Jump to content

గరిమెళ్ళ వ్యాసాలు/సాంఘిక నవల

వికీసోర్స్ నుండి

సాంఘిక నవల

మన ఆంధ్రమున నిప్పటి కొక వేయి వనలలయినను ప్రచురింపబడి యుండవచ్చును. వీటిలో ననేకములు బంగాళీ, హిందీ, మహారాష్త్రము మొదలగు దెశీయ భాషలనుండి తర్జుమాలైయున్నవి. వీటిలో గూడ కొన్ని మహమ్మదీయ, మహారాష్ట్ర రాజపుత్ర యుగములనాటి చరిత్రాత్మకములై యున్నవి. కొన్ని బ్రిటీషు యుగము నాటి రహస్య పరిశోధకములై యున్నవి. మఱి కొన్ని పౌరాణికములై కూడా యున్నవి. అతి కొంచెము మాత్రము గ్రంథకర్తలు తాము స్వయముగా నాలోచించి వ్రాసినవై యున్నవి. వాటిలో గూడ మరల ఆంధ్రదేశపు టాచార వ్యవహారములకును, ఆంధ్రదేశపు పల్లెలు, పట్టణములు, ఏఱులు, సరోవరములు మొదలగువాటి వర్ణనలకును సంబంధించినవి మఱియు స్వల్పము. ఈ చివర వాటినే తప్ప మఱి వేనిని గాని ఆంధ్ర సాంఘిక నవల యనుటకు వీలు లేదు. అయినను ప్రస్తుత గ్రంథకర్తలలో సాంఘిక నవల వ్రాయుదమను నుత్సాహము మిక్కుటముగా గనుపట్టుచున్నది. ఇట్టి యవసరమున సాంఘిక నవల కుండవలసిన లక్షణము లెవ్వి? అవి యెట్లు మన ప్రస్తుత సాహిత్యమున నచ్చటచ్చట పొడచూపు చున్నవి. వాటినెల్ల సంపుటీకరణము చేసి యందమగు సాంఘిక నవలా నిర్మాణమున కెట్లు దారితీయనగును అను అంశములను కొంచెము విచారించుట యెంతమాత్రమును నప్రస్తుతము కాదు. లాక్షణికులిట్టి నిర్ణయమిప్పుడు చేయనిచో ప్రతి లేఖకుడును ఏ వివాహమునకో వ్యవహారమునకో లేక వింతకో సంబంధించిన యొక కథనల్లి దానికి సాంఘిక నవల యను పేరు పెట్టుట తటస్థింపవచ్చును. అట్లు జరుగుచున్నది కూడాను.

ఐరోపా ఖండములోనేమి భారతదేశముననేమి నవల యనునది పురాణములు, పద్యకావ్యములు, వచన చరిత్రములు మొదలగునవి యెన్నియో వెలువడిన తర్వాత నూతనముగా వికసించిన సాహితీ విశేషమని చెప్పవచ్చును. ఐరోపా ఖండములో అనేక సాహిత్య వికాసములకు లాటిను భాషయు, ఇటాలియను గ్రంథములును మార్గదర్శకము లైనట్లే నవలలకు గూడ ఇటాలియను నవలలే మార్గదర్శకములుగా నుండెను. ఇటాలియను నవలలు తరుచుగా ఉన్నత కుటుంబములకు చెందిన యువతీ యువకులు, నాయికా నాయకులు కలవిగాను, వారు ఒకరి ప్రేమ నొకరు చూఱగొనుటకు చేయు త్యాగములు, విలాసములు, పరిశ్రమలు మొ॥నవి విషయములుగా గలవిగాను, చాలమట్టుగ చరిత్రాత్మకములు గాను, కొంత వరకు అద్భుతములతో కూడినవిగాను నుండెడివి. అయిరోపా ఖండము ఇటాలియను సాహిత్య పరిచయము వలన బడసిన నూతన భావములతోను, ఉత్సాహములతోను ఉఱ్ఱూతలూగెడి సమయమున వివిధ దేశములలో ప్రథమమున వెలువడెడి నవలలిట్టివి గానే యుండెడివి. ఆంగ్లేయ బాషలో స్కాటు నవలలను పఠించు వారికి వాటి లక్షణములు తెలియగలవు. మనదేశములో రసపుత్ర శౌర్యముగ రచించిన విమలాదేవి, రాణి సంయుక్త మొదలగు నవలలు కూడా నిట్టివే.

