కొండుభొట్టీయము/ప్రథమాంకము
కొండుభొట్టీయము
ప్రథమాంకము
ప్రథమ రంగము - మంజువాణి యిల్లు.
(మంజువాణి తలదువ్వుకొంటూ కుర్చీపైని కూర్చుండును. కొండిభొట్లు ప్రవేశించును.)
మంజు : దండం శాస్తులుగార్కి వెంకీ : శాస్తులు గార్నికూర్చోబెట్టి పీటవెయ్యే.
కొండి : సకలైశ్వర్య సిద్ధిరస్తు. పంతుళవారు పాదాక్రాంతాభవంతు... ఆ తలవెండ్రుకలు సాక్షాత్తూ చమరీవాలాల్లాగ శోభిల్లుచున్నాయి. విన్నావా మంజువాణీ!
మంజు : యింకా యేవి యెలా వున్నాయి?
కొండి : యేదిన్ని వర్నించడానికి సెఖ్యం కాకుండా వున్నాయి... ముఖం చందబ్రింబంలా వున్నది. కళ్లు కలవరేకుల్లా వున్నయి. గళం శంఖంలా వున్నది. బాహువులు లతల్లా వున్నయి. మరెవచ్చీ....
మంజు : మరెవచ్చి అక్కడ ఆగండి.
కొండి : మంజువాణీ! అదికం యేల. నీ సౌందర్యం, రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమాదుల్ను ధిక్కరించి వెక్కిరించియున్నది.
మంజు : మా పంతులుగారి వెధవ అప్పగారి సాటి యేమాత్రమయ్నా వస్తుందా?
కొండి : హాశ్యానికైనా అనగూడని మాటలున్నాయి (పొడుం పీల్చును. )
మంజు : చెయ్యగాలేంది చెప్పడమా తప్పొచ్చింది.
కొండి : దేవతలు బ్రాహ్మలు చేసే పనులు తప్పు పట్టకూడదు. స్వర్గంలో వాళ్లు దేముళ్లయితే, భూలోకంలో మేం దేముళ్లము; అంచేతనే మమ్మల్ని భూసురులంటారు. చదువుకున్న దానివి నీకు తెలియందేమున్నది.
మంజు : వెధవల్ని తరింపజేసే భూసురోత్తములకు నమస్కారము (నిలుచుని నుదుట చేతులు మొగిడ్చి నమస్కారము చేయును.)
(భీమారావు పంతులు ప్రవేశించును.)
భీమా : యేమిటీ నాటకం.
మంజు : ముక్కోటి దేవతలు స్వర్గంలో ఉంటే, భూమ్మీద దేవతలు బ్రాహ్మణులని కొండిబొట్లుగారు శలవిచ్చారు. అందుచేత వేశ్య యింటికి అనుగ్రహించి వేంచేస్ని భూసురోత్తముల్ని కొలుస్తున్నాను.
భీమా : నీవు యెంత యెకసెక్యం చేసినా మేం దేవతలమే, అందుకు రవ్వంతైనా సందేహము లేదు.
మంజు : భూలోకంలో కృష్ణావతారం లాంటి రసికులు మీరు. కృష్ణావతారం కుదిరింది; కాని శాస్తులు గారు యే దేముడి అవతారమో పోల్చలేకుండా వున్నాను.
భీమా : పట్టణం వెళ్ళినప్పుడు పరంగీ స్త్రీల సహవాసం చేశానని చెప్పారు గనుక శాస్త్రుల్లుగారు సాక్షాత్తు నారదావతారం.
మంజు : అన్నా! మరచిపోయినాను. యెంత బుద్ది తక్కువ మనిషిని; దూరముగా నిలుచొండి. ప్రాయచ్చిత్తం చేసుకొంటేనే గాని దగ్గరకు రానియ్యను.
భీమా : శాస్త్రుల్లుగారూ! యేమిటండి ప్రాయచ్చిత్తం? నకక్షతమా? దంతక్షతమా?
కొండి : అది యెంత అదృష్టవంతులకు గాని సంప్రాప్తమవుతుంది. ముక్కుతిమ్మన్న ఏమన్నాడు.
“చ... నను భవదీయదాసుని..................
...................... అరాళకుంతలా.”
స్వేతముఖలు గనుక బ్రాహ్మడికి రజతదానం చేస్తే ప్రత్యువాయం పోతుంది. మా కుర్రవాడు మెటిక్లేషను పరీక్షకు కట్టాలి. యీ బీదబ్రాహ్మడికి దానం యిస్తే సమయానికి పనికి వస్తుంది.
మంజు : నిత్యసువాసినికి సువర్నదానం చెయ్యమని లేదా?
