనిషి ననుకున్నావా, పందిననుకున్నావురా, నిందగలెయ్యా!” అని ప్రారంభోపన్యాసం యిచ్చింది. వాడు గడపదాకా ఎక్కి, అక్కడ అగి, తనమూతి పైకి ఎత్తిపట్టి, చుట్టుతీసి, “ప్ధూ” అనే పెద్ద శబ్దంతో ఇంట్లో పడేలాగు కడివంత ఉమ్మెసి, వీధికేసి తిరిగి, చుట్ట మళ్ళీ నోట్లో స్థాపించి, నులకతాడు బిగించి, గుమ్మంమీద కూచున్నాడు. సిమాలమ్మ, నడుం బిగించి, పళ్లు బిగించి, చేతుల్లో గాల్నిపొడుస్తూకొంచెం వడిగా, “ఓరి వెధవా, వెథవన్నరా! కుంకా! దోయంకుంకా! కుంకాక్షీ! చెవలవెధవా, చెవుల్తెగిన వెధవా! మరీపొయ్యకాలంవచ్చిందేంరా! హోమంచెయిస్తా! నీకొవ్వొండిస్తా! నీపొగరుతీయిస్తా! అమ్మ వెధవపొగరా!” ...

అంటూ కాస్తదార్లోపడుతూండేసరికి, ఎరకలాడుఛంగున గద్రిగాడులాగ ఆవిడ యెదట ఓగజం ఎడంలోకి గంతేసివాలి, చుట్టతీసి పట్టుగుని, ఒక గొప్ప మేఘమండలం నోట్టోంచి బల్లపరుపుగా ఊది, ఆవిడికి నిర్మొహమాటంగా ప్రత్యక్షదానంచేసి, మళ్ళీ వెళ్లి గడపమీద కూచున్నాడు. ఆ పొగతో ఉక్కిరి బిక్కిరి అయి, ధూపం వేసినట్టు అయి, అరికాలిమంట నెత్తికెక్కి ఆవిడ తేనెపట్టులా రేగిపోయింది. అదిలగాయతు, ఆవిడ ప్రతీతిట్టుముక్కకీ, మడములు ఎగరెయ్యడం, చేతులుచాచి చేతిగూళ్ళు గిరగిరా తిరిగేలాగు నిలువువాటంలో బండచక్రాలులాంటి సున్నలు చుట్టడం. మందుకీ వెనక్కీ ఊగడం, తల ఎదరకి విసరడం, విడవకుండా చేస్తూ అచ్చంగా అయోమయపు గిన్నెలకి చక్రంతిప్పే మనిషి అవస్థలో పడింది.

వాడుతల పాగాలోంచి అద్దం ఓటి పైకితీసి, నవ్వుకుంటూ, తన మొహంయొక్క అందానికి మురిసిపోతూ. పెదిమిలికి ఒక ఐమూల ఉన్న చుట్ట దానంతట అదే పళ్ళమీద నృత్యం చేస్తూ అవతల ఐమూలకి చేరేటట్టు కదుపుతూ, తన పెదిమిల యొక్క పనివాడితనం చూసుగుంటున్నాడు.

సిమాలమ్మ - (ఒకతిట్టుకే పైన చెప్పిన చేష్టలన్నీ చేస్తూ, వాడిమోహం మీద కోపంవచ్చి) ఓరి నీమొహం ఈడ్చా, నీమొహంమండా, నీమొహం ఊరేగించా, నీమొహాన్ని జీడెట్టా, నీమొహం తగలెయ్యా, నీమొహంకాలా, నీమొహంగానుగాడా, నీమొహం ఛత్రంచెయ్యా. నీమొహం చిత్రికపట్టా, నీకళ్ళు పేలా, నీగుడ్లు మాడా.

వాడు - (చుట్ట తప్పించి, కోతిలాగ పళ్ళిగిలించి, దొరగెక్కినట్టు ముక్కూ వొళ్లూ గోక్కున్నాడు.)

సి - నీపళ్లుపీకా, నీగోళ్ళుపేల్చా, నీగోక్కోడం అంటించా, కొండముచ్చు వెధవా, కోతివెధవా...

