గుసగుస పెళ్ళి/'సనాసమీ'

వికీసోర్స్ నుండి


సమాసమీ

అప్పట్లో నా మకాం చంద్రభవనం. చంద్రభవనం పదిపద్దానుగు పేటల నగరం - పట్టుమని ఓ మహాబస్తీ కాదు కాని, దానికే పల్లెటూరి నజ్జు వొదిలిపోయిందని తెగేసి చెప్పచ్చు. ఆ నగరానికి చెందిన ఒక సంస్థకి - సరి! - ఎన్నికల కార్తివచ్చింది.

“ఓటరు మహాభాగ్యులారా! ఓటు యుగపుణ్యజనులారా! ఒక మనవి, చిత్తగించండి! ఇదేమీ స్వంతం గురించిన బ్యాండు బాజా కాదు, స్వార్థం గురించిన సరాగనాటకం కాదు. కేవల యధార్థం! అందులోనూ కాసాగా సత్యం! ప్రాణం అంటే ఏమిటో ఇంకా ఫలానా అని తేలకపోతేం గనక, అది ఏశరీరంలో నివసించి ఉంటేంగనక, ప్రాణం యొక్క తూనిక ఒక స్థిరమూల్యం అనే సంగతి స్థిరపడింది. కాబట్టి ప్రాణులు సమం. అందులో మానవులు బహుసమం, తెగసమం. దేవుడు తానొక్కడూ రొట్టి పుచ్చుగుని మానవులకి ముక్క యిస్తాడా? ఎక్కడేనా ఉంటుందా! 'నాతో సరిసమానంగా, నా ఒరవడినే, ప్రతీ మానవ వ్యక్తినీ తయారు చెయించానర్రా' అని, దేవుడు వినేవాళ్లతో వేనోళ్ల గొంతిక చించుకున్నాడు, అందువల్ల కూడా మానవులు సర్వసమం (షరా, స్త్రీలుకూడా మానవుల్లోనే జమ). ఇటువంటి మానవవ్యక్తుల్లో ధనాధికార జ్ఞాన సౌందర్యాలను గురించిన హెచ్చుతగ్గులు అనేవి అల్పుల కల్పనాశిల్పం! అయితే, హెచ్చుతగ్గులు ఎందులోనూ లేవా అని తమరు అడగగల్రు. ఉన్నాయి, ఉండాలి! స్థితులూ, పదవులూ, అంతస్థులూ, అవస్థలూ - ఇటువంటి వాటిల్లో మాత్రమే ఉన్నాయి. పోనీ వీటిల్లోనే అయిరి, ఆ హెచ్చుతగ్గులు ఎందుకండీ ఉండడం? అంటే, ఏవో హెచ్చుతగ్గులు ఉంటూంటే గాని లోకవ్యవహారానికి జరుగుబాటే ఉండక, సర్వమూ స్తంభించిపోయి సృష్టి యావత్తూ వ్యర్థం అయిపోతుందని దేవుడికి చాలా భయం అన్న సంగతి నాబోట్లకి రూఢిగా తెలుసు. అందువల్ల యుగ యుగాంతరాల వరకూ స్థితులు మొదలైన వాటిల్లో హెచ్చుతగ్గులు ఉండి తీరతాయి. ఇక, మానవులు గ్రహించవలసిందేమిటంటే! - ఎవరో కొందరు - కొందరు మాత్రమే లేచి, తగుదుమమ్మా అని చెప్పి, ఆ స్థితుల్ని పదవుల్నీ అధిష్ఠించి మైలురాళ్ళులాగ పాతుకుపోయి బైఠాయించి తిష్ఠ వెయ్యడం అప్రతిష్ఠ, అక్రమం, అమానుషం, అదైవికం!అని. అల్లా జరగడం చాలా శోచనీయం ఏమనుకున్నారో గాని! అటువంటి చోట్లకి చకచకా ఎక్కగలుగుతూండేవాళ్లు వెంట వెంటనే భిడియపడి, త్వరత్వరగా తప్పుగుని సరసరా దిగిపోయి గబగబా వీలైనంతవరకు తండతండాలుగా ఇతరుల్ని బొట్టెట్టి పిల్చి, విడివిడిగా వాళ్ళందరికీకూడా ఓ 'ఛాన్సు' - చమ్కీ ఛాన్సు కాకపోతే పీడాపోయిరి, పోనీ ఓ కుర్చీఛాన్సు, ఓ పంకాఛాన్సు, ఆఖరికి ఓ సంతకంఛాన్సు - ఇస్తూండడం ఎంత సమంజసం! పై చెప్పిన స్థితులూ పదవులూ ఒక వేళ కర్మవశం చేత అష్టకష్టాలూ పడి ఆక్రమించుకోగలిగిన వ్యక్తులు, తమ బోటి తమలాటి తమసాటి తోటి మానవ వ్యక్తులు కోట్లాదిగా వాట్లకోసమే పడగాపులు పడిఉంటారనే గమనింపు ఎంత మాత్రమూ లేక, ఒక్కొక్క పదవికే ఒక్కొక్కడు ఏదో అక్కడికి పెద్ద పుప్తి కట్టిన మొగుడులాగ (-అసలు కొన్ని దేశాల్లో ఇప్పుడు ఏడాది పుస్తెలూ, రెండేళ్ల పుస్తెలూ కూడా తయారవుతున్నాయిట!) నిరంతరంగా అవిచ్చిన్నంగా లంగరు వేసెయ్యడం ఉందే, అది, సంఘ తిరోగమనానికీ, ప్రపంచ మరణానికీ, లోకాస్తమయానికి కారణమవుతుంది. ఏమనుకున్నారోగాని! కాబట్టి, పదవులధిష్ఠించిన వ్యక్తులు కొండొకచో మానవ శ్రేయస్సును గురించి ఆలోచన చెయ్యని అటువంటి బాపతు అయినప్పుడు, తక్కిన వాళ్లకేనా లోకశ్రేయోభిలాష ఉండద్దూ! వాగి పదవిలోకి వెళ్లినవాణ్ణి ఇంకా వాగే వాడొచ్చి దింపచ్చుగా! పాడుపన్లు చేసి పదవి పట్టినవాడికి పాడున్నరపన్లవాడు ఉద్వాసన చెప్పచ్చుగా! పోనీ, వేతన పదవులను గురించిన యాతన పై అధికార్లుపడతారు, గౌరవ పదవులు గురించేనా జనం కట్టుదిట్టాలు చేసుగోవద్దూ! పాతవాడే అర్హుడూ, పాతసరుకే గట్టిదీ, పాతదినుసే మేలూ అంటూ కొందరు వోటేశ్వరులు వాదించడం అనేది చాలా కూపస్థంగానూ, మిక్కిలి దేశారిష్టంగానూ పరిణమించి తీరుతుంది. అందువల్ల నేచెప్పేది, అధమం గౌరవ పదవుల్లో నేనా వోటాధిపతులు పాత పైత్య విశేషవాదనలు కట్టి పెట్టి, కళ్లు తెరిచి, దృష్టి నిగిడించి, హృదయ వైశాల్యం పెంచి, మానవ సమత్వం గమనించి, బొడ్డున మాణిక్యం పెట్టుగుని పదవి నిమిత్తం కొందరే పుడతారు గావున - అనే మూఢవిశ్వాసాన్ని నిరసించి రంగు ఫిరాయించి మార్పే పరమావధిగా పెట్టుగుని, క్షణక్షణమూ కొత్త వ్యక్తుల్ని నెలకొల్పుతూండడమే నవనాగరికత, నవజ్ఞానం, నవజీవనం! ఓటయేది, మరోటయేది - ఊహూ- పట్టిగెళ్ళి ఆ వెనకటి ఘటానికే సంక్రమింపజేస్తూ కూచోడం ఎంత తప్పో గ్రహించుకోండి. జీవిస్తే మారాలిగనక, మారిస్తేగాని జీవం కణకణలాడదు. పాత పాతే, కొత్త కొత్తే ఏమనుకున్నారో! కొత్త వ్యక్తిలోనే ఉంది ఏమున్నా! కొత్త పంథా అంటేనే సొగసూ! అబ్బ! కొత్తావకాయ రంజు పుర్రెపోతే మరోదానికి ఉంటుందిటండీ చాదస్తంగానీ! అయ్యో! కావున, ప్రతీ స్థితికీ ఎప్పుడూ పాతవాడేనా! ప్రతీ పదవికీ కలకాలమూ పూర్వవ్యక్తేనా! ప్రతీ అంతస్థుకీ ఎల్లకాలమూ ఆ ఘటమేనా! ప్రతీ అవస్థకీ అస్తమానమూ ఆ స్వరూపమేనా? కాదు, కాదు. ప్రతీదాల్లోనూ ప్రతీకొత్తవాడికీ తరుణం రావాలి! ప్రతీవాడూ చలామణీ కావాలి! అంతా మారాలి! - ఇట్లు, సమా సమీ.”