ఈ నవలలను పఠించుట వలన నవలయను పేరు మోసెడి ప్రతి గ్రంథమునకును కొన్ని పడికట్లుండుననియు, అది లేనిచో ఆ గ్రంథము నవల కాదనియు అభిప్రాయము సాహిత్య ప్రపంచమున నల్లుకొనెను. ఆపడికట్లు ఉన్నత వంశమునకు చెందిన నాయికా నాయకులు, వారొకరికొరకొకరు తప్పక త్యాగము చేసి యిడుములు గుడిచి తమ ప్రేమను ఋజువుపరచుట, నీతిదాయకమై నెగడుట, భాష రసోద్దీపకమై శబ్దాలంకార శోభితమై లలితమై, గంభీరమై యుండుట ఆయాతావుల కథకెంత యవసరమో అంతకు మించియు (కథనడకలో విస్తారము సంబంధము లేకపోయినను సరే) ప్రకృతి వర్ణనములు సలుపుట మొదలగునవి. ఈ విశ్వాసము నవలా ప్రపంచమున నొక మూర్ఖమతము వలె వ్యాపించి యీజాతి నవలలన్నియు స్థల నామములు, పురుష నామములు మత్రమే భేదముగా సమస్త దేశముల నవలలు నొక్క తీరుగా నుండునట్లు చేసినది. ప్రత్యేక స్థలముల యాచార వ్యవహారములు గాని, నిరూపణలు గాని, వ్యక్తుల పోలికలు గాని చేజిక్కక యువకజనోచితంబగు నుత్సాహమును మాత్రమినుమడించుచు, అద్భుత చర్యల పఠనమున కాస గొలుపుచు వచ్చినవి. వీటిని నవలలు కావని యెవ్వరును ననజాలరు. అవియొక రీతి ననలలు. సాంఘిక నవలలు కావు.

సంఘజీవనము నందాసక్తి పుట్టి, వారి యాశలు ఆశయముల యందు మనకభిరుచి జనించి వారి తళుకులు, బెళుకులు, హోయలు, యొయ్యారములు, నవ్వులు, పరియాచికములు, విచారములు, కష్టసుఖములు మొదలగు వాని యందు సానుభూతి జనించి ఆ అచ్చటలను ముచ్చటలను ఆనందదాయకముగా వీలయినంత వరకు వారు మాటలాడుకునే శబ్దార్థాద్యలంకార రహితమగు శైలిలో చెప్పెడి ప్రశంసలకే సాంఘిక నవలలని పేరు. అట్లని శైలి అల్పులు, నీచులు కూడ మాట్లాడెడి రీతిని హేయపద భూయిష్టమై యుండకుండా సఖ్యమై వెగటు పుట్టించ కుండిన చాలును. ఇట్టి నవల కుండవలసిన ముఖ్య లక్షణమేమన కథ యే కాలము నాటిదని మనము చెప్పుచున్నామో, ఆ కాలము నాటి మాటవడుపు, యాస, మర్యాదతీరు స్థలాదుల చిత్రము కళ్ళకు కట్టినట్లగుపడవలెను. ఇట్టివన్నియు పురుషాంతరమునున కొకసారియైన నచ్చముగ మారిపోవుచుండును. సాంఘిక నవలయనిన కథ చెప్పుట కాదు. కథ చెప్పుటకెట్టి శైలియైనను నొకటే. యెట్లు వర్ణించిననునొకటే. సాంఘికనవలయనిన కథను చిత్రించుట. ఇట్టి చిత్రమున కెక్కడనుండవలసిన రంగు, నీడ, కాంతి అక్కడ సరిగ నుండిననే చిత్రము సరియైనదగును కాని సంఘమర్యాదలు, వివరములు, స్థలము యొక్క తాత్కాలిక విచిత్రములు, మొదలగు వానియందు లక్ష్యము లేక లేఖకుడు తన కల్పనలతో నవిచ్చిన్నముగ విజృంభించినచో ఏదో యొక చిత్రము తయారయి ఏదో యొక వింతగొలిపి మోహింప జేయునే కాని అది సంఘ చిత్రము కానేరదు.

