కొండుభొట్టీయము/ద్వితీయాంకము
కొండుభొట్టీయము
ద్వితీయాంకము
ప్రథమ రంగము
(కొండిభొట్లు యింటి అరుగుమీద చాప పరుచుకొని వెంకన్న కూర్చుని చుట్ట చేతితో పట్టుకొనును.)
వెంక : రాముడు చుట్ట మా ఠీవిగా కాలుస్తాడు. ముక్కులోంచి పొగ తెప్పిస్తాడు. ఆ విద్య పట్టుపడింది కాదు. (అగ్గిపుల్ల వెలిగించి చుట్ట ముట్టించుచుండగా తలుపు తియ్య బడును) (చటుక్కున చుట్ట, అగ్గిపుల్ల పారవేశి, తటాలున ముసుగెత్తి పడుకొనును) పార్వతమ్మ ప్రవేశించి గుమ్మము దగ్గర నిలువబడి; మెల్లగా “వెంకడూ! వెంకడూ” అని పిల్చును. వెంకన్న మారు పలకక నిద్రించినట్టు నటించును. పార్వతమ్మ అరికాలుగోకి తిరిగి నిమ్మళముగా “వెంకడూ, వెంకడూ! అని పిలుచును.
వెంక : (కాలు ముడుచుకొని) నిద్రపోతున్నానే.
పార్వ : దొంగనిద్ర పోతున్నావు! నువ్వు చుట్ట కాల్చడం సొంపు చూడలేదనుకున్నావా యేమిటి?
వెంక : చూశావూ?
పార్వ : చూశాను.
వెంక : బాబుతో చెబుతానంచావా యేమిషి? కాల్చడం మానేస్తానులే.
పార్వ : నే చెప్పినమాట వింటే చెప్పనులే గదా, చుట్టలు కొనడానికి రూపాయిలు కూడా యిస్తాను.
వెంక : చుట్టల శిఘాగోశెనుగాని, పది రూపాయలంటూ యిచ్చావంటె పొడుం దుకాణం పెట్టుకుంఛాను.
పార్వ : చెప్పినట్టు వింటె, పది కాదు యిరవై రూపాయీలు యిస్తాను....... యిప్పుడె యిమ్మంటావా యేమిటి ?
వెంక : యిచ్చావంటె నీకన్న పుణ్యాత్మురాలుందా?
పార్వ : అయితే లోపలికిరా... (అని గదిలోనికి వెళ్లును)
వెంక : (సావిడిలోనికి వచ్చి నిలుచుని పొడుం పీల్చి) పార్వతీ బహుదొడ్డ మనిషి... బాబుకంటె నయం. నేను పొడుంకొట్టు పెట్టానంటె వఝ్ఝల కొట్టుమీద వక్క దమ్మిడీ పొడుం చెల్లదు. పార్వ : (ఒక చేతితో విస్తరంటలో అట్లున్నూ, రెండవ చేతిలో రూపాయిలున్నూ పట్టుకొచ్చి అట్లు కింద వుంచి) అట్లు తిను.
వెంక : కాళ్ళూ చేతులు కడుక్కుని తడిగావంచా కట్టుకుని తింఛాను.
పార్వ : (తనలో) వెర్రివెధవా. (పైకి) మీ బాబు కాళ్లు కడుక్కొంది వీధిలోంచి వొచ్చిన బట్టతో తింటాడు కాని. నీకు అంతకన్న ఆచారం బలువయి పోయిందీ? తిన్నగా తిను.
వెంక : కాళ్లూ చేతులు కడుక్కోవద్దంఛావా ఏమిషి.
పార్వ : కాళ్ళు కడుక్కుంటే చప్పుడవుతుంది.
వెంక : చప్పుడవుతే యేమిషి?
పార్వ : (తనలో) మొద్దు వెధవ! (పైకి) అంతా లేస్తారు.
వెంక : (గట్టిగా) ఓ! హో! దొంగతనంగా తెచ్చావు?
పార్వ : నిమ్మళంగా మాట్లాడు. చెప్పినట్టు వినకపోతే రూపాయిలివ్వను.
వెంక : అనాచారంగా తింటే యిస్తానంఛావా (తినను)
పార్వ : పది రూపాయిలిస్తే యేం చేస్తావు?
వెంక : పొగాకు కొని పొడుం కొట్టు పెడుతాను. నేను పొడుంకొట్టు పెట్టానంటే వాడి కొట్టు పడిపోతుంది.
పార్వ : గట్టిగా మాట్లాడకు.
వెంక : నా పొడుం యెంత బాగా వుంటుందనుకున్నావేమిటి, చిన్న పట్టు పీల్చిచూడు. (అని ఎడమ చేతిలో మొలనున్న పొడుంకాయ చూపించును)
పార్వ : (ముక్కుమీద వేలుంచి) ఆడవాళ్లు పొడుం పీలుస్తారుట్రా? (పొడుంకాయ మొల్లోంచి తీసి రూపాయలు మొలలో ముడుచును. ఆలాగు చేయుటలో తన శరీరము వెంకన్న పార్శ్వమునకు తగిలించును.)
వెంక : (తనలో) యిదేమిషోయి మీదపడుతూన్నది.
పార్వ : (అట్టుముక్క తానుకొరికి వెంకన్న నోటి కందించును.)
వెంక : యిదేమిటి, యెంగిలితినమంచావా యేమిషి,
పార్వ : నేచెప్పినట్టు వింటానన్నావే? (అని నోటిలో కుక్కును. )
వెంక : (అయిష్టముతో మింగుతూ) యెంగిలి తినడానికి పది రూపాయిలు యిచ్చావంషావు? పార్వ : యింకా వుంది.
వెంక : యేమిటుంది?
పార్వ : యిదిగో (అని కౌగిలించుకొనును)
వెంక : వెధవముండా (అని విదిలించివేయును. పార్వతి నేలబడును, వెంకన్న పైకి పారిపోయి అరుగు మీద ముసుగు పెట్టికుని పడుకొనును. (తనలో) చచ్చానురోయి! యిదేమిటీ రంకుముండకి కాలం... రామ... రామ!
పార్వ : (చీపురు కట్ట తెచ్చి) గాడిద కొడుకా.. (అని కొట్టును)
(తెర దించవలెను)
ద్వితీయాంకము
ద్వితీయ రంగము
(అక్కాభక్తుడి యిల్లు)
వెంక : అక్కాబత్తుడూ - అక్కాబత్తుడూ (అని తలుపు కొట్టును)
అక్కా : యెవరది?
వెంక : వెంకన్న
అక్కా : (తలుపు తీసి పైకి వచ్చి) యేమిటి వెంకన్న.
వెంక : కొంప ములిగింది.
అక్కా : ములగడానికి నీకు కొంప వుంటేనా? మీచ్నిబాబు గారి కొంప ములిగినట్ట్నాయిన, శుభవార్త చెప్పు.
వెంక : కొంప ములిగింది.
అక్కా : యెందుకు తొందర - నింపాదిగా చెప్పు - దొంగలొచ్చారా? యిల్లంటుకుందా? యేదయ్నీ సంతోషమే.
వెంక : చెప్పనా?
అక్కా : (అరుగుమీద కూర్చుని) చెప్పు.
వెంక : నేను చెప్పను.
అక్కా : చెప్పకపోతే యింట్లోకి పోయి వెచ్చగా పరుంటాను. (లేచి తలుపు వైపు పోవును. ) వెంక : (అక్కాబత్తుడి దుప్పటి పట్టుకులాగి) నేను చెప్పుతాను. చెప్పుతాను.
అక్కా : (తిరిగి కూర్చుని) అయితే చెప్పండి.
వెంక : యెవరితో చెప్పరు గద!
అక్కా : యేమిటా మహా రహస్యం
వెంక : చెప్పరు గద - యిదిగో పార్వతి రాత్రి పడుకుంటే, మెల్లిగా లేపి మయిల బట్టలతో అట్లు తినమంది.
అక్కా : యిదా రహశ్యం, మైలబట్టలతో ఎందుకు తిన్నావు?
వెంక : (తలగోక్కుంటూ) పొడుం కొట్టు పెట్టుకోవడాన్కి పదిరూపాయిలిస్తానంది.
అక్కా : మరేమి! నీరొట్టి నేతిలో పడ్డది.
వెంక : నెయ్యి లేదు, వొట్టి రొట్టిలే పెట్టింది.
అక్కా : కొంప ములగడం?
వెంక : తను కొరికిన యెంగిలి రొట్టిముక్క తినమన్నది.
అక్కా : (నవ్వి) తిన్నావ?
వెంక : తిన్నాను.
అక్కా : (నవ్వు పట్టలేక మిక్కిలిగా నవ్వుతూ) రూపాయి లిచ్చిందీ?
వెంక : యిచ్చింది.... యిచ్చి....
అక్కా : యిచ్చి యేంచేసింది.
వెంక : మీదపడి కాగలించుకుంది. వెధవముండా అని తోసేసి అరుగు మీద వచ్చి పడుకున్నాను. ఆయంతా చీపురుగట్ట పట్టుకు వచ్చి వీపు పెట్లగొట్టింది. దాంతో మీ దగ్గరకు పారిపోయిచ్చినాను.
అక్కా : (నవ్వు పట్టలేక దొర్లును)
వెంక : యెందుకు నవ్వుతారేమిషి?
అక్కా : నవ్వక యేడవమన్నారేమిటి?
వెంక : నేను కూడా నవ్వనా?
అక్కా : అడిగి నవ్వుతారాయేమిటి? నవ్వు.
వెంక : (నవ్వును) అక్కా : అయితే యిప్పుడేంచేస్తావు.
వెంక : యేం చెయ్యమంటారు.
అక్కా : తిన్నగా వెళ్ళి అరుగుమీద పడుకో.
వెంక : చీపురుకట్ట ముతకది.
అక్కా : నిష్కారణం దెబ్బలు తిండం యెందుకు? పార్వతి చెప్పినట్టు చెయ్యి.
వెంక : వెధవతో సంగమం చెయ్యమంటావయ్య.
అక్కా : నీ పింతండ్రికంటను నువ్వు గొప్పవాడివా యేమిటి? ఆయన యెన్నో పాడు దేవాలయాలు ప్రతిష్ట చేశాడు.
వెంక : మా తండ్రి మహా యోగ్యుడు. అయ్య పేరు చెడగొట్టుతానా.
అక్కా : హాశ్యానికన్నాను. బహుధర్మంగా ప్రవర్తించావు. నిన్ను చూచి చినబాబు బుద్ది తెచ్చుకోవాలి. నీవు వేలలో యెన్నికైన మనిషివి. గాని రేపటి నుంచీ యేలా కాలక్షేపం చేస్తావు.
