గురుజాడలు/కవితలు/లంగ రెత్తుము

వికీసోర్స్ నుండి


లంగ రెత్తుము

               1
విరిగి పెరిగితి పెరిగి విరిగితి;
కష్ట సుఖములపార మొరిగితి;
పండు నన్నవి ఆశలెన్నో
          యెండి రాలగ బొగిలితిన్.

              2
అంద జాలని పళ్ల కోసము
అఱ్ఱు జాపితి; నేల పాకిన
చెట్ల పళ్లను విలవ లెరగక
           పాదరక్షల మట్టితిన్.

              3
తీపి విరిగిన చెరుకు వలె ఆ
నాటి కోర్కెలు నేడు బెండౌ
టెంచి నవ్వితి; బుద్ది చపలత
           కొత్త కోర్కెల తగిలితిన్.

              4
దేవతలతో జోడు కూడితి;
రక్కసులతో కూడి ఆడితి;
కొత్త మిన్కుల తెలివి పటిమను
           మంచి చెడ్డల మార్చితిన్.



                  5
చూతునా! అని చూసితిని; మరి
చేతునా ! అని చేసితిని; ఇక
చూడ చేయగరాని వింతలు
          చూపి కన్నులు కట్టితిన్.

                  6
శత్రు మిత్రుల కిచ్చి నెనరులు
స్నేహవార్ధిని కొల్లగొంటిని;
నాటి మిత్రులు తరల శూన్యం
           బైన పుడమిని నిలిచితిన్.

                 7
పంజరంబున నున్న కట్లను
పగలదన్నగ లేక స్రుక్కితి;
నింగి పర్వగ లేని జన్మము
           నీరసంబని రోసితిన్.

                 8
“ఉసురులకు విసికితివొ? యుద్ధము
కలదు; దేశము కొరకు పోరుము.”
యుద్దమా? ఇకనేమి లోకము !
            చాలు ! చాలును ! లంగరెత్తుము.

(కృష్ణాపత్రిక, 1915 జనవరి రచనాకాలం 1914 సెప్టెంబరు)

This work is in the public domain in the United States because it was published before January 1, 1929. It may be copyrighted outside the U.S. (see Help:Public domain).