సంఘ చిత్రము సరియైనదై యుండవలెను. అనగా సత్యమైనదై యుండవలెను. సత్యమనగా ఇక్కడ బ్రహ్మపదార్ధమును గూర్చిన సత్యము వంటి విశేష సత్యము కాదు. ఆ సత్యము దేశకాల పరిస్థితుల వలన బాధింపబడినది. ఈ సత్యము దేశకాల పరిస్థితుల మార్పు వలన బాధింపబడు సామాన్య సత్యము. స్థలములు నేడున్నట్లు మరి పదియేండ్ల తర్వాత నుండవు .మాట తీరులు, అలవాటులు, మర్యాదలు, ఆచారములు తాత్కాలిక చరిత్రాత్మకమగు విశేషములు మొదలగునవి కూడా నేడున్నట్లు ఒక పురుషాంతరము తరువాత నుండబోవు. ఈ చిత్రమును మనము కన్నులార చూచుచు చిత్రించినవే సరియైన సత్యమైన చిత్రము చిక్కును కాని ఊహాప్రపంచము నుండి కల్పనలను తీసుకొని వచ్చి చిత్రించినచో అది కృత్రిమము కాకమానదు. కనుక సాంఘిక నవల గ్రంథకర్త తన కన్నుల యెదుట ప్రవహించుచున్న కాలవాహినిని గాంచుచు అందలి విషయములను గూర్చి వ్రాసినపుడే సరియైన సత్యము చిక్కును గాని రసపుత్రయుగము నాటిదియు వంగభాష మాటాడు వంగదేశమునకు సంబంధించినదియు రాయచూరు యుద్ధము వలె ఏ విజయనగర సామ్రాజ్యము నాటి ఆంధ్రుల చరిత్రకో సంబంధించిన దియు నగు విషయము నెత్తుకొని వ్రాయగడంగినచో మన చర్మ చక్షువుల యెదుట జరుగు అకళంక సత్యమును గాక ఊహా చక్షువు నెదుట గోచరించు నట్టియు అభూతకల్పనలతో కూడినట్టియు శృంగార, వీర, శోకాద్భుతాది రసంబులతో మన డెందముల నానందకల్లోలినిలో నుంచునట్టియు, విచిత్రకాల్పనిక సత్యమును మాత్రమే చిత్రించినదగును. పందొమ్మిదవ శతాబ్దమున జీవించిన థేకరియను ఆంగ్ల నవలాకారుడు పదునెనిమిదవ శతాబ్దము నాటి యొక కథను నవలా రూపుముగా వ్రాసెను. అందుకొరకా శతాబ్దపు మర్యాదలు, సంభాషణములు మొదలగునవి యెన్నో పఠించి చిత్రముల నెన్నింటినో దర్శించి కష్టపడెను. అయినను అద్భుత కార్యమొనర్చిన యొక ప్రజ్ఞావంతుడుగను, సాధింప సాధ్యము కాని కృత్యమును చాలవరకు సాధించిన యొక వీరునిగ మాత్రమే పరిగణించుచున్నారు. కాని దానిని సంపూర్ణమగు సాంఘిక నవల యని వ్రాయుటకే విమర్శకునకు చేయిరాకున్నది.

