కోనంగి/దశమ పథం

వికీసోర్స్ నుండి


దశమ పథం

యుద్ధ ప్రళయం

హిట్లర్ రష్యామీద విరుచుకుపడి ముందుకు సాగిపోతూ ఉన్నాడు.

రష్యా ఇంగ్లండులు ఒకదాని కొకటి సహాయం చేసుకొనడానికీ, జర్మనీ సంపూర్ణంగా ఓడిపోయి కాళ్ళమీద పడేటంతవరకూ ఏ విధమయిన సంధీ జర్మనీతో చేసుకొనకుండా ఉండడానికీ, ఇద్దరూ కలిసే ఏపనైనా చేయడానికి, ఒకరికి తెలియకుండా ఒకరు ఏవిధమైన సంధీ ఎవ్వరితోనూ చేసుకొనకుండా ఉండడానికీ సమాధానానికి వచ్చారు.

రష్యా స్నేహంనమ్మి తాను పడమటి రాజ్యాలలో యుద్ధం చేస్తూ ఉంటే, రష్యా బెసరేబియా ఆక్రమించి, యుగోస్లేవియా మద్దతు చేసి. ఎస్తోనియా, లిథుయోనియాలను ఆక్రమించి తనమీద భయంకర ద్రోహం చేసిందనీ, తాను ఇతర దేశాలతో యుద్ధం చేసే ఈ సమయంలో తన వెనుకనుంచి విడుచుకుపడి జర్మనీని నాశనంచేయ చూస్తూందనీ, అసలు పోలండు యుద్ధంలోనే నమ్మకద్రోహం చేసి పోలండును సగం ఆక్రమించుకుందనీ, అలాంటి ద్రోహం చేసినా కూడా తాను ఊరకున్నాననీ హిట్లర్ ప్రకటించాడు.

జర్మనీ సైన్యాలు పోలండును ఆక్రమించాయి. లిథుయోనియా, ఎస్టోనియాలను ఆక్రమించాయి స్మాలెంస్కు అయిపోయింది. మాస్కోమీదకు చొచ్చుకుపోతున్నాయి.

రష్యామీదకు యెప్పుడు జర్మనీ విరుచుకుపడిందో, ఆ మరుక్షణమే కమ్యూనిస్టుల కందరకూ జర్మనీమీద ప్రళయరుద్రుని కోపం వచ్చింది. కమ్యూనిస్టుపార్టీ నాయకులు పైన ఉన్నవారు ఈ యుద్ధం ప్రజాయుద్ధం అన్నారు. 'ప్రజాయుద్ధం' అనే వారపత్రిక పెట్ట సంకల్పించారు. ప్రపంచాని కంతకూ ముప్పుతెచ్చే జర్మనీ ముందు నాశనమై పోవాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సర్వసహాయం చేస్తామన్నారు.

ఆ వెంటనే భారతీయ కేంద్ర ప్రభుత్వంవారు కమ్యూనిస్టులను విడుదలచేయ తీర్మానించుకొన్నారు. కడలూరు జిల్లా జైలు సూపరింటెండెంటు డాక్టరు రెడ్డిగారినీ, కోనంగిరావుగారి జూలై 14-వ తారీకు ఉదయం తన ఆఫీసులోకి పిలిచి, “మీరు ఇద్దరూ, మీ కమ్యూనిస్టుపార్టీ వారితో ఏకీభవించి యుద్ధ విషయంలో ప్రభుత్వంవారికి సర్వ సహాయాలూ చేస్తారా?” అని అడిగాడు. ఆయన కమ్యూనిస్టుపార్టీ నాయకుల ఉత్తరాలు రెడ్డిగారికీ, కోనంగిరావుగారికీ చూపించారు. అందుపై రెడ్డిగారు తమ మాట్లాడుతూ తామెప్పుడూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదనీ, తమకా ఉద్దేశమే లేదనీ, ప్రభుత్వం ఒప్పుకుంటే తాను ప్రభుత్వానికి సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నాననీ, కోనంగిరావుగారు అసలు రాజకీయాలలో లేరనీ, ఉద్యోగార్థమైవచ్చి అందుకే ఎదురు చూస్తున్న యువకుడనీ, అతని వివాహంనాడే అరెస్టు చేసి తీసుకువచ్చారనీ చెప్పినాడు.

జయిలు సూపరింటెండెంటుకు వీరిద్దరినీ, వీరితోపాటు ఖయదులో ఉన్న ఇంకా కొందరు దక్షిణాది కమ్యూనిస్టులను విడుదల చేయవలసిందనీ, విడుదలయ్యే వారితో మాట్లాడి వారి భాషలు కనుక్కొని, వారిలో పైకి ఒక రకంగా, లోన ఒక రకంగా మాట్లాడేవారిని కని పెట్టి వారి విషయం ఇన స్పెక్టరు జనరల్ ఆఫ్ ప్రిజన్స్గారికి తెలియజేయవలసిందని ప్రభుత్వపు తాఖీదులు వచ్చాయి.

అందుచేతనే విడుదల ముందు అధికారి ఈ రకంగా మాట్లాడినాడు.

వెంటనే వారిని తమ తమ సామానులు సర్దుకోమన్నారు. కోనంగిరావుగారూ, డాక్టరు రెడ్డిగారూ జయిలులో స్నేహం చేసిన వారందరి సెలవు పుచ్చుకొని ఈవలికి వచ్చారు.

కోనంగికి కన్నుల నీరు తిరిగింది.

డాక్టరుగారూ, కోనంగిరావుగారూ, ఆ ఊళ్ళో భోజనం చేసి రాత్రి రైలెక్కి ఉదయానికి మదరాసు చేరారు. అదివరకే ఫలానా బండిలో వస్తున్నామని జయలక్ష్మికి, అర్జంటు టెలిగ్రాం యివ్వడంవల్ల అది రాత్రే అందింది. ఇంక జయలక్ష్మికీ, అనంతలక్ష్మికీ కలిగిన ఆనందం ఇంతింతని కాదు. కన్నీళ్ళు కన్నీళ్ళలో నవ్వులు, అనంతలక్ష్మి నాట్యం చేస్తూ లోపల “వస్తాడే మా బావ!” అనే పాట పాడుకుంది. ఇద్దరూ ఏదో ఇల్లంతా సర్దడం. ఊరకే ఆటూ తిరగడం.

అందరూ చేరి కబుర్లు చెప్పుకుంటూ అతిసంతోషంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు. అనంతలక్ష్మికి ఏమీ తోచలేదు. కాలం జరగదు. కారు వేసుకొని ఇద్దరు ముగ్గురు స్నేహితురాండ్ర ఇండ్లకుపోయి. వాళ్ళను గట్టిగా కౌగలించుకొని “వస్తున్నారు! వారు వస్తున్నారు! కోనంగిరావుగారు వస్తున్నారు! నిన్ననే విడుదలై వస్తున్నారు. యుద్దము మూలాన రైళ్ళు లేక రాత్రి రైలుకు బయలుదేరి వస్తున్నారు. ప్రొద్దునకే వస్తారు!” అని చెప్పింది. వాళ్ళు ముగ్గురూ అంబుజం, పార్వతీ, అలమేలూ అందరూ ఆ రాత్రికే అనంతం ఇంటికి వచ్చారు.

ఎవ్వరికీ నిద్రపట్టదు. అందరూ అనంతలక్ష్మిని వేశాకోళాలతో వేపేశారు.

పార్వతి: ఇక అనంతం మనతో మాట్లాడుతుందా?

అలమేలు: ఎందుకు మాట్లాడుతుందీ! మాట్లాడేందుకు లక్ష స్నేహితురాళ్ళ ముద్ద వస్తున్నాడుగా!

అంబుజం: కోటి స్నేహితురాళ్ళు ముద్దకట్టినా మద్రాసంత లావవడానికి అసలు ఆనందం ఏమి ఇవ్వగలరే!

పార్వతి: ఏమిటే ఆ ఆనందం?

అంబుజం: అనందం సంగతి అనంతానికే తెలియాలి? మనకా విషయాలలో ఏమి అనుభవం ఉందే?

అనంతం: మిమల్ని ఆ అనుభవం సంపాదించు కోవద్దన్నాన్నా? ఆ అనుభవం మీకు సమకూర్చేందుకు సిద్దంగా ఉన్నారు ముగ్గురు.

పార్వతి: ఎవరు బాబు వాళ్ళు?

అనంతం: ఈపాటికి పుట్టకుండా ఉంటారా వాళ్ళు?

అలమేలు: వాళ్ళు చిన్నబిడ్డలు కాబోలు తల్లీ!

అనంతం: ఏమో, మీ ముగ్గురి విషయమూ చంద్రహాస నాటకంలా అవుతుందేమో?

పార్వతి: ఏం కులుకమ్మా! ఓహెూ పాడవే పాట! వాహినీ వారి పుణ్యమా అని “వచ్చాడే నా మొగుడూ!” పాట పాడేయి.

అంబుజం: ఆ పాట “వచ్చాడే మా బావ !” అన్నదే.

పార్వతి: బావైతేనేం, మొగుడైతేనేం, మొగుణ్ణి బావా అని పిలువకూడదా?

అనంతం: పార్వతి తన మొగుణ్ణి “బావా” అని పిలుస్తుంది. అంబుజం “మొగుడా” అని పిలుస్తుంది.

అలమేలు: అనంతం “గురువుగారూ!” అని పిలవడం నేను విన్నాలెండర్రా!

పార్వతి: అందరికీ చదువు చెప్పే గురువే భర్త అవడానికి సాధ్యం ఎల్లా చెప్పండీ!

అనంతం: అందుకనే “మొగుడా' అని పిలుస్తానన్నానుగా?

పార్వతి: నా కిష్టమే! ప్రియ ‘హబ్బీ' అంటాను వచీరావు మల్లే! కాదు, కాంతం మల్లే “ఇదిగో చూడండి” అంటాను.

అనంతం: ఆ పుస్తకాలన్నీ నేనూ చదివానోయ్!

అలమేలు: నేను చదవలేదు. నాకు తెలుగు రాదుగా!

అంబుజం: నేను మాత్రం చదివానా!

అనంతం: మీ ఖర్మ. “నాయడుబావా!” అను. అతడు “మఘవ మస్తక మకుట మాణిక్య రాజ్జీ!” అంటాడు.

పార్వతి: లేదూ, సుందరీ! అని పిలుస్తాడు నన్ను!

అనంతం: నువ్వు “నందా!” అని పిలు.

అంబుజం: మీ భాష నాకర్థం అవటం లేదర్రా!

పార్వతి: నేను లాటిను మాట్లాడడంలేదు.

అనంతం: నేను హీబ్రూలో జవాబు చెప్పడం లేదు.

అంబుజం,

అనంతం: తప్పకుండా మీ ఇద్దరూ నీగ్రో భాష మాత్రం మాట్లాడుతున్నారు.

* * * *

చెట్టిగారికి కోనంగి, డాక్టరు రెడ్డి విడుదలై వస్తున్నారని తెలిసింది. ఆ రోజున అతని కోపం మిన్ను ముట్టింది. శుద్ద అరవంలో ప్రభుత్వాన్నీ, కమ్యూనిస్టులనూ, రష్యానూ బండబూతులు తిట్టేశాడు. తన అనుయాయు లందరూ చుట్టూ ముగి ఉండగా, ఇటూ అటూ పచార్లు చేస్తూ నిప్పులు కక్కుతూ, ఖడ్గరోముని గొంతెత్తి అరిచేశాడు. “వెధవ రష్యా ఎందుకు జర్మనీతో విరోధం పెట్టుకోవాలి? జర్మనీదాన్ని తగలవేసి, నాశనం చెయ్యాలి! కమ్యూనిస్టులు నాశనం అయిపోవాలి. గుండాలందరూ కమ్యూనిస్టులు. జర్మనీ ఈ కమ్యూనిస్టు రాక్షసుల్ని పిండి పిండి చేస్తుంది. చచ్చు బ్రిటిషు ప్రభుత్వం ఏం చేయగలదు? భాగ్యవంతుల పిల్లల్ని తగుల్కొనే ముండాకొడులంతా కమ్యూనిస్టులా? మళ్ళీ సినిమాలా వీళ్ళకు? పైత్తెకారి పయ్యంగళ్, నాయీగళ్.”

అతడు కోనంగినన్నా జయిలులో యుద్ధం ఆఖరు అయ్యేవరకూ ఉండేటట్లు చేయడానికి ప్రయత్నించాడు. కాని ఎందుకో ప్రభుత్వాధికారులు అది పెడచెవిన పెట్టినారు. అందుకు కారణం ఏమై ఉండునా అని అతడు ఆలోచించాడు. తన స్నేహితుడే, తన డబ్బు రుచి చూచిన ఒక పోలీసు ముఖ్యాధికారి, కొంచెం యెదురు తిరిగి తన్నే సన్నగా చీవాట్లు పెట్టినాడు.

2

ఎగ్మూర్ స్టేషను వస్తోంది అనగానే కోనంగి కూర్చోలేకపోయినాడు, నుంచోలేక పోయినాడు. కంపార్టుమెంటు అంతా కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారు. యేమీ తోచదు. డాక్టరు చూచాడు, చూచాడు చిరునవ్వు నవ్వుతూ.