వెంక : మధోకరం.
అక్కా : నేస్తం! నేనువుండగా నీకా అవస్థ రానిస్తానా? ఆ పది రూపాయిలు యేం చేస్తావు?
వెంక : పార్వతికి పంపించేస్తాను.
అక్కా : నేను యంత మదుపు పడితే అంత మదుపు పెట్టుతాను. పొడుం కొట్టుపెట్టి నీ కాలక్షేపము పోగా మనకి లాభం కూడా వస్తుంది.
(యిద్దరూ నిష్క్రమింతురు.)
కొండుభొట్టీయము
ద్వితీయాంకము
తృతీయ రంగము
(రామమూర్తి, చేతులు కట్టుబడి పార్వతమ్మ ప్రవేశించును)
రామ : యిదేమిటి పార్వతి.
పార్వతి : (కంట నీరొలుకుతూ వూరుకుండును. )
రామ : (దగ్గిరచేరి కూర్చుని) యే దుర్మార్గులు కట్టారు నీ చేతులు.
పార్వతి : (మాట్లాడదు. )
రామ : (వెంట్రుకలు సవరించి, ముద్దు పెట్టుకొని చేతులు కట్లువిప్పి) యెవరు నీకీ అవస్థకి కారణభూతులు.
పార్వతి : వెంకడు.
రామ : వేధవని యెముకలు విరగదంతాను.
(యిద్దరూ నిష్క్రమింతురు)
కొండుభొట్టీయము
ద్వితీయాంకము
చతుర్ధ రంగం
(పొడుం దుకాణం)
వెంకన్న: (పొడుం చేస్తూ ప్రవేశించును. )
రామమూర్తి : యెందుకురా వెంకా చేతులు కట్టావు?
వెంకన్న: యెప్పుడొచ్చావు రాముడూ? పరీక్ష ప్యాసయిందిరా?
రామమూర్తీ : దున్నపోతు. అడిగిన మాటకు జవాబు చెప్పవేమి?
వెంకన్న :(పొడుంకర్ర పడవేసి నిర్ఘాంతపోయి జూచును) యెందుకురా రాముడు యీ కోపము.
రామ : పార్వతి చేతులు కట్టినందుకు ఇదిగో, పూనితీసి వో లెంపకాయ (అని కొట్టును)
వెంక : (బుగ్గ తడుముకుంటూ) యెవర్రా కట్టారు పార్వతి చేతులు.
రామ : నువ్వు కట్టావని చెప్పింది.
వెంక : నేను కట్టానని చెప్పిందా వెధవముండ.
రామ : వెధవముండని దాన్ని తూల్నాడితే మరో లెంపకాయ తీస్తాను.
వెంక : వెధవముండ కాకుంటే పునిస్త్రీ ముండనమంఛావురా! యీ మాటు లెంపకాయ తీస్తే ఆ మండ విరిచేస్తాను. విన్నావా..... ఒక దెబ్బకి మా రాముడివి కదా అని వూరుకున్నాను.
రామ : (పస్తాయించి) అయితే నువ్వు కట్టకపోతే దాని చేతులు ఎవరు కట్టారు ?
వెంక : అదేమో నాకేం తెల్సును. నెల రోజులాయి నేను యింటికే వెళ్ళలేదు.
రామ : (కూర్చుని ఆశ్చర్యముతో) యేంచేతరా? అబద్దమాడిందా.... అబద్దమాడి వుండదు.... నే వినడం తప్పు కావచ్చును... యెంచేతరా నెలరోజులాయి ఇంటికి వెళ్ళలేదు?
వెంక : యెంచేతనంటే... చెప్పకుమా పొడుం కొట్టు పెట్టుకున్నాను.
రామ : మా నాన్న గెంటేశాడా యేమిటి?
వెంక : మీ నాన్న నెలరోజులాయి వూళ్ళో లేడు.
రామ : నీ మానాన్న నువ్వు బతకాలని బుద్దిపుట్టిందా యేమిటి?
వెంక : అవును రాముడు. పొడుం మా బాగా తయారుచేస్తాను. మీ తట్టు పొడుం యిలా వుంటుందిరా. ఒక పట్టు పీల్చు
రామ : (పీల్చి) మా మజాగా వుందిరా. ఏం వేస్తావేమిటి?
వెంక : యే వేస్తానా? మకోబా పిక్క వేస్తాను... ఘుమఘుమలాడుతుంది. ఓ పెద్ద పొట్లం పుచ్చుకో... నీకు యెప్పుడు కావలిస్తే అప్పుడు పొట్లాము యిస్తాను.
రామ : వెంకన్నా! నీవు చాలా మంచివాడివిరా.
వెంక : నేను మంచివాణ్ణిరా?
రామ : అవును.
వెంక : మరి నన్నెందుకు కొట్టావు?
రామ : బుద్ది తక్కువచేత !
వెంక : మరెప్పుడూ కొట్టవు గద?
రామ : కొట్టను.
వెంక : రాముడు ! నువ్వు మునసబు పనిచేస్తూ వుంటే నేను వచ్చి, “వారె రాముడు!” అని పిలుస్తాను. కోప్పడవు గద.
రామ : కొప్పడను... యింటికెళ్ళిపోయిరా!
వెంక : అమ్మా.. నేను రాన్రా.
రామమూర్తి : యిన్నాళ్ళు అన్నదమ్ముల్లా ఉండి, యిప్పుడు వేరుంటావురా?
వెంకన్న: చీపురుగట్ట ... (అని వీపు తడుము కొనును.)
రామమూర్తి : నీకేం ప్రాలుబ్దం. చీపురుగట్టతో స్వయం యిల్లు తుడుచుకోవడం... వంట చేసుకోవడం నాకేం మనస్కరించలేదు.
వెంకన్న : వొరే రాముడూ! వంట ఓ సొగసుగా చేస్తానూ.... చినబాబు దేశాంతరం వెళ్ళుతే నేనే గద వండుతాను. యీ రాత్రి వుల్లిపాయల పులుసు చేస్తాను వస్తావా?
రామమూర్తి : యెందుకు శ్రమ పడుతావు. నా మాట విని యింటికి వెళ్ళిపోయిరా.
వెంకన్న : యెంత డబ్బొస్తూందంటావంటె... రెయిలు వచ్చినప్పుడల్లా అక్తాబత్తుడు పొట్లాలు పంపిస్తాడు. ఒక రూపాయి పొట్లాలు చెల్లుతాయి. మా పొడుం వూరు వూళ్ల వాళ్లు కొనుక్కుపోతారు. వఝ్ఝలు కొట్టు యెత్తేశాడు. ఒక రహశ్యం విన్నావూ.
రామమూర్తి : ఆరహశ్యమేమిట్రో?
వెంకన్న :పొడుం షడక్షరని ఒక మహా మంత్రం వుంది. కంసాలి గురువు వీరనాభాచార్యులు దగ్గిర ఉపదేశమయి పునశ్చరణ చేశాను. శిద్ధయింది.
రామమూర్తీ : నాకు చెప్పుతావురా ఆ మంత్రం.
వెంకన్న : చెప్పుతే తల పేలిపోతుందీష, ... గురువు చెప్పాడ్రా...
రామమూర్తి : మంత్రాలబద్ధం. శ్రమపడి పునశ్చరణ చెయ్యకు.
వెంకన్న : అదొక్కటేన్రా? నీ దగ్గిర దౌర్భాగ్యపు గుణం... తెల్లవాడి మాట నమ్మేసి మన గ్రంథాలన్నీ అబద్ధం అంఛావు... నాకు దాఖలా యిస్తేనే. స్వప్నంలో మంత్ర దేవత నానా భర్ణ భూషితురాలవు కుంచున్నూ బంగారపు పొడుం కర్రతో వీపు మీద వేశింది. దాంతో తెలివొచ్చింది. మరి ఆవేళ నిద్రపోలేదు. నిద్రపోతే ఫలం పోతుందిష.
రామమూర్తి : పూర్ ఫూల్ (poor fool).
కొండుభొట్టీయము
ద్వితీయాంకము
పంచమ రంగము
(అక్కాబత్తుడు, వెంకన్న ప్రవేసించును.)
అక్కా : యేమిటి కబుర్లు?
వెంకన్న: మా రాముడు పరీక్ష ప్యేసు అయినాడు? యీ వేళే పట్నం నుంచి వచ్చి వో లెంపకాయ తీశాడు.
అక్కా : యెందుకేమిటి?
వెంక : పార్వతి చేతులు యెవడో కట్టాడుష,
అక్కా : యెవడో కట్టలేదు. వీధి దగ్గిర నిలుచుని తోవంటెపోయే వాళ్ళని చూస్తూవుంటే, మీ మేనత్తతో ఖాయిదా పెట్టమనినే చెప్పాను. అంచేత చేతులు కట్టింది.
వెంక : మా మేనత్త కడితే రాముడు నన్నెందుకు కొట్టాడు ?
అక్కా : నీ సత్యకాలము చూసి. రామమూర్తికి గూబకదలేశావు కాదు.
వెంక : రాముణ్ణి కొడుతానా! వాడ్కి మునసబీ అయితే “వారే రాముడూ” అని పిలుస్తాను. వాడి పెళ్ళి చేస్తాను.
అక్కా : నువ్వే చేస్తావూ?
వెంక : (పొడుం పీల్చి) ఆ నేనే! మా చిన్నాన్న వచ్చి నన్ను కౌగలించుకు యెత్తి యింటికి తీసుకుపోయినాడు. యివాళనుంచి మా యింట్లోనే భోజనం. ష్టాంపు సంతకము చేసి వెయ్యి రూపాయీలు తెచ్చి మా మామకిచ్చాను.
అక్కా : యంత బుద్ధి తక్కువ పనిచేశావు. నాతో చెప్పందీ యెందుకు సంతకం జేశావు.
వెంక : రాముడికి పెళ్లి చెయ్యవొద్దంఛావా యేమిషి?
అక్కా : యంత పనిచేశావు! (ఆత్మగతం) దీనికేమిటీ ప్రతీకారం? (ప్రకాశముగా) రెయిలు వేళయింది పొట్లాలు పంపించు.
(యిద్దరూ నిష్క్రమింతురు. )
కొండుభొట్టీయము
ద్వితీయాంకము
షఠ్విరంగము
(కొండుభొట్లు ప్రవేశించును.)
(రెయిలు వచ్చును. ఫస్టు క్లాసు బండిలో, జరీ టోపీ, కన్ కాఫ్ ఫాయిదామా మొదలయ్న పోషక్ వేసుకొని త్రివిక్రమరావు పంతులు కిటికీలో నుంచి తొంగిచూచి “అల్లీఖాన్- అల్లీఖాన్” అని నౌఖర్ను పిలుచును.)