భీమా : (దీని తస్సాగొయ్యా బంగారపు సరకును మళ్ళీ తెమ్మంటుంది కాబోలు) తొందరపని వుంది. యిప్పుడే వెళ్ళి వస్తాను.
కొండి : మంజువాణి! బహు పుణ్యాత్మురాలివి, యేమైనా సాయం చేస్తేనే గానీ కుర్రవాడు పరీక్షకు వెళ్లే సాధనం కనబడదు.
మంజు : పంతులుగారి అప్పని అడుగరాదా?
కొండి : యెవర్నీ అడక్కుండా యేమయింది. వైదీకపాళ్ళని పుట్టించినప్పుడే బ్రహ్మ రాసిపడేశాడు. “ముష్టెత్తుకొండర్రా” అని. మంజు : యేది యిందాకటి పద్యం చదవండీ.
కొండి : (రాగవరసను చదువును)
“చ నను భవదీయ.........
(అలా రాగవరసని చదువుతూవుండగా వెనుక వైపు వచ్చి మంజువాణి శాస్తులు వీపు మీద తన్నును)
ఓస్నీ అమ్మాశిఖా... (అని తగ్గి).... ఆహా! మల్లి పువ్వుల గుత్తా? పట్టుకుచ్చా? మలయ మారుతమా? వీపు తాకినది?
మంజు : సానిదాని కాలు.
కొండి : కాదు! కాదు! మన్మధుని వాడి వాలు.
మంజు : ప్రాస కుదిరింది కాని, శాస్తుల్లు గారు! యీ తాపు మదనశాస్త్రంలో క్రియక్రింద పరిగణన మవుతుందా? భూసురోత్తములను తన్నిన పాపం క్రింద పరిగణన మవుతుందా.?
కొండి : పది రూపాయీలు పారేస్తే పుణ్యం కింద పరిణామం అవుతుంది.
మంజు : పాటు పడక పైసా రాదు.
కొండి : బ్రాహ్మడికల్లా సాపాటు వక్కటె పెద్దపాటు యేర్పాటు చేసి బ్రహ్మ పడేశాడు.
మంజు : అయితే పెందరాళే వెళ్ళి ఆపాటు పడండి.
కొండి : మంజువాణి! యెంత చదువుకున్నా మా వంటి వాళ్లం నీకు వక్క మాటకు సదుత్తరం చెప్పగలమా? బాపనాళ్ళని కనికరించి, ఒక డబ్బు సొమ్ము ఇవ్వాలి గాని.
మంజు : వేశ్యల ద్రవ్యం పాపిష్టిది. బేరం తెచ్చి రుసుం పుచ్చుకుంటే ప్రత్యువాయువుండదు.
కొండి : ఈ వూళ్ళో నానాటికి రసికత సన్నగిల్లుతూన్నది. “అంధునకు గొరయవెన్నెల” అన్నట్టు ఈ వూళ్ళో మూర్ఖులకు నీరూపలావణ్య విలాస విశేషములు అగ్రాహ్యములు. తోవంటపోయే పొన్నూరు వాళ్లను కాచి పట్టుకొవ్వాలి.
మంజు : ఈ కంసాలాడు యింటి యెదుట దుకాణం బెట్టుకొని యిక్కడికి వచ్చే వాళ్లనల్లా వాళకం కట్టుతూ వుంటాడు. వాడిని తెస్తే.......
(తెర దీంచవలెను.)
ప్రథమాంకము
(ద్వితీయ రంగము)
(కొండుభొట్లు యిల్లు - వీధి సావిడి)
(రామ్మూర్తి, వెంకన్న, గిరీశం ప్రవేశించును.)
వెంక : రాముడు! పరీక్షంటే ఏమిటిరా?
రామ : పరీక్షంటే యెగ్జామినేషన్.
వెంక : (పొడుం పీల్చును) యజ్ఞం నాకు తెలుసును. మేషం అంటే మేక, మేకపోతు వేస్తారా ఏమిషిరా?
రామ : ఫూలిష్! యజ్ఞం కాదూ. మేషం కాదు. శాస్త్రాల్లో ప్రశ్నలు అడుగుతారు.
వెంక : నీకు శాస్త్రము వచ్చును? తర్కమా? వ్యాకరణమా?
రామ : నథింగ్ ఆఫ్ ది క్రైండ్ (Nothing of the kind) జాగర్ఫీ ఒకటి.
వెంక : అనగా?
రామ : భూగోళ శాస్త్రం.
వెంక : దానిలో యేమిటుందిరా?
రామ : వెలగపండువలె గుండ్రంగా వుండే భూం మీద యేయే నదులు, సముద్రాలు, కొండలు వగయిరాలు యెక్కడవున్నాయో చెప్పుతుంది.
వెంక : భూమి గుండ్రంగా వుంది? అబద్దం! అబద్దం! నలు చదరంగా వుంది. దాన్ని, అష్ట దిగ్గజాలూ మోస్తున్నాయి.
రామ : నాన్‌సెన్సు (Nonsense) "కపిద్దాకార భూగోళం” అని మనవాళ్లు కూడా అన్నారు. యేనుగులు మాట పాతమాట. అవి అన్నీ వెళ్ళిపోయినాయి.
వెంక : గుండ్రంగా వుంటే ఎవరు మోస్తున్నారు.
రామ : యెవ్వరూ మొయ్యలేదు. ఆకర్షణ శక్తి వల్ల భూగోళం అంతరాళంలో నిలిచియున్నది.
వెంక : అలా చెప్పు... అదొక కొత్త శక్తి పేరు చెప్పావు. యేదోవక దేవతలేన్ది యేదీ వుండదు. అయితే ఈ వెధవలు పత్సిమసముద్రం చూశారు?
రామ : ఓ! దాన్లోకి! ఓబి. యెనిసి, లీనా, అను మూడు నదులు, ప్రవహించును.
వెంక : అబద్దం, శుద్ద అబద్ధం, హిమవత్పర్వతానికి వుత్తరం చూడ్డం. మనుష్యులు వెళ్లితే చచ్చిపోర్రా! ఇదా. దొంగముండా శాస్త్రం. ఇంకా యే శాస్త్రం చదువుకున్నావు. రామ : హిష్టరీ.
వెంక : విస్తరా?
రామ : చెరిత్ర
వెంక : అనగా?
రామ : తెలియనివాడితో యేమి చెప్పను. వేదాలు యెప్పుడు రాశారో, రామాయణం, భారతం, యెప్పుడు పుట్టేయో అవి యెంత నిజమో, యెంత అబద్ధమో....
వెంక : వేదాలు రాశేరు? రామాయణం అబద్ధమా?
రామ : ఆ! కావలసినంత. రాముడు దేముడు కాడుట. మహారాజు, రావణాసురుడికి ఒక్కటే బుర్ర, విన్నారా?
వెంక : ఈ పాపపు మాటలు వినగూడదు.
(చెవులు మూసుకొని పారిపోవును.)
గిరీశం : అజ్ఞానం! అజ్ఞానం పోతే గాని మన దేశం బాగుపడదు.
రామ : మా వెంకడికి మెదడు లేదు.
గిరీశం : మీ తండ్రి తెలివి వున్న మూర్ఖుడు. భోగం వాళ్ల యింటికి వెళ్లి ఆశ్రయిస్తాడు. నీ పరువు తీసి వేస్తూన్నాడు. సమయము చూచి చీవాట్లు పెట్టాలి.
రామ : అతనికి తోచినట్టు అతను చేస్తాడు. మనకు తోచినట్లు మనం చేదాం.
గిరీశం : డామిట్ (Damit), ప్రాణమయ్నా యిచ్చెయ్యాలి గాని రిఫారం విషయమై నదురూ, బెదురూ వుండకూడదు. లేకుంటే మనదేశం బాగుపడేదెట్లు? మనకి బంగాళీ వాళ్లలాగ పరువు ప్రతిష్ఠ వచ్చేదెట్లు?
రామ : అయితే సమయం చూసి చీవాటు పెట్ట మంటారా?
గిరీశం : ఇంక ఆలోచిస్తావా? అదుగో మీ తండ్రి వస్తూన్నట్టుంది. నన్నెరగనట్టు నటించు. రహస్యం భేదించకుండా నటించాలి.
రామ : యెందు కేమిటండి?
గిరీశం : మీ తండ్రి అసాధ్యుడు. నిన్ను గురించి యెంతో విచారిస్తూన్నాను.
రామ : ఆయనతో పరిచయము చేశారా యేమిటి?
గిరీశం : చేశాను. నీకు చేస్తానన్న పిల్ల ముక్కుపచ్చ లారని పసిపిల్ల. రిఫార్మర్ (Reformer) అనేవాడు అలాంటి పిల్లని పెళ్ళాడితే (Society looks down upon him) సంఘం నిరసనగా అతన్ని చూస్తుంది. రామ : అంచేతనే నేనూ సిగ్గుతో చచ్చిపోతున్నాను, తెగించి దేశాలంట పోదూనా అనిపిస్తూంది.
గిరీశం : నాతో యెన్నడు చెప్పకపోతివే?
రామ : యేమని చెప్పను. సిగ్గుచేత చెప్పలేదు.