“కాస్త కంగారుపడితే ఎగ్మూరు స్టేషన్ త్వరగా వస్తుందనే నీ ఉద్దేశం?” అన్నాడు.

"రైలు కొంచెం వేగంగా వెడుతుందని ఉద్దేశం డాబుదొరా?”

“డాబుదొరంటే ఏడిసినట్లే ఉంది.”

“డాబుగా ఉంటే ఏడిసినట్లా? 'డాక్టరు' తెలుగులో 'డాకటరు” 'డాగతరు’ 'డాగుదొర' అవుతుంది. 'డాడు' అంటే ఇంగ్లీషులో తప్పు అర్థం వస్తుంది కాబట్టి 'డాబుదొర' అయింది.

“ఏమి సైకాలేజీ అండీ?”

“అది లాలీ గోవిందదాసుగారు కాదుగదా పొరపాటున?”

“లాల్టీ గోవిందదాసుగారి పూర్తి చరిత్ర నాకు తెలియదుగాని, తమరు ప్రేమజీ పిచ్చిజీగారులా ఉన్నారు.”

“ఒకరు ప్రేమ్ జీ అవడం మాటలా ఏమిటోయి? నీ బోటి హెూటలు జాతివాళ్ళకు ఏం తెలుస్తుంది?”

“హెూటలు జాతి వాళ్ళేమిటి?”

జీవితం అంతా హెూటళ్ళలో తినేవాళ్ళుంటారు. ఎరుగుదువా? వాళ్ళకు ఇల్లూ, వాకిలీ, భార్య, బిడ్డలు భావం ఉండదు. వాళ్ళు మనుష్యులు వెనక్కిపోవాలి అని వాదించే రకంవాళ్ళు. అంటే పశువులు, సరీసృపాలు, పురుగులు కావాలి అని వాదించే జాతి వాళ్ళు.”

“ఏమిటా కసి నీకు? మనుష్యుని ప్రథమస్థితి ఎలాంటిదో ఉత్తమస్థితీ అలాగే ఉన్నట్లు కనబడుతుంది. పురోగతి వర్తులాకారంగా ఉండి, చుట్టలు చుట్టులుగా పైకి పోతుంది. కోతీ మనుష్యుడూ ఒకటే పోలిక చాలా వాటిల్లో.”

“అదో వాదన. నా ఉద్దేశం పురోగతి వర్తులాకారం కాదనీ. ఆకాశంలోకి వెడితే తిరిగి తిరిగి మొదటి పోలికలు రావు. ప్రగతి పైకి ఉంటుంది. తమ జీవితం ఒక ప్రపంచగోళం అని అనుకున్ననాడు తిరిగి తిరిగి బయలుదేరిన చోటికే వస్తావు. ఇంక సోషలిజం ఎందుకు? సామ్యవాద మెందుకు? నువ్వు గడిచిన పథం మళ్ళీరాదు అని తెలిసికొని వెళ్ళితే ఎప్పుడూ ముందుకే విశ్వంలో. జీవితం ఒక భూగోళం కాదయ్యా!”

యూరపులో ఇంగ్లీషువారూ, ఇంగ్లండులో జర్మనులూ బాంబులు వేస్తున్నారు. పట్టణాలు నాశనమైపోతున్నాయి. ప్రజలు దూదిపింజలై ఎగిరిపోతున్నారు.

రైలు అతివేగంతో మీనంబాకం దాటింది. ఈ పక్కా ఆ పక్కా చెట్లూ చేమలూ, టెలిగ్రాఫ్ స్థంభాలూ అతివేగంగా వెళ్ళిపోతున్నాయి.

కోనంగి ఒక సిగరెట్టు వెలిగించాడు. లోగొంతుకతో తాను సినిమాలో పాడిన ఓ పాట పాడుకొంటూ చూడని చూపులతో కిటికీలోంచి సర్వప్రపంచమూ చూస్తున్నాడు.

“వెళ్ళుము రా ప్రియమూర్తీ!

వెళ్ళుము రా!

వెళ్ళుము నీవూ వేగపు నడకల

భళ్ళున తూర్పున తెల్లని రేకలు

తోచెను రా ప్రియమూర్తీ!

వెళ్ళుము రా!

కన్య బాలికా కలకంఠములో

గానామృతములు వానలు కురిసెను

అమృతమూర్తిర నీ చేడియ

వెళ్పుము రా!

డాక్టరు: ఆ పాటంటే నాకు కోపం.

కోనంగి: అయితే నా మీదా కోపమేనా?

డాక్టరు: నీమీదెందుకు?

కోనంగి డాక్టరు ఎదురు గుండా నిలుచున్నాడు.

“చూడబ్బాయి, నేనూ నా ప్రియురాలికోసమే తహతహలాడుతూ వెడుతున్నానుగా?”

“అయితే మాత్రం నీమీద కోపం ఎందుకు స్వామీ?”

“ఆ పాట నాకూ వర్తిస్తుందిగా!”

“అందుకనే ఆ పాటమీద కోపం నాకు.”

“నయమే! నీబోటి ఓ పెద్దమనిషి తన మొగంమీద కోపం వచ్చినప్పుడల్లా, ఎదురుగుండా ఉన్న అద్దం బద్దలుకొడుతూ ఉండేవాడట.”

“కాబోలు. అతి తెలివైనవాడే! అలాంటి కవిత్వంమీద కోపం నాకు.”

“ప్రేమకవిత్వం వట్టి ఎస్కేపిస్టు కవిత్వం అంటావు.”

“కాదా మరి?”

“దేశంమీద కవిత్వం? సామ్యవాదంమీద కవిత్వం? కూలీలమీద కవిత్వం?”

“అది నిజమయిన కవిత్వం! పారిపోని కవిత్వం!”

“నీకు దేశ ప్రేమ పారిపోనిదా? స్త్రీపై ప్రేమ పారిపోయేది గదా? గోధుమలు తింటే వేరా? అన్నం తింటే వేరా?”

“స్త్రీ ప్రేమ స్వార్థం. దేశప్రేమ పరమార్థం.”

“దేశ ప్రేమలో తాను ఉండడు? తనకు మాత్రం స్వరాజ్యం రాదు? ఓహెూ హెూ!”

రైలు గిండీ దాటింది. సైదాపేట దాటింది. త్యాగరాజనగరం దాటింది.

కోనంగి పకపక నవ్వుతూ డాక్టరు భుజంతట్టి “నువ్వు వట్టి ఉండు కవిత్వం వ్రాయి. నేను పారిపోయే కవిత్వం వ్రాస్తా.”

రైలు కోడంబాకం దాటింది.

చెట్ పట్ దాటింది.

మాట లేకుండా ప్లాట్ ఫారం వచ్చేవైపు కిటికీలోంచి కోనంగి తొంగి చూస్తున్నాడు.

3

రైలు ప్లాటుఫారంమీద జయలక్ష్మి. అనంతలక్ష్మి, ఆమె స్నేహితురాండ్రు, సేవకురాండ్రు, వినాయగంపిళ్ళె, అతని ఇద్దరి స్నేహితులు, ఆనందంనాయుడు, అతని కుటుంబం, అందరూ తిరువనంతశయనం ఎక్స్ ప్రెస్ బండికి సిద్దంగా ఉన్నారు. బండి ఆగింది. కోనంగి బండిలో నుంచి ఉరికాడు. రెండు ఆంగలలో కోనంగి. అనంతలక్ష్మి దగ్గరకు వెళ్ళాడు.

“అనంతా!”

“గురువుగారూ!” అస్పష్టంగా దగ్గుత్తికతో అనంతలక్ష్మి అన్నది.

ఇద్దరి కళ్ళూ మిలమిలలాడిపోయాయి. మోములలో ఏదో పరమ పవిత్రకాంతులు చంద్రికలై ప్రసరించినవి. ఒకరి నొకరు సర్వలోకమూ మరచి చూచుకొన్నారు. అందరూ కోనంగివయిపే చూపులు.

అయిదు నిమిషాలు వారిద్దరూ ఒకటిగా!

కోనంగి. అనంతలక్ష్మి స్నేహితురాండ్రను అందరినీ అతి సంతోషంతో పలుకరించాడు. అత్తగారి దగ్గరకు వెళ్ళి అత్తగారికి సమస్కరించి “అత్తయ్యగారూ!” అన్నాడు. జయలక్ష్మి కన్నుల ఆనందంతో రంగరించిన కన్నీళ్ళు తిరిగినవి. కోనంగి. వెంటనే వినాయగంపిళ్ళ వాళ్ళ దగ్గరకి పోయి అందరినీ చేతులు పట్టుకొని గట్టిగా నొక్కినాడు. ఆనందంనాయుడు దగ్గరకు వెళ్ళి కోనంగి “ఏమండీ బావగారూ, అంతా క్షేమమా?” అన్నాడు. పనివాళ్ళ నందరినీ పలుకరించాడు. ఇలా మాట్లాడుతూ కారు దగ్గరకు వెడదామని బయలుదేరే ముందు సారా ప్లాట్ ఫారం దగ్గరకు గబగబా పరుగెత్తుకొని వచ్చింది.

“హలో కోనంగిరావ్” ఆమె పలుకరిస్తూ కోనంగి దగ్గరకు వచ్చేటప్పటికి కోనంగి “హలో, సారా! బాగున్నవా?” అని ఆమెకు కరస్పర్శ చేశాడు, సారా పకపక నవ్వుతూ, యిదిగో మీ ఆవిడ ముఖం ఏం ప్రపుల్లమైపోయిందో చూసుకో. ఏమి నీలో చూచి మీ ఆవిడ యింత ముచ్చటపడి పోతోంది?” అన్నది.

“నేను లోకైక సుందరుణనిన్నీ, ఒక చిన్న గొప్ప నెపోలియన్ లాంటివాణ్ణనిన్నీ అనుకొని యీ వెర్రిబాగుల పిల్ల ఆనందంచేత ఆకాశం అంటుతోంది” అని అన్నాడు కోనంగి.

అవతల డాక్టర్ రెడ్డికోసం కమ్యూనిస్టు నాయకులు కొందరు, ఆయన చుట్టాలు కొందరు స్టేషనులోనికి వచ్చి ఉన్నారు. వారంతా డాక్టరుగారితో అనేక విషయాలు ముచ్చటించుతూ నిలుచున్నారు. వారితో మాట్లాడుతూనే, డాక్టరు రెడ్డి కోనంగి, ఆనందము; అనంతలక్ష్మి అందరినీ చూస్తూ చిరునవ్వు నవ్వుకొన్నాడు.

కోనంగి రెండడుగుల్లో డాక్టరు రెడ్డి దగ్గరకు వెళ్ళి అక్కడ వుండే వారందరికీ నమస్కారాలు చేసి రెడ్డిని తన వాళ్లున్న చోటికి లాక్కొచ్చాడు.

అనంతలక్ష్మి, జయలక్ష్మి మొదలగు వారందరు డాక్టరు రెడ్డిగారికి నమస్కారాలు చేశారు, జయలక్ష్మి “డాక్టరుగారు! మీరూ కోనంగిరావుగారూ యిద్దరూ చిక్కేరండి ఎలాగైనా జయిలు.....” అంది.

డాక్టరు: (నవ్వుతూ) మనం యివతల ఉంటే అనవసరంగా తిని కొవ్వులు పెంచుకుంటాం. జైల్లో అవసరమయిన తిండీ, ఒళ్ళు దిట్టంగా గట్టిపడడం, మంచి ఆరోగ్యం.

కోనంగి: ఇక యిక్కడ నుంచి ఎవరికైనా జబ్బుచేస్తే, మా డాక్టరు మూడు మోతాదులు జైలునివాసం మందిస్తాడు గావలెను?

సారా: ఓయి భగవంతుడా. అంత చేదుమందు నాకు మాత్రం చీటీ వ్రాసివ్వకండి డాక్టరుగారూ. నేను మాత్రం కొవ్వు జబ్బు తెప్పించుకోదలచలేదు.

అనంతలక్ష్మి, ఆమె స్నేహితురాండ్రు అంతా నవ్వారు. కబుర్లు చెప్పుకుంటూ అందరూ, టిక్కెట్టు కలెక్టరుకు టిక్కెట్లు యిచ్చి వంతెనమీద నుండి కారుల దగ్గరకు వచ్చారు. డాక్టరు రెడ్డిగారు అందరి దగ్గర సెలవు తీసుకొని, తన స్నేహితులతో కలసి కారుమీద యింటికి వెళ్ళి పోయాడు.

కోనంగి, అనంతలక్ష్మి, జయలక్ష్మి మొదలయినవారంతా వాళ్ళకార్లలోనూ, వాళ్ళ టాక్సీలలోనూ యింటికి వచ్చారు. రాగానే జయలక్ష్మి లోపలికి పరుగెత్తుకు వెళ్ళి తాను సిద్ధంచేసి వుంచిన దృష్టిదోష పరిహారపు వస్తువులు తీసుకువచ్చి అనంతలక్ష్మికి, కోనంగికి దృష్టితీసి లోపలికి వెళ్ళి పోయింది.

8 సారా, పార్వతి, అంబుజమూ, అలమేలూ అందరూ హాలులో సోఫాలమీద కూర్చొని కబుర్లు సాగించారు. కోనంగి, అనంతలక్ష్ములు వారిగదిలోకి వెళ్ళారు.

