గణపతిముని చరిత్ర సంగ్రహం/కపాల భేదసిద్ధి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10. కపాల భేదసిద్ధి

1922 ఏప్రిలులో నాయన అరుణాచలమునకు వచ్చెను. చూతగుహకు ముందు గది నిర్మాణము మరమ్మత్తులు జరుగుచుండగా నాయన ఉమా సహస్రమును సంస్కరింప మొదలిడెను. అది ఏడవ సంస్కరణము. పిదప ఆయన ఇరువది రోజులలో దీక్షగా ఇంద్రాణి సప్తశతిని రచింపవలెనని సంకల్పించెను. కాని రచనము ఆరంభము కాకముందే నాయనకు తీవ్రమైన శిరోబాధ కలిగెను. రెండుదినములు సుమారుగా నుండి మూడవదినము రాత్రికి గొడ్డలితో కొట్టుచున్నంతగా బాధ కలిగెను. దానితోపాటు వెన్నులోనుండి కంఠము పర్యంతము దుర్భరమైన తాపము బయలుదేరెను. నాయన మహర్షి యొద్దకు పోలేక చీటి పంపెను. మహర్షి మౌనము వహించెను.

అర్ధరాత్రి యగునప్పటికి నాయన శిరస్సునుండి "టప్" అను శబ్దము గుహ వెలుపల కూర్చుండిన విశాలాక్షమ్మకు వజ్రమ్మకు వినబడెను. వారు మిగుల భయపడ జొచ్చిరి. వెంటనే చంద్రకాంతివంటి జ్యోతి ఆయన శిరస్సు నుండి వెడలి గుహయొక్క కప్పుపై బింబాకారముగా పడి గుహలోని చీకటిని తొలగించెను. దానితోపాటు ఆయన శిరస్సునుండి ఆవిరివంటి పొగ వెలువడ జొచ్చెను. అప్పుడు నాయన "అమ్మయ్య" అని నిట్టూర్చి, "శీర్షకపాలములు రెండును భిన్నమగుటకే ఇంత బాధ కలిగినది; అవి భిన్నమైనవి! బాధ పోయినది" అని చెంత నున్నవారితో చెప్పెను. తెల్లవారు నప్పటికి శిరస్సునుండి పైకి వచ్చుచున్న యావిరి యొక్క వేగము తగ్గెను. ఆ రాత్రియంతయు నాయన ఆవిరివలన తాపము, లోపల చందన శీతలత్వమును అనుభవించు చుండెను.

తెల్లవారిన తరువాత భగవానుడు చూతగుహకు వచ్చి జరిగిన దంతయు విని సంతసించి స్వయముగా నాయనను గుహలోనుండి గదిలోనికి తీసుకొనివచ్చి మంచముపై కూర్చుండబెట్టి ఆయనకు పాలను ఇప్పించెను. భగవానుడు నాయన తలను పరీక్షించెను. ఆశ్చర్యముగా అరచేయి మేర జుట్టు అంతయు ఒక్క రాత్రికే ఊడిపోయెను. మహర్షి అ శిరస్సును కొంతసేపు నిమిరి, ఆయనకు సేవ చేయుచున్న చిరుపాకం కొండయ్యను పంపి పాదుకల జత, బాదము తైలము, చిట్టాముదము తెప్పించుచు విశాలక్షమ్మతో ఇట్లనెను. "నాయనకు ఇంక భయము లేదు. కాని శరీరమంతయు విద్యుచ్ఛక్తితో కూడియున్నది. ఇంక వీరి శరీరము లోహముయొక్క స్పర్శనుగాని, ఆహారమున ఉప్పుకారములను గాని భరింపజాలదు. వీరు వట్టి నేలపై కూర్చుండరాదు; గదిలోనైన పాదరక్షలు లేకుండ తిరుగరాదు. స్నానమునకు ముందు తలకు బాదము తైలమును, తరువాత చిట్టాముదమును పట్టింపుడు". ఇట్లు చెప్పి మహర్షి తల్లిసేవ చేయుటకై వెడలిపోయెను.

