కోనంగి/ఏకాదశ పథం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఏకాదశ పథం

సంపాదకుడు

కోనంగిరావుగారు పత్రిక ప్రారంభించి రెండు నెలలన్నా పూర్తి అయిందో లేదో జపాను పెరల్ హార్బర్ పై విరుచుకుపడింది, 1941 డిశంబరు 9-వ తారీఖున.

పత్రిక ప్రారంభించిన శుభముహూర్తం నుంచీ రియాసత్ ఆలీ విజృంభించాడు. బొంబాయి కలకత్తాలు తిరిగాడు. న్యూఢిల్లీ వెళ్ళినాడు. ప్రభుత్వం వారి వివిధ ప్రచారశాఖల ప్రచురణల పరంపరలన్నీ సంపాదించాడు అన్ని పత్రికలలో పడే మందుల కంపెనీల ప్రచురణలు “మహాత్ముల వరప్రసాదలబ్ది పంజాబ్ ఔషధాలు, మహెూత్తమ జ్యోతిష్యుల అతి నిజమయ్యే ఫలితాలు, ఎంత ముసలివాడయినా పది మోతాదుల సేవనతో ముప్పదేళ్ళ కౌమారం ఇచ్చే దివ్యౌషధాలు.” ఈలాంటి వాటి ప్రచురణ ప్రచార జైత్రయాత్రలు కొట్టుకువచ్చాడు.

రియాసత్ ఆలీ పొడుగ. అందమయినవాడు, స్పురద్రూపి. ఇంటరు బి.ఏ.లలో రెండవభాష తెలుగు పుచ్చుకున్నాడు. ఐచ్చిక విషయాలు: ఉరుదూ, అరబిక్, పర్షియన్ భాషలు.

అతనికి వరవడి మౌలానా అబ్దుల్ కలాం అజాద్. రియాసత్ తీయని తెలుగు వ్రాస్తాడు, గంభీరంగా ఉరుదూ వ్రాస్తాడు. సాధుమూర్తి. కాని కోపం వస్తే రుద్రుడు అవుతాడు. భక్తుడు. ఉదయ సాయంకాలం ప్రార్థన చేసుకుంటాడు. నిజమయిన మతభక్తుడు. తక్కిన మతాలను ద్వేషించకూడదని అతని వాదం. మతం వ్యక్తిపరమయినదని దృఢంగా నమ్ముతాడు.

ఎక్కువ బలంకలవాడు కాడుకాని, గట్టి ఆరోగ్యం కలవాడు.

అతని ప్రేమనిధానం మెహరున్నీసా! ఇద్దరూ మేనత్త మేనమామ బిడ్డలు. చిన్నతనాన్నుంచీ ఒకరిని ఒకరిని ప్రేమించుకొన్నారు. ఈనాడు రాజకీయంగా వేరు వేరు భావాలు కలిగి ఉండడంవల్ల విడిపోవలసివచ్చింది. భర్త కాంగ్రెసు, భార్య ముస్లింలీగు; యెందుకు ఉండకూడదని అతడంటాడు. భార్యాభర్తలిద్దరూ ఒకే రాజకీయ మతవిషయికాభిప్రాయాలు కలిగి ఉండాలని మెహర్ వాదన.

ఆ పరిస్థితులలో రియాసత్ తన మేనమామ ఇంటిలో ఉండలేక పత్రికా కార్యాలయానికి దగ్గరగా ఉన్న ఒక మేడలో రెండుకోట్లు, ఒక వంటయిల్లు అద్దెకు తీసుకొని ఒక ముస్లిం వంటవాణ్ణి పెట్టుకొని కాపురం ఉంటున్నాడు. ఆ వంట మనిషే అతనికి సేవకుడు. ఆ వంట మనుష్యుని పేరు ఫజిల్.

కోనంగి, రియాసత్, మధుసూదనలూ, డాక్టరు అంతకన్న అంతకన్న ఒకళ్ళో కళ్ళు విడరాని స్నేహంలో ఓలలాడిపోతున్నారు.

జపాన్ పెరల్ హార్బర్ పై విరుచుకుపడింది అనగానే నలుగురు స్నేహితులు నాలుగు రకాలుగా వ్యాఖ్యానం చేశారు.

కోనంగి: నేను జపాను రష్యామీదకు ఉరుకుతుందని వ్రాయడం ఉద్దేశం జపాను యుద్ధంలోకి దిగుతుందని మాత్రమే. జర్మనీ మల్లేనే జపానూ సిద్దమయి ఉంది. జర్మనీకన్న జపానుకు నౌకాబలం చాలా ఎక్కువ అంతే తేడా!

మధు: ఇంత ఆలస్యంగా జపాను రంగస్థలంలోనికి రావడం వట్టి తెలివితక్కువ పని. ఇదివరకే జర్మనీతోపాటు వచ్చి ఉంటే రష్యా పని అయి ఉండును.

డాక్టరు: ఏమి నాయనా, నీకు రష్యామీద అంతకోపం?

మధు: నాకు రష్యామీద కోపం లేనేలేదు. నాకు కావలసినది, భారతదేశానికి విముక్తి.

రియాసత్ ఆలీ: విముక్తికోసం ప్రపంచంలోని దేశాలన్నీ కొట్టుకుచావాలా?

మధు: చావవా అంట! ఇన్నాళ్ళ నుంచి ప్రాచ్యదేశాలను పీడించుకుతిన్న పాపఫలితం ఎక్కడికి పోతుందీ?

కోనంగి: పాపఫలమో, పుణ్యఫలమో నాకు తెలియదు. కాని, జపాను తన నాశనం తానే భస్మాసురునిలా తెచ్చి పెట్టుకుంటుందని నా వాదన.

రియాసత్: అన్ని రాజ్యాలు ఈ ప్రపంచ యుద్ధంలో క్షవరం ఔతాయి. ఈ దెబ్బతోనన్నా ఈజిప్టు, లిబియా, మొరాకో, అల్జీరియా, పాలస్తీనా, ట్రాంసు జోర్డాను, సిరియా, ఇరాక్లకు విముక్తి దొరికి తీరుతుందని నా ఉద్దేశం.

డాక్టరు: చక్కని ఉద్దేశమేకాని, ఈ పట్టు ప్రపంచయుద్ధంలో జర్మనీ పుణ్యంవల్ల ప్రాచ్యదేశాలకన్నిటికీ స్వాతంత్ర్యమూ సామ్యతత్వమూ రెండూ కలిసి వస్తాయని నా నమ్మకం.

మధు: చివరదొక్కటే వస్తుందని నీ ఉద్దేశం కామేడు!

డాక్టరు: (పకపక నవ్వుతూ) కాదా మరి! ఎవరి విధానం వారికి రావాలని ఉంటుంది. ఏమి సంపాదకీయం వ్రాస్తావు కోనంగిరావ్?

కోనంగి: నేను పత్రికా ప్రపంచంలో ప్రవేశించడమే సంపాదకునిగా. అయినా ఈ రెండు నెలలు దంచేశానా, లేదా?

డాక్టరు: ఊక!

రియా: నీ సామ్యవాదం వస్తే వడ్ల దంపా డాక్టరూ?

మధు: నా ఫార్వర్డు బ్లాకు వస్తే గోధుమ దంపు.

కోనంగి: ఏమి చిత్రంగా ఉందీ మన పేపరు? నా సినిమా స్పెషల్ వ్యాసరాజంబులు అమృతంగా ఉంటున్నాయా లేదా?

డాక్టరు: నీ వ్యాసాల మాటకేంగాని, మీ ఆవిడ దంచేస్తోంది. వెనుక ఇంగ్లండులో సఫైజైట్ ఉద్యమంలో కూడా ఆడవాళ్ళ వ్యాసాలు, ఉపన్యాసాలు అంత ఘట్టిగాలేవే?

కోనంగి: మా అనంతం ఏమిటో అనుకున్నావు. నా ప్రతి సంపాదకీయం క్రింది స్త్రీ సమస్య ఒక్కొక్కటి తీసుకొని తాను ఉపసంపాదకీయం వ్రాస్తోంది.

మధు: తాను పరీక్షకు వెడుతుందా! నువ్వు ఈ పని ప్రస్తుతం నాకు వదలవమ్మా తల్లీ అని మా సరోజ అంటే వినదు! రాత్రి పాఠాలు చదువు కున్నాక, తన సంపాదకీయం వ్రాస్తోంది..

రియాసన్: సరోజినీదేవి మాత్రం తన ప్రత్యేక స్త్రీ సమస్యా చర్చల భాగము అద్భుతంగా నిర్వహిస్తోంది.

డాక్టరు: ఒక దినపత్రికలో ఒక అర్గ పేజీ, ఆఖరుకు మూడుకాలాలు స్త్రీ సమస్యలతో, వార్తలతో నింపుతోంది సరోజనీదేవి, చాలా దట్టంగా పనిచేస్తోంది.

కోనంగి: ప్రపంచ స్త్రీల వార్తలు, స్త్రీల హక్కుల వ్యాసాలూ-మా చెల్లెలుగారు డయనమో!

మధు: అన్ని మహిళా సమాజాల నుండి వార్తలే!

కోనంగి: మనం ప్రస్తుతం వ్యాసాలు వ్రాసే సోదరీమణులకూ, వార్తలు పంపే మహిళామణులకూ ఏదో కొంచెం ముట్టచెప్పాలి. ఏమంటావయ్యా రియాసత్?

రియా: అట్లాగే ప్రారంభిద్దాము.

దినపత్రిక ఒక పెద్ద సంస్లే పేపరుకి సాయంకాలం ప్రచురణ సంచికలు కట్టలుగా రైల్వే పార్సిళ్ళుగా వెళ్ళాలి. విడి సంచికలు పోస్టాఫీసుకు పోవాలి. ఉదయం సంచికలు పట్టణంలో అమ్మకానికి.

చెన్ననగరమంతా ఏజంట్లను పెట్టినారు. పత్రిక అంతకన్న అంతకన్న స్త్రీలు ఎక్కువ కొనుక్కొనసాగించారు దినదినమూ, స్త్రీలకోసం యేర్పడిన దినపత్రిక ప్రపంచంలో ఇంకోటిలేదు. ఇంతవరకు స్త్రీలు వార్తాహరులుగా పాశ్చాత్యదేశాలలో ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు “నవజ్యోతి” ఆంధ్రభాషలో వార్తాహరులను ఏర్పాటు చేయగలిగింది. అంతకన్న అంతకన్న కార్యాలయంలో స్త్రీభాగం పెద్దది చేయవలసి వచ్చింది, ఇద్దరు ఉప సంపాదకురాండ్రు పనిచేస్తున్నారు.

పత్రికకు టెలిప్రింటరు సంపాదించారు. ఆడవాళ్ళు తలుచుకుంటే, రాయిటరు ఏజంట్లూ గీజంట్లూ ఆగుతారా?

2

జపాను యుద్ధంలో ఉరికింది. ఆ మర్నాడు అమెరికా యుద్ధం ప్రకటించింది. వెంటనే జర్మనీ ఇటలీలు అమెరికామీద యుద్ధం ప్రకటించాయి.

“అమెరికా యుద్ధంలోకి రావడంయొక్క పరమార్ధం వీరభద్రుడు దక్షయజ్ఞంలోకి ఉరకడం అన్నమాటే! హనుమంతుడు అశోకవనంలోకి దూకడం అన్నమాటే' అని కోనంగి సంపాదకీయం వ్రాశాడు.

ప్రపంచ రాజకీయాలు, భారతీయ రాజకీయాలు కోనంగి ఎల్లా అర్థం చేసుకున్నాడో! అనంతలక్ష్మి తన చదువు కాగానే భర్త ఒళ్ళోకి వాలుతుంది. కోనంగీ, అనంతమూ నిత్య ప్రేమికులయిపోయారు. అనంతం భర్తను ప్రపంచ రాజకీయాలు అడుగుతుంది. భార్యకు రాజకీయాలు చెప్పుతూ కోనంగి తన భావాలను స్పష్టం చేసుకుంటాడు. మాటలలో అతనికి కొత్త కొత్త భావాలు వస్తూ ఉంటాయి. తన నూత్నోద్భవ భావాలకు తానే ఆశ్చర్యం పొందుతాడు. అవి విపులం చేస్తాడు అనంతలక్ష్మికి పాఠం చెప్పినట్లు.

అనంతలక్ష్మికి పాఠం చెబుతోంటే వారిద్దరూ బ్రహ్మ సరస్వతులౌతారు. లోకాన్ని దర్శిస్తూ వారిద్దరూ లక్ష్మీనారాయణులౌతారు. వారి ప్రేమలో వారు అర్ధనారీశ్వరులౌతారు.

“అనంతం! ఉదయం కార్యాలయానికి పోతానా-అక్కడ ఒంటిగంట వరకూ, జనరల్ మేనేజరు, మీ అన్నయ్య అయ్యంగారున్నారే ఆయనా, నేనూ పత్రికల పంపకం వగయిరా వ్యాపారాలన్నీ వివిధశాఖల వారితో సంప్రతించి ఏర్పాట్లు చేసుకుంటాము. ఒంటిగంటకు అత్తగారు పంపిన ఉపాహారం అందుతుంది. రెండుగంటల నుండీ మూడువరకు దినపత్రికలు చదువుతాను. ఈలోగా రేడియో వార్తలు వింటాను. మూడుగంటల నుండి అరగంటలో వచ్చిన వార్తలూ, అందులో పత్రికలలోకి తర్జుమా అయిన వార్తలూ చూస్తాను. ఒక ముఖ్య విషయం ఏరుకొని అరగంటలో సంపాదకీయం దంచేస్తాను. ఇంత చేస్తున్నా నా జీవిత సామ్రాజ్ఞి నా ఎదుటే?”

“అదేమిటండీ, ఎంత ప్రేమించినా అస్తమానమూ ప్రియురాలిని తలుచుకుంటూ కూర్చుంటారా ఏమిటి?”

“నయమే నిన్ను చదువు మానివేయమని పొద్దస్తమానాలు నా కౌగిలింతలో ఇమిడించుకు కూర్చొని ఉండలేదుగా?”

“ఏమో, మీ వ్యాపారం చూస్తే అంతపనీ చేసేటట్టే ఉన్నారు.”

“లేకపోతే ఏ ఆడవేషమో వేసికొని, నీతో కాలేజీకి రావలసి ఉంటుంది.”

“వెనుకటికి మీ వంటి ఒక నవకవి-

ఓసి ప్రియురాల! నిను వీడి ఒక్కక్షణిక

మైన మనజాల నగుట నీ మేన దాల్చు .

వలువనై కంచుకమునై భూషలునునై త్వదీయ మధుర లోచనముల దీప్తినగుదు” అన్నాట్ట.

అల్లాగే నా జడలోని పూలదండై నాతోనే రండి.”

“అలాగే అనిపిస్తుంది అనంతం! అనంతంమీద అనంతమయిన ప్రేమ గలిగిన అనంగసుందరుడైన కోనంగి ఆమె పెదవుల పైన రేకలు, కనుబొమల వంపు, గడ్డం క్రింద పుట్టుమచ్చ, అరచేతి ఎరుపు అయిపోయాడని ఈరోజు మాకు రాయిటరు వార్త వచ్చింది.”

“ఎవడావార్త పంపిన వార్తాహరుడు?” (కోపం నటిస్తూ)

“పురుషుడు కాడు. స్త్రీ ప్రత్యేక విలేఖరి!”

“ఎవరామె చెప్పండి. ఇప్పుడే తక్షణం?” (ఇంకా కోపంగా)

"ఆమె నేంచేస్తావు?”

“కౌగలించుకుంటాను.”

“పురుషుడయితే ఏమి చేసి ఉందువు?” (కంగారుగా)

“హల్లో బ్రదర్ అని షేక్ హాండ్ చేసి ఉందును!”

“వహ్వా!”

“గురువుగారూ! జపానుమీద మీరు వ్రాసిన సంపాదకీయం ఎంత బాగుందండీ! భాష బాపూజీగారి ఇంగ్లీషులా ఉంది. ఆ సంపాదకీయం మూడు సార్లు చదువుకున్నాను.”

“ఇంగ్లీషు పత్రికలకు ఇదివరకే సంపాదకుడుగా గాని, మంచి సహాయక సంపాదకులుగా గాని పేరున్నవాళ్ళే కావాలి! తెలుక్కి ఇప్పుడే సంపాదకజాతి ఉద్భవిస్తోంది. అదివరకు పేరుపొందిన సంపాదకులు ముట్నూరి కృష్ణారావుగారు, కీ.శే. దేశోద్దారక నాగేశ్వరరావుపంతులుగారు.”

“ఆంధ్రప్రభ నారాయణమూర్తిగారో?”

“వారు కొత్తగా ఉద్భవించిన సంపాదక కుమారులలో పెద్ద కుమారుడు.”

“సహాయకులుగా చాలామంది లేరుటండీ మరీ మీరు?”

“ఉన్నారు ఉపసంపాదకులు వారంతా పైకి రావలసినవారే. ఏవీ తెలుగు దినపత్రికలు?”

“మన దేశానికి ఎన్ని దినపత్రికలుండాలని మీ ఉద్దేశం?”

“తెలుగువారి జనాభా మూడుకోట్ల యాభై లక్షలు ఉంది. మూడు దిన పత్రికలు ఏంచేస్తాయి. ఆరు దినపత్రికలన్నా ఉండాలి.”

 “ఆరు పత్రికలకు చందాదారులు ఉండవద్దా?”

“ఒక్కసారి ఆరు పత్రికలూ వస్తే అన్నీ దెబ్బతింటాయి. నిజమే!

ఒక్కటొక్కటే రావాలి. ఒక్కొక్కపత్రిక ఒక్కొక్క ప్రత్యేకతా, వ్యక్తిత్వమూ సంపాదించు కోవాలి.”

“ఏమిటా వ్యక్తిత్వము?”

“పేపరు రూపం, పేపరు వార్తలిచ్చే విధానం, పేపరు సంపాదకీయం వ్రాసే విధానం, కొన్ని ప్రత్యేక రచనలూ ఉండాలి.”

“ఆంధ్రప్రభ నారాయణమూర్తిగారు “పాన్ సుపారీ” అని వ్రాస్తారు. అలాగా?”

“అవును, 'టైములో' కాండిడన్' 'క్రానికళ్ 'బీరబల్' లాంటివి!”

“నవజ్యోతి”కి పెట్టుబడిడబ్బు పెట్టినవారు ఓ పదిమంది ఉంటారు.

అందరూ తలో ఇరవైవేలూ వేసుకొని రెండులక్షలు చేసి ప్రారంభించారు.

జయలక్ష్మి, డాక్టరు రెడ్డి, ఆనంతకృష్ణయ్యంగారు, డాక్టరు రెడ్డిగారి స్నేహితులు కొందరు కోనంగి సినీమా స్నేహితులు కొందరు, రియాసత్ ఆలీ మేనమామా వాటాదార్లు.

పేపరు రూపం చాలా ఆందంగా వచ్చేటట్టుగా కోనంగి స్వయంగా తాను చూసుకుంటాడు.

మొదట పేజీ ఒక్కసారి ఆకర్షించేటట్టు ఆంధ్రప్రభ చేస్తుంది. ఆంధ్రపత్రిక కొంచెం నిదానంగా నడుస్తుంది.

కోనంగి ఆలోచించాడు, ఆలోచించాడు పత్రిక ప్రారంభించక ముందే.

దినపత్రికకు సాధారణంగా వారానికి రెండుసార్లు ప్రపంచవార్తలలో ఒకటి ముఖ్యమైన వార్త ఉంటుందనీ, అతడు ఆరునెలలు పాత అంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, హిందూ, ఎక్స్ ప్రెస్ పత్రికలు చూచి కోనంగి ఈ నిశ్చయానికి వచ్చాడు. పదిహేనురోజుల కొకసారి ఒక్కటి మరీ ముఖ్యవార్త వస్తుందట!

నెలకు ఒక్కటి మరీ మరీ ముఖ్యవార్త వస్తుందని అతడు తేల్చుకున్నాడు. ఇక వర్ణించడానికి కూడా అతీతమయి అద్భుతమయిన వార్త మూడునెలల కోసారి వస్తుందట.

ఈలాంటి వార్తను గ్రహించటం సంపాదకత్వం యొక్క ప్రజ్ఞ అని కోనంగి తన సంపాదకులతో, సహాయసంపాదకులతో తన విజ్ఞానమంతా వెల్లడిస్తూ చెప్పినాడు.

ఒక సంపాదకుడు: అది గ్రహించి ఏమి చెయ్యాలండీ?

కోనంగి: నమిలి మింగండి అని కాదు. ఆ వార్త చేతబట్టుకొని, ఆ వార్తకు నాయకుం డెవ్వరో నిశ్చయింపవలయును. (అందరూ నవ్వుతారు)

కోనంగి: నవ్వకండి రామారావుగారూ, మొఖంబు అతి ముచిగుంభనంగా అనగా సీరియశంబుగా పట్టి వినండి!

రామారావు: అవధారు!

కోనంగి: ఆవార్త అనే కావ్యానికి నాయకు డెవరో ఆయన చిత్రం సంపాదించాలి!

శ్రీనివాసరావు: ప్రతి ముఖ్యవార్తా కావ్యము వంటిదే అంటారు. అయితే కథానాయిక కూడా ఉంటుందా అండీ?

కోనంగి: ఒక్కొక్క ముఖ్యవార్తకు కథానాయకుడో, కథానాయికో ఉంటారు. నాయకుడైతే సాయకిన్నీ, నాయిక అయితే నాయకుడున్నూ తెర వెనుక ఉంటారు.

శ్రీనివాస: ఇందిరానెహ్రూ పెళ్ళివంటిదయిదే నాయికా నాయకులు తెరముందరే ఉంటారన్నమాట.

కోనంగి: అద్దదీ విషయం!

రామా: ఉపనాయకులూ, నాయికలూ, ప్రతినాయకులూ, నాయకులు ఉండవచ్చు గాదాండీ?

కోనంగి: ఆ! లేకపోతే కావ్యం ఎల్లాగ? ఒక్కొక్కప్పుడు వార్త భావకావ్యం వంటిది కావచ్చును. అప్పుడు అలాంటి వగయిరాలు ఉండకపోవచ్చును.

రామారావు: బొమ్మ సంపాదించి ఏమి చేయమంటారు?

కోనంగి: దాని అతిముఖ్యత, పరమముఖ్యతలనుబట్టి మన పత్రికలో ప్రచురించే కొలత నిర్ణయించాలి రామారావుగారూ!

శ్రీనివాస: మీరు 'గిలిగింతలు' అని ఒక ప్రత్యేక “శీర్షిక” కాలం వ్రాస్తున్నారే! దాన్ని లోకం అంతా మెచ్చుకుంటున్నదండీ!

కోనంగి: హాస్యంగా, మధురంగా దెబ్బకొట్టడం, అభినయంలో నాయిక జడచివర పూలకుచ్చుతో కొట్టటంవంటిదండీ!

రామా: మనం పూర్తిగా కాంగ్రెసుపక్షం అవకూడదా అండీ?

కోనంగి: మనం ఎల్లాగా కాంగ్రెసుపక్షమే. కాని అది వ్యక్తం చేయకుండా నిఖారసయిన జాతీయపక్షం. అందులో కాంగ్రెసు ఒక సంస్థ అన్నట్లు చూపాలి!

శ్రీనివాస: “హిందూ” పక్షం అదేకదా అండీ?

కోనంగి: కాదండీ. హిందూ కొంచెం, సాంబారు పక్షందా. ఖారంజాస్తి ఉండదుగా, పంచదార అసలే లేదుకదా!

(అందరూ పకపకమని విరగబడి నవ్వుతారు)

3. మా పత్రిక

“పత్రికాసంస్థ దేశంలోని ముఖ్యసంస్థలలో నాలుగవది. మొదటిది ప్రజలు, రెండు శాసనసభలు, మూడు ప్రభుత్వకార్యవర్గం, నాలుగు పత్రికాసంస్థ, అయిదు న్యాయస్థానాలు, ఆరురాజకీయ సంస్థలు, ఏడు సారస్వతము, ఎనిమిది సాంఘిక సంస్థలు.

“అలాంటి పత్రికా సంస్థలలో దినపత్రిక రాణి. దినపత్రిక సంపాదకీయం ఆరాణికి మకుటం. వార్తలిచ్చే విధానం భూషణాలు, వార్తాహరులు భోజనం. రాజకీయాలు వ్యక్తిత్వం.

“ప్రజల అభిప్రాయాలు ప్రజలకే వ్యాఖ్యానంచేసి పత్రిక చెప్తుంది. ప్రజల భావాలను మార్చగల నాయకుడౌతుంది పత్రిక. తీవ్రంగా విమర్శిస్తుంది. ప్రజలను పొగుడుతుంది. బ్రతిమాలుతుంది.

"శాసనసభలకూ ప్రభుత్వానికీ మార్గాలు చూపిస్తుంది. వానిని విమర్శిస్తుంది, ఖండిస్తుంది, పొగుడుతుంది, ప్రభుత్వానికి వెరవకుండా సంచరిస్తుంది. ప్రభుత్వం శిక్షిస్తే అనుభవిస్తుంది. పొరపాట్లకు క్షమాపణ అడుగుతుంది. గూడుపుఠానీలు, కుట్రలు బయటపెడ్తుంది. లోకులను మాయచేసే వంచకులను చీల్చి చెండాడుతుంది పత్రికాసంస్థ.

ప్రజోద్యమాలకు కోటివిధాల సహాయం చేస్తుంది. అభ్యుదయ మార్గాలను అన్వేషిస్తుంది. చందాలు వసూలుచేసి పెడుతుంది. బాధపడే మారుమూల ప్రజలకు సహాయమౌతుంది. ప్రజలలో దాగివున్న మూగబాధలను గంభీరకంఠమై, ఒత్తించుకు తిరిగేవ్యక్తుల, సంస్థ, ప్రభుత్వాల నిలిపి నిలిపి వారివారి ధర్మాలు వారికి బోధిస్తుంది.

