Jump to content

క్రీడాభిరామము (ఎమెస్కో)/శ్రీనాథుని చాటు పద్యములు

వికీసోర్స్ నుండి

శ్రీనాథుని చాటు పద్యములు

సీ.

పలుతెఱంగుల రంగు పద్మరాగల వీణె
                        చకచక ప్రభల సాక్షాత్కరింప,
సొంపుతో రవ చెక్కడంపు ముంగర చాయ
                        పవడంపుమోవిపైఁ బరిఢవిల్ల,
విరిసి యోసరిలి క్రిక్కిఱిసిన చనుదోయి
                        బిగువున నెఱ రైక పిక్కటిల్ల,
నొసపరి యొయ్యారి ముసుగులో నెఱివేణి
                        కొమరాలి మూఁపున గునిసియాడ,


తే.

విరులతావియు, నెమ్మేని వెనుక కచ్చ,
ఫెళ ఫెళక్కను చిఱుఁ దొడల్, బెళుకు నడుము,
వలుఁద పిఱుఁదులు, కలికిచూపుల బెడంగు,
లొలయఁ గన్గొంటి, వేపారి కలువకంటి.

57


క.

అద్దిర కుళుకులు బెళుకులు!
నిద్దంపు మెఱుంగుఁ దొడల నీటులు గంటే?
దిద్దుకొని యేల వచ్చును,
ముద్దియ యీ నంబిపడుచు ముచ్చట దీఱన్.

58


చ.

వడిసెల చేతఁ బట్టుకొని, వావిరి చక్కనిపైఁట జాఱఁగా,
నడుము వడంకఁగాఁ, బిఱుఁదు నాట్యము సేయఁగఁ, గొప్పు వీడఁగా,
దుడదుడ మంచె యెక్కె నొక దొడ్డమిటారపుఁ గమ్మ కూఁతురున్
దొడదొడ మంచ మెక్కె నొక దొడ్డమిటారపు రెడ్డి కూఁతురున్.

59


ఉ.

అంగడివీథిఁ బల్లవుల కాసగ మామిడిపండు లమ్ముచున్
జంగమువారి చిన్నది పిసాళితనంబునఁ జూచెఁ బో! నిశా
తాంగజ బాణ కైరవ సితాంబుజ మత్త చకోర బాల సా
రంగ తటిన్నికాయముల రంతులు సేసెడు వాఁడిచూపులన్.

60

సీ.

బాలేందురేఖ సంపద మించి విలసిల్లు
                        నొసటి తళ్కుల నీటు నూఱు సేయు,
భ్రమరికా హరి నీల చమరవాలములఁ బోల్
                        వేణీభరము చాయ వేయి సేయు,
దర్పణ ద్విజరాజ ధాళధళ్య ప్రభ
                        లపన బింబ స్ఫూర్తి లక్ష సేయుఁ,
గోట హాటక శైల కుంభి కుంభారాతి
                        కుచకుంభయుగళంబు కోటి సేయు,


తే.

జఘనసీమకు విలువ లెంచంగ వశమె?
దీని సౌందర్య మహిమంబు దేవుఁ డెఱుఁగుఁ!
నహహ యెబ్భంగి సాటి సేయంగ వచ్చు?
భావజుని కొల్వు, జంగము భామ చెల్వు.

61


క.

సర్వజ్ఞ నామధేయము,
శర్వునకే, రావు సింగ జనపాలునకే,
యుర్విం జెల్లును, ద క్కొరు
సర్వజ్ఞుం డనుట, కుక్క సామజ మనుటే!

62


సీ.

కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెను గదా
                        పురవీథి నెదురెండ పొగడదండ!
యాంధ్రనైషధకర్త యంఘ్రియుగ్మంబునఁ
                        దగలియుండెను గదా నిగళయుగము!
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
                        వియ్యమందెను గదా వెదురుగొడియ!
సార్వభౌముని భుజాస్తంభ మెక్కెను గదా
                        నగరివాకిట నుండు నల్లగుండు!


తే.

కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము,
బిలబిలాక్షులు దినిపోయెఁ దిలలుఁ బెసలు,

బొడ్డుపల్లెను గొడ్డేఱి మోసపోతి
నెట్లు చెల్లింతుఁ డంకంబు లేడునూర్లు?

63


సీ.

కాశికావిశ్వేశుఁ గలసె వీరారెడ్డి,
                        రత్నాంబరంబు లే రాయఁ డిచ్చు?
రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు,
                        కస్తూరి కేరాజుఁ బ్రస్తుతింతు?
స్వర్గస్థుఁ డయ్యె విస్సన్నమంత్రి, మరి హేమ
                        పాత్రాన్న మెవ్వని పంక్తిఁ గలదు?
[1]కైలాసగిరిఁ బండె మైలారవిభుఁ డేగి
                        దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు?