సాంఘిక నవల యనగా కథ యే కాలమునకు చెందినదో ఆ కాలముయొక్క సరియైన చిత్రము. గ్రంథకర్తలు తరుచుగా తమ కన్నుల యెదుట జరుగుచర్యలనే సరిగా చిత్రించలేక యేదో ఒక అభాసము చేయుచుందురనిన వేరొక కాలము నాటి చిత్రము నెట్లు సరిగా వర్ణించగలరు? వారు వర్ణించిరని నిర్ణయించగల తీర్పరు లెవరు? జరుగుతున్న కాలమునాటి దానికి సజీవమగు ఆ సంఘమే సాక్షి. ఏ మాత్రమెచ్చుతగ్గున్నను యే యమ్మలక్కలైనను కనిపెట్టగలరు. ఇక విమర్శక విశారదుల మాట వేరే చెప్పనేల?

కనుక సాంఘిక నవలను వ్రాయబూనువాడు తన కాలము నాటియు, తనకు తెలిసినట్టియు, తాను కనినట్టియు జీవితాంశముల నెత్తుకొని వర్ణింపదొడగిననే సఫలీకృతుడగును. కాని 'అనగనగా నొకరాజు ' అని యే పూర్వచరిత్రనో గైకొనినచో కేవల పరిహసపాత్రుడగును. కథ జరిగి తీర నక్కరలేదు. నిజముగా జరుగుచున్నట్లనిపించిన జాలును.

సాంఘిక నవల కవి వ్రాయుచున్న నాటి కాలముదై యుండవలెను. మన కథ జరుగుచున్న నాటి సమయమున ప్రయోగమందెచ్చటను కానరాదు. కథ యే భాషలో వ్రాయబడుచున్నదో ఆ భాష మాటలాడే ప్రాంతమునకును, జాతికినీ సంబంధించినదై యుండవలెను. ఒక దేశపు ప్రజలు వేఱొక దేశపు భాషను దానికి స్వతస్సిద్ధమగు జాతీయములతోను, సులువుతోను, సౌందర్యముతోను మాటలాడజాలరు. కవి తన స్వభాషలో స్వభాష మాటలాడు వారి జీవనమును ప్రతిబింబింప చేయుటకు ప్రయత్నించిననే సాంఘిక నవల సరియైన చిత్రము కాగలదుకాని లేనియెడల సరియైనది కాజాలదు.

కథ సత్యముగ జరుగుచున్నట్లగుపించి వలెననిన సాంఘిక నవల కవి కాలము నాటిదై కవి యొక్క స్వభాషలో రచితమై పాత్రలు తమ మాతృభాషను నవలలో మాటలాడుచుండ వలెనని కథలో నెచ్చటను కృత్రిమ నామాదులుండరాదు. కృత్రిమ నామములనగా ఆ భాష మాటాలాడే ప్రజలు గల రాష్ట్రములో వాడుకలో లేని స్థలనామములు, పురనామములు, పురుషనామములు మొదలగునవి. భోగవతి, మధురానగరము, ధార్మిక పురము, శ్రీ నికేతనము మొదలగు పుర నామములు, రజతగిరి, కనకాచలము మొదలగు కొండల పేరులు, మందాకిని, మత్స్యవతి మొదలగు నేఱులపేరులు, వీరసేనుడు, విజయసింహుడు మొదలగు పురుష నామములు, సంధ్యావళి, మదాలస, మనోరమ, మొదలదు స్త్రీ నామములు - ఇట్టివి మన తెలుగు దేశములో లేవు. కనుక ఇట్టి పేరులను కవి సాంఘిక నవల యందు ప్రయోగించినచో అంతవరకు అవి కాల్పనికములుగా తోచి కథనంత వరకు సత్యము కానట్లు తోపజేయును. ఆంధ్రదేశపు సాంఘిక నవలను వ్రాయగడగినచో ఆంధ్రదేశములో నున్న నదులు, కొండలు, గ్రామములు, పట్టణముల పేరులును, ఆంధ్రదేశములో వ్యవహారములో నున్న స్త్రీ, పురుష నామములను మాత్రమే ప్రయోగించవలెను.

