Jump to content

కొప్పులింగేశ్వరశతకము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కొప్పులింగేశ్వరశతకము



ఇది

గోదావరీతీరంబున పల్వలపురంబునందుండు

కూచిమంచి సోమసుందరునిచే
రచియింపంబడి

తత్పుత్రులు సాంబశివరావుచే

ప్రకటింపఁబడియె

రెండవకూర్పు 500 ప్రతులు

రామచంద్రపురం,
కృత్తివెంటి వేంకట కృష్ణారావు పంతులుగారి
విద్యావినోదినీముద్రాక్షరశాలయందు
ముద్రింపఁబడియె

కాపీరైట్ రిజిష్టర్డు

1923

వెల 2 అణాలు

శ్రీరస్తు

శ్రీసదాశివపరబ్రహ్మణేనమః

కొప్పులింగేశ్వరశతకము

శా.

శ్రీనీహారవసుంధరాధరకుమారీసంగతార్ధాంగని
త్యానందామృతదానచంగకరుగాభ్యంచన్నిజానాంగభ
క్తానికప్రియసంగభవ్యశివయోగైశ్వర్యసింహాసనా
సీనాత్మాంబుజభృంగపల్వలపురీ శ్రీకొప్పులింగేశ్వరా.

1


మ.

మరుకేళి న్మును వేశ్య కిచ్చిన భవన్మాల్యంబె పూజారి దా
సరగన్ భూపతి కివ్వ నందొకశిరోజం బున్న చర్చింపఁగాఁ
బరఁగ న్వాఁ డది స్వామిదే యని వచింపన్ వాని రక్షింప నీ
శిరమం దప్పుడు కొప్పుదాల్చితట యోశ్రీ...

2


మ.

నతమందారనుతప్రచార నిగమాంతస్వైరసంచార భ
వ్యతరాకార విపద్విదార బుధలోకాధార దివ్యప్రభాం
కితకోటీరతమోవిదూర ఫణిరాట్కేయూర దుర్వాందు
ష్కృతసంహార సుధీర పల్వలపురీ శ్రీ...

3


మ.

తపనీయాచలచాప సంయమిహృదంతర్గేహచిద్దీప భ
క్తపరాధీనదయాకలాప పరతత్వవ్యక్తనిక్షేప ని
త్యపరానందమయస్వరూప చితిభస్మాలేప నిర్లేప నీ
కృప నామీదను జూపవేళ యిదిరా శ్రీ...

4

మ.

నిఖిలాఘౌఘవినాశ లోకచయనిర్నిద్రస్వనిర్దేశ ష
ణ్ముఖముఖ్యావృతసత్సకాశత్రిజగన్మోక్షాధిరాజ్యేశ చి
త్సుఖసంధాయినిజప్రకాశ రజతక్షోణీధరాంచన్మహా
శిఖరోదారనివేశ పల్వలపురీ శ్రీ...

5


మ.

జగదత్యంతబుధాభివాద్యభవ రుగ్జాలాపహృద్వైద్యస
న్నిగమాంతప్రతిపాద్య సత్యఘనమౌనిస్వాంతసంవేద్య భూ
రిగుణాపారీభవహృద్యసర్వసుమనోబృందాద్యనానామహ
ర్షిగణధ్యేయపదానవద్యచరితా శ్రీ....

6


మ.

అసమశ్రీసుకుమారహరణోద్యత్ఫాలదృక్సార సా
రసగర్భేష్టవిహార హారవిభర్యత్కీర్తివిస్తార తా
రసమందర్గుణవార వారణదపుఃక్రవ్యాదభీతామరా
ర్తిసముద్ధారవిచార చారణనుతా శ్రీ....

7


మ.

నతభక్తాననశీలనిత్యపరమానందామృతావాల సం
దితబృందారకజాల భూర్యుపనిషద్బృందాటవీఖేల సం
తతనిర్యత్కరుణావిశాలత్రిజగద్రక్షాసమాలోల వి
స్తృతవిశ్వద్రుమమూల పల్వలపురీ శ్రీ....

8


మ.

సకలామర్త్యగణప్రకాండ దివిషచ్ఛైలేంద్రకోదండ పా
తకసంఘాతవిఖండ మౌనిజనహృత్కంజతమార్తాండ పూ
జకవర్గాభయదానశౌండ కరుణాసంరక్షితాజాండ హా
రికథాంచద్గుణకాండ పల్వలపురీ శ్రీ....

9

మ.

అరమేనన్ జవరాలు పెన్ జెడలలో నవ్వేలుపుంజాలు వ
ల్వరహిన్ బెబ్బులితోలు చందురునినవ్వంజాలుమైడాలు చే
నరుదౌ ముమ్మొనవాలు వెండిమల చెల్వౌప్రోలు గ్రాలంగ బల్
సిరి మీరన్ జగమేలుమేటిదొరవో శ్రీ...

10


మ.

సనిరూఢిన్ నిగమాంతవాక్తతిఋతం సత్యం పరం బద్మాయం
చు నుదారోక్తులన్ నిన్ బరాత్పరునిగా సువ్యక్తతం దెల్పుచున్
వినుతుల్ సేయునుగాదె నీకు నెపుడున్ విశ్వేశ యింకెందుఁ జూ
చిల నీకన్నను దైవతంబు గలదా శ్రీ...

11


మ.

కలవారల్ రసపాకసౌష్టవ మలంకారాళిఁ జెల్వంగ నిం
తలుగాఁ బండుగ సేయ శక్తికొలదిన్ దాఁ బేదయున్ జేయు న
ట్లలబ్రహ్మాదులు ము న్నొనర్చినత్వదీయస్తోత్రముల్ పెక్కు భా
సిలుచుండ న్నిను నే నుతించుటలు నోశ్రీ...