తే.

భాస్కరుఁడు మున్నె దేవునిపాలి కరిగెఁ,
గలియుగంబున నిక నుండఁ గష్ట మనుచు,
దివిజకవివరు గుండియల్ దిగ్గు రనఁగ,
నరుగుచున్నాఁడు శ్రీనాథుఁ డమరపురికి.

64


సీ.

తాటంకయుగధగద్ధగితకాంతిచ్ఛటల్
                        చెక్కుటద్దములపై జీరువార,
నిటలేందుహరినీలకుటిలకుంతలములు
                        చిన్నారిమోముపైఁ జిందులాడ,
బంధురమౌక్తికప్రకటహారావళుల్
                        గుబ్బపాలిండ్లపై గునిసియాడఁ,
గరకంకణక్వణక్వణనిక్వణంబులు
                        పలుమాఱు రాతిపైఁ బరిఢవిల్ల,


తే.

నోరచూపుల విటచిత్త మూఁగులాడ,
[2]బాహుకుశలతఁ జక్కని మోహనాంగి

పాటఁ బాడుచుఁ గూర్చుండి, రోటిమీఁదఁ
బిండి రుబ్బంగఁ గన్నులపండు వయ్యె.

65


సీ.

జగదొబ్బగండాంక! సంగ్రామనిశ్శంక!
                        జగతీశ రాయవేశ్యాభుజంగ!
అఖిలకోటలగొంగ! యరిరాయమదభంగ!
                        మేలందు ధరణీశ మీనజాల!
మూరురాయరగండ! మురియు రాజుల మిండ!
                        యభివృద్ధి మీఱు చౌహత్త మల్ల!
గోవాళఘనగాయ! కామినీపాంచాల!
                        బ్రహ్మాయుశశివంశ పరశురామ!


తే.

దండి బిరుదుల సురతాణి గుండె దిగుల!
బళియ యల్లయ వేముని పగఱ మిండ!
రమణ మించిన మేదిని రాజు బిరుద
సంగరాటోప! మాదయ లింగ భూప!

66


సీ.

రాజనందన రాజరా జాత్మజులు సాటి
                        తలఁప నల్లయ వేమ ధరణిపతికి,
రాజనందన రాజ రా జాత్మజులు సాటి
                        తలఁప నల్లయ వేమ ధరణిపతికి,
రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                        తలఁప నల్లయ వేమ ధరణిపతికి,
రాజనందన రాజరాజాత్మజులు సాటి
                        తలఁప నల్లయ వేమ ధరణిపతికి,


తే.

భావభవభోగసత్కళాభావములను,
భావభవభోగసత్కళాభావములను,
భావభవభోగసత్కళాభావములను,
భావభవభోగసత్కళాభావములను.

67

ఉ.

వీరరసాతిరేక! రణవిశ్రుత! వేమనరేంద్ర! నీ యశం
బారభమానతారకరహారవిలాసము, నీ భుజా మహం
బారభమానతారకరహారవిలాసము, నీ పరాక్రమం
బారభమానతారకరహారవిలాసము, చిత్ర మారయన్.

68


క.

రసికుఁడు పోవఁడు పల్నా,
డెసఁగంగా రంభ యైన నేకులె వడుకున్,
వసుధేశుఁ డైన దున్నును,
గుసుమాస్త్రుండైన జొన్నకూడే కుడుచున్.

69


ఉ.

ఫుల్లసరోజనేత్ర! యల పూతన చన్నుల చేఁదు ద్రావి నా
డల్ల దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల? తింత్రిణీ
పల్లవయుక్తమౌ నుడుకు బచ్చలిశాకము జొన్నకూటితో
మెల్లన నొక్కముద్ద దిగమ్రింగుము! నీ పస కాననయ్యెడిన్.

70


మ.

కవితల్ సెప్పినఁ, బాడ నేర్చిన, వృథా కష్టంబె, యీ బోగపుం
జవరాండ్రే కద భాగ్యశాలినులు? పుంస్త్వం బేల పో పోఁచకా?
సవరంగా సొగసిచ్చి, మేల్ యువతివేషం బిచ్చి పుట్టింతువే,
నెవరున్ మెచ్చి ధనంబు లిచ్చెదరు గాదే పాపపుం దైవమా?

71


సీ.

