గురుజాడలు/కవితలు/ఋతశతకము

వికీసోర్స్ నుండి

ఋతశతకము


స్మితమతి సూచీ భేదిత
ఋత మౌక్తిక పదక శతక మిభపతి భాషా
సతి కతి కుతుకత గూర్చగ
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్.

సతి ప్రేమ వృత్తులను గని
పతి నమ్మిక నెగడు రీతి ప్రకృతి సతి యెడన్
మతియుతుడు ఋతము గనుటను
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

వెత బెట్టకు మిది యిమ్మని
బ్రతిమాలెడు ప్రియుని పల్కు ప్రతిభాషల సు
స్మిత ఋతమున్ వివరింపగ
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

ఋతము లతియత్న మృగ్యము
లతిగుప్తము లౌట పండ్ల నాకులలోనన్
వెతుకు గతి వెతుక దగునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

ఋతము గనుట లుప్తాక్షర
తతి పోల్కియు వేరు తెలివి తలపుల గూటం
బు తలప దాని క్రమమ్మని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

అతి సుకుమారము ఫలద
మ్మృత వృక్షం బనృతకక్ష మేచిన దానిన్
హతిజేసి తరువు గనుమని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

కుతప తరుణీ కర శబలీ
కృత వాతాచక్ర మనిల కృపి జెడు భంగిన్
ఋతమంటి కల్ల చెడునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

వితథముల బల్కి యొరులకు
వెత జేయు నతఁడు వన్నెలు వెట్టి యనృత పా
తతి కీలల తనె పడునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

కతలను రక్కసు నెత్తురు
క్షితి బడి రక్కసులగు గతి నృతమతి జంపన్
ఋతములు మితి లేకగునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

అతి తృష్ణాగ్ని పిశాచము
మతి ధర్మపథంబు నుండి మరలించు నెడన్
ఋతవిదుడె త్రోవ యిడునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

చతురత నశ్వంబును వలె
మతి నొంచు విచిత్ర గతుల మానవుడీ వై
నృత సత్యవర్త్నలం జన
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

ఋతమందు నిలిపి యుంచిన
మతి కుడ్యావృత సముద్ర మధ్యస్థంబై
ద్యుతి జెందు నోడ వలెనని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

మతి వీణా నిక్వణమున
ధృత తంతువు మీటకున్న నెట్టావృతమై
శ్రుతి చెడు, శ్రావ్యత యెట్లని?
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

మతి వీణ మీటు నంతనె
ఋత తంత్రీ శ్రుతిని జేరి యింపుగ స్వరముల్
ప్రతి సంవాద మ్మిడునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

ఋతమతి చూపులు దాకకు
మతి విద్యుద్యంత్ర మంచు మానిసి పగిదిన్
ధృతి చెడి వికలత గనునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

కితవత గట్టిన సంపద
కుతు కోద్యతి డించు పేక కోటల రీతిన్
ఋతమంటి నంత చెడునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

ఇతిహాసానృత కోష్టము
లతి కామోద్రేక రచన లందిరి నృపతుల్
ఋతకృతు లొందగ నృపతికి
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

మృతభట సంభృత రణ భువి
కుతల పతులు గనిరి కీర్తి కుంజర పతికిన్
మృతజీవిక ఋతభువి
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

గత క్లేశము లొదవు హాయిని
కతలను విను వలన నెట్లు గలుగున్ సుఖముల్
మతిలేక నట్టి పోల్కిని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

బ్రతుకు విధము దెలియగ నగు
బ్రతికి యవుల బోవు తెలివి వంక వెతల నీ
ది తరణి గనుటయె యగునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

వెతక దగు నొక్క సత్వము
మతి నరు నొక్కింత ప్రేమ సరిగా జూడన్
నితరము లరయం జనదని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

ఋతమునకు బ్రాణ మిచ్చిన
మతిమంతు చరిత్ర కాల మార్గము నందున్
ఋత ఋజ దీపం బనుచున్
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

మితి మీరి దానవు తా
మృతిదాయక లోహమెత్త మెయి జీవనమౌ
గతి లోహమెత్తె నరు డిల
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్



వితత కవితా ఖని గని కు
మతి కను చెదురు; మతియుతుఁడు కవితల సొంపున్
చతురత నేరిచి గనునని
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్

ధృతి గురు జాడల నరిగెడు
గతి పెద్దలు జూప జనితి గజపతి త్రోవన్
కృతి కదె గౌరవమగుటన్
సతతము సంతస మొసంగు సత్యవ్రతికిన్