గిరీశం : ఒకరి లోపాలికి మనం సిగ్గుపడనేల? చేతనయినంతవరకూ మళ్లిద్దాం. మళ్లకపోతే కనికరిద్దాం. సిగ్గుతోనూ, కోపంతోనూ పనిలేదు.
రామ : నామీద్దయ చేత మీరు అలా అంటారు. లోకంలో తలయెత్తుకు యెలా తిరగను.
(తెర దింపవలెను.)
ప్రథమాంకము
తృతీయ రంగము
(అక్కాబత్తుడి యింటి వీధి అరుగు)
(వెంకన్న, అక్కాబత్తుడు ప్రవేశించును)
వెంక : యేనుగులు దొబ్బేశాయండోయి.
అక్కా : యెవరియేనుగులు? విజయనగరం వారివా? బొబ్బిలివారివా?
వెంక : కాదండి, దిగ్గజాలు.
అక్కా : యెక్కడికి వెళ్ళిపోయినాయి?
వెంక : భూమి వెలగపండులా గుండ్రంగా వుందిష. అంచేత యేనుగులు మోత అక్కరలేదుష
అక్కా : భూమి వెలగపండయితే యేనుగులు వెలగ పండు తినేస్తాయి కాబోలు!
వెంక : మా రాముడు చెప్పాడు.
అక్కా : ఇంకా ఏమి చెప్పాడు?
వెంక : వేదాలేవళ్లో రాశారుష, రాములువారు మనీషష, దేముడు కాడుష.
అక్కా : మీకు కొండిబొట్లు ఇంగ్లీషు చదువు చెప్పించాడు కాడని నాకు కించగా వుండేది. ఇంగ్లీషు చదువు కిదే ఫలితమయితే మరి విచారం లేదు. తురకలు మెడకి కత్తి మొనజేర్చి గొడ్డు మాంసం తినిపించే వారు. ఈ యింగ్లీషు వాళ్లు చదువులు పెట్టి మనవేళ్ళతో మనకళ్లే పొడుస్తున్నారు. అదిగో మీ బాబు వస్తున్నాడు పారిపో.
(యిద్దరు నిష్క్రమింతురు. )
ప్రథమాంకము
చతుర్ధ రంగము
(కంసాలి దుకాణం)
(అక్కాభత్తుడు, కొండిభొట్టు ప్రవేశింతురు.)
కొండి : అక్కాభత్తుడు గారూ? దయలేదు గదా..
అక్కా : బ్రాహ్మణోత్తములు తమదయ మాకుండ వలెను గాని మా దయ యేమిచెరితార్థం?
కొండి : విశ్వకర్మలనగా సాధారుణులండీ. పురుష సూక్తంలో యేమి చెప్పాడో విన్నారా. “విశ్వకర్మణ... పురుషుణ్ణీ” అనగా ఆపరమాత్ముడ్నే త్వష్ట అనే కంసాలి చేశాడుట.
అక్కా : అలా అయితే బ్రాహ్మల కన్న కంసాల్లు యెక్కువే గదా?
కొండి : సందేహమేమిటండి. అందుచేతనే కంసాల్లు బ్రాహ్మలకి దండం పెట్టరు. వక్కహక్కు మాత్రం బ్రాహ్మణులకు వుండుకున్నది. కంసాల్లకి గాని యితర వర్ణాలకి గాని లేదు.
అక్కా : అది యెషువంటిదండి?
కొండి : గొప్ప చెప్పుకోవలసినది కాదు. అది యేమిటంటే "ప్రతి గ్రహణం” తెలిగిస్తే, ముష్టి యెత్తుకోవడమన్న మాట.
అక్కా : గడియకపోతే అది అందిరికీ వున్న హక్కే
కొండి : గడిచినా బ్రాహ్మడ్కి తప్పదు. నూరుకోట్ల రాజ్యాలేలే శ్రీమంతుడ్కి తప్పింది కాదు.
అక్కా : అది యేలాగేమిటి.
కొండి : చిత్తగించారా? అహల్యాబాయి అని హోల్కారు మహారాజులుంగారి భార్య వుండేవారు. ఆవిడకి కోట్లతో ధనమువుండేది. ఆ మహారాణీ బహుదొడ్డ పుణ్య కార్యాలు చేశారు. కాశీలో ఒక ఘట్టం కట్టించారు. సత్తరువు వేశారు. చిత్తగించారా! ఒకనాడు శ్రీమంతుల వారికి ద్రవ్యం కావలశివచ్చినది. అహల్యా బాయి గారిని దోచుదామని వెళ్ళేసరికి ఆ మాట తెలిసి అహల్యాబాయి గారు యేం చేశారంటె ధనమంతా కుప్పపోసి స్నానం చేసి, పట్టు వస్త్రాలు ధరించి తులసిదళం జారీ చేత్తోపట్టుకొని శ్రీమంతులు రాగానే “మహారాజా! దోచడానికి యేమి అవసరముంది. మీరు బ్రాహ్మణ మహారాజులు. ఈ తులసిదళం రెండు నీళ్ళ చుక్కలుతోటి నా యావత్తు ధనం పరిగ్రహించవలసినది. యింత పాత్రతయిన దానం యెలా లభిస్తుంది” అని ఆ మహారాణి అన్నారుట.