సొగసుకీల్జడదాన! సోఁగకన్నులదాన!
                        వజ్రాల వంటి పల్వరుసదాన!
బంగారుజిగిదాన! బటువుగుబ్బలదాన!
                        నయమైన యొయ్యారినడలదాన!
తోరంపుఁగటిదాన! తొడలనిగ్గులదాన!
                        పిడికిట నడఁగు నెన్నడుముదాన!
తళుకుఁజెక్కులదాన! బెళుకుముక్కరదాన!
                        పింగాణికనుబొమచెలువుదాన!

తే.

మేలిమి పసిండి రవ కడియాలదాన,
మించి పోనేల రత్నాల మించుదాన!
తిరిగిచూడవె ముత్యాలసరులదాన!
చేరి మాటాడు చెంగావిచీరదాన!

72


మ.

వనజాతాంబకుఁ డేయు సాయకముల న్వారింపఁగా రాదు, నూ
తనబాల్యాధికయౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయ, ది
ట్లనురక్తిన్ మిముబోంట్లకు న్దెలుప నాహా, సిగ్గు మైకోచు, పా
వనవంశంబు స్వతంత్ర మీయదు సఖీ వాంఛ ల్తుద ల్ముట్టునే?

73


ఉ.

అంగడి యూర లేదు, వరి యన్నము లేదు, శుచిత్వ మేమి లే,
దంగన లింపు లేరు, ప్రియమైన వనంబులు లేవు, నీటికై
భంగపడంగఁ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు, దాత లె
న్నంగను సున్న, గానఁ బలనాటికి మాటికిఁ బోవ నేటికిన్?

74


ఆ.

ఊరు వ్యాఘ్రనగర, మురగంబు కరణంబు,
కాఁపు కపివరుండు కసవునేఁడు,
గుంపు గాఁగ నిచట గురజాలసీమలో
నోగు లెల్లఁ గూడి రొక్కచోట.

75


క.

కుంకుమ లేదో? మృగమద
పంకము లేదో? పటీర పాంసువు లేదో?
సంకుమదము లేదో? యశు
భంకర మగుభస్మ మేల బాలా! నీకున్?

76


సీ.

ఖండేందుమౌళిపైఁ, గలహంసపాళిపైఁ,
                        గర్పూరధూళిపైఁ, గాలుద్రవ్వు;
మిన్నేటితెఱలపై, మించుతామరలపై,
                        మహి మంచు నురులపై మల్లరించు;

జంభారిగజముపైఁ, జంద్రికారజముపైఁ,
                        జందనధ్వజముపైఁ జౌకళించు;
ముత్యాలసరులపై, మొల్లక్రొవ్విరులపై,
                        ముదికల్పతరువుపై మోహరించు;


తే.

వెండిమల యెక్కి, శేషాహి వెన్ను దన్ని,
తొడరి దుగ్ధాబ్ధి తరఁగలతోడ నడరి,
నెఱతనం బాడి నీ కీర్తి నిండె నహహ!
విజయరఘురామ! యల్లాడ విభుని వేమ!

77


క.

గరళము మ్రింగితి ననుచుం
బురహర! గర్వింపఁబోకు పో పో పో! నీ
బిరు దింకఁ గానవచ్చెడి
మెఱసెడి రేనాఁటి జొన్న మెతుకులు తినుమీ!

78


క.

గిట గిట నగు నెన్నడుములు,
పుట పుట నగు గన్నుఁగవలు, పున్నమ నెలతోఁ
జిట పొట లాడెడు మొగములు,
కటి తటముల కొమరు, శబరకాంతల కమరున్.

79


క.

గుడిమీఁది క్రోతితోడను,
గుడిలోపలి నంబివారి కోడలితోడన్,
నడివీథి లంజతోడను,
నడిగొప్పుల హోరుగాలి నడిగితి ననుమీ!

80


ఉ.

గుబ్బలగుమ్మ, లేఁజిగురుఁగొమ్మ, సువర్ణపుఁగీలుబొమ్మ, బల్
గబ్బిమిటారిచూపులది, కాఁపుది, దానికి నేల యొక్కనిన్
బెబ్బులి నంటఁ గట్టితివి? పెద్దవు నిన్ననరాదు గాని, దా
నబ్బ! పయోజగర్భ! మగనాలికి నింత విలాస మేఁటికిన్?

81

ఉ.

గొంగడి, మేలుపచ్చడము, కుంపటి, నల్లులు, కుక్కిమంచమున్,
జెంగట వాయుతైలము, లజీర్ణపు మందులు, నుల్లిపాయలున్,
ముంగిట వంటకట్టియల మోపులు, దోమలు, చీముపోతులున్,
రంగ! వివేకి కీ మసరరాజ్యము కాఁపుర మెంత రోతరా!

82


ఉ.

