గుసగుస పెళ్ళి/మడత పేచీ

వికీసోర్స్ నుండి


మడతపేచీ

ఒకసారి చందనబస్తీ పత్రికలో ఒక చాటింపు పడింది! “లక్షారావుగారు ప్రమాదంవల్ల పడిపోయారు. వారినడుం మడతపడిపోయింది. చిట్టిచిట్టి ఉపాయాలవల్ల గుణం లేకుండా ఉంది. ఇక్కడికి వచ్చి కుదర్చగల వైద్యుడికి వెయ్యిరూపాయలు పైగా ఉండే బహుమతి ఇస్తారు. ప్రజ్ఞగల వైద్యులు కావాలి. స్వయంగా వచ్చి మాట్లాడుకోవచ్చును. వివరాలకి వ్రాయవచ్చు - చిరునామా, పత్రికాధిపతి! చందనబస్తీ” అని.

ఆ బస్తీకి ఒకపూట నాటుప్రయాణంలో కరూరుఅనే పట్నం ఉంది. ఆ ఊళ్ళో వైద్యాభ్యాసం చేస్తున్న డాక్టర్ ధనాధన్ గారుకూడా, అందరికిమల్లేనే, పత్రికలోపడ్డ ఘోషణ చదివి చప్పరించి ఊరుకున్నాడు. కాని, ఆ మర్నాడే పత్రికాధిపతి దగ్గర్నించి ఆయనకి ఓ పెద్దఉత్తరం వచ్చింది. అందులో రోగిగారిని గురించిన వివరాలన్నీ ఉన్నాయి. ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఘన వైద్యులు ప్రపంచంలో ఉంటూంటే తనపేరు అప్పుడే పత్రికాధిపతికి ఎట్లా తెలిసిందో గదా అని ఆయన అనుకుని, లోపల సంతోషించుగుని భార్యని కేకేసి, మీసం ఉండవలిసిన చోట తర్జన్యంగుష్టాలతో గాల్ని మెలిపెడుతూ, “చూశావా, మనతఢాఖా!” అంటూ ఆవిడికి ఆ ఉత్తరం చూపెట్టాడు. తక్షణం ఆవిడ నవ్వేసి, "తఢాఖాలనే ఉంది మొన్న నేను పత్రికాధిపతి పేర రాయగా, ఆయన తబిసీళ్ళు రాశాడుగావును. ఇంత మాత్రానికే పొంగిపోకండి మరి" అంది. ఆయనకి కొంచెం చిన్నతనంవేసినా, మాట్లాడానికి వీల్లేక ఊరుకున్నాడు. బహుమతీ ఆశ ఎవడి కుండదూ? ఆయనా నిలబడ్డపాట్న ఆకేసు అంగీకరించి ఉండేవాడే కాని, అతనికి ఆ ఉత్తరంలో చాటింపులో లేని షరతు ఒకటి మహాపాపిష్ఠిది కనిపించింది. ఏమంటారా, వైద్యానికి కుదురుకున్నవారు వందరూపాయలు ధరావతు కట్టిం తరవాతే వైద్యం ప్రారంభించవలసి ఉంటుందని ఎక్కడేనా చక్కటి బజానాముందు పుచ్చుగుని పని ఒప్పుగుంటారు గాని ఇవ్వడం ఏమిటి అన్నాడాయన. పెద్దవాళ్లతో వ్యాపారం ఆమాత్రం బరువుగానే ఉంటుందని గ్రహించుగోవాలి అందావిడ. ఆ బహుమతీకి ఓ అరదణ్ణం పెట్టి మనపని మనం చూసుగుంటే నయం అని ఆవిడతో నయాన్నీ భయాన్ని చెప్పిచూద్దాం అని ఆయన యత్నించాడు. ఆవిడ ససేమిరా వినిపించుకోలేదు. సరిగదా!

భార్య - మనకి బ్యాంకిలో నిలవ ఎంతుంది?

డాక్టర్ - నూరు పైనే ఉంటుంది.

భా - రేప్పొద్దున్న అది పుచ్చేసుగుని వెళ్ళిమీరు ఈ బేరం అచ్చుగోండి.

డా - అక్కడ ఎంతమంది ఉన్నారో పోటీకి?

భా - ఏ కాళ్ళో పట్టుగుని బేరం చేచిక్కించుగోవాలి. దాట పెట్టుగుంటే ఓరికేసి ఓరు చూస్తూ కూచోవాలి.

