కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/దేవుడున్నాడా?

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

దేవుడున్నాడా?

ప్రశ్నిస్తున్నవారు : దేవుడు అనేవాడు అసలు వున్నాడా అన్న సంగతి నిజంగా తెలుసుకోవాలనుంది నాకు. దేవుడు కనుక లేకపోతే జీవితానికి అర్థమే లేదు. దేవుడు అంటే ఏమిటో తెలియకపోవడంవల్ల వేలాది నమ్మకాలలో, కల్పిత రూపాలలో మనిషి అతన్ని ప్రతిష్టించుకున్నాడు. ఈ నమ్మకాలు తయారుచేసిన భయాలు, విభేదాలు మనిషిని తన తోటి మనుష్యుల నుండి విడదీశాయి ఈ విభజనలవల్ల కలిగిన బాధలనుండి, గోలల నుండి తప్పించుకోవడానికి మనిషి మళ్ళీ కొన్ని నమ్మకాలను తయారుచేసుకున్నాడు. ఇంకా దారుణంగా పరిణమించిన బాధలు, గందరగోళం అతన్ని చుట్టుముట్టేసాయి. తెలియక పోవడంవల్ల నమ్మకంలో పడతాం. దేవుడిని నేను తెలుసుకోగలనా? ఇండియాలోను, యిక్కడా కూడా ఎంతో మంది మహాత్ములను యీ సంగతి అడిగాను. వాళ్ళంతా 'మొదట నమ్ము, ఆ తరువాత నీకు తెలుస్తుంది. నమ్మకం లేకపోతే ఏమీ తెలుసుకోలేవు' అని నమ్మకాన్నే బలపరిచారు. మరి మీరేమంటారు?

కృష్ణమూర్తి : ఒక విషయం కనిపెట్టడానికి నమ్మకం అవసరమా? తెలుసుకోవడం కంటే నేర్చుకోవడం చాలా ముఖ్యం. నమ్మకం అంటే ఏమిటో నేర్చుకోగానే నమ్మకం అంతరిస్తుంది. నమ్మకాన్ని వదిలేసి స్వేచ్ఛ పొందినప్పుడే మనసు చూడగలుగుతుంది. నమ్మకం అయినా సరే, అపనమ్మకం అయినా సరే, రెండూ మనిషిని కట్టిపడేస్తాయి. ఎందుకంటే నమ్మకం, అపనమ్మకం రెండూ ఒకటే. అవి ఒకే నాణేనికి వున్న రెండు ప్రక్కలు. కాబట్టి నమ్మకం వుండటాన్ని, దానికి వ్యతిరేకమైనదాన్ని కూడా మనం పూర్తిగా త్రోసిపారేయాలి. విశ్వాసి, అవిశ్వాసి యిద్దరూ ఒకటే. యిదంతా యదార్థంగా చూశాక, అప్పుడు దేవుడు వున్నాడా అన్న ప్రశ్నకు అర్థం మరొకలాగా వుంటుంది. 'దేవుడు' అనే మాటకు వెనకాల వున్న సంప్రదాయం, స్మృతులు, మేధనుపయోగించీ, భావోద్వేగాలననుసరించీ, ఆ మాటకు మనం యిచ్చుకునే విశేషార్థాలు- యివన్నీ దేవుడు కాదు. ఆ మాట అసలైన నిజం కాదు. కాబట్టి ఆ పదాన్ని మనసు వదిలేయ గలుగుతుందా?

ప్ర : అంటే ఏమిటో నాకు తెలియడంలేదు.

కృ : ఆ మాట అంటేనే సంప్రదాయం; ఒక నిత్యసత్యాన్ని కని పెట్టాలనే ఆశ, కోరిక పరమార్థాన్ని చేరుకోవాలనే యత్నం; మన అస్తిత్వానికి వూపిరి పోసే ఒక వుద్యమం. అందువల్ల ఆ మాటే ఒక పరమార్థం అయిపోతుంది. అయితే, అసలైనది ఆ మాటలో లేదని మనం గ్రహించవచ్చు. మన మనస్సే ఆ మాట. మాట అంటే ఆలోచన.

ప్ర : నాలోనుంచి ఆ మాటను తీసిపారేయమని మీరంటున్నారు. అదెట్లా సాధ్యం? ఆ మాటలో గతం వుంది. జ్ఞాపకాలు వున్నాయి.. భార్య అంటే ఒక మాట. యిల్లు అన్నా ఒక మాటే. సృష్టి ఒక మాటతో ఆరంభమైంది. అంతే కాకుండా మాట ద్వారానే భావప్రసారం జరుగుతుంది. మాట ఒక గుర్తుగా పనిచేస్తుంది. మీరు అంటే మీ పేరు కాదు. అయినా కూడా మిమ్మల్ని గురించి నేను తెలుసుకోవాలంటే మీ పేరు పెట్టి అడగాలి. మీరేమో మనసు యీ మాటను వదిలించుకోగలదా, అంటే మనసు తాను చేసే పనులన్నింటినీ తానే ఆపివేయగలదా అని అడుగుతున్నారు.