అక్కా : సరేకాని అపాత్ర దానంవల్ల దోషం లేదా? కొండి : ఈ కలియుగంలో పాత్రాపాత్ర లెంచడానికి అవకాశమేది. అంతా పాపభూయిష్టమయి యున్నది. “బ్రాహ్మణబీజాయి తేనమః” అన్నాడు, గనుక బ్రాహ్మణ బీజానికి పుట్టితే చాలును.
అక్కా : అదైనా నిశ్చయము కద్దా?
కొండి : లోకం అంతా నమ్మకముతో వుంది. నమ్మకం లేకుంటే అడుగుతీసి అడుగు పెట్టడాన్కి వీలు లేదు. నమ్మియెన్నో వెండి, బంగారాలు లోకులు తమకి స్తున్నారు కారూ? అసాక్షికం లేదంటే యేమిటి చెయ్యడం “నమ్మిచెడిన వారు లేరు. నమ్మక చెడిపోతే చెడిపోయారు” అన్నాడు.
అక్కా : శాస్త్రాలు వదిలి తంబళి పదాల్లోకి వొచ్చారు?
కొండి : భారతంలో యేమన్నాడు “లోకజ్ఞున్” అన్నాడు. అంచేత లోకంలో వేదం మొదలుకొని తంబళి పదాల వరకూ యావత్తుహంశములు తెలిస్తేగాని పండితుడు కానేరడు. ఇదిగో శాస్త్రంలో ముక్క మనవి చేసుకొంటాను. “కంసాలి” అనగా “కంసారి” “రలయోరభేదః” అన్నాడు. గనుక కంసాలి శబ్దార్థం సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి వారని సిద్ధాంతం.
అక్కా : నేను కృష్ణమూర్తిని అయితే సత్యభామని యెక్కడయ్ని ఆలోచించారా లేదా?
కొండి : అదే నేనూ మనవి చెయ్యాలనుకుంటాను. సత్యభామ కోసం యెక్కడికైనా వెళ్లాలా, యేమిటి? తమ యింటి యెదుటనే కాచివేచి యున్నది. మంజువాణి - బంగారు బంతి - దాని రూపురేఖ విలాసాలెషువంటి దనగా ........
అక్కా : అదంత నిజమే కాని, “మిక్కిలి రొక్కము లియ్యక చిక్కదు రా వారకాంత సిద్ధము సిద్దము సుమతీ” అన్నాడు. నేను డబ్బెక్కడ తేను.
కొండి : శ్రీకృష్ణమూర్తి వారియందు సత్యభామకు వలెనే ఈ మంజువాణికిన్ని మీ యందు మనసు లగ్నమయి వున్నది.
అక్కా : అది చెప్పిందా, మీరు పోల్చారా?
కొండి : అది చెప్పనూ చెప్పింది. అయితే మాటల్లో మర్మము వుండవచ్చును కాని, కామశాస్త్రంలో చెప్పిన హావభావచేష్టల్ని పట్టి పండితముండా కొడుకుని ఆపాటి పోల్చలేనా? “స్తంభః ప్రళయరోమాన్‌చ శ్వేదో వైవర్ణ వేపదుః...”.
అక్కా : ఒక్కొక్కటి సెలవివ్వండి.
కొండి : తమర్ని స్మరించేటప్పుటికి "స్తంభః” స్తంభించిపోవడం. అక్కా : అగ్నిస్తంభమా జలస్తంభమా?
కొండి : స్తంభమనగా నిత్సేష్టగా నిలిచిపోవడము.
ప్రళయ : ఇంద్రియ వ్యాపారాలు అణగడం.
రోమాంచ : వెండ్రుకలు పులకరించడము.
స్వేదం : చమట పొయ్యిడం.
వైవర్ణ్యం : తెల్లపోవడము.
వేపదు : వణకడంము.
ఇవియన్నియు ప్రేమాతిశయ ద్యోతకాలు.