డా - నాకింకా వైద్యపరంగా చెయితిరగలేదు, అర్ధపరంగా గుక్క తిరగలేదు! మనస్థితి కింకా ఎక్కడా గాలి తిరగలేదు.

భా - మృతనష్టపు కేసులు ఎన్ననిచేసి సంపాదిస్తే అంత అవుతుంది?

అని వాదించింది. డాక్టర్ ధనాధన్ పనివాడే గాని, మాటశూరుడు కాడు. అందులో, ఇవతలమనిషి భార్యగాని, మరొకరూ మరొకరూ కాదు. అందుకని, మర్నాడు డబ్బాడవాలీ కట్టి, బ్యాంకి కెళ్ళి డబ్బు తెచ్చి జాగర్తచేసుగుని, ఆరోగి కాస్త మార్గంలో పడడం చూసుగుని ఒకవారంలో మళ్ళీ వస్తానని చెప్పి, ఆయన చందనబస్తీ వెళ్ళిపోయాడు. ఆయనా వెళ్ళగానే, ఆవిడ స్నేహితురాలిద్వారా ఆవిడదగ్గిరికి ఒక బంగారపు గొలుసు - పాతిక్కాసుల్ది - బేరానికొచ్చింది. మషాగతు కలిసి రావడం వల్ల కొంచెం రాహితుగా వస్తువుదొరుకు తోందనిపించి, బహుమతీ రాగానే పూర్తిగా సొమ్ము గిరవటెయ్యచ్చుగదా అనే ధైర్యం చొప్పున, ఆవిడ, మాస వాయిదాలమీద డబ్బు చెల్లించే షరతుకి ఆ గొలుసు పుచ్చుగోడానికి ఒప్పుగుని బజానా ఇచ్చింది.

కాని, డాక్టర్ ధనాధన్ గారు వారంలేదు. గీరంలేదు మర్నాడు సాయింత్రానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిపడ్డాడు. అంత పెందరాళే ఆయన వచ్చెయ్యడం ఆవిడికి కొంచెం ఆశ్చర్య అయింది. అయినా ఆవిడ, “చూశారా! ఈగొలును ఎంత ఇంచక్కా ఉందో!” అంది. 'ఇంచక్కానే ఉంది', అని ఆయన కూలబడి చెప్పుగొచ్చాడట!

ఆ ఊళ్ళో ఉన్న సత్రంలో రాత్రి మకాం వేశాను. ఉదయాన్ని కాఫీ కానిచ్చుగుని, వచ్చి మరి ఆరోగిదగ్గిరికి ఎల్లానా వెళ్ళిపడడంఅని నేను గుంజాటన పడుతూండగా, కోర్టు పనిమీద ఆవూరొచ్చి అక్కడ బసగా దిగిన ఒకాయన సాయంచేశాడు. ఆయన నన్ను వెంటబెట్టుగుని తిన్నగా లక్షారావుగారి గుమాస్తాకి అంటించి వెళ్ళాడు. మొదట్లో ఆ గుమాస్తా రేగటి బెడ్డల్లాగ మహగుచ్చుకొనేటట్టు మాట్లాడాడు. కాని, కాస్త తడి తగిలించేసరికి, అతడు ఎక్కడలేని మెత్తదనం కనపరిచి తక్షణం నన్ను వెంటేసుగుని రోగిగారింటికి తీసిగెళ్ళాడు. రోగిగారిది పెద్దమేడ, ఒక గదిలో ఒక సాగుడు మంచంమీద ఆయన శాలువ కప్పుగుని పరున్నాడు. ఆయన బాధతోనే నాతో ప్రసంగించాడు.

రో - కూచోండి తమ దే గ్రామం?

నేను - కరూరు. మీకు ఒంట్లో ఎట్లా ఉంది?

రో - ఒంటికేమండీ, పిక్కలా ఉంది. నడుమే!

నేను - అసలు సంగతేమిటండి!

రో - మా బస్తీ ప్రముఖులు ఈ మధ్య రోడ్లమీద పిల్లకాలవలు తవ్వారు.

నే - ఎందుకూ?

