గుత్తునా యని జాతి ముత్యాల్
Jump to navigation
Jump to search
మహాకవి (గురజాడ అప్పారావు)
గుత్తునా యని జాతి ముత్యాల్
గుచ్చినాడే మేలి సరముల
ఇత్తునా యని తెలుగుతల్లికి
ఇచ్చినాడే భక్తితో!
నవ వసంతము నవ్య వనరమ
మావి కొమ్మల కమ్మ చివురులు
పాట పాడెడి పరబృతంబును
ఎవ్వ రాపుదురో?
పొడుపుమల పయి రంగవల్లిక
మింటి నడుమ ప్రచండ తేజము
సంజమబ్బుల పైని కెంపులు
చూడ రైతిరిగా!
రంగవల్లిక మాయ మయ్యెను
చండ తేజము మాసిపోయెను
సందెకెంపులు సాగిపోయెను
వెదకుచున్నారా!
కారుచీకటి క్రమ్మినప్పుడె
చదలు మబ్బులు కప్పినప్పుడె
మిణుగు రైనను మెరయనప్పుడె
వెదకుచున్నారా!
చుక్క లన్నియు సొక్కి సోలెను
గిరులు కదలెను, తిరుగ పాడెను
లోకమోహన మధురగానా
స్వాదమోదమున.
యుగయుగంబులనుండి మ్రోగెడు
విశ్వగాన వియత్తరంగిణి
భంగముల నుప్పొంగు నాతని
గీతశీకరముల్
పాట పాడిన పరబృతంబును
మూగవోయిన ముద్దుకోయిల
చిన్నిపికములు చిరుతపాటల
పిలుచుచున్నవియా!