గోష్పదరూపమై, మిగుల కోమలమై, గణుతింపరానిదై,
శష్పవిహీనమై, నునుపు చాలఁగఁ గల్గి, ద్రవం బపారమై,
పుష్పిణి యైన నీభగముపుణ్యమునన్ భుజియింపఁ గల్గె, వా
స్తోష్పతి కైన నో ద్రవిడసుందరి! నిన్ను వచింప శక్యమే?

83


ఉ.

గ్రామము చేత నుండి, పరికల్పితధాన్యము నింట నుండి, శ్రీ
రామకటాక్షవీక్షణపరంపరచేఁ గడతేఱెఁ గాక, మా
రామయమంత్రి భోజనపరాక్రమ మేమని చెప్పవచ్చు, నా
స్వామి యెఱుంగుఁ దత్కబళచాతురి తాళఫలప్రమాణమున్.

84


ఆ.

చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవళ్ళు,
నాగులేటి నీళ్ళు, నాపరాళ్ళు,
సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులును, దేళ్ళు,
పల్లెనాఁటి సీమ పల్లెటూళ్ళు.

85


మ.

జననాథోత్తమ! దేవరాయ నృపతీ! చక్రేశ! శ్రీవత్సలాం
ఛనసంకాశ! మహాప్రభావ! హరి! రక్షాదక్ష! నా బోఁటికిన్
గునృపస్తోత్రసముద్భవం బయిన వాగ్దోషంబు శాంతంబుగాఁ
గనకస్నానము చేసి గాక, పొగడంగా శక్యమే దేవరన్?

86


క.

జొన్న కలి, జొన్న యంబలి,
జొన్నన్నము, జొన్న పిసరు, జొన్నలు తప్పన్
సన్నన్నము, సున్న సుమీ!
పన్నుగఁ బలినాటిసీమ ప్రజ లందఱకున్.

87

శా.

జోటీ! భారతి! ఆర్భటి న్మెఱయుమీ! చోద్యంబుగా నేను గ
ర్ణాటాధీశ్వరుఁ బ్రౌఢదేవ నృపతిన్, నాసీర ధాటీచమూ
కోటీఘోటకధట్టికాఖురపుటీకుట్టాకసంఘట్టన
స్ఫోటీధూతధరారజశ్చుళికితాంభోటిన్ ప్రశంసించెదన్.

88


సీ.

 డంబు సూపి ధరాతలంబుపైఁ దిరుగాడు
                        కవిమీఁదఁ గాని నా కవచ మేయ,
దుష్ప్రయోగంబుల దొరకొని చెప్పెడు
                        కవిశిరస్సునఁ గాని కాలు చాప,
చదివి చెప్పఁగ నేర్చి సభయందు విలసిల్లు
                        కవినోరు గాని వ్రక్కలుగఁ దన్న,
సంగీతసాహిత్యసరసవిద్యల నేర్చు
                        కవుల రొమ్ములఁ గాని కాల్చి విడువ,


తే.

దంటకవులకు బలువైన యింటిమగఁడఁ,
గవులవాదంబు విన వేడ్క గలిగెనేని
నన్నుఁ బిలిపింపు మాస్థానసన్నిధికిని,
లక్షణోపేంద్ర! ప్రౌఢరాయక్షితీంద్ర!

89


ఉ.

తక్కక, రావు సింగ వసుధావరుఁ డర్థుల కర్థ మిచ్చుచో,
దిక్కుల లేని కర్ణుని, దధీచిని, ఖేచరు, వేల్పు మ్రాకుఁ, బెం
పెక్కిన కామధేనువు, శిబీంద్రుని నెన్నెదు బట్ట! దిట్టవై,
కుక్కవొ ?నక్కవో? ఫణివొ? క్రోఁతివొఁ? పిల్లివొ? బూతపిల్లివో?

90


క.

తేలా కాయెను బోనము,
పా లాయెను మంచినీళ్ళు, పడియుండుటకున్
నేలా కఱవాయె, నిసీ!
కాలిన గురిజాల నిష్ట కామేశ! శివా!

91

సీ.

దండయాత్రాఘోష తమ్మటధ్వనులచే
                        గంతులు వేయించెఁ గప్పకొండ,
కితపకాలాభీలకీలానలముచేత
                        నేలపొం గడఁగించెఁ బాలకొండ,
ఆరట్టజాధట్టహయధట్టములచేత
                        మట్టి తూర్పెత్తించెఁ బొట్టునూరు,
భూరిప్రతాపాగ్నిఁ బుటములు పెట్టించె
                        విద్వేషులను గళా(కాళ)వెండిపురము,


తే.