12


మ.

అవితర్క్యాఖిలమూలతావకవపుర్యజ్ఞాంగధాత్రీరు
హోద్భవపద్మప్రభవాండభాండఫలసంతత్యంతరాకీర్ణరం
ధ్రవిలోల న్మశకంబు లాహరిహయబ్రహ్మాదు లెన్నంగ వా
రివిభూతుల్ భవదాశ్రితుల్ దలఁతురే శ్రీ...

13


మ.

తళుకున్ బంగరుమేల్ జరీజిగిబుటేదారీవలె న్మించువ
న్నెలఁ జెన్నౌపులితోలుశాలుగహొయల్ నిండార మైగప్పి య
న్నెలకూనన్ సిగఁబువ్వుగా నునిచి యెంతేఠీవి నొప్పారు నీ
చెలు వెన్నన్ వెయినోళ్లు చాలవవురా శ్రీ...

14

మ.

అమలప్రౌఢిమ సర్వలోకముల మోహశ్రాంతి నొందించి సం
తతముం ద్రిప్పెడునామహాప్రకృతి యుద్యన్మోహసంసక్తి సం
యతయై యుండెను నీదుకౌఁగిట నహా హారిప్రభాశ్రీసమం
చితబాలేందుకలాకలాపరుచిరా శ్రీ...

15


మ.

త్రైలోక్యప్రకటాధిపత్యము సుధాంధస్స్వామికిన్ భూరినా
నాలోకైకవిభుత్వ మచ్యుతునకు న్వాగ్భర్త కేతజ్జగ
ల్లీలాకల్పనశక్తి యిచ్చితివి బల్విభ్యాతి నీవంటిజే
జే లేలోకమునందునైనఁ గలరా శ్రీ...

16


శా.

భాణుం డెంతయుభక్తి నిన్ను వినుతింప న్మెచ్చి వానింట సం
త్రాణాసక్తిని గాపు కాచితట యేదైవంబు లిబ్భంగి న
క్షీణోదారత భక్తవాంఛితములన్ జెల్లింతు రీవిష్టప
శ్రేణిన్ జూచిన నీవెకాక యితరుల్ శ్రీ...

17


మ.

మద ముప్పొంగ గజాసురుండు సురల న్మర్దింపఁగా వారు నీ
పదమే దిక్కని మ్రొక్కి వేడ ననుకంపారూఢిచే వారికిం
పొదవ న్నీ వభయం బొసంగి కరిదైత్యుం ద్రుంచి భవ్యస్థితిన్
ద్రిదశానీకముఁ గాచి తీవటభళీ శ్రీ...

18


మ.

పశుసంఘంబుల మమ్ము నోపశుపతీ పాలింపవే యంచు వి
ష్ణుశతానందముఖామరుల్ త్రిపురరక్షోభీతి ని న్వేడ నొ
క్కశరం బేసి పురాళి ద్రుంచి జగముల్ గాపాడితౌరా భవా
దృశశారుణ్యపరాయణు గలరే యోశ్రీ...

19

మ.

నరసింహాకృతి శౌరి విష్టపముల న్గారింప భీతాత్ములై
సురలెల్ల న్నినుఁ జేరి వేడఁ గరుడోస్ఫూర్తి న్వెస న్నీ వటన్
శరభాకారముఁ బూని తద్భయదతేజంబెల్లఁ జల్లార్చి చె
చ్చెరలోకంబులు గాచి తీవ కదమున్ శ్రీ...

20


మ.

అనురక్తిన్ శివరాత్రివేళ నొకకామాంధుండు వేశ్యాంగనా
ఘనకేళీరతి నుండి యాచెలికుచాగ్రంబందు నీ కర్పితం
బని పువ్వొక్క టొసంగ మెచ్చితట యాహా విశ్వమం దెన్ని చూ
చిన లే రెందును నిట్టిభక్తసులభుల్ శ్రీ...

21


మ.

 పరమాప్రాకృతదివ్యమంగళభవద్భవ్యాంగసౌందర్యవి
స్ఫురణం బాపురుషోత్తమాదులకు దా మోహావృతిం జేయుచో
నరయం గానల దారుకావనమునీంద్రాబ్జాననల్ నిన్నుఁ జూ
చి రుచి న్మోహనిమగ్నలౌట కరుదాశ్రీ...

22


మ.

వనజాక్షుండు వరాహరూపధరుఁడై త్వద్దివ్యపాదాబ్జముల్
గనఁ బాతాళముఁ జొచ్చియం దరసి దాఁ గానంగలే కంత నీ
ఘనమాహాత్మ్య మెఱుంగ నేరికి నశక్యంబౌనటంచు న్నుతిం
చిన లోకైకవిభుత్వ మీ వొసఁగితౌ శ్రీ...

23


మ.

ఘనత న్నీపదసేవ సేయు నలమార్కండేయు సాధింపరాఁ
గని యాకాలుని కాలదన్నితివి వీఁకన్ గుండెయల్ వీలిపా
యనితద్భీతిని నాతఁ డెప్పుడును నీయంఘ్రిస్తుతుల్ సేయువా
రిని దూరంబునఁ గాంచి మ్రొక్కి తొలఁగున్ శ్రీ...

24

శా.