ఇంతియ కాదు. ఈ నదులను గ్రామములను మొ॥ వానిని గూర్చి వర్ణించునపుడు గాని, వాటి ప్రశంసలు వచ్చునప్పుడు గాని యే నదులకైనను గ్రామములకైనను సమానముగా వర్తించునట్టియు పురాణ ప్రబంధములలో తరచుగ గాననట్టియు సమాన గుణములు కురిపించి, విడిచి ఆయా పేరులు గల గ్రామములకు, నగరములకు, పట్టణములకు ప్రత్యేకించి చెల్లునట్టియు, కథనము యెక్క గమనికను, వీలయినంత వరకు ప్రతియక్షరమును సంబంధించునట్టియు విశేషములు చేర్చవలెను. ఇట్లు చేయుట వలన ఇతివృత్తము సరిగా నడచుచున్నట్లు మనదృష్టికి గోచరించుచుండును.

పిమ్మట ఈ దేశములో నున్న కులాచార వ్యవహారములను చిత్రించుచు రావలెను. కాని పల్లె పడుచులకు పట్టణ వాసపు ఫేసు ఫౌడరులను పూసియు, పట్టణపు కన్యలకు టర్కీ మసుగులు, ఇంగ్లీషు గౌనులు తొడిగియు, వికారవేషములు వేయరదు. ఆచారములను మీరి ప్రవర్తించు వారి విషయమై వర్ణించునపుడు మాత్రమే అట్టుల వ్రాయనగును. ఇది కాక ప్రతి జాతికిని జాతి లక్షణముల నొప్పు కొన్ని స్వభావ లక్షణములుండును. ఇవి దేశమునుండి దేశమునకు, రాష్ట్రమునుండి రాష్ట్రమునకు మాత్రమే కాక ఒక గ్రామము లేక నగరములో కూడా ఒక తెగ నుండి మరియొక తెగకూడ భేదముగా నుండును. వారి యిళ్ళు వాకిళ్ళలోనూ వారి వస్తు వాహనముల నుంచుకొనెడి యిమ్ములోను ఒకరినొకరు పలుకరించి ఆదరించెడి విధానములోను, ఇతరులతో ప్రవర్తించునప్పుడు కనబరుచు విధి వినయములు లేక టెక్కు టక్కులలో శుభాశుభ పుణ్యాపుణ్య కార్యములలోను, ద్రవ్యాదుల నాకర్షించునట్టి లేక వెచ్చించునట్టి తెరవులలోను, సరసములు, సల్లాపములలోను ఈ లక్షణములు తమ్ము తమ్ము చూడు మన్నట్లగుపించుచుండును. నిజమైన శిల్పదృష్టి గల కవి వాటినెట్లో పోల్చి వర్ణనలో, ప్రశంసలలో, సంభాషణలలో వాటి ఛాయల నాకర్షించి ముద్రించగలడు. ఈ శిల్పదృష్టి లేని వాడెంత పండితుడయ్యు, ఎట్టి యనర్గళ ధార కలవాడయ్యు ఆ సంఘచ్చాయ నాకర్షించలేడు.

ఈశిల్ప దృష్టి స్వతస్సిద్ధముగా పుట్టుకొని రావలసినదే యని యొప్పుకొనుచునే అట్టి శిల్పుల కుండవలసిన కొన్ని సాధారణ లక్షణములు మాత్రమిచ్చట చెప్పవలసి యున్నది. వారు సంఘమునెడ యెడము గాక సంఘముతో కలిసిమెలసి తిరుగ నభిలాష కలిగి తిరుగుచుందురు. వారి కష్టములను, సుఖములను, సరసములను, విరసములను తాము కూడ ననుభవించునట్లు మనశ్చలనములను గలిగి యుందురు. అందరితోను కలుపుగోలుతనముతో తిరుగగలట్టియు, అరమర అభ్యంతరము లేక ప్రవర్తించునట్టియు, అందరికిని హర్షప్రదనమైనట్టియు, జనపరిచయము, సంభాషణతీరు, హాస్యరసము, అనుకూలమగు నడవడి కలిగియుందురు. సాంఘిక నవల వ్రాయగోరువారు మున్ముందెంత వరకీ లక్షణములు తమకు గలవో యోచించుకొని, అలవాటు చేసుకొని, ఛాయగ్రహన శక్తి నలవరచుకొని గ్రంథరచనకు గడంగినచో బాగుండును. లేని యెడల ఆ గ్రంథము సరియగు చిత్రముగా ప్రచారము కాక గ్రాంథిక శైలి కొరకో, అద్భుతములగు చర్యల కొరకో దీర్ఘమగు కథ కొరకో, నీతిబోద కొరకో పాఠశాల తరగతులలో పఠనీయమైనదిగా కమిటి వారిచే నిర్ణయింపబడుట కొరకో మాత్రమే గౌరవము కలిగియుండును.

