Jump to content

కూసుమంచి గణపేశ్వరాలయం/గణపేశ్వరాలయం అమరిక

వికీసోర్స్ నుండి

గణపేశ్వరాలయం అమరిక

దేవాలయాల గురించి తెలుసుకునేందుకు చాలా చోట్ల శాసనాలు, సాహిత్యం ఉపయోగపడ్డాయి. అదేవిధంగా దేవాలయ నిర్మాణాన్ని ఒక క్రమంలో అర్ధం చేసుకోవడం ద్వారా కూడా ఆలయం గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అదృష్టవశాత్తూ గణపేశ్వరాలయం పునాదులనుంచి మూలవిరాట్లువరకూ చెక్కుచెదరకుండా నిలచివున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ నిర్మాణసంగతులను అర్ధం చేసుకోవచ్చు.

పీఠం, ఉపపీఠం

దేవాలయం మొత్తం దేనిమీద నిలబడి వుంటుందో దాన్ని ‘పీఠం లేదా అధిష్ఠానం’ అంటారు. ఇది దేవాలయానికి ‘పాదం’ లాంటిది. కాకతీయుల కాలంలో కట్టించిన పెద్దపెద్ద దేవాలయాలన్నింటిని భూమికి 5 లేదా 6 అడుగుల ఎత్తుగా వున్న అత్యంత విశాలమైన రాతి పీఠాలపై నిర్మించారు. పాలంపేట రామప్పదేవాలయం, హనుమకొండ రుద్రేశ్వరాలయం, పిల్లలమర్రి ఎరుకేశ్వరాలయం లాగానే కూసుమంచి గణపేశ్వరాలయాన్ని కూడా నేలనుంచి 6 అడుగులు పై బడిన ఎత్తులో పీఠాన్ని తయారుచేసి దానిపై ఆలయాన్ని నిర్మించారు. పునాదులకోసం డబ్బాలాగా దీర్ఘఘనాకారంలో తీసిన కందకంలో ఇసుకను నింపి, కుదించి, దానిపై బండలను ఒకదానిపై ఒకటి ఒక క్రమంలో పేర్చారు. ఈ రకంగా ఇసుక పునాదులు వాడటాన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటున్నాము. భూమి పొరల్లో సర్ధుబాట్ల వాళ్ళ భూకంపాలూ, తుఫానులూ వంటివి వచ్చినప్పటికీ మొత్తంగా పీఠం పగుళ్లిచ్చి కూలిపోకుండా ఇసుకలో సర్ధుబాట్లు జరగటం ద్వారా ఆలయం నిలబడే వుండేందుకు ఈ విధానం తోడ్పడుతుంది అని కొందరు నిపుణులు అంటున్నారు. రైలుపట్టాల విషయంలోనూ, హైవే విద్యుత్ తీగలు వదులుగా కట్టడంలోనూ ఉష్ణవ్యాకోచాలను దృష్టిలో వుంచుకున్నట్లు కాలక్రమంలో సంభవించే ఉష్ణోగ్రతా వ్యత్యాసాలు, భూకంపాలు వంటివాటిని తట్టుకుని తరాల పాటు నిలబడటానికి శ్యాండ్ బాక్స్ విధానం సమర్ధవంతంగా ఉపయోగపడుతుంది అని కొందరంటుంటే, మరికొందరు ఈ శాండ్ బాక్స్ విధానం వల్లనే కాకతీయ ఆలయాలు ఎక్కువగా బలహీనపడ్డాయని వాదిస్తున్నారు.

ఈ అధిష్ఠానం కింద ఉండే వరుసల్ని ‘ఉపపీఠం’ అంటారు. గణపేశ్వరాలయ ఉపపీఠం చూడటానికి ఎత్తుగా, చుట్టూ ప్రదక్షిణ చేయటానికి విశాలంగా ఉంది. ఆధారశిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, అథోపద్మం అనే ఉపపీఠం వరుసలపై ఎలాంటి అలంకార శిల్పమూ లేక సాదాగా వున్నాయి.

అధిష్ఠానానికి పైన ఏనుగుల వరుస (గజధార)లు, కమలాల వరుస (పద్మధార) లు బహుశా చుట్టూ వుండేవి కావచ్చు. కాలక్రమంలో శిథిలమైనవి శిథిలమైపోగా మిగిలిన కొన్ని వరుసలూ ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తున్నాయి. పైవైపున సమంగా గర్భాలయ, అర్ధమండప, రంగమండపాల నేల రాళ్ళు పరచబడినాయి.

కక్షాసనