కూసుమంచి గణపేశ్వరాలయం/నాణేలూ చరిత్రను చెపుతాయి !!

వికీసోర్స్ నుండి

నాణేలూ చరిత్రను చెపుతాయి !!

ద్రవ్యమారకానికి ఉపయోగించిన ఆ కాలం నాటి నాణెములు ఏవి ఆధారంగా దొరికినప్పటికీ అవి కొంత కథనాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ దేవాలయ ప్రాంతంలోని పొలాలలోనూ ఇతర చోట్ల దొరికిన నాణేలు చరిత్ర నిర్మాణానికి కాక వ్యక్తులవద్దకు చేరుకున్నాయనే మాట వినికిడిలోవుంది. ఏవైనా నాణేలు దొరికి వుంటే వాటిని చరిత్రను అర్ధంచేసుకోవడం కోసం ఉపయోగిస్తే మంచిది.

కాకతీయుల శాసనములోనూ అప్పటి సాహిత్యంలోనూ వారు ఉపయోగించిన నాణెముల ప్రస్తావన వుంది. వాటిని స్థూలంగా తెలుసుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఏవైనా అటువంటి ఆధారాలు ఎక్కడైనా మరుగున పడివుంటే తెలుసుకునే అవకాశం వస్తుంది. అప్పటి శాసనాలలో గద్యాణములు, మాడలు, రూకలు వంటి నాణెముల ప్రస్తావన వుంది. జడ్చర్ల శాసనంలో కోడూరి గోకర్ణసింగరూకలు అనే మాట వస్తుంది అంటే ఆ నాణెములపై సింహం గుర్తును ముద్రించడం వల్ల సింగరూకలు అని వ్యవహరించి వుంటారు. అలాగే కేసరిమాడలు అనేది. అమ్రాబాద్ శాసనంలో కొత్తలు అనే నాణేలూ కనిపిస్తాయి. రెండు అడ్డుగలయితే ఒక రూపాయి అని వ్యవహరించేవారు. వరాహాము అంటే పందిబొమ్మవున్న బంగారు నాణేలను వరహా అని, దానిలో సగభాగాన్ని మాడ లేదా ప్రతాపము అని పిలిచేవారు. మాడలో పదవ వంతు భాగాన్ని రూక లేదా పణము అని పిలిచేవారు. త్రుణమో ఫణమో అన్న మాటలో ఫణము ఈ ద్రవ్యరూపమే. పాల్కురికి సోమనాధుడు మాడ, అరకాని, కాసు, వీసము, తార అనే నాణెముల గురించి పేర్కొన్నాడు. క్రీడాభిరామంలో సొన్నాటంకములు, నిష్కములు, అని ప్రతాప రుద్ర చరిత్రలో వరహాలు, సువర్ణ టంకములు, సువర్ణ నిష్కములు అనేవి పేర్కొన్నారు. అంటే అప్పటి నాణేలు ప్రధానంగా బంగారము లేదా వెండితో తయారయినవి కావడంతో ఇవి దొరికిన వారు సులభంగాకరిగించి వాటి రూపాన్ని నాశనం చేసి మరేదైనా వస్తువులుగా చేయించారు. ప్రతాపరుద్రుని కాలంలో రాగినాణెములు కూడా అచ్చువేయించినట్లు ఆధారాలు దొరికినవి. వాటిలో ఒకవైపు నంది ప్రతిమ మరొక వైపు అక్షరములలో కాకతి ప్రతాప రా...య అని కాకతి ప్రతాపరుద్ర నామము అచ్చులో వున్నాయి. బహుశా ఇటువంటి ఆధారాలను విడిచిపెట్టేందుకు తోడ్పడాలని కూడా కావచ్చు అప్పట్లో ధ్వజస్తంభ నిర్మాణంలో స్థాపన సమయంలో అప్పటికి వాడుకలో వున్న నాణెములతో పాటు వారివద్ద వున్న నాణేలను అందులో వేయాలని నియమం పెట్టారు. బహుశా ఏదైనా పునరుద్దరణ సమయంలోనైనా ఇటువంటివి పరిశీలనలోకి తీసుకునేందుకు ఫోటోలుగా తీసుకుని పునః స్థాపితం చేయగలిగినా మంచే జరుగుతుంది. ఆలయ ప్రాంతాలలో దొరికిన ఏ చిన్న ఆధారాలనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ వాటి రెప్లికాలనూ లేదా వాటి ఫోటోలను అదేప్రాంగణంలో ప్రదర్శనకు వుంచటం అసలు ప్రతి ఎక్కడుందో దాని దగ్గరే రాసివుంచడం చేయగలిగితే అసలు వస్తువులకు భద్రత కల్పించడంతో పాటు ఆ ప్రాంత చరిత్ర ఛిద్రం కాకుండా భద్రపరచినవాళ్లం అవుతాము.