“పత్రిక ఒక అద్భుతమయిన లలితకళాసంస్థ, శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము, కవిత్వము ప్రజలకు అందుబాటు చేస్తుంది. అవి ఉత్తమంగా అనుభవించే విధానం నేర్పుతుంది.

“తానే ఒక లలితకళ అవుతుంది. ఆనందం సమకూరుస్తుంది. ఒక చిత్రమౌతుంది. శిల్పమౌతుంది. ఒకపరమ మాధుర్య గీత మౌతుంది. విచిత్రమూర్చన అవుతుంది. కథానిక అవుతుంది. హృదయాలను కదల్చివేసే నాటిక అవుతుంది.

“ఈ మధ్య జరిగిన పెరల్ హార్బరు ఒక విషాదాంత నాటిక. ఈ నాటికకు సూత్రధారుడెవరు, నాయకుడెవ్వరు, ప్రతినాయకుడెవ్వరు, ఇవన్నీ పత్రికలలో ఎంత హృదయోద్రేకముగ వర్ణించబడ్డాయి! టోజో ప్రతినాయకుడు. రావణునికన్న, హిరణ్య కశ్యపునికన్న, ఇయాగోకన్న దుర్మార్గుడు. ధ్వనిగా, వాచ్యంగా ఈ కావ్యం పత్రికలు వివిధ వ్యక్తిత్వాలుగా ప్రచురించాయి.

“ఇది మా పత్రిక! ఆంధ్రదేశంలో ఈమెను ఒక వ్యక్తిత్వంగల మహత్తర సంస్థగా చేయదలచుకొన్నాము.

“మేము ఏ పార్టీకి చెందము. భారతదేశానికి పదహారణాలూ స్వరాజ్యం కావాలని వాదిస్తాం. అందుకు మేము నడుంకట్టుకొని పోరాడుతాము.

“మేం ఆంధ్రులం. మా పత్రిక సంపూర్ణంగా ఆంధ్రుల బిడ్డ! ఆంధ్రరాష్ట్రం లోటూ పాటూ లేకుండా పూర్తిగా బీహారు, ఒరిస్సా, సింధు, సరిహద్దు, అస్సాంరాష్ట్రాలవలె రావలసిందే. రావడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాము.

“ఇదిగో ఇదే మా ప్రథమ పత్రికా పుష్పం. ఇది పారిజాతంలా నిత్యయౌవనంతో, నిత్యపుషితయై, వాడని పుష్పాలు దేశానికి అర్పించడానికి అవతరించింది.

“ఆనాటి పారుజాతం, కృష్ణావతారం అవగానే స్వర్గానికి వెళ్ళిందట. మాది ఆంధ్రదేశంలో అనంతంగా ఉండిపోతుంది. ఆంధ్రులకు సేవ చేస్తుంది. ఆంధ్రలోకము మము గాఢప్రేమతో ఆదరిస్తారని మా సంపూర్ణనమ్మకం.

ఇది తన మొదటిరోజు సంపాదకీయాలలో రెండవ సంపాదకీయం. అది మళ్ళీ చదువుకొంటూ, దంచివేశామురా ఆంధ్ర సోదరా అనుకున్నాడు.

దైనందినమూ “ఆంధ్రరాష్ట్రం ఎందుకు కావాలి?” అను శీర్షిక ఒకటి పెట్టి ఆంధ్ర దేశంలోని పెద్దలూ, పిన్నలూ, ఆంధేతరులయిన పెద్దలూ, చిన్నలూ అందరి వ్యాసాలు ప్రచురించడం సాగించాడు. ఆ వ్యాసాలకు వ్యక్తినిబట్టి, వ్యాసం తూనికనుబట్టి పారితోషికాలు పంపించడం సాగించాడు.

“ఆంధ్రులు రాజకీయంగా ప్రత్యేక రాష్ట్రం పొంది తీరాలి” అన్న మొదటి వ్యాసం ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు ఆధ్యక్షులు వ్రాశారు. “ఆంధ్రులు ఆర్థికంగా ఆంధ్రరాష్ట్ర విజయ నిర్వహణ చేయగలరు” అన్నది రెండవరోజు వ్యాసము. మూడవ సంచికలో “ఆంధ్రతేజం” అన్న శీర్షిక క్రింద ఆంధ్ర కవులలో నవ్వులలో పెద్దలూ, పెద్దలలో నవ్వులూ, నవ్వులలో నవ్వులూ, పెద్దలలో పెద్దలూ, పద్యాలూ, పాటలూ వ్రాసినవి ప్రచురించాడు.

“వ్యవసాయంలో ఆంధ్రదేశం భారతదేశానికి శిరస్సు” అని ఉపకార వేతనం పుచ్చుకుంటున్న ఒక పెద్ద ప్రభుత్వ వ్యవసాయోద్యోగి వ్యాసం వ్రాసినాడు.

ఈలా సాగించాడు కోనంగి, ఇతరులను తిట్టకుండా, ఒకరికీ మనస్సు నొవ్వకుండా, ఆంధ్రరాష్ట్ర సంపాదన విషయంలో ప్రతి ఆంధ్రుడూ ఒక్కనిమిషమూ ఏమరుపాటున ఉండకూడదని అతని వాదన.

మొత్తంమీద “నవజ్యోతి' ఆంధ్రదేశం అంతటా ఒక్కసారిగా గడబిడ చేయటం సాగింది.

అవతల సరోజినీదేవి స్త్రీలకు జరిగే అన్యాయాలు, స్త్రీల హక్కులు, శాసనసభలు చేయవలసిన మార్పులు, ప్రజాసంస్థలు చేయవలసిన కర్తవ్యాలు వరుసగా వ్రాయ నారంభించింది.

హిందూ ధర్మం ప్రకారం స్త్రీలకు పురుషులకు విడాకులు ఉండాలా, లేదా? అన్న విషయం ఆవిడ చర్చకు నింపింది. ఓట్లు తీసుకుంది. ఓట్లు అక్కరలేదు అన్నవి ఎక్కువ వచ్చాయి, మహిళల దగ్గిరనుంచే.

ఇదంతా మొగవాళ్ళ కృత్రిమం అని ఒక సంస్కర్తి వ్రాసింది. అందుకు జవాబుగా ఒక మధ్యవాదిని అలాంటి ఆరోపణలు స్త్రీల గౌరవానికి భంగకరం అని వ్రాసింది.

ప్రసిద్ద దేశ నాయకురాండ్రు ఎప్పుడూ స్త్రీలపుటలో పెద్ద పెద్ద వ్యాసాలు వ్రాస్తున్నారు. భారతీయ మహిళామణులు ఎవరు మదరాసు వచ్చినా సరోజినీదేవీ, అనంతలక్ష్మీదేవి వారి అభిప్రాయాలు కనుగొనడానికి సిద్ధం.

అనంతలక్ష్మి ఒక చక్కని చిన్న ఛాయాగ్రహణయంత్రం కొంది. చాలా విలువగల యంత్రమది. వెలుగుయంత్రమూ కొంది. ఏ ప్రసిద్ధ నారీమణి వచ్చినా వీరిద్దరూ కారుమీద వెళ్ళడం, వారి చిత్రం గ్రహించడం, తమ పత్రికలో ఆ రోజే వేయించడం, లేకపోతే మర్నాడు వేయించడం, ఆంధ్ర మహిళలు ఇది మా పత్రిక అన్నారు.

కోనంగి అనంతలక్ష్మిని చూచి "అనంతం! కొన్నాళ్ళకు ఈ దినపత్రిక పూర్తిగా మళయాళం చేస్తావా?” అని అడిగాడు.

“మీకు కావలసినన్ని మొగపఠాలం పత్రికలు లేవా ఏమిటి?” అన్నది.

4

కోనంగి: వచ్చే ప్రతివార్తా ఉప సంపాదకులు తర్జుమాచేస్తూ ఉంటారు. దానికి శీర్షికలిస్తూ ఉంటారు. పూర్వకాలపు భావాలుగల పత్రిక అయితే శీర్షికలు చిన్నవి. ఒక కాలం మాత్రమే ఇస్తారు. ఎంత గొప్పవారయినా అంతే!

డాక్టరు: ఈనాటి పత్రికలు!

కోనంగి: ఈనాటి పత్రికలు వార్త యొక్క ముఖ్యతనుబట్టి ఎన్నికాలంలో నిర్ణయించాలి డాక్టరూ! కాలంలే కాదు, ఆ శీర్షిక అక్షరాల సైజూ నిర్ణయించాలి.

డాక్టరు: ఆ విషయాలన్నీ ఈనాటి పత్రికలన్నింటిలోనూ చూస్తూనే ఉన్నాము ఇక తామేమిటి, కొంటె కోనంగేశ్వరరాయ బహదూర్ వారూ సెలవిచ్చేది? తమ అద్భుతమయిన, అతి నవీనమయిన -

కోనంగి: అతివిచిత్ర, చిత్ర, పరమ మాధుర్య, అశనిపాతయిక, గంభీరాతి గంభీర, అనర్గళ, హృదయబాంబు సంఘాత విధానం ఏదీ? అని అనబోతున్నావు!

డాక్టరు: నేనలా అనబోలేదు! నేను -

కోనంగి: అలాంటి అర్థం ఇచ్చే మాటలే అనబోయావు!

డాక్టరు: అలాంటి అర్థాలుగాని, ఆ అర్థాలకు సరిపోయే అర్థాలుగాని, దగ్గర చూట్టాలయిన అర్థాలుగాని అనబోలేదు.

కోనంగి: నువ్వు అనబోయిన మాటలు, అవి మాటలో లేక ఏవో అయి ఉండాలి.

డాక్టరు: పాటలా, పద్యాలా?

కోనంగి: పాటలుకావు, పద్యాలుకావు, గద్యాలుకావు, వచనాలుకావు, పద్యగద్యాలు కావు, నాటికలుకావు, రాగాలుకావు, తాళాలుకావు.

డాక్టరు: అవి తప్పెట్లు, మురజలు, డిండిమాలు, బాకాలు, క్లారియసెట్లు -

కోనంగి: అవి ఒక పెద్ద జంత్రగాత్ర సమ్మేళనమాలిక!

డాక్టరు: ఇంక చాలించి నా మాట విను.

కోనంగి: అమ్మయ్యా, దారికి వచ్చాడండీ, ఇక కానీ!

డాక్టరు: ఒక్కొక్క సైజులో రెండేసి జాతుల అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఒక జాతి రంగు ఒత్తుగా ఉండేది, రెండోది సన్నగా ఉండేది. ఇవేకాక, ఇంకా అయిదారు జాతులు ఉండాలని నా వాదన.

డాక్టరుగారు ఇచ్చే వార్తలన్నీ సామ్యవాదులకు సంబంధించినవి. కోనంగీ అతడూ కలసి ఒక పక్షంవారు ఇంకో పక్షంవారిని ఆడిపోసుకునే వార్తలకు ప్రాముఖ్యత ఉండకూడదనిన్నీ, అలాంటి ఉత్తమ విషయాలను గురించి వచ్చిన ఉత్తరాలు ప్రచురించకూడదనీ నిశ్చయించుకున్నారు.

“ఏ రాజకీయ పక్షమయినా దొంగపక్షం కాకూడదు. అంతే మనం చూచుకోవాలి” అని కోనంగి అన్నాడు.

అనంతలక్ష్మి పరీక్షలయిపోయి, భర్తతోపాటు పత్రికాలయానికి వచ్చి, తాను దిట్టంగా పనిచేయడం ప్రారంభించింది. భార్యాభర్తలిద్దరూ నిజమయిన సంపాదకులయ్యారు. ఇద్దరూ కారుమీద వస్తారు. ఇద్దరూ పనిలో నిమగ్నులౌతారు. మధుసూదన కోనంగులూ, సరోజానంతలక్ష్ములూ, రియాసత్, ఒకప్పుడు డాక్టరూ కలసి ఉపాహారాలకు ఏదయినా మంచి కాఫీ హెూటలుకు పోయేవారు, లేదా తమ కార్యాలయానికే తెప్పించుకొని ఆరగించేవారు. కాఫీ మాత్రం, కార్యాలయంలో విద్యుచ్ఛక్తిస్టవుపై నీరూ, పాలూ కాచి అనంతలక్ష్మీ, సరోజినీదేవో తయారు చేసేవారు.

పేపరు ఎలాగయినా విజయవంతంగా నిర్వహించాలని వారందరూ సాయశక్తులా తంటాలు పడుతున్నారు.

ప్రతిదినమూ వారందరూ సాయంకాలం పని పూర్తికాగానే ఏబీచికో, వాహ్యాళికో పోయేవారు లేదా సినిమాకో పోయేవారు. అందరూ కలసి అనేక విషయాలు చర్చించుకునేవారు.

పత్రికా నిర్వహణ ఎంతయినా పని. అది ఆ రోజుకు ముగియగానే కాస్తసముద్రతీర విహారమో, కొంచం సినీమా ప్రదర్శనమో, క్వచిత్ మృత్తికాతైల శక్తి జనితవేగశకటవిహారమో ఒంటికి మంచిదిగాదా అని కోనంగి వాదిస్తాడు.