అనే సారాంశం గల పదాలతో చంద్రభవన వారపత్రికల్లో ఒకటైన 'యుగసంధి' పత్రికలో 'సమాసమీ' గారు ప్రకటించిన వ్యాసం ఊర్ని ఇల్లా ఊపేసింది. ఎక్కడ ఎవరు మాట్టాడినా దీన్ని గురించే. ఎవరు ప్రమాణించినా ఇందులోంచే. ఈ వ్యాసంతో ఊళ్ళో ఉండగల దళసరి జనంలో కూడా సంచలనం కలిగింది, గడ్డ తిరగపడింది, కట్ట తెగడింది. కొత్తదనం ప్రతీ జీవుడిదగ్గిరా ఉండడంవల్ల ప్రతీవాడూ ఈ రచన తన్నే ఆహ్వానిస్తోం దనుకుని. ప్రతీ ఇతరుడి దగ్గిరా పాతదనం కనిపెడుతోచ్చాడు. దీని అర్థం కొంతవరకే అని చాలామందన్నారు. దీని భావం చాలా దూరం వెడుతోందని కనుబొమ లెత్తారు వెయ్యికి ఒకరిద్దరు. ఎంజేస్తాం, అది సత్యంగనక భరించవలసిందే అని ఒకరకం పెద్దలు పెదిమి విరిచి చప్పరించారు. తమకి ఏది చిక్కుగా ఉంటుందో అది మాత్రం అందులో లేదంటూ కొందరు అర్థవాదులు, భావవాదులు, తాత్పర్యవాదులు, వ్యాప్తివాదులు ఇల్లాగా ఊళ్లో వెలిశారు. పోటీలు, పట్టింపులు, పందెం వేసుగోడాలు, ఉక్కురోషాలు, ఉడుకుమోత్తనాలు, అకారణ వైరాలు - ఇల్లాంటివి కూడా ఈరచనవల్ల బయల్దేరాయి.

ఓట్ల కట్నాలు చదివించే రోజు వస్తోందనగా, ఒకనాడు నేను షికారు వెళ్లడానికి బయల్దేరాను. కొన్ని వీథులు దాటి అమాంతరావు ఇంటి ఎదటికి వెళ్ళేసరికి, ఆయింటి మెట్లు ఉత్సాహంగా దిగుతూ, చేతులో ఉన్న పత్రిక మడిచి జేబులో పెట్టుగుంటూ, మొహంలో కులాసా కనపరుస్తూ సవారినాధం వస్తున్నాడు. సవారినాధం ఊళ్ళో పెద్ద హడావిడిదాసూ, చిన్న గ్రంథసాంగుడూ, కొంచెం నాయకుడూ, ప్రతీ విషయంలోనూ తప్పనిసరి పెత్తందారూనూ! విశేషించి నాకు ఓ వేలువిడిచిన పరిచయుడూనూ!

స - ఇదుగో! (అని నన్ను చూసి కనుబొమ్మలూ, దవడలూ ఎగరేశాడు.)

నేను (తల ఎగరేసి నవ్వాను)

స - ఊళ్ళో లేరామిటి? ఈ మధ్య కనపట్టంలేదు!

నే - అబ్బే, ఉన్నా! అమాంతరావు గారింట్లోంచి వస్తున్నారే!

స - అవును, ఆశ్చర్యంగా ఉందా?

నే - మీకూ మీకూ వెనక మాటలు పోయినట్టున్నాయి?

స - ఆఁ. ఎక్కడికి పోతాయి. మళ్ళీ వచ్చేశాయి! అవసరం వెంబడిని వస్తూంటాయి.

నే - పోనీలెండి, అదే కావలిసింది. నాకు సెలవు. వెళ్ళొస్తా.