అనఁగ నుతి కెక్కి తౌర! కేళాదిరాయ!
అరులపండువమండువాయవనహరణ!
బళియధూళియమాళువబందికార!
విజయరఘురామ! అల్లాడవిభునివేమ!

92


శా.

దాయాదుల్వలె గుబ్బచన్ను లొఱయన్, ధావళ్యనేత్రాంబుజ
చ్ఛాయ ల్తాండవ మాడఁ గేరి, పురుషస్వాంతమ్ముల న్మన్మథుం
డేయం, జంగమువారి చంద్రముఖి విశ్వేశార్చనావేళలన్
వాయించెం గిరిగిండ్లు, బాహుకుశలవ్యాపారపారీణతన్.

93


ఉ.

దోసెడుకొంపలోఁ బసులత్రొక్కిడి, మంచము, దూడరేణమున్,
బాసినవంటకంబు, పసిబాలురశౌచము, విస్తరాకులున్,
మాసినగుడ్డలున్, దలకు మాసినముండలు, వంటకుండలున్,
రాసెఁడుకట్టెలున్ దలఁపరాదు పురోహితు నింటికృత్యముల్.

94


సీ.

పంపావిరూపాక్షబహుజటాజూటికా
                        రగ్వధప్రసవసౌరభ్యములకు,
తుంగభద్రాసముత్తుంగవీచీఘటా
                        గంభీరఘుమఘుమారంభములకు,
కళసాపురప్రాంతకదళీవనాంతర
                        ద్రాక్షాలతాఫలస్తబకములకు,

కర్ణాటకామినీకర్ణహాటకరత్న
                        తాటంకయుగధాళధళ్యములకు,


తే.

నిర్నిబంధనిబంధమై నెనయు కవిత
తెలుగునను సంస్కృతంబునఁ పలుకనేర్తు,
ప్రౌఢదేవేంద్రరాయ భూపాలవరుని
సమ్ముఖంబున దయ చూడు ముమ్మ సుకవి!

95


చ.

పస గల ముద్దుమోవి, బిగి వట్రువగుబ్బలు, మందహాసమున్,
నొసట విభూతిరేఖయుఁ, బునుంగున తావి, మిటారి చూపులున్,
రసికులు మేలు! మేలు! బళిరా! యని మెచ్చఁగ, రాచవీటిలోఁ
బసిఁడిసలాక వంటి యొకబల్జెవధూటిని గంటి వేడుకన్.

96


ఉ.

పువ్వులు కొప్పునం దుఱిమి, ముందుగఁ గౌ నసియాడుచుండఁగాఁ,
జెవ్వునఁ జంగ సాఁచి, యొకచేతను రోకలి బూని, యొయ్యనన్
నవ్వు మొగంబు తోడఁ తన నందనుఁ బాడుచు, నాథుఁ జూచుచున్,
"సువ్వియ సువ్వి" యంచు నొకసుందరి బియ్యము దంచె ముంగిటన్.

97


ఆ.

మందరాద్రిసములు మానవు లందఱు,
చందమామకూన లిందుముఖులు,
కందులేని మౌక్తికంబులు జొన్నలు,
కుందనంపుబెడ్డ, కుందుగడ్డ.

98


ఉ.

వంకరపాగలున్ నడుము వంగిన కత్తులు, మైలకోకలున్,
సంకటి ముద్దలున్, జనుప శాకములున్, బులు పచ్చడంబులున్,
దెంకగు నోరచూపులును, దేఁకువ దప్పిన యేసబాసలున్,
రంకుల బ్రహ్మ యీ మసరరాజ్యము నెట్లు సృజించెనో కదా?

99

ఉ.

వీరులు దివ్యలింగములు, విష్ణువు చెన్నుఁడు, కల్లిపోతురా
జారయఁ గాలభైరవుఁడు, నంకమ శక్తియ యన్నపూర్ణయున్,
గేరెడి గంగధార, మడుఁగే మణికర్ణికగాఁ జెలంగు నీ
కారెమపూఁడి పట్టణము కాశి గదా పలనాటివారికిన్!

100


సీ.

శ్రీరస్తు, భవదంఘ్రి చికురంబులకు మహా
                        భూర్యబ్దములు సితాంభోజనయన!
వర కాంతి రస్తు, తావకసఖముఖముల
                        కాచంద్రతారకం బబ్జవదన!
మహి మాస్తు, నీ కటిమధ్యంబులకు మన్ను
                        మిన్ను గలన్నాళ్ళు మించుబోఁడి!
విజయో౽స్తు, నీ గానవీక్షల కానీల
                        కంఠ హరిస్థాయిగా లతాంగి!


తే.