స్వామీ కాముఁడు నీదుకంటఁ బడి భస్మం బౌట చిత్రంబె నీ
నామంబొక్కటి యొక్కసారి యెవఁడైనన్ దా జపింపంగఁ ద
త్కామక్రోధవిలోభమోహమదమాత్సర్యాదికాంతస్స్థిత
స్థేమారాతిచయంబు భస్మమగుచో శ్రీ...

25


మ.

ధననాథుం డగురాజరాజు సఖుఁడై తారాద్రి సంస్థానమై
ఘనలోకేశుడు భృత్యుడై యలరమాకాంతుండు ముఖ్యాప్తు
డై కనకాహార్యము చాపమై దగు జగత్కళ్యాణునిన్ జేరి కొ
ల్చిన భక్తావళిభాగ్య మెన్న దరమా శ్రీ...

26


శా..

కాలోదగ్రమహాగ్రహోద్ధతికి మార్కండేయుఁ డాపన్నుడై
హాళిన్ నీశరణంబుఁ జొచ్చినను దీర్ఘాయుష్యసంపన్నుఁగా
లీలన్ జేసితి వింక నెందు నితరు ల్నీవంటిశశ్వత్కృపా
శీలుల్ లేరు జగత్త్రయి న్వెదకినన్ శ్రీ...

27


మ.

సుర లాహాలహలానలోద్ధతశిఖాస్తోమార్భటిన్ స్రుక్క నీ
శరణం బొందిన వారిపైఁ గరుణ మించన్ దద్విషం బానుచో
నురుగర్భస్థితలోకముల్ చెడునటం చూహించి కంఠంబునన్
స్థిరతన్ నిల్పిన బల్దయాంబునిధివో శ్రీ...

28


శా.

దోషంబెన్క నెత్తిఁబెట్టుకొనవే దోషాకరుం బట్టి సం
తోషం బొప్పఁగ లింగధారియని యెందు న్నీప్రభావంబు నా
భాషాధీశ్వరకైటభాంతకజగత్పాలామరాచార్యవా
క్ఛేషాహీంద్రులకైన నెన్నఁదరమా శ్రీ...

29

మ.

శ్రుతిసందోహమునీప్రభావలవమున్ సూచింపఁగా లేక శా
శ్వతవాఙ్మానసవృత్త్యగోచరపరబ్రహ్మంబ వీవంచు నూ
ర్జితయుక్తిం గని మాటిమాటికి నమస్తే రుద్ర యంచున్ నమ
స్కృతు లెల్లప్పుడు నీ కొనర్చునుగదా శ్రీ...

30


శా.

నీవాత్సల్యనిరూఢికి న్విజయుఁడున్ నీపాదపద్మైకసం
సేవోత్కృష్టత కెన్నఁ జక్రియు సురజ్యేష్ఠుండు నీశక్తికిన్
నీవిద్యాప్రదరూఢికిన్ శ్రుతులు నెంతేసాక్షులై యుండనిన్
సేవింపన్ గొరవొక్కటైనఁ గలదా శ్రీ...

31


శా.

ధాత్రి న్నీ కొకబిల్వపత్రము సముద్యద్భక్తి నర్పించినన్
సుత్రామాదుల కందరానిపదవుల్ శోభిల్లగా నిచ్చిన
న్మైతి న్వానికి మోక్షమిచ్చెదట నీమాహాత్మ్య మేమందు బల్
చిత్రంబుల్ భవదీయదివ్యచరితల్ శ్రీ...

32


మ.

ఇతరుల్ దైవము లెందరెంద రిఁక వేరెన్నంగ నింతైన నా
మతి యేమో భవదన్యదైవతముల న్మన్నింపఁగాఁబూన ద
ప్రతిమాంచజ్జగదేకపావన హరిబ్రహ్మేంద్రముఖ్యామరా
ర్చితపాదాంబుజ నిన్నుఁ బాసి యెపుడున్ శ్రీ...

33


మ.

శతమన్యుండు భవత్ప్రణామరుచిఁ బూజాసార మాచక్రి వా
క్పతి నీస్తోత్రమహానుభావము నెఱుంగన్నేర్తురేగాని యిం
కితరుల్ నేర్తురె నీగుణానుభవ మెంతేసేయ లీలావిని
ర్మితపంకేజభవాండభాండనికరా శ్రీ...

34

మ.

వసుధన్ బిల్వదళంబు నీకు నొక టెవ్వండైన నర్పింప నిం
పెసఁగ న్వానికి న్విస్వవైభవము లీవీఁజూతుతువో యంచు భీ
తసహస్రాక్షచతుర్ముఖాదివిబుధుల్ దీప్తానిమేషైకదృ
ష్టి సదా చూచుచు వార లైరనిమిషుల్ శ్రీ...

35


మ.

హరి దా నెంతయనంతరూపమహితుం డైనన్ భవద్దివ్యస
చ్చరిత ల్వర్ణన సేయఁజాలఁడఁట యస్మాదృగ్జడశ్రేణికిన్
దరమా నిన్ బొగడంగ నింతయయిన న్వాఙ్మానసాతీతసు
స్థిరకళ్యాణగుణాభిరామచరితా శ్రీ...

36


మ.

నిజరేతోగతి నే నరుండ మరి నిన్ సేవించునాతండె దా
విజయుం డెందును నేతదర్ధమునకు న్వెయ్యేల నాసవ్యసా
చి జయశ్రేణికి సాక్షి యింక నొరులన్ జర్చింపఁగానేల యో
త్రిజగద్వంద్యపదారవిందయుగళా శ్రీ...

37


శా.

