Jump to content

గుసగుస పెళ్ళి/పై పెచ్చుట, తప్పు మాదిట!

వికీసోర్స్ నుండి


పై పెచ్చుట, తప్పు మాదిట!

ఒకనాడు రాగయ్య, మేం వతనగా కలుసుగుంటూండే చోటికి కాళ్ళీడుచు గుంటూ కళేబరం జేరేసి బస్తాలాగ ఓకుర్చీలో కూలబడి ఉసూరుమంటూ ఈ కిందిమోస్తరుగా ఏకరెట్టడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు మేం ఏదేనా ప్రశ్న వెయ్యడంలో నెగ్గినా, అతడు తను మాట్టాడుతూనే అది వినేసే వాడుగాని, సాధారణంగా ఆగి వినేవాడుకాడు. అందుకని రమారమీ అవిచ్చిన్నంగా ఉన్న అతని ఉపన్యాసం మేం, రైల్లో మందుల ఏజంటు అప్పగించే ఉపన్యాసంలాగ, శబ్దగ్రాహిలో ప్రతిఫలించే ఛాయోపన్యాసంలాగ, సశబ్ద చిత్రంలో ఉద్భవించే అఖండ గానంలాగ, ఆపెయ్యడానికి వీలులేని అవస్థలో వినవలిసొచ్చింది!

“పై పెచ్చుట, తప్పు మాదిట! సెబాసు, సిగ్గుఉండద్దూ! ఎవడేనా నవ్విపోడూ! తనజాతి ధనియాలజాతి, చేష్టలు కోతి చేష్టలు, బుద్ధి కుక్కబుద్ధి, నడక పీతనడక, ఉన్న సౌడుభ్యంఇదీ, దీనికి సాయం వేళాపాళాలేకుండా శ్రీరంగనీతులు. వీడిభార్య! బాబో, అసలు మాట్టాడలేం, వీళ్ళ నేరాలు జాస్తి అయిన కొద్దీ వీళ్ళ సబబులుకూడా జోరుచేశారు. వీళ్ళ పెడసరం బండలుగానూ! వీళ్ళు ఎవరికో నా బోటి మేకలాంటివాడికి ఘోరాన్యాయం చెయ్యడం, వాడు ఎందుకొచ్చిందని సాత్వికంగా నోరు నొక్కుగుని ఊరుకోడం, అయినా ద్రోహబుద్ధి పీడించడంచేత వీళ్ళు ఊరుకోలేకపోడం, అక్కణ్ణించి ఆ సాత్వికుడికి తమరు జరిపిన ద్రోహమే ఆ సాత్వికుడువల్ల తమకి జరిగిందని వీళ్ళు ఏడుస్తూ ఎదురు తిరిగి, అట్టు తిరగేసి, నోరు చేసుగుని, అమ్మశక్తుల్లాగ వాడిమీదా వినేవాళ్ళమీదా విజృంభించడం! అప్పుడు మధ్యవర్తులంతా అవతలవాడు సాత్వికుడల్లా కనబుతున్నాడేగాని వాడే ద్రోహి అనుకోడం, నిజంగా బాధపడ్డది వీళ్ళే అనుకోడం. సత్యం ఏదో అసత్యం ఏదో తెలియకుండా పూతపూసి వీళ్ళు ఊరుకుంటున్నారా, సత్యమే అసత్యంఅని జనం నమ్మేట్టు గోలెత్తడం, అసత్యానికి సత్యగౌరవం తెప్పించి నెగ్గడం, ఏక చెండ్రుకోడం, ఏక ఎద్దేవా! చెబితే గర్వం అని ఏడుస్తారుగాని, నేనంటే, మా యింట్లోవాళ్ళంటే, మేం అంతా ఎంత సాత్వికులం! దిక్కుమాలి నక్కలాళ్ళంతావచ్చి నన్ను పేట్రేగ కొట్టకపోతే, నాకు కోసినా - చాకు మీయిష్టం వచ్చింది తెండి పదునెట్టి - కోపం ఉందా! ఇంకోడి జోలి నాకు కావాలా! వీళ్ళకి మరీ వచ్చింది! నా అదైవాటాలో నేను చేరడానికి చాలా పూర్వమే తను అవతలపక్క వాటాలో శనిలాగ పోగై కూచుని, తనమీదికి నేను శనిలా వచ్చానంటాడు, వీడిదుంపతెగా! నేను ఇల్లా నావాటాలో దిగీ దిగకుండానే నాతో జట్టీ! మాతో పోటీ ఎందుకండీ వీళ్ళకీ అడిగేవాడు లేకగానీ! మళ్ళీ వీళ్ళు ఎల్లాంటి సమర్ధింపు లనుకున్నారు, మహాఋషులకేనా ఇంతంత మాటలు చెల్లవ్! నాకు ఉద్యోగం లేదని వీళ్ళు ఎంత ఏడుపో! నాకు ఉద్యోగం కాలేదంటూనే వీళ్ళు ఇంత ఏడిచేటప్పుడు, నాకే ఉద్యోగం అయితే వీళ్ళు బతుకుతారా! అబ్బబ్బ! వొల్చుగు తినేస్తున్నారు. వేగ లేకండా ఉన్నాం. అమ్మయ్య! ముగుడే ముగుడు, పెళ్ళామే పెళ్ళాం! పేళ్ళతో సహా వీళ్ళని ఎల్లా కూర్చి సంపుటీ చేశాడోగాని ఆ బ్రహ్మ!”