ఈ ఇరువురి దంపతుల ఆనందము చూస్తూ రియాసత్ ఆలీ నిట్టూర్పు విడుస్తూ వుంటాడు. తన మెహర్ ఇంక తనకు కాదు. తన ప్రేమ నిరర్థకమై మురిగిపోతుంది. ఆ ప్రేమతో తానూ హరించిపోతాడుగాక. స్త్రీలను ప్రేమిస్తాము. వారి పాదాలకడ మన సర్వమూ ధారపోస్తాము. వారు మనల ప్రేమిస్తారు. ఏ తిక్కవస్తుందో నిన్ను ప్రేమించడం లేదని వారంటారు. నివేదనకై సమర్పించిన ప్రేమామృతపూరిత సువర్ణకలశాన్ని వారు కాలతన్నుతారు. ఆ అధికారం వారిది. పురుషుల హృదయాలను విచ్చిన్నంచేసే అధికారం వారిది.

అతడు తెలుగులో పద్యాలు వ్రాసుకున్నాడు. పాటలు వ్రాసుకున్నాడు. ఉర్దూలో ఇష్కియార్లు (ప్రేమగీతాలు) వ్రాసుకున్నాడు.

“నీకె ఈ అధికారమ్ము నీకె ఈశి

లా హృదయ కఠినత నీకై లలితచంద్రి

కా దృగంచలాలు అదియు కలుషసహిత

ప్రేమ నిత్యత నెట్లు కంపించగలవు!”

అతని ఆవేదన స్నేహితులతో ఏమని చెప్పుకోగలడు. గంభీర హృదయుడు, మితభాషి, సరసవాది, గాఢమిత్రుడు, ఉత్తమ చరిత్రుడు. అతనికి పని అంటే ఆనందము. ఒక్క నిమిషమయినా పనిలేకుండా కాలం వెళ్ళబుచ్చలేడు. అందులో ఈ ప్రేమభంగము అంతరించినప్పటి నుండీ ఒంటిగా ఉండడమూ, ఆలోచనా, మరీ వేదనాభరితాలై దుర్భరమైపోయాయి.

కోనంగి బోధించినట్లు ప్రేమను అంతర్ముఖం చేసుకొని, ఆ శక్తి తన జీవితమే ఆక్రమించేటట్లుచేసి, నిరంతర పురోగమన యోగవంతుడు కావాలి. తమ పత్రికను మహెూన్నత పథాలకు తీసుకుపోవాలి.

మెహర్ ఏమి ఆలోచిస్తుంటుంది. తమ పంతాలు, తమ రాజకీయాలు, తమ పవిత్రప్రేమను మహాగ్నితప్తంచేసి ఇంకించి వేయవలసిందేనా? ప్రేమ నీచాశయాలకు అందనిది కాదా? ప్రేమ ఎట్టి కల్మషాలనయినా నాశనంచేసే శక్తిగలది కాదా? తాను ఆమెను, ఆమె తన్నూ ఈలా వ్యర్థంగా ప్రేమించుకుంటూ లేనివి అడ్డం పెట్టుకొని కూలబడిపోవలసిందేనా? తానొక మజ్నూ, మెహరొక లైలా కావలసిందేనా? చివరికైనా లైలా తెలిసికొంది. మెహర్ తన అంత్యదశలోనైనా తన్ను సమీపిస్తుందా?

ఒకరోజున అనంతలక్ష్మి తన మెహర్ ఇంటికి వెళ్ళి మాట్లాడిందట. మెహర్ అనంతలక్ష్మి ఒళోవాలి వెక్కివెక్కి ఏడ్చిందట. ఎందుకా దుఃఖం? కాంగ్రెసులో చేరినంత మాత్రాన తాను ద్రోహం చేస్తున్నాడా ఏమిటి? కాంగ్రెసు ముస్లింలు చేసిన దోషం ఏమి? అభిప్రాయభేదాలు పనికి రావా? అంతమాత్రంతో మనుష్యులు భరింపరానంత విరోధులవుతారా?

తనకు మాత్రమా పంతం ఎందుకు? తన ప్రేమనిధానంకోసం తన భావాలు ఆహుతి చేయకూడదా?

కాని ప్రేమతో ఒకరికొకరు నిశ్చితాభిప్రాయాలను ఆహుతి ఇచ్చుకోడంకన్న వాటిని అధిగమించి, ఉత్తమపథాలలో ఐక్యం కాకూడదా? ప్రేమ ఉత్తమపథ సంచారిణి కాదా? వట్టి కామతృప్తికోసమే ప్రేమ అయితే, పశువులకు స్వంత భావాలేమిటి, ఆశయాలేమిటి? కామవాంచ గలిగి రెండు జంతువులు సంయోగానికి అడ్డంకులు లేకపోతే కలుసుకుంటాయి. కామతృప్తి నందుతాయి.

ప్రేమ కామవాంఛ కాదు. ఇరవైనాలుగు గంటలూ మనుష్యుడు కామంకోసం బ్రతకడు. కాని ఇరవైనాలుగు గంటలు కాదుకదా, ఇరవై నాలుగులక్షల గంటలు ప్రేమకోసం బ్రతకమంటే ఆలా బ్రతకడానికి సిద్దం అవుతాడు.

5

జపాను విజృంభణ మహావేగంతో ఆపరానిదై సాగిపోతూ ఉన్నది. ఫిలిఫైన్సు దీవులు పూర్తిగా ఆక్రమించుకొంటున్నాడు. ఇటు మలయాలోకి దిగాడు. ఇంగ్లీషువారి సైనికబలం, అమెరికావారి యుద్ధబలం జపానువారి ధాటీముందు ఏమీ నిలువలేక పోతున్నాయి. గుమ్మడికాయ తగిలినట్లు వారి పురోగమనము నిరాటంకముగా సాగిపోతూ వుంది.

“నన్నెవ్వరాపలే రీవేళ నాధాటికోర్వలే రీవేళ” అని బసవరాజుగారన్నట్లు జపాను నావికాబలాలు ఫసిఫిక్కుమహా సముద్రంలో చిన్న చిన్న ద్వీపాల్ని ఆక్రమించుకున్నాయి. వారి విమానదాడులు దోమల ముసురూ. మిడతలదండులా రావడమే! రంగూన్ నాశనమైపోయింది. సాగినారు జపానువారు.

ఇంగ్లీషు సైన్యాలు, వారితోబాటు భారతీయ సైన్యాలు వెనక్కు వెళ్ళుతున్నాయి.

“ఎందుకు ప్రభుత్వంవారు సరియయిన విమానాలూ, టాంకులూ, తుపాకులూ, ఫిరంగులూ పంపించరూ?” అన్న ప్రశ్నవేశాడు. ఆ ప్రశ్నలోనే “జపానును అరికట్టండి” అని పెద్దవ్యాసం డాక్టరు వ్రాసినాడు.

అటు ఉత్తర ఆఫ్రికాలో రోమైల్ సేనాని ఇంగ్లీషు సైన్యాలను తరుముకుంటూ వచ్చి 1941 జూలై ఐదుకు అలెగ్జాండ్రా దగ్గర మకాంవేశాడు. ఆ సంవత్సరం స్టాలిన్గ్రాడు పట్టుకుందామని ప్రయత్నించిన జర్మనులు సెప్టెంబరులో పూర్తిగా విఫలులైపోయి 23-వ తారీఖున తిరుగుముఖం వట్టారు. నవంబరులో ఫ్రాన్సు పూర్తిగా జర్మన్ల వశమైపోయింది డిశంబరు 1-వ తేదీని టోబ్రూకును బ్రిటిషుసేనలు పట్టుకున్నాయి. డిశంబరు 24-వ తేదీని అడ్మిరల్ డార్లానులు ఎవరో హత్యచేశారు.

1942-వ సంవత్సరంలో జపాను వారు మానిల్లా ఆక్రమించుకున్నారు. ఫిబ్రవరిలో సింగపూరు పడిపోయింది. ఏప్రియల్లో అనంతలక్ష్మి పరీక్షలయాయి. రంగూన్ పతనమైపోయింది. మాండలే పతనమైపోయింది. జపాను సేనలు అస్సాంవైపు పురోగమిస్తున్నాయి ఆంగ్లప్రభుత్వంవారు క్రిపుగారిని హిందూదేశానికి ప్రభుత్వ రాయబారిగా పంపారు.

క్రిప్పురాకను గూర్చి పత్రికలన్నీ సంపాదకీయాలు వ్రాసినాయి. క్రిప్పు రావడం దేశం అంతా అల్లకల్లోలమయినది. కొందరు స్వరాజ్యపు ఛాయలైనా వస్తాయన్నారు కొందరు చర్చిలుగారినీ, ఆమెరీగారినీ ఎరగమా, దేశానికి వచ్చేదేమీలేదు. ఇంకా రెండు మూడు కేంద్రప్రభుత్వ సభ్యత్వం భారతీయులకు లభిస్తాయి అన్నారు. కొందరు మోసపోకండి అన్నారు. కొందరు వచ్చిన వీలు వదలకండి అన్నారు. క్రిప్పుగారు నాయకులందరినీ కలుసుకున్నారు. మహాత్మునితో మాట్లాడారు. రాష్ట్రపతి ఆజాదును, నెహ్రూను కలుసుకున్నారు. ఖయిదేఆజం జిన్నాగారిని కలుసుకున్నారు హిందూ మహాసభనాయకులు వీర సావర్కారుగారు, శ్యాంప్రసాదుగారూ క్రీపును కలుసుకున్నారు.

క్రిప్పుగారు కార్మికపక్షం మనుష్యుడు. ఆంగ్లరాజ్యంతోగాడ స్నేహసంబంధం కలిగి, భారతదేశం స్వాతంత్రం కలిగివుండాలని ఆయనవాదన. అందుకనే రాగానే “స్వరాజ్యం వస్తుంది. మీరంతా ఇంగ్లండు పోవడానికి మూటాముల్లే కట్టుకు సిద్దంగా ఉండండి” అని ఆయన ఇంగ్లీషు ఉద్యోగులతో నవ్వుతూ అన్నాడు, నవ్వుతూ అన్నా, ఆ నవ్వువెనుక క్రిప్పు హృదయంలో ముచికుంభత ఉంది అని వాళ్ళు గ్రహించారు. ఆ వెంటనే వాళ్ళంతా రహస్యంగా చర్చిలుగారికి తంతివార్తలు పంపారు. వెంటనే చర్చిలుగారు క్రిప్పు గారికి, వైస్రాయి గారికి, సర్వసైన్యాధ్యక్షులయిన వేవేవ్ గారికి తాఖీదులు పంపాడు.

“తాను ప్రధానమంత్రిత్వంలో ఆంగ్లసార్వభౌముని సామ్రాజ్యంలో రాజ్యాలు రాజ్యాలుగా మాయచేయడానికి ఉద్భవించలేదు అన్న చర్చిలుగారు తన హయాములో జాతీయ మహాసభలలో పాటుపడతాడా?

“వైస్రాయి క్రిప్పు త్రిపాత్ర నాటకం ఆడారు. ఆజాద్ నెహ్రూలకు చేతులు బోర్లించి చూపారు. కాంగ్రెసు కార్యవర్గం ఏదో అవుతుందని ఢిల్లీలో సమావేశమయ్యారు. రాజగోపాలాచార్యులవారు ఏం గోల పెట్టినా కాంగ్రెసువారు వట్టి గుల్లస్వరాజ్యం తీసుకోమన్నారు. వారి మాటలకు తందానతానా అన్నారు లీగువారు.

“క్రిప్పు ప్రతిపాదనలు ఎవరికీ ఆనందం సమకూర్చవు. ఈ భయంకర యుద్ధం జరిగే రోజుల్లో బ్రిటిషు ప్రభుత్వం యుద్దమంత్రిత్వం భారతీయులకు ఇవ్వకపోతే ఏమి లాభం? ఈ సమయంలో ఆ పనే జరిగితే భారతీయులందరూ ఒక్కుమ్మడిగా లేచి జపానును తమ చేతులతో నెట్టిపారవేస్తారు.

“క్రిపు గిరి వాదన-ఉన్న 1919 సంవత్సరపు రాజ్యాంగశాసనంలోనే అధికారాలు భారతీయులకు ఇవ్వగలం అన్నది వట్టి శుష్కవాదన అని మా ఉద్దేశం. బ్రిటిషు ప్రభుత్వం తలుచుకుంటే ఎంత సేపు పార్లమెంటులో ఒక క్రొత్తశాసనం పుట్టడం?

“ప్రస్తుతం ప్రజాప్రభుత్వం అనే ఉత్తమాశయాన్ని వట్టి వేళాకోళం చేసిన వందలకొలదీ ఆర్డినెన్సులు పోయి నిజమయిన ప్రభుత్వం ఏర్పడితే ఆంగ్ల - భారతీయ స్నేహం ఘట్టిది అయిపోవునుకదా!

“దినాలు ఏమీ బాగాలేవు యుద్ధం ఇంతట్లో ముగిసే సూచనలు లేవు. కాబట్టి కాంగ్రెసువారూ ముస్లింలీగువారూ, ప్రభుత్వంవారూ రాజీపడాలని మేము ఆశిస్తున్నాము.”