స - ఉండవయ్యా, ఏకతొందర! నేను పొద్దుణ్ణించి ఎన్నిమైళ్ళు తిరిగానో తెలుసా?

నే - ఓట్లకోసం కాబోలు!

స - కాకపోతే దేనికీ! తెల్లారకట్ట లేచాను, కాఫీ పీల్చాను. రెండు ఊళ్ళెళ్ళి వచ్చి ఈ ఊళ్ళో, ఇంకా ఇంటికేనా వెళ్లకుండా, తిరుగుతూనే ఉన్నాను. ఇంతవరకు మెతుకులులేవు.

నే - అరెరె. వెళ్లి ఎంగిలిపడండి పాపం.

స - అక్కర్లేదు. నిమ్మణంగా వెడదాం. వెళ్లిన పని అవుతూంటే శ్రమ కనిపించదు. రెండుగంటలు కూచుంటే గాని ఓ ఆసామీ ఓటు చేతులో పడలేదు. ఒకప్పుడు అల్లా వస్తూంటుంది.

నే - అమాంతరావు ఓటా?

స - కాదు, సజ్జనరావుది.

నే - అతడు పేచీపెట్టడే! వెళ్లగానే పువ్వుల్లో పెట్టినట్టు ఓటు మూటకట్టి ఇచ్చేస్తాడుగా మొదట అడిగినవాడికీ!

స - అబ్బో, అది వెనక.

నే - అయితే ఏం జేశారూ?

స - ఏముందీ! సజ్జనరావు కూతురికి పెళ్లి సంబంధం కుదరటం లేదు. ఓ ఎక్కా సంబంధం రైటు చేస్తానని అతనికి నచ్చచెప్పి అతని ఓటు లాగేశాను.

నే - వరుణ్ణి ఎల్లా సృష్టి చేస్తారండీ, ఊహా చిత్రమా ఏమిటి?

స - కాదు. నా స్నేహితుడొకడున్నాడు పట్నంలో. అతడి భార్యదగ్గిర లోపాయికారీ అనుమతి మొదట పొంది, ఆవిడికి పబ్లీగ్గా విడాకులిప్పించి, పెళ్ళి అవసరం అతడికి కలిగించి, ఈ సంబంధంలో వచ్చే కట్నం ఆవిడికి పారేయిస్తాను! దానికేం గాని, అమాంతరావుని పడగొట్టడం మరీ కష్టం అయిందిస్మీ!

నే - అదెల్లా సాధించారు?

స - (పత్రిక పైకితీసి) ఈ 'యుగసంధి' సంచికలో ఎవడో మహనీయుడు 'సమాసమీ' అనే మారు పేరుతో రాసిన రచనధర్మమా అని, అతణ్ణి బుట్టలో వేశాను. “గట్టి వాడైతే మాత్రం అస్తమానం ఆ ఒకడేనా గౌరవ పదవిలో ఉండడం! మాట వరసకి చెబుతాను! రేపు మీరోమరీ, మీ వాడోమరీ, తక్కిన వాళ్ళో మరీ, చెబితే బడాయనుకుంటారు, ఎంతచెడ్డా, నేనో మరీ!” అంటూ మాలీసు చేసేసరికి ఓటు నా కిచ్చేస్తానన్నాడు. నే - అయితే, విజయం మీదే అన్నమాట!

స - అన్నమాట!

అంటూ మాట్లాడుకుంటూ ఆవీధి నడిచి ఓ మళుపు తిరగ్గానే, వెనకాల్నించి పరిగెట్టుకుంటూ, మీనయ్య చక్కావచ్చాడు. మీనయ్య సవారినాధంగారి రెండోవాడు. అతగానికి మైనారిటీబాధా, స్కూలుపైనలు పీడా రెండూ కూడా ఏక కాలమందే వొదిలి పోయాయి. మీ - లెఖ్ఖ కట్టించావా, నాన్నా!

స - అబ్బ, ఇప్పుడేమిటోయ్! ఇక్కడే నామిటీ!

మీ - అవును, చాలా అర్జెంటు.

నేను - నాకు సెలవా! ఏదో రహస్యమేమో!

స - దిబ్బ రహస్యం! తన వాటా పంచి పెట్టమంటాడు.