రో - మంచినీళ్ళ గొట్టాలకనీ, మురుగునీటి తూములకనీ, చెట్లు పాతడానికనీ, స్తంభాలు స్థాపించడానికనీ, బళ్ళవాళ్ళమీద కసి కొద్దీననీ, హెచ్చుతగ్గు లొచ్చినప్పుడు దూరాభారం వెళ్ళక్కర్లేకుండాననీ జనం చెప్పుగున్నారు. ఆ వయినం ఇంకా తేల్నేలేరు.

నే - సరిపోయింది. మీరల్లాంటి గోతులోగాని పడ్డారా ఏమిటి!

రో - మరే.

నే - పోన్లేస్తురూ, మీ అజాగర్తా మీరూనూ! కాస్తకిందూ మీదూ చూసుగుని నడవక్కర్లేదుటండీ, మీ రెంతసామంతులైనా! చిన్నవారూ చితగవారూగనకనా ఇదవడానికి!

రో - అయ్యొ! అయ్యొ! అబ్బ ! అబ్బ!

నే - ఏం ఏం ? నెప్పా? తగ్గిస్తాగా! వెధవ నెప్పి!

రో - మరేనండి. గట్టిగ మాట్లాడేసరికి ఖరేలు మనడమూనూ అక్కణ్ణించి ధనువాయి పోటూనూ ! కదులుదాం అనుకునేసరికి కలుక్కుమంటుంది.

నే - అయితేపోన్లెండి. కాస్త నిమ్మళించుగుని మరీ చెప్పండి. రో - ఒకనాడు నేను రాత్రి షికారెళ్ళి కార్లోవచ్చాను.

నే - మీరు రాత్తెళ్ళు కారుషికారు వెడతారా?

రో - రోజూ కాదు. తోచనప్పుడు వెడుతూంటాను. ఆవేళ కారు దిగి ఇంట్లోకివస్తూ, ఈ పక్కా ఆ పక్కా కనిపించే పాతాళపు గొయ్యిలాంటిది చూసి కళ్లు తిరిగిపోయి పడిపోయాను. ఆ పడిపోడంలో ఆతవ్విన కాలవకి సరీసుగా అడ్డంగా డామువంతెనలా పడ్డానేమో నా నడుం మడతడి పోయింది. అసలు విరిగి ముక్కలైపోవలిసిన మాటే ఆతరవాత ఏం జరిగిందో నాకు తెలియలేదు. కాని కిట్టని కుంకలకి పన్లేక నాకు పడడానికి పూర్వమే స్పృహలేదనీ, నేనేదో తాగొచ్చిపడిపోయాననీ, లేనిపోని అపవాదలు నామీద వేశారనీ మా గుమస్తాకి తెలిసిందిట. నడుం సర్దుకోడంతోటే, నడుంకట్టి వాళ్లపని పడతాను.

నే - పోన్లెండి, అదంతా ఎందుకిప్పుడు? తక్షణం మీరు తోమించకపోయారా?

రో - అయ్యో! తోమించాం.

నే - ఎదేనా మందు పామించకపోయారా?

రో - అయ్యో! పామించాం.

నే - బెణుకువైద్యులకీ, యిరుకువైద్యులకీ చూపించారా?

రో - చూపించాం.

నే - కాపించారా?

రో - కాపించాం. ఉప్పు, నిమ్మకాయి.

నే - పట్లు?

రో - పట్లూ వేయించాం.

నే - లోపలికి మందు ఏమన్నా కుట్టించారా?

రో - ఆ. కుట్టించాం.

నే - పథ్యం ఏమన్నా చేస్తున్నారా?

రో - ఆక్కర్లేదన్నారు. సరేగానండి, తమది కూనీ వైద్యం కాదుగదా!

నే - అంటే?

రో - అంటే కూనీయే.

నే - చఛ. తమకి తెలియదు. అది 'హైడ్రోపతి'. నాకు అదీ తెలుసు.

రో - అయితే తమరు దయచెయ్యండి. ఇల్లా ఉండనీ బాబూ, పోయినప్పుడే పోతాను. కూనీ కావడం ఎందుకొచ్చింది?

నే - అది జలవైద్యమయ్యా! అది కర్తపేరు,

రో - పేరా? అయితేమాత్రం. ఏమిటంత మరీ నిర్మొహమాటప్పేరు!

నే - పైగా నా కది ఆట్టే బాగా రాదు. సరా!

రో - మీది సీసామందు వైద్యమా?

నే - "అలోపతీ” తెలుసు.

రో - 'ఉమాపతీ' తెలుసా?