కవికీ దృష్టి యుండి, స్వభాషణలో రచించుటకు, స్వభాష మాటలాడువారి చర్యలే వ్రాయుటకు, వారి ఆచార వ్యవహారములను, ఆశలు, విలాసములను, కష్ట సుఖములనే చిత్రించుటకు గడగినచో సాంఘిక నవల మనోహరముగా నుండును. సాంఘిక నవల రచించు నాతడింకొక విషయమును గురించి అత్యంత శ్రధ్ధ వహించవలసి యున్నది. అది శైలిని గూర్చి. ఈ సందర్భమున గ్రాంధిక, వ్యవహారిక శైలులను గూర్చిన చర్యకు దిగుటకు నాకెంత మాత్రము నిష్టములేదు. సాంఘిక నవలను గూర్చి ఆలోచించినంత వరకైనను, ఒక శైలి వ్యావహారికమైనంత మాత్రమున గ్రంథస్థమగుటకు తగదినియు గ్రాంథిక మైనంత మాత్రమున సంఘమును చిత్రింపజాలదనియు చెప్పుటకు నేను సాహసింపను. శైలి కవికి నైజమై యుండవలెను. కాని శ్రమపడి పుస్తకములు వెదకి కష్టమై అపురూపమైన ప్రయోగముల నేర్చి గ్రంథములో గాంభీర్యము కొరకు జొనుపబడినదిగా నుండకూడదు. సముద్రతరంగముల వలె గంభీరమున నుండునుగాన, సెలెయేటి కలకలము వలె మంజులముగా నుండును గాన, తేనేసోనల వలె తేటగా నుండును గాన, శైలి కవికి నైజమై యుండవలెను. అతను సృష్టించెడి పాత్ర నోటిలో నది ఔచిత్యము గలిగి యుండవలెను. పాత్రల సంభాషణలో నుపయోగించెడి శైలి పాత్రము నుపయోగించినంత వరకు మాటలాడు కొనే భాషలో, అరసున్నలు, నెరసున్నలు, లేక అనాయాసకరమైనదిగా నుండక తీరదు. లేని యెడల నా పాత్రలు మనకు వింత గొలుపును గాని నైజత్వమును స్పురింపజేయవు. వారి సంభాషణపై విమర్శనములు, వారు సంభాషించుచుండు తరి వారి హావభావ విలాపములను వర్ణించు భావములు కూడా ఆ శైలిలోనే వ్రాయుట యెంతయును యుచితము. కవి తానుగా నొనరించు స్థలాదుల వర్ణనలు, సంఘ సమస్యల చర్చలు, పాత్రల యోగ్యతలను గూర్చి అభిప్రాయములు, వాటిపై విమర్శలు తన కిష్టమైన శైలిలో వ్రాయవచ్చును. అవి కవి అభిప్రాయములు కనుక పాఠకులు శ్రమ తీసుకొని చదవగలరు. కాని పాత్రలే మాటలాడునప్పుడు లేదా వారి సంభాషణలు ప్రక్క ప్రక్కను వచ్చుచు వాటి సున్నితములను మనము గ్రహించుటకు కవి సహాయము చేయవచ్చునపుడు, కవి తన ప్రతిభను, పాండిత్యమును, కల్పనా ప్రాగల్భ్యమును జొప్పించక పాత్రలను తమంతట తామే వచ్చుచు పోవుచు మాటలాడునట్లు చేయవలెను.

చారిత్రక నవలల వలె మోహశౌర్య ప్రధానములగు నద్భుత నవలల వలె, కూపీలు తీసెడి చమత్కారముల చూపు రహస్య పరిశోధన నవలల వలె సాంఘిక నవలలు కథా ప్రధానము లైనవి కావు. వీటికి ఒక మొదలు, ఒక నడుమ, ఒక తుది అని యుండవలసిన ఆవశ్యకత లేదు. సంఘము పోకడయు మానవుల సామాన్య సాంసారిక చర్యలే యొక మనోహరములగు నవల లాంటివి. దానిని చిత్రించుట కెక్కడ నుంచి ప్రారంభించి యెక్కడితో మనమాపినను ఒకటే. మన గ్రంథ ప్రారంభమే ఆ కథ యొక్క ప్రారంభము కాదు. మన మాపిన మాత్రమున ఆ కథ ముగిసినదని చెప్పుటకు వీలు లేదు. కాలశకటములో ప్రయాణము చేయుచు కవి చూపినంత మేరకు మనము చూచినాము. చూపని మేరలను కూడ చూడవలెనని యున్నను మనకు సాధ్యము కాక యూరకొనుచున్నాము. సంఘములో ఏ గ్రామములో లేక ఏయే వ్యవహారంలో ఏయే రంగములకు సంబంధము గలదో ఆయారంగముల నాయా వరుసను చిత్రించు కొనుచు పోయినచో చాలును. కారణాంతరములచే వాటికి ముందుండిన రంగములను విడువ వచ్చును. వాటి తరువాతి రంగమును చిత్రింపక పోవచ్చును. ఈ కారణముల చేత ఇట్టి నవలలను శ్రమపడి ఆలోచించి పన్నవలసిన వ్యూహం లేక చట్రము (deliberate Plot) ఉండవలసిన ఆవశ్యకత లేదు సరేగదా అది యెంత లేకపోయిన కథ అంత స్వతస్సిద్దమై యున్నట్లగుపించును.

చిత్ర విచిత్రముగా నల్లిన వ్యూహము (Plot) లేనిదీ. శౌర్య పరాక్రమాది రసప్రధానము కానిదీ, అద్భుతాశ్చర్యములు వెలిగ్రమ్మనిదీ, రహస్య పరిశోధకులు వెన్నాడి లోక కంటకుల గుట్టుమట్లు కనిపెట్టి పాఠకుల కుతూహలము తీర్చనిదీ విరహవేదనల తోడి విప్రలంభములు, సుందర పద్యముల తోడి మోహలేఖలు, శబ్దాద్యలంకార యుక్తములగు ప్రకృతి వర్ణనలు లేనిదీ నవలయేమిటి అని ఇప్పటి పాఠక లోకమున కచ్చెరువు కలుగవచ్చును. కాని యిట్టి విశేషములు సంఘములో నెప్పుడేని కలుగుచుండును గనుక కథలనియు, సదా సంఘములో నిల్చి జరుగుచుండవు కనుక సాంఘిక నవల కథ కాదనియు, కథకాని సాంఘిక చరిత్రలో నిట్టివి తరచు కలుగుచుండవు గనుక సాంఘిక నవల యిట్టి పై పై తెచ్చుకోలు విశేషము లేక, సాధారణ సంఘము వలె చల్లగా, సాధారణపు టచ్చటలు, ముచ్చటలు, కష్ట సుఖములు కోరికలు, ప్రయత్నములు జయాపజయములు మొదలగు వనితో గూడి సంఘము యొక్క సాధారణ సమయ వాహినీ చిత్రము వలె నలరారవ లెను.


--భారతి, 1932 ఆగస్టు