క్రీడాభిరామము/నాలుగవ భాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


<poem> ఈరీర్చుట

సారెకు సారె కేమిటికి జంపెదు గోరట యెర్రలైన వా లారు నఖాంకురంబుల వయస్య కచంబున బాటపాట యీ రీరిచి సీత్కృతుల్‌ చెవుల కింపొనరింప చకోరనేత్ర నీ చారు కుచద్వయంబు మము జంపెడు దోసము నీకు జాలదే

అనుచు నయ్యింటి ముందట

పసుపు నూరుట

పరిపాటీ ఖర్వ ఖర్జూప రతిసమయ సంభ్రాంత సంభోగ భంగిన్‌ తరుణీరత్నంబు హేలాతరళగతి హరిద్రారజః కర్దమంబుం కురు లల్లాడంగ నీగుం గుచములు కదలం గొంతుకూర్చుండి నూరెన్‌ కరవల్లీ కాచభూషా కలమధుర ఝణాత్కారముల్‌ తోరముల్‌ గాన్‌

అని యచ్చోటు వాసి బాహ్య కటకవిథీ విటంకంబు లతిక్రమించి

ఓరుగల్లు

సప్తపాతాళ విష్టప మహాప్రస్తాన ఘంటాపథంబైన గనప పరిఖ తారకామండల స్తబకావతంసమై కనుచూపు గొనని ప్రాకారరేఖ పుంజీభవించిన భువనగోళము భంగి సంకులాంగణమైన వంకదార మెరుగు రెక్కల తోడి మేరుశైలము బోలు పెను పైడితలుపుల పెద్దగవని

చూచె జేరె ప్రవేశించె జొచ్చె ప్రీతి సఖుడు దానును రథ ఘోట శకట కరటి యూథ సంబాధముల కొయ్యనోసరిలుచు మందగతి నోరుగల్లు గోవిందశర్మ

ప్రవేశించి టిట్టిభనామధేయుండైన కోమటిసెట్టి గారితో నాతడిట్లనియె

రాజమార్గంబు వారణ ఘటా ఘోటక శకటికా భటకోటి సంకులంబు ధరణీస్థలీ రజస్త్రస రేణు బహుళంబు కావున మనమందు బోవవలదు క్రంతత్రోవల నొండు కలకలంబులు లేవు తరచుగా సుఖవినోదములు గలవు మరియు విశేషించి మన్మథకూటమౌ వేశ్యవాటిక మధ్యవీథి దరిసి

చిత్తమున కెక్కినట్టి లంజియల తోడ సరససల్లాప సౌఖ్యంబు సలుపవచ్చు నంత మధ్యాహ్నసమయ మౌనపుడు గాని వేడుకైయుండ దక్కలవాడ సొరగ

అనిన టిట్టిభు డౌనంచు ననుసరింప నాలువరి క్రింది త్రోవగా నరిగి యరిగి విప్రుడీక్షించె పలినాటి వీరపురుష పరమదైవత శివలింగ భవన వాటి

పల్నాటివీరులకథ

ద్రుతతాళంబున వీరగుంభి తకధుం ధుం ధుం కిటాత్కార సం గతి వాయింపుచు నాంతరాళిక యతిగ్రామాభిరామంబుగా యతిగూడం ద్విపదప్రబంధమున వీరానీకముం బాడె నొ క్కత ప్రత్యక్షరముం గుమారకులు ఫీట్కారంబునం దూలగన్‌

గర్జించి యరసి జంఘా కాండయుగళంబు వీరసంబెటకోల వ్రేయునొకడు ఆలీఢ పాదవిన్యాస మొప్పగ వ్రాలి కుంతాభినయము గైకొను నొకండు బిగువు గన్నుల నుబ్బు బెదరుచూపుల తోడ ఫీట్కార మొనరించు బెలుచ నొకడు పటుభుజావష్టంభ పరిపాటి ఘటియిల్ల ధరణి యాస్ఫోటించి దాటు నొకడు

ఉద్ది ప్రకటింప నొక్కరుండోలవాడు బయలు గుర్రంబు భంజళ్ళ బరపు నొకడు కొడుము దాటింపుచును బెద్దగొలువు లోన పడతి పల్నాటివీరుల పాడునపుడు

కులము దైవతంబు గురిజాల గంగాంబ కలని పోతులయ్య చెలిమికాడు పిరికికండ లేని యరువదియేగురు పల్లెనాటి వీరబాంధవులకు

ఆరువల్లి నాయినారి దుర్మంత్రంబు కోడిపోరు చాపకూటి కుడుపు ప్రథమకారణములు పల్నాటి యేకాంగ వీరపురుష సంప్రహారమునకు