మీ - అందులో తప్పేముందీ! ఆ అబ్బాయినికూడా రమ్మన్నాను.

స - ఆ అబ్బాయేమిటీ?

మీ - ఒక మంచి కుర్రాడు. నా వాటా నాకు దఖలు పడగానే అతనికి ఇచ్చేస్తాను.

స - (నాతో) చూశారా, మావాడి దాతృత్వం!

నే - ఎవరి పుత్రుడు మరీ! (మీనయ్యతో) ఇచ్చేసి మరి నువ్వేం జేస్తావు బాబూ!

స - ఎం జేస్తాడూ! చెంబుకి చింతపండట్టిస్తాడు.

మీ - అదేమిటి నాన్నా! అల్లా కోప్పడతారేం? కర్మాగారంలో పనిచేస్తాను. ఇంకోళ్ళకి లేనప్పుడు నేను మట్టుకి అనుభవించనా?

స - ఏడిసినట్టే ఉంది ఆఖరికి!

మీ - అయితే నేను ఉండకుండా అసలు పోతాను. సరిగ్గా చెప్పండి ఇచ్చేదీ లేందీ! ఇస్తారా, ఆ అబ్బాయికిచ్చేస్తాను. అతనే మిమ్మల్ని 'నాన్నా' అంటాడు. ఎప్పుడూ నేనేనా? ఆ అబ్బాయి గనక రాకపోయినా, ఇష్టపడక పోయినా నావాటా ఈ ఊళ్ళో జనాని కందరికీ సమానంగా పంచి పెట్టేస్తాను.

స - కొందరికొందరికి అబ్జర్లేదోయ్, నిబోడివాటా!

మీ - అయినా పంచుతాను.

స - ఏమొస్తుంది, నీ మొహం, ఒక్కక్కళ్ళకీ! నీ వాటా నాలుగు వేలుంటే ఏమయినట్టూ, ఈ ఊరి జనాభాకీ!

నే - ఒక అరకప్పు కాఫీ విలవ రావచ్చు ఒక్కొక్కడికి.

స - బాగా చెప్పారు. అబ్బాయి, నడమ్మా! నిదానించు, అల్లానే పంచుతాన్లే.

అంటూ మాట్లాడుతూ మరోవీథి నడిచి మరోమళుపు తిరగగానే సవారినాధంగారి ఇంటి వీథులోకి వచ్చాం .

మీ - నాకు మీటింగు ఉంది, నేపోతాను. నావాటా విలువకి చిల్లర పట్రండి.

స - అదోటా! .. పోనీ అన్నానికొస్తావా!

మీ - రాత్రి మాకు మరో మీటింగు లేకపోతే వస్తాను.

స - సరే.

మీనయ్య వెళ్ళిపోయాడు మేంనడుచుగుంటూ సవారినాధంగారి ఇంటి ఎదటికొచ్చాం . ఓజట్కాలోంచి మువ్వదిగుతోంది. మువ్వ సవారినాథంగారి పెద్ద కూతురు. ఆ అమ్మాయి ముక్కుమీద కట్టుకట్టుగుని ఉంది. మరొక అమ్మాయి బండిలో ఉంది. ఆ అమ్మాయిని కూడా దిగమని సంజ్ఞ చేసి, మువ్వ దింపింది.

స - (మువ్వ మొహంకేసి ఆశ్చర్యంగా చూసి) అదేమిటమా!

ము - (మాట్టాడకుండా కొత్తపిల్లకేసి చూపెట్టింది.)

స - (కొత్తపిల్లతో) నువ్వు కొట్టావా ఏమిటమ్మా మా అమ్మాయిని?

కొ - అంత పశువునాండీ?

స - మా అమ్మాయి మాట్లాడదేం మరీ!

కొ - అసలు నేను వద్దంటూనే ఉన్నానండి.

స - ఏం జేసిం దేం జేసింది?

కొ - తన ముక్కు చివర చిన్న ముక్క ఓటి కత్తిరించి దూరంగా పారేశింది, వెతికి తెచ్చి అతకడానికేనా వీల్లేకుండా!

స - అయ్యొ! అదేమీ?

కొ - మొదట మేం ఇద్దరమే వాదించుకున్నాం అనుకోండీ! తరవాత వెళ్ళి మధ్యవర్తుల్ని అడిగాం.