ప్రశ్న - ఎవరిమాటా నువ్వనేది! రా - ఏట్లో వాళ్ళమాట ! ఎవరున్నారూ, మా పొరుగువాటాలో అద్దెకుంటూన్న పీనుగులు!

ప్ర - పేర్లు!

రా - వాడి పేరు గుండయ్య, భార్య మిరియమ్మ.

ప్ర - ఓహో! ఉమ్మడిస్థలం గురించిన కుస్తీలా! ఆ మిరియమ్మా

మీ కూచమ్మగారూ పట్టింపులు పోతూంటారు గావును!

రా - అంతటితో కుదిరిందా! హాలూ దొడ్డీ ఉమ్మడి, నా వాటా తూర్పుది, వాడి వాటా పడమటిది, మధ్యహాలులో చెరిసహానికి గీత గీసుకున్నాం. కాని, ఆ చచ్చినాడు రాత్రి మమ్మల్ని కునకనిచ్చి ఆగీత మావాటాకేసి జరిపేస్తూంటాడు. కానీ, వాడిగీత ప్రకారం వాడికి అవుతుందని ఊరుకుంటిని గాదా, ఊరుకుంటూన్న కొద్దీ వాడికి నోరెగిసిపోతోంది, పోటీ బిగిసిపోతోంది.

ప్రశ్న - అసలు కమామీషు ఏమిటి?

రా - అసలా? వాళ్ళు గొప్పవాళ్ళనీ మేం అల్పులంఅనీ; వాళ్ళు ఉద్యోగులనీ, మేం కాదనీ! వాళ్ళు డబ్బున్నవాళ్ళనీ మేం లేని వాళ్ళంఅనీ! ఏముందీ! గుండయ్యకి కొడుకు ఓడున్నాడు. వాడు అచ్చంగా బూడిద గుమ్మడికాయలా వుంటాడు. మొహం కొండముచ్చు మొహం, ముక్కు చిచ్చుబుడ్డి, అం, తోటి కుమారస్వామీ తమరికి ఉన్నాట్టా మాకులేట్టా, అందుకని నేనూ మా ఆవిడా ఉడికిపోయి, వెళ్ళి, మా చెల్లెలి గారి అబ్బాయిని తెచ్చుగున్నాంట తమరిమీద పోటీకోసం! ఈమాట పట్టుగుని మమ్మల్ని అడ్డమైన వాళ్ళ దగ్గిరా నిరసన! వాళ్ళొచ్చి నాతో చెప్పరనే గావును ఈ బోడిగాడి ఉద్దేశం! -

ప్ర - మీరు అక్కడికి వెళ్ళింతరవాతే, వాళ్ళకి పిల్లాడున్నాడు అని తెలిసింతరవాతే, ఒక పిల్లాణ్ణి మీరుకూడా తీసి తెచ్చుగున్నారు గావును!

