కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/బాధ

వికీసోర్స్ నుండి

బాధ

ప్రశ్నిస్తున్నవారు : నా జీవితకాలమంతా ఎన్నో బాధలతో గడిపినట్లుగా నాకనిపిస్తున్నది. శారీరకమైనవి కావు, మరణం చూశాను. ఒంటరితనం అనుభవించాను. బ్రతుకు వట్టి నిరర్ధకం అనిపించింది ఎన్నోసార్లు. నాకు ఒక కొడుకు. వాడిని ఎంతగానో ప్రేమించాను. ఒక ప్రమాదంలో చనిపోయాడు. నా భార్య నన్ను వదలి వెళ్ళిపోయింది. ఆ విషయం నన్ను అమితంగా కలవరపరచింది. చాలామంది మా వర్గం మనుష్యుల్లాగే నాకూ కొంత డబ్బు, స్థిరమైన వుద్యోగం వున్నాయి. నా పరిస్థితులను గురించి నేను వాపోవడంలేదు. అయితే దుఃఖం అంటే ఏమిటి, అదీ అసలు ఎందుకు కలుగుతున్నది, అనేది నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. దుఃఖం అనుభవించడం ద్వారా వివేకం వస్తుందని అందరూ అంటారు. కాని అందుకు విరుద్ధంగా జరుగుతుందని నేను అంటున్నాను.

కృష్ణమూర్తి : బాధ అనుభవించడం ద్వారా మీరు ఏం నేర్చుకున్నారా అని నేను ఆలోచిస్తున్నాను. అసలు మీరు ఏదయినా నేర్చుకున్నారా? దుఃఖం మీకు ఏం నేర్పించింది?

ప్ర : ఒకటి మాత్రం ఖచ్చితంగా నేర్పించింది. అదే మనుష్యులతో బంధం పెంచుకోకూడదు - అని. ఒక విధమైన విరక్తి, అన్నింటినుండి దూరంగా తొలిగి వుండటం, మనోభావాలను అదుపులో వుంచుకోవడం - యివన్నీ అలవర్చుకున్నాను. మళ్ళీ మళ్ళీ గాయపడకుండా జాగ్రత్త పడటం కూడా నేను నేర్చుకున్నాను.

కృ : కాబట్టి మీరు అంటున్నట్లుగానే దుఃఖం వివేకాన్ని మీకు నేర్పలేదు. పైగా మిమ్మల్ని మరింత కపటంగా, మరింత మొరటుగా తయారుచేసింది. మనల్ని మనం రక్షించుకోవడం కోసం జరిపే యీ ప్రతిక్రియలు కాకుండా మరింకేమైనా దుఃఖం మనకి నేర్పిస్తుందా?

ప్ర: బాధని జీవితంలో ఒక భాగంగా నేను స్వీకరిస్తూనే వున్నాను. కాని యిప్పుడు ఎందువల్లనో దాన్నుంచి విముక్తి పొందాలనుకుంటున్నాను. బంధాలు మళ్ళీ మళ్ళీ పెంచుకోవడం, మళ్ళీ ఆ భరింపరాని విరక్తినీ, ఆ నిరాసక్తతనూ అనుభవించడమూ నుంచి విముక్తి చెందాలనుకుంటున్నాను. నా జీవితానికి ప్రయోజనం లేదు, వట్టి శూన్యం, చాలా స్వార్థపూరితంగా, చాలా తుచ్ఛంగా అనిపిస్తున్నది. అతి సగటు బ్రతుకు నాది. బహుశ యీ సగటుదనమే అన్నిటినీ మించిన ఆవేదనను కలిగిస్తున్నది.

కృ : వ్యక్తిగతమైన దుఃఖమూ వున్నది. లోకానికి సంబంధించిన దుఃఖమూ వున్నది. అవివేకం అనే దుఃఖం, కాలం అనే దుఃఖం వున్నాయి. తనని గురించి తనకి తెలియకపోవడమే యీ అవివేకం అంటే. కాలం అనే దుఃఖం అంటే కాలమే చికిత్స చేస్తుంది, కాలమే నయం చేస్తుంది, మార్పులు తెస్తుంది అనే భ్రమ. చాలామంది యీ భ్రమలో చిక్కుకొనిపోయి, దుఃఖాన్ని నెత్తిన పెట్టుకొని పూజించడమో, సమర్థించడమో చేస్తుంటారు. ఏవిధంగా చేసినా దుఃఖం మాత్రం అట్లాగే వుండి పోతుంది. అయితే దానిని పూర్తిగా అంతం చేయలేమా అనే ప్రశ్న మాత్రం మనం చేసుకోము.

ప్ర : అది అంతమవుతుందా, ఏవిధంగా అనేకదా నేను అడుగుతున్నది. దుఃఖాన్ని నేను ఎట్లా అంతం చేయగలను? దానినుంచి పొరిపోవడంవల్ల లాభంలేదని నాకు తెలుసు. విరక్తితో, నిరాశావాదంతో దానిని నిరోధించీ లాభంలేదు. ఎంతో కాలంనుంచి నేను మోసుకొస్తున్న యీ దుఃఖాన్ని అంతమొందించడానికి నేను ఏంచేయాలి?

