గురజాడలు/మెరుపులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


మెరుపులు


ఈవియు దియ్యని మాటయు
భావంబున జేయతగిన పని తెలియుటయున్
ఠీవియగు ధైర్యభావము
రావు సుమీ యొకని వలన రావలె తనతోన్.

మానిసులు గాని యింతుల
తా నేర్చని నేర్పు చెలగు తరి జెప్పంగా
జ్ఞానవతుల కగునె పికము
దాని శిశువుల బెంచు నెగురుదాక నొరుచేన్.

గడ్డి తిను కారు మెకముల
బొడ్డున కస్తూరి నునిచి పొలియగ చేసెన్
జడ్జివిధ దుష్టజిహ్వల
నొడ్డిన సమకూరు శుభము లుర్విజనులకున్.

అడచుకొన కింద్రియంబుల
నిడుమల కది త్రోవ యండ్రు యివి యడచుటయే
కడు సంపదలకు బాటగు
నడుమే తేర వి ష్టమొదవు నా మార్గమునన్.

కాశి జచ్చెనేని కలుగదు జన్మంబు
కలిగెనేని నుదుట కలుగు కన్ను
సిరసు నందు చిన్ని సిరి తోడుబుట్టువు
కంఠసీమ వెలయు గరళ చిహ్న

నాల్గు రీతుల గనకంబు నాడెమగును
వేటు గీటుల తునియించి వెచ్చజేసి
నరుడు నట్టుల నాల్గింట నాడెమగును
కులము శీలంబు కర్మంబు గుణము చేత.

(ఇవి కొన్ని సంస్కృత శ్లోకాలకు గురజాడ తెనిగింపు అని అవసరాల సూర్యారావు గుర్తించారు. సం||)