కొండు : యే తాలూకా వారు వీరు - యే తాలుకా రాజా వారు వీరు (అని దగ్గర నున్న వార్ని అడుగును.)
దగ్గిర వున్నవారు : మాకు తెలియదు.
కొండు : (త్రివిక్రమరావు పంతులుగారి దగ్గరకు వెళ్ళి) ప్రభువువారు జాజి నగరం జమీందారు వారనుకుంటాను.
త్రివిక్రమరావు : అలాగే నన్ను చూసి అంతా అనుకుంటారు. మేము తుమ్మల పాలెం మొఖాసాదార్లం. మాకు భూములవల్ల పది పదహారు వేల్దాకా వస్తాయి.
కొండు : నా విష్ణుః పృథ్వీపతిః అన్నాడు. భూస్వాములు కాకపోతే ఆ రాజవర్ఛస్సు యెలా వస్తుంది. తమ నాయనగార్ని మా బాగా యెరుగుదును. నాయందు వారికి చాల దయ. పిల్ల జమీందార్లును - అఖండ అన్న ప్రదాతలును - ప్రభువు వారు యిక్కడ దిగుతారు? పైకి దయచేస్తార? యిక్కడ దిగేటట్టయితే మా యిల్లు విశాలంగా వుంచుంది. యే విధమయిన యిబ్బందిన్నీ వుండదు. యీ గ్రామం గొప్ప క్షేత్రం. పాండవ ప్రతిష్ట కోదండ రామస్వామి వారు స్వయం వ్యక్తం.
త్రివి : మేము విలాసార్థం దేశం చూదామని విజయం చేస్తున్నాం. మీ గ్రామంలో చోద్యాలేమయ్నీ వుంటే రెండు పూటలు గడుప అభిప్రాయం కద్దు.
కొండు : చోద్యం అంటే పాతకోట కద్దు - సీత గుండం కద్దు. స్వామివారి ఉద్యానవనం కద్దు. అందులో మంటపము, దేవ నిర్మాణం దేవాలయం. నౌఖరీ చేసేవారు యాభయి యిళ్లు భోగం వాళ్లు వున్నారు. మంచి విద్యావంతులు - రూపవంతులున్నూ.
త్రివి : అయితే యిక్కడ దిగుతాం.
కొండు : యేమర్రా - ఓయి - కళాసులు.
త్రివి : సాయిబు వున్నాడు - మీరు శ్రమ పడకండి.
కొండు : పరాయిలపనా యేమిటి? తమ పనికి నా కభ్యంతరము లేదు.
అల్లీఖాను : (ప్రవేశించి) నీకీ పైకీ చలోజీ
కొండు: నేను సామాను అందిస్తాను. నువ్వు బహర్‌రఖో.
అల్లీ : నాకి బాత్ నకోజీ - నీకి సామాన్ మత్‌పకడో.
కొండు : అమ్ముకి తక్లేఫ్ నహి (అని అటూ యిటూ సామానుతీస్తూ సీసా గళాసులు తన్నివేసును)
అల్లీ : అరే బంచూత్ కామ్‌కియా.
కొండు : అపరాధం - అపరాధం
త్రివి : అవి మనవి కావండి - యెవడో దొరవొదలి వెళ్ళి పోయినాడు. (అని వూరుకొమ్మని సాయిబుతో సంజ్ఞ చేయును)
కొండు : నేను పరాయివాణ్ణి కాను - నేను శాక్తేయుణ్ణీని. వామాచార తత్పరుణ్ణిన్ని - నా దగ్గిర ప్రభువు వారు అరమరవుంచవద్దు - రండి - ప్రభువు వారు దయ చెయ్యండి. సామాను వెనుక నుండి తీసుకువస్తారు.
టిక్కెట్టు కలెక్టరు: (ప్రవేశించి) కొండుభొట్టు చెయ్యి పట్టుకు లాగి - ఫస్టుక్లాసు బండీలోంచి దిగుతూ వుండగా నేను కళ్ళార చుశాను.
కొండు : అది యెవర్ని చూచి నేననుకున్నావో - వొంటి మీద చెయి వెయ్యకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి - నీ మీద డేమేజీ దావా తెస్తాను. (కొండుభట్లు త్రివిక్రమ రావు గారి వేపు తిరిగి) చిత్తగించారా ప్రభువు వారు యీ మూర్ఖుడికి యింగ్లీషున నాలుగు చివాట్లు రానియ్యండి శ్రోత్రియుణ్ణైన బ్రాహ్మణ్ణి అమాంతముగా ముట్టు గుంటారు! తల పగిలిపోతుంది.
టిక్కెట్టు : యీ కబుర్లెందుకు పదండి ష్టేషన్ మేష్టరు దగ్గరకి.
కొండు : పద, నాకేం భయమనుకున్నావ యేమిటి? (త్రివిక్రమరావు పంతులుగారితో) యిప్పుడే వస్తాను. తాము వొక్క నిమిషం ప్రభువు వారు కుర్చీమీద కూర్చోండి. (రంగనాయకులు సెట్టి తొందరగా ప్రవేశించి కొండుభట్లు చెవిలో యేమో చెప్పును. కొండుభొట్లు ఆందోళన పడును. యిద్దరూ ప్రత్యేకము మాట్లాడడముకు ఒకే ప్రక్కకు వెళ్లిపోదురు.)
టిక్కెట్టు క. : యెక్కడికి వెళ్ళుతావు ష్టేషను మాష్టరు దగ్గరకి రా!
శెట్టి : ఏమిటీ అల్లరి
కొండు : నేను ఫష్ణు క్లాసులో కూచున్నాని ప్రాణం పుచ్చుగుంటున్నాడు.
శెట్టి : యెళ్ళు! బాపనోళ్ళ మీదే నీ ఝంకారమంతాను. యింద! సుట్ట ముక్కలకి (అని ఒక అణా చేతితో పెట్టును. )
కొండు : కొంప ములిగింది. హఠాత్తుగా చచ్చింది, ముండ! యింత వేగం ఛస్తుందని నే నెరుగను. లేకుంటే వూరు దాటుదునా? అయితే మంజువాణిని ఎవరయినా ఆదుకున్నార? ఆమెకు యెవరు భరాసా యిస్తూన్నారు... నువ్వు వెళ్ళావు కావు.
శెట్టి : అంతా రత్నాంగే. మరెవరు నేను వెళితే కట్టి పట్టుకుని వెంట తరుముతుంది.
కొండు : అయితే మనకేం చెయిజిక్కదు కాబోలు.
శెట్టి : సిక్కకేం! మీరు బేగెల్లి సుళువు చెయ్యండి.
కొండు : యేం సుళువు చెయ్యడం ? బుద్ధిమాల్ని వెధవని. నాలుగు రాళ్లకి ఆశపడి రామసానికి అంత జబ్బుగా వున్నప్పుడు వూరు విడిచివెళ్లేను.
శెట్టి : బుద్ధి తక్కువకు లెంపలాయించుకుని బేగెళ్లి కథ యెలా వుందో కనిపెట్టండి.
కొండు : సరేగాని ప్రొద్దుపోతూంది. నువ్వు ముందు వెళ్ళి పెరటి గుమ్మం దగ్గర వుండు. నే నిప్పుడే ఆ బోడి పంతులిని బసకు దిగబెట్టి వచ్చి కలుసుకుంటాను... (త్రివిక్రమరావు పంతులుగారి వద్దకు వెళ్ళి) ప్రభువు వారు దయచెయ్యాలి... యేదిరా గుర్రబ్బండీ. తీసుకురా జట్కా! ప్రభువువారి హోదాకి తగినది కాదు కాని - కుచేలుడింటికి శ్రీకృష్ణమూర్తి వారు విజయం చేసినట్టు అనుగ్రహించాలి... సాయిబూ, మా బసకి పోనీయి. ఈ సామాను పట్టించుకుని నౌకర్లతో కూడా నేను వస్తాను.
వెంకటస్వామి : నా గాజు సామానుకు వేరే బండి కావాలి.
కొండు : ఈ బండీ నీకు.
అచ్చన్న: నా లాంతరుకి కొవ్వొత్తులకి వేరే బండీ కావాలి.
కొండు : ఈ బండీ నీకు
అల్లిఖాన్ : పంతులుగారి హుక్కాకీ, లేహం డబ్బాకీ వేరే బండీ కావాలి.
కొండు : ఈ బండి నీకు.
అల్లీ: పంతులుగారి పోషక్‌కు వేరేబండి కావాలి.
కొండు : దానికీ బండి.
బుచ్చన్న: వంట సామానుకో బండి కావాలి.
పాపన్న : ప్రత్యేకం నాకొకబండి మామూలు.
కొండు : మరిలేవు పొండి.
పాప : స్నేహితుణ్ణి, ఆశ్రితుణ్ణి -
కొండు : మరిలేవుబళ్లు, ఒక్కొక్కరే ఓ బండీ యెక్కి వాళ్లు వుడాయించారు.
బుచ్చ : అయితే యీవాళ పంతులుగారు పస్తు పడుకోవాలీ....
కొండు : నడిచి వెళ్ళిపోదాం - మరి బళ్లు దొరకవు.
బుచ్చ : సామానెవడు మోస్తాడు.
కొండు : కూలివాడు ఒకడూ కనపడ్డూ - మనమే మోసుకుపోవాలి.
పాప : మనం - తిమ్మనం - ఆ పప్పుడకదు. నేను ఒక్క వస్తువయినా పట్టుకోను.
బుచ్చ : దొబ్బితిని, భంగుతాగి పంతులుతో మజా ఉడాయించడాన్కి నువ్వున్ను, అరవచాకిరీ చెయ్యడాన్కి నేనూనా!
పాప : బ్రహ్మదేవుడు నీకలా రాశాడు. నాకిలా రాశాడు. కావలిస్తే బ్రహ్మదేవుడితో వెళ్ళి ఫిర్‌యాద్ చేసుకో. శాస్తుల్లు గారు యీ వూళ్లో డాన్‌సు కథ యేమయినా వున్నదా యేమిటి - లేకుంటే పంతులు పడడు.
కొండు : యీ దేవాలయం నౌఖర్లులో మంజువాణి సాక్షాత్తు రంభావతారం, వుంది.
పాప : యెవరైనా వుంచుకున్నారా?
కొండు : నరహరిరావని ఒక పంతులు వుంచుకున్నాడు.
పాప : అయితే మా పంతులికి అవకాశం యెలాగ?