కృ: చెట్టు అనే విషయం తీసుకుందాం. అందులో వస్తువు మన కళ్ళ ముందు వుంటుంది. ఆ మాట చెట్టుని గురించి అని అందరూ ఒక ఒప్పందానికి వచ్చారు. ఇప్పుడు 'దేవుడు' అనే మాట తీసుకుంటే, ఆ మాటకు సంబంధించినది ఏదీ లేదు. అందువల్ల ప్రతివారూ తమకు తోచిన వూహాచిత్రాన్ని సృష్టించుకుంటున్నారు. ఎందుకంటే ఆ మాటకు సంబంధించినది ఏదీ లేదు కాబట్టి. ఇది వేదాంతి ఒక రకంగానూ, మేధావి మరో రకంగాను సృష్టించుకుంటాడు. నమ్మకం వున్నవాడు, నమ్మకం లేనివాడు కూడా తమకు నచ్చిన పద్ధతుల్లో తయారుచేసుకుంటారు. ఆశలోనే యీ నమ్మకం పుట్టి, ఆపైన వెంపర్లాట ఆరంభమవుతుంది. ఆ ఆశ అసలు నిస్పృహ యొక్క -: అంటే లోకంలో మన చుట్టూరా వున్నదంతా చూడటంవల్ల కలిగిన నిస్పృహ యొక్క పర్యవసానం. నిస్పృహలో నుంచే ఆశ పుడుతున్నది. ఇవి రెండూ కూడా ఒకే నాణేనికి వున్న రెండు ప్రక్కలు, ఏ ఆశా లేనప్పుడు అది నరకమే. నరకం అంటే భయం కాబట్టి మనం ఆశకి ప్రాణం పోస్తాం. అప్పుడు భ్రాంతి ఆరంభమవుతుంది. కాబట్టి, ఆ మాట మనల్ని భ్రాంతిలో పడవేసిందే తప్ప దేవుడి దగ్గరకు మాత్రం చేర్చలేదు. దేవుడు అంటే భ్రాంతి. ఆ భ్రాంతిని మనం పూజిస్తున్నాం. ఇక అవిశ్వాసి యింకోరకం దేవుడిని గురించి ఒక భ్రాంతిని సృష్టించుకొని, దాన్ని పూజిస్తాడు. అదే తన దేశం లేదా ఒక భూలోకస్వర్గం లేదా సత్యం మొత్తం అందులోనే వుందని అతను అనుకునే ఒక గ్రంధం. అందువల్ల యీ భ్రాంతితో కూడుకున్న ఆ మాటను మీరు వదిలేయగలరా అని అడుగుతున్నాము.

ప్ర : ఈ విషయమై నేను బాగా యోచించాలి.

కృ : భ్రాంతి లేనప్పుడు, యిక మిగిలింది ఏమిటి?

ప్ర : ఉన్నది ఏదో అది మాత్రమే

కృ: ఆ 'వున్నది' అత్యంత పవిత్రమైనది

ప్ర : 'ఉన్నది' కనుక అత్యంత పవిత్రమైనదయితే, అప్పుడు యుద్ధం అతిపవిత్రమైనది; ద్వేషం, అస్తవ్యస్తత, బాధ, దురాశ, దోపిడీ యివన్నీ పవిత్రమైనవి. అప్పుడు మనం మార్పు గురించి ఏమీ మాట్లాడ కూడదు. 'ఉన్నది' కనుక పవిత్రమైనదయితే, అప్పుడు ప్రతి హంతకుడు, దోపిడీ చేసే ప్రతివాడూ, స్వలాభానికి యితర్లనీ వుపయోగించుకునే వాడూ, అందరూ 'నన్ను ఏమీ అనకండి, నేను చేస్తున్నది పవిత్రమైన పని' అని అనవచ్చు.