గదిలోకి వెళ్ళడమేమిటి, కోనంగి అనంతలక్ష్మిని తన హృదయానికి అదుముకొని తన సర్వస్వము పొదివికొన్న గాఢ చుంబనములో కరగి పోయినాడు.

“అనంతా!”

అనంతలక్ష్మి ఏమీ మాటలాడలేకపోయింది. ఆమె నవ్వూ, కన్నీళ్ళూ, ఆనందమూ, ఏదో పరమశృతి రూపమై అతని జీవితము ఆణువు అణువునా నిండిపోయినాయి.

అతని కన్నుల ఆనంద బిందువులు తిరిగి అతని చెక్కుల ప్రవహించినవి. అతడు మాటాడలేక అలాగే మళ్ళీ మళ్ళీ అనంతలక్ష్మిని హృదయానికి అదుముకొన్నాడు. అతడక్కడ వున్న సోఫాకుర్చీలో కూర్చుండి, అనంతలక్ష్మిని తన ఒళ్ళో కూర్చుండబెట్టుకొని హృదయాని కదుముకొన్నాడు. ఆమె అతని మెడచుట్టు చేతులు పెనవేసి అతనిలో ఒదిగి పోయింది.

అయిదు నిమిషాలు, పది నిమిషాలు, ఇరవై నిమిషాలు వారు మాట్లాడలేక పోయినారు. ఒక్క హృదయమై, ఒక్క మనస్పై, ఒక్క ఆనందమై, ఒకరై అతి వియోగానంతర సమయోత్తమ పునస్సమాగమ ప్రపంచాద్భుత సంఘటన ప్రేమీ ప్రేమిక చరిత్రలో కలిసిపోయినారు.

అనంతలక్ష్మి చెలులందరూ చల్లగా ఎవరి యిండ్లకు వారు వెళ్ళి పోయినారు. జయలక్ష్మి అల్లునికి రకరకాల వంటలు అన్నీ సిద్ధంచేస్తున్నది. ఆ మరునాడు కూతురూ, అల్లుడూ కలసి సత్యనారాయణవ్రతము చేసుకొనడానికి కావలసిన సరంజాములు చేస్తూ ఉన్నది.

మేడంతా కలకలలాడిపోతూ ఉన్నది. జయలక్ష్మి, అనంతలక్ష్మి గది గుమ్మం దగ్గరకు వచ్చి “అమ్మిణీ! అల్లుడుగారికి స్నానానికి ఏర్పాటయినది” అని తెలియపర్చెను,

సోఫా కుర్చీమీద కూర్చున్న కోనంగీ, అతని ఒడిలో ఒరిగి ఉన్న అనంతలక్ష్మీ ఒకరి కౌగలింతలో ఒకరు కరిగిపోతూ, చుంబన మహాంబుధిలో మునిగిపోయి ఆ ఇద్దరూ ఉలిక్కిపడి లేచినారు. కోనంగి “వస్తున్నాను అత్తగారూ” అని ప్రతివచనంగా కేక వేసి అనంతలక్ష్మిని ఇంకొక సారి దీర్ఘ చుంబనము వరం పొందినాడు. ఇద్దరూ లేచినారు.

స్నానం ఒనర్చి కోనంగి శుభ్రవస్త్రాలు ధరించి హాలులో కూర్చుండి తన్ను చూడడానికి వచ్చిన అయ్యంగారు బావగారితో, ఇతర బందుగులతో కబుర్లు చెప్పుకుంటూ, వీళ్ళింకా త్వరగా వెడితే బాగుండిపోనురా అనుకుంటూ కాలం గడిపాడు.

కోనంగి: అనంతం, నువ్వు నెమ్మదిగా ఆంధ్ర భోజనం అలవాటు చేసుకోవాలి.

అనంతం: మీ ఖారం నేను తినలేను బాబూ!

కోనంగి: నువ్వు తినడానికి కాకపోయినా, నా కక్కరలేదా ఏమిటి?

అనంతం: ఏమిటి? కోనంగి: గోంగూరపచ్చడి?

అనంత: అవునండోయి, నా చిన్నతనంలో, వందేమాతరం బొమ్మ చూచాను. ఆంధ్రుల్ని గోంకూరలు అంటాడు రాజాబహదూరు.

కోనంగి: అరవల్ని మావాళ్ళు సాంబారుగాళ్ళు అన్నట్లు.

జయలక్ష్మి: మేము అరవవాళ్ళము కాము అల్లుడుగారూ!

కోనంగి: కాకపోతే ఏం! అరవదేశంలో ఉండి ఉండి అరవ భోజనం అలవాటు చేసుకున్నారు మీరు.

జయలక్ష్మి: మా యింట్లో అయ్యంగారు వంటాయనకదా మరి?

కోనంగి: అందుకనే అంటున్నాను. మా గోంగూర మా పచ్చళ్ళు, మా పులుసులు, మా ఆవకాయ, మాగాయ, మెంతికాయ, మా కొరివి ఖారం, మా కూరలు రుచి చూస్తే వదులుతారు మీరు! మా పచ్చిపులుసుల మజా మీకేం తెలుసు?

అనంతం: మా కవన్నీ ఎల్లా తెలుస్తాయండీ?

కోనంగి: నాతో బందరు వచ్చే నేర్చుకుందువుగాని!

జయలక్ష్మి: బందరెందుకు స్వామీ?

కోనంగి: కోడలు అత్తగార్ని చూడవద్దా?

జయలక్ష్మి: మా వియ్యపురాలుగారే యిక్కడకు వస్తే బాగుంటుందేమో!

కోనంగి: మొదట మే ఇద్దరం బందరు వెళ్ళి మా అమ్మను లాక్కురావడానికి ప్రయత్నం చేస్తాము.

అనంతం: తప్పకుండా వెడదామండీ గురువుగారూ!

కోనంగి: అవును అనంతం! ఆంధ్రదేశానికి కోడలివి నువ్వు. రాజ రాజనరేంద్రుడు చేసినట్లు నిన్ను మా దేశానికి తీసుకువెళ్ళి చూపిస్తాను.

భోజనాలయ్యాయి. కోనంగీ అనంతం తమ గదిలోనికి పోయినారు. అనంతం భర్త వద్ద కూర్చుండి భర్తకు తాంబూలం ఇస్తూ ఉంది. కోనంగి ఒక్కొక్క ఆకుచిలక ఆమె నోటికి అందిస్తున్నాడు.

ఇంతట్లో కోనంగితోపాటు, దుక్కిటెద్దుల సినీమాలో అభినయించిన వారూ, దర్శకుడూ, కళాదర్శకుడూ, సంగీత దర్శకుడూ, ముఖ్యతారా మొదలయినవారు పదిమంది కోనంగిని చూడటానికి వచ్చారు.

కోనంగిరావూ, డాక్టరు రెడ్డి విడుదలయ్యారన్న వార్త ఆ ఉదయం పత్రికలలోనే వచ్చింది!

4

కోనంగి జైలునుంచి వచ్చిన పదిహేనురోజులు అమృతపక్షమే ఆ యవ్వన దంపతులకు! ప్రేమ మహాసముద్రము అంత గంభీరము! అంత ఆనందకల్లోలపూరితము! అంత అవధి రహితము!

కోనంగి బందరు వెళ్ళేందుకు మెయిలుబండిలో మొదటి తరగతి రెండుసీట్ల కంపార్టుమెంటులో ప్రయాణంచేస్తూ, అనంతలక్ష్మిని తన ఒడిలో ఒదిగించుకొని పడమట వైపుకు వాలే పంచమి చంద్రవంకను భార్యకు చూపిస్తూ “అనంతా! నీ జీవితరహస్యం తెలుసుకోవాలంటే, నీ ప్రేమ మాహాత్మ్యభావం అర్థం చేసుకోవాలంటే, ఆ చంద్రవంకను ఉపాసిస్తూ వేయేళ్ళు తపస్సు చేయాలి” అన్నాడు.

“తపస్సు చేస్తే?”

“అర్థం అవుతుంది!”

“ఏది?”

“నీ ప్రేమ!”

“నా ప్రేమ అంత అర్థంకానిదా?”

“అవును!”

“నా జీవిత రహస్య మేమిటి? నా జన్మలో మీకు తెలియని రహస్యాలు లేవే!”

“రహస్యంలేని నీ జన్మ యావత్తూ రహస్యాతీతమైనది.”

“రెండూ ఒకటేనా?”

“రెండూ ఒక టేల్లా అవుతాయి? ఒకటి నీ జీవితమార్గం నిష్కల్మషమయినదనీ, రెండవదాని అర్థం నీ జన్మ ఏదో పరమశ్రుతి నర్థించి వచ్చిందనీ!”

“మీబోటి గురువుగారిని పిల్లి అంటే అర్థం ఏమిటని అడిగినాడట ఒక శిష్యుడు. ఆ గురువుగారు మార్జాలము అని జవాబు చెప్పినాడట. ఆ కుర్రవాడు ఆది విని అదేదో పెద్దజంతువో ఏమిటో అని కళ్ళు పెద్దవి చేసి కూర్చున్నాడట.”

“అనంతలక్ష్మి! నీమీద వ్రాసుకొన్న ఈ మూడుపాటలూ విను! ఇవి పారిపోయే కవిత్వం అయినా నాకు భయంలేదు. వ్యక్త్యానందంలోంచి, ఆ వ్యక్తియొక్క లోకసేవాగాఢరక్తి ఉద్భవిస్తుంది. ప్రేమరహితునకు మానవ సేవాభావమే అర్థంకాదు.”

“పారిపోయే భావం ఏనమిటి?”

“మన ఇద్దరి స్థితి”

“మీ పాటలు పాడరూ! అవి నాకు నచ్చాయా మీకు ఎన్ని ముద్దులన్నా బహుమానం ఇవ్వగలను.”

“సిగ్గులేని పిల్లా! రైలు వింటుంది.

ఓసి దివ్యప్రేమమయీ!

ఓసి లోకానంతమూర్తీ!

నిన్ను ప్రేమించి నిజమెరిగినవాడనే

నీలోన వివసించు నఖిలలోకమ్మంచు

ఓసి అమృతమందాకినీ!

ఓసి ఆనందవారాసి!

నిను నే కాంక్షించి, అరిబాధితప్రజా

కాంక్షలన్నీ లోన కరగించుకొన్నాను.

ఓసి వేదనాభరితాత్మ!

ఓసి పరమకరుణార్దితా!

నిన్ను నే పూజించి నిండించుకొన్నాను

మనుజు మనుజుల మధ్య మండేటి ద్వేషమ్ము

ఓసి పూర్ణసౌందర్యాంగి!

ఓసి లావణ్య తేజస్వి!

హృదయాన నిను పొదివి మది తెలుసుకొన్నాను

దేశ దేశప్రేమ దేశాల శాంతియని!”

అతని పాటా ఆ పాటా తాళమూ వేగంగా పోయే రయిలు చక్రనినాదంతో శ్రుతులయ్యాయి. అనంతలక్ష్మి భర్త దగ్గరగా, ఇంకా దగ్గరగా ఒదిగి “నన్నిలా మీరు నానామాటలు అనవచ్చునా? ఈ పాట నామీద వ్రాసినారని లోకం అంతా ప్రచారం ఏమనుకుంటారు?”

“కోనంగి వట్టి పిచ్చివాడని!”

“ప్రజల మొగం చూడడానికి నాకు సిగ్గు అవదండీ గురువుగారూ?”

“ఎందుకూ?”

“అందరూ మీ పాట చదివి, ఆ పాట ఈ అమ్మాయిమీదే వ్రాశాడు కోనంగికవి అని అనుకుంటూ నన్ను తేరిపార చూడరూ!”

వట్టి తేరిపార చూడడమా? ఈమె కోనంగి గీతానాయిక అంటూ తండాలుగా వచ్చి నీ మెళ్ళో ఇన్ని దండలువేసి ఊరంతా ఊరేగించి పెద్ద మీటింగు చేసి, అనేక వినతిపత్రాలు, నవరత్నాలు, తారకామాలలు అర్పించి కృతిసమర్పణలుచేసి, పట్టుచీరెలు, పట్టురెవికలు బహుమతు లివ్వరూ! అప్పుడు నువ్వు నాతో మాట్లాడుతావా ఏమన్నానా?”

“చాటునుండే ఎంకి

సభకు రాజేశావ

పదిమంది నోళ్ళల్లో

పడమంట రాశాడ!”

అని ఎంకెన్నట్లు అల్లా నామీద పాటలు వ్రాస్తారా మీరు? న్యాయమా చెప్పండి?”

“వట్టి అన్యాయం. శుద్ద అన్యాయం. నీ మొగుణ్ణయిన నేను కవి అయిన కోనంగిమీద రామప్పంతులులా డామేజీ దావా పడేసి డొక్కచీలుస్తాను.”

“దావాలు గీవాలు వేయకండి. నాకు కోర్టులంటే హడలు. రెండో పాట పాడరూ!”

“ఏ తపస్సు చేసినానో

ఏ అదృష్టము పొందినానో

నీవు దర్శనమిచ్చి నావూ

నిత్యశోభాంగీ!

మధురకంఠీ! మసృణాండీ!

మామకీన విజృప్తజన్మము

నిండు చేసిన నిర్మలాత్మా

నీవటే దేవీ!

చూపవేమే సకలలోకము

చూపవేమే ప్రజాహృదయము

సుప్తి ఎరుగని మానవార్తిని

చూపవే దేవీ!

“నేనో ప్రశ్న అడుగుతాను, భావికవిత్వపు జవాబు చెప్పక నిజం చెబుతారూ!”

“భావికవిత్వం అబద్దమనా?”

“భావికవిత్వం నిజానికి అతీతమని మీరేగా అన్నారు.”

“అంటే ఏమని నీ ఉద్దేశం?”

“ప్రాపంచిక సత్యం, అర్ధసత్యమూ పావుసత్యమూ మాత్రమేకాని భావసత్యము ఆనంత సత్యానికి దగ్గర అని మీరన్నారు.”

“అవును అన్నాను.”

“అయితే అనంత సత్యం ఏమిటి?”

“నీ సత్యం !”

“పోనీ లెద్దురూ! ఉండండి నా సత్యం మీరే!”

“నువ్వు నా సత్యానివి!”

“సరే లెండి చాలా బాగుంది. అనంత సత్యమేమిటో చెప్పండి.”

“అనంత సత్య మేమిటో నాకు తెలియదు. శాస్త్రవేత్తలు సృష్టికి పునాది ఎలక్ట్రానా, ఇంకా ఏమన్నానా తేల్చలేదు ఇంకా! అయినా ప్రాథమిక రూపంలో వస్తువులను ముక్కలు చేస్తే వాటి ఆధారం ప్రోటానుల ఆ ఎలక్ట్రానుల కలయిక అని మాత్రం తెలుసుకున్నారు. అది అంతవరకు సత్యం. అయినా ఈ చిన్న చిన్న సత్యాల వెనుక నిజమయిన సత్యం ఒకటి ఉంది అని వారు గ్రహించారు. అదేమిటో వారికి తెలియదు. అది రావసత్యం. ప్రాపంచికమైన సత్యాలు, ఇంకా ఒక లక్ష ఇతర రకం సత్యాలూ వీని అన్నింటి వెనకా ఏదో ఒక సత్యం ఉంది. అది అనంతసత్యం!”

“మీరు లెక్కలు మాట్లాడుతున్నారే!”

“అయితే లెక్కల ప్రకారం నా కివ్వవలసిన ముద్దుల బాకీ నాకిచ్చేయి.”

5

కోనంగి, అనంతలక్ష్మీ బందరు స్టేషనులో దిగగానే అక్కడకు అతని ఉత్తరం ప్రకారం, అవతల యిచ్చిన టెలిగ్రాం ప్రకారం అతని స్నేహితుడు మధుసూదనరావు స్టేషనుకు కొందరి స్నేహితులతో వచ్చి సిద్ధంగా ఉన్నాడు.

కోనంగి, ఈ రెండేళ్ళలోనూ ఆనవాలు పట్టరానంత మారినట్లు వారికి తోచింది. స్నేహితులందరూ కోనంగిని కౌగలించుకునేవాళ్ళూ, చేతులు జోడించేవాళ్ళూ ఆయి అతనికి స్వాగతం యిచ్చారు. సామాను అదీ తాను వెంట తీసుకువచ్చిన టాక్సీలమీద వేసుకొని మధుసూదనరావు యింటికి వెళ్ళారు.

మధుసూదనరావు కుటుంబమువారు రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు బందరు నోబిలు కాలేజీలో లెక్చరరుగా ఉన్నప్పుడు బ్రహ్మసమాజంలో కలసి కులభ్రష్టులయ్యారు. ముట్నూరి కృష్ణారావుగారు, పట్టాభి సీతారామయ్యగారు మొదలయిన వారితోబాటు మధుసూదనరావుగారి తాత సాంఘిక సంస్కరణలు తన కుటుంబంలో తీసుకువచ్చి కొమరిత పెద్దమనిషి అయిన తర్వాత బొంబాయిలో ప్రభుత్వ వైద్యుడుగానున్న ఒక బ్రహ్మ సమాజికునకిచ్చి వివాహం చేశాడు. ఆ మధుసూదనరావుగారి మనుమడు ఈ మధుసూదనరావు. కోనంగి వివాహానికి కూడా వచ్చి ఉన్నాడు. అప్పుడే భార్యాభర్తల నిద్దరినీ బందరు రావలసిందని ఆహ్వానించాడు.

కోనంగి స్నేహితులు, మధుసూదనుడు కోనంగి భార్య అత్యంత రూపవతి అని చెప్పడం విన్నారుకాని, ఇంత సౌందర్యవతి అని వారనుకోలేదు.

బచ్చుపేటలో ఉన్న మధుసూదనరావు ఇంటికిపోయి, తన కేర్పాటయిన గదిలో సామాను సర్దుకొని, స్నానాదికాలు నిర్వర్తించి వారందరితో భోజనం చేసిన వెనుక పన్నెండు గంటలకు ఒక జట్కా తల్లి కోసం పంపించాడు కోనంగి.

ఇదివరకే కొడుకూ కోడలూ వస్తున్నారని ఆమెకు తెలియగానే తబ్బిబ్బయిపోయింది కోనంగి తల్లి పార్వతమ్మగారు. ఏదో తన బ్రతుకు తాను బ్రతుకుతూ వుంది. ఇప్పుడు వీడు రావడమేమిటి? వాడు ఒక్కడూ వచ్చి తనును చూచి వెళ్ళిపోయినా తనకు అంత ఇబ్బంది ఉండేది కాదు. ఎవరో కులం తక్కువ అమ్మాయిని చేసుకొని, ఆ పిల్లను కూడా తీసుకు వస్తాడట.

ఆమె నిజచరిత్ర ఎవరికి తెలుస్తుందో అని భయం. కొడుకు మదరాసులో ఉండి ఏదో సినీమా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని పదిమందికీ తెలిసినా, ఆమె అంత కంగారు పడలేదు.

ఇవాళ తన కొడుకూ, తన కొడుకు పెళ్ళి చేసుకున్న ఆ పిల్లా వచ్చారనీ, వెంటనే జట్కా ఎక్కిరమ్మన్నారనీ కబురు రాగానే బేజారైపోయింది. మధుసూదనరావు తనింట్లోనే కోనంగిరావూ, అతని భార్య ఉంటారని చెప్పినప్పుడే, ఈ బ్రహ్మసమాజంగాళ్ళ ఇంట్లో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్ళినా తంటే, వెళ్ళకపోయినా తంటే అనుకుంది.

ఇప్పుడు తన్ను రమ్మంటున్నారు కొడుకూ కోడలూ ఇద్దరూ అని కబురూ బండి రాగానే తన కొడుకు ఫలానా వారింటిలో ఉన్నాడని తెలియగానే, తాను వంటచేసే కుటుంబం యజమానురాలూ, ఆమె చుట్టాలూ ఏమనుకుంటారో అని గజగజలాడి పోయింది. ఎవరూ అడగకుండా, యజమానురాలి దగ్గరకు పోయి, “అమ్మా! మా అబ్బాయి వచ్చాడట పాడు బండి పంపించాడు. వెళ్ళి చూచి వస్తాను” అని చెప్పి గబగబవచ్చి బండి ఎక్కింది.

బండి వెంటనే బయలుదేరి బచ్చు పేట వచ్చింది. బండి రాగానే ఆమెను ఎదుర్కొనడానికి మధుసూదనరావు సిద్ధంగా ఉన్నాడు.

పార్వతమ్మగారు దిగీదిగటంతోటే లోనికి వెళ్ళి “ఏడీ కోనంగేశ్వరుడు?” అని ప్రశ్నిస్తూ మధుసూదనరావువైపు తిరిగింది. అప్పుడే కోనంగీ, అనంతలక్ష్మీ హాలులోనికి వచ్చి పార్వతమ్మగారి పాదాలకు నమస్కరించారు. అనంతలక్ష్మీ అత్తగారికి సాష్టాంగపడింది.

అనంతలక్ష్మిని చూస్తూనే పార్వతమ్మ ఆశ్చర్యంతో మునిగిపోయింది. పూర్తిగా అరవ బ్రాహ్మణ బాలికలా నగలూ అవీ. సౌందర్యవతియైన ఆ బాలిక పార్వతమ్మ కళ్ళల్లో మిలమిలలాడిపోయింది.

కోనంగి “అమ్మా! నీ కోడల్ని చూచావా? అనంతలక్ష్మీ. మా అమ్మగారు” అని అన్నాడు.

పార్వతమ్మ తెల్లబోయి చూడడమేగాని మాట్లాడలేకపోయింది.

“రండి అత్తయ్యగారూ! గదిలో కూర్చుండి మాట్లాడుకుందాం”

అని అనంతలక్ష్మి పార్వతమ్మను పిలిచింది. పార్వతమ్మ మాట్లాడకుండా అనంతలక్ష్మికీ కోనంగికీ ఏర్పాటైన గదిలోనికి పోయింది.


పార్వతమ్మ అక్కడ ఉన్న కుర్చీమీదగాని, చాపమీదగాని తివాసీ మీదగాని కూర్చోడానికి నిరాకరిస్తూ “నిలుచుంటానే అమ్మాయీ, మడికట్టుకున్నాను.” అంది.

అనంత: అత్తయ్యగారూ! మీరు మదరాసు రావాలి.

పార్వతమ్మ: నేనా, నేను మదరాసా, అమ్మయ్యో!

అనంత: అదేమిటి అల్లా అంటారు. మీ అబ్బాయిగారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బోలెడు సంపాదిస్తూ ఉంటే మీరు ఈ ఊళ్ళో వంట చెయ్యటం ఏమీ బాగాలేదండీ. నేనందుకు ఎంతమాత్రమూ ఒప్పుకోను.

పార్వతమ్మ: మీరు ఏ కులం అమ్మాయి?

ఆనంత: మేము తెలుగువాళ్ళమేనండీ!

పార్వతమ్మ: మీరు తెలుగువాళ్ళే అయి ఉండవచ్చును. కాని కులం?

అనంత: మాది హిందూమతం!

పార్వతమ్మ: అంటే, అదేం కులం?

అనంత: మేము వైష్ణవ మతస్తులం!

పార్వతమ్మ: వైష్ణవులా? అయ్యో మా వాడు వైష్ణవ బాలికను పెళ్ళి చేసుకున్నాడా?

అనంత: అత్తయ్యగారూ! మా అమ్మమ్మ బోగంది. మా అమ్మా అంతే! కాని మా తాతయ్య గారు వైష్ణవ బ్రాహ్మణుడు. మా అమ్మ వైష్ణవ మతస్తురాలు. ఆమెను ఒక రంగయ్యంగారు పెళ్ళి చేసుకున్నారు. ఆ ఇద్దరికీ నేను పుట్టాను.

పార్వతమ్మ తెల్లబోయింది. పదినిమిషాలు మాట్లాడలేకపోయింది. అనంతలక్ష్మి తెల్లబోయింది. అయినా తన భర్త తన తల్లిని గూర్చి సమాచారం యావత్తూ ఇదివరకే తనకు చెప్పి ఉన్నాడు. కాని ఇంత వెర్రిబాగుల చాదస్తపు ఆవిడ అని అనంతం అనుకోలేదు.

ఇంతలో కోనంగి లోనకు వచ్చాడు. “ఏమిటి అత్తాకోడళ్ళిద్దరూ మాట్లాడుకొంటున్నారు. అమ్మా! నువ్వు మాతో రావడమేనా?” అని తల్లిని ప్రశ్నించాడు.

పార్వతమ్మ “నేను రానురా! నేను మదరాసువస్తే నా జన్మ తగలబడి పోదూ!” అంది కన్నీళ్ళు నింపుకుంటూ.

6

యుద్దం వరమైంది. ఇంగ్లండును నాశనం చేయాలని జర్మనీ అతి భయంకరమయిన విమాన దాడులను సాగించింది. పాపం కోనంగి ఆ వార్త చదివినప్పుడల్లా గజగజలాడిపోతాడు. యుద్ధంలోని ఒక్కొక్క పిరంగి ప్రేలుడు యొక్క భయంకరధ్వని కోనంగి హృదయంలో భూకంపం అవుతూ ఉంది.

ఏది కోరి జర్మనీ ఈ యుద్ధంలో దిగింది? 1914వ సంవత్సరములో ఏది కోరి జర్మనీ యుద్ధం ప్రారంభించింది? ఆశ అనే మహారోగం పట్టుకుంటే ఎన్ని మందులు ఆ రోగాన్ని నివారించగలవు? ప్రపంచం అంతా మందై ఒక్క మోతాదై ఆ జబ్బు వాడి చేతులోకి వచ్చినా, ఇంకో మోతాదు కావాలని ఆ జబ్బు అల్లరి చేస్తుంది.

ఇంగ్లండుకు ఆ జబ్బు పట్టుకునేగా, అదే జబ్బు పట్టుకుని బాధపడుతూన్న స్పెయిన్ ను నాశనం చేసింది. ఇంగ్లండుకు అమెరికా, ఇండియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, మలయా, న్యూగినియా, న్యూజిలాండు, అన్నీ మోతాదులయ్యాయి, ఈ జబ్బు గమ్మత్తు ఏమిటంటే, మందు పుచ్చుకున్న కొలదీ జబ్బు ఎక్కువౌతుంది. జబ్బు ఎక్కువైన కొలదీ మందు యెక్కువ కావాలి.

