క్రీడాభిరామము/మొదటి భాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


<poem> కృత్యవతరణిక

గణన కెక్కిన దశరూపకముల యందు వివిధ రసభావ భావన వీధి లెస్స ఏ కవీంద్రుడు రచియించె నీ ప్రబంధ మనుచు మీ రానతిచ్చెద రైన వినుడు

కృతికర్త వంశ వర్ణన

అఖిల ప్రపంచంబు నన్యథా కల్పించె పటురోషరేఖ సాఫల్యమొంద త్రైశంకసంబైన తారకామండలం బాకాశ మార్గంబు నందు నిలిపె మాలినీతీర నిర్మల సైకతములలో మేనకాప్సరసతో మేలమాడె నామ్నాయమాత గాయత్రీమహాదేవి ప్రణుతించి బ్రహ్మర్షి పదము గాంచె

నెవ్వడాతండు సామాన్యఋషియె తలప దాటకా కాళరాత్రికి దాశరథికి కాలకంధర కోదండ ఖండనునకు కార్ముకాచార్యవర్యుండు గాధిసుతుడు

ఆ విశ్వామిత్రు గోత్రంబను జలనిధి యాహ్లాదముం బొందుచుండన్‌ భూవిఖ్యాత ప్రభావాభ్యుదయు డుదయం బొందె నాచంద్రకీర్తుల్‌ ద్యావాపృథ్వ్యంతరాళాంతరముల నతి నిస్తంద్ర చంద్రాతపశ్రీ ధావళ్య స్ఫూర్తి లక్ష్మీతరళతర కళా ధాళధళ్యంబు సూపన్‌

ఆ మంత్రీశ్వరు కూర్మినందనుడు చంద్రామాత్యు డంభోజభూ భామా రత్న పయోధరద్వయ తట ప్రాలంబనైపథ్య ము క్తా మాణిక్య నిభాభిరూప్యపద వాక్యప్రౌఢ సాహిత్య వి ద్యా మాహాత్మ్య విలాస సమ్ముదిత విద్వన్మానసుండిద్ధరన్‌

కర్ణాటక్షితినాథుడైన పెదబుక్కక్ష్మాప దేవేంద్రు న భ్యర్ణామాత్యుని దానఖేచరుని చంద్రాధీశు బంధుప్రియున్‌ వర్ణించున్‌ కవికోటి శంకరజటా వాటీ తటాంతర్నదత్‌ స్వర్ణద్యంబు తరంగరింగణ లసత్సాహిత్య సౌహిత్యయై

ఆ చంద్రమంత్రి మణికిని పోచాంబారత్నమునకు బుట్టెను బుధ ర క్షాచణుడు మంచనార్యుడు వాచస్పతి సదృశ బుద్ధివైభవుడగుచున్‌

మంచనార్యు తిప్పమకును సుపుత్రులు నలువురెన్న సింగనయును తిప్ప నయును మల్లనయును నయనీతి సత్కళా న్వితుడు చెన్నమంత్రి విభుడు ననగ

సింగరామాత్య సుతుడు సుస్థిరగుణుండు మానినీమన్మథుడు చంద్ర మంత్రివరుడు వెలసె వైభవముల దేవవిభుని బోలి సకలబుధతతి యెల్లను సంస్తుతింప

మిరుతూరి విట్ఠమంత్రీ శ్వరుతనయ వరించె మల్లసచివాగ్రణి శం కరు డద్రిరాజనందన పరిణయ మగుభంగి నధిక భాగ్యోన్నతుడై

మల్లనమంత్రికిం ద్రిపురమా తరళాక్షికి కాంతి రోహిణీ వల్లభు లాత్మసంభవులు వల్లభ లింగన తిప్పన క్షమా వల్లభ మంత్రిశేఖరులు వారవధూజన పుష్పభల్లు లు త్ఫుల్ల యశోవిభాసితులు పుణ్యులు లింగన భైరవేంద్రులున్‌

అందు

తారకామందార తారాచలంబుల తో రాయు నెవ్వాని చారుకీర్తి భావసంభవ భద్ర దేవేంద్రుసూనుల మరపించు నెవ్వాని మహితమూర్తి జీమూతవాహన శిబి సూర్యతనయుల ధట్టించు నెవ్వాని దానశక్తి భార్గవ గార్య్గ గీష్పతి మతిప్రౌఢిమ నిరసించు నెవ్వాని నిశితబుద్ధి

యతడు రిపురాజ రాజ్య సప్తాంగ హరణ కరణ పరిణత యుక్తి ప్రకాశమాను డతులితాచార విజిత గంగాత్మజుండు మర్య్తమాత్రుండె వల్లభామాత్యవరుడు