సాక్షాన్మోక్షఫలప్రదాతవు మహేశానుండ వైనట్టి ని
న్నాక్షేపించిన నెంతదక్షుఁడయినన్ హాని న్వెసం జెందు ప్ర
త్యక్షంబేకద మున్ను దక్షుఁడు త్వదీయావజ్ఞ గావించి తా
శిక్షం జెందుట సర్వలోకమునకున్ శ్రీ...

38


మ.

సతియౌ నీసతియే కుమారుఁడును నెంచ న్నీకుమారుండె యు
న్నతదివ్యాంబరమున్ ద్వదంబరమె నానాలోకసర్గాదివి
శ్రుతలీలన్ భవదీయలీలలె కడున్ రూఢంబులై సార్థక
స్థితి నొప్పారునుగాక యొండుదగునా శ్రీ...

39

శా.

స్వామీ నీనిజభక్తకోటికి మహైశ్వర్యంబు లెట్లిచ్చితో
నీమైఁ జూడ దిగంబరుండనిక నెంతేగోచియున్ లేదు నీ
సామర్థ్యం బది యెట్టిదో శ్రితులకున్ సర్వేప్సితశ్రేణి ని
స్సీమోదారత నిచ్చెదందురు బుధుల్ శ్రీ...

40


మ.

ఒకటౌ బిల్వదళంబు పల్దళములై యొండొక్కపు వ్వర్థిఁ బా
యక పూబోణులసంఖ్యలై యొకఫలం బాత్మేష్ట నానాఫల
ప్రకరంబై యొకయింతతోయ మెలమిన్ బల్తోయమై వన్నెవా
సికి నెక్కు న్మును భక్తి నీ కొసఁగినన్ శ్రీ...

41


శా..

నీభార్యామణి సర్వమంగళ భవన్మిత్రుండు దా శ్రీదుఁడున్
నీభవ్యాశ్వము భద్రమున్ దలఁప నెంతే నీస్వధర్మంబు లో
కాభీష్టార్ధములెల్ల నిచ్చు వరకళ్యాణస్వరూపం బిఁకే
రీ భాగ్యోన్నతి నెన్న నీసరిదొరల్ శ్రీ...

42


మ.

క్షితికన్యాపతియంతవాఁడును నినున్ సేవించియేకాని తా
శతసంఖ్యామితయోజనాబ్ధి గడవనా శక్తుండు గాఁడయ్యె నిం
కితరు ల్నేర్తురె నిన్ భజింపక యపారేచ్ఛాతరంగానివా
రితసంసారపయోధి దాటుటకు నో శ్రీ...

43


శా.

నీకై మొక్కు లొనర్చునట్టిశిర మెంతేయుత్తమాంగాఖ్యకౌ
నీకీర్తి స్తుతిసేయుజిహ్వయును వర్ణింపన్ రసజ్ఞాఖ్యకౌ
నీకళ్యాణకథాప్తి నుండుచెవులున్ నిక్కంబు శ్రుత్యాఖ్యకౌ
శ్రీకంఠా యటుగానివెల్ల దగునా శ్రీ...

మ.

తనియ న్వాహనమై మృదంగధరుఁడై తా బాణమై నేస్తుఁడై
తనరారన్ బ్రియభార్యయై మఱఁదియై త్వత్పూజకుండై సదా
నిను సేవింపుచు నేకదృష్టి మిగులన్ నిన్ జేర్చి నిన్నర్థిఁ గొ
ల్చిన వైకుంఠుఁడె పూజ్యుఁ డిజ్జగములన్ శ్రీ...

45


మ.

భవదీయాంఘ్రిసరోరుహాద్వితయసేవాధుర్యుఁడై నట్టిసా
రవ శేషజ్ఞునిపాదపంకజరజఃప్రవ్యాప్తిచేఁ బూతమౌ
భువిలోనం జరియించుకీటచయము న్మోక్షాప్తి నుండంగ నో
శివ నీభక్తులు ముక్తులౌట కరుదా శ్రీ...

46


మ..

అకటా నీవు వరంబు లిచ్చుతరి నింతైన న్విచారింప విం
చుక పుణ్యాత్ముఁడు వీఁడు వీడు ఖలుఁ డంచుఁ వార లెట్లైన ని
న్నొకమా రర్థి భజించి వేడినను నీ వుద్యత్కృప న్వారికో
రిక లీడేర్చుట నీస్వభావముగదా శ్రీ...

47


మ.

శివ నీవేకద విశ్వమంతయును జర్చింపంగ వెయ్యేల నీ
భువియు న్దోయము లగ్ని వాయువు నభంబు న్సూర్యచంద్రా
త్మలున్ భవదీయాకృతులై చెలంగ మహిమన్ భాసిల్లు నా
యష్టమూర్తివి నీ కన్యము లేశమైనఁ గలదా శ్రీ...

48


మ.

అల దుర్వాసుని గొప్పసేయక సహస్రాక్షుండు త్రైలోక్యని
స్తులసామ్రాజ్యరమావిభూతి దొలఁగెం దూర్ణంబె గానన్ ధరా
స్థలి నెవ్వాఁడు త్వదీయభక్తులఁ దిరస్కారంబు గావించి భా
సిలఁజాలున్ సిరిపోక జీవితముతో శ్రీ...

49

శా.

శుంభతయరాఘవాదులకు నెచ్చోదాటరానట్టియ
య్యంభోధిన్ దగ నొక్కగ్రుక్క గొనె నాహా కుంభజన్ముండు ని
ర్దంభప్రౌఢిమలీల మీఱఁగ భవద్భక్తప్రభావంబు ల
ర్థిం భాషాపతికైన నెన్న వశమా శ్రీ...