కృ : 'ఉన్నది' అత్యంత పవిత్రమైనది అన్న వాక్యంలోని సరళత్వమే దాన్ని చాలా అపార్థం చేసుకోవడానికి దారి తీస్తున్నది. ఎందుకంటే మనం అందులోని సత్యాన్ని చూడం. 'ఉన్నది' పవిత్రమైనది అని నిజంగా గ్రహించినప్పుడు, మీరు యుద్ధమూ చేయరు, ఆశలూ పెంచుకోరు, యితర్లని దోపిడీలూ చేయరు. ఇవన్నీ చేశాక, మీరు వుల్లంఘించిన ఆ సత్యమే మళ్ళీ మిమ్మల్ని రక్షించాలని మీరు కోరుకోవడానికి వీల్లేదు. వీధుల్లో హింసాకాండ చేస్తున్న నల్లవాడితో, “ఉన్నది చాలా పవిత్రమైనది, దానిని ఎదిరించకు, దానిని మంటబెట్టకు” అంటున్న శ్వేత జాతీయుడు 'వున్నది' ని గ్రహించలేదనమాట. ఎందుకంటే నిజంగా అతడు గ్రహించి వుంటే అతనికి ఈ నీగ్రో పవిత్రంగా కనబడి వుండేవాడు. అప్పుడు యీ విధ్వంసానికి ఆస్కారమే వుండేది కాదు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ యీ సత్యాన్ని చూస్తే, మార్పు తప్పక కలుగుతుంది. సత్యాన్ని గ్రహించడమే మార్పు.

ప్ర: దేవుడున్నాడా లేదా అన్నది తెలుసుకోవడానికి నేను యిక్కడికి వచ్చాను. మీరు నన్ను పూర్తిగా గందరగోళంలో పడేశారు.

కృ: దేవుడున్నాడా అన్నది అడగడానికి మీరు వచ్చారు. ఆ మాట భ్రాంతికి దారితీస్తున్నది; ఆ భ్రాంతిని మీరు పూజిస్తున్నారు; ఈ భ్రాంతికోసంగాను ఒకరినొకరం హతమార్చుకోవడానికి మనకు ఏ అభ్యంతరమూ వుండటం లేదు. ఏ భ్రాంతులూ లేనప్పుడు 'వున్నది' అత్యంత పవిత్రమైనది. అసలు యదార్థంగా వున్నదేమిటో యిప్పుడు చూద్దాం. మనం తీసుకున్న ఒక క్షణంలో 'వున్నది' భయం కావచ్చు, తళుక్కున మెరిసి మాయమయే పుల్లాసం కావచ్చు. ఇవన్నీ నిరంతరం మారిపోతూనే వుంటాయి. ఇవి కాక, 'నా చుట్టూరా యివన్నీ మారిపోతూ వుంటాయి. కానీ నేను శాశ్వతంగా వుండిపోతాను' అని అంటున్న పరిశీలకుడు కూడా వున్నాడు. అది వాస్తవమేనా, అది నిజంగా అట్లా వున్నదా? అతను కూడా మార్పు చెందడం లేదూ? కొంత తనలో చేర్చుకుంటూ, కొంత తననుంచి తొలగించుకుంటూ, రూపం మార్చుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, మరొకలాగా అవుతూనో, అవకుండానో - ఆతను మారడం లేదూ? కాబట్టి పరిశీలిస్తున్న అంశమూ, పరిశీలకుడూ రెండూ నిరంతరం మార్పు చెందుతూనే వుంటాయి. 'ఉన్నది' అంటే మార్పు. అది ఒక వాస్తవం 'ఉన్నది' అంటే అదీ.

ప్ర : అంటే, అప్పుడు ప్రేమ కూడా మార్పు చెందుతుంటుందా? ప్రతీదీ మార్పు అనే కదలికకు లోనవుతున్నప్పుడు, ప్రేమ కూడా యిటువంటి కదలికలోనిదేగా? ప్రేమ కూడా మారుతూ వుండేదయితే, అప్పుడు నేను యీ రోజు ఒక స్త్రీని ప్రేమించవచ్చు, రేపు మరొక స్త్రీతో సంబంధం పెట్టుకోవచ్చు.

కృ : ప్రేమ అంటే అదేనా? ప్రేమ వేరూ, అది బయటకు వ్యక్తపరచడం వేరు అని మీరు అంటున్నారా? లేదూ ప్రేమకంటె, వ్యక్తం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం యిస్తున్నారా? ఆ విధంగా పరస్పర వైరుధ్యాలనూ, సంఘర్షణనూ సృష్టిస్తూ. ప్రేమ మార్పు అనే చక్రంలో చిక్కుకొని పోతుందా? అప్పుడది ద్వేషంగా కూడా అయిపోవచ్చు. అప్పుడు ప్రేమ అంటే ద్వేషం. ఏ భ్రాంతులూ లేనప్పుడే 'వున్నది' అత్యంత పవిత్రమైనది. ఏ భ్రాంతీ లేనప్పుడు 'వున్నది' ని దేవుడనవచ్చు, లేదూ మీకిష్టమైన మరొక పేరు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి, దేవుడు కాని, మీరు పెట్టుకున్న మరొక పేరు కానీ మీరు లేనప్పుడే వుంటాడు. మీరు వున్నప్పుడు అది వుండదు. మీరు లేనప్పుడు ప్రేమ వుంటుంది. మీరు వుంటే ప్రేమ వుండదు.

(ది అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్)