స - ఏ విషయం?

కొ - మా యిద్దర్లో అందకత్తె ఎవరూ అని? ఎవర్నడిగిచూసినా, మీ అమ్మాయే అందమైందన్నారు.

స - లేకపోతే నిన్నంటారని ఎల్లా అనుకున్నావ్, పిడకమొహం తల్లీ! నువ్వేమన్నావ్?

కొ - చెప్పేదోటి, చేసేది మరోటీనా అన్నాను.

స - అనగా?

కొ - రూపం ఎప్పుడూ తనకే ఉంచుగుంటే, సమత్వం కబుర్లు కట్టెయ్యమన్నాను. .

స - ఏడిసినట్టే అన్నావు తల్లీ? ఇంకోరి రూపం నీ కెల్లావస్తుంది. ఎడ్డిమృగానికీ! నీ మాటలో సబబుండాలా?

ము - అందకనే నే నీపని చేశాను నాన్నా! నా రూపానికి వికారం వచ్చేసింది గనక ఈవిడరూపానికి అందం బయల్దేరేసింది. ఇంటోకి పదండి, (ఆవిడతో) రావమ్మా! రాంభాయమ్మా! కాఫీ పుచ్చుగుని వెడుదుగాని!

స - (నాతో) ఎంత చిత్రంగా తయారయారో చూశారా! సంతానాన్ని కన్నవాళ్ళని ముక్కూ చెవులూ తెగొయ్యాలి.

నే - నాసికాగ్రత్యాగం సంతానాలే చేస్తూంటే, తల్లిదండ్రులకి కర్ణఖండన చాలనుకుంటాను. 'సమాసమీ' గారు ఈ విషయంలో ఏమంటారో!

స - ఏమో! వారి మొహం అంటారు, వారి మొహం వారి మోరానూ!

అని సవారినాధంగారు పత్రిక తీసి, చింపి, ముక్కలు చేసి నార చల్లినట్టు చల్లేశారు. వీథిగేటు దాటి ఇంటి ఆవరణలో మొక్కలమధ్య తీర్చి కట్టిఉన్న 'ఆర్చి' కింది బాటమీద నాలుగడుగులు వేశాం.

నే - నాకు సెలవా?

స - అబ్బ, రస్తురూ! కాస్సేపు కూచుని వెడుదురు గానీ?

అనడం ముగియకుండనే, భంట్రోతు ఎదటిహాల్లోంచి పైకివచ్చి, భం - అయ్యగారండి! పెద్దబ్బాయిగారికి ఆస్ట్రేషన్ అయిందండి. ఆర్నీ, ఆ ఇంకోఅబ్బాయినీ ఇప్పుడే ఉత్తరపు గదిలో పడుకోపెట్టి ఎల్లిపోయారండి, డాక్టరు!

స - (ఖంగారుగా) అయ్యొ! ఆపరేషనా?

భం - మరేనండి.

స - ఇంకో అబ్బాయా?

భం - మరేనండి. మరో అబ్బాయి?

స - బాఘా దెబ్బలు తగిలాయా ఇద్దరికీ? సైకిల్ సరసంగావును.

భం - కాదండి.

స - మరి!

నే - శంఖయ్యకాదూ మీ పెద్దబ్బాయి?

స - అవునండి,

నే - ఏమన్నా జబ్బుగా ఉందా?

స - లేదండీ! పట్నంనించి సెలవలకివచ్చాడు వారమాయె. (భంట్రోతుతో) కొట్టుగున్నారా ఏమిట్రా, కర్రలుచ్చుగునీ! ఎదీ! ఆగదిలోకి వెడదాం నడు.

భం - రేపు ఉదయందాకా ఆర్ని మాట్లాడించ కూడదంటండి, డాకటేరు అన్నారు.

స - హోరి! అల్లాయితే అసలు ఆపరేష నేమిట్రా దిక్కుమాలాడా!

భం - అబ్బ, ఏటండీ, నన్నంటారూ! బుర్రకాయ ఆప్రేషనా, బుర్రగుంజో, అదేదోటండీ! ఎళ్ళి డాక్టర్ని తీసుకొచ్చేదా! ఆరుకొత్తోర్ట.

స - అబ్బ, వాడెక్కడున్నాడో ఇప్పుడూ! అబ్బాయి కులాసాగా ఉన్నాడా, పోనీ?