50


మ.

హరి నేత్రాబ్జముతోడ నీకొగి సహస్రాబ్జంబు లర్పించి తా
సరగన్ నీదుసుదర్శంనంబు గొను టాశ్చర్యంబె వెయ్యేల హృ
త్సరసీజంబొకటే త్వదర్పితమునొందన్ జేయువాఁ డెల్లఁ జె
చ్చెర నీదివ్యసుదర్శనంబు గనుచో శ్రీ...

51


శా.

రంగౌ మేలతనంపుసొమ్ములు మణీరాజత్ఫణాంచత్ఫణుల్
రంగన్మౌళితలస్రజంబు సుమనోరమ్యాపగారత్న మెం
చంగా నంగవిలేపనం బతనుభాస్వద్భూతియై యొప్పునీ
శృంగారంబు మహాద్భుతంబుగదరా శ్రీ...

52


మ.

చిరకాలంబు భజింపకున్న వరము ల్చేకూర్ప రేవేల్పులున్
గరిమన్ నీకొకసారి మ్రొక్కిన నుదత్కాలంబునందే సిరుల్
దొరయన్ గోరికలెల్ల నిత్తువఁట యెందున్ లేరు యుష్మాదృశా
చిరసంరూఢదయాప్రసన్నహృదయుల్ శ్రీ...

53


మ.

భవదారాధనకున్ ఫలం బనుచు నాబ్రహ్మేంద్రలోకాదివై
భవము ల్నీ వొగి నిచ్చెదేమొ యవి నీపాదార్చకు ల్మెత్తురే
శివ నీశాశ్వతయోగసౌఖ్యజలరాశిన్ బిందువు ల్చూడ వా
రివిభుత్వంబు లవేల మాకు ననుచున్ శ్రీ...

54

మ.

అమరంగా నొకసారె తజ్జపము సేయన్ బ్రహ్మహత్యాదిఘో
రమహాఘంబులు వీగిపారు సకలార్థశ్రేణి చేకూరు ను
త్తమనిర్వాణముఁ జేరు నెంతయు భవత్పంచాక్షరీమంత్రభూ
రిమహత్త్వంబు గణింప బ్రహ్మతరమా శ్రీ...

55


శా.

కామక్రోధముఖాంతరంగరిపులన్ ఖండించు నుద్యన్మహో
ద్దామాపత్తమమున్ హరించుఁ బరతత్వప్రాభవాంచత్పరం
ధామావాప్తి ఘటించు నెంతయు భవన్నామమ్ము సర్వోన్నత
క్షేమస్థాన మశేషలోకములకున్ శ్రీ...

56


శా.

పాపారణ్యదవానలం బఖిలసంపద్వల్లికాచైత్ర ము
గ్రాపత్పర్వతవజ్రమిష్టఫలకల్పాగంబు సంసారసం
తాపచ్ఛేదసుధారసంబు నిగమాంతక్ష్మానిధానంబు నీ
శ్రీపాదాంబుజభక్తికన్నఁ గలదా శ్రీ...

57


శా.

ముద్రాభ్యాసనిరూఢి నొంది మునిరాణ్ముఖ్యు ల్సమాధిస్థితిన్
భద్రస్ఫూర్తి తదేకలక్ష్యపరతన్ భావింప నుద్భూతమై
హృద్రాజీవసుకర్ణికాంతరమునం దింపారు తేజంబు నీ
చిద్రూపం బని చెప్పుచుందురు బుధుల్ శ్రీ...

58


శా.

జారుండైనను చోరుఁడైనను దురాచారుండునైన న్మహా
క్రూరుండైనను భక్తి నొక్కపరి నీకున్ మ్రొక్కిన న్వారలన్
సారోదారకృపాకటాక్షశుభవీక్షారూఢి నీదగ్గఱన్
జేరందీసి వరంబు లిచ్చెదుగదా శ్రీ...

59

మ.

ప్రకటింపన్ భవదగ్రసూనుఁ డఖిలప్రత్యూహముల్ వాపుఁ బా
యక నీగేహిని సర్వమంగళసుభవ్యప్రాప్తి గావించుఁ దా
వకనామంబు ఘటించుఁ దా శివపదవ్యక్తిన్ నినున్ గొల్చువా
రికి సర్వార్థము లాత్మహస్తగతముల్ శ్రీ...

60


శా.

గేయంబెంతయు వాక్ప్రపంచమున లక్షింపంగ నీకీర్తి యే
ధ్యేయం బెన్న నశేషలోకములకు దేవేశ నీమూర్తి యె
జ్ఞేయం బారయ నీదుతత్వమొకటే చింతింప సర్వాధిక
శ్రేయం బీశ్వర నీపదార్చనమెకా శ్రీ...

61


శా.

రుద్రారాధకు లున్నతావులకు మీరున్ నేనుఁ బోఁగూడ దా
రుద్రాక్షాప్తియు భస్మధారణము గుర్తుల్ వారికంచుం గడున్
భద్రం బొప్పఁగ నాత్మకింకరులకున్ బల్మాఱు కాలుండు ని
ర్ణిద్రప్రక్రియ నాజ్ఞసేయునట యో శ్రీ...

62


శా.

ఆయుర్దాయమునందు బాల్యమున నస్వాధీనదేహేంద్రియ
వ్యాయామశ్రమ యౌవనంబున దురంతాత్యంతకామార్తి రో
గాయాసవ్యధ వృద్ధభావమున నాహా యూహసేయంగ జీఁ
చీ యీపుట్టున సౌఖ్య మింత గలదా శ్రీ...

63


మ.