నే - దాన్ని 'హోమియోపతీ' అనాలి.

రో - ఈ కాలంలో 'ఉమాపతీ' అంటేనే పుణ్యం. మీకేం తెలుసు?

నే - పోనీలెండి. ఉమాపతీ తెలుసు. రో - ఇంక మరేమీ తెలియవు కద, ఇన్నింటి తాలూకు పథ్యాలూ చెయ్యాలేమో?

నే - నాకు 'లక్ష్మీపతీ' 'వనస్పతీ' తెలుసు, ఎలెక్ట్రోపతీ' తెలుసు. కొన్ని చోట్ల దాన్ని 'న్యాపతీ' అని కూడా అంటున్నారు.

రో - అయితే మీరు ఎక్కువ ఇష్టంగా వాడేరకం ఏది!

నే - నాది 'బృహస్పతీ' వైద్యం అంటాను.

రో - అంటే?

నే - మిక్కిలి గొప్పది.

రో - సరే. మీరు గుమాస్తాగారికి అడ్వాన్సు చెల్లించండి.

నే - ధరావతు ముట్టినట్టు రసీదు రాసి యిప్పించండి. కుదరడంతోటే నా బహుమతీ నాకు స్వాధీనపరిచే అంగీకారంతో కాగితం కూడా నాకు పారేయించండి. నేను ఈ వేళే ప్రారంభిస్తాను.

రో - ఇన్నాళ్ళకి నాకు ధైర్యంవచ్చింది. సరే, మీరు భోజనం చేసుగునిరండి. వైద్యానికి ఇక్కడ బాగుండేటట్టు లేదు. ఆవతల వీధులో నామేడ మరోటి ఖాళీగా ఉంది. నేను అక్కడికి మారతాను. వసతి మారుస్తే రోగం సహంమట్టుకు తమాయిస్తుందని శాస్త్రం. మీరు దగ్గరుండి, నన్ను ఎల్లాగో జాగర్తగా కార్లోకి ఎక్కించాలి. కారు సున్నితంగా నడవాలి. ముందు కోట దాకా వెళ్ళిరావాలి.

నే - కోట ఏమిటి?

రో - ఈ ఊళ్ళో కచేరీలన్నీ ఉండే చోటు.

నే - అక్కడి కెందుకూ?

రో - ఈ వేళ కోర్టులో వాయిదా ఉంది. ఆ తరవాత నన్ను ఎల్లానో ఆమేడలో దింపాలి.

నే - సరే లెండి. వస్తాను.

అని నేను వచ్చేస్తూంటే గుమాస్తా, దేవతార్చనకి నన్ను తన యింటికే లాక్కెళ్ళాడు. ఎక్కడి కక్కడికే అనుకుని, నేను రానని బెట్టు చెయ్యలేదు, భోజనం అయివచ్చాం. ఆయన్ని ఆపళంగానే ఒక బల్లచెక్కమీదికి జరిపి ఆ బల్లచెక్క పళంగానే ఆయన్ని కార్లో ప్రతిష్ఠించాం. ఆరోజున కారుడ్రైవరు కార్యాంతరంమీద వెడతానని సెలవు అడిగితే లేదన్నారట, కొరకొర లాడిపోతూ ఉన్నాడు. నేను ఎదటికెళ్ళి డ్రైవరుపక్క కూచోబోయాను. అతడు నన్ను వెనక్కివెళ్లి దయచెయ్యమన్నాడు. అధికారవర్గంలో వాళ్లు కిరాయి బస్సుడ్రైవర్లని బెదిరించి, వాళ్ళచేత బస్సులు ఖాళీ చేయించి, స్వంతపనిమీద ఫ్రీగా ఎక్కినప్పుడు వాళ్ళకి సరియైన సమ్మానం జరగడానికి డ్రైవర్లు వాళ్ళని వీలైనంత వెనకే కూచో పెడతారులే.