ఈలా నడిచింది కోనంగి వ్రాసిన సంపాదకీయం. ఇంతపని చేశానని, ప్రక్కగదిలో కూర్చుని ఉన్న భార్యను పిలిచి సంపాదకీయం అంతా చదివి వినిపించాడు.

“అద్భుతం!” అంది అనంతలక్ష్మి,

కోనంగి ఇటూ అటూ చూచి భార్యను ఒళ్ళోకి లాక్కొని గాఢంగా కౌగిలించి చుంబించాడు.

అనంతలక్ష్మి కోపం అభినయిస్తూ లేచి పయ్యెదా చీరకుచ్చెళ్ళూ సవరించుకొని “ఏమిటండీ మీధూర్తత్వం” అంది.

అప్పుడు కోనంగి నవ్వుతూ,

“ప్రియురాలా కోపించకు

నయగారపు ముద్దుగాదు నమ్ముము నన్నున్

స్వయముగ నీవే వచ్చిన

ప్రియ ఉప్పొంగి ముద్దుపెట్టితి నిన్నున్!

అని ఆశుధారగా కందం చదివాడు.

“కందం ఎవరయినా సులువుగా రచింపగలరు!” అని నవ్వుతూ అనంతం తన గదిలోకి పారిపోయింది.

మధుసూదనుని రెండవ చెల్లెలు కమలనయనా, ఆమె అక్క చౌధురాణీ 1942 జూలై నెల్లో మదరాసు వచ్చినారు. ఇంటరు మొదటితరగతిలో నెగ్గి రాయపురం స్టాన్లీ మెడికల్ కాలేజిలో చేరడానికి వచ్చింది కమల. అతని చెల్లెలు చౌధురాణీ పత్రికలో పనిచేయడానికి వచ్చింది. ఆతని తమ్మునికోసం బందరులోనే ఉండిపోయింది మధుసూదనుని తల్లి.

కమలనయనకు పందొమ్మిదేళ్ళు. చౌధురాణికి ఇరవై రెండేళ్ళున్నాయి. కమలనయనకన్న చిన్నవాడు మధుసూదనుని తమ్ముడు. అతని పేరు రమేశుదత్తు. ఈ పేళ్ళన్నీ వారి తండ్రి బ్రహ్మసమాజంవాడవడంచేత బంగాళీ బ్రహ్మసమాజంవారి పెద్దల పేర్లు పెట్టుకున్నారు.

చౌధురాణీ అంతకుముందు సంవత్సరమే బి.ఏ. ప్యాసయి ఉంది. ఆమెకు ఏమీ ఉద్యోగంలేక శ్రీ ముట్నూరి కృష్ణారావుగారు, పట్టాభిగారు మొదలగు పెద్దల సహాయంచేత ఒక బాలికా పాఠశాలలో తాత్కాలికంగా నలభై రూపాయలకు చేరింది.

ఇప్పుడు కోనంగీ, డాక్టరూ ఆలోచించి అనంతలక్ష్మీ, జయలక్ష్ముల సంప్రదింపులతో చౌధురాణీకి నూరురూపాయల జీతంపై ఉపసంపాదకురాలినిగా తీసుకున్నారు.

కమలనయన వైద్యకళాశాలలో చేరింది. మధుసూదనుని కుటుంబం అంతా అనంతలక్ష్మి ఇంటికి అనతిదూరంలో ఆలివర్ వీధిలో ఒక చిన్న మేడ అద్దెకు తీసుకున్నారు. కమలనయన కాలేజీ హాస్టలులో బాలికా భాగంలో చేరింది.

చౌధురాణీ, కమలనయన వచ్చేరోజున రైలు దగ్గరకు కార్లమీద కోనంగీ, అనంతలక్ష్మీ, మధుసూదనరావూ, ఆతని భార్య సరోజనీదేవీ, డాక్టరు రెడ్డి వెళ్ళారు. వారిరువురూ ఆడవాళ్ళ ఇంటరు బండిలోంచి దిగారు. చౌధురాణీ మోము శిల్పశాష్ట్రం ప్రకారం సౌందర్యాంగ సమన్వితం అని చెప్పలేము. కాని, ఆమె మోములో సౌందర్య కాంతులూ ఏవో మధుర విషాదకాంతులూ కలయిక పొంది ఆమెకు కృష్ణశాస్త్రి కవిత్వ మనోహరత్వం సమకూర్చాయి. అతి సున్నితమయిన ఆరోగ్యం, అతి బక్కపలచని బాలిక, ఆమె నడుస్తూ ఉంటే వీణ తీగమీద ఏదో రాగం సంచరించినట్లే ఉంటుంది.

రెడ్డి ఆ బాలికను చూచాడు అలాగే నిరాంతపోయి నిలుచున్నాడు. ఈమెకు కురిషిద్ గడ్డమూ, మెహతాబ్ పెదవీ, నసీమ్ కరుణపూరిత నయనాలూ ఉన్నాయి అనుకున్నాడు. కమలనయన మగవీరుడు. ఆమె అచ్చంగా స్నేహప్రభలా ఉంటుంది.

“హల్లో డాక్టర్, మీకు ప్రత్యర్థిగా రానులెండి. మీరు బెంగపెట్టు కోకండి?” అని రెడ్డిగారిని ఒకసారి పలకరించి కరగ్రహణ లాంఛనం జరిపింది. చౌధురాణి డాక్టరు రెడ్డిగారికి నమస్కారం మాత్రం చేసింది.

వచ్చిన వేనుక మూడురోజులు గడచినప్పటి నుంచీ చౌధురాణి. నవజ్యోతి ఉప సంపాదకవర్గంలో చేరింది. ఆమె చేరిన వారం రోజుల నుంచి రెడ్డిగారు ఎక్కువ శ్రద్దగా పత్రికా కార్యాలయానికి రావడం సాగించారు.

డాక్టరు రెడ్డి ఎక్కువగా మధుసూదనరావు విషయం కనుక్కుంటూ అతన్ని హుషారుపరుస్తూ తనింటి కాతన్ని ఎక్కువగా తీసుకుపోసాగినాడు.

ఆవులించకుండానే ప్రేవులు లెక్కపెట్టగల కోనంగి డాక్టరుని వెంటనే అర్థం చేసుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచీ మన్మథుడు డాక్టరు దగ్గరకు వెళ్ళడం అంటే భయపడేవాడు. ఈనాడు ఆ పంచాస్రుడు గురి తప్పకుండా జుంజుం అని డాక్టరు గుండె మధ్య నుంచి తన బాణం గాటంగా పెద్దతూటు పడేటట్లు వేయగలిగాడయ్యా అని అనుకున్నాడు కోనంగి.

డాక్టరుగారికి ప్రేమలేని వైరాగ్యలోలాయత ఈనాడు చౌధురాణీ వాటర్లూ యుద్ధంలో ఓడించి జయమందిందయ్యా అని ఆనందించాడు కోనండీ.

ఓడినాడు చివరకూ

మా

వాడురెడ్డి పిన్నడూ

ఓటమంటే ఏమిటంటు

మాటలాడు వై ద్యుడూ!

ఓడినాడు చివరకూ

మా

వాడు రెడ్డి పిన్నడూ!

వాలుకనుల వాలుగాలు

డాలుతాగి తూలెనంటు

మేలమాడి ప్రాలుమాలి

బేలుకొట్టే ధీరుడూ

ఓడినాడు చివరకూ

మా

వాడు రెడ్డి పిన్నడూ!

సెంటిమెంటు అంటనట్టి

చిత్తధైర్య కవచధారి

సర్వకవచ భేదాస్త్రము

చక్కనయిన పిల్ల చూసి

ఓడినాడు చివరకూ

మా

వాడు రెడ్డి పిన్నడూ!

శుకయోగిని నేనంటూ

సాకుమాట లాడువాడు

ఋష్యశృంగుడై బాలిక

దృక్కుదారి నడిచినాడు

ఓడినాడు చివరకూ

మా

వాడు రెడ్డి వీరుడూ!”

ఈ పాట వినగానే డాక్టరు చిరునవ్వు నవ్వాడు. తరువాత ముచికుంభత తాల్చాడు.

“కోనంగీ, ప్రేమకలవాళ్ళు ప్రేమపాశ బద్దులయినవారి హృదయాలు నిమిషంలో గ్రహిస్తారు. నాకు ప్రేమ అనే భావం వట్టి సెంటిమెంటల్ నాన్సెన్స్ అనుకున్నాను. ఇంతలో మా జోషీ భారతదేశంలో అందమయిన బాలికల్లో ఒక ఆమెను ప్రేమించాడు అని వినేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. ఈ రోజున నా పనీ అంతే అయింది నాయనా!” అన్నాడు రెడ్డి.

“ఈ విషయం రియాసత్ కూడా గ్రహించాడు. తక్కిన వారెవరికీ ఇంకా అనుమానాలు తట్టలేదనుకుంటాను.”

“కానీ ఆమె ఉద్దేశం?”

“ఓయి నీయిల్లు బంగారంకానూ! పదిహేనురోజులు కాలేదు, నాయిక అవతరించి! ఏమి ప్రేమవేదన! వారేవా!”

6

డాక్టరు రెడ్డికి ప్రేమ దావానలంలా, ఉప్పెనలా, తుపానులా వచ్చిపడింది. రోగుల్ని పరీక్షిస్తూ ఉంటే చౌధురాణీ ఎదురుగుండా దర్శనమిస్తుంది. ఎవరికైనా ఇంజెక్షన్ ఇస్తోంటే, రాణికే ఇంజక్షను ఇస్తున్నానని భయపడతాడు. తాను పెద్ద శుకమహర్షికాడు. తనది సదోపవాసి బ్రహ్మ చర్యం. అప్పుడప్పుడు దేహం కామవాంఛాపూరితం అయినప్పుడు ఏ నర్సునో, ఏ సినీమా తారనో, ఏ ఆమెనో తన పడకగదికి రప్పించుకొనేవాడు. ఏమైనా శుభ్రభావం కలవారు కాబట్టిన్నీ, కొంచెం రసవాది అవటంవల్లనూ అందమయిన యువతులను, ఆరోగ్యాలను ఏరుకొనేవాడు. వారికి కామతృప్తి, ధనతృప్తి బాగా కలిగించేవాడు.

అతని స్నేహితులకు ఈ విషయం తెలుసును. కాని తక్కినవారికి ఏమీ తెలియదు. కొందరు మాత్రం ఏ సన్యాసోతక్క తక్కిన మానవ మాత్రులు బ్రహ్మచర్యం అవలంబించలేరు అని నమ్మేవారు. “అమ్మో! డాక్టరు అలా కనబడతారు! లోతునీళ్ళు అతి నిర్మలం' అని అంటారు.

వెనుక రోజుకోసారో లేక రెండురోజుల కొకపర్యాయమో పత్రికా కార్యాలయానికి వచ్చే డాక్టరు, ఈ మధ్య రోజుకు రెండుమాట్లు, మూడుమాట్లూ రావడమో, లేకపోతే వచ్చినప్పుడు రెండుగంటలపాటు వరసగా వ్రాస్తూ తన కాలం ఉపయోగించడమో ప్రారంభించాడు.

కోనంగి నవ్వుకుంటూ రెడ్డితో “కాలజ్ఞానము లేనివారుగదరా కామాస్త్ర సంపీడితుల్” అన్నాడు.

రెడ్డి నవ్వుతూ, “నాయనా, ఈ ప్రేమ అనేది మా చెడ్డవస్తువులా కనబడుతోందే! నా మతి పోగొట్టింది ఆమె దేహం కాదు, ఆమె అందం కాదోయి నా మతిపోగొడ్డా. ఆమే. ఆమె సర్వస్వమే!” అన్నాడు.

“ఓ పిచ్చివాడా! నన్ను ఆరోజుల్లో పిచ్చివాడనని వేళాకోళం చేశావ్. ఈ రోజున తెలిసిందేం! 'తనవరకూ వస్తేగాని ధర్మాలకు అర్థాలుండవు' అన్నమాట వృధా అనుకున్నావా?”

“ఆ బాలికలో ఏమి ఉంది? నన్ను మతి లేనివాణ్ణి చేసి పారవేసిందే!”

“నిన్ను మతిలేనివాణ్ణిగా తయారుచేసే శక్తి ఉంది.”

“నా మాట ఎప్పుడయినా వస్తుందా?”

“నీ మాట అక్కడ ఎందుకు వినబడుతుంది మాకు! నువ్వు వస్తే వినబడుతుంది.”

“సంతోషించాములే! ఆ బాలిక ఎప్పుడయినా తెస్తుందా?”

“ఆ బాలిక నీ మాట ఎందుకు తీసుకురావాలి?”

“నేను ఆ బాలిక మాట తీసుకురావటంలేదా?”

“నువ్వు ఆమెను ప్రేమిస్తునావు గనకనూ!”

“అందుకనే అడిగానయ్యా స్వామీ!”

“నిన్ను ప్రేమిస్తోంటే ఆ అమ్మాయి నీ మాట తీసుకువస్తుందికదా అనా!”

“ఆమ, ఆమా!”

“డమ! డమా!”

“చెప్పవయ్యా!”

“ఆ అమ్మాయి ఏదో మాటవరసను నీ మాట ఎత్తినమాట నిజము!”