క్షితి నానావిధహీనయోనులను గాసిన్ బుట్టుచుం చచ్చుచు
న్వెతలం బొందెడు ప్రాణిలోకమునకు న్నీపాదపద్మైకసం
స్మృతిదక్క న్మఱియొండుత్రోవవలన న్జర్చంప నీఘోరనం
సృతివారాశి దరింప శక్యమగునా శ్రీ...

64

శా.

నీపాదాంబుజభక్తి లేక మిగులన్ నిత్యంబు శిశ్నోదర
వ్యాపారంబులఁ బ్రొద్దుఁబుచ్చుచు దురాశాయత్తులై యూరకే
తాపం బొందుచునున్నమాత్రముననే తర్కింప నామోక్షని
క్షేపం బబ్బునె పుణ్యహీనులకు నో శ్రీ...

65


మ.

జనసంఘంబున కెల్లెడన్ సులభనిష్పన్నంబులౌ తుమ్మిపూ
లును దోయంబును భూతి బిల్వదళము ల్చూడంగ నీప్రీతికిన్
స్వనివాసంబులుగా ధరిత్రి నమరన్ సర్వార్థదంబై తన
ర్చిన నీపూజ యొనర్పలేరు కుమతుల్ శ్రీ...

66


మ.

కనకం బేక్రియ తారుమారయినఁ దద్గణ్యార్థమున్ గుందుఁ జెం
దనిభంగిన్ బరమేశ నీమహిమ బోధం బింతయున్ లేకయై
న నసూయామతినైనఁ బాపగతినైనన్ వ్యత్యయస్ఫూర్తి గాం
చినఁ దద్రూఢి యొకింతయున్ దరగునా శ్రీ...

67


శా.

నీవేదాంతసుచర్చ నొక్కతఱియు న్నీచింత నొక్కప్పుడున్
నీవిజ్ఞాననిరూఢి నొక్కడుగున న్నీపూజ నొక్కజ్జునన్
గా విశ్వంభరఁ బ్రొద్దు లి ట్లనుపుచు న్వర్తించువారేకదా
జీవన్ముక్తు లనంగనొప్పు సుకృతుల్ శ్రీ...

68


శా.

యుక్తాచార్యనియుక్తపద్ధతి భవద్యోగక్రమాభ్యాస మా
సక్తిన్ జేయక సాధుభక్తజనతాసాంగత్యమున్ గాన కే
భక్తిజ్ఞానవిరక్తిమార్గముల నిన్ భావింపలే కూరకే
రిక్తాచారములందు ముక్తి గలదా శ్రీ...

69

శా.

ఒప్ప న్నీపదభక్తి లేక తమచే నున్నంతలో కొంచెమో
గొప్పో పేదల కియ్యనొల్లక కుయుక్తుల్ నేర్చి వేదాంతపుం
జొప్పే కానక సర్వముం దెలియునంచున్ శుష్కవేదాంతముల్
చెప్ప న్మోక్షము గల్గునా జనులకున్ శ్రీ...

70


శా.

గానంబేకద పెద్ద యెల్లకళలన్ గౌరీశ లోకంబులన్
దానంబేకద మేటిసద్గుణములన్ దర్కింప నీసత్పద
ధ్యానంబేకద లెస్స సర్వపురుషార్థకశ్రేణిలోఁ జూడ ల
క్ష్మీనాథార్చితపాదపంకజయుగా శ్రీ...

71


శా.

కాయక్లేశముల న్సహించి మిగుల గాసిల్లి మాయావిధో
పాయవ్యాప్తులఁ బొట్టకంచు సిిరి గూర్పన్ జూతురేకాని య
య్యో యీదేహము నమ్మరాదనుచుఁ దా రూహించి నీధ్యానమున్
జేయంజాల రిదేమి సామి మనుజుల్ శ్రీ...

72


మ.

ఘనతన్ బ్రహ్మశిరంబు ద్రుంచి తది యుక్తంబేకదా గాఢలు
బ్ధుని విత్తాధికుఁ గాఁగ దాతను దరిద్రుం గాఁగ నత్యంతరి
క్తున నేకాత్మజయుక్తుఁ గాఁగ ననపత్యుం గాఁగ సంపన్నుఁ జే
సిన యాబ్రహ్మకు నట్ల కావలె సుమీ శ్రీ...

73


మ.

ధన మున్నప్పుడె దానధర్మములచేతల్ దల్లిదండ్రుల్ క్షితి
న్మనునాఁడే తదభీష్టసంఘటన సమ్యక్పాటవంబైన యౌ
వనమందే వరతీర్థయాత్రలు నరత్వంబందె నీపూజఁ జే
సినవాఁడేకద జాణ యెందు నరయన్ శ్రీ...

74

మ.

ధర సాఫల్యము గాంచు వర్షములచేత న్విద్య సాఫల్యమున్
బొరయున్ సద్వినయంబుచేఁ గను దపంబున్ శాంతి సాఫల్యమున్
వరసుజ్ఞానముచేత మర్త్యజని సాఫల్యంబు దాఁ బొందు బల్
సిరి సాఫల్యము నొందు దానగరిమన్ శ్రీ...

75


మ.

పరులన్ దప్పులు పట్టినంతటనె తాఁ బ్రాజ్ఞుండు గాఁబోఁడు ద
బ్బరవేసంబులు దాల్చినంతటనె సద్భక్తుండు గాఁబోఁడు వా
విరిదుర్యుక్తులు నేర్చినంతటనె తా విజ్ఞానిఁ గాఁబోఁడు సు
స్థిరమౌ నాత్మనిరూఢి లేక జగతిన్ శ్రీ...