కుశల మస్తు, లసచ్ఛాతకుంభకుంభ
జంభవిత్కుంభికుంభావిజృంభమాణ
భూరిభవదీయవక్షోజములకు మేరు
మందరము లుండు పర్యంత మిందువదన!

101


మ.

శ్రుతిశాస్త్రస్మృతు లభ్యసించుకొని విప్రుం డంత నానాధ్వర
వ్రతుఁడై పోయి కనున్ బురందరపురారామద్రుమానల్పక
ల్పతరుప్రాంతలతాకుడుంగసుఖసుప్తప్రాప్తరంభాభగ
ప్రతిరోమాంకురపాటనక్రమకళాపాండిత్యశౌండీర్యమున్.

102


సీ.

సప్తమాడియ రాయ చంద్రబింబాననా
                        చికురవల్లరులపైఁ జిన్నిపువ్వు,
ఝాడె జంతుర్నాటి జననాథ శుద్ధాంత
                        కుచకుంభములమీఁది కుంకుమంబు,
బారుహదొంతి భూపాల లీలావతీ
                        గండస్థలంబులఁ గలికినవ్వు,

కలువ పల్ల్యొడ్డాడి కటకాధిపతి వధూ
                        సీమంతవీథులఁ జేరుచుక్క,


తే.

యల్లడాధీశు వేమ క్షమాధినాథు
భూరినిష్టురధాటీవిహారచటుల
సైన్యనాసీరతుక్ఖారశఫఫుటోత్థ
వింధ్యపార్శ్వవసుంధరావిపులధూళి.

103


క.

సిరిగలవానికిఁ జెల్లును
దరుణులఁ బదియాఱువేలఁ దగఁ బెండ్లాడన్,
దిరిపెమున కిద్దఱాండ్రా
పరమేశా! గంగ విడుము, పార్వతి చాలున్.

104


సీ.

నీలాలకాజాలఫాలకస్తూరికా
                        తిలకంబు నేమిట దిద్దువాఁడ?
నంగనాలింగనానంగసంగరఘర్మ
                        శీకరం బేమిటఁ జిమ్మువాఁడ?
మత్తేభగామినీవృత్తస్తనంబుల
                        నెలవంక లేమిట నిల్పువాఁడ?
భామామణీకచాభరణశోభితమైన
                        పాపట నేమిటఁ బాపువాఁడ?


తే.

ఇందుసఖులను వేప్రొద్దు గ్రిందు పఱిచి,
కలికి చెంగల్వఱేకుల కాంతిఁ దనరి
…................................ అహహ!
పోయె నాగోరు! తనచేతిపోరు మాని.

105


ఉ.

ఇంగల మంచు వచ్చి 'యడియే 'నని కొత్తమసాని మ్రొక్కఁగాఁ
గొంగు బిరాల్నఁ బట్టి, తిరుకొం గటు దీసి, జలారి చెంతనే

వంగగఁ బెట్టి, యోనిఁ దిరువట్టలఁ గొట్టఁగఁ, జాలుఁ జాలు నీ
..... లటంచు నిన్ను మఱి తిట్టెనుగా శఠకోప జియ్యరూ.

106


ఉ.

[3]మీనవిలోచనంబులును, మీటిన ఖంగను గుబ్బచన్ను, లిం
పైన వచో౽మృతంబు, సొగసైన మదాలస మందయానమున్
గా నొనరించి దీని గణికామణిఁ జేయక, నిర్దయాత్ముడై
గానులదానిఁ జేసిన వికారవిధిం దల గొట్టఁగా వలెన్.

107


ఉ.

జంగమురాలిఁ బట్టి, యొకజంగము వంగఁగ బెట్టి, యోనిలో
లింగము బెట్టి, క్రుక్కి యదలించుచు, నొక్కొకతాఁకు తాఁకినన్,
లింగ! నమశ్శివాయ! గురులింగ! మహేశ్వర! జంగమయ్య! యో
యంగజభంగ! సాంబ! గురుఁడా! యనుఁ దాఁకిన తాఁకు తాఁకునన్.

108


చ.

ఉలిమిడిచెక్కయున్, మిగుల నుక్కయుఁ, జప్పని రొట్టె ముక్కయున్,
మలినపు గుడ్డలున్, నులుక మంచపుఁ గుక్కియుఁ, జీకటిల్లునుం,
దలచిన రోఁత వచ్చు, నొకనాఁటి సుఖం బొకయేఁటి దుఃఖ, మీ
పలివెల వారకాంతల యుపస్థలకున్ బదివేల దండముల్.

109


సీ.