అక్కా : నా వ్యాఖ్యానం వింటారా? దొంగపని చేసి పట్టుబడి బొంకలేకపోతే తెల్లపోవడం, ఒక సరసుడుండగా, మరోసరసుడొస్తే స్తంభః అనగా ఒకడ్ని స్తంభం చాటున దాచడం. సీతాకాలములో సరసుల్లేకుండా వంటరిగా పడుకొంటే వేపదుః, రోమాంచ, అడిగినప్పుడు సరసుడు డబ్బు యియ్యకపోతే ప్రళయం, ఇవి హావభావచ్చేష్టలు.
కొండి : బంగారం గీటు గియ్యనిది నాణెం చెయ్యరు గదా. పండు రుచి చూడందీ తారీపు చెయ్యరు కదా. స్త్రీని అనుభవించి యెంచాలి. సుఖాలు అనుభవ వేద్యాలు గాని వర్ణింప వీలైనవి కావు.
అక్కా : సత్యభామని నేను తగులుకుంటే, యింట్లో యిల్లాల్ని యెవరికివప్పచెప్పను.
కొండి : తమ యిల్లాలు సాక్షాత్తూ రుక్మిణీదేవిలాగు కీర్తి ప్రతిష్టలు సంపాదించి వున్నారు. జ్ఞాపకం తెచ్చారు. వారి నోములుకి నా పౌరోహిత్యం మానివేశారు కదా.
అక్కా : మీరు కాలం అంతా లౌక్యంలో వెళ్లబుచ్చుచున్నారు. చిన్ననాడు చదువుకున్న ముక్కలు జ్ఞాపకం వున్నాయో లేవో.
కొండి : దానిముండా మోసిపోయెను. నిలుచున్నపట్లాన యజ్ఞాదీక్రతువులు చేయించమంటే | చేయించి వేస్తాను కదా, నోములు చేతకాదూ?
అక్కా : తమరే శలవిచ్చారు గదా కంసాల్లు బ్రహ్మల కంటే అధికులని, అంచేతనే వీర సభాచార్యులు మా యిళ్ళలో పౌరోహిత్యం చేస్తున్నాడు.
కొండి : తమకియిదో మెహనత్తు కాదు కాని, మంజువాణి దగ్గర నుంచి చిన్న పని తీసు కొచ్చాను. చిత్తగించారా (పంచకొంగున కట్టబొడ్డు దగ్గర ముడిచిన బంగారపు కమల్ పఠామొలతాడు తీసి) యిది చెరిపి బంగారు గోవతాడు చేయించమంది. అక్కా : (స్వగతం) యిది మాతండ్రి, పంతులు తల్లికి తయారు చేస్నిది. యింత పనివాడితనం వున్న యీ పాలెలు చితగొట్టుటకు చేతులు యెలా వస్తాయి. ఇది పంతులు యింటి వద్దపోయినదని కలవిలపడి వూరుకున్నాం. కానియ్యి! ఇది పంతులు భార్యకు యిచ్చి వేస్తాను (ప్రకాశం) యెంతట్లో కావాలి.
కొండి : యెంతవేగం వీలైతే అంత వేగం కావాలి.
అక్కా : సరే (మొలతాడు పెట్టిలో పెట్టి తాళం వేసి) మీకుర్రవాడు వచ్చినట్టుంది. చదువెలాగు వుంది?
కొండి : ఈ సరికి బాగా వుంది. యిప్పుడు మెట్రికిలేషను పరీక్షకు కడతాడు. యిరవై రూపాయీలు కావాలి. తమవంటి వారి సహాయం వుంటే గాని గట్టు దాటదు.
అక్కా : (ఇరవయి రూపాయీలు పెట్టిలోనుంచి తీసి యిచ్చి) గుప్తదానము యిది. యెవరితో చెప్పకండి.
కొండి : (అక్కాభత్తుడి చెవిలో) చూశారు మంజువాణి, డబ్బు లక్ష్యంగాని, డబ్బు జాగ్రత్తగాని వున్న మనిషి కాదు. బంగారం కరగడంలో కొంచెం కొంచెం చెయ్యి తడి చేసుకోవచ్చును. మా వాడి వివాహం వొకటి తటస్థించింది. డబ్బుకి వ్యాపకపడుతున్నాను.
అక్కా : అలాగేకానియ్యండి. తూనిక మీరు శెలవిచ్చి నట్టు అందాదుగా చూసుకొందాం. ఈసరకు యిలాగే వుంచీ నా దగ్గర బంగారం పెట్టి జమిలిగోవాతాడు తయారుచేస్తాను. కాని మీ కుర్రవాడు భూమిగుండ్రంగా వుండునని, రామాయణం అబద్దమని అంటాడట. మీరు విన్నారా? అవునుగాని వెంకన్నకి యింగ్లీషెందుకు చెప్పించారు గారు?