భం - నవ్వుతూ ఉన్నారండీ.

స - స్పృహ ఉందా?

భం - అబ్బే, చా, పిక్కలా గున్నారండీ.

స - (నాతో) వీడెవడో అఖండ డాక్టర్లా ఉన్నాడండోయ్!

నే - లేక ఒకవేళ, ఖండ డాక్టరేమోనండి...

స - ఏంరా? ఇంకా ఏం జేశాడు ఆ డాక్టరు?

భం - అబ్బ, నాకు తెల్దండి, ఈరి బుర్రలో ఉండే గదులమద్దిన కొలపుల్లతో సూత్తే తొంబయి పెగ్గెలున్నాయంటండి. మరో అబ్బాయికి పదే ఉన్నాయంట. ఈ అన్నాయం తీసెయ్యాలని పెద్దబ్బాయిగారి పట్టంట! యెంట్నే యీ ఆప్రేషనయింది. అబ్బాయిగారి బుర్రలోకి కపాళం పక్కమ్మటే బెమ్మరంధ్రంలో పిచ్చిగారి పోనిచ్చి ఓ నలభై పెగ్గెలు పైకి ఎగజుర్రి లాగేశారంట, ఆ సేత్తోనే ఆ ఇంకోఅబ్బాయి బుర్రలోకి, అయి, 'ఇండీషన్' చేశారంట! రేపటుదయానికి ఇద్దరికీ ఓటే తెలియీ, ఓటే పెగ్గా, ఓటే మాటా, ఓటే గ్యాపకం, ఓటే అబిప్పరాయం , ఆ, ఓటే కమామీషూ ఉంటాయట! వారం ఆగి మరో ఆప్రేషన్ చేత్తే, ఆ యింకో అబ్బాయికే తొంబయి పెగ్గెలూ, మన పెద్దబ్బాయి గారికి పదీ అయిపోతా యంటా! (గారాం నటిస్తూ) అయ్య గారండీ! మీ పెగ్గెలు నాకు 'ఇండషన్' చెయించరండీ, మల్లీ ఆ డాకటేరు తోకముడుత్తాడేమో!

స - (నిర్ఘాంతపోయి, నాకేసి చూసి) చూశారా, వీడి కోరికలు!

నే - (యాదాలాపంగా, భంట్రోతుకేసి చూసి) వాడు కోరుకోతగ్గవాడు, మీరు చెల్లించ తగ్గవారు. అని నే నూరుకున్నాను. నేను పోతానంటే నన్ను సవారినాధం పోనిచ్చాడు కాడు. ఇంకా యేం జరుగుతుందో అని నాకు భయం పట్టుకుంది.

స - (భంట్రోతుతో) సమాజంనించి అమ్మగా రొచ్చారా?

భం - రాలేదండి.

స - ఏమో?

భం - ఆడోరి కందరికీ ఈయాల సంబరం దినంటండి, సాలుసంబరం కామోసు.

స - అమ్మాయి, మువ్వా! రవ్వ రాలేదూ?

రవ్వ సవారినాధంగారి రొండోకూతురు.

ము - వాళ్ళ నవసమాజభవనం ఈవేళ తెరుస్తారు. (పొట్టిగా ఉన్న వీధిగోడమీంచి చూసి) అదుగో, అక్కడికి ఈ దార్నే వెడతారు గావును!

ఒక్క చిటిగెలో మేం నడిచివచ్చిన వీధిచివరనించే ఆరుగురు క్రాపుజుట్టువాళ్ళు, ఇద్దరిద్దరు చొప్పున మూడువరసల్లో నడిచివస్తూ మాకు కనిపించారు. మొదటివరసలో ఉన్న రవ్వ, చేత్తో, ఒక పటంకర్ర నిటాగ్గా పైకి పట్టుగుంది. ఆపటం మీద పెద్దఅక్షరాలతో “మానవ ప్రకృతి సమాజం - చంద్రభవనం” అని రాసి ఉంది. కాక, ఆ అట్టమీదే రెండు బొమ్మలున్నాయి. రెండు బొమ్మలూ ఒకే వ్యక్తివి. కాని, ఒకబొమ్మ స్త్రీ గానూ, ఇంకోటి పురుషుడుగానూ ఆవ్యక్తిని ద్యోతకం చేస్తున్నాయి. రెండు బొమ్మల్లోనూ ఉన్న వ్యక్తి ముఖానికీ, ఆ అట్టకర్ర పట్టుగున్న రవ్వయొక్క ముఖానికీ తేడా ఒక్క రవ్వకూడా లేదు.