76


మ.

ధనమే దైవము లుబ్ధకోటికి నితాంతస్వైరిణీనంగచిం
తనమే మోక్షము కాముకావళికి నుద్యత్సాధుబాధాసమా
ర్జనమే ధర్మము దుష్టసంతతికినై ప్రస్ఫూర్తి నుండంగ మిం
చినసద్బోధ లిఁకేల వారల కిలన్ శ్రీ...

77


మ.

జననీముఖ్యులఁ దిట్టకున్న బహుపూజల్ చేసిన ట్లిద్ధన
జ్జనులన్ బాధలు సేయకున్న మిగులన్ సత్కారముల్ చేసిన
ట్లు నిషిద్ధక్రియ లేవగించినను బల్పుణ్యవ్రతశ్రేణిఁ జే
సిన యట్లెన్నఁగవచ్చు నీచెడు కలిన్ శ్రీ...

78


మ.

పుడమిన్ గోడలికష్ట మత్తయుఁ గరంబు న్మామ దైనట్టిలే
వడి యల్లుండు గ్రియార్థి దైన్యము దొరల్ ప్రాణివ్యధన్ గాలుఁడున్
గడుజాలిన్ మృగబాధ వ్యాధుఁడును లెక్కం జేయ రింతైన నా
చెడుగుం దాత యిటేల చేసె జగతిన్ శ్రీ...

79

మ.

మతి నెన్న న్మహిలోన మానవులకు న్మర్యాదభంగంబును
న్మృతియున్ నిందయు నీచయాచ్నయపకీర్తిప్రాప్తియు న్మానహీ
నత దైన్యంబును నొక్కచందములె యైనన్ వానిలోఁ జూడఁగా
మృతి యొక్కించుక మేలు మాననిధికిన్ శ్రీ...

80


మ.

పరుల న్మోసము నేయనేర్చునతఁడే ప్రజ్ఞాధికుం డెంతయున్
గరుణాశూన్యుఁడె గట్టివాఁ డకృతసత్కర్తుండె వేదాంతి ని
ర్భరదంభాన్వితుఁడే ప్రపూజ్యుఁడునుగాఁ బాటిల్లె నివ్వేళ న
చ్చెరు వౌరా కలికాలపున్మహిమ మో శ్రీ...

81


మ.

ఇలలో సంకరజాతి వృద్ధియగుఁగీ డింతేనియున్ లేక ని
చ్చలుఁ బెంపౌ విషకంటకాగములు వర్షంబింత లేకున్న నే
పలరున్ నేర్వకయున్నఁ జౌర్యముఖకృత్యంబుల్ స్వతస్సిద్ధమై
చెలఁగున్ దుర్గుణకోటి మానవులకున్ శ్రీ...

82


మ.

పతితు ల్లేరు మదన్యు లెందును గణింపన్ లేరు నీకన్నఁ ద
తృతితత్రాణధురీణు లట్లగుట నొప్పన్ నీదుదాసుండనై
నతి గావించుటనాదువంతు దయ న న్రక్షింప నీవంతు సం
సృతిదూరా పరమేశ్వరా శుభకరా శ్రీ...

83


మ.

నెప మెన్నన్ దగఁదంటి నిక్కముగ నే నీవాఁడసు మ్మంటి నే
నపరాధిన్ ననుఁ బ్రోవుమంటి బరులన్ బ్రార్థింపలేనంటి నీ
కృపఁ జూపన్దరి యిప్పు డంటిఁ గడున్ గీర్తింపుచుంటిన్ సరీ
సృపరాడ్భూషణ నీదుచిత్త మిటుపై శ్రీ...

84

మ.

నియతిన్ జెప్పెద రూఢిగాఁగ వినుమా నేఁ జేయకున్నట్టిదు
ర్ణయ మొక్కింతయు లేదుగాని యటులైనన్ నీపదాంభోరుహ
ద్వయి దిక్కంచును నమ్మినాఁడ మఱి నీదాసుండ న న్నిప్పు డే
క్రియ రక్షింతువొ నీదుచిత్తముసుమీ శ్రీ...

85


మ.

సవిశేషవ్రతదానధర్మనియమస్నానాదిపుణ్యక్రియ
ల్లవమున్ జేయఁగలేదు పూని యొకవేళన్ స్వప్నమందైన నే
నెవరి న్వేల్పులఁ గొల్వలే దెపుడు నిం కేలా బహూక్తుల్ సదా
శివ నీవే గతియంచు నమ్మితిసుమీ శ్రీ...

86


శా..

చిత్తైకాగ్రతఁ జేసి నీదుపదమున్ జింతింపఁగానేర స
ద్వృత్తం బొప్పఁగ దానధర్మగతు లర్థిన్ జేయఁగానేర దు
ర్మత్తుండన్ ఖలుఁడన్ జడుండఁ గడుదుర్మార్గుండ దీనుండ నీ
చిత్తం బేక్రియఁ బ్రోతువో నను దయన్ శ్రీ...

87


మ.

అతిఘోరాఘములెల్లఁ జేసియును లక్ష్యంబింతయు న్లేక స
న్మతి నే వేల్పులఁ గొల్వలే దెపుడు గానన్ నాపయి న్గోపసం
యుతులైయుండిరి వేళ గాచి హరిముఖ్యుల్ గావునన్ నీపదా
శ్రితు న న్నిప్పు డుపేక్ష సేయఁదగునా శ్రీ...

88


శా.