పచ్చనిపిండి గందమును బాలముసేసయు నెర్రపూవులన్‌ గ్రుచ్చిన కంఠమాల్యములు గొప్పుగ నల్లిన వేణిబంధముల్‌ కచ్చుల వీరసంబెటయు క్రొత్త మణుంగగు కాసెపుట్టమున్‌ రచ్చల కెక్కినట్టి రసణంబులు వీరకుమార కోటికిన్‌

నల్లంగొండయు నాగరి కల్లును ధరణీస్థలిం బ్రగల్ఫస్థలముల్‌ పల్లేరు నాగులేరును పల్లె క్ష్మాకాంత యెల్ల ప్రారంభంబుల్‌

ఇచ్చోట భుజియించి రేకకార్యస్తులై సామంతనృపతులు చాపకూడు ఇచ్చోట జింతించె నిచ్చ నుపాయంబు నళిణాక్షి యార్వెల్లి నాయురాలు నిజ మనుశుద్ధికై నిప్పులయేటిలో నోలాడె నిచ్చోట బీలసాని ఇచ్చోట బోరిరి యిల పణంబుగ గొల్ల సవతితల్లుల బిడ్డ లవనిపతులు

ధీరులగు వారలేవురు వీరపురుషు లై మదోద్ధతి నిచ్చోట నాజి బడిరి యనుచు జెప్పుదు రైతిహ్య మచట నచట జనన పెద్దలు పల్లెదేశములయందు

చిత్తము గూర్చి మాచెరలచెన్నుడు శ్రీగిరిలింగముం గృపా యత్తత జూడ ముల్కివిషయంబునకా మహిమంబు చెల్లెగా కుత్తరలోన మింట జలముట్టిన మాత్రన నాపరాలలో విత్తిన యావనాళ మభివృద్ధి ఫలించుట యెట్లు చెప్పుమా

మగసింగంబులు సంగరాంగణములన్‌ మత్తిల్లి రున్మత్తులై జగదేకస్తుతు లంచు నేమిటికి సంశ్లాఘింప నా భూమిలో చిగురుంబోడుల కాపుగుబ్బెతల నక్షీణప్రభావంబునన్‌ మగసింగంబులగా నెరుంగుదురు పుంభావ ప్రసంగంబులన్‌

కోలదాపున ద్రిక్కటి గూడియున్న గచ్చు చేసిన చిత్రంపు గద్దెపలక వ్రాసినారదె చూడరా వైశ్యరాజ శీల బ్రహ్మాది వీర నాసీర చరిత

ఈ వీరపురుషులు మనకుం గార్యసిద్ధి సేయుదురు గాక పదపద మనుచుం గతిపయపదంబు లరిగి నింబ పల్లవ నికురంబ సందానిత వందన మాలికాలంకృత ద్వారంబగు నేకవీరాగార గోష్టంబు గనుంగొని

ఏకవీర

వందనం బిందిరావరు కన్నతల్లికి దండంబు ఫణిరాజమండనకును నంజలి సోమసూర్యానలనేత్రకు నభివందనము జగదంబికకును మొగుపుజేతులు దేవమునిసిద్ధ సేవ్యకు జమదగ్ని గారాపుసతికి శరణు జోహారు రమణీయ శోభనాకారకు నమితంబు గిరిరాజనందనకును

నిత్యకల్యాణి కలికులనీలవేణి కాదిశక్తికి వేదవేదాంతసార కేకవీరకు పూర్ణరాకేందుముఖికి నఖిలజననికి సాష్టాంగ మనుదినంబు

పద్మలోచన భృగు బ్రహ్మ సంయమి వంశ పరిపాటి కభినవాభరణ మయ్యె రమణి త్రేతా ద్వాపరముల సంధ్యావేళ మగనితో బెక్కేండ్లు మనుపుమనియె నెలత గానక కన్ననెయ్యంపుగొడుకుచే జంపించె ముయ్యేడుసారె నరుల దరుణి హైహయరాజ దంతాస్థిపటలంబు గవడపేరుగజేసి కట్టె నరుత

మండపాకము బెనుబాక మాహురమున నాగవరమున బోలాస ననిచె నింతి యోరుగంట వసించె నీలోత్పలాక్షి కాకతమ్మకు సైదోడ యేకవీర

అలగి యెంతటిరాజు నాండ్రనైనను బట్టి పుట్టుబాపల జేయు రట్టుకత్తె ఘనుడైన జమదగ్ని మునినాథు కూరిమి వెలయించు పెనుబాక వేడ్కకత్తె సుక్షత్రియకులంబు నిక్షత్రముగ జేయు కొడుకు గాంచినయట్టి కోపకత్తె బవనీల జవనిక పాటల నిల్లాండ్ర రమణ ద్రుళ్ళాడించు రంతుకత్తె