కోనంగి ఈ మహారోగాన్ని గూర్చి ఆలోచించిన కొలదీ, మరింత భయపడి పోయాడు.

“అనంతం! ఈ రోగం ఉందే భగవంతుడికో, ప్రపంచ ప్రజలందరికో మాత్రమే లొంగుతోంది.”

“మనకు కూడా పట్టుకోదుగదా ఈ జబ్బు?”

“విడివిడి మనుష్యులకూ పట్టుకుంటుంది ఈ రోగం?”

“ఇది అంటుడు రోగమా?”

“ఆ! టర్కీ నుంచి స్పెయినుకు, స్పెయిను నుంచి ఇంగ్లండుకు పట్టుకుంది. పోర్చుగల్కు తగిలింది. అక్కడ నుంచి ఫ్రాంసుకు పాకింది. ఆస్టియాకు పాకింది. ఆస్టియాతో దెబ్బలాడి స్వతంత్రం సంపాదించుకొన్న ఇటలీకి పాకింది. రష్యాకు పాకింది. ఇంగ్లండు నుంచి స్వతంత్రం సంపాదించుకొన్న అమెరికా వారికి ఈ రోగం తగిలింది. రష్యాతో దెబ్బలాడి విజయం పొందిన జపానుకు పుట్టింది.”

“సరేగాని మీ కవిత్వం మాని, యుద్ధం రోజులలో మనం చేయవలసిన పనేముందండీ! మనదేశానికి బలంలేదు. ప్రపంచంలో నైతికబలం మృగ్యమైకదా ఈ యుద్దాలు వచ్చేది. రామరామా! ఎంతమంది బిడ్డలు, ముసలివాళ్ళు, యువకులు, యువతులు నాశనం అయిపోతున్నారు! ఏ ప్రళయమో వచ్చి నాశనం అవడంలేదు. మనుష్యుని చంపడం అనే భావం ఎంత హృదయ విదారణమయిందండీ!”

“ఎలా యుద్దం చేయగలరో మనుష్యులు? చంపడం అనే భావం జంతు ధర్మానికి చెందింది. ఆ జంతువైనా, క్రూరజంతువు అనంతం!”

“ఏమిటండీ ఈ పాశ్చాత్య నాగరికత?”

“పాశ్చాత్య ఏమిటి? ప్రాచ్యమేమిటి? చంపడం భావం వస్తే అందరూ ఒకటే ప్రాణేశ్వరీ! మనదేశంలో పార్టీ కక్షలు, పొలం తగాదాలు వస్తోవుంటాయి చూడలేదూ! భారతీయులు ఎంతోమంది బ్రిటిష్ సైన్యంలో చేరి యుద్దాలు చేయడం లేదూ ప్రియమూర్తీ! గూర్బాలు, పఠానులు, శిక్కులు, పేరు చెప్పితే ప్రపంచంలోనే హడలు.

ఒక రోజున పేపరు చదువుకుంటూ ఆ యవ్వనదంపతులిద్దరూ ఈ సంభాషణలో పడినారు. అనంతలక్ష్మికి బందరు వట్టి మారుమూల స్థలంలా కన్పించింది. వచ్చిన మూడురోజులవరకూ హుషారుగా గడిపారు ఇద్దరూ. సముద్రం ఒడ్డు, జాతీయ కళాశాల, బందరు వీధులూ చూపించాడు. తను ఆడుకున్న స్థలం, తాను చదివిన హిందూ కాలేజీ అన్నీ అనంతానికి చూపించాడు కోనంగి.

“అదియే బొంబాయి, అల్లదే కనుము పట్టాభి మహానాయకుడదియే” అని అతడు ఆశు కవిత్వంగా పాడుతూ అనంతలక్ష్మిని సాయంకాలానికి బందరు కోటకు తీసుకు తీసుకువెళ్ళాడు. ఆ చుట్టుప్రక్కల రాత్రి ఎనిమిదింటి వరకూ తిరిగి, ఇంటికి చేరుకున్నారు.

కోనంగితల్లి పార్వతమ్మ కుమారునితో “నాయనా! నేను నా వంటపని మాని మదరాసు వచ్చి ఏం చెయ్యగలను తండ్రీ! నేను చేసిన మహాదోషానికి నేను అనుభవించాలిరా? నువ్వు సంపాదించి నన్ను సుఖపెట్టాలని వున్నా, నాకు సుఖం ఎక్కడిదిరా? నాకు ప్రపంచం అంతా తారుమారుగా కనబడుతోంది. నువ్వెందుకు వచ్చావో ఈ లోకంలోకి. నీకీ పెళ్ళేమిటో నాకేమీ అర్థంకావటంలేదు. నా బ్రతుకు ఇట్లాగే బ్రతకనీ! తర్వాత ఏది ఎల్లా ఉంటుందో? మీరిద్దరూ త్వరగా ఈ ఊరు నుంచి వెళ్ళిపొండి” అని విషాదంగా, ఖండితంగా చెప్పింది.

కోనంగికి తల్లి హృదయం అర్థం అయింది. ఆమెకు తాను పుట్టడమే తప్పని అతడనుకొన్నాడు! ఈ విచిత్రమైన భారతదేశంలో జీవితాదర్శాలు, జీవిత భావాలు విచిత్రపథాల ప్రయాణం చేస్తూ వుంటాయి. ఫ్రాయిడ్ మొదలయిన వారి సిద్ధాంతాలన్నీ భారతీయ స్త్రీల విషయంలో వర్తించవు అని అనుకొన్నాడు.

మర్నాడు భార్యాభర్తలు ఇద్దరూ స్నేహితులందరి దగ్గరా సెలవు పుచ్చుకుని వెళ్ళారు. మధుసూదనరావూ, అతని భార్యా, కోనంగీ, అనంతలక్ష్మి కలిసి ఫోటో తీయించుకొన్నారు.

మధుసూదనరావు కోనంగితో ఆ నాలుగయిదు రోజులూ తన విషయం చెప్పుకొని గొంతెత్తి ఏడ్చాడు. “ఒరే కోనంగీ, నా జీవితం వట్టి నిరర్థకం అనుకుంటున్నానురా! యేం చెయ్యను? యుద్దానికి పోదామనుకున్నాను.

“ఏమిటి వ్యాపారం?”

“మాకు ఋణాలు ఎక్కువయితే భూములన్నీ అమ్మేసి అప్పులు తీర్చాం. ఉద్యోగాలు లేవు కొద్దిగా బంగారం ఖరీదు ఎక్కువవడంచేత మాయింట్లో ఉన్న బంగారం అంతా అమ్మేసి కాలక్షేపం చేస్తున్నాము బి.ఏ. పూర్తి చేశాను ఎల్లాగో. ఉద్యోగం? తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు. అమ్మాయిలు మా చెల్లెళ్ళిద్దరికీ పెళ్ళిళ్లు కాలేదు.”

“పెద్దచెల్లెలు చౌధురాణీ బి.ఏ. పూర్తి చేసింది కాదురా?”

“ఆ! రాణీ ఏం చెయ్యాలో తెలియక కొట్టుకుంటోంది. దాన్ని చూస్తే మరీ బెంగ.”

“రాణీని ట్రెయినింగుకు పంపించరాదూ!”

“ట్రయినింగుకు ఇచ్చే పిఠాపురం రాజావారి స్కాలరుషిప్పు దానికి అక్కడ ఉండడానికి సరిపోతుందా!”

“సరే కాని, వెంటనే నువ్వూ, నీ భార్య, చౌధురాణీ మదరాసు రండి. అక్కడ మా యింట్లో ఉందురుగాని.”

"ఛా! ఛా! నువ్వే మీ అత్తవారింట్లో ఉన్నావు.”

ఇంతట్లో అనంతలక్ష్మీ, చౌధురాణీ, మధుసూదనుని భార్యా అక్కడకు వచ్చారు. మధుసూదనుని భార్య కమలనయన “కోనంగిరావుగారూ! మీ ఆవిడ మమ్మిద్దరినీ చంపేస్తోందండీ!” అన్నది.

అనంతలక్ష్మి నవ్వుతూ “చూడండి! వీళ్ళిద్దరినీ. మధుసూదనరావు అన్నగారినీ నాలుగురోజులపాటు మదరాసుకు రమ్మంటే, అల్లరి చేస్తారేమిటండీ?” అన్నది..

“ఒరే మధూ, మీరు రాకపోతే నన్ను మరిచిపొండి, అంతే!” అన్నాడు కోనంగి.

7

చెట్టియారు మధురలో యుద్ధ పారిశ్రామిక వస్తువులను తయారుచేసే పారిశ్రామికులను తయారుచేసే పారిశ్రామిక విద్యాలయం పెట్టాడు. ప్రభుత్వ సలహా ఉద్యోగి (మంత్రుల బదులు వీరు వచ్చారు) ఒకరు వచ్చి ఆ విద్యాలయం తెరిచారు. ప్రభుత్వం కూడా సహాయం చేస్తూ ఉంది. దీనికి తగినట్లు ప్రభుత్వ సహాయంతో ఒక తమిళ దైనికపత్రిక పెట్టాడు. స్వయంగా అరవంలో అరవదేశం అంతా తిరుగుతూ యుద్ద నిధికి సహాయము చేయమనీ, యుద్దంలో చేరమనీ ఉద్భోదించసాగాడు. తాను స్వయంగా ఒకసారి లక్షరూపాయలు ఇచ్చినాడు. గవర్నరుగారు వచ్చినప్పుడు రెండులక్షల రూపాయలు నిధికి అర్పించినాడు. వైస్రాయిగారు మదరాసు వచ్చినప్పుడు నాలుగులక్షలు ఇచ్చినాడు.

దీనికంతకూ వెనకాల దిట్టమయిన ఒక మూలకారణం ఉంది. అనంతలక్ష్మీ అమృతతుల్య మందహాసమే. ఎలాగయినా, ఎప్పటికయినా ఆ మందహాసం తనకు ఆస్వాదనభోగం ఇచ్చితీరాలి! ఆ అద్బుత ముహూర్తంకోసం తాను యెంత కర్చుకైనా వెనుదీయదలచుకోలేదు.

ప్రభుత్వ స్నేహం శక్తినిస్తుంది. ఆ శక్తివల్ల మదరాసురాష్ట్రం అంతా తన వెనుక రయిలు ఇంజను వెనుక బండ్లులా వచ్చి తీరుతుంది. ఆ వచ్చే బండ్లలో ఒక మొదటి తరగతి బండిలో, చక్కని అలంకారం చేసిన దాంట్లో అనంతలక్ష్మి ఒక్కతే మన్మథుని రాణిలా తనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తాను మన్మథుని వేషంతో దర్జాగా ఆ గదికి వెడతాడు.

అతని కన్నులు అరమూతలు పడ్డాయి. రుచిగల వస్తువును తలచుకొని పెదవులు చప్పరించే దౌర్బాగ్యునిలా చెట్టిగారు తన పెదవులు చప్పరించుకొన్నాడు.

ఇంక కోనంగి కూడా తన రైలు క్రింద పడిపోతాడు. రైలు వాణ్ణి ముక్కముక్కలుగా ఎండించి పారేస్తుంది.

ఈ ఆలోచనరాగానే చెట్టిగారు మధుర నించి చెన్నపట్నం బయలు దేరబోయే వేళ ఒక తమిళ వారపత్రిక పోస్టులో తక్కిన టపాతోపాటు వచ్చింది. ఆ పత్రికను చూచీ చూడడంతోటే చెట్టిగారు మండిపోయారు. కళ్ళు కాలిన ఇటుకరాళ్ళలా ఎరుపెక్కినాయి. ముక్కుపుటాలు విస్తరించాయి.

“తిరట్టు పయ్యగాడు. ఏమంటాడు, ఏమంటాడు?” అంటూ ఆ పత్రిక తీశాడు.

ఆ పత్రిక చూడకూడదు, చదవకూడదు. అని కోటివేలసారులు అనుకున్నాడు. అయినా 'కల్లు దుకాణానికి వెళ్ళకూడదు అనుకుంటూనే రోజు నాగా లేకుండా తల వంచుకుపోయే పందిలా, చెట్టిగారు ఆ పత్రిక పై అంటించిన విలాస కాగితం చింపి “నిజం' అనే ఆ వారపత్రిక మడత విప్పి, చదువుకోవడం సాగించాడు. లోపల కుడివైపు పేజీ ఒక దాంట్లో, “చెట్టి నవాబుగారి మన్మధ విజృంభణ” అన్న పెద్ద ఆక్షరాల వ్యాసం కనబడింది. చెట్టిగుండె దడదడ కొట్టుకుంది.