స - (నాతో) మా రవ్వకి ఇదో చాదస్తం అండి.

నే - చాదస్తమేమండీ! నిక్షేపంలా ఉంది.

స - రవ్వ ఎప్పుడూ నాతో వాదన. పరమాత్మ తనికిమల్లేనే ఉండి ఉండాలని.

నే - అల్లాగే మరీ! మరి నాకు సెలవా?

స - మా ఆవిడ వచ్చేవేళ కావొచ్చింది, ఉండండి.

నే - మీకు బోలెడు పని ఉన్నట్టుంది. ఇంకా భోయినం లేదాయిరి!

స - ఫరవాలేదు లేస్తురూ!

అని ఆయన లోపలికెడదాం అని చూస్తూండగానే, ఆవీథి రెండోవేపునించి ఒక పెద్ద తొడతొక్కిడిలాగ స్త్రీ జనం వచ్చేస్తున్నారు. కోలాహలం ముందే వస్తోంది. పెద్ద జండా పుచ్చుగుని ఎదట నడిచి సమీపిస్తున్నారు నాయకురాలైన చీమమ్మగారు - అనగా సవారినాధం సతి. తక్కినవాళ్లంతా, వెనకాల, ఎడంచేత్తో చిన్నజెండా, కుడిచేత్తో పూలదండా పట్టుగుని ఘోషణ అరుపులు అరుస్తూ బిలబిలలాడుతూ, ఒకర్ని ఒకరు తోసుగుంటూ, దిగలాగుతూ, కదల్తున్నారు. పెద్దజండామీద “ఎల్లకాలం పాతవాడేనా!”, “కలకాలం పూర్వఘటమేనా!” లాంటి ఎన్నిక రోకళ్ల పాటల చరణాలు రాసి ఉన్నాయి.

స - (గీసిన కందలా మొహం చేసుగుని నాతో) చూశారా! దాని అర్థం ఏముటో గమనించారా?

నే - ఎన్నికలండీ! అదోటేగా విషయం!

స - మీ తలకాయి. నాకు దానర్థం స్పష్టంగా తగుల్తూంటే పెడర్థం సమర్థిస్తా వేమిటయ్యా?

నే - చిత్తం. ఇంతటితో నాకు సెలవా? వచ్చేవాళ్లు ఇంకా సమీపించారు. చీమమ్మగారు ప్రశ్నకేకా, తక్కినవారంతా కలిసి జబాబుకేకా వేస్తున్నారు. (ఆవిడ చేసిన ప్రారంభమే ఇటీవల టాకీ ప్రదర్శనం గురించిన ఘోషణల్లో కుర్రాళ్లు నేర్చుగున్నట్టు తెలుస్తుంది!)

చీ - ఏం రకం కావాలి?

తక్కిన - కొత్తరకం కావాలీ.

చీ - ఏం సరుకు పోవాలీ?

త - ఉన్న సరుకు పోవాలీ.

చీ - ఎక్కడెక్కడ పోవాలీ?

త - ఇంటాబైటా పోవాలి.

సవారినాధంగారు కూచోపడ్డాడు.

చీ - ఏం కూడా మారాలీ?

త - అంతా కూడా మారాలి.

చీ - ఏం పత్రిక చదవాలీ?

త - యుగసంధే చదవాలి.

సవారినాధం తల వెనక్కీ కళ్లుపైకీ, కిందపడ కిందకీ పోయాయి.

చీ - ఏం వ్యాసం?

త - సమాసమీ.

చీ - ఎవరిదీ?

త - మీది!

తక్షణం ఆ స్త్రీలోకం యావత్తూ “జయ్ 'సమాసమీ'గారికీ జయ్!” అంటూ అరుస్తూ, ఒక్కొక్కరే వచ్చి తమ చేతుల్లో ఉన్న దండల్తో నాయకురాలి మెడ నిండేశారు!

- సెప్టెంబర్, 1943


★ ★ ★