యోలిమి గదుళ్ళవాగులో నోలలాడు కలికి పల్లికదేబెల గన్నతల్లి వాసికెక్కినయట్టి పోలాస యిల్లు చక్కమెప్పుల మాహుర మ్మక్కనాచి

బవనీడు

కక్షనిక్షిప్త వికస్వర స్వర విలా సశ్రీ నివాసంబు జవని కందు గట్టిన తంత్రికి కంఠశ్రుతికి గూడ జొక్కంబుగా నారి సొబగు మీర నాలాపముల శుద్ధసాళన సంకీర్ణ వివిధరాగంబుల చవులు చూపి డమడమధ్వనుల బొటారింప యెడనెడ గత్తెరమార్గంబు బిత్తిరిల్ల

వాద్యవైఖరి గడు నెరవాది యనగ నేకవీర మహాదేవి యెదుటనిల్చి పరశురాముని కథలెల్ల ప్రౌఢి బాడె జారుతరకీర్తి బవనీలచక్రవర్తి

మాలెత

అలరుంబోడి జనంగమప్రమద మధ్యానద్ధ ఘంటాధ్వనుల్‌ చెలగం బాడె సమస్తలోక జననిన్‌ శ్రీయేకవీరాంబికన్‌ వలరాజొక్కొక మూర్ఛనాస్వరమునన్‌ బ్రాణంబు గల్పింపగా గలకంఠీ కలకంఠ కోమల కుహూకారంబు తోరంబుగన్‌

అకలంకస్థితి గోరి కొల్చెదరు బ్రహ్మానందభావంబునన్‌ సకలానందమయైక మాత లగుచున్‌ సంతోషచిత్తంబునన్‌ తకదుమ్ముల్‌ యకతాళముల్‌ జవనికల్‌ తందాన లమ్మయ్యకున్‌ ఎకవీరమ్మకు మాహురమ్మకు నథోహ్రీంకార మధ్యాత్మకున్‌

ఆలోకింపక మ్రొక్కరాదు నిజ భక్య్తావేశ సంపత్తిమై నాలోకించిన జిత్త మెట్లగునొ కామావేశ సంయుక్తిమై నేలాగోయి కిరాట మానుదమొ సంవీక్షింతమో చెప్పుమా వ్రీళాశూన్య తటీరమండలము దేవీశంభళీవ్రాతమున్‌

కాపుటాలు

జరివోని గడితంపు జిరుతచౌకంబుల తొగరుబుట్టము కచ్చ దొడివి కట్టి యోలగందపుబొట్టు నుపరిభాగంబుపై సిందూరతిలకంబు బొందుపరచి పసరు దారెడు నింబపల్లవంబుల దండ గుబ్బచన్నులమీద గుదురుగొల్పి క్రొత్తదోమిన దంతకోరకంబుల యందు తాంబూలరాగంబు తళుకు గూర్చి

సకల సంధ్యంగములకు దేజంబు గలుగ మధుమదారంభ మణకువ మరల ద్రోవ దేకువయు నారజంబును దేటపడగ బురమునకు వచ్చె నొక కాపు పూవుబోడి

అయ్యవసరంబున నేకవీరాంబకుం బ్రణమిల్లి యట జనునప్పుడు

జక్కులపురంధ్రి

కోణాగ్రసంఘర్ష ఘుమఘుమధ్వని తార కంఠస్వరంబుతో గారవింప మసిబొట్టు బోనాన నసలు కొల్పిన కన్ను కొడుపుచే దాటించు నెడప దడప శ్రుతికి నుత్కర్షంబు జూపంగ వలయుచో జెవిత్రాడు బిగియించు జీవగర్ర గిల్కుగిల్కున మ్రోయు కింకిణీగుచ్ఛంబు తాళమానంబుతో మేళవింప

రాగముననుండి లంఘించు రాగమునకు నురుమ యూరుద్వయంబుపై నొత్తిగిల్ల కామవల్లీ మహాలక్ష్మి కైటభారి వలపు వాడుచు వచ్చె జక్కులపురంధ్రి

అక్కలు

ముద్రికా మాణిక్యముల దీప్తి కెంగేలి పించెంబు గుంచెతో బిత్తరింప నుపవాసమున తద్దయును సన్ననగు కౌను చనుదోయు భరమున జలదరింప దోకచుక్కల బోలు తోరంపు దెలికన్ను లా వైళమున సిగ్గు నతకరింప నిద్దంపు వెలిపట్టు నెరికదూలిన యప్డు తొడలమించులు వెలి దొంగలింప