జిలుఁగైనచెంగావి జిగి మీఱు కుచ్చెళ్ళు
                        చిన్నిమెట్టెలమీఁదఁ జిందులాడ,
నీటైనరత్నాలతాటంకములకాంతి
                        కుల్కుగుబ్బలమీఁద గునిసియాడ,
గుఱుతైనయపరంజి గొప్పముత్తెపునత్తు
                        మోవిపై నొకవింత ముద్దుగుల్క,
తీరైనముత్యాలహారముల్ మేలిమై
                        మెఱుఁగుఁజెక్కులతోడ మేలమాడ,

తే.

గంధకస్తురివాసనల్ గమ్మనంగ,
నలరువిలుకానిచేతిపూవ మ్మనంగ,
కాళ్ళ నందెలు గలుగల్లుగ ల్లనంగ,
సొగసు గుల్కంగ, వేపారిసుదతి వచ్చె.

110


ఉ.

కూటమి నొక్కనాఁటికిఁ ద్రికోణసహస్రములం బగుల్చు నీ
ధాటికిఁ! జల్లడంబులును, దారుణగోణము, లంచుగోచులున్,
శాటులు నోర్వఁగాఁ గలవె? చాలును నీదు విజృంభణం, బయో!
యేటికి లేవఁబాఱితివి యీసరిప్రొద్దు కడం బ్రజాపతీ!

111


ఉ.

మాపటి కొండవీటి కసుమాలపుఁదొత్తులఁ జూచి యేల యు
త్థాపనశక్తి చూపెదవు దబ్బఱ శిశ్నమ? వారిసౌమన
శ్చాపగృహాంతరాళతలజాగ్రదుదగ్రనిరర్గళవ్రణో
ద్దీపితకాలకూటవిషదిగ్ధశరీరుల ము న్నెఱుంగవే?

112


సీ.

పరరాజ్య పరదుర్గ పరవైభవశ్రీలఁ
                        గొనకొని విడనాడు కొండవీడు,
పరిపంథిరాజన్యబలముల బంధించు
                        కొమరు మించిన జోడు కొండవీడు,
ముగురురాజులకును మోహంబు పుట్టించు
                        గుఱుతైన యుఱిత్రాడు కొండవీడు,
చటులవిక్రమకళాసాహసం బొనరించు
                        కుటిలాత్ములకు గాడు కొండవీడు,


తే.

జవనఘోటకసామంతసరసవీర
భటనటానేకహాటకప్రకటగంధ
సింధురారవయోహనశ్రీలఁ దనరు
కూర్మి నమరావతికి జోడు కొండవీడు.

113


క.

నీలాటిరేవు లోపల
మేలిమితోఁ దీర్చినట్టు మెఱసి నిలుచుచున్,

దాలిమిని వాలుఁజూపుల
బాలామణి గుట్టు బైటఁ బడఁగాఁ జూచెన్.

114


క.

నెమలిపురి యమపురముగా,
యముఁ డాయెను బసివిరెడ్డి, యంతకు మిగులన్
యమదూత లైరి కాఁపులు,
క్రమ మెఱుఁగని దున్న లైరి కరణా లెల్లన్.

115


ఉ.

ఆదరణంబు సున్న, వినయంబు హితంబును బొంకు, సత్యమా
లేదు, దయారసం బది హుళిక్కి, పసాపడువేళ పంక్తిలో
భేదపుఁ బెట్టు దిట్ట, బలి భిక్షముఁ ……................…త
త్త్వాదుల బుట్టఁ జేసిన విధాత ప్రజాపతి గాక యుండునే?

116


శా.

దస్త్రాలున్ మసిబుఱ్ఱలున్ గలములున్ దార్కొన్న చిం తంబళుల్,
పుస్తుల్ గారెడు దుస్తులున్, జెమట కంపుం గొట్టు నీర్కావులున్,
అస్తవ్యస్తపుఁ గన్నడంబును, భయంబై తోఁచు గడ్డంబులున్,
'వస్తూ చూస్తిమి రోస్తిమిన్' బడమటన్ వ్యాపారులం గ్రూరులన్.

117


తే.

వీనులకు విందులై తేనె సోన లెనయ,
ముందు రాగంబునను జగన్మోహనముగఁ
బాడె నొకజాలరి మిటారి యీడు లేని
కాకలీనాదమున నోడ గడపు పాట.

118


తే.

మేఁతఁ గరిపిల్ల, పోరున మేఁకపిల్ల,
పారుఁబోతుతనంబునఁ బందిపిల్ల,
యెల్ల పనులను జెఱుపంగఁ బిల్లిపిల్ల,
యందమునఁ గ్రోఁతిపిల్ల, యీ యఱవపిల్ల.

119


సీ.