కొండు : నేను కొంచెము వైద్యము కూడా చేస్తాను. పంతులుకి పైత్యాధికం పోవడానికి అప్పటప్పట విరోచన సాధనం చేస్తాను. దాంతో మూడు నాలుగు రోజులు మంజువాణికి ఆట విడుపు కలుగుతూ వుంటుంది.
బుచ్చన్న : నువ్వు పాతర సామాను పట్టుకుంటే నేదీనస్సు పట్టుకుంటాను.
కొండు : నా ప్రారబ్ధం కాలితే నా స్వగ్రామంలో మూటలు మొయ్యమంటావు.
బుచ్చ : అంత పౌరుషముంటే - వెదికి కూలాణ్ణి యెవడ్నయినా తీసుకురా.
(కొండుభట్లు నిష్క్రమించును.)
(తెర దించవలెను)
కొండుభొట్టీయము
ద్వితీయాంకము
సప్తమ రంగము
(మంజువాణి పెరటి యింట్లోగది. ఆ గదిలో ఒక వైపు పెద్ద పాత పందిరి మంచము, ఒక మూలకు ఒక పాతబోను పెట్టె గోడవైపు రెండు పెద్ద జాడీలు, గోడలకు బల్లల పీటలు, వాటి పైని బొమ్మలు పాతపఠాలు, పందిరి మంచము క్రింద యిత్తడి సామానులు.)
(చింపిరితల, కొంచము మాసినబట్టతో కనకవల్లి, దువ్వినజుత్తు, తగు మాత్రం అలంకారం, కావిరంగు చీరతో మంజువాణి, ఒక జాడీకి యీ ప్రక్కనొకరు, ఆ ప్రక్కనొకరు నిలిచివుందురు. రత్నాంగిచేతిలో, ఒక వెలుగుతూ వున్న కొవ్వొత్తి, జాడీ దగ్గర ఒక మొక్కల పీటపైని, బంగారపు సరుకులు, మరి ఒక పీట మీద వెండి సామాను, ఒకవేపు బట్టల మూట.)
రత్నాంగి కొవ్వొత్తి వెలుతుర్ని - జాడీ నాలుగు మూలల తొంగి చూచి - తలయెత్తి - యింతే - మరిలేదు - యేవఁనుకుంటావు? యిరవై ముఫ్ఫై వేలకు చేకురుతుంది. యింత గణించిందని, యవరూ యెన్నడూ అనుకోలేదు. బతికి నిన్ను బాధ పెడితే పెట్టింది కాని చచ్చి నీకు కనకాభిషేకం చేసింది. లోకం కోసమయినా కంటతడి పెట్టావు కావు.
మంజు : చచ్చిందని సంతోషించుతూ కంట నీరు పెట్టడం యెలాగ?
రత్నాంగి : నవ్వులు, కన్నీళ్ళు, భోగం దానికి తలిచే టప్పటికి రావద్దా?
మంజు : నేను భోగం దాన్నా?
రత్నాంగి:నాలుగేళ్ళు సానెరికం చేసి, యింకా సంసార్ని అనుకుంటానా?
మంజు : నమ్మక స్వామిద్రోహము చేసి నన్ను అమ్మి కొండుభొట్లూ, డబ్బిచ్చి కొని రామసానీ నాలుగేళ్ళు యీ చెరలో పెట్టారు - దేవుడు యిన్నాళ్ళకి చేరవొఁదిల్చాడు. యీ డబ్ళు నాకు యివ్వాలని ఆ పిశాచం యిచ్చిందా యేమిటి? యీ డబ్బు నాకు దేవుడు యిచ్చాడు. నన్ను బెట్టి అది యెంత ఆర్జించింది? యిక స్వేచ్ఛగా బతుకుతాను.
రత్నాంగి : అనగా?
మంజు : వొకరి బాధ లేకుండాను.
రత్నాంగి : యెవరి బాధ?
మంజు : రామసాని బాధ వొదిలిపోయింది - యిక పంతులు బాధ.
రత్నాంగి: (జాడీలో సరుకులు ఉంచడం మాని నిలిచి) నా మాట కొంచెం వింటావా?
మంజు : నీకంటె నా మంచి కోరిన వారెవరున్నారు.
రత్నాంగి : అట్టి నమ్మకం వుంటే పది రోజుల కాలం పాటీ తోవనే జరగనీ.
మంజు : అయితే నీ యిష్టం.
రత్నాంగి:అలసివున్నావు. వెళ్ళి పడుకొని నిద్దర తెచ్చుకో.
మంజు : అలాగె, కాని నిద్దర రావడం యెలాగ? యీ మంచం మీద యింకా పడుకుందేమో అని బితుకు వేస్తూంది. దేయ్యవైందేమో?
రత్నాంగి:చచ్చిన వుత్తర క్షణం వెర్రి కుక్కయి పుట్టి వుంటుంది. మనుషుల్ని పీక్కుతినే పిసినిగొట్లకు అదే గతి. ఆంజనేయ దండకం చదువుకుంటూ పడుకో (మంజువాణిని కాగలించుకొని జుత్తు సవరించి ముద్దు పెట్టుకొని) వెళ్ళు, పడుకో.
మంజు : నీకీ రాత్రి జాగరవేఁనా?
రత్నాంగి : లేకుంటే ప్రమాదం వుంది - డబ్బు పాపిష్టిది - యెవరి కే దుర్వూహలు వున్నాయో?
మంజు : వొక్కర్తవీవుండడానికి భయం వేఁయదా?
రత్నాంగి:బతికివున్నప్పుడు భయపడందానికి చచ్చిం తరువాత భయపడుతానా?
(మంజువాణి పైకి వెళ్లును. రత్నాంగి తలుపు వేసి లాంతరు వెలిగించి తిరిగి చూసును. మూలనున్న పెద్ద జాడీలోంచి కొండుభొట్లు లేచును - రత్నాంగి గుండె ఝల్లుమని కొవ్వొత్తి జారవిడుచును - కొండుభొట్లు వూరుకొమ్మని చేత్తో సంజ్ఞ చేసును -రత్నాంగి కొవ్వొత్తి తిరిగీ తీసుకొని కొండుభొట్లు దగ్గరకు వెళ్లును)
కొండు : మంచి యెత్తు యెత్తావు. నీ అంత బుద్ధి మంతురాలు లోకంలో లేదు.
రత్నాంగి:మీ కంటేనా?
కొండు : అంచేతనే మనవుభయులం యిక్కడ కలిశాం.
రత్నాంగి:యిన్నాళ్లు యిటు కనపడితే అటు మొహం తిప్పేవారే?
కొండు : ఆ రాక్షసి ముండ రామసానికి నీ పేరు చెబితే యిష్టం లేకపోయేది. మరిదాన్ని ఆశ్రయించుకు బతక్క తీరేది కాదు; అంచేత నీకు యెడ యెడంగా తిరిగే వాణ్ణి గానీ నీచతురతా - నీ విద్యా - నీ ధర్మబుద్ది - చదువుకున్న వాణ్ణి నేను కాన లేదనుకున్నావా? ..... తెల్లవారేసరికి యీ సరుకులన్నీ కరగడానికి తగిన సాధన సామగ్రి సిద్దంగా వుంది. వొంతులు యేర్పర్చేయి - నన్ను మాత్రం కలుపుకున్నావంటే పోలీసు గీలీసు నిన్ను ముట్టలేరు - మంజువాణి డబ్బు విలువ యెరగదు. మనం యెంత వుడాయించినా పోల్చలేదు.
(కొండుభొట్లు రత్నాంగి భుజం మీద చేయి వేసి)
కొంచెం ఆసరాయియ్యి పైకి రావడం దండ ఘడియ పడుతుంది. కాళ్లకి కొంచెం మేహవాతనొప్పులు.
(రత్నాంగి కొండుభొట్లుచేయి విదల్చి సరుకులు జాడీలో పడివేయ నారంభించును.)
కొండు : సరుకులు జాడీలో పడివేస్తున్నావేమి?
రత్నాంగి:జాడీతో కూడా పట్టుకుపోవడానికి.
కొండు : జాడీ యెలా మోసుకువెళ్లడం.
రత్నాంగి : జాడీ మొయ్యడానికి మనుషులున్నారు.
కొండు : యెందుకు వృధా శ్రమ-నలుగురికీ తెలియడం. నా మాట విని యీ గావంచా గుడ్డలో కట్టు (గావంచా చుట్ట చుట్టి రత్నాంగికి విసురును) నీకు యీ విద్యలో ప్రావీణ్యత తక్కువగా వున్నట్టు కనబడుతుంది.
రత్నాంగి : బంగారం యెవరు కరిగిస్తారు?
కొండు : యిదుగో మన......
రత్నాంగి:మన యెవరు?
కొండు : యెవరయితేనేం పేరడక్కు
రత్నాంగి:నమ్మినట్టా? నమ్మనట్టా?
కొండు : కావలిస్తే నువ్వు కూడా దగ్గిరవుందువు కాని.....
రత్నాంగి:అయితే పేరు చెప్పరా?
కొండు : యేదీ! గ్రంథంలో దిగిన తరువాత అసలు అవతారాలె దీగుతాయి - పేర్లతో యేం పని?
రత్నాంగి : అయితే పేరు చెప్పరా?
కొండు : నీ పుణ్యం వుంటుంది - కొంచెం ఆసరా యియ్యి పైకి వొచ్చి అన్ని సంగతులు చెబుతాను. వీటి తస్సాగొయ్యా బొద్దెంకలు చెడకరుస్తున్నాయి.
రత్నాంగి:బొద్దెంకలు కరవ్వు కొంచెం దాళండి. యీ జాడి పెట్టించి మళ్లి వస్తాను.
(తలుపు దగ్గరికి వెళ్లి ఘడియతీయనారంభించును. )
కొండు : అంతా నువ్వే అవుపోసం పడతావు? కొంచెం బ్రాహ్మడికి పారెయ్యకపోతే శ్రేయస్సు కాదు... ఆ ధనంలో మూడో వంతు నా మంత్రాంగమువల్ల రామసాని సంపాదించింది.
రత్నాంగి:(తలుపు కొంచెం తీసును - కొండుభొట్లు తల జాడీలోకి తీసును)
రత్నాంగి : ఆ తగాయిదా యేదో మంజువాణితో తీర్చుకొండి. పిలుస్తాను.
కొండు : (బుర్రపైకెత్తి) అమాంతంగా చంపేస్తావా యేమిటి?
రత్నాంగి : అయితే పేరు చెప్పండి.
కొండు : చెప్పకపోతే యేం జేస్తావు?
రత్నాంగి:మంజువాణ్ణి పిలుస్తాను
కొండు : నువ్వు కాకనేకాదంటె-చెబుతాను కాని, కోరి లభించిన ధనంకాళ్లని తన్నుకుపోవడమే?
