గణపతిముని చరిత్ర సంగ్రహం/క్రోధాగ్ని

వికీసోర్స్ నుండి

9. క్రోధాగ్ని

1917 జూన్‌లో నాయన మందసా నుండి తిరువణ్ణామలై చేరెను. అప్పటికి చూతగుహ వాసయోగ్యముగా లేదు. దానికి మరమ్మత్తు అవశ్యకమైయుండెను. నాయన ఎచ్చెమ్మాళ్ ఇంటియందు కాపురముండి "హృదయకుహర మధ్యే" అను శ్లోకమునకు వ్యాఖ్యానముగా ఉపనిషత్తువంటి గ్రంథమును 7-7-1917 తేది ఆరంభించెను. 23వ తేది విరూపాక్ష గుహయందు తాను సకుటుంబముగా నుండుటకు నాయన మహర్షి యనుమతిని కోరెను. గృహస్థులు ఆ గుహయందు ఉండరాదను నియమము ఉండెను. అయినను అమ్మనాయనలు బ్రహ్మచర్యముతో నున్నారని కాబోలు మహర్షి నాయనకు అనుమతి నొసంగి, పలనిని పిలిచి అ గుహను బాగుచేయుమని చెప్పెను. అతడు దానికి తాళమునుకూడ తీయలేదు. నాయన వచ్చి మహర్షికి ఆ విషయమును చెప్పెను. మహర్షి పలనిని పిలిపించి నాయనకు తాళపుచెవినైన ఇమ్మనెను. ఆ గుహలో నాయన సంసారము చేయుటకు వీలులేదని చెప్పుచు తాళపుచెవి నిచ్చుటకు కూడ అతడు నిరాకరించెను. భగవానుని యాజ్ఞను తిరస్కరించుటయేకాక తన బ్రహ్మచర్యమునుకూడ పలని శంకించి, తన్ను సంసారిగా తలంచుట నాయనకు అవమానకర మయ్యెను. అది ఆయనయందు క్రోధమును ప్రజ్వలింప జేసెను. దానివలన "ఖాండవవనమునందు అర్జునునివలె నేనిప్పుడు ఇచ్చట క్రోధాగ్నిని వదలుచున్నాను" అనునర్థముతో శ్లోకరూపమున నాయన నుండి శాపము వెలువడెను. అంతట ఆ తాళమును ఱాతితో పగులగొట్టి నాయన గుహయందు ప్రవేశించెను. వెంటనే ఆయన పశ్చాత్తాప మును పొంది ఆ ప్రాంతమునకు శాపాగ్ని వలన సంతాపము కలుగకుండ ఇంద్రుని స్తుతించెను.

శాపము వెలువడినంతనే భగవానుడు మౌనముతో కనులు మూసికొనియుండెను. కొంతసేపటికి నాయన కావించిన స్తుతివలన పెద్ద వర్షము కురిసెను. భగవానుడు లేచి ఆకాశము వంక జూచుచు వానలో నిలుచుండెను. దేవాలయము వద్దనున్న రథముపై పిడుగు పడి దానిని దహించెను. భగవానుడు "అమ్మయ్య! బ్రతికితిమి" అని స్కందగుహ నుండి దిగి విరూపాక్ష గుహ యొద్దకు వచ్చి నాయనకు దగ్ధమగుచున్న రథమును చూపెను. నాయన ఖేధమును పొందెను. భగవానుడు నాయనను చూచి, "క్రోధము ఇట్లే విచక్షణతను కప్పివేయును. భూమికి ఆపదయైనచో మనకు కాదా! రథము కొఱకు విచారింపకుడు. ప్రాతది పోయినచో క్రొత్తది వచ్చును. ఏమైనను ఇకమీద క్రోధమునకు వశముగానని ప్రమాణము చేయుడు" అనెను. నాయన అట్లే ప్రమాణమొనర్చి గురువునకు వ్యధకలిగినందులకు దు:ఖించెను. భగవానుడు నాయనను ఓదార్చుచు గుహలోనికి తీసికొనిపోయి పెరుగు అన్నమును స్వయముగా తినిపించెను. కొలది దినములకే పలని మృత్యువు వాతబడెను.

విరూపాక్షగుహ వసతిగా లేకపోవుటవలన నాయన స్కందాశ్రమమున రమణునితో ఉండజొచ్చెను. అక్కడ దశ మహావిద్యలసారమును సంగ్రహించుచు నాయన 475 సూత్రములను మూడు దినములలో రచించెను. తరువాత, అంతకుపూర్వ మారంభించిన "హృదయ కుహర" శ్లోక వ్యాఖ్యాన గ్రంథమును రమణోపదేశముల వివరణముగా 300 శ్లోకములతో 18 అధ్యాయములలో నాయన పూర్తిచేసెను. అదియే "రమణగీత"గా ప్రసిద్దమయ్యెను.

అమ్మ యభిలాషను అనుసరించి నాయన దైవరాతునితో 1917 అక్టోబరులో పడైవీడునకు చేరెను. ఆమె అక్కడ 40 దినములు తపోదీక్ష వహించెను. కుమారుడైన మహాదేవునకు వివాహము నిశ్చయమగుటచే 1917 పిబ్రవరిలో వారు దైవరాతుని ఇంటికి పంపి ఆశీస్సుల కొఱకు రమణునియొద్దకు వచ్చిరి. అప్పుడు నాయన మహర్షి సోదరునకు సన్న్యాసము నొసంగి నిరంజనానందుడు అను పేరు పెట్టి, ఆయన తల్లి అలఘమ్మకు కూడ సన్న్యాసము నొసంగెను. తరువాత ఆయన కలువఱాయికి చేరి 15-3-1918 తేది కుమారునకు వివాహమును జరిపించెను. అక్కడ 6 నెలలుండి అరసవల్లి క్షేత్రయాత్ర గావించెను.