నురుమ చప్పుళ్ళకును బిల్లబురుల మ్రోత కంతకంతకు బేరుబ్బు నావహింప నాడె బీటలపై నోలి గూడియున్న యక్క లేడ్వురలో నొక్క యలరుబోడి

హరహర యింత యొప్పునె మహారభటిన్‌ జగఝంకృతస్వన న్మురళిని మిశ్రితాంక రవ మూర్ఛల చిత్తములుబ్బి యక్క లే డ్వురు నదె యాడజొచ్చిరి కడుంగడు వేడ్క సమున్నమత్పయో ధర యుగ భార భీరుతమత న్వవలగ్నములైన నృత్యముల్‌

ఇదె మాయింటి యజమానుండు సంతానకాంక్షియై ప్రతిబంధనోదనార్థంబు యక్షకన్యలం బరీక్షారాధనంబు సేయుచున్నవాడు గావలయు మాణిభద్ర కులోద్వహులైన దేవతలు కామవల్లి శ్రీమహాలక్ష్మితో గూడి యపేక్షితకార్యంబు మనకు నవ్యాక్షేపంబునం జేయుదురుగాక యనుచు విశ్వాసంబుతో నమస్కారంబుతో నమస్కారంబు సేసి కాసల్నాటి గోవిందమంచనశర్మ నర్మసఖుండు దాను నట చని ముందట

మంద్ర మధ్య తార మాన త్రయా భిన్న మహిషశృంగనాద లహరి గూడి డమరు డిండిమంబు డమడమ ధ్వని మ్రోసె నద్భుతం బదేమి యార్భటంబు

మైలారభటులు

అని టిట్టిభుండడిగిన

రవరవ మండు నెర్రని చండ్రమల్లెల చోద్యంపుగుండాలు చొచ్చువారు కరవాడి యలుగుల గనపపాతర్లలో నుట్టిచేరులు గోసి యురుకువారు గాలంపుగొంకి కంకాళచర్మము గ్రుచ్చి యుడివీథి నుయ్యెల లూగువారు కటికిహోన్నాళంబు గండకత్తెర వట్టి మిసిమింతులను గాక మ్రింగువారు

సందులను నారసంబులు సలుపువారు యెడమకుడిచేత నారతులిచ్చువారు సాహసము మూర్తిగైకొన్న సరణివారు ధీరహృదయులు మైలారవీరభటులు

వీరు మైలారదేవర వీరభటులు గొండ్లి యాడించుచున్నారు గొరగపడుచు నాడుచున్నది చూడు మూర్ధాభినయము తాను నెట్టికసీలంత గాని లేదు

వెనుకను మొగ్గవ్రాలి కడువిన్ననువొప్పగ తొట్టెనీళ్ళలో మునిగి తదంతరస్థమగు ముంగర ముక్కున గ్రుచ్చుకొంచు లే చెను రసనాప్రవాళమున శీఘ్రము గ్రుచ్చెను నల్లపూస పే రనుపమలీల నిప్పుడు నుపాయము లిట్టివి యెట్లు నేర్చెనో

శనివారసిద్ధి సజ్జనపారిజాతంబు వరదాత యాదిత్యవార భోగి మాడచీరమడుంగు మాయావినోదుండు మాళవీప్రియభర్త మహితయశుడు పల్లెంబనాయకుం డెల్ల వేల్పుల రాజు గనపవేటల వేడ్కకాండ్ర భర్త కత్రశాలస్వామి కరుణాపయోరాశి పుణ్యకీర్తనుడైన వ్రోలియయ్య

మంచుకుంచాల గొలువంగ మాయలేళ్ళ బట్టి కట్టంగ నేర్చిన బాసవెల్లి భైరవుని తోడిజోడు మైలారదేవు డోరుగంటినివాసి మేలొసగు గాత

అదిగో యెత్తినవారు పట్టణము మధ్యక్షోణి సింహధ్వజం బదిగో కట్టినవారు నింబదళ మాల్యా తోరణవ్రాతముల్‌ విదితంబయ్యె మహోత్సవంబు నెరయన్‌ వీథీవిటంకంబులం దదిగో నిల్పినవారు పూర్ణకలశం బాబాలవృద్ధాంగనల్‌

అకలంకస్థితి శీధుపానరుచులై యాసాదు లుప్పొంగి యో యకరో యమ్మకరో యమక్కరొ యదీ యట్టట్టకో యంచు బా యక తప్పెట్లును దళ్ళెతాళములు నింపై సొంపురంజిల్లగా జకజుంజుం జకజుంజు జుమ్ము మనుచున్‌ సాగుం గడున్‌ వాద్యముల్‌

అట చని ముందట <poem>