రత్నాంగి : పేరు... పేరు?
కొండు : అయితే విను (పొడుం పీల్చి) అక్కాబత్తుడు
రత్నాంగి:కంసాలాడి శ్రీరంగనీతులన్నీ వొట్టివేనా?
కొండు : మరేవిఁటనుకొన్నావు. లోకమంతా అంతే - నీలాంటి ధనవొల్లని వెర్రికుట్టె యెక్కడో వుంటారు - నా మాట విను.
రత్నాంగి:ముందు నా మాట వింటే - ఆ తరువాత నీ మాట ఆలోచిస్తాను.
కొండు : నీ చిత్తం - నువ్వేమి చెబితే అది చేస్తాను.
రత్నాంగి: గదిలోనికి యేలా వొచ్చావో చెప్పు.
కొండు : యేకవచనం ప్రయోగిస్తూన్నావేమిటి?... యక్ష ప్రశ్నలడుగుతున్నావు. నా వంటి మంత్రవేత్తకి తలుపులు - గోళ్ళూ ఒక అడ్డా?
రత్నాంగి:అయితే ఆ మంత్రం వల్లే పైకిరా - యీ జాడీపైన పెట్టించి పైనుండి తాళం వేస్తాను.
కొండు : గదిలో ప్రవేశించడానికి యేం బ్రహ్మవిద్య కావాలి? మారు తాళం పెట్టి తీశాను.
రత్నాంగి:యే మనిషి నీకు సాయం చేసింది?
కొండు : నా కొకరి సాయం కూడా కావాలా?
రత్నాంగి: పేరు?
కొండు : చెప్పకపోతే?
రత్నాంగి:పట్టి అప్పచెపతాం
కొండు : పట్టి అప్పచెప్పితే ప్రాణత్యాగం చేస్తాను - బ్రహ్మహత్య నిన్ను చుట్టిముట్టి శేషువులాచుట్టుకుంటుంది.
రత్నాంగి:అయితే చెప్పిన మాటకి జవాబు చెప్పండి.
కొండు : పేరుకే వుంది. (పొడుం పీల్చి) అంకి.
రత్నాంగి:అబద్ధం!
కొండు : అయితే - పైడి
రత్నాంగి:అబద్ధం!
కొండు : యెరిగి నన్నెందుకడుగుతావూ
రత్నాంగి:బ్రాహ్మడికుండే నీతి నీకు లేకపోయినా - దొంగకి వుండవలసిన నీతైనా నీకున్నందుకు అలరుతున్నాను.
కొండు : అయితే బ్రాహ్మణ్ణి దయదల్చి ప్రాణాల్లో వొదిలి వేస్తావాయేమిటి? నువ్వు ధర్మాత్మురాలివి. యీ పుణ్యం కట్టుకుంటే స్వర్గం యెదురుగా వస్తుంది. కొంచెం ఆసరా యయ్య. జాడిలోంచి పైకి వచ్చి యీ దొంగముండా బొద్దెంకల బాధ వదుల్చుకుంటాను.
రత్నాంగి:శిఖా, యజ్ఞోపవీతం, యిక్కడ సమర్పించి, మరీపైకి రావాలి.
కొండు : అదేవిఁటది?
రత్నాంగి:అలానిలుచుండండి; చెబుతాను (దగ్గరకు వెళ్లి) ముందు జంఝం, దర్భముడి వుంగరం ఇలా ఇచ్చెయ్యి.
కొండు : (జంఝం తీసి యిచ్చి) యిదుగో జంఝంపోస దాఖలు చేసుకో -బ్రాహ్మడన్న వాడికి ప్రాణ సమానమైన ధనం యిదే. అది నీ పాలు చేశాను. అంతటితో వొదలి వేయి.
రత్నాంగి:వుంగరం ఇలా ఇయ్యి.
కొండు : నువ్వు నీతిమంతురాలవని పేరు పడ్డావు. బ్రాహ్మణ ద్రవ్యం అపహరిస్తావా? అవిషం విషమి త్యాహుః బ్రాహ్మస్వం విషముచ్చతే” అని వెయ్యి నోళ్ళతో శాస్త్రకారుడు చెప్పాడు. చదువుకున్న బ్రాహ్మణ్ణి కొంచం చెయ్యి తడిచేస్తావేమో అని ఆశపడితే అసలుకి మోసం తెస్తూన్నావేమిటి?
రత్నాం : అధిక ప్రసంగం ఆలస్యానికి హేతువ! మన మాటలు విని ఎవరైనా వస్తే గుట్టు బట్టబయలవుతుంది... వుంగరం! ....
కొండు : కానియ్యి! నా వేలు వుంగరం నీ మృదువైన వేలు అలంకరిస్తే కృతార్థత చెందుతుంది. (వుంగరం అందిచ్చును.)
రత్నాం : ఆ మాట బాగుంది. (వుంగరం వేలునుంచుకుని) యిక శిఖ వుండిపోయింది. (తలవంచి ఒక నిమిషం కదలకుండా వుండి మొలలోంచి కత్తితీసి చూపించును. )
కొండు : (జుత్తు చేత పట్టుకుని) సిగకే తాళం పట్టావు? అదిమాత్రం వొదిలే, నీకు దాసుణ్ణై తిరుగుతాను. యెన్నడైనా నీ మాట గడువు దాటితే అప్పుడే యీ మర్యాద చేతువు గాని.
రత్నాం : “శుభస్య శీఘ్రం” అన్నాడు.
కొండు : కేశఖండన వుత్సవానికి చెప్పినట్టు చెపుతున్నావు. మాత్రం గడపవా? ముందు నీకెంతో పనికి వస్తాను సుమా.
రత్నాం : అలా అయితే కొస కొంచం కత్తిరించి వొదిలేస్తాను; అది మాత్రం తప్పదు.
కొండు : అయితే కానీయి !
రత్నాం : (జుత్తు కత్తిరించును. )
కొండు : కొనేమిటి! మొయ్యా కత్తిరించేశావు.
రత్నాం : వెంట్రుకల కేవిఁటి! తరిగినకొద్దీ పెరుగుతాయి, బలువు తగ్గింది.
కొండు : యీ అవమానంతో నలుగుర్లో యెలా తలెత్తి తిరగడం ? దాని సిగ్గోసినసిగ పోతే పోయింది. కొంచెం ఆసరా యిచ్చి పైకి లేవదియ్యి. కాళ్లు కొంకర్లు పోయినాయి.
రత్నాం : మొదట యెలా దిగావు ?
కొండు : తలుపు తాళం రాగానే శరీరాన్కి యెక్కడలేని లాఘవం వొచ్చి హనుమాన్లులా యెగిరి లోపల్కి జారాను గానీ వొళ్ళు కొట్టుకుపోయింది.
రత్నాం: రాలేకపోతే అలాగే వుండు.
కొండు : యేం యీలాంటి కాఠిన్యం వహించావు? (కొండుభొట్లు అంచులు చేతపట్టి ఉబక ప్రయత్నించగా జాడీ పగిలిపడును. (కొండుభట్లు పెంకుల మధ్య కూలబడును.) చంపావు! (రత్నాంగి కొంత కనికారముతో లేవతీసును. )
వొళ్ళంతా గాయాలు తగిలాయి గాని, నీ కరస్పర్శ తగలగానే అమృతనిష్యందనం లాగ-(కుంటుతూ తలుపు వేపు నడుచును. తలుపు దగ్గర నిలచి ధనం వేపు చూచి) ధనం కాళ్ళతన్నుకు పోతున్నావు. లేక నాతో వంతుకూడ్డం యిష్టం లేదు గాబోలు - నా మట్టుకు కొత్త నీరూ పాత నీరూ కూడా యేకంగా కొట్టుకుపోయినాయి - నా వుంగరం దొబ్బినందుకు లేడా దేవుడు (అంటూ తలుపు గడియ తీసును, రత్నాంగి తను కూడా తలుపు దగ్గరకి వెళ్లి తలుపు తానే వేస్తూ)
రత్నాంగి:నిన్ను ఒక్కణ్ణీ పైకి వదలనే - గదిలో వున్నానంటే పైని గొళ్ళెం వేసి కొంపకగ్గిపెట్టగలవు. గనుక నిన్ను వీధిలోకి సాగనంపి వీధి తలుపు గడియ వేస్తాను (రత్నాంగి గదిపైన గొళ్లెం వేసి కొండుభొట్లుతో పైకి వెళ్లును)
(బోనిపెట్టి తలుపు యెత్తి కోమటి రంగన్న పెట్టి పైకి వచ్చి సరుకులు పరీక్షించి అందులోంచి వుంగరాలు తీసి చేతిని పట్టుకొని కొన్ని కాసులు మొలను దోపుకొనును.
యింతట్లో రత్నాంగి కాళ్ల చప్పుడవును. శెట్టి మంచం మీద పడుకుని దుప్పటి తీసి కప్పుకొనును. రత్నం తలుపు తీసి గదిలో ప్రవేశించి సరుకులు వేపు చూచి - కాసులు పోగుచేసి)
రత్నాంగి : యేమిటీచిత్రం కాసులు సగానికి సగం తగ్గిపోయినాయి? (నిలుచుని నాలుగువైపులా చూచును. మంచంమీద మనిషి వుండడం చూసి గతుక్కుమని రెండడుగులు వెనక్కువేసి ఆంజనేయదండకం పఠిస్తూ “శ్రీమన్మహా అంజనీగర్భ సంభూత - సద్బ్రహ్మచారీ - కపీంద్రాదివంద్యా - కిరీటోజ్వలద్రత్న” రత్నాంగి దుప్పటీ ముసుగుతీస్తుంది. గాఢ నిద్రలో వున్నట్టు శెట్టి కదలడు. రత్నాంగి బాగా మనిషిని, నఖసిఖ పర్యంతం పరీక్షించి మొలదగ్గర చెయ్యి పెట్టును - శెట్టి తటాలున రత్నం తలపట్టుకొని)
శెట్టి : దొరికావు మరొగ్గను - చెప్పు - అమ్మవారివా? అసిరమ్మవా? పీడవా? పిశాచానివా? ఆ! యేమిటీ వాళకం చెప్పు - నిశిరాత్రి వేళ యిటొస్తావు అటొస్తావు నీకేం నేనాశ్శకరా! పరాశ్శకరా! వోలమ్మా యిదియేవూరు? యేలోకం? నా కొంపలో నా పక్క మీద నీను పల్లకపడుకున్న ముండా వాణ్ణి అమాంతంగా యెత్తి తెచ్చి యిక్కడ పడేసినావు గదా గుండెబద్దలయి సవ్వనా? రామసాని నీకేటి కావాల? ఒక్క మాట చెప్పు, యేటపోతు కావాలా? నీ రూపం చూస్తే నాకు భయం వేస్తున్నాది. కళ్లు మూసు కున్నాను. తల్లీ రక్షించు.