కొండి : ఒక్కడికి చెప్పించడమే కృత్యాద్యవస్తగా వుంది. ఇద్దరికీ చెప్పించడం నా తరమా?
అక్కా : వెంకన్నకే ఇంగ్లీషు చెప్పించి, రామ్మూర్తికే కావ్యాలు యెందుకు చెప్పించారు కాదు?
కొండి : అక్కాభత్తుడు గారు! అన్నీ యక్షప్రశ్నలడుగు తారు. మనమా చేసీవాళ్ళం. జాతక యోగం వుండాలి.
అక్కా : యోగం యెలావుంటే అలా వుండనియ్యండి కాని వెధవ ముండనెవర్తినీ పెంళ్లాడకుండా వివాహం ముందు చెయ్యండి.
కొండుభొట్టీయము
ప్రథమాంకము
పంచమరంగము
(కొండిభొట్లు యింటి పెరట్లో పెంకిటిసాల, పొయి మీద నీళ్ళకాగు. పొయ్యిలో నిప్పు లేదు. నీరుకాయ పంచ అంగవస్త్రం ధరించి కొండుభొట్లు, నీళ్ళ కాగులోకి తన జుత్తు వదుల్తాడు. గావంచాతో తడిజుత్తు తుడుచు కుంటూ అంటాడు.)
కొండి : తల వెంట్రుకలకి శీతోష్ణాలు తెలియకుండా చేసిన భగవంతుడి ప్రజ్ఞ ఏమని పొగడనూ. లేకపోతే సీతకాలంలో తెల్లవారగట్లే చన్నీళ్లలో మునగడానికి మనిషా, మానా?
(వీభూతిబురిక గూట్లోంచి తీసి బాలరామాయణం చదువుతూ నుదుటికి జెబ్బలకీ గుండెకీ రాసుకొంటాడు. )
కూజంతం... రామరామేతి..... మధురం మధు రాక్షరం ఆరుహ్యకవితాశా ఆఆఖాం| వందేవా...ల్మీకికోకిలం. యఃఎర్భ సతతం రామ....
చప్పుడౌతుంది. లేచాడు గాబోలు. (గట్టిగా)
చరితామృత సాగరం అతృప్తస్తం మునిం వందే ప్రాచేత సమకల్మషం! గోష్పదీకృత వారాసిం మశకీకృతరాక్షసం
(రామమూర్తి ప్రవేశించును)
అబ్బీ మేష్టరుల్లేచాడ్రా?
రామ్మూ: మేష్టరుగారు యేటికి స్నానానికెళ్ళారు.
కొండి : యీచల్లో యేట్లో యలా స్నానం చాస్తాడ్రా? ఉద్దండ పిండంలా వున్నాడు.
రామ్మూ : మీకంటే యెవరైనా నయం.
కొండి : తండ్రిం తప్పట్టకూడదు; తెలిసిందా. మాతృదేవోభవ! పితృదేవోభవ! అని వేదం ఘోషిస్తూంది.
రామ్మూ : రాత్రి ఎక్కడకెళ్లారు.
కొండి : పెద్దల్ని పిన్నలు ప్రశ్నలడగకూడదు. యాభై యేళ్ళు దాటి తుదకి నీకా నేను సమాధానం చెప్పడం! నా బ్రతుకు అంతకొచ్చిందీ!
అంజనానందనం దేవం జానకీ శోకనాశనం!
కపీశ మక్షహంతారం వందే లంకాభయంకరం!
రామ్మూ : ఆ శ్లోకాలు కట్టబెట్టి, నేం జెప్పే మాట వినండి.
“ప్రాప్తీషోడశ వర్షాణి పుత్రంమిత్రవ దాచరేత్” అన్నాడు
కొండి : (చిన్న రాగి జారీ చేతపట్టుకొని నిల్చి)
నా శాస్త్రం ముక్క నామీదికే విసురుతున్నావ్? ఆ చెప్పే మాటేదో చెప్పు. యిటు పైని నువ్ తండ్రివి నేను కొడుకునీనీ.
రామ్మూ: మీరు రాత్రి రామసానిపంచనో పంతులుగారి పంచనో తిని పరుంటారని మా గురువుగారితో అమ్మ చెప్పేసరికి నా వొళ్లు నీరు విడిచిపోయింది. మీరు సాందాని కొంపకి వెళ్లడవైనా మానాలి, నేను మీ యింట్లో అడుగు పెట్టడమైన మానాలి.
కొండి : (నిర్ఘాంతపోయి) యేమంటున్నావ్?
రామ్మూ: మీ ప్రవర్తన బాగుంది కాదు.