కారు బయల్దేరేటప్పుడే పెద్ద సింహగర్జన చేసింది. డ్రైవరు వాలకం చూస్తే అతడేదో అవాంతరం తెచ్చి పెట్టేటట్టు కనపడింది. నిమిట్లో పెద్దరోడ్డుమీంచి తప్పుగుని కారుపక్క వీథిలో పడింది. అది సందులా ఉన్నా పసందుగా కూడా ఉంది. వెనక కతకలపోటీలో ఒకరోడ్డుకి మట్టి 'షీల్డు' బహుమతీ యిచ్చారని విన్నాం. అలాంటి రోడ్డది, గాలీ, వానా, వాహనాలూ, అధికార్లూ, మధ్యవర్తులూ అంకినంత వరకు రక్తం పీల్చేసుగుని మాంసం నల్చేసుగుని వొదిలేసిన శల్యాల్లాగ కంకరరాళ్ళూ, కతకలూ, గోతులూ, కయ్యలూ, గాళ్ళూ రొంపీ, దిబ్బలూ దిరుగుండాలూ, మట్టీ మశాణం, పెంటడబ్బా - దానిచుట్టూ శాఖోపశాఖలుగా వ్యాపించి ఉన్న తుక్కు సంతానం - ఇల్లాగ్గా భయమేస్తూ ఆరోడ్డు జీభూతంలాఉంది. ఆ డ్రైవరు తెలివి ఏమిటోగాని, కారు, వెనక్కీ ముందుకీకూడా నడిచింది. అది ఒక్కొక్కసారి కప్పలా దాటేది. ఒక్కొక్కసారి పీతలా నడిచేది. ఉండి ఉండి పొట్టేలులాగ ఉన్నచోటే గిజగిజా కొట్టుకునేది. నేను పచ్చడైపోయాను. పచ్చడీ మెతుకులూ నోట్టోకొచ్చాయి. రోగిమాట అల్లా ఉండగా నా నడుం విరిగేటట్టు కనపడింది. రోగి, ఏక మూలగడం, కుయ్యడం, అరవడం, ఏడవడం, ఓమాటు రోగిడ్రైవరుమీదికి ఒరిగాడు, మళ్ళీయథాస్థానంలో పడ్డాడు. మరోమాటు, మేం యిద్దరం డ్రైవరుమీద పడి వెనక్కొచ్చాం. ఇంతలో నేనున్నవేపు గాడిలోదిగడి రోగివచ్చి నా పొట్టమీదపడ్డాడు. పడ్డవాడు ఊరుకోకూడదూ, రోగమా? బాబో, బాబో' అని ఏడుపు. ఆ పళంగా అతడు అసలుచోటి కెళ్ళి పడేటట్టు ఒక్కగెంటుగెంటాను. మరి కాస్సేపట్లో రోగి వేపు చక్రాలు రొంపిలాంటిదాల్లో కూరుకుపోయేసరికి డ్రైవరు 'గేరు' మీద కార్ని లాగించాడు. దాంతో నే నున్న వేపు పైకి లేచిపోయి, నేవెళ్ళి అమాంతంగా రోగిమీద పడ్డాను. కారు బోల్తావేసింది. రోగి 'చచ్చాను, చచ్చాను, నీతాడు తెగా, నామీద పడకురోయ్' అని గోల, నాశక్యమా? డ్రైవరు జాగర్తపడి ముందే దూకేశాడు. చాలామందిజనం పోగై నన్నూ రోగినీ పైకితీశారు. ఈ గలభాలో నాకు మోకాళ్ళూ మోచేతులూ కొంచెం కొట్టుగుపోయాయి. కాని, ఆరోగినడుం బాగుపడి నిట్రాడులా అయి ఊరుకుంది, వీడి అదృష్టంకాలా! అతడు 'అమ్మయ్య' అనుకుంటూ సాగి వెళ్ళిపోబోయాడు. 'నా బహుమతీ నాకిచ్చెయ్యండీ' అని నే నడిగాను. 