“ఏమిటా మాటలవరస?”

“ఈ డాక్టరుకు మతిపోయిందా? అని నన్నడిగింది.”

“ఛా!”

“ఆ! ఈ పేపరుకు ఇంతడబ్బు పెట్టాడు. ఆయనకు మతిపోయిందా?” అని అడిగింది.

“ఇంకా?”

“ఇంకా, ఏమిటి? ఇదేమన్నా ఇడ్లీలోకి సాంబారు వడ్డించడంటయ్యా?"

“చెప్పుదు స్వామీ!”

“చెప్పుతాన్, సామీ!”

“ఆడవాళ్ళ మనస్సులు అతి విచిత్రాలూ, సినీమా చిత్రాలూను. ఆమె మనస్సులో ఏమి ఉందో?”

“సరేలే! మనుష్యుల్ని ఏడిపించడమంటే, మనకు చాలా సరదాదా!”

“ఏడవడమెందుకూ, నవ్వమంటూంటే!”

“ఏది చూచి నవ్వడం?”

“ఆ అమ్మాయిని చూచి!”

“ఆ అమ్మాయి హృదయం తెలియందే!”

“నేను మూడు నాలుగు రోజులలో నీకు ఏ విషయమూ చెప్తానుగాదా!”

“నాలుగురోజులా!”

“ఆగు! ఆ మాత్రం నిరీక్షణ చేయలేవా? ప్రేమ కాలాతీతం తొందరపడి దాన్ని గడియలలోకి లాక్కొస్తానంటావేమిటి?”

రెడ్డి నిట్టూర్పు విడుస్తూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కోనంగి చౌధురాణితో ఏదో లోకాభిరామాయణంవేసి కూర్చున్నాడు.

“చౌధు! ఎల్లా వుంది పత్రికా ఉపసంపాదకత్వం?”

“అదో గమ్మత్తుగా ఉంది చిన్నన్నయ్యా!”

“నీకు విసుగురావడంలేదుగదా!”

“మొదట కొంచెం విసుగుగా ఉండేది. తర్వాత తర్వాత ఉసిరి కాయలు తిన్నట్టే!”

“అబ్బా చాలా బాగుంది. మా డాక్టరూ, మా అత్తగారూ ఈ పత్రిక ఆరంభించడం నాకు కోటివేల సహాయం అయింది.”

“నీకేమిటి, అన్నకో?”

“అన్న కృతజ్ఞత వర్ణించలేను. డాక్టరు అన్నకూ, నాకూ ఎంత ఉపకారం చేస్తున్నాడు?”

“ఎవరీ డాక్టరు అన్నా?

“నాకు ప్రాణ స్నేహితుడు.”

“ఎన్నాళ్ళ నుంచీ మీ ఇద్దరి స్నేహం?”

“ఇక్కడకు వచ్చినప్పటి నుంచీ.”

“ఏమిటీ, ఇక్కడకు వచ్చిన తరువాతనే!”

“అమదా!”

“ఏమి చేస్తూవుంటాడు?”

“ఏవరీ డాక్టరు అని నీ ప్రశ్న? అతడు అమృతం కలవాళ్ళలో ఒకడు!”

“సరేకాని, చిన్నవదిన ఎంత అందమైంది?”

“నా అదృష్టం. పల్లుతోము పుల్లకు చెట్టు ఎక్కితే, సంజీవకరణి దొరికినట్లయింది.”

“అదుగో వదినే వస్తోంది.”

అనంతలక్ష్మి పరుగున వచ్చి, “రండి, మన బ్రౌన్” మేడమీద నుంచి క్రింద పడింది!” అని వగరుస్తూ చెప్పింది.

7

బ్రౌన్ అనంతలక్ష్మి కుక్క ఐరిష్ స్పానియల్ మేలుజాతికి చెందినది. నేబిలు రంగు, ఎరుపుబొచ్చుతో ఎర్రఎలుగుబంటిలా ఉంటుంది. దాని కంఠంలోని స్వనము మేఘగర్జనమే! బ్రౌను గుణాలన్నీ ఉత్తమ మైనవి. దానికై ఏర్పాటు చేయబడిన కుర్చీలోనే అధివసిస్తుంది. అనంతలక్ష్మి స్నేహితు లెవ్వరు వచ్చినా ఏమీ మాట్లాడదు. కొత్తవారు గుమ్మం ఎక్కడానికి వీలులేదు. పోర్చిలో నిలబడవచ్చును, కారుమీద వస్తే వరండాలోకి వచ్చి అక్కడ ఉన్న కుర్చీలలో కూర్చోనిస్తుంది. తర్వాత హాలులోనికి వెళ్ళి అక్కడ తన ఆసనం అధివసిస్తుంది. క్రింద పడుకోదు. ఎప్పుడూ తనకై కేటాయింపు చేయబడిన కుర్చీలలోనే అధివసిస్తుంది. విశ్రాంతి తీసుకుంటుంది. ప్రకృతి బాధలు తనకై నిర్మాణం చేసిన దొడ్డిలో తీర్చుకుంటుంది. వేళకు తన భోజన ప్రదేశానికిపోయి భోజనం చేస్తుంది. ఎముకను సాయంకాలంలో కొరుక్కునేందుకు తోట వెనుక ఒకచిన్న అరుగు చేరుతుంది.

“ఈ స్పానియల్ కుక్కతోబాటు డాల్మేషియన్ కుక్కను ఒకటి కొనండి గురువుగారూ!” అని అనంతలక్ష్మి భర్తను అడిగింది.

“అనంతం! నాకీ కుక్కల సంగతి పూర్తిగా తెలియదు. ఎందుకు ఈ పెద్దజాతి కుక్కలు? ఆస్థి, ఐశ్వర్యమూ అందరికీ సమానం అయితే కుక్కలే అక్కరలేదు. మన బంగారాలు వగైరాలు కాపాడడానికే ఈ కుక్కలు!”

“కుక్కలు ఒక విధంగా మనుష్యులకు ఆనందం ఇస్తాయి. కొన్ని జాతికుక్కలు మనుష్యులకు ఎంతో సహాయం చేస్తాయికదా?”

“అవును. వేటాడేందుకు, నీళ్ళలో పడిపోయేవారిని రక్షించేందుకు.”

“మీరు నన్ను హేళన చేయనక్కరలేదు. నాకు మంచిజాతి కుక్కల్ని చూస్తే ఆనందం.”

“ఏమిటా మంచిజాతి అనంతం?”

“కుక్కజాతులు మనుష్యజాతులకన్న మంచివి. గ్రేటోడేస్, గ్రేహౌండు, బ్లడ్హౌండ్, వాటర్హౌండ్, హారియల్, టెర్రియల్ జాతులు. అందాల కుక్కలయిన పోమరేనియన్ వగయిరాలు, పెకింగీస్, జపానీస్, గ్రిషాంక్సు వగైరా వగైరాలు.”

“చాలు ప్రాణేశ్వరీ చాలు! కుక్కశాస్త్ర గ్రంథాలు చాలా చదివినట్లుంది.”

ఆ తర్వాత కోనంగి డాల్మేషియనూ కొనలేదు, కూలీజాతి కుక్కనూ కొనలేదు. కాని బ్రౌనుకూ అతనికీ ఎంతో స్నేహమయింది.

అలాంటి బ్రౌన్ కు ఆపత్తు ఏదో జరిగిందనగానే పరుగెత్తినాడు కోనంగి. బ్రౌన్ కులాసాగానే ఉంది. ఏదో కొంచెం గీచ్కుపోయింది. అంతే!

“నా తల్లి రా! నా తండ్రి రా! దెబ్బ తగిలిందా?” అని కళ్ళనీళ్ళతో అనంతలక్ష్మి బ్రౌనును గట్టిగా హృదయానికి అదుముకుంది.

బ్రౌన్ కులాసాగానే ఆడుకుంటూ ఉన్నది. అందరూ పత్రికా కార్యాలయానికి వెళ్ళినారు.

అనంతం కొంచెం మనసులో ఏదో బాధపడుతూ ఉన్నది. కోనంగి తన భార్య కుక్క విషయం మనస్సులో ఖేదపడిందనుకొని, ఏవో నాలుగు మాటలు ఊరడింపుగా పలికినాడు. అతడు ఆఫీసులో సంపాదకీయంలో పడినాడు.

మహాత్మాగాంధీగారు క్రిప్పుగారి రాయబార షరతులకు “రాబోయే తారీకు వేసిన చెక్కు' అని పేరు పెట్టారు. అంటే అది ఒక ప్రామిసరీ నోటువంటిది అని కోనంగి. అన్నాడు. చిన్నపిల్లవాళ్ళు కోరికకు సమాధానంగా 'లేవు' అని ఇంటిగోడమీద రాయడం వంటిది అని కోనంగి హేళనచేశాడు. 'క్రిప్పు'గారు వట్టి ట్రిక్సు' గారిలా ఉన్నారని నవ్వాడు. చర్చలుగారికి చర్చలు అంటే మహాఇష్టమన్నాడు. కాబట్టి ప్రభుత్వం సంప్రదించి, వారితో కలిసి యుద్ధం కొనసాగించాలన్నారు.

డాక్టరు రెడ్డి వచ్చి కోనంగి గదిలోనే కూర్చొని, “ఏమి చేశావోయి నన్ను గూర్చిన రాయబారాన్ని!” అని అడిగినాడు.

“ఈ రోజే ప్రారంభించాను.”

“ఎంతవరకూ వచ్చింది?”

“ఆమెకు ఒక మైలుదూరంవరకూ వచ్చింది”

“అంతదూరమే?”

“ఏమయ్యా, ఇదివరకు మూడువందలమైళ్ళ దూరంలో ఉన్న రాయబారం మైలు దూరంవరకూ రావడం వాయువేగాన్నంటావా, మనోవేగాన్నంటావా?”

“ఏదో త్వరగా చెప్పునాయనా?”

“ఏమి విరహతాపం! దీనినిబట్టి తమకు కొంచెమన్నా అభిప్రాయాలు మారాయా?”

“ఏ అభిప్రాయాలు?”

“ప్రేమనుగూర్చి!”

“ఏమని?”

“ప్రేమ పారిపోవుతనమన్నావు. ప్రేమకవిత్వం పారిపోవు కవిత్వం అన్నావు”

“నా ప్రేమనుగూర్చి నాకు కవిత్వం వ్రాసుకోవలసిన అవసరం ఎందుకు రావాలి? అది అచ్చు వేయించి అందరిమీదా రుద్దడమెందుకు?”

“రుద్దడమంటావు. కవిత్వం ఆముద మనుకొన్నావా, ఆవు నెయ్యనుకోన్నావా. అమృతాంజనమనుకొన్నావా?”

“అన్నీ అనుకోవాలె. మీ ప్రేమకవిత్వాలు చూస్తే!”

“ఓయి వెర్రివాడా, నీ ప్రేమవల్ల నీకు ఆనందం కలిగితే, దానివల్ల కళారూపం సృష్టించ వాంఛ కలిగితే, అలా కవిత్వం ఉద్భవిస్తే, నీ భావాలే సర్వమానవభావాలు కాబట్టి, వారాకవిత్వం విని రసానందం అనుభవిస్తే, ఇదంతా పారిపోయేతనం అంటావు. నీ ప్రేమ పారిపోయేతనం కాదూ? అందరి ప్రేమలూ పారిపోయేతనాలు కావూ? ఈ పారిపోయేతనాలు పనికివస్తాయా! కళలో పారిపోయేతనాలు పనికి రావూ?”

“ఇంత పెద్దలెక్చరిచ్చావు, నాడి సరిగ్గా ఉందో లేదో నన్ను చూడనీ!”

“నాకేమీ జబ్బు లేదుగాని, నీకు చేసేటట్లున్నది, నాలుగురోజులు వరుసగా ఆ అమ్మాయిని కనుక్కోకపోతే.”

డాక్టరు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ సాయంకాలం కోనంగి, అనంతలక్ష్మి, మధుసూదనూ, సరోజినీ, చౌధురాణీ అందరూ కలిసి సినీమాకు పోయారు. రెండు మూడు సారులు చౌధురాణి వెనుకసీటులో నుంచి, ముందుసీటులో కారు నడుపుతూ ఉన్న అనంతలక్ష్మి ప్రక్కను కూర్చునివున్న కోనంగిని “అన్నా! ఏమవుతుందంటావు క్రిప్పు రాయబారం?” అని అడిగింది.

అనంతలక్ష్మి క్రీగంటితో ఈ దృశ్యమంతా చూసింది. పళ్ళు బిగపట్టి కారు సినిమాహాలుకు పోనిచ్చింది.

8

అనంతలక్ష్మి సినీమాలో చల్లగా, చప్పగా కూర్చున్నదని ఎవ్వరూ చూడలేదు. అది 'పతి' సినిమా. సారధివారి సారధి రామబ్రహ్మంగారు సారధిత్వం వహించిన ‘రూపవాణి' శిలప్పాధికారగాథ తెరమీద కెక్కిన చిత్రం. సెట్టింగులు, అలంకారాలు అతిచక్కగా ఉన్నవి. తారాగణం ఆకాశంలో నిర్మల నీలాకాశంలో తారలే. సంగీతం ఫరవాలేదు. సారధత్వం ప్రతిభతో నడిచింది. కాని కథ మాత్రం చిత్రానికి అనువైనదికాదు.