మా చెట్టిగారి జనాభా నాటికి వృద్ధి అవుతోంది. మా చెట్టిగారు కోటి మన్మథులను కలేసి నూర్చి పాకంకట్టి, వంటవండిన ముద్ద. వీలయితే చెట్టిగారు లోకంలో ఉన్న ప్రతి అందమైన బాలికా తన శృంగారమందిరంలో తనకోసం నిరీక్షణలో ఉంచుకుంటాడు. అందరూ ఇంగ్లీషు సినిమాలలో నాట్యంచేసే సుందరీమండలిలా, తన ఎదుట నాట్యం చేస్తారు. ఉలిపరబట్టలు కట్టుకుంటారు. ఆ బట్టలు లేకపోతే మరీ అందంగా ఉంటాడు వాళ్ళ మధ్య తాను!" ఒక సినిమాతార కురంగినయన తన ఎదుట!

ఎందుకు కురంగినయన అని మీరు మమ్ము అడగవచ్చును. చెట్టియారుగారి మలయాకోట్లు ఎవరిని సువర్ణలక్ష్మిని చేస్తున్నాయి? కురంగినయన ఎక్కితిరిగే స్టుడిబేకరు కారును, కురంగినయన ఎవరి చెక్కుబుక్కులలో చెక్కుపెట్టి కొనుక్కుంది?

“కురంగినయనా, మన చెట్టిగారూ తిరుచునాపల్లిలో ఆయన మేడలో ఇద్దరే... తారీఖున మూడురోజులు గడిపారే, వారు చేసుకున్న ఉత్సవమేమిటి?”

చెట్టియారుగారి హంసడిభకులు, చెట్టియారుగారు శ్రీరంగంలో ఒక్క ఇంటిలోకి దూరబోతూ ఉంటే అడ్డంబెట్టిన ఒక భర్తను యెందుకు తన్నారు?”

“... తారీఖున సాయంకాలం ఎనిమిది గంటలకు చెట్టియారుగారి ఇంటిలో మదరాసుల ఆరుగురు సీనీమాతారలతో చెట్టిగారు రాసక్రీడ సలిపారేం! ఆ తారలు కురంగినయన, కుమారి మీనాక్షి, కృష్ణబాల, "తరలాక్షి, కావేరీఅంబాళ్, కనకదేవి అనే వారేనా? ఈ రాసక్రీడ ఉద్దేశమేమిటి? ఒక విలేఖరి?”

చెట్టియారు కోపం మిన్నుముట్టి స్వర్గం, సత్యలోకం దాటిపోయింది. ఆయన క్రోధం అతల, వితల, సుతల, మహాతల, తలాతల, రసాతల, భీతల, భాతల, పాతాళాది. లోకాలకు దిగి కమ్ముకు పోయింది. అతని పళ్ళుకొరుకు ధ్వనులు యూరపు అమెరికాలు, అఫ్రికా ఆస్ట్రేలియాలు, ఆసియా ఖండాలు నిండిపోయాయి.

వెంటనే నూరు విమానాలకు వేయిటన్నుల బాంబులు, తిరుచునాపల్లిలో ఉన్న ఆ ముద్రణాలయంమీద విసరివేయండని మనస్సులో ఆజ్ఞలను జారీచేయించినాడు.

“ఒరే సభాపతీ!” అని కేక వేశాడు. తన అరువల్తో ఆరుమంది నన్నా బలిగొన్న సభాపతి పిళ్ళ లోపలికి వచ్చి చెట్టియారునకు దణ్ణం పెట్టాడు.

“ఈ 'నిజం' పత్రికగాడు?”

“చిత్తం మీరు. ఎప్పుడు 'ఆమ' అంటే ఆ మర్నాడు 'నిజమా? ఉండదు. దాన్ని రాసే ఆ పైత్తకారీ ఉండడు.”

“మంచి వీలు చూడండి. వాడిని..."

“సెహబాస్ స్వామీ! వాడు అయిపోయిండుదా!”

“వెనకా అల్లాగే అన్నావు?”

“ఏం చెయ్యమూ వాడితో మాట్లాడడానికి. ఆ దినం పోలీసు సబుఇనస్పెక్టరు ఒకడు వచ్చాడు. ఆ పోలీసు సబుఇనస్పెక్టరు పళ్ళెత్తు, పళ్ళతోబాటు వాడికి మెదడు ఎత్తులేదు స్వామీ!”

“అయితే వాడి మెదడు ఎత్తు అవడానికి నాలుగు కాసులు బోటునిల బెట్టండి?”

మదరాసులో చెట్టిగారు అడుగుపెట్టడంతోటే ఒక సేవకుని పిలిచి, అనంతలక్ష్మి గారింట్లో ఎవరెవరు ఉన్నారో కనుక్కు రమ్మనమని పంపించాడు..

బందరు నుండి ఆ ఉదయమే కోనంగిరావుగారూ, అనంతలక్ష్మి తిరిగి వచ్చారని వార్త తీసుకువచ్చాడు చెట్టియారుగారికి ఆయన సేవకుడు.

వాళ్ళిద్దరూ దేశాలు తిరుగుతున్నారు. భార్యాభర్తలు! ఆ కోనంగి అనంతలక్ష్మితో ఎంత ఆనందం అనుభవిస్తున్నాడో! చెట్టిగారికి కళ్ళనీళ్ళు వచ్చినంత పని అయింది.

8

జూలై నెలాఖరుకు జపాను ఏమి చేస్తుందో అని ప్రపంచం అంతటా గుసగుసలు బయలుదేరాయి. జపాను జర్మనీ పక్షం చేరుతుందని అందరికీ అనుమానాలు ఎక్కువయ్యాయి. ఇంగ్లండు బర్మా, చీనాలకు హిమవత్ పర్వతాల గుండా ఒక రోడ్డు నిర్మించింది. దాన్నే బర్మా రోడ్డంటారు.

చీనాకు జపానుకు యుద్ధం ప్రారంభమై అప్పుడే మూడేళ్ళు దాటిపోయింది. చీనాదేశం తగ్గిపోని పట్టుదలతో పోరాడుతూంది.

జపానువారి శక్తిముందర చీనా ఎంత అనే వాదన దేశాలన్నిటిలోనూ బయలు దేరింది. భారతదేశంలో కొంతమందికి తమ రహస్య హృదయ భాగాల్లో చీనా పూర్తిగా జపానుకు లోబడి పోవలసిందే అని మహాకోర్కె కాని కాంగ్రెసువారికి జపానుమీద కోపంగా ఉండేది.

కోనంగి జపానంటే మండిపోయేవాడు. ఆసియా ఖండవాసులు ప్రపంచనాయక జాతులుగా కావాలని కోరితే వాళ్ళల్లో ఒకళ్ళకొరకు యుద్ధం చేసుకో కూడదు. తమలో ఉన్న శక్తిని కేంద్రీకరించుకొని ఇంగ్లీషు మొదలయిన సామ్రాజ్యశక్తి వినాశనం చేయాలి. అప్పుడే ప్రపంచానికి ఎంతో శ్రేయస్సనీ. శాంతి తప్పకుండా చేకూరుతుందనీ కోనంగి వాదిస్తాడు.

కోనంగి స్నేహితుడు మధుసూదనరావు భావాలు వేరు. ఎవరైతే బ్రిటిషు సామ్రాజ్య విచ్ఛిన్నానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు అవతారపురుషులంటాడు. జర్మనీని మెచ్చుకుంటాడు. రష్యాను బూతులు తిడ్డాడు. చీనా ఆసియాకు గుదికర్ర అంటాడు. ఏభయికోట్ల జనాభాతో స్వతంత్రం కలిగి ఉండిన్నీ ఆసియా ఖండానికి ముక్తి ప్రసాదించడానికి ఏమీ ప్రయత్నం చేయలేదనిన్నీ, అదీగాక బోగందాని ఇల్లులా ప్రతి పాశ్చాత్య రాజ్యమూ వచ్చి తన్నుక పోవడానికి సిద్దమై ఉండడంచేత అనేక పట్టణాలలో, రాష్ట్రాలలో ఇంగ్లండు, ఫ్రాంసు, అమెరికా, రష్యా, జర్మనీలు అధిరాజకీయ ప్రతిపత్తులు సంపాదించుకున్నారనీ అతని వాదన.

అందుకనే ఇంగ్లీషువారు బర్మారోడు కట్టివేయడం మా మంచిపని! అని వాదించాడు. కోనంగీ, అతడూ మదరాసులో అనంతలక్ష్మి ఇంట్లో కూర్చొని ఈ వాదనంతా చేస్తూ ఉంటే అనంతలక్ష్మి మధుసూదనుని భార్య సరోజనీ వింటూ కూర్చున్నారు. జయలక్ష్మి రవికలకు పూవులు కుట్టుతూ కూర్చుంది.

అనంత: మీరు ఎంత వాదించండి, నాకు ఈ యుద్ధం ఏమీ అర్ధం కావడంలేదు.

సరోజిని: అనంతలక్ష్మి వదినా, ఈ మగవాళ్ళు శాంతిదూతలులా కనబడినప్పుడు వాళ్ళని నమ్మకు. వాళ్ళందరికీ రక్తపాతం అంటే ఇష్టమే!

కోనంగి: గాంధీ మహాత్మునకూనా సరోజినీదేవీ?

సరోజిని: ఆయన మాట తీసుకరాకండీ అన్నగారూ! ఆయన పురుషాతీతుడు.

కోనంగి: స్త్రీలకు రక్తపాతం ఇష్టంలేకపోతే మాంసాహారం ఎల్లా గుటకాయస్వాహా చేస్తున్నారు?

అనంతలక్ష్మి: ఏమి ప్రశ్న వేశారండి గురువుగారూ! మాలో ఉన్న అహింస మీవల్లనే పాడయిపోతో ఉంటుంది.

కోనంగి: ఏమి నంగనాచులండీ! ద్రౌపదికాదూ కృష్ణునితో రాయబారానికి వెళ్ళవద్దని రాజసూయావబృథ స్నానపవిత్రమై దుశ్శాసనునివల్ల అపవిత్రమైన వేణిని చూపింది?

సరోజిని: అన్నగారూ, సీతాదేవి హనుమంతుడు తన్ను తీసుకొని వెల్తానన్నా వద్దు రాముడేవచ్చి రావణుని సంహరించి తన్ను తీసుకువెళ్ళాలంది. అంతమాత్రాన సీత హింసావాదినా?

మధు: మగవాళ్ళకన్నా స్త్రీలు నయమని ఒప్పుకోవాలి. కాని రష్యాలో స్త్రీలుకూడా యుద్ధంలో పాల్గొంటున్నారు.

అనంత: తప్పనిసరి వచ్చిందా మా ఆడవాళ్ళు దద్దమ్మల్లా ఊరుకుంటారా అన్నగారూ, సత్యభామ నరకాసురుణ్ణి చావతన్నింది.

కోనంగి: రుద్రమదేవి మహాదేవరాజు డొక్కచీల్చింది.

అనంతలక్ష్మి: గురువుగారూ! మీరు వాదాని కెంతయినా గమ్మత్తుగా మాట్లాడు తారండీ! మొన్నేగా మీరు మమ్ము శాంతిదూతలని పొగడుతూ పాట వ్రాశారు? అది పాడి వినిపించరూ?

మధు: మంచిమాటన్నావమ్మా అనంతలక్ష్మి!

సరోజిని: ఆ పాట పాడండి!

జయ: కోనంగిరావుగారూ, పాడండి!

కోనంగి: మీ పాటముందూ, మీ అమ్మాయి పాటముందూ నా పాటేమిటి?

అనంత: అయితే ఎందుకు పాడారు నా ఎదుట?

కోనంగి: నువ్వూ నేనూ ఒకటే గనుక.

అనంత: అయితే, ఓ నేనూగారూ! ఓ పాట పాడండి.

కోనంగి: అయితే, ఓ నేనూప్రియా! పాటుతున్నా విను!

రూపజిత స్వర్ణదీ

దీప్తిజిత జ్యోత్స్నాళి

ఆపలే రెవరు నీ

ఆనందజృంభణము!

ద్వేషదుర్గముపైన విజయయాత్రకు పోయి

క్రోధకుడ్యములెల్ల కూత్తు ప్రేమాస్త్రముల (రూ)

ఆటపాటల ప్రేమ అందాలపై ప్రేమ

కాటుకలదిద్దేటి కళలపై తన ప్రేమ (రూ)

ప్రణయలీలా నృత్యళ్ళంగారనాయకీ

పంచమస్వనరాగ భావగీతిక ప్రేమ (రూ)

బంగారు శిశువు ఒడిని పాలిచ్చు సుత ప్రేమ

పతికి పరిచర్యలిడు పరమసతియై ప్రేమ (రూ)

ఆర్తికై కుందేటి అమృత ప్రేమాప్లవిత

అఖిల లోకద్వేష మాహుతించే దేవి (రూ)

ఆ పాట కోనంగి మాయామాళవగౌళ రాగంలో పాడుతూ, సర్వలోకమూ మరచి, తన అనంతలక్ష్మినే చూస్తూ దివ్యభావాలతో కరగిపోయి కన్నుల నీరు నిండ నిలిచిపోనాడు.

అందరికీ కన్నుల నీరు తిరిగాయి. అనంతలక్ష్మి భర్తపై నిరవధిక ప్రేమ తన్ను ముంచెత్త కళ్ళల్లో తన గంభీరపూజ జ్యోత్స్నాకాంతిలా ప్రవహింప, లేచి వేగంగా నడచిపోయి తన పడకగదిలో మంచంమీద వాలి పోయింది.