కృ : దుఃఖంలో వున్న ప్రధానాంశాల్లో ఒకటి తన మీద తనే జాలిపడటం, మరొక వ్యక్తితో అనుబంధం పెంచుకోవడం; ఆ వ్యక్తి తిరిగి మనతో అనుబంధం పెంచుకోవడాన్ని ప్రోత్సహించి, పెంపు చేయడం రెండవది. దుఃఖం కలిగేది యీ అనుబంధం సడలిపోయినప్పుడే. కాని దుఃఖపు బీజాలు మాత్రం అనుబంధపు ఆరంభదశలోనే పడతాయి. దీనంతటికీ కారణం ఏమిటంటే మనల్ని గురించిన జ్ఞానం మనకు బొత్తిగా లేకపోవడం, తనని తాను తెలుసుకోవడమే దుఃఖాన్ని ఆంతం చేయడం. మనల్ని గురించి తెలుసుకోవాలంటే మనకు భయం. ఎందుకంటే అందరినీ మంచివాళ్ళు - చెడ్డవాళ్ళు, దుర్మార్గులు - మహాత్ములూ, నిష్కళంకులు- అవినీతి పరులూ అని మనమే విభజించి కూర్చున్నాం. చెడుని గురించి మంచి ఎప్పుడూ తీర్పులు యిస్తూ వుంటుంది. ఈ వేరు వేరు పక్షాలు ఒకదానితో ఒకటి కలహిస్తూ వుంటాయి. ఈ కలహమే దుఃఖం. దుఃఖాన్ని అంతం చేయడం అంటే యీ వాస్తవాన్ని చూడటం. దానికి వ్యతిరేకమైనది కని పెట్టడం కాదు. ఎందుకంటే పరస్పర వ్యతిరేకాలలో (ద్వంద్వాలలో) ప్రతిదానిలోనూ రెండోది కూడా వుంటుంది. ఈ ద్వంద్వాలను పట్టుకొని నడవడమే దుఃఖం. జీవితాన్ని యీ విధంగా వున్నతమూ నీచమూ, మహోత్తమం - ఆతిక్షుద్రం, దేవుడు - దయ్యమూ అనే పక్షాలుగా ముక్కలు చేయడంవల్ల సంఘర్షణ, బాధ పుట్టి పెరుగుతాయి. దుఃఖం వున్నప్పుడు ప్రేమ వుండదు. ప్రేమ, దుఃఖం రెండూ కలిసి ఒకేచోట వుండలేవు.

ప్ర : అహా! ప్రేమను ఎదుటివారిని దు:ఖంలో ముంచగలదు. నేను ఒకరిని ప్రేమిస్తుండవచ్చు, అయినా వారికి దుఃఖాన్ని కూడా కలిగించవచ్చు.

కృ: మీరు ఒకరిరిని ప్రేమిస్తున్నప్పుడు, దుఃఖాన్ని మీరు యిస్తున్నారా, అవతలి వ్యక్తి కలిగించుకుంటున్నారా? ఒక వ్యక్తి మీతో అనుబంధం పెంచుకున్నాడనుకుందాం. మీరు దానిని ప్రోత్సహించిన సరే, ప్రోత్సహించకపోయినా సరే అతను పెంచుకున్నాడు. మీరు అతని నుంచి దూరంగా తొలగిపోయారు. అతను బాధపడతాడు. అతను పడుతున్న బాధకు కారణం మీరా, ఆతనా?

ప్ర : మరొకరి దుఃఖానికి బాధ్యత -,ఆ దుఃఖం నాకోసం అయినా సరే - ఆ బాధ్యత నాది కాదని మీరంటున్నారా? అప్పుడు మరి దుఃఖం ఎట్లా అంతమవుతుంది?

కృ : మేము చెప్పినట్లుగా, తనని తాను పూర్తిగా తెలుసుకోవడంలో మాత్రమే దుఃఖం అంతమవుతుంది. ఒకే ఒక్క చూపుతోనే మిమ్మల్ని మీరు తెలుసుకుంటారా లేదూ బహుశా, దీర్ఘమైన విశ్లేషణ అనంతరం - అంటారా? విశ్లేషణ ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకోలేరు. పరస్పర సంబంధాలలో, కూడబెట్టి నిలవ చేసుకోవడంవల్ల కాకుండా, క్షణ క్షణపు బాంధవ్యంలో మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. దీని అర్థం ఏమిటంటే, యదార్థంగా యిప్పుడు జరుగుతున్నది ఏమిటో దాని ఎడల, మన యిష్టాయిష్టాలతో ప్రసక్తి లేని ఎరుక వుండాలి. అంటే ఏమిటంటే మనం ఏమిటో దానినే చూడటం. దానికి వ్యతిరేకమైనదిగానీ, ఒక ఆదర్శం గానీ, ఒకప్పుడు మనం ఏమిటో ఆ సమాచారం గానీ లేకుండా చూడటం. మీవైపు మీరు ఆగ్రహంతోనో, ద్వేషంతోనో కూడుకున్న దృష్టితో చూసుకుంటే గతించిన కాలం పులిమిన ఛాయల్లోనే మీరు కనబడతారు. మిమ్మల్ని మీరు చూసుకుంటున్నప్పుడల్లా గతాన్ని వదిలివేస్తూ వుండటమే గతంనుంచి విముక్తి చెందడం. అవగాహన అనే కాంతి వున్నప్పుడే దుఃఖం అంతమవుతుంది. అయితే యీ కాంతి ఏదో ఒక ఆనుభవం వల్ల వెలగదు; మెరుపు లాంటి ఒక అవగాహనవల్లా రాదు. ఈ అవగాహన ఎల్లవేళలా తనని తాను వెలిగించు కుంటూ వుంటుంది. ఇంకొకరు ఎవరో మీకు దీనిని యివ్వలేరు - గ్రంధం కానీ, తంత్రం కానీ, బోధకుడు కానీ, లోక రక్షకుడు కానీ - ఎవ్వరూ యివ్వలేరు. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవడమే దుఃఖాన్ని సమాప్తం చేయడం.

(ది అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్)