రత్నాంగి:చదవవలస్ని పాఠంవంతా అయిందా? యింకా వుందా?
శెట్టి : అయితే మనిషివే? యెవరమ్మా నువ్వు? చెప్పు - నా యిల్లు చేర్చు తల్లీ మా వాళ్ళు బెంగ బెట్టుకుంటారు - రత్నాంగివా? అయితే బతికాను. (పలు ప్రక్కలా పరికించి) యిది రామసాని చీకటి గది కాదు? పిశాచమై పీక్కు తింటూంది! నన్ను తెచ్చి పడేసినట్టే నీన్నూ తెచ్చి పడేసిందా ఏమిటి? యిక్కడుంటే మన్ని చంపేసి పోగలదు! రా! పైకి పోయి మంత్రగాడి కాళ్ళట్టుకుని ప్రాణం బచాయించుకుందాం.
రత్నాం : తల వొదిలెయి.
శెట్టి : చూశావా నా చేతులు యెలా గజగజ వొణుకుతున్నాయో? భయం చేత వళ్లు కంపం పట్టుకుంది... నా వశవాఁ చేతులు వొదల్డానికి. (రత్నాంగి పెనుగులాడి మొల దగ్గిరకి చెయ్యి పోనిచ్చును)
శెట్టి : చెయ్యి మాత్రం మొలలోకి వెళ్లనియ్యకు. దోపిడే? సానిబుద్ధిపోతుందా? పిశాచం పీక్కుతింటావుంటే సరసానికి యాళా?
రత్నాం : వేళాకోళం మాని మొలనున్న కాసులు అక్కడ పెట్టు.
శెట్టి : యీ వాళకం సెట్టి దగ్గర పనికి రాదు. (లేచి నిలబడి రత్నాంగిని దూరానికి తోసి తలుపు వేపు జరుగును)
రత్నాం : దొంగ! దొంగ! మంజువాణీ (అని కేక వేసును.)
శెట్టి : నేనేం యెఱ్ఱి కుట్టి బాపనాణ్ణనుకున్నావా యేమిటి? నీ యిష్టం వొచ్చినవాళ్లని పిలువు.నాకు భయమనుకున్నావా? (పెద్ద గొంతుకతో) నన్ను యీ సీకటి గదిలోకి పిలిసి యీ బంగారం మనం పంచుకు దొబ్ళుదామంటే నే నొప్పుతానా? నీక్కావలిస్తే నువ్వు దొబ్బు. పోలీసోళ్ల పట్టుకున్నప్పుడు నువ్వడ్డుపడతావా? రామసాని దెయ్యమై పీక పిసికితే నీ డబ్బడ్డుపడతాదా? (తలుపు దగ్గిరకి దాసీలు, మంజువాణి, నరహరిరావు గారు వచ్చి తట్టుదురు)
శెట్టి : నా యెత్తు ధనం పోస్తే యిలాంటి దొంగ పని నేను చెయ్యను. యింత ద్రోహవాఁ? పాపము బద్దలై ఆకాశమంత పిడుగు నెత్తిమీద పడదా? నా చెయ్యి వొదిలెయి. తలుపు తీసి నీ భవిష్యం నలుగురి యెదుటా తీస్తాను.
రత్నాం : చేతులు పట్టు వొదల్దు ! ఏం చెయ్యను?
నరహరి: (తలుపు మీద చెయ్యివేసి) యెవర్లోపల?
రత్నాం : శెట్టి -
మంజు : శెట్టా? యెలా వొచ్చాడు?
శెట్టి : శెట్టి యెలా వచ్చాడా? రత్నం రమ్మని ప్రాణం తింటే వచ్చాను. బంగారం నాణెం చేసి ఖరీదు కట్టాలి రమ్మంటే వచ్చాను. దొంగ పని చెయ్యమంటే నే నొడబడతానా? రామసాని సొమ్ము ఒక్క చిల్లికాసు ముట్టుకుంటే పిశాచై పీక పిసగదా? (తలుపు తీసుకు పైకి పోవడాన్కి ప్రయత్నిస్తూండగా)
రత్నాం : పట్టుకోండి! మొల్లో కాసులు ముడుచుకుపోతున్నాడు? అవుగో, వుంగరాలతో పాటు...
శెట్టి : యేటీ మనిసి యికారం. (రత్నాంగి మీదికి వంగి మొహం దగ్గర మొహం పెట్టి) నే దొంగనా? నువ్వు దొంగవా? మా యింటావంటా ఆ మాటలేదు. ఆ మాట మళ్లీ అన్నావంటే చాలా దూరం యెళుతుంది. కోవఁటోళ్లం! మా యిల్లంతా బంగారం! మా వొళ్ళంతా బంగారం.
నరహరి: శెట్టీ!
శెట్టి : సిత్తం బాబు! పిశాచమంటే నాకు భయం. పోలీసోళ్లంటే నాకు భయం - మరెవ్వళికీ లచ్చపెట్టను. (శెట్టితిరిగి సాగి వెళ్లుతాడు. )
నరహరి: నిలబడు!
శెట్టి : (వెళ్లిపోతూ) భోగం దానియింట్లో ఒక్క నిమషం నిలబణ్ణు! అదంతా బాపనాళ్లకు చెల్లుతుంది.
నరహరి: (పరుగెత్తి శెట్టి రెక్క పట్టుకొని నిలబెట్టి) కాసులు, వుంగరాలు పెట్టు.
శెట్టి : సెయిముట్టు సరసం మాత్రం సెయకండి, మాటొస్తుంది.
నరహరి: యిస్తావా? యివ్వవా?
శెట్టి : దోపిడే!
నరహరి: ఆహా!
శెట్టి : యివ్వకుంటే యేటి సేస్తావు?
నరహరి: పిలకూడదీస్తాను.
శెట్టి : గవరుమెంటు బావుటా యెగురుతుండగా యెవడు పిలకట్టుకునేవాడు ?
నరహరి: యిదుగో నేను (అని పిలకపట్టుకుని వంచును.)
శెట్టి : బాబ్బాబు ! మీ మాట కెప్పుడయినా కోవటోఁడు అడ్డు పెడతాడా? మీ శెలవు! బాపనోరికి బంగారం యిచ్చుకుంటే పుణ్యం కదా! పితాళ్లు స్వర్గానికి పోరా? ముండ కాసులు మళ్ల ఆర్జించుకుంటాను; పుచ్చుకొండి! (కాసులు పుచ్చుకుని నరహరిరావు జుత్తు వదలివేయును.)
నరహరి: దెబ్బకు దెయ్యం వెరుస్తుంది.
శెట్టి : బాబు! దెయ్యమంటే నాకు వొల్లమాల్ని భయం! మరొగ్గెయ్యండి! ఈ కొంపలోంచి దాటిపోతే బతుకుతాను. (గడప దిగుతూవుండగా)
రత్నాం : వుంగరాలో?
నరహరి: వుంగరాలిచ్చి మరి వెళ్ళు!
శెట్టి : మీ శలవు! మీ శలవు కడ్డా? (వుంగరాలు తీస్తూ రెండడుగులు ముందు కేసి పరిగెత్తి పారిపోవును.)
(తెర దించవలెను)
కొండుభొట్టీయము
ద్వితీయాంకము
అష్టమరంగము
(అక్కాబతుడి దుకాణం)
(అక్కాబత్తుడు - రామమూర్తి ప్రవేశించును)
అక్కా : యిక రామమూర్తి అని పిలవకూడదు. రామమూర్తి పంతులుగారు అని పిలవాలి.
రామ : యేదో పెద్ద ఉద్యోగాలు అయినప్పుడు గదా అలా పిలవడం.
అక్కా : అందాకా మామూలుగా పిలవొచ్చునా?
రామ : యేం చదువు - యేం వుద్యోగాలు.
అక్కా : యేం అలా అంటున్నారు.
రామ : మా తండ్రి సంగతి బాగుంది కాదు. ఆయనకి మంచి స్నేహితులైన మీలాంటి వాళ్లు కూడదని చెప్పరు -
అక్కా : ఆయ్ని యే కూడని పని చెయ్యలేదే. యేదో ఉపాయం వల్ల పదిరాళ్ల సొమ్ము ఆర్జించుకుని సంసారం గడుపుకుంటున్నాడు.
రామ : యెవడో షోళంగిరాజును యీ వేళ యింట్లో దింపి పార్వతిని వాడికి ఉపచారం చెయ్యమని అప్పచెప్పారు. ఈ దౌర్జన్యం చూశారా?
అక్కా : “భార్యా రూపవతీశత్రు?” అన్నాడు. మొగుడున్న పెళ్ళామే సొగసుగా వుంటే పరాయి వాళ్లు కన్నేస్తారు గదా! ఖాయిదా లేకుంటే సొగసైన వితంతు చెడిపోవడమనగా యెంతసేపు?
రామ : మా తండ్రికి అలాగ్గడ్డి పెట్రాదా?
అక్కా : మీ తండ్రికి గడ్డి పెడితే గడ్డయ్యేది గట్రయ్యేది సాపుగా తినేస్తాడు. అయినా ఆయిన ప్రతిబంధకం మీ ప్రయత్నానికి అడ్డవుతుందా యేమిటి? పెళ్ళి మూర్తం యెప్పుడండి?
రామ : యెవరి పెళ్లండి?
అక్కా : యవరి పెళ్లనుకున్నారు?
రామ : నా పెళ్లి?
అక్కా : ఆ మాటే - మీ పెళ్లి - పార్వతమ్మ పెళ్లిన్నీ.
రామ : (నిర్ఘాంతపోయి) యెవరు చెప్పారేమిటి?
అక్కా : యెవరూ చెప్పలేదు..... లేదు మీ మాటల వల్లా, మీ చెర్యల వల్లా ఊహించాను. మరేం భయపడకండి. అది మహా మంచిపని. మీ తండ్రి ఆదాలో వుంటే రత్నం లాంటి పిల్ల చెడిపోతుంది - యీ మాట పొక్కేలోగా శీఘ్రంగా కానియ్యండి - నా చేతనయ్ని సహాయం చేస్తాను.
రామ : నిజంగాను?
అక్కా : లింగం సాక్షి.
రామ : అయితే మా గురువు గిరీశంగార్ని తీసుకొస్తాను.