కోనంగి అనంతలక్ష్మి వెనకాలే వెళ్ళాడు. కోనంగి రెండడుగులలో అనంతలక్ష్మి బోర్లగిల పండుకుని ఉన్న తమ పర్యంకము దగ్గరకు వెళ్ళి“ఏమిటిది అనంతా! ఏమిటి నీ ఆవేదన?” అని ఆతురతతో అడుగుతూ, మూర్తికట్టిన సౌందర్యమైన భార్య నడుముచుట్టూ తన ఎడంచేయి పోనిచ్చి ఆమె భుజాల చుట్టూ తన కుడిచేయి పోనిచ్చి తనవేపుకు తిప్పుకున్నాడు. అనంతలక్ష్మి మధురంగా నవ్వుతూ, కళ్ళనీళ్ళు తుడుచుకొని. భర్త చెంపలదిమి అతని కళ్ళల్లోకి తేరిపార చూచి, “నా గురువుగారూ, నా భగవంతుడు గారూ, మీ పాటకు నా మనస్సు కరిగింది. ఏదో ఆవేదన నన్ను అదిమి వేసింది. ఆనందమూ, ఆవేదనా, అవి రంగరింపులయ్యాయి. మీ అందమయిన, అద్భుతమయిన పాటకూ, మీ అమృత గానానికీ తక్షణం కౌగిలించుకోవాలని బుద్ది పుట్టింది. కాబట్టి ఇక్కడకు వచ్చాను. మీరు నా వెనకాలే వస్తారని నాకు తెలుసును” అంటూ ఆతని మోము తన వక్షానికి అదిమి పట్టి అతని జుట్టు ఆఘ్రాణిస్తూ, అతణ్ణి తనపైకి లాగుకొని గాఢంగా కౌగిలించి పెదవులు చుంబించింది."

కోనంగి, ఆమెను మరీ హృదయానకు అదుముకున్నాడు. తెప్పరిలి ఇద్దరూ ఒకరికొకరు దగ్గరగా మంచంమీద కూర్చున్నారు. కోనంగి తన ఎడంచేయి ఆమె నడుంచుట్టూ వేసి, కుడిచేత్తో ఆమె గడ్డం పట్టి మేమెత్తి, ఆమె కళ్ళల్లోకి పరికిస్తూ.

“ఆవేదన ఏమిటి శిష్యురాలా!” అని ప్రశ్నించాడు.

“లోక శాంతికోసం అంత ఆవేదన ఉందా మీకు?”

“ఎవరికి ఉండదు లక్ష్మీ!”

“మీ పాటవల్ల నాకూ ఓ పెద్దప్రశ్న బయలుదేరింది సుమండీ!”

“ఏమిటది చెప్పు వెన్నెల వెలుగూ!”

“ఎప్పుడూ నవ్విస్తారు. మీకు ముచికుంభత రానే రాదా?”

“ముచికుంభత ఏమిటి ముచికుందుడులాగ?”

“ముచికుంభత అంటే సీరియసనెస్ తెలిసిందా? మా తంజావూరు ప్రాంతంలోనూ, రాయలసీమలోనూ ఇది విరివిగా వాడతారే. మీ కృష్ణా గోదావరీ వాళ్ళకు తెలుగు రాదేమిటండీ?”

“ఎంతదెబ్బ కొట్టావు జ్యోత్స్నాదేవీ!”

“ఈలా చూడండి! మీ ప్రేమ ఇంత పరమాద్బుతమై నన్ను ముంచెత్తుతోంది, చివరకు నా స్వాతంత్ర్యం లేకుండా నన్ను వట్టి బానిసనుగా చేసుకుందామనా? అప్పుడే సగం బానిసనయిపోయాను స్వామీ!”

“నేను నీకు బానిసను, మరీ బానిసను, ఏ మాత్రమూ వంపూసోంపూ లేని బానిసనయిపోయాను.”

“మనిద్దరికీ ఇక స్వాతంత్ర్యం లేదా?”

“లేదు! లేదు! ముమ్మాటికీ లేదు!”

9

కోనంగి: డాక్టరూ! హిట్లరు మాస్కోను ముట్టడించాడు. మాస్కో పని ఏమవుతుంది? డాక్టరు: లెనిన్గ్రాడును పట్టుకోగలిగాడా? కోనంగి: లేదుకాని, రష్యావారిని ఓడించగలడా?

డాక్టరు: వారు తలక్రిందులయ్యేది, ఓడించలేడు. ఎందుకంటావా? రష్యా ప్రజలతో, వారి భావాలతో, ఆశయాలతో, హృదయంతో వీరు దెబ్బలాడాలి. జర్మనీవాళ్ళు అతి మిలిటరీవాళ్ళు. అతి మిలిటరీతనం మొదట విజయం సమకూర్చినా, చివరకు నాశన మయిపోతుంది. అదేగాదు, రష్యా ప్రజలతోనేగాక ఆ నాజీగాడు రష్యాతోనే యుద్ధము చేయాలి. అంటే, దేశం శత్రువు. యుద్ధయాత్ర చేయడానికి అనువయిన దేశంకాదు. దేశం పెద్దది, అనంతమైనది. దేశంలో ఏకాలం వచ్చినా, అత్యంతమయిన మార్పుతో వస్తుంది. జర్మనీ చుట్టూ కొండలు ఉండడంవల్ల జర్మనీవాళ్ళు భయంకరమైన శీతాకాలాలు ఎరుగరు. రష్యా శీతాకాలం రష్యావాళ్ళకు స్నేహితుడు. వాళ్ళకు ముఖ్య సేనాపతి.

కోనంగి: ఏమో బాబూ! నీ మాట నిజమయితే లోకానికి కళ్యాణం, నాకు అంతకన్న. అంతకన్న 'మహాత్మునివాదమే జగద్రక్షకరము' అన్నభావము నిశ్చయమయి ప్రత్యక్ష మౌతోంది. అందుకని హింసాత్మక తరగతిలో ఫస్టుమానిటర్ అయిన జర్మనీ సంపూర్ణముగా ఓడిపోతే, ఇకనేముంది! లోకంలో రెండవపాఠం నేర్పబడిందన్నమాటేగా!

డాక్టర్: ఒకవైపు అహింస అంటావు. ఒకవైపు రష్యా జర్మనీని నెగ్గాలంటావు. నీకు మతిపోతోందా?

కోనంగి: మాటల వెనకాల ఉన్న భావధ్వని తెలుసుకోలేని నీమెదడు మెత్తబడిందేమో నాయనా! కాస్త ధారా వైద్యం చేయించుకో.

డాక్టర్: ఏమిటా పిచ్చిధ్వని?

కోనంగి: లోకానికి ఎప్పటికన్నా ఉత్తమమార్గం అహింసా, సత్యాలే. ఈలోగా హింసామార్గం అవలంబించిన రెండుదేశాల విషయం ఆలోచిస్తే, ధర్మం ఎవరిపక్షం ఉందో వాళ్ళవైపు మొగ్గుతుందని నాబోటి వాళ్ళ హృదయం!

డాక్టర్: నీబోటివాళ్ళ హృదయాల విశిష్టత ఏమిటి నాయనా?

కోనంగి: అహింసా సత్యమార్గాలంటే యిష్టంపడి, ఆ దారిలో ప్రయాణంచేయ ప్రయత్నించే వాళ్ళ హృదయాలన్నమాట కత్తిచేతరాయా!

డాక్టర్: ఒకటి మనవి చేసుకుంటా ఉండు, జావకుండ చేతిరాయా!

కోనంగి: మనవి చేసుకోవచ్చునయ్యా స్టెతస్కోపు ఆయుధహస్తా!

డాక్టర్: ఆకర్ణింపుము చీపురుకట్టహస్తా.

కోనంగి: చెవి ఒగ్గి నాయనా ధర్మామీటరు కొలతబద్ద విభూషా!

డాక్టర్: లోకంలో కడుపునిండా తిండి తినేవాళ్ళు పదికోట్లు. ముప్పాతిక తిండి మాత్రమే కలవాళ్ళు పది హేనుకోట్లు. అర తిండి కలవాళ్ళు ముప్పదికోట్లు. పావు తిండి కలవాళ్ళు ఆరవైకోట్లు. పాతికకోట్లకు ఏమీ తిండేలేదు.

కోనంగి: రెట్టింపు తిండి ఉన్నవాళ్ళూ, లెక్కలేనంత తిండి ఉన్న వాళ్ళూ, వాళ్ళ లెక్కచెప్పవేం?

డాక్టర్: రెట్టింపుతిండి ఉన్నవాళ్ళు పదికోట్లు ఉంటారు. అయిదు రెట్లు తిండి ఉన్న వాళ్ళు రెండుకోట్లు ఉంటారు. ఏభై రెట్లు తిండి ఉన్నవాళ్లు పది లక్షలు ఉంటారు. వేయిరెట్లు తిండి ఉన్నవాళ్లు పదివేలుంటారు. లక్షరెట్లు తిండి ఉన్నవాళ్ళు నూరుమంది ఉంటారు. పదిలక్షల రెట్లు తిండి ఉన్నవాళ్లు ఒకరో ఇద్దరో ఉండక తప్పదు.

కోనంగి: సరే! అంచనాలు నిజమే అనుకుందాము...

డాక్టర్: నిజమే అనుకోక అబద్దం అనుకో! నీబోటి బూర్జువాలు ఏదయినా అనుకుంటారు. బీదతనం ప్రపంచంలో పోకూడదు. మానవ బానిసత్వం పోకూడదు. అహింసా, అహింసా అని వాగే నీబోటి దద్దమ్మలే హింసావాదులు. డయాబిటిసు వచ్చి మధుమేహవ్రణం వేస్తే, తులసి ఆకులతో మంత్రించే నీబోటివాళ్ళు రక్తంతాగే జాతి వాళ్ళు. ఆపరేషను చేస్తే తప్పా? అది హింసా? రోగిని మంటగలిపే మంత్రించిన నీళ్ళప్రయోగం అహింసా?

కోనంగి: అంతకోపం యెందుకు నాయనా?

డాక్టర్: కోపంకాదూ! ఎంతకాలము ప్రపంచం ఊరుకుంటుంది? ఎంతకాలం ప్రజలు ఊరుకుంటారు? ప్రజాచైతన్యం విజృంభిస్తోంది రష్యా నెగ్గనీ, ఈ బూర్జువాల, నీబోటి పూంజీదారుల ప్రభావమూ, శక్తీ మంటగలిసి పోతుంది.

కోనంగి: వినండి వినండి, అని కేకలు నేను. సామ్యవాదం జిందాబాద్! పూంజీదారులు మురదాబాద్! అని గందరగోళం.

డాక్టర్: ఏమిటి నువ్వనేది?

కోనంగి: నాటకంలో భాగం అప్పజెప్పుతున్నా,

డాక్టర్: నీ వ్యాపారం అంతా నాటకంలాగే ఉంది. డబ్బుగల పిల్లను చేసుకొని కులుకుతున్నావు.

కోనంగి: దెబ్బకొట్టు! “నువ్వు కూడా నా బ్రూటసూ? అన్నట్టు నువ్వూ చెట్టిగారితో చేయిచేయీ కలుపు.

డాక్టర్: నువ్వు ఏం చేస్తున్నట్లు?

కోనంగి: నాకు అనంతలక్ష్మి ధనం కావాలా? ఐశ్వర్యం కావాలా? నా బ్రతుక్కి ఆవిడ డబ్బులో ఒక్క దమ్మిడీ అయినా వాడుకోను. నాకు అత్తగారింటిలో ఆంబోతులా పెరుగుదామని ఉందనుకున్నావా? నేను తీవ్రంగా ఒక విషయం ఆలోచిస్తున్నాను.

డాక్టరు: ఏమిటా మహత్తర విషయం?

కోనంగి: దానికి మా అనంతమే కారణభూతురాలు. ఆవిడగారు నన్ను ఒక తెలుగు దినపత్రిక పెట్టమంటూంది. ఇదివరకే స్థాపితమై నేడు భూస్థాపితమయినంత పనైన ఒక దినపత్రికను నామకః డబ్బుపెట్టి కొనమంది.

డాక్టరు: పెట్టుబడి?

కోనంగి: తాను ఒక లక్షరూపాయలు పెట్టుబడి పెడుతుందట!

డాక్టర్: వారేవా! కాని ఏదో పనిచేయి. నీ దృష్టిలో నూతన దృక్పథం తీసుకురా. ఆ పేపరు పేరు?

కోనంగి: “నవజ్యోతి” ఆ పేపరు 1936లో బయలుదేరి 1937లో తొంగుంది. అందుకు సంబంధించినవన్నీ అమ్ముడుపోయాయి. పేరు మిగిలింది. కంపెనీ లిక్విడేటు కాలేదు. మా అనంతం క్లాసుమేటు స్నేహితురాలిని తీసుకొనిపోయి, ఆ అమ్మాయి తండ్రి ప్రభుత్వ అడ్వైజరీగారిని సలహా అడిగింది. ఆయనా కాగితం 'కోటా' (వంతు) ఇప్పిస్తానన్నాడు.