ఆంధ్రదేశంలో పెద్ద ప్రదర్శనశాలలలో పదహారు వారాలన్నా చిత్రం నడిస్తే డబ్బు వచ్చిందన్నమాటే. ఆడవాళ్ళు చిత్రం చూడడానికి వచ్చిహాలంతా ఏడుపులతో నింపితేగాని ధనం వారలుకట్టదు. ఆడవాళ్ళు హడలిజేజారై రావడం మానితే. ఆరురోజుల్లో సినీమా ప్రదర్శనం ఆఖరు.

ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాడు కోనంగి. అనంతలక్ష్మి భర్త మోము మూడుసారులు చూచింది. ఆలోచనాదీనమయివున్న అతని మోము ఆ కనుచీకటిలో ఎవరో ఒక కొత్తవాని మోములా తోచింది. అనంతలక్ష్మి హృదయంలో రాబోయే వాన మొదటి చినుకులా, అనుమానపు రాళ్ళవాన మొదటిరాతి చినుకుపడింది.

పేపరులో సంపూర్ణంగా మునిగిపోయి తన్ను మరచిపోయినారా! బందరులో తన్ను అక్కా అని పిలిచింది చౌధురాణి ఈ రోజు “అన్నా, అని కోనంగిరావుగారిని పలకరిస్తోంది. ఏవో రాజకీయాల వాదప్రతివాదనలేగాని ప్రేమ సంభాషణలలో, ప్రణయ విలాసాలలో ముంచెత్తు తన మనోనాయకుడు ఈ దినాలలో దూరంగా ఉంటున్నారు. ఆమె రెండు మూడుసారులు కోనంగి చౌధురాణితో ఏవో రహస్య మంత్రాంగాలు సలుపుతూ ఉండడం చూసింది.

అనంతలక్ష్మి చిత్రంలో కూర్చోలేకపోయింది. చటుక్కునలేచి, అప్పుడే వస్తానని బయటకు పోయింది.

కోనంగి తన భార్య ఎందుకో వెళ్ళిందనుకున్నాడు. అయిదు నిమిషాలలో కథా భాగాల అనుసరణలో నిమగ్నుడయ్యాడు. పదినిమిషాలయింది. అనంతలక్ష్మి రాలేదు. అతని మనస్సు ఎందుకో చెదిరి మళ్ళీ కథవైపు ప్రసరింపలేదు.

ఇరవై నిమిషాలయింది. అనంతలక్ష్మి రాలేదు. ఏదో కంగారు పుట్టి లేచి బయటకు వచ్చి, తన భార్య కారు ఆపుచేసి వుంచిన స్థలం దగ్గరకువస్తే, కారూలేదు, అనంతమూ లేదు. కారువేసుకు వెళ్ళిందా? వెళ్తే ఇంటికేనా, లేక ఏదయినా పనిమీద ఎక్కడికైనా వెళ్ళిందా? అలా వెడితే స్నేహితురాండ్ర ఇళ్ళకు మాత్రం వెడుతుంది. ఈ మధ్య తనతో చెప్పకుండా ఎక్కడకూ వెళ్ళటంలేదే! వంటో బాగుండక తక్కినవారి ఉత్సాహం పాడుచేయడం ఎందుకని ఆమె వెళ్లిపోయి ఉంటుంది! అతడు గబగబ బస్సు ఆగేచోటికి పోయి బస్సు ఎక్కి యింటికి చేరినాడు. గదిలో మంచంమీద ఆనంతం పడుకొని ఉంది. జయలక్ష్మి కుమార్తె పక్కలో కూర్చుండి, 'కాఫీ తాగమ్మా' అని బ్రతిమాలుతూ ఉన్నది.

కోనంగి వస్తూనే “ఏమిటండీ అత్తగారూ? అనంతానికి వంట్లో బాగా లేదా ఏమిటి?” అని కంగారుగా మాట్లాడి మంచం దగ్గరకు ఉరికినాడు. జయలక్ష్మి “అమ్మాయిచేత మందు తాగించు నాయనా! నాకు పని ఉంది!”

“అసలు ఏమిటి? డాక్టరుకు కబురు పంపినారా?”

“కంగారు పడకు, ఏదో కొంచెం తలనొప్పిగా ఉందంది!” జయలక్ష్మి వెళ్ళిపోయింది.

కోనంగి భార్య ప్రక్కను కూర్చుండి, ఆమె నుదుటిపై చేయివైచి చూచాడు. నాడి చూచాడు. నాడి ఏదో కొంత వేగంగా ఉంది. కాని జ్వరం ఏమీ లేదు. కోనంగి ఆమెను దగ్గరగా లాక్కొని, మోము తనవైపు తిప్పుకొని, ఆమె కన్నులవెంట నీరు ధారగా ప్రవహించడం చూచి, “అనంతం!” అని తన కళ్ళలో నీరు తిరిగినంతపని కాగా, ఆమె కన్నులు చుంబించాడు.

మూసిన కన్నులు అనంతం తెరవదు. భార్యను మరీ హృదయానికి అదుముకున్నాడు.

“కాఫీ త్రాగు అనంతం!”

అనంతం మాట్లాడలేదు

“బాగాలేదా, కాఫీ సయించలేదా?”

అనంతం మాట్లాడలేదు. కోనంగికి ఆదుర్గా ఎక్కువయింది.

“నీవంట్లో బాగా ఉండలేదా? వెంటనే చెప్పు, మన డాక్టరు గారిని పిలుచుకు వస్తాను.”

“నాకు తలనొప్పిగా ఉన్నది. మీరు ఊరికే నన్ను మాట్లాడించకండి. నాకు కాఫీ వద్దు, డాక్టరూ వద్దు. మీరు కాసేపు పడుకోనివ్వండి. నన్ను ఎవరయినా ముట్టుకుంటే నాకు తేళ్ళూ జెర్రులూ పాకినట్లుంది.”

కోనంగి కొంచెం కించపడి, లేచి విద్యుద్దీపం ఆర్పివేసి, దూరంగా ఆ గదిలో ఉన్న సోఫాపై కుంగిపోయి కూర్చున్నాడు.

అనంతానికి, ఎప్పుడూ పెంకితనంలేదు. ఆ బాలికకు తనపై ఉన్న ప్రేమ అనంతము, జగదద్భుతముకదా! నిజంగా జబ్బుచేసిందా? వట్టి గోలపిల్లవడంచేత వంట్లో బాగుండకపోయినా, ఏదో అనుకొంటుందేమో. పసితనం వదలని ఈ పరమ సుందరిలోన ఏదోగా ఉండడంవల్ల అది తెలియక చీకాకు పడుతుందేమో అనుకున్నాడు. ఈ బాలికకు తెలియకుండా డాక్టరుకు కబురు పంపితే? తీరా ఏ అజీర్ణమో చేస్తే తలనొప్పి వచ్చిందేమో? హాస్యం చేసినా, ఈలాంటి వాటిల్లో ఛాందసము మంచిదేమో?

ఇంతట్లోకే “అనంతం అక్కా!” అని చౌధురాణి, “ఏమిరా కోనండీ!” అని మధుసూదనుడు. ఇంతలో ఇద్దరూ “మామయ్యగారూ!” అంటూ సరోజినీ, “వారెవా! ఏమి దంపతులండీ!” అంటూ కమలనయనా చక్కావచ్చారు.

జయలక్ష్మి హాలులోనికి వచ్చి “అమ్మిణికి వంట్లో కులాసాగా లేదు. అక్కడే ఉన్నాడు కోనంగిరావుగారు” అన్నది.

అందరూ అనంతలక్ష్మి గదిలోనికి వచ్చారు. వీళ్ళు వస్తున్నారని కోనంగి స్విచ్ నొక్కినాడు. అనంతలక్ష్మి భర్త దీపం వెలిగించే లోపునే గబగబ చీకటిలో మోము దుప్పటితో తుడుచుకొని, కళ్ళు మూసుకొని ఉంది.

దీపం వెలిగింది. అందరూ గదిలోకి వచ్చారు. మధుసూదనుడు కోనంగిని చూచి, “ఏమిరా! ఎల్లా వచ్చావు? నువ్వు వెళ్ళావు. పదినిమిషాల తర్వాత ఏమి జరిగింది బాబూ అంటూ బయటకు వచ్చాము. అప్పుడే కారు వచ్చింది. మేమూ వచ్చాము. నువ్వు ఎట్లా వచ్చావు?”

కోనంగి: నేను బస్సుమీదే వచ్చాను. నువ్వు ఎల్లా వచ్చావని నన్నొక్కణ్ణి అడుగుతావేమి?

మధు: ఆనందం మాతో చెప్పినాడు. “మా చెల్లెలు ఒక్కతే డ్రైవు చేసుకుంటూ వచ్చింది. వంట్లో బాగుండలేదు కూడా!” అని మాతో చెప్పాడు. ఏమిటో, ఎందుకో అని కంగారుపడి ఆ కారుమీద పరుగెత్తి వచ్చాము.

9

ఎప్పుడూ సంతోషంగా ఉండే కోనంగి ఎంతో కుంగిపోయినట్లయ్యాడు.

“బ్రదర్! అల్లా కుంగిపోయినట్లున్నావు?” చౌధురాణి ఎప్పుడూ ఇంగ్లీషులో మాట్లాడుతుంది. ఇంగ్లీషులో బావను ఇంగ్లీషువారు “బ్రదర్” అనే అంటారు. ఆమెకు కోనంగి వరసకు బావే! చిన్నతనాన్నుంచీ కోనంగీ మధుసూదనూ “బావా! బావా!” అనుకునేవారు. చౌధురాణి తెలుగులో మాట్లాడినా కోనంగిని "బ్రదర్' అనే పిలుస్తుంది.

ఒక బాలికను ఎవరయినా ప్రేమిస్తే ఆ విషయాన్ని ఆ పురుషుడు ఎంత రహస్యంగా దాచుకున్నా, ఆ బాలికకు హృదయంలో ఆ విషయం స్పర్శత నందుతుంది. చౌధురాణికి డాక్టరు రెడ్డి హృదయం అర్థమయింది. డాక్టరు రెడ్డి ఆమెకు ఒక విచిత్ర వ్యక్తిగానే కనిపించాడు. ఈయన కమ్యూనిస్టు అని కోనంగిరావు అన్నాడు. చాలామంచివాడు, పేరుపొందిన డాక్టరు, సంస్కారి అనీ కోనంగి బ్రదర్ అన్నాడు.

మాటయాసా, ఇంకా ఒకటీ రెండు విషయాలలో తప్ప డాక్టరు రెడ్డిగారు బ్రాహ్మణునిలా ఉంటాడు. బ్రాహ్మణుడు కాదా అన్న ప్రశ్న తనకెందుకూ? తనకు కులాలూ, గొడవలు ఉన్నాయా? రెడ్డి ఎవరయితే తనకేమి అనుకుంది.

కాని ఎదుట ఒక హృదయం ఆమెపై ప్రేమతో వీణతీగలై మ్రోగుతూ ఉంటే, ఆమె హృదయంలో శ్రుతితీగలే ఉంటే, అవన్నీ ప్రతి స్పందన అయి మ్రోగవలసిందే కదా!

రెడ్డి తన జోలికి రాలేదు. తన ఎదుటకు వచ్చి నాల్గయిదుసారులు మాత్రం అందరితోపాటు కూర్చున్నాడు. ఏదో మాట్లాడినాడు.

రెడ్డి అందరితోనూ అతిచనువుగా మాట్లాడేవాడు. ఆమెతో సాధారణంగా మాట్లాడడు. ఆ విషయం ఆమె గమనించకపోలేదు.

ఆమెకు డాక్టరు రెడ్డి విషయం ఎందుకో అస్తమానం మనస్సుకు రావడం ప్రారంభించింది. కొన్నాళ్ళకు ఆ రావడం కొంచెం కొంచెం కంగారు పెట్టడం ప్రారంభించింది.

అందుచేత చౌధురాణి పదిసార్లు తన సోదరునితో సమానుడయిన కోనంగి దగ్గరకు రాసాగింది. కోనంగి చిన్నతనంలో అంటే పది, పన్నెండు పదమూడు ఆ ప్రాంతాల “నిన్ను పెళ్ళిచేసుకుంటాను కోనంగి బావా!” అనేది. పధ్నాలుగు, పదిహేను సంవత్సరాలలో మాట అనకపోయినా కోనంగిని ప్రేమిస్తున్నానని అనుకుంటూ అతన్ని ప్రేమించిన దానివలె నడతలో చూపించేది.