రా - సడె! మేం మా చెల్లాయిగారి అబ్బాయిని అనేకమాట్లు, ఈ గుండయ్యకి కొడుకుకుంక పుట్టకపూర్వమే ఆపేక్షకొద్దీ తీసి తెచ్చుకునే వాళ్ళం. నీచులికిగాని పోటీ మా కెందుకు ఉంటుందీ! గుండయ్య అంతటితో ఊరుకోవచ్చా, తన కుర్రవెధవకి తోపుడుబండీ ఓటికొన్నాడు. కొన్న మూడోనాడు, మా ఆవిడ, - చెడిబతిగావా బతిగిచెడ్డావా అన్నట్టు, స్వతహా అయినింటి బిడ్డగనక - నాతో “తీరా మనం పిల్లవాణ్ణి ఓణ్ణి తీసి తెచ్చినవాళ్ళం అవనే అయాంగందా! ఊళ్ళో వాళ్ళ కుర్రవెధవ లందరికీ తోపుడు బళ్లు ఊరేగుతూన్నప్పుడు మనం అంత చెడిపోయామా, అంతకీచాలమా, అంతా చెయ్యమా? పాడు రకాలకిగాని మనబోటి గాళ్ళకి పోటీబుద్ది ఎందు కుంటుంది గనక! మనం తీసికట్టు అని ఋజువు చెయ్యడానికేట వాళ్ళు బండీ కొన్నది! ఈపిల్లాడికి మాత్రం బండిమీద మక్కువ ఉండనే ఉండదా, కుర్రనాగమ్మ విప్పిచెప్పుకోలేడుగాని! మీరుకూడా వీడికి ఓటి అల్లాంటిదే కొని గౌరవం నిలబెట్టండి” అని సన్న సన్నంగా సమంజసంగా నా భార్య చెబుతూంటే ఆవిడమాట వినకపోడం అనేది మహాపాతకం అనిపించింది. కాని, బులబాటం చల్లారిం తరవాత, తీరా బండిమీది వ్యామోహం రెండుపూటల్లో గతిస్తే, కొన్న బండీ మళ్లీ ఏం జేసుగోం? అని, నేను ఆలోచించుగుని, ఓబండీ 'టెంపొరీ' గా తెత్తాంగదా అని మర్నాడు చీకటడ్డ తరవాత ఓ వడ్లాబత్తుడింటికెళ్ళి, అక్కడికి మరమ్మతు నిమిత్తం వచ్చిన ఓ బండీ చూసి, బదులుచేసి తెచ్చిన ఓ పావలా వాడిచేతిలో పడేసి, మర్నాడు సాయింత్రానికి అది మళ్ళీ అప్పగించేసే షరతుకి ఇంటికి తోసిగెళ్ళాను. పొద్దున్నే మాపిల్లాణ్ణి అందులో కూచోపెట్టి ఇంకా మా వాటాలోనే ఇటూ అటూ తిప్పుతూంటేనూ, గుండయ్య గాడు పిరికిపందలాగ వెనకాలే - వీడికాళ్లు పడిపోనూ - వచ్చి, - వీడి వేళ్ళు అంటించా - అంటుగునేట్టు ఒక్క చరువు నన్ను చరిచి, పిల్లాణ్ణి కింద పడగొట్టి, బండీ లాక్కు చక్కాపోయాడు, అల్లరవుతుందని అప్పట్లో వాణ్ణి నేను కొట్టలేదు. న్యాయతహా చెప్పుచ్చుగు కొట్టవలిసింది. ఇహ వడ్లాబత్తుడితో ఏం చెప్పనురా బాబూ అనుకుంటూ వాడిదగ్గిర కెళ్ళేసరికి ఆ రాలుగాయి శనిగాడు నీలుగుతూ. 'సిత్తం' అది గుండయ్య గారిదేనండి. మరమ్మతుకోసం అంపారు' అన్నాడు!! ఇది గుండయ్యపనే అయి ఉంటుంది, వీడికొమ్ములు ఎల్లా కొట్టెయ్యడమా, నేను తనంతవాణ్ణే అని వీడికి పాఠం చెప్పడం ఎల్లానా, నా గౌరవం నిలుపుగోడం ఎల్లానా అని నాకు అనిపిస్తూ ఉండేది.