(యిద్దరు నిష్క్రమింతురు)
కొండుభొట్టీయము
ద్వితీయాంకము
నవమ రంగము
(మంజువాణి యిల్లు - ఒక బల్ల చుట్టూ కుర్చీలు - బల్లమీద గళాసులు - విప్పిన సీసా.) (మంజువాణి మంచం మీదను త్రివిక్రమరావు పంతులు ఈజీ చెయిరు మీదను మితిమీరి పడివుందురు)
కొండు : (చప్పుడు కాకుండా బొటన వ్రేళ్ళమీద నడచి వచ్చి త్రివిక్రమరావును కదిపిచూచును. తెలివిరాదు. ఆత్మగతం) జేబులో యేముందొ-(చెయి జేబులో జొరిపి మనీపర్సు తీసి-విప్పిచూచి, ఆత్మగతం) దీనిలో పెద్ద కాసులు చాలా వున్నాయి-యివి వీడికీ దక్కేవి కావు - వివాహ కార్యం క్రింద వినియోగపరిస్తే కొంత పుణ్యం అయ్నా వీడికి దక్కుతుంది. రెండు కాసులు మంజువాణికి యిచ్చేటందులకు యిందులో వుంచి యిదిగో జేబులో మళ్లీ పడేస్తాను. కడంవి కాకితం పొట్లాం కట్టి కందులజాడీలో లోతుగా కప్పివేస్తాను.
(నిష్క్రమించును)
త్రివిక్ర : (నిద్రలో కాలుజాచగా సారాబుడ్డి నేలకిపడి చప్పుడవును, అంతట వులికిపడి లేచి, మరి ఒక గళాసు పుచ్చుకుని) దీనికి డబ్బిచ్చి వెళుదాం.
(జేబులో మనీఫర్సు తీసి చూచి నిర్ఘాంతపోయి ప్రకాశం) ఆ! రెండే వున్నాయి - కడంవి యెవరు దొబ్బారు. అది మంచం మీద వొళ్ళెరక్క పడే వున్నది. లేక నేను
ఖర్చు పెట్టాన? లేకుంటే నౌఖర్లు యెవరయినా చెపాయించేశేరా? ఈ రెండు కాసులు దీనికి యిచ్చేస్తే యింటికి చేరే సాధనమేమిటో... ఒకటీ సాధనం కనపడుతూంది. శాస్తులు ఇంట్లో దాని శిగగోస్ని పాత్రసామాను వొదిలివేసి - సన్నంగా నలుగురుం జారిపోయి తెల్లారగట్ల రెయిలులో విశాఖపట్నం జేరుకుంటే, అక్కడ రుణం చేసుకోవచ్చును. యెవడూ మేలుకుండలేదుగద?
(తలుపు మెల్లగా తీసి వెళ్ళిపోవును)
కొండుభొట్టీయము
తృతీయాంకము
ప్రథమ రంగము
(కేశవరాయుడు గారి చదువు గది. కేశవరాయుడు గారు హెడ్ మేష్టరు - ఇంద్రపట్నం బ్రహ్మ సమాజ కార్యదర్శి - దివాన్ బహద్దర్ రాజారాం గారు - కేశవ రాయుడు గారు ప్రవేశించును.)
కేశవ : బహు కాలానికి. దయచేయ్యండి.
ది.రా : రిటైరయ్నివాళ్లం కామండీ, బ్రతుకు యొక్క సాయం కాలంలో దేవుడికి దేశానికి నౌఖరీ చేయ్యవలెననే అభిలాష కలిగి దైవారాధనా గ్రంథ కాలక్షేపంతో కాలం వెళ్లబుచ్చుచున్నాను. భగవద్గీత ఆచార్యుల వారి వ్యాఖ్యాన సహితంగా ఆంద్రీకరించినాను కద - ఇప్పుడు ఉపనిషత్ భాష్యం తెనిగిస్తున్నాను. నాస్తికం ఇంగ్లీషు చదువుకున్న మన వారిలో యెక్కువగుచున్నది. పెద్దలు చిన్నలు కూడా అప్పటి ఐహికములందు మగ్నచిత్తులయి వుండడమే కాని "What Am I" "కోహం” “నేనెవడను?” నా దేవుని యడల నా యెడల నాతోటి పాటి జంతువుల యడల duty యేమిటి? where am I drifting? నే నేతోవజారుతున్నాను - అనే తలంపులు యేమి పాపమో కాని బుర్రలో జొరబడవు. ఆస్తికులయిన తాము ప్రధానోపాధ్యాయులయి వుండుటను యీ పట్నముల బాలురు మాత్రము యితర పట్నముల వారివలె కాక బుద్ధివంతులుగా నున్నారు.
కేశవ : దయచేత నన్ను పొగడుచున్నారు గాని నేను యెంతటి వాడను. నే చేసేపననగా యెంతటిది?
ది.రా : మీ వంటి సత్పురుషులకు వినయము సదాభూషణమయే వుండును. దేశమున ముందునుండీ యున్న పాపచింతా ఆంగ్లేయ విద్యల వలన కలిగిన నాస్తికతా అనే
మహా మిసిసిపి -మిసోరి ప్రవాహములకు బ్రహ్మ సమాజ మతమనేది పెద్ద ఆకట్టుకట్టువలే ఆచరిస్తున్నాది. బ్రహ్మ సమాజము లోకములో నుండు మతములన్నింటికన్నా Rational సవబయినదే అయిననూ లోకమున అవస్తాభేదము-రుచి భేదము కలిగి వుండుట చేత ఏజాయ మనుష్యులకు ఆజాయను జ్ఞానోత్పత్తి ధర్మోపదేశమూ చేయడము విధి గనుక తాము తర్కమును బట్టి సూటిగాపోవు బుద్దులకు బ్రహ్మమతోపదేశము చేయుచున్నారు. నేనంటిరో హిందూ మత గ్రంథములలో పురాణాదులు కేవల స్త్రీ పామరజన బోధక ప్రయోజనములుగా తొలగించి పాశ్చాత్యులు గూడా వేయినోళ్ళ పొగడు భగవద్గీతాది మహాగ్రంథముల సహాయమున ఆర్య మతమునకు చిరకాలమావరించిన తృప్పును గడగి ఆచార్య నిర్దిష్ట కర్మ - వేదాంత మార్గములను చదువరుల కంటికింపుగ గనపర్చ ప్రయత్నిస్తుయున్నాను.
కేశవ : యేరీతినయినా నాస్తికతా పాపముయడల భీతి-పుణ్యము యడల ఆసక్తి కలుగ చెయ్యడం యిప్పుడు మన దేశములో అత్యావశ్యకములైనప్పటికి మనవాళ్ల అవివేకానికిమేర లేకుండా వున్నది.
ది.రా : Pardon me. యేదో ఒక తరహా అంటే ఇంచుక నేను తమ అభిప్రాయముతో భేదించవలసి వస్తుంది. క్షమించవలయును. యే రీతిగానైనా ఆస్తికత అంటే యిదిగో ఛండాలుడు యెనుపోతును వేటవేసి మరిడమ్మకు పూజ చేస్తాడు. మనమునూ అట్టుల చేయగలమా? సంఘములో పై అంతస్తుల వారమైన మనము Rational Religion కలిగి వుండవలెను. అట్టి మతము క్రమక్రమంగా క్రిందివారికి దిగును. సవబునే నేను పూజిస్తాను. థియాషిపిష్ణు మతము వలె పేడా బెల్లం కలిపి మనవాళ్ళు సంతోషించడం కొరకు ప్రతి వెర్రి మొర్రి వ్రాతకు సందర్భార్థము కల్పించడము ప్రతి అవకతవక ఆచారముకు రహస్యసవబులు గుణములు కల్పించడము - యేమంటారు? తాము అట్టి వెర్రి మాయల నమ్మజాలరే?
కేశవ : నిజమే!
ది.రా : అట్టి ప్రవర్తన కలవారితో రాజీ లెల్లను యెట్లు పాటించతరమనవలయును. మతసంబంధ మయిన ఆ తర్కిత ఆచరణలో మన వాకిటలోనే కొండంత inconsistency వున్నది చూడండి. నాయుడు గారు - మనమాధవయ్య గారున్నారు - వారి యోగ్యత ఆంధ్ర పాండిత్యమూ, కవితా సామర్థ్యము - మన దేశమున కెల్లా అలంకార భూషితములయియున్నవే - వారు బ్రహ్మ సమాజ మతము నెన్నాళ్ల నుండియో అవలంబించి, ఆ మతమునకు మొనగాండ్లయి వున్నారు. విధవా వివాహములు
ఆచరించవలసి వచ్చినప్పుడు రీజన్ కాగినవారు బ్రహ్మ సమాజము యొక్క మార్గము వదలి హిందూ శాస్త్ర ప్రకారం ఆచరిస్తారు - అది యేమనవచ్చును?
కేశవ : నిజమే గాని మాధవయ్య గారు సవబు మాలిన పనిచేసిననూ మళ్ళించడము శక్యము కాదు గాని తాము విధవా వివాహమునకు ఫర్ (for) గాని, ఎగనెష్టు (Against) గాని వున్నట్టు కానరాదు - తమవంటి పండితులు ఆ రిఫారం (refom) విషయమయి చర్చించి యేదో వకనిశ్చయము తీసుకు వుండకపోతే......
ది.రా : అన్ని పనులు అందరూ చెయ్యడము శక్యమా? మత సంస్కారము అందుతో సంబంధించిన గ్రంథ రచనా నా బ్రతుకుకు నిధానములుగా నిర్నయించకు వున్నాను - చేయవలసిన పనులు లోకములో మెండు కలవు. చేయ జేసుకొనిన పని చాయశక్తుల చేయనగు అందు విద్య అన్య వ్యాపార నిరోధి (Jealous wife) ప్రస్తావనవశాత్తూ విధవా వివాహముల మాట అంటిని గాని, ఆ భారము కూడా వహించుటకు నా భుజములకు వైశాల్యముజాలదు. మాధవయ్య గారూ, తమలాంటి వారు పట్టి యుండగా నా రిఫార్ము (refom)కు మరియొకరి సహాయమావశ్యకము కాదు - గాని నా మనసునకు కలిగిన సందేహము నివారించుకోజాలక మాధవయ్య గారి మతమునకు ఆచరణకు గల వైరుధ్యము తాము సమన్వయించగలుగుదురని అడిగితిని.
కేశవ : రాత్రింబొగళ్ళు నేనిదే ఆలోచించుతాను - వారు వినరు - యేమి చెయ్యను. నేను కూడా మోరల్ కరేజ్ (moral courage) లేనివాడిలా లోకానికి కనపడుతున్నాను.నా శతృవులు నన్ను తరుచుగా వెక్కిరిస్తూ వుంటారు.