నాయన కపాల భేదనమున కలిగిన యనుభూతులను కొన్నింటిని ఉమా సహస్రమున చేర్చి ఎనిమిదవ పర్యాయము దానిని సంస్కరించి అపీతకుచాంబా సన్నిధియందు పఠించెను. తరువాత నాయన ఇంద్రాణి సప్తశతిని 20 దినములలో పూర్తి చేసెను. ఈ రచనా కాలమున గ్రీష్మమునందు కూడ ప్రతి సాయంకాలము ఇంద్రాణి దేవత విద్యుత్ పరంపరలను చూపుచు తన యనుగ్రహమును ప్రకటించుచుండెను. నాయన పడైవీడునకు పోయి రేణుకా దేవి సన్నిధియందు ఆ గ్రంథమును పఠించెను. అప్పుడు ఆదేవి సాక్షాత్కరించి వినుచున్నట్లుగా కొందరకు గోచరించెను.

ఆ గ్రంథమున నాయన యొకచోట తన లక్ష్యములను వివరించుచు ఇంద్రాణిని ఇట్లు ప్రార్థించెను.[1] "స్త్రీల స్వాతంత్ర్యమును రక్షించుట కొఱకు, పంచముల యపారమైన దైన్యమును తొలగించుటకు, ధర్మము పేరుతో ప్రబలుచున్న యధర్మమును హరించుటకు, గంభీరమైన వేదార్థమున సందేహములను దీర్చుటకు, ఘోరమైన వర్ణభేదమును నాశ మొనరించుటకు, అమ్మా! నా బుద్ధికి శక్తికి మహోల్లాసమును ప్రసాదింపుము".

శ్లో|| స్వాతంత్ర్యం వనితానాం త్రాతుం మాత రథీశే
    దూరీకర్తు మపారం దైన్యం పంచమజాతే:
    ధర్మ వ్యాజ మధర్మం భూలోకే పరిహర్తుం
    వేదార్థే చ గభీరే సందేహా నపి హర్తుం
    ఘోరం వర్ణవిభేదం కర్తుం చ స్మృతిశేష
    ముల్లాసం మతిశక్త్యో ర్మహ్యం దేహి మహాంతమ్||

భారత దేశ దుర్గతికి నాయన ఎంతగా పరితపించు చుండెనో ఈ గ్రంథమున అక్కడక్కడ వ్యక్తమగు చున్నది. "శత్రు భారముచే భిన్నమైయున్న భారత దేశమును రక్షించుటకు, ఓ తల్లీ! నాకు బలము ఇమ్ము, దుర్మార్గుల వినాశము కొఱకు నాకు నీవు అస్త్రముగా నుండుము; నా బుద్దిని శక్తివంత మగునట్లు చేయుము. భారత దేశ దుర్గతిని చూచుచు దు:ఖమును పొందుచున్న నాకు యోగ మదము (సిద్ధి) వలన తృప్తి కలుగుట లేదు."[2]

19-5-1922 న భగవానుని తల్లి అలఘమ్మ నిర్యాణము నొందెను. ఆమె సమాధిపై మహర్షి లింగాకారముతో వున్న యొక శిలను ప్రతిష్ఠించెను. దానికి "మాతృ భూతేశ్వర లింగము" అని నాయన నామకరణము మొనరించెను. పిదప నాయన చూత గుహలో నాలుగు నెలలు తపస్సు చేసెను. 1923 ఫిబ్రవరి ముగియు నప్పటికి ఇంద్రాణి సప్తశతిలోని శ్లోకములను సుమారుగా నాలుగు వందలు ఉమాస్తుతిలో చేర్చి సహస్రముగా శుద్దప్రతి వ్రాసి రమణునకు సమర్పించెను.1942 లో ముద్రింపబడిన యా గ్రంథమునకు ఈ ప్రతియే ఆధార మయ్యెను. ఆయన ఉమాస్తుతి నుండి కొన్ని శ్లోకములను ఇంద్రాణి సప్తశతి యందు చేర్చి కొన్ని క్రొత్త శ్లోకములను కూడ కూర్చి దానిని గూడ తీర్చి దిద్దెను.

  1. * జయంతి సంచిక - వాసిష్ఠుని ఇంద్రాణి - డాక్టర్ ప్రసాదరాయ కులపతి M. A., Ph. D. - పుట. 56.
  2. * నాయన పుటలు-530, 531.