ఎల్లనో పోనీ అయింది దిగమింగి సరిపెట్టుగుందాం అని యత్నిస్తూండగానే, మిరియమ్మ ఓచీర కొంది. అందులో విశేషం ఏమీలేదు. దానికి అంచుమాత్రం పచ్చగా నదరగాఉంది. ఆచీర సింగారించుగుని, మెడ టెక్కించడం, తాళ ప్రకారం నడుస్తూన్నట్టు నడవడం, ఒయ్యారం ఒలక పొయ్యడం, ఉమ్మడి హాల్లోకి రావడం, మా ఆవిణ్ణి వచ్చి కూచోమనడం, అర్థంలేని కబుర్లెట్టడం! ఎందుకూ! మహా అక్కడికి చీరకొంది కాదూ ఎల్లాగైతేం, వెధవచీరా! - నోరు తిన్నగా రాదు నాకు ఏమనుకున్నారోగాని - ఆ సింగారం అంతా ప్రకటించుగోడానికి! ఆమాత్రం మేం కొనుక్కోలేం అనే దాని ఊహా! మా ఆవిడ మిరియమ్మ గర్వం చూసి క్షమించి కిమ్మనకుండా ఊరుకుంది. ఇంకోత్తి అయితే అచ్చంగా అల్లాంటి చీర నుంచున్నపాట్న తెస్తావా కంఠానికి ఉరోసుగోమన్నావా అని ముగుణ్ణి ఱంపాన్ని బట్టి రాసేసేదే. కాని, మావాళ్ళు అల్లాచెయ్యక, రెండోవాళ్ళకి బాధలేకుండా, అన్నం మాత్రం మానేసి బొట్టు చెరిపేసుగుని అతిశ్రావ్యంగా లయ యుక్తంగా రాగాలు పెట్టారు. ఇలాగంటియిల్లాలి కంటినీరు కారితే సముద్రాలు ఏకం అవుతాయని భయంవేసి, చటుక్కున నా ఉంగరం తాకట్టెట్టి రాత్రికి రాత్రి వెళ్ళి నేనూ అల్లాంటిచీరే గాలించి పట్టుగుని తెచ్చి మా ఆవిడికిచ్చి, అది ఆవిడ ధరించి తూర్పు తెల్లారకుండా ఉమ్మడిహాల్లో ఎత్తుపీట వేసుగుని కూర్చుని, మిరియమ్మని పిలిచి ఆవిడతో సోదివేస్తే, అప్పుడు మిరియమ్మకి మాతక్కువ ఏముందో తన ఎక్కువ ఏం చచ్చిందో బోధపడి సిగ్గురావచ్చు గనుక, అల్లా కానిమ్మని మా ఆవిడతో చెప్పాను. కాని ఉదయాన్నే నన్ను లేవగొట్టి మా ఆవిడ దుఃఖించడం మొదలెట్టింది. ఏమంటే నే తెచ్చినచీర అంచుకంటె మిరియమ్మ చీర అంచు, రంగులో, ఒత్తుగా ఉందిట. నిజమే అయిఉంటుంది. రాత్రి నాకు ఆనదు. ఇంతేగదా అనేసి ఆలస్యం కానీకుండా నిలువు కాళ్ళమీదపచ్చసిరా తీసి తెచ్చి మా చీర అంచుమీద ఓ 'కోటింగు' వేశాం. దాంతోటి మిరియమ్మ జలుబు వదిలిపోయిందనుకున్నాం. కాని, మిరియమ్మ మర్నాడు ఓ యాభైయ్యెట్టి బణాత్ చీరకొంది. మా ఆవిడ తక్షణం తనకి గౌరవహాని కలగడం కనిపెట్టి, వెఱ్ఱిబాగుల్ది గనక ఎంతోంత చిన్నబుచ్చుగునే, తన పాత నాగరమూ పట్టిడా కరిగించి సొమ్ము తెప్పించి, అదెట్టి శుద్దబణాత్ కొని, మిరియమ్మ కంటె ముందు కట్టేసుగుని ఉమ్మడి హాల్లో కూచుంది.

ప్రశ్న - కొంత పోటీభావం మీలో లేదంటావా!