వాదాల సురధునీ వీచికాగంభీర వాచావిలాసుడు బైచమంత్రి పల్లవోష్ఠీ మానసోల్లాసకృతి పుష్ప భల్లావతారుండు మల్లవిభుడు పన్నగాలంకార పన్నీరజ ధ్యాన సన్నుతాత్ముండు పోచన్నశౌరి ప్రత్యగ్రసహజ సాహిత్య విద్యా కళౌ న్నత్యుండు తిప్పనామాత్యఘనుడు

నందనులు చంద్ర మందార కుంద కుముద గంధకీ గంధసార సౌగంధ్య బంధు బంధురోదారకీర్తి సౌభాగ్యనిధికి మల్లికార్జున మంత్రికి వల్లభునకు

కనకాద్రి ప్రతిమాన ధైర్యనిధి లింగ క్ష్మాప మంత్రీంద్రుతో ననతారాతి నృపాల మంత్రి జనతాహంకార తారా హిమా ర్కునితో రూపరతీంద్రుతో హరిహర క్షోణీంద్ర సామాజ్య వ ర్ధనుతో సాటి సమాన మీడు గలరా రాజన్య సైన్యాధిపుల్‌

తిప్పమంత్రి జగదుదీర్ణ వితీర్ణు డు ద్వాహమయ్యె నధిక వైభవమున హరితగోత్రజలధి హరిణాంకుడగు తిప్ప నార్యతనయ పెద్దమాంబ నెలమి

ఆ మల్లామాత్యవర్యుం డయుగనయన పూజానుసంధాన సంధా సామగ్రీ పుండరీకేక్షణుడు వెలసె నైశ్వర్య సంపత్సమృద్ధిన్‌ సీమా దంతావళాభ్యు చ్ఛ్రిత కర తటక్షేత్ర నిర్యన్మదాంభన్‌ స్తోమద్యాలోల భృంగస్తుత విమలతర స్ఫూర్తిసత్కీర్తి లక్ష్మిన్‌

సత్యవ్రతాచార సత్కీర్తిగరిమల చంద్రుతోడను హరిశ్చంద్రుతోడ నభిమాన విస్ఫూర్తి నైశ్వర్యమహిమల రారాజుతోడ రైరాజుతోడ సౌభాగ్య వైభవ జ్ఞాన సంపన్నత మారుతోడ సనత్కుమారుతోడ లాలిత్య నిరుపమ శ్లాఘా విభూతుల భద్రుతోడను రామభద్రుతోడ

పాటి యనదగు ధారుణీపాల సభల వీర హరిహరరాయ పృథ్వీకళత్ర రత్నభండార సాధికార ప్రగల్భు మల్లికార్జును త్రిపురారి మంత్రివరుని

కపటాచార విరోధిరాజ సచివగ్రావోగ్ర దంభోళికిన్‌ నృపనీతి వ్యవహార కార్యఘటనా నిర్ధారణాశాలికిన్‌ తపనీయాచలరాజ ధైర్యనిధికిం ధర్మైకపాథోధికిం ద్రిపురారాతి మహాప్రధానునకు నేరీ యుద్దు లిద్ధారుణిన్‌

అటవీసూకరమేల యేల ఫణి యేలా కొండ లేలా దిశా తటవేదండము లేల కూటకమఠాధ్యక్షుండు సప్తాబ్ధి సం ఘటనాలంకృత మధ్యమైన నిఖిలక్ష్మాచక్రవాళంబు నె క్కటి దాల్పం ద్రిపురారి వల్లభు భుజాకాండద్వయం బుండగన్‌

గంధవతీ ప్రతీర పుర ఘస్మర పాద బిస ప్రసూన పు ష్పంధయచక్రవర్తి శ్రుత పర్వత దుర్గ మహాప్రధాన రా డ్గంధగజంబు తిప్పన యఖండిత ధీనిధి కాంచె పుత్రులన్‌ బాంధవ కల్పవృక్షముల బైచన మల్లన తిప్ప మంత్రులన్‌

అందు

కృతికర్తృ ప్రశంస

మూడు గ్రామ గ్రాసముల తోడ గూడంగ మోపూరు పాలించె ముల్కినాట నాశ్వలాయన శాఖ యందు ఋగ్వేదంబు కరతలామలకంబుగా పఠించె ప్రత్యక్ష మొనరించి భైరవస్వామిచే సిద్ధసారస్వతశ్రీ వరించె కామకాయనస విశ్వామిత్ర గోత్రంబు వంశగోత్రంబుగా వార్తకెక్కె