ది.రా : మాధవయ్య గారు గొప్ప గ్రంథకర్తలు. సంఘ సంస్కార నిర్వాహకులు. వారికి మన మందరమూ పూజ చేయవలసినదే వారి పేరట చంద్రకాంత శిలాప్రతిమ ఒకటి నిలపనగును గాని తప్పుత్రోవను మనల నీడ్చుకు పోయి హాస్యాస్పదులనుగా జేసి నప్పుడు నేనయిన నేమిచేతును? పెళ్ళి చేసుకునే కుర్రవాడు బ్రహ్మసమాజ మతస్తు డైనప్పుడు సమాజ మందిరములో సమాజపద్దతి ప్రకారం పెళ్లి చేయించుదును.మాధవయ్య గారేమి చేయుదురు?
కేశవ : తమరిచ్చిన సలహా బాగా వున్నది. సంఘ సంస్కార సమాజం వారము చాలామందంతా బ్రహ్మ సమాజము వారమే. మేము నలుగురమూ కలసి మా మత ప్రకారం వివాహము చెయ్యడమునకు నిశ్చయిస్తే మిగిలిన ముచ్చకాయ ముగ్గురూ యేవిఁచెయ్యగలరు? అందులో మా స్కూలు కుర్రవాళ్లు మా పక్షం వుంటారు కద. ఓట్లు మెజారిటీ యే
మీటింగులోనయ్నీ మాకే వస్తుంది. యిటు పైని మా నమ్మకములననుసరించి పని చేసి చూస్తాము. థేంక్యూ వెరిమచ్ ఫర్ ది ఎడ్వైస్. (Thank you very much for the advice). :
ది. రా : నేను యెడ్వైసు (advice) యివ్వలేదు. యివ్వజాలినంత వాడిని కాను. రిఫారమ్ (refom) విషయమై నేను తమకు యెడ్వయిజు (advice) యేల? ఈ హంశము మన ప్రసంగములో ఉపమానముగా తెచ్చినాను. దీని మాటకేమి? తాము సవబు ప్రకారం నడిచేటప్పుడు లోకం అంతా మీ పట్ల వుంటారు. మనం అనుకుంటూ వున్న ప్రస్తావన రిలిజన్ రేషనల్‌గా (religion rational) వుండకుంటే అన్యమతస్కుల యొక్క నాస్తికం యొక్క ఢోకాకు నిలవగలదా.
కేశవ : అవును.
ది.రా : నేను యిప్పుడు తమ దర్శనానికి రావడము కారణమేమంటే తమతో ముచ్చటించడమనే సంతోషమలా వుండగా ఆదివారం రోజున, మా తోటలో నలుగురు ఫ్రెండ్సు (friends) కి టీపార్టీ యిస్తాను. ఆహూయము చేయుటకు వచ్చితిని.
కేశవ : చీటీవ్రాస్తేవస్తానే నా కోసం యింత శ్రమ తీసుకున్నారు.
ది.రా : తామును చూడడపు ఆనందమో తమతో ముచ్చటించుట వలన గలుగు జ్ఞానోత్పత్తియో? గుడ్ బై (Goodbye) (Shake hands చేసుకుందురు.)
కేశవ : గుడ్ బై.
(యిద్దరూ నిష్క్రమింతురు.)
కొండుభొట్టీయము
తృతీయాంకము
ద్వితీయ రంగము
(రాజారాంగారి కచేరి గది)
(దివాన్ బహుద్దూర్ రాజారాం గారు, గంగాధర శాస్త్రి ప్రవేశించును.)
ది.రా : ఈ పటుపటాంగములో యెవరు గెలుస్తారంటారు?
శాస్త్రి : తాము దీవాన్ బహద్దర్లు - మాధవయ్య గారు రావు బహద్దరు - ఇద్దరి తారతమ్యము కంపెనీ వారు యెంచేవుంచారు. తాము సార్థక నాములగు మంత్రులు - మాధవయ్య
గారిది వైదీకపురస్తా - అందులో వేగినాటి సన్యాసం ఆయ్నకు దేశాన్ని పట్టి అబ్బింది. గ్రంథాలయితే చాలా రాశారు.
రాజా : పండితులైన మీరూ అలా అనడం ఆశ్చర్యంగా నున్నది. పిట్టకథలు పిచ్చిక కథలు తిట్లూ గ్రంథము లంటారా? ఇంగ్లీషులో సోలిడ్ బుక్ (Solid Book) అంటారే అనగా ఉద్గ్రంధము. అది మనము వ్రాస్తూన్నాము. మన భగవద్గీత ఆంధ్రభాషకు వజ్రకిరీటమని పేపరు వాడు రాశాడు. శైలి భేదం చూశారా మాధవయ్య గారి వ్రాత - ఊక - పేలపిండి మా శైలి అలంకార భూయిష్టమైయుండును. వాక్యములనడక సంగీత గమనము ననుకరించును. పామర జనులకు ఉత్కృష్ట వస్తుగుణ గ్రహణం వుండదు. మన గ్రంథములు యెంత సొగసుగా నచ్చొత్తించినను కొనువారు కానరారు. జమీందార్లు తమ యుద్యోగస్తుల మేలుకోరి కాపీలధికముగా గొని తాము వారికి పంచి పెట్టిన జమీందారీలు బాగగును. దేశములో జ్ఞానాభివృద్ధికి మార్గమగును. ఒకమారు వెళ్ళి ఉద్యోగావస్తలో పూర్వ పరిచితులయిన వారిని చూడవలె. యెక్కడయినా మంచి సంస్థానంలో దివాన్‌గిరీకి కుదురుకుంటేనే గాని అధికారం చేసే అలవాటు పోయి యేమీ తోచకుండా వున్నది.
గంగా : ప్రజలికి అదృష్టం పట్టాలి కదా!
ది.రాజా: దివాన్ గిరీ చేస్తే చెన్నపట్టపు వకీళ్లతో పలుకుబడి కూడా వుంటుంది. కౌన్సిలు మెంబరు పనికి సహాయ భూతంగా వుంటారు. యీజిల్లాలోనే కొంచెం ప్రజలని రంజింప చెయ్యడాన్కి సంఘ సంస్కారంలో మనంకూడా వేలు పెట్టితేనే కాని యిక్కడి వాళ్లు మనకు వోట్లు యివ్వరు.
(నౌఖరు ప్రవేశించి)
నౌఖ : గిరీశం పంతులుగారు వచ్చారు.
ది.రాజా: రమ్మను (గంగాధర శాస్త్రీతో)
ఇతడు నా బాల్యస్నేహితులయ్ని యుగంధరరావు పంతులుగారి కొమారుడు. చిన్న నాటి నుంచి యెరుగుదును. బి.ఏ. ప్యాసుఅయినాడు. తండ్రి ఆర్జించిన ధనం పెట్టి బ్రతుకుతున్నాడు. ఇతనిని సంఘ సంస్కారంవారు కెప్తాను అంటారు. సాహసౌదార్యాలు గల మనిషి కోటి విద్యలున్నాయి. నాటకాలాడుతాడు. పాడుతాడు. గారిడీ చేస్తాడు. దొర్లకి యితనంటే సరదా. తండ్రిచేసిన మొదటి వివాహం భార్యాపోయింది. పిల్లలు లేరు. తిరిగీ వివాహం లేదు. చేసుకుంటె మరెవరయినా పిల్లను యిచ్చివుందురు. అర్ధరాత్రివేళ యెటువైపున పిలచినా రెండువేలమంది వెనుక కూడుతారు. గుణయోగ్యత
లున్నవిగాని కొంచెం పెద్ద పిన్నా తారతమ్యం మరిచి హాస్యరసంగా మాట్లాడుతాడు. తుంటరి ... అతనువచ్చే సర్కి పుస్తకం చదువుతూ వుందాము. “భీష్మాత్ వాతఃపవతి - భీష్మోదేతి సూర్యః - భీష్మాదగ్నిశ్చండశ్చ.
గిరీశం: (ప్రవేశించి.)
ఆ స్వరాన్ని యెందుకు సాగదీస్తున్నారు. శాస్తులుగారి చేత చదివించండి. మీరు అర్థం వ్రాయండి.
ది.రాజా: (Dam it) (అప్పుడే ఆరంభించాడు. )
బి.ఏ. ఆ భాషలో ప్యాసు అయినాడు. వాడికి సంస్కృతంలో మంచి ప్రవేశం వుందండి. తండ్రి ఉపనిషత్తులు కూడా చెప్పించాడు.
గిరీ : మా గ్రామములో ఒక కోమటి ఉండేవాడు. ఆయన పురుషసూక్తం పారాయణ చేస్తూ వుంటే నూతులో కప్పలు బుఱ్ఱపైకెత్తి అరిచేవి.
గంగా : మండూకప్లుతం - వేదంలో స్వరం కూడా వుంది.
గిరీ : బ్రాహ్మలు సోమపానం చేసి తొలకరి వేదపారాయణ చేస్తే తొలకరి కప్పల అరుపుల్లా వుంటుందని ఋగ్వేదంలో ఉపమానం కల్పించారు. తొలకరివాన కురిసినతరవాత రాత్రివేళ కప్పలు మేళంగట్టి తరహాతరహాలుగా గానం చేస్తూవుంటే అదిఒక ఆనందంగా ఉంటుంది.
ది.రాజా: (Serious subject) సీరియస్ సబ్జెక్టులోనయినా హాస్యం విడనాడజాలవుగదా ! రావుజీ!
గిరీ : మామగారు! గుడ్లగూబలా గాంభీర్యంగా కూర్చుంటాను. యేం శలవు?
ది.రాజా: ఉపనిషద్వాక్యము పరిసమాప్తి చేసి మాటాడుకుందాము.
శాస్తులుగారు! అబ్బీ నువ్వు కూడా విను. నీ బుద్దీలో (originality) ఒరిజినాల్టీ వుంది. భీష్మాత్ వాతః పవతే” అన్నాడు. దేవునికి భయపడి వాయువు వీస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. అని యీ ప్రకారం చాలామంది తాత్పర్యం చెప్పుతారు. భయమనేది భగవంతుని యందు క్రౌర్యం కనపరుస్తుంది. భక్తి వల్ల దేవతలు వారి వారి పనులు చేసినారంటే కొంత స్వారస్యంగా వుండును. మా వాడు (గిరీశం వంక చూసి) భయం చేత చెయ్యమంటే యే పని చెయ్యడు. “భీషా” అనే మాటకు మరి యేదయినా అర్థం చేప్పితే బాగుంటుంది. యూరోపియన్లు వ్రాసిన డికషనరీలు చూదాం.