కోనంగి నవ్వుకుంటూ ఉండేవాడు. ఎప్పుడూ కలుసుకుంటూ ఉన్నా కోనంగికి ప్రణయలేఖలు వ్రాసి చెల్లెలు కమలనయనచేత పంపించేది. అవన్నీ మధుసూదనునకు చూపిస్తే కోనంగీ, మధూ ఇద్దరూ నవ్వుకొనేవారు. “పోనీ మా చెల్లెలిని పెళ్ళి చేసుకోరాదట్రా?” అని మధు కోనంగిని అడిగేవాడు. కోనంగి “ఒరే! నాకు చెల్లెళ్ళులేరు. వీరిద్దరూ నా చెల్లెళ్ళు. చౌధు నన్ను నిజంగా ప్రేమిస్తుందనా నీ ఉద్దేశం! అదీ ఒక తియ్యటి ఫాషన్” అన్నాడు.

ఇంటర్ చదివేరోజులలో ఆమెకు కోనంగిమీద ప్రణయం పొగమంచులా మాయమయింది. ఆ మొదటి దినాలలో కోనంగిని చూడడానికి సిగ్గుపడింది. తర్వాత కలుసుకొని ఆ గొడవమానేసి ఇతర విషయాలు మాట్లాడేది.

ఇంతలో కోనంగి మదరాసు వెళ్ళిపోయినాడు.

మదరాసు బయలుదేరే రోజునే చౌధురాణి కోనంగికి క్షమాపణ ఉత్తరం వ్రాసింది.

“అన్నయ్యా! నువ్వు నన్ను గురించి ఏమీ తప్పు అభిప్రాయం పడవద్దు. నేను నీకు అనుంగు చెల్లెలిని. నువ్వు నీ ఉతృష్ణ ప్రేమతో నన్ను నీ ఏకగర్భజనిత అయిన చెల్లెలిగా చూచుకొన్నావు. నాకా రోజులు చిన్నతనం. ఈనాడు నేను ప్రపంచాన్ని సరీగా అర్థం చేసుకుంటున్నాను. అన్నా! నాకు ఇద్దరు అన్నలు. ఎప్పుడూ నీకు అనుగు చెల్లెలిని.

నీ ప్రియసోదరి

చౌధు.”

అని వ్రాసింది. ఇది చూచి కోనంగి కళ్ళు చెమరించగా నవ్వుకున్నాడు. ఆ బాలిక వ్రాసిన ఉత్తరాలన్నీ తగలవేసి, ఈ ఉత్తరంమాత్రం దాచుకొని మదరాసు వచ్చినాడు.

అలాంటి చౌధురాణి తనలో తనకు అర్థంకాని ఏవేవో ఊహలు ఉద్భవిస్తే అవన్నీ చెప్పుకుందామని తనకు అన్నకన్న అన్నఅయిన కోనంగి దగ్గరకు చేరింది. కాని ఏమీ చెప్పలేదు.

నేడు తన ప్రియమైన వదిన అనంతలక్ష్మి అలా ఉండడమూ, తన అన్న ఏదో దిగాలుపడి ఉండడం చూచి ఎంతో దిగులుపడింది.

ఈలోగా మధుసూదనుడు కారు తీసుకువెళ్ళి డాక్టరు రెడ్డిని లాక్కొని వచ్చాడు.

డాక్టరు అనంతలక్ష్మికి జ్వరం సంగతి చూచి, నాడి పరీక్ష చేసి ఏమీలేదు కొద్దిగా అజీర్తి చేసిందని ఆయన హాలులోనికి వచ్చి కూర్చున్నాడు. అక్కడకు మధుసూదనుడూ, కోనంగీ కూడా చేరారు.

డాక్టరు: కాంగ్రెసు కార్యవర్గంవారు బ్రిటిషువారిని దేశం వదలి నడవమన్నారు. ప్రభుత్వాన్ని ఈ దేశంనుండి నడపడానికి తీర్మానం చేశారు, అది ఆగష్టు మొదటివారంలో బొంబాయిలో జరిగే అఖిల భారత జాతీయ మహాసభా సమితి ఎదుట పెడ్తారట.

కోనంగి: అవును, పెట్టరా.

డాక్టరు: 'క్విట్ ఇండియా' విధానం లేవదీశాడు గాంధీజీ.

మధు: అదే మహాత్మాజీలోని మహత్తు. దేశం క్రుంగి ఉన్నప్పుడు ఒక్కొక్క క్రొత్త భావం ప్రజలలో విసురుతాడు

డాక్టరు: రాయిలా!

కోనంగి: అమృతఘుటికలా!

డాక్టరు: మీ మహాత్ముడు జపాను యుద్ధాన్నిగూర్చి అలా వ్రాశాడేమిటి?

కోనంగి: ఏమి వ్రాశాడు? తానయితే జపానుకు వెళ్ళి వాళ్ళను తాము చేసే ఈ దురన్యాయపు యుద్దం చెడుగుదని బోధిస్తా నన్నాడు.

డాక్టరు: దానిమీద బ్రిటిషు పత్రికలు ఈ ముసలాయన్ను తిట్టిపారేస్తున్నాయి.

మధు: తిట్టవు మరీ ... ఆయన భావానికి చెయ్యాలని తప్పర్థం చేసి అవాకులు వాగితే సరి.

10

క్రిప్పుగారు కాంగ్రెసును, భారతీయులను నాలుగు తిట్టి చక్కాబోయారు. లండను వెళ్ళి తిట్టినారు. బ్రిటిషు ప్రభుత్వంవారూ నాలుగు తిట్టినారు.

దేశంలో ప్రజలకు బ్రిటిషువారిపై ద్వేషం ఎక్కువై పోతోందని మహాత్మాజీ అఖండ సత్యాగ్రహం ప్రారంభించాలన్నారు. నాయకులు సంపూర్ణ సత్యాగ్రహం జరుగుతుంది, సిద్ధం అంటున్నారు.

పత్రికలన్నీ ప్రభుత్వంవారిని చివాట్లు పెడుతూ కాంగ్రెసుతో రాజీపడండి అని కోరుతున్నాయి.

జపాను నేడో రేపో ఇండియాలో దిగుతుంది అన్న కింవదంతులు ప్రబలిపోయాయి.

విరోధుల రేడియో వార్తలు వినవద్దని ప్రభుత్వంవారు ఆర్డినెన్సు చేసినా ప్రజలలో చాలమంది వింటూనే ఉన్నారు. జర్మనీ నుంచీ, సైగాను నుంచీ, జపాను నుంచీ వార్తలు, ప్రసంగాలు వస్తున్నాయి.

భారతదేశం నుండి ఏ రకంగా మాయమయ్యారో సుబాసబాబు జర్మనీ చేరి అక్కడ భారతీయ సైన్యం ఏర్పాటు చేశాడని రేడియోలో వినబడసాగింది.

ఏమి గడబిడలు జరుగుతాయో అని ప్రభుత్వం ఆర్డినెన్సులూ, అరెస్టులు జరిగే విషయాలన్నీ ఆలోచించుకొని సిద్ధంగా ఉన్నారు.

కమ్యూనిస్టులు కాంగ్రెసువారిని ఇప్పుడిప్పుడే సత్యాగ్రహం పెట్టవద్దనీ, ఫాసిస్టులను నాశనం చేయవలసిన ఈ సమయంలో కాంగ్రెసువారు సత్యాగ్రహం ప్రారంభించడం దేశానర్థదాయకమనీ వ్యాసాలు, ఉపన్యాసాలు మారుమ్రోగిస్తున్నారు.

 రాడికల్ డెమొక్రటిక్ పార్టీవారూ, వారి పెద్ద ఎం. ఎన్. రాయిగారూ కాంగ్రెసును, గాంధీజీని దుమ్మెత్తి పోయసాగారు. కమ్యూనిస్టులకు రహస్యంగానూ, రాడికల్ వారికి బహిరంగంగానూ ప్రభుత్వం డబ్బిస్తోందని దేశంలో మారు మ్రోగుతోంది. ఫార్వర్డుబ్లాకు పార్టీవారి నందరినీ ప్రభుత్వం జయిళ్ళకు పంపించింది. ఫార్వర్టుబ్లాకు పార్టీనే నిషేధించింది.

ఈ గడబిడలో నవజ్యోతి, అటు ప్రభుత్వం కొండకూ, ఇటు కాంగ్రెసు కొండకూ తగలకుండా చక్కని సంపాదకీయాలు అర్పింపసాగింది. డాక్టరు రెడ్డి సామ్యవాది అయినా నవజ్యోతిని సామ్యవాదపు పేపరు చేయదలచుకోలేదు. కోనంగీ, అనంతలక్ష్మీ కాంగ్రెసు వైపే మొగ్గి ఉన్నా నవజ్యోతిని కాంగ్రెసు పేపరు చేయదలచుకోలేదు.

ఈ సందర్భంలోనే అనంతలక్ష్మికి కోపం వచ్చిన సంఘటన జరిగింది. ఆ దినం ఆగస్టు ఒకటవ తారీఖు.

హాలులో డాక్టరు, కోనంగి, మధుసూదనుడూ మాట్లాడిన వెనుక డాక్టరూ మధుసూదనుడూ వెళ్ళడానికి లేచారు.

ఈ లోపుగా చౌధురాణీ, సరోజీనీ, కమలనయనా అనంతలక్ష్మితో ఏవో పిచ్చాపాటీ మాట్లాడుకొని, అనంతలక్ష్మి కులాసాగా ఉండడం చూచివారూ వెళ్ళడానికి హాలులోకి వచ్చారు.

చౌధురాణీని చూడగానే రెడ్డి గుండెలు దడదడ కొట్టినాయి. చౌధురాణీ రెడ్డిగారి వంక చూడనట్లు కనిపించింది. కాని, చూడవలసిన రీతిగా చూడనే చూసింది.

అందరూ వెళ్ళిపోయారు. కోనంగి చాలా పొద్దుపోయినా, హాలులో ఒక సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతడు కుంగిపోయి ఆలోచనలులేని ఆలోచనలలో మునిగియున్నాడు. దీపం వెలుగుతూనే ఉంది గుడ్డిగా.

మదరాసులో బ్లాకుఅవుటు అవడంచేత ఇళ్ళలో కూడా దీపాలచుట్టూ నల్లటి బురకాలు పెట్టవలసి వచ్చింది. ఒక గంట అయింది. కోనంగి చటుక్కున లేచి తన పడక గదిలోనికి వెళ్ళినాడు.

అనంతలక్ష్మి పందిరిమంచంమీద కళ్ళు తెరిచే పడుకొని ఉన్నది. కోనంగి నెమ్మదిగా వెళ్ళి మంచంమీద కూర్చుండి "అనంతం! వంట్లో బాగా కులాసాగా ఉందా?” అని అడిగినాడు. అనంతం చేతులు చాచింది. కోనంగి ఆమె హృదయంపై వ్రాలి ఆమెను గాఢంగా తన హృదయానికి అదుముకొన్నాడు.

తెల్లవారి ఏడుగంటలు అయింది. కోనంగి భార్య పక్కనుండి మెల్లగా లేచి ఆ గదిలో వారిద్దరికోసం ఉంచుకొన్న ఒక చక్కని రేడియోను మదరాసు మీటరు తిప్పి మంచం దగ్గరకు వచ్చి నిదురలో సౌందర్యనిధియై పడుకొన్న అనంతలక్ష్మిని చూస్తూ మంచం దగ్గరే నిలుచున్నాడు.

అనంతలక్ష్మి గులాబిమొగ్గల పెదవులు కొంచెం విడివడి ముత్యాల పలువరస కొంచెముగా కనబడుతూ ఉన్నది. ఆమె పెదవులూ, మూతలు పడియున్న కన్నులూ నవ్వుతూ ఉన్నాయి.

“ఈలాటి పరమ కల్యాణమూర్తిని భార్యగాగల ఎవ్వనికి కవిత్వంరాదు!” అని కోనంగి అర్థస్ఫుటంగా అనుకున్నాడు.

ఆమె ముంగురులు అర్థచంద్ర సుందరమయి ఆమె ఫాలంపై చెదిరి ఉన్నాయి. ఆమెకు మెలకువ రాకుండ నెమ్మదిగా కోనంగి ఆ కురులు సర్దుతున్నాడు.

పయ్యెద నుండి ఓరగా తప్పుకున్న ఒక బంగారు హృదయదేవాలయము పయ్యెద మరుగున ఉన్న గోపురములు ఆమె ఊపిరితో పైకి లేస్తూ దిగుతూ ఉన్నాయి. అతని చూపులా పరమ పవిత్ర ద్వయముపై ప్రసరించినవి. అప్పటి నుండి ఆతని చూపులు ఆమె చుబుకముపై వ్రాలినవి.

ఇంతలో రేడియోలో మద్రాసు నుండి స్పష్టంగా ప్రభాత గీతిక వినిపించ సాగినది. ఆ రాత్రే కోనంగి. ఒక పాట ఆ ప్రభాత గీతిక వరసనే వ్రాసి ఉంచుకున్నాడు. ' ఆది ఆ రేడియో గీతికలో కలిపి పాడసాగినాడు.

“జయమో సుందరి నీకూ

జయలక్ష్మీ తనయా!

జయమ హెూ సుందరి నీకూ!

పల్లవాధరీ! పుల్లసుమానన

హల్లకకుట్మల యుగ్మకుచా!

జయమహో సుందరి నీకూ!

నీదు స్వప్నములు నిర్మలకాంతులు

నన్ను పొదువునవి నిశ్చలప్రేమలు

జయమూ సుందరి నీకూ!”