కోనంగి డాక్టరుగారితో అన్న ముక్కలు నిజమే! దినపత్రిక పెట్టడం చాలా ముఖ్య మనుకున్నాడు. ఏ రాజకీయ పక్షంవైపు మొగ్గకుండా ఉండడం మొదటిరోజులలో, తర్వాత “అటునుంచి ఇటు నరుక్కురమ్మన్నాడు” అనుకున్నాడు.

పేపరు జయలక్ష్మి అనంతలక్ష్ముల పేరను కొనవలసి వచ్చింది. పత్రికామందిరానికి హారిసరోడ్డులో ఒక పెద్ద మేడిల్లు అద్దెకు పుచ్చుకున్నాడు. డాక్టరుగారి సహాయంతో ఒక చిన్న రోటరీ మిషను రెండు వేలకు కొన్నాడు.

రియాసత్ ఆలీ అడ్వర్టైజ్ మెంటు మేనేజరు పని చేసేవాడు. అనంతలక్ష్మి కోనంగిరావులు సంపాదకులు. మధుసూదనరావు మేనేజరయ్యాడు. ఇతర ఆంధ్ర దినపత్రికలలో పనిచేసే ఇంకొక పెద్దమనిషి సుబ్బారావుగారు వార్తా సంపాదకుడు. ఇంకా ఇద్దరు అనుభవంగల యువకులు ఉపసంపాదకులయ్యారు.

అనంతలక్ష్మి స్నేహితురాండ్రూ కారులమీద పోయి నెలరోజుల వరకు ప్రకటనలు రోజుకు పదిహేను నుండి ముప్పటివరకూ వచ్చే ప్రకటనలు పట్టుకువచ్చారు.

జయలక్ష్మి తాను బాగా ఎరిగిన అరవయ్యంగారు జ్యోతిష్కుని ఒకరిని పట్టుకొని ముహూర్తం పెట్టించింది.

హారిస్ రోడ్డులోని “నవజ్యోతి కార్యాలయానికి అన్నీ జేర్చి, ఆ కార్యాలయం సిద్ధం చేసేటప్పటికి 1941 సెప్టెంబరు నెలాఖరయింది.

టైపు ఏది పెట్టాలని వాదన వచ్చింది. పాయింటుటైపు అందం అంటాడు డాక్టర్ గారు. మధుసూదనుడు పూర్వకాలపు జి.పి., ఇంగ్లీషు బాడీలు ఉత్తమం అంటాడు.

చివరకు డాక్టర్ గారి మాటే నెగ్గింది. టైపు కేసులు వచ్చాయి. కంపోజిటర్లు చేరారు. అక్టోబరు నెలలో ప్రారంభ ముహూర్తం.

10

వెనుకటి 1914 ప్రపంచయుద్ధానికీ, ఈనాటి ఈ రెండవ ప్రపంచ యుద్ధానికీ ఎంతో తేడా ఉంది.

వెనుకటి యుద్దానికీ ఈ యుద్దానికీ పోలికలు కొన్ని ఉన్నాయి.

1. ఆ యుద్దమూ ఈ యుద్ధమూ ప్రారంభించిన మహానుభావులు జర్మనీవారు.

2. ఈ రెండు యుద్ధాల్లో ఇంగ్లీషువారూ, ఫ్రెంచివారూ మిత్రమండలి ఆయ్యారు.

“ఇంక తక్కినవన్నీ తేడాలే. అప్పుడు జర్మనీ ప్రాంసులోనికి కొంతదూరమే చొచ్చుకు వచ్చింది. అక్కడ నిలవరించారు ఆనాటి మిత్రమండలివారు.

“అప్పుడు రష్యా మొదటి నుండీ మిత్రమండలి తరపున ఉంది. ఈ రోజున రష్యా మొదట జర్మనీతో సంధి చేసుకొని, తర్వాత జర్మనీవాళ్ళ దౌర్జన్యంవల్ల యుద్దంలో చేరింది.

యింక యుద్దంలోని యిరువాగులవారి బలాబలాలను నిర్ణయించడం పూనుకొంటే తేలే అంశాలు:

1. జర్మనీ తన మొదటి ఓటమిని మనస్సులో ఉంచుకొని సంపూర్ణంగా తయారై యుద్దంలోకి దిగింది. కాబట్టే జర్మన్లకు యూరోపు ఖండంలో (రష్యా తప్ప) సంపూర్ణ విజయం చేకూరింది.

2. ఇవతల ఇంగ్లీషువారూ, ఫ్రెంచివారూ యుద్దానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా ఫ్రెంచి రాజకీయ నాయకులలోనూ, యుద్ద నాయకులలోనూ ఐకమత్యతలేదు. కాబట్టి జర్మనీదాడిని అడ్డుపెట్టడానికి నిర్మించిన మేజినాటు రక్షణశ్రేణి పూర్తికాలేదు. ఆ కారణం చేతనే ఫ్రాంసులోనికి జర్మనీ సైన్యాలు మూడురోజుల ప్రయత్నముతో జొరబడగలిగాయి.

3. పైగా ఫ్రెంచివారిలో దేశభక్తి ఉన్నా, పార్టీభక్తి ఎక్కువై, అదే జన్మాశయమై వారి దారిని కుంటుచేసింది. కొందరు ఆంగ్ల ప్రేమికులు, కొందరు జర్మన్ ప్రేమికులు, కొందరు రష్యా ప్రేమికులు, జర్మన్ ప్రేమికులు కొద్దిమందైనా బలవంతులు. కాబట్టి ప్రాంసు తనకు పూర్తిగా తెలియకుండానే ఆర్యన్ యుద్ద జగన్నాథ రథచక్రాల క్రింద పడి నలిగిపోయింది.

4. “ఇంగ్లీషువారు ప్రజా ప్రభుత్వవాదులు, యుద్దప్రియులు కారు కానీ, సామ్రాజ్యప్రియులు. యుద్దంకోసం దేశాన్ని తయారుగా ఉంచడం అన్నభావం వారిని క్రోధపూరితులను చేస్తుంది. రాజ్యం ముప్పాతిక హంజీదారుల చేతులలో ఉంది. అయినా తమ రాజ్యపాలన విషయంలో ప్రజారాజ్య విధానసూత్రం వారికి గాథాశయం. అది వారి స్వప్నం, వారి పోలీసులు, వారి న్యాయస్థానాలు, వారి న్యాయవిధానం ప్రపంచ శిఖరితం. ఆందుచేతనూ, వారి దేశం చుట్టూ తవ్వని బ్రహ్మాండమైన అగడ్తగా సముద్రం ఉండడంచేతనూ, వారికి వారు ఉత్తమ నావికులు అనే సంపూర్ణ నమ్మకం ఉండడంచేతనూ, వారి నౌకాబలం నిజంగా మంచిదవడంచేతనూ యుద్దము వస్తోంది అని వారికి తెలిసినా వారు యుద్ధానికి సిద్ధంగా లేరు.

“ఈ కారణాలచేత జర్మనీవారు అవిచ్చిన్నంగా విజృంభింపగలిగారు. కాని ఇంగ్లీషువారి ఓపికా, ఆంగ్ల సామ్రాజ్యముయొక్క సంపూర్ణశక్తీ జర్మనీ పైన ప్రయోగించ బడలేదు. ప్రయోగింపబడితే వారి వారి బలాబలాలు ఎలా ఒకదాన్ని ఒకటి ఎదుర్కోగలవో మనం చెప్పలేము.

“ఒక్కటిమాత్రం మిత్రమండలివారికి అతిబలం చేకూర్చగల సంస్థ ఉంది.

“ఆ సంస్థ అమెరికా, అమెరికావారు స్వాతంత్ర్యప్రియులు. అమెరికాలో ఎందరు ఇతర యూరోపియను జాతులవారు చేరినా ఆ దేశంలో పుట్టి మహావృక్షంలా పెరిగిన తత్వం మధ్యమాంగ్లతత్వం.

"అందుచేతనే అమెరికా వారికి ఆంగ్లేయులంటే మహాయిష్టం. ఆమెరికా కోటీశ్వరదేశం. ఆకాశహర్మ్యదేశం. ఏ పని చేసినా అమెరికా వారి అంచనాలు, ఆశలు, అశయాలు మహత్తరాలు. వాళ్ళ దేశమే అలాంటిది. ప్రపంచంలోకల్లా పొడుగాటి పెద్దనది వాళ్ళదేశములో ఉంది. ప్రపంచంలోకల్లా పెద్ద మంచినీళ్ళ చెరువు వాళ్ళ దేశంలో ఉంది అందుకనే వాళ్ళు నిర్మించుకున్న జాతీయ క్రీడావనం వేలకొలదీ చదరపు మైళ్ళుంది.

“అలాంటి అమెరికాకు ప్రజ్ఞావంతుడయిన రూజువెలు అధ్యక్షుడు. ప్రపంచంలో శాంతి ఉండాలని కోరే ఉత్తమ పురుషుడు. శాంతికోసం వేయి విధాల ప్రయత్నించాడు. హిట్లరుకి, ముసోలినీకి స్వయంగా ఉత్తరాలు వ్రాశాడు 'శాంతి శాంతి!' అని. కాని లాభం లేకపోయింది.

“వెనుక వుడ్రో విల్పను అధ్యక్షుడు, అమెరికా ప్రపంచ రాజకీయాలలో భాగం ఉంచుకోవాలి, తన పధ్నాలుగు సూత్రాలు ప్రపంచంలో ఆచరణలోకి రావాలి అని వాదించి తన దేశాన్నే ఒప్పించలేక కుంగిపోయాడు.”

“కాని అమెరికా ఇంగ్లండుకు, ఇప్పుడు యుద్ధంలోకి దిగిన రష్యాకు ఎంతయినా సహాయంచేస్తా నన్నది. అమెరికా 'అప్పు-కౌలు చట్టం' తీర్మానించి సహాయం చేస్తోంది.

“ఇంక రష్యా విషయంలో ఆలోచిస్తే, హిట్లరు రష్యాపైన ఉరకడం నాజీతత్వ నాశనానికే అని మా దృఢనిశ్చయం. రష్యా అమెరికాకు రెండు రెట్లున్న దేశం. అమెరికా ఎల్లా అయితే మహత్తత్వాన్ని ప్రదర్శిస్తుందో అల్లాగే రష్యా. రష్యామీద విజృంభించి ఏ మహావీరుడూ విజయం పొందలేదు. ఈనాడు రష్యా పదహారణాలూ రష్యావారిదే. రష్యాదేశం, రష్యా శీతాకాలం, రష్యా ప్రజలు సంపూర్ణంగా హిట్లరుతో ప్రతి అంగుళ దశాంశమూ యుద్ధం చేశారు. రష్యాలోనే నాజీపురుషుని గోరీనిర్మాణమై ఉందని మా నమ్మకం.

రష్యా నాయకుడు స్టాలిన్ అంటే ఉక్కుమనిషి వజ్రాన్నయినా ఖండించే ఉక్కుమనిషే. అతడే రష్యా, రష్యాయే అతడు.”

“ఇంక ఇవతల పక్షంలో హిట్లర్. హిట్లర్ లోని శక్తి ప్రాంకెయిన్ స్టెయిన్ శక్తి, జర్మనీలోని యుద్దప్రియ రాక్షసత్వం తన విజృంభణకోసం సృష్టించుకొన్న భూతం హిట్లర్. ఆ భూతానికి ఆత్మలేదు. కాబట్టి ఆ భూతాన్ని ఆ అమిత యుద్ద దాహానికే మింగేస్తుంది.”

ముసోలినీ రూపానికి భయంకరుడే. బూచివాడంటివాడు. లబ్సీనియా, శిబియా, ట్రిపోలీ, మొరాకోలవంటి చంటిబిడ్డల్ని బెదరించే పెద్దవాడు. మొదట హిట్లర్ని అలాగే బెదరించాడు! ఇప్పుడు ఎరిట్రియా, అబ్సీనియాలు క్షవరం చేసుకుంటున్నాడు.

“ఇంక మిగిలింది జపాన్. జపాను నిజంగా ప్రాచ్యదేశాలకు నాయకత్వం వహించదలచుకుంటే, చీనాతో యుద్ధం మానేసి, చీనాకు తాను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చెల్లించి, తన శక్తిని నాజీ రాక్షసత్వాన్ని నాశనం చేయడానికి ఉపయోగించాలి. కాని నాజీ యుద్దతత్వాన్ని పోలిన యుద్ధతత్వం జసానుది. ఉండి ఏ రష్యామీదో విరుచుకుపడి, ఏ ద్రోహం చేస్తుందో ఎవరికి తెలిసు?”

ఈ రకంగా కోనంగి మొదటిరోజున నవజ్యోతి' రెండవ సంపాదకీయం వ్రాశాడు. ఆ రోజు మొదటి సంపాదకీయం 'మేము' అనేది. అందులో ఆ దినపత్రిక ఆశయాలూ, కార్యక్రమమూ తెలుపుతూ ఆంధ్రదేశ సేవా, భారత జాతీయసేవా, ప్రపంచ భద్రతాభిరక్తి తమ కార్యక్రమానికి ఆధారాశయాలు అనిన్నీ, ఆంధ్రులకు ఈ నూత్న పత్రికా శిశువును పోషింప ముఖ్యబాధ్యత ఉందనిన్నీ వ్రాసినాడు.