క్రీడాభిరామము (ఎమెస్కో)
వినుకొండ వల్లభరాయని
క్రీడాభిరామము
అనుబంధము :
శ్రీనాథుని వీథి నాటకము, చాటువులు
సమాలోకనము :
బి. వి. సింగరాచార్య
గౌరవ సంపాదకులు :
బొమ్మకంటి వేంకట సింగరాచార్య
బాలాంత్రపు నళినీకాంతరావు.
ESS-20
EMESCO SAMPRADAAYA SAAHITI
(Emesco Classics)
KREEDAABHIRAAMAMU
VINUKONDA VALLABHARAAYADU
Publishers:
M. SESHACHALAM & CO.
EMESCO POCKET BOOK
First Edition: June 1972
Cover Design:
BAPU
Printers :
SRI KALA PRINTERS
Madras - 33
Distributors:
ANDHRA PRADESH BOOK DISTRIBUTORS,
Raashtrapathi Road. Secunderabad.
Soft Cover Rs. 2-50
Library Edition Rs. 4-25
ప్రకాశిక
ఎమెస్కో సంప్రదాయ సాహితీ ప్రచురణలలో ఇంతవరకు తెలుగుసాహిత్యంలో సువిఖ్యాతములైన పందొమ్మిది కావ్యాలు వెలువరించాము. మన ప్రాచీన సాహిత్యంపట్ల ఆధునిక సాహిత్య రసజ్ఞుల ఆసక్తిని, అభిరుచిని పునరుజ్జీవింపజేయటం అవసరమనీ, 'దేశ భాష లందు తెలుగు లెస్స' అన్న అనుపమఖ్యాతికి ప్రధాన హేతువులైన ప్రాచీన కావ్యాల పరిచయం నవ సాహిత్యకులకు ఆవశ్యకమనీ, దానివల్ల వారి సాహితీ రసజ్ఞత పరిపుష్టమై, తెలుగు పలుకుబడుల ఒడుపులు, ఒయ్యారాలు వారు చక్కగా గ్రహించి ఆనందించగలరనీ విద్వన్మిత్రులు మాకు చిరకాలంగా చేస్తూ వచ్చిన సూచనలను అమసరించి ప్రారంభించిన ఈ ప్రచురణలు సహృదయామోదం పొందుతూండటం విశేషం. వివిధ పత్రికలలో వెలువడుతూన్న సమీక్షలు, సాహితీప్రియు లెందరో పంపిన అభినందన లేఖలు, అన్నింటికన్న ఈపుస్తకాలు చురుకుగా పంపకం అవటంలో పాఠకులు, పుస్తక విక్రేతలు చూపుతూన్న ఉత్సాహం - ఈ ప్రచురణల అగత్యాన్ని, ఆదిలో సాహితీహితైషులైన విద్వాంసులు చేసిన సూచనలోని ఔచితిని నిస్సంశయంగా ధ్రువపరచటం మరొక విశేషం.
సంప్రదాయ సాహితీ ప్రచురణలను అభినందించిన కొందరు మిత్రులు మాకు కొన్ని సూచనలు కూడా చేశారు. ఈ కావ్యాలు టీకాతాత్పర్యాలతో ప్రచురిస్తే చాలినంత భాషాజ్ఞానం లేని పాఠకులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయని కొందరూ, కనీసం కొన్నికఠిన పదాలకైనా అర్థాలు (లఘుటిక) ఇవ్వటం మంచిదని మరి కొందరూ సలహా లిచ్చారు. పీఠికలు ఆయా కవుల్ని గురించి ప్రత్యేక కృషి చేసిన పలువురు విద్వాంసులచేత వ్రాయించటం మంచిదన్నది మరొక సలహా, ఈ ప్రచురణలయందు ఆదరభావంతో చేసిన ఈసూచనలకు కృతజ్ఞులం.
అయితే, ఈ ప్రచురణల ఆశయం సాధ్యమైనంత తక్కువవెలకు, సులభంగా చేతబట్టి చదువుకొనటానికి వీలయిన, ముచ్చటైన, చిన్ని సంపుటాలుగా, ముఖ్యంగా నవసాహిత్యకులకు అనువుగా, విస్తృతంగా పంపకం చేయటం - అని ఆదిలో మేము చేసిన వివరణదృష్ట్యా ఈ సూచనల ఆచరణీయతను పరిశీలించవలసి ఉంది.
సంప్రదాయ సాహితి: ప్రథమ దశకము (1. మనుచరిత్రము, 2. వసుచరిత్రము, 3. ఆముక్తమాల్యద, 4. పాండురంగమాహాత్మ్యము, 5. శృంగారనైషధము, 6. పారిజాతాపహరణము, 7. శ్రీ కాళహస్తి మాహాత్మ్యము, 8. ప్రభావతీప్రద్యుమ్నము, 9. విజయవిలాసము, 10. హరవిలాసము) ప్రచురణ పూర్తి చేసి, వాటిపట్ల పాఠకలోకంలో వ్యక్తమయిన ఆసక్తిని పురస్కరించుకొని, అలాగే ఈ పరంపరలో మరికొన్ని ప్రముఖ కావ్యాలు - పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి శృంగారశాకుంతలము, మొల్ల రామాయణము, సారంగు తమ్మయ వైజయంతీవిలాసము, పింగళి సూరన కళాపూర్ణోదయము రెండు సంపుటములుగాను; బిల్హణీయము, అహల్యాసంక్రందనము, రాధికాసాంత్వనము, శశాంకవిజయము ప్రచురించి, ఇప్పుడు క్రీడాభిరామమనే ఈ సువిఖ్యాత శృంగార కావ్యమును అందిస్తున్నాము.
ఇక్కడితో సంప్రదాయ సాహితి పందొమ్మిది కావ్యాలు (2 సంపుటాలు) వెలువరించాము. ఇతర ప్రసిద్ధ కావ్యాలు కూడా వీలు వెంబడిని ఇలాగే ముచ్చటైన సంపుటాలుగా ప్రచురించగలము.
ఈ ప్రచురణలకు సదా మీ సహకారం ఆశిస్తూన్న
భవదీయుడు,
యం.యన్. రావు