'నువ్వుకుదిర్చిందేమిటి? ఇంటికెళ్లి ఇచ్చేస్తాలే” అన్నాడు. తన డ్రైవింగు మహత్యం వల్ల ఆయనకి నడుం కుదిరింది గనక, బహుమతీ ఛీదాగా తనకే రావలిసి ఉంటుందని డ్రైవరు మొదలెట్టి నన్ను అటకాయించాడు. నేను కొంచెం తెల్లపోయి ఆగిపోయాను. ఆ స్థలానికి ఒకవేపున ఇల్లుగల కూచయ్య తనయింటి యెదుట లక్షారావు నడుం కుదిరింది గనక తనకే ఆ బహుమతీ రావా లన్నాడు. రెండోవేపు కాపరం ఉన్న మాచయ్య వచ్చి, తన యింటికి కూడా ఆస్థలం యెట్ట యెదటిదే గనక, తనకి చెరిసహమేనా వాటా ఉండాలన్నాడు, దాంతో, కూచయ్య, లక్షారావు తనయిల్లున్న పక్కనే కార్లో కూచుని ఉండడంవల్ల తనకే యావత్తు బహుమతిగాని, మాచయ్యకి పూచికపుల్లేనా వెళ్ళకూడ దన్నాడు. ఆస్థలం పేరుకి కూచయ్య వేపుదైనా, పగలు తనపిల్లలూ రాత్రి తన పెద్దలూ బాహ్వానికి భుక్త పరుచుగుంటూండడంవల్ల తనదే బహుమతీ అని మాచయ్య కేకలేశాడు. అక్కణ్ణించి ఓ పోలీసు “బీటు” కనిస్టీవు వచ్చి, ఆరోడ్డు అక్కణ్ణించి ఎడాపెడా వందగజాలు తనదేగనక, తనకే బహుమతీ రావాలన్నాడు. వెంటనే, ఎక్కడ తెలిసిందో, వెనక ఆరోడ్డు వేయించిన కంట్రాక్టరు వచ్చి, 'అయ్యా!' ఈ రోడ్డు ఇంతమహత్యం గలిగి ఉండేటట్టు తయారు చేయించింది నేను. ఇల్లా రోడ్డులేకుండా ఉంటే కారు ఇన్ని పిల్లిమంత్రాలు వేసి ఉండదు. అది అల్లావేసి ఉండకపోతే, మీకు నడుం కుదిరి ఉండదు. అందుకని బహుమతీ నాది' అన్నాడు. ఆరోడ్డు స్వయంగా తవ్విచేసిన వాళ్ళిచ్చి తమకీ బహుమతీలో వాటా ఉందన్నారు. కాస్సేపటికి బస్తీపాలక సంఘంవారు మనుషుల్ని పంపి, రోడ్డు తమదేగనక బహుమతీ తమదే అన్నారు. ఇది పబ్లీగ్గా జరిగిన పనిగనక, డీ.పీ. డబ్లుయూ వారు రాకుండా ఉంటారా అనికొంద రన్నారు. ఈ లోపల కొందరు బోర్డువారికీ, ప్రభుత్వానికీ, చక్రవర్తికీ టెల్లిగ్రాపులు కొట్టి వార్నొచ్చి బహుమతికోసం దెబ్బలాడమని సలహాయిస్తాం అన్నారు. ఈ దెబ్బలాటలో లక్షారావు చాలా దూరం వెళ్ళిపోయాడు. నన్ను కదల్నీకుండా వీళ్ళంతా పిశాచాల్లా పట్టుగున్నారు. “మీ వాటాలు ఇదైపోనూ, అల్లానే చూడచ్చు లెండర్రా! పోనీ, ఇంకా ఎంతమందికి బహుమతీలో వాటాలున్నాయో కనుక్కుని మధ్యవర్తుల్ని పెట్టి వ్యాపార పరిష్కారం చేయిత్తాం, ముందు అసలుమనిషి దాటిపోకుండా పట్టుగుందాం నడవండి', అని నేను గట్టిగా అన్నాను. అతడు కోటవేపుకి వెళ్ళాడని కొందరన్నారు. కార్ని ఆ రోడ్డుమీంచి గెంటి, పెద్దరోడ్డుమీదికి ఎక్కించి, అంతా కిటకిట లాడుతూ కార్లోనూ కారుమీదా ఎక్కి కూచున్నాం. క్షణంలో కారు కోటదగ్గిరవాలింది. లక్షారావు ఏకోర్టులోకో వెళ్లి అప్పుడే తిరిగి వచ్చేస్తున్నాడు. కొందరెళ్ళి వాకబుచేశారు. వాడికోర్టు చల్లగా ఉండా, అది దివాలాల కోర్టుట, వాడివాయిదా అక్కడట.

అని డాక్టర్ ధనాధన్ వైద్యవృత్తాంతం చెప్పి ఆగాడట. పోనీ మీరు అడ్వాన్సుగా కట్టిన సొమ్ము తెచ్చుగున్నారా?' అని ఆయన భార్య అడిగిందిట. ఆ సంగతి తను అప్పట్లో మరిచా ననిన్నీ, మళ్ళీ వెళ్ళి తెచ్చుగోవాలనిన్నీ ఆయన అన్నాడట.

- జనవరి, 1939