రా - ఏడిసినట్టే ఉంది. ఇదా నీతీర్పు! అసలువాళ్ళు ఎప్పుడు ఏం పనిచేసినా తమరి నిమిత్తం కాదు, పక్కనున్న మా దరిద్రం, మా అల్పత్వం, మా అధమత్వం, మా అజ్ఞానం వెల్లడి చెయ్యడానికే అని మాకు తెలుసు, వాళ్ళ “నవిజం” మీకేం తెలుసూ! నాకు నీలక్ష్యంగాని, గుండయ్య లక్ష్యంగాని, మరో మెడమీద తలున్నవాడి లక్ష్యం గానిలేదు. నా గౌరవానికి భంగం వస్తూన్నప్పుడు నాకు అన్నం వడ్డించే వాణ్ణయినా సరే పొడిచేస్తాను. అవసరాన్ని బట్టి నేను దేవుణ్ణికూడా లక్ష్యం చెయ్యను. సమయం వచ్చేసరికి అసలు నాఅంత తల్లకిందులు ముండావాడు ఉండబోడు. ఇంతలో గుండయ్యగాడు ఓ కుక్కపిల్లని కొన్నాడు. దొంగభయం దొట్ర భయం ఉండదు. భైరవం అవతరాల్లో చేరుతుందన్నారు. ఓ కుక్కపిల్ల ఉండడం మనికిమంచిది' అని నా అర్ధాంగి. నాకు అప్పటికి పదిరోజుల క్రితంనించీ సకారణంగా నూరిపోస్తూంటే వాడెప్పుడో వినేసి చేసినపనే అది. మా ఆవిడ మాటల్లోఉండే యాధార్థ్యం మరి తోసెయ్యలేక, మర్నాడు నేను కుంభయ్యగారి కుక్కపిల్లని ఓమాటు అరువిమ్మని అడిగి, గొలుసు పళంగా తీసుగొచ్చి, మా స్తంభానికి ఇల్లా కట్టేస్తూంటే, ఆ కుక్కపిల్లకి ఏం అనుమానం తగిలిందో, లటక్ మని నాకాలు పట్టుకుంది. 'బాబో, రావే రావే' అని మా యింట్లో వాళ్ళని ధైర్యంకోసం కేకేశాను. గుండయ్యకుంక ఇంట్లోలేడు. వాడికుక్కపిల్ల ఏమనుకుందో దానితాడు తెంపుగుని వచ్చి నేతెచ్చిన కుక్క పిల్లమీద పడబోయి - అది తప్పించుకోగా - నారొండో కాలు వడేసి పట్టుగుంది. ఇంట్లో మూల జేరేసిఉన్న మన్యపుకర్ర తెచ్చి మా ఆవిడ ఉమ్మడిగా, దంచి తిరగేసింది, నా కాలికి కొంచెం దెబ్బ తగిలినా నేను లెక్కచెయ్యలేదుగాని, కుంభయ్య కుక్కపిల్ల కుయ్యో మొర్రోయని మొరుగుతూ గిరగిరా తిరిగి పడుకుంది. గుండయ్య కుక్కపిల్ల దెబ్బ తగిల్నట్టేలేదు. అప్పుడు నేను లోపలికెళ్ళి చేంతాడు తెచ్చి దాన్ని కాళ్ళ మీద ప్రాణావశిష్టంగా ఉతికి మళ్ళీ మా వాటాలో అడుగు పెట్టడానికి వీల్లేకుండా ఏర్పాటు చేసేశాను. మిరియమ్మ ఏడుచుగుంటూ ఇదంతా గుండయ్యతో చెప్పుగుంది.

ప్రశ్న - కుంభయ్య తన కుక్కపిల్ల కోసం పేచీ పెట్టలేదూ?