నీవే దిక్కని నమ్మినాఁడ పరుల న్నే వేడ నీవాఁడ నా
కీవే దైవము తోడునీడ మఱి నీవే సర్వము న్జూడ నే
లావేయున్నను గన్నవాఁడ నిను నేలాగైన నే వీడ నీ
సేవాసక్తుఁడ నెట్లు బ్రోచెదొ ననున్ శ్రీ...

89

మ.

మును నీ కెంతటిపాపియైనను గరంబున్ మ్రొక్కి ప్రార్ధించినం
తనె నీ వతనికి న్వరంబు లిడి మోదం బొప్ప రమించినా
వని భాషింతురు కల్లలో నిజములో యాసుద్దు లేనెంత చే
రి నిను న్వేడిన నూరకుందు వహాహా శ్రీ...

90


మ.

క్షితిలో నేరికిఁ జెప్పరానియఘముల్ చింతింప కేఁ జేసితిన్
గతి యిం కేమని వేడఁగా విబుధవర్గంబెంతయున్ సప్రమా
ణతతో నాశ్రుతు లొప్పఁ జెప్పిరి భవన్నామస్మృతిన్ బోనిదు
ష్కృతమిం కెందును లే దటంచు మిగులన్ శ్రీ...

91


మ.

శరణన్నన్ గరుణింపవయి తిది సర్వా సర్వేశ న న్నింక సా
దరతన్ బ్రోవకయున్న నీదుపతితోద్ధారక్రియారూఢస
ద్బిరుదాంకస్థితి తోడు తారకమహాభిఖ్యార్థమున్ దోడు నీ
స్థిరకారుణ్యము తోడు భక్తవరదా శ్రీ...

92


మ.

ఇతరోపాయములెల్లఁ గాంచి సుఖ మెందే లేక వర్జించి మా
నితసారం బిదిగా గ్రహించి నిరతి న్నీపాదపద్మంబులే
గతిగా నెంచి భజించి మించి వినతు ల్గావించి నీచెంతఁ జే
రితి నీచిత్తము నాదుభాగ్య మటుపై శ్రీ...

93


మ.

పతితానీకముఁ బ్రోతునంచు బిరుదొప్పంబూనియున్నావు సు
స్థితి మీఱ న్మును నీవు న న్నొకనివాసిన్ బ్రోవకున్నన్ ర్వదు
న్నతికిన్ లోపమువచ్చుఁగాన నది యూనంబొందకుండంగ నం
చితలీల న్నను నేలుకొమ్ము కరుణన్ శ్రీ...

94

శా.

చేతోవృత్తి భవత్పదాబ్జయుగమున్ జింతింపుచు న్నీకథా
జాతంబు ల్వినుచుం ద్వదీయవిలసచ్చారిత్రము ల్పాడుచున్
బ్రీతిన్ నే నిమిశంబుగాఁ గడపెదం బెక్కేండ్లు లీలాగతిన్
శీతాద్రీంద్రసుతామనోహరదారా శ్రీ...

95


మ.

నినుఁ బూజింతునటన్న సర్వమును ము న్నేతావకాయత్తమై
తనరె న్ని న్వినుతింతునన్నను భవద్భూరిప్రభావం బెఱుం
గను నిన్ ధ్యాన మొర్తునన్నను నిరాకారుండవ ల్లాటఁ గూ
ర్మి నమస్కార మొనర్తు నీ కొకటి నే శ్రీ...

96


మ.

లలి నీకుం బ్రియగంధమాల్యవసనాలంకారమృష్టాన్నముల్
వెలయ న్మన్మథదావాభస్మవిలసద్వేధఃకపాలాభ్రకుం
డలి రాజేంద్ర హలాహలంబులటఁ జూడ న్వాని నేఁ గూర్చి రం
జిల నీపూజ లొనర్ప నా కలవియే శ్రీ...

97


మ.

చతురస్యాదులు యుక్తి నేరకకదా సర్వీశ నీసుప్రస
న్నత గన్నట్టితఱిన్ బృధక్పృథగనూనన్వేష్టము ల్వేడరే
నతమాత్రం బగుయుక్తి గంటి భవదీయాంఘ్రిద్వయీభక్తి సు
స్థితిగా వేడిన సర్వలాభ మనుచున్ శ్రీ...

98


మ.

కుతుకం బొప్పగ నాంధ్రదేశమునఁ దద్గోదావరీతీరసంస్థిత
మౌ రాజమహేంద్రరమ్యపురికిన్ జెల్వొప్పఁగా యోజన
ద్వితయక్షోణి వసించు పల్వలపురీదివ్యస్థలిన్ భక్తవాం
ధతముల్ దీర్ప శుభాకృతి న్వెలసితో శ్రీ...

99

మ.

శిన యుష్మత్కరుణాకటాక్షకలితశ్రీమత్ప్రసాదాప్తస
త్కవితావైభవజాత మీశతక మేధన్యుండు తా వ్రాసినం
జెవులార న్వినినన్ బఠించినను వాసిన్ గోరికల్ గాంచి మిం
చి విముక్తిన్ గనువాఁడు నీస్థిరకృపన్ శ్రీ...

100


మ.

తతకీర్తిస్తుత కూచిమంచివిలసద్వంశాభిజాతుండు శో
భితశీలుండను సోమసుందరవరాభిఖ్యుండ నీపేర నీ
శతకం బే రచియించి పూసరముగా సద్భక్తి నీకున్ సమ
ర్పితము న్జేసితి దీని గైకొను దయన్ శ్రీకొప్పులింగేశ్వరా.

101


కొప్పులింగేశ్వరశతకము
సంపూర్ణము.