కొండి : మతిపోయి మాట్లాడుతున్నావేమిటి? బ్రాందీత్రాగలేదు కద?
రామ్మూ: అదొక్కటీ తరువాయుండిపోయింది. మీరు సాని యింట్కి వెళ్లడం నాకు యిష్టము లేదు.
కొండి : గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని... నీ యిష్టం యెవరిక్కావాలి. ముండయేడుపుసంత. యేదొమ్మరి గుడిసెలూ దూరకపోతే యే అకార్యాకర్ణాలు చెయ్యక పోతే నీకు బోలిడేసి డబ్బు పోసి చదువెలా చెప్పిస్తున్నాననుకున్నావు.
రామ్మూ: సానికొంపలు తిరిగి తెచ్చే డబ్బు పెట్టి నాకు చదువు చెప్పించక్కరలేదు.
కొండి : అయితే మున్సబీదాకా చదుకోవూ? నీయధాన్న యిదివరకల్లా బోశ్ని డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే? ఇది వరకు తిన్నది మాత్రం దుష్ట డబ్బు కాదా యేమిటి? అది ముందు వెళ్లగక్కి తరవాత శ్రీరంగ నీతులు చెప్పు.
రామ్మూ: మీరు మన యింటి పరువు తీసేస్తున్నారు.
కొండి : ఓరీ! నీ పరువుకు తండ్రినయినానుకాను, రాముడు దేవుడు కాడని, వెధవ ముండల్ని పెళ్ళి చేసుకో మనే కిరస్తానపు వెధవలకు సానింటికెళ్తే తప్పొచ్చిందీ. నీ పెళ్ళి కూడా సమీపించింది. కిరస్తానంలో కలసిపోవాలనుకుంటే యీలోగానే కలసిపో నీమేనమామ కూతురు కొంపెందుకు తీస్తావు.
రామ్మూ: కిరస్తానంలో యెంత మాత్రము కలియను నేను.
కొండి : ఈ తండ్రి మీద తిరుగుబాటంతా ఏమిటి.
రామ్మూ: నేను బ్రహ్మ సమాజంలో కలిశాను.
కొండి : బ్రహ్మ సమాజం ఏమిటి? విష్ణుమతం, శివమతం అని సృష్ట్యాది నుంచి విన్నాం కాని, బ్రహ్మకి పూజెక్కడేడిసింది. పోనియ్యి: యే సమాజమయినా యెవణ్ణో మనదేవుణ్ణే పట్టుకుని కిరస్తానంలో కలియకుండా వుంటే చాలు.
రామ్మూ: కిరస్తానమతం అసత్యమతం - దాల్లో బుద్ధిమంతుడెవడూ కలియడు.
కొండి : అదిగో! ఆ మాత్రం మంచిమాట అన్నావంటే నాకు పరమానందం (కౌగలించుకొని) మున్సబీ పరీక్ష కోసం తెల్లవాళ్ల చదువు చదువుదు గాని, స్వేత ముఖులు కల్పించి మతం చెడగొట్టాలని వ్రాశిన సంగతులు ఒకటయ్నా నమ్మవద్దు. యివిగో యిరవై రూపాయ్యీలు తెచ్చాను. ఇవి కట్టి పరీక్షకు వెళ్లు.
రామ్మూ: (రూపాయీలు పుచ్చుకొని) సానింటికి వెళ్లడం మానేస్తే బాగుండును.
కొండి : మరో పరమార్థం మాట మనస్సులో వుంచు కోవాలి. విన్నారా? జాజిమొక్కకి పేడవగైరా అసుద్ధ పదార్ధములు వేస్తే మొక్క పెరిగి, పరిమళ భరితములగు పూలు పూస్తుంది. చెట్టుకి పేడవేశామని పుష్పాలకేమయినా అపవిత్రత వచ్చిందా? అవి దేవుడి నెత్తిమీద పెడతాం. అషువలెనే యే మాయోపాయం చేతనైనా ద్రవ్యం సంపాదించి పెద్ద అవస్తలోనికి వచ్చిన తరువాత వుచితంగా ధర్మంచేస్తే పాపాలన్నీ దహించుకుపోతాయి. నీ పెళ్లి అయిన తరువాత శివ పంచాక్షరీ మంత్రముపదేశం చేస్తాను. దాంతో ఐశ్వర్యము, ముక్తి కూడా లభిస్తాయి. పాపాలు యెగిరిపోతాయి.
రామ్మూ : (ఆత్మగతం)
కాష్టవాదం వల్ల కార్యం లేదు. యెంతయ్నీ పెద్దవాడు తండ్రిగదా (ప్రకాశం) అలగే.
(ఇద్దరూ నిష్క్రమింతురు.)