రా - ఎందుకూ! అది చావందే! ఊరికే పడింది. గంజోసి లేవదీశాం. అక్కణ్ణించి గుండయ్య మొహం చూడకూడదు అన్నంత అసహ్యం నాకూ మా ఆవిడికీ కూడా పట్టుగుంది. అదిలగాయతు, నిద్రాహారాలు మానుకుని ఆ వెధవ ఏ కొత్తవస్తువు ఇంట్లోకి తెచ్చుగుని బడాయి కొడుతూనో కొట్టకుండానో ప్రకటిస్తూంటే మూడు మూర్తులా అల్లాంటిదే నేనూ తక్షణమే తల తాకట్టెట్టయినా సరే తెచ్చి నా యింట్లో పడేసి, “ఏమిట్రా నీ గొప్పా! ఎవడికి భయంరా ఇక్కడా! నేను తక్కువ తిన్నానుట్రా! చూస్కో రా!” అని నేననుకుంటున్నానని వాడికి బోధపడేటట్టు చేసేవాణ్ణి. మిరియమ్మ చెవలికి గరిగమ్మల్లాంటి లోలకులు చెయించింది. మేమూ చెయించాం. ఆవిడకాళ్ళకి చక్కిలాలు చెయించింది. మేమూ చెయించాం. ఆవిడి వెండిగ్లాసు కొంది, మేం మా పల్లెటూరిలో స్థలం అమ్మేశా - లేకపోతే వీళ్ళపొగరు అణిగి ప్రపంచం బాగుపడేట్టు కనపడలేదు. ఆ డబ్బొచ్చింది. మేమూ వెండిగ్లాసు కొన్నాం - అల్లాంటి పలకల వెండిగ్లాసే. ఆవిడ పోటీకోసం ఇరవైకాసులెట్టి ఒడ్డాణాం చెయించింది. మేం రహస్యంగా గిలుటుది కొన్నాం. ఆవిడ గంగాళం కొంది. మేమూ కొన్నాం. ఆవిడ దాసీదానికి కుడికన్ను గుడ్డి. కుడికన్ను అల్లానే ఉన్నవాళ్లు ఆ ఊళ్ళో దొరక్క మేమూ దాన్నే పెట్టుగున్నాం. గుండయ్యగాడు ఫిడేలు కొని మొదలెట్టాడు. నేనూ కొని వాయించడం మొదలెట్టగానే అది వినడానికి వాడికి చెవుల్లేక తను వాయించడమే మానేశాడు. వాడు లెక్చరు ఇచ్చాడు. నేనూ లెక్చరు ఇచ్చినట్టు ఒక విలేఖరికి రెండు రూపాయిలిచ్చి పత్రికలో వేయించాను. వాడు పుస్తకం చేశాడు. నేను ఓడిచేత రాయించి వాడికి అయిదు రూపాయిలిచ్చి, నాకర్తృత్వం దానికి పెట్టించాను.