అంటూ ఆవిడ దొరకపుచ్చుకునేసరికి ఆసమయానికి ఓ ముష్టమ్మి, ఓ కోతిని ఆడిస్తూ తీసుగొచ్చింది. ఎరకలాడు తలపాగాలోంచి ఓ అరిటిపండు తీసి దానికేసిగిరవటేసి, ఇంకోటి కుడి అరుగుమీద పడేశాడు. తక్షణం ఆకోతి గిరవటేసిన పండు పండట్టుగుని ఒక్క గంతులో కుడి అరుగుమీదికి ఎగిరి, అక్కడి పండుకుడా తీసుగుని తినేసి, మొగ్గలేసి సిమాలమ్మ ఎల్లా ఎల్లా తిప్పుగుని ఏమేమి చేస్తే అల్లాఅల్లా తిప్పుగుని అది అది చేస్తూండడం మొదలెట్టింది. సిమాలమ్మకి కోపం, జనానికి సంతోషం ఎక్కువైపోయాయి. ఇక ఎరకలాడు ఊరుకున్నప్పుడుకుడా, ఊరుకోకుండా ఆవిడ తిట్టేస్తోంది.

ఇంతలో వాడు ఆవిడకేసి చూచి నవ్వి, తనవేళ్ళు, (కళ్లుమూసుగుంటూ) ముద్దెట్టుగున్నాడు.

సిమాలమ్మ - (గబగబా) నీకు అమ్మవారు రానూ, నీకు మహమ్మారిరానూ, నీకు ఏకైత్తురానూ, నీకు పెద్దరోగంగానూ, నువ్ మంచంఅట్టా, నిన్ను పెద్దపాం పీకా, నిన్ను పులేసుగుపోనూ, నీమీద పిడుగడా, నిన్ను బలెయ్యా, నిన్ను తెగెయ్యా...

కోతిగుడా అంతవడిగానూ పెదిమిలు కదుపుతూ, కడంపన్లన్నీ చేసి చూపించింది. జనం చూస్తూ, వింటూ, కోలాహంలంగా ఉన్నారు.

కాని, సిమాలమ్మకి మాట ఒక్కంటికి అన్నేసి చేష్టలు చేస్తూండడంవల్ల, క్రమేపీ మడమలు లేవడం మానేశాయి. కాస్సేపటికి చేతులు గూళ్ళల్లో పట్టు తప్పిపోయాయి. మరి కాస్సేపట్లో మెడజీవాలుకూడా తోడుకు పోయాయి. అక్కడితో ఆవిడ చాలా పీలస్వరంలో తిట్టడం తప్ప, అభినయాల్లో ఒక్కటీ చెయ్యలేకపోయింది. ఆ సందర్భంలో వాడు కుడితర్జనితో తనకేసి చూపెట్టుగుని వెంటనే ఆవిడికేసి చూపించి, తర్జనీలు కలిపి చూపించాడు.

సి - (చాలా కోపంతో, అతివడిగా) నువ్వు చచ్చిపోనూ, 'నువ్వు రాలిపోనూ, నువ్వుకాలిపోనూ, నీకు నిచ్చిన కట్టా, నీకు సవ్వారికట్టా, నీకు పాడికట్టా, నీకు రాయికట్టా, నిన్ను మోసెయ్యా, నిన్ను తగలెయ్యా, నిన్ను పాతెయ్యా, నిన్ను పాతరెయ్యా, నిన్ను బారెట్టా, నిన్ను పుఠం వెయ్యా, నిన్ను బూడిద చెయ్యా, నీకు పన్నెండెట్టా, నీకు మాసిగం పెట్టా, నీ పిండం పిల్లులికెయ్యా, నీశార్థం చెట్టుకిం దెట్టా ..