కూడు తలఁపఁ జోళ్ళు, కూర కారామళ్ళు,
                        చెవులంత వ్రేలాళ్ళు, చేలు మళ్ళు,

దుత్తెఁడే నాగళ్ళు, దున్నపోతుల యేళ్ళు,
                        కలపు మాపటివేళ గంజి నీళ్ళు,
మాటమాటకు ముళ్ళు, మరి దొంగ దేవళ్ళు,
                        చేఁదైన పచ్చళ్ళు, చెఱకు నీళ్ళు,
వంట పిడ్కల దాళ్ళు, వాడనూతుల నీళ్ళు,
                        విన విరుద్ధపుఁ బేళ్ళు, వెడఁద నోళ్ళు,
సఖుల చన్నుల బైళ్ళు, చల్లని మామిళ్ళు,
                        పరుపైన వావిళ్ళు, పచ్చ పళ్ళు,


తే.

దళమయిన యట్టి కంబళ్ళు, తలలు బోళ్ళు,
పయిఁడికిని జూడఁ బయిఁడెత్తు ప్రత్తి వీళ్ళు,
చలముకొని వెదికినను లేవు చల్లనీళ్ళు,
చూడవలసెను ద్రావిళ్ళ కీడు మేళ్ళు.

120


సీ.

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిర్యపుఁ జారు
                        చెవులలోఁ బొగ వెళ్ళి చిమ్మిరేఁగఁ,
బలుతెరంగులతోడఁ బచ్చళ్ళు చవిగొన్న
                        బ్రహ్మరంధ్రము దాఁకఁ బారు నావ,
యవిసాకు వేఁచిన నార్నెల్లు ససి లేదు
                        పరిమళ మెంచినఁ బండ్లు సొగచు,
వేపాకు నెండించి వేసిన పొళ్ళను
                        గంచానఁ గాంచినఁ గ్రక్కు వచ్చు,


తే.

నఱవవారింటివిం దెల్ల నాగడంబు,
చెప్పవత్తురు తమతీరు సిగ్గులేక,
…………..............................
చూడవలసెను ద్రావిళ్ళ కీడు మేళ్ళు.

121


సీ.

నడివీథిలో రాళ్ళు, నాగులే దేవళ్ళు,
                        పరగట సావిళ్ళు, పాడుగుళ్ళు,

ఐదువన్నెల కూళ్ళు, నంబటి కావిళ్ళు,
                        నూరూర జిల్లేళ్ళు, నూట నీళ్ళు,
నడుముకు వడదోళ్ళు, నడువీథి కల్ రోళ్ళు,
                        కరుణాల వడిసెళ్ళు, కాఁపు ముళ్ళు,
………......................................
                        ................................……….


తే.

....................................................
....................................................
......................….. నేరెళ్ళ వాగునీళ్ళు,
సిరులఁ జెలువొందు మారెళ్ళసీమయందు.

122


ఉ.

మా కలిదిండి కామయ కుమారకుఁ డన్నిటఁ దండ్రి వైఖరే
కాక తదన్యుఁ డె ట్లగును? గాడిదకుం దురగంబు పుట్టునే?
చేకొని కొంకినక్కకును సింగము పుట్టునె? మాలకాకికిం
గోకిల పుట్టునే? చిరుతకుక్కకు మత్తగజంబు పుట్టునే?

123


సీ.

చక్కని నీ ముఖచంద్రబింబమునకుఁ
                        గళ్యాణ మస్తు, బంగారుబొమ్మ!
నిద్దంపు నీ చెక్కుటద్దంపురేకకు
                        నైశ్వర్య మస్తు, నెయ్యంపుదీవి!
మీటినఁ బగులు నీ మెఱుఁగుఁబాలిండ్లకు
                        సౌభాగ్య మస్తు, భద్రేభయాన!
వలపులు గులుకు నీ వాలుఁగన్నులకు న
                        త్యధికభోగో౽స్తు, పద్మాయతాక్షి!


తే.

మధురిమము లొల్కు నీ ముద్దుమాటలకును
వైభవోన్నతి రస్తు, లావణ్యసీమ!
వన్నెచిన్నెలు గల్గు నీ మన్ననలకు
శాశ్వత స్థితి రస్తు, యోషా లలామ!

124

  1. కైలాసమున జంట మైలారవిభుఁ డుండె
    దినవెచ్చ మెవ్వఁడు దీర్పఁగలఁడు?
  2. బాహుమూలచ్ఛవిన్ వెల్గు మోహనాంగి
  3. ఈపద్యము క్రీడాభిరామమందును గలదు. ఇది శ్రీనాథుని వాథిలోనిదని బ్రౌను పేర్కొనెను.