కాని, కొనడానికి వీల్లేని వస్తువులు కొన్ని కొన్ని వాడికి సంక్రమిస్తూ ఉండేవి. నేను ఒకటోరకమైన ప్రజ్ఞగల వాణ్ణి గనక ఒక్కొక్క వడిసుట్టే దాటేవాణ్ణి. వాడికి ఉద్యోగం ఉందిలెండి, వాడల్లా అనుకుంటున్నాడుగాని, వాడి ఉద్యొగమూ నా దగ్గిరున్న గుడ్డిగవ్వా సమానం! ఓ నాడు వాడి అధికారిగారి రొండుగుర్రాల 'సారటు' ముష్టెత్తి దానిమీద తనింటికివచ్చి వాడు దిగడం నాకు తెలిసింది. తనంతటి ఉత్తమురాలికి జీవితేశ్వరుణ్ణి అయిన నేనుకూడా అల్లా రావడం చూసినప్పుడుగాని తనకళ్లు చల్లగా ఉండవని మా యింట్లోది ప్రతిజ్ఞపట్టింది. ఊళ్ళో అల్లాంటి 'కోచి' మరోటిలేదు, పోనీ రెండు విడి గుర్రాల్ని మాట్లాడి, వాట్లమీద ఓ చెక్కపడేసి, దానమీద వచ్చి, మాయింటియెదట దిగెయ్యచ్చు, ఏవడేనా ఇదేమిటని నవ్వితే, ఓరికుంకా, రెండు గుర్రాల బళ్ళు అనేక రకాలురా అని బుకాయించవచ్చు, అనుకుంటే, అంత సమం నడక గుర్రాలు దొరకవండి, ఏ మాత్రం విషమంగా నడిచినా చిక్కు, అని గుర్రాలవాళ్ళన్నారు. అందుకని, ఆ అధికారింటికే దొడ్డిదార్ని నేనూ వెళ్ళి, ఆ బండితోలేవాడి చేతిలో ఓ పాత బేడ పెట్టి, ఆ బండి అధికారిగారికోసం వెళ్లేటప్పుడు మావీధిలోంచి పోనిమ్మని వాణ్ణి ఆజ్ఞాపించాను. వాడు అల్లా చేశాడు గాని నన్ను వెనకాల ఉండే బల్లచెక్క మీద కూచో పెట్టాడు. అక్కణ్ణించే దిగాను. దొంగతనంగా కొందరు పిల్లలు బోలపడుకునీ కొందరు కూచునీ వెడుతూండే చోటుట అది. ఆ పళంగా, మిరియమ్మ, ఒళ్లు తిప్పుగుంటూ, చేతులు గిరవటేస్తూ, కళ్ళు మిటగరిస్తూ, “అదేమిటీ! మీ వారు అక్కణ్ణించి దిగారేమిటి?” అంటూ ఈసడించి మాట్టాడిందిట! మా ఆవిడ మళ్ళీ రాగాలెట్టి, తనముచ్చట్లన్నీ అల్లానే ముక్కలైపోతున్నాయని కుములిపోయింది. బండీతోలే వాడికి సన్నిహితంగా పృష్ఠభాగంలో కూచోడంకంటే వెనకాల హాయిమంటూ గాలేస్తూండేచోట కూచోడంలో నామర్దాలేదు పోదూ అని తెగేసి ఈ మాటు మిరియమ్మకి సమాధానం చెప్తే సరి అని మా ఆవిణ్ణి సమదాయించాను. ఏదో వోటి వస్తూనే ఉంది. గుండయ్యగాడికి విందుపిలుపు గురించి ఓ కార్డు వచ్చింది, నే యింటోలేను. అరుంధతిలాంటి రోషవంతురాలు గనక శిరచ్చేదం అయినట్టు అయి మా ఆవిడ నే రాగానే ఆమాట నాతో చెప్పింది. పిలిచినవా రెవరో తెలియదాయిరి. అయినా మర్నాడు కొంచెం కాళ్ళు అరిగేటట్టు తిరిగి, వయనం దొరక్క ఇది పనికాదని చెప్పేసి, ఆచీట్లు అచ్చుకొట్టిన ప్రెస్సు పట్టుగుని, అక్కడ అటువంటి చీటీ ఒకటి ఓ కాఫీ ఖర్చు పారేసి సంపాదించి, దానిమీద నా పేరు నేనే ఎడంచేత్తో రాసుగుని పట్టిగెళ్ళి నా భార్యకి చూపించి, ఆవిడ యొక్క బాధ తొలగించి, ఆవిడకి ఆనందం కలిగించి, అది జేబులో పెట్టుగుని భోజనానికి వెళ్ళి తరద్దీగా ఉన్నప్పుడు లోపల ప్రవేశించాను. గుండయ్య యత్నాలన్నీ మమ్మల్ని కొంచపరుద్దాం అనే. అందుకనే వాడికి తెగ సప్లయిలు అవుతాయి యింటికి. ఓ మాటు ఓ పల్లెటూర్నించి వాడికి గేద్దూడలాంటి పనసపండూనూ నిలువెత్తు తెల్లచెక్కర కేళీ గెలానూ వచ్చాయిట. కాని, వాళ్ళపుణ్యమా అని, ఆ సమయానికి మిరియమ్మా వాళ్ళూ ఎక్కడికో భోయినాని కెళ్ళారట. చూస్తూ చూస్తూ అంతంత పసందైన ఫలాలు చెయిదాటపెట్టుగుంటే ఏం పాపం మెడకి చుట్టేసుగుంటుందో అని మా ఆవిడ భయపడుతూ “ఎవరికి” అని పట్టుగొచ్చిన వాణ్ణి అడిగిందట. వాడు - గుండయ్య అన్లేక గావును 'గున్నయ్య' గారికేనండి అని చీటీ ఇచ్చాడట. మా ఆవిడ ఆ చీటీ విప్పి చిరునవ్వు ముఖంతో అది చదవడం అభినయించి,