అనేరకాలు కొన్ని సొంతంగా ప్రయోగించుగుంటూ చివర చివరకి రావడంలో, ఆవిడికి మాటకూడా పడిపోయింది. కళ్ళు తెరిచిఉన్నాయి, నోట్టోంచీ ముక్కు షోణాల్లోంచీ గాలిమాత్రంవస్తోంది. మరేమీలేదు. అయినా ఎరకలాడు ఇంకోసారిచూద్దాం అనుకుని, బుగ్గని వేలెట్టుగుని తక్కుతూ, ఆవిడ దగ్గిరిదాకా వెడుతూ వస్తూ బోగంఆట ఆడిచూశాడు. కోతికూడా అల్లానే చేసింది. కాని ఆవిడ ఎంత మాత్రం చేతావాతా కాకుండాపోయి కేవలం అశక్తురాలై బొమ్మలాగ చూస్తూ ఉండిపోయింది.

గ్రంథం అంతవరకు రానిచ్చి, ఎరకలాడు, ఒక్క మాటంటే ఒక్కమాటే నోరువిప్పి. “నేను నీకు ముగుణ్ణి కానుటే” అంటూ ఆవిడ కేసి చూసి సిగ్గు అభినయించాడు. ఈమాటతోటి, అస్ఖలితంగా బతికిన మనిషి గనక, సిమాలమ్మ తన అపజయం , పరాభవం , అవమానం, నిస్త్రాణ, నీరసం వగైరాలవల్ల గుప్పుమని పెద్దపెట్టున అప్పుడు మళ్ళీ పుట్టిన కోపంతో, ఊతం బలవంతం చేసుగుని, ఆఖరుమాటు చేతులు తిప్పుతూ ఆడిపోతూ కసిదీరా వాణ్ణితిట్టాలనుకొని చేతులు చాచి, “ఓరినీనోరు పడోవ్” అనడానికి ప్రయత్నించడంలో, గూళ్లు పట్టుతప్పిపోవడం వల్ల ఎల్లానో చాచినచేతులు అల్లానే ఉండిపోయాయి గాని మరి కిందికి రాలేదు, మాటలు అనడానికి తెరిచిన నోరు అంకిళ్ళు పట్లు వొదిలిపోడంవల్ల ఎల్లనో ఆ మాటలు అనేసి, తరువాత అల్లానే ఉండిపోయింది గాని దగ్గిరపడలేదు. ఒక్కక్షణం ఆస్థితిలో నిల్చిపోయి, చెయ్యీ దవడా స్వాధీనం తప్పిపోడం ఆవిడకి బాగా గుష్టుకి రాగానే, ఆవిడ కుంగిపోయి పక్కకి పడిపోయింది.

జనానికీ ఎరకలాడికీ ఆవిడమీద అది వరకే బయల్దేరిన జాలి విల్లివిరిసి పోయింది. ఎరకలాడు తనవైద్యం మరి కట్టేశాడు. అసలు వైద్యులొచ్చి ఆవిడ గూళ్ళూ అంకిళ్ళూ బాగుచేసి, మందిచ్చి ఉపచారాలు చేయించగా, ఆవిడ ఓ వారం రోజుల్లో లేచింది.

ఎరకలాడివేషం వేసిన ఆయనకీ ముష్టి అమ్మి వేషంలో కోతిని తీసుగొచ్చిన అతని తమ్ముడికీ వాగ్దానప్రకారం ఆ ఊరి జమిందారుగారు సిమాలమ్మధర్మమా అని ఓ అగ్రహారం ఇచ్చారు. సిమాలమ్మ తన ఆస్తి కూడా తన అనంతరం వాళ్ళకి చెందేటట్టు రాసేసింది.

తరవాత సిమాలమ్మగారు, తను జీవించిన పదికాలాల పాటూ, ఇల్లా నోరు విప్పి ఎరగదుట, నోరు విప్పగా ఎవ్వరూ వినలేదుట, ఆవిడమాట మానుకున్న అనంతరం ఆవిడ మాటలు వినాలని వేలాదిగా జనం వచ్చేవారుట. ఆవిడగొప్ప జ్ఞానురాలనీ, ఆలోచనపరురాలనీ, కవయిత్రి అనీ జనం అప్పుడు కనిపెట్టి ఎంతో మెచ్చేవారుట.

“సారస్వత ప్రౌఢిమార్థి... సురియ చేత నాలుకఁ గోసికోని ....... యిష్ట మొందు”

అని మన సూరన్న మాటలు

మాటలేనా!

- అక్టోబరు, 1938