నెవ్వడా త్రిపురాంతకాధీశ్వరునకు రాయ నవరత్న భండార రక్షకునకు ప్రియతనూజుండు చందమాంబికకు సుతుడు మనుజమాత్రుండె వల్లభామాత్యవరుడు

అహరవధి సమయ నృత్య త్తుహినాంశుధర ప్రచార ధూతాభ్ర ధునీ లహరీ భ్రమ ఘుమఘుమముల వహి తిప్పయ వల్లభన్న వాగ్వైభవముల్‌

హాటకగర్భవధూటీ వీటీ కర్పూర శకల విసృమర సౌర భ్యాటోప చాటుకవితా పాటవ మరు దవని వల్లభన్నకు నమరున్‌

హల్లీసక నటనోద్భట పల్లవ హరికృష్ణ కంఠ వనమాల్య మిళ ద్గల్లత్సురభులు తిప్పయ వల్లభ రాజప్రధాన వాగ్వైభవముల్‌

అమృతరస మథన సంభవ ఘుమఘుమిత పయఃపయోధి కోలాహలమున్‌ భ్రమియించు తిప్ప సచివో త్తము వల్లభవిభుని చాటుధారా ఫణితుల్‌

భిల్లావతార మధుభి ద్భల్ల భుజాస్ఫాల్యమాన పటుచాప జ్యా వల్లీ మతల్లి చెల్లెలు వల్లభ రాయప్రధాన వాగ్వైభవముల్‌

నెల్లూరి తూముకాలువ హల్లకముల కమ్మదావి నపలాపించున్‌ సల్లలితలీల తిప్పయ వల్లభ రాయప్రధాన వాగ్డంబరముల్‌

ఉపమించెద ధారాధర తపనజ రైరాజరాజ ధారానగరా ధిప ధారాధరవాహుల త్రిపురాంతక వల్లభుని వితీర్ణి ప్రౌఢిన్‌

సరివత్తు రీవి నిర్జర పరివృఢ మణి ధనద జలజ బలి ఖచర నిశా కర సురతరు సురధేనువు లరుదై త్రిపురారి వల్లభామాత్యునకున్‌

సారాచారమునన్‌ వివేకసరణిన్‌ సౌభాగ్యభాగ్యంబులన్‌ ధౌరంధర్యమునం బ్రతాపగరిమన్‌ దానంబునన్‌ సజ్జనా ధారుం దిప్పనమంత్రి వల్లభు నమాత్యగ్రామణిం బోల్పగా వేరీ మంత్రులు సింధువేష్టిత మహోర్వీ చక్రవాళంబునన్‌

మందారవారుణీ మద ఘూర్ణితాత్ముచే వెడదకన్నుల చిన్నివడువు చేత డమరు ఖట్వాంగ దండ కపాల పాణిచే ధూర్తబాలక చక్రవర్తి చేత కుర్కుర పరివార కోటి సేవితునిచే వెలది కోరల మోము వేల్పు చేత (ఒక చరణం కొరత)

విశ్వవిశ్వంబు పాలించు విభుని చేత పార్వతీదేవి గారాబు పట్టి చేత నీప్సితము గాంచు తిప్పమంత్రీంద్ర తనయు డర్మవణి వల్లభామాత్యు డహరహంబు

ప్రేమాభిరామ ప్రశంస

ఆ మంత్రిశేఖరుండు రావిపాటి త్రిపురాంతకదేవుండను కవీశ్వరుం డొనరించిన ప్రేమాభిరామ నాటకంబు ననుసరించి క్రీడాభిరామంబను రూపకంబు తెనుంగుబాస రచియించిన వాడు

ఆతడెంతటివాడు ప్రేమాభిరామ మనగ నెంతటియది దాని ననుసరించి వీథి యను రూపకము మది వెరపు లేక తిప్పవిభు వల్లభుండెట్లు తెనుగు జేసె

అని యానతిచ్చెదరేని

నన్నయభట్ట తిక్కకవినాయకు లన్న హుళక్కిభాస్కరుం డన్నను జిమ్మపూడి యమరాధిపుడన్నను సత్కవీశ్వరుల్‌ నెన్నెదుటం గరాంజలులు నింతురు జే యని రావిపాటి తి ప్పన్నయు నంతవాడ తగునా యిటు దోసపుమాట లాడగన్‌

జనని సంస్కృతంబు సకల భాషలకును దేశభాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటె సౌభాగ్యసంపద మెచ్చుటాడుబిడ్డ మేలుగాదె <poem>