"మాకే! ఇక్కడికే! లోపల పెట్టు పట్టుగొచ్చి! ఆ పేరు మా యింటాయన చిన్నప్పటి ముద్దుపేరు! ” అని వాడితో చెప్పి, అవి యింట్లో పెట్టించి, వాడికింత ఊరగాయిపడేసి ఇంత మజ్జిగ దాహంయిచ్చి, దెయ్యాల్లాగ మిరియమ్మా వాళ్లూ వచ్చిపడకుండా వాణ్ణి తరిమికొట్టేసిందిట. నేను వచ్చింతరవాత ఇదంతా మా ఆవిడ నాతో చెప్పగానే, వాళ్ళకి తెలిసినా కూడా తగదా లేకుండా మా ఆవిడ వ్యవహరించి నందుకు నేను తెగ ఆనందించి, తెగ నవ్వుకుని ఆవిడ ప్రజ్ఞ తెగ పొగిడి, స్వజనవిషయం అయినా తప్పనిసరివల్ల చాలా మెచ్చుగున్నాను. ఒకనాడు ఈ మధ్య నేను ఇటూ అటూ తిరిగి ఇంటి కొచ్చేసరికి మిరియమ్మ డోక్కుంటోంది. ఏమిటని కనుక్కుంటే వేవిళ్ళు అని తేలింది. సరే, మరిఆఖరు. మనం ఆత్మగౌరవం నిలబెట్టుగోడానికి ఇంతబాధా పడుతూంటే వాళ్ళ ఆధిక్యత ఖాయపడడానికి దేవుడుకూడా సంకల్పించాడు కాబోలు అని నాకు దిగులు పట్టుగుంది. పిల్లాణ్ణాంటే, తెచ్చాంగాని, ఇవెల్లా! నేనిల్లానే ఒకనాడు ఆలోచిస్తూ కూచుని ఉండగా, మా ఆవిడా డోక్కోడం మొదలెట్టింది. వెళ్ళిచూస్తే రాగి చెంబుని చిలుంఅరగతీసి నోట్టో పెట్టుగున్నానంది. ఆవేళకి మా ఆవిణ్ణి అంతటితో ఆగమని, అది ప్రాణాపాయం అని ఆవిడతో చెప్పి మర్నాడు ఒక కాకి ఈక తెచ్చి అది గొంతిగలో తిప్పుగుని డోక్కోడం అభినయించమని ఆవిణ్ణి ప్రార్థించాను. ఆవిడ అల్లానే చేస్తోంది. వాళ్లిద్దరి రోగాలూ చప్పగా కుదిరాయి. కాని, గుండెలు బద్దలుచేసే పిడుగుపడ్డట్టు, గుండయ్యకి మూడువేలు లాటరీలో కొట్టుకొచ్చింది ఒక్కమాటుగా! మా ఆవిడ మంచం పట్టి, “మనకి మన ప్రాణాలు నిలవాలీ అంటే ఈ మాటు లాటరీలో మీ పేరు మోగాలి” అంది. నేను తక్షణం లాటరీ అధికారుల్తో మాట్టాడాను. సొమ్ము అడక్కుండా ఉండి, ఆదివ్యయం నేను భరించే షరతుకి, లాటరీ నాకే వచ్చేటట్టుగా కార్యక్రమం నడపగలం అని వాళ్ళు అన్నారు. ఆఖర్చు మొత్తం మొదట్లో 'వెయ్యి' అని అన్నా చివరకి అయిదు వందలు అని స్థిరపరిచారు. నాకు రెండెకరాల భూమి ఉంది. అది అమ్మి వాళ్ళకి అయిదు వందలూ ఇచ్చేశాను. లాటరీ ప్రతిఫలం రేపో మాపో రావాలి. పోటీకుంకలవల్ల ఆత్మగౌరవానికి భంగం వచ్చేటప్పుడు అష్టకష్టాలూ పడవలిసొస్తే పణ్ణూపడాలి, పడుతూనూ ఉన్నాం. అయినా సరే, పై పెచ్చుట, తప్పు మాదిట!!!

- జూలై, 1939