ఈ సందర్బమున వాసిష్ఠ వైభవమునందు శ్రీ కపాలశాస్త్రి "సంస్కృతభాషను అధ్యయన మొనరింపని మహర్షియొక్క హృదయమునుండి స్వయముగా పైకి వచ్చిన "హృదయ కుహర" అను శ్లోకము ద్వితీయ విషయముగా వివరింపబడినది" అని యుద్ఘాటించెను. "భగవతోఽ నధీత సంస్కృత గిరో మహర్షే:స్వతో హృదయాదుద్గతో "హృదయ కుహర" ఇతి శ్లోకో ద్వితీయాధ్యాయత యోపన్యస్త:" (205 ప్రకరణము-20) శ్రీ రమణమహర్షి సంస్కృతమును నేర్చుకొనలేదనుట అసంగతము. ఆయన సంస్కృతమున ఎన్నో శ్లోకములను రచించెను. మఱియును "హృదయ కుహర" అను శ్లోకమును మొదలు పెట్టినవాడు శ్రీ జగదీశశాస్త్రి. మహర్షి దానిని పూరించెను.

1918 అక్టోబరులో అమ్మనాయనలు సికింద్రాబాదునకు చేరి 1919 డిసెంబరు నెల వరకు అక్కడ నుండిరి. అప్పుడు స్వరాజ్యము కొరకు ఉద్యమము విజృంభించెను. ఆ నాయకులలో గాంధి ప్రబలుడైయుండెను. గాంధి మైత్రేయ ఋషియొక్క అంశమున జన్మించినవాడని నాయన చెప్పుచుండెడివాడు. ఆస్తి విషయములను చక్కబెట్టుకొనుటకు ఆయన కలువఱాయికి పోయి 1920 మే నెల చివర సికింద్రాబాదునకు చేరి 1922 మార్చి వరకు అక్కడనే యుండెను. 1921 జూన్ నెలలో సుధన్వుడు, కపాలిశాస్త్రి నాయన యొద్దకు వచ్చిరి. అప్పుడాయన తన యనుభవములను వారికి చెప్పుచు విఘ్నేశ్వరుని ఉద్దేశించి నాలుగు శ్లోకములను చెప్పెను.

ఆ శ్లోకముల తాత్పర్యము ఇట్లున్నది. "గజాననా! నేను ఘోరతపస్సును చేయకున్నచో అది నీయపరాధమే. నీవు ఏల ప్రేరణ చేయలేదు? నీవు ప్రేరేపించినను నేను తపస్సు చేయలేదన్నచో నీ ప్రేరణకు ఏమి శక్తి యున్నట్లు? నేను కలుషముచే భంగము నొందుచుంటినని మహావిపత్తులో మునుగుచుంటినని ఏల బృంహితధ్వనులను చేసెదవు? నేను నిద్రించుచున్నచో హస్తముతో తట్టి లేపుము. నేను అపమార్గమున పోవుచున్నచో వెంటనే వెనుకకు మరలింపుము. గుహయందున్న యీ చీకటి నేత్రముల శక్తిని హరించుచు నా మార్గమును అరికట్టుచున్నది. చూచుటకు నేను అశక్తుడనైయున్నాను. ప్రభూ! నాయందు స్నేహము (చమురు) ఉన్నది; దశ (వత్తి) ఉన్నది. దీనిని వెలిగించుటకు దయతో నీ కటాక్ష జ్యోతిస్సును కొంచెము అనుగ్రహింపుము. నేను ముందునకు పోవుదును."

ఈ బావన అప్పటి ఆయనయొక్క మన:పరిస్థితిని చక్కగా వ్యక్తము చేయుచున్నది.

1922 జనవరిలో మహాదేవుడు చదువు వదిలి ఉపాధ్యాయు డయ్యెను. నాయన అమ్మతో చెన్నపురము చేరి మార్చి చివర వఱకు నుండెను. అప్పు డాయన శిష్యుల కొఱకు యోగసాధన రహస్యములను సూత్రములనుగా రచించెను. అది తరువాత "రాజయోగసారము" అను గ్రంథమయ్యెను. అప్పుడాయన ఒక సందర్భమున పండితులతో నిట్లనెను. "మంత్రధ్యానము చేతనే నాకు నిరుపాధిక ధ్యానయోగ మలవడెను. అది దైవ కటాక్షమే. ఆ కటాక్షమునకు గురు కటాక్షముకూడ తోడై నాయం దా యోగము స్థిరమై, శక్తిని వృద్దిపరచెను... ఈ నిర్విషయ విమర్శయోగ మలవడుకొలది, ఈ జగద్వ్యవహారము లెన్ని యున్నను నా యాంతర్య మందీ యోగసాధనము నిరంతరము కాజొచ్చెను. ఇది యెప్పుడు సిద్ధి బొందునో చెప్పజాలను."[1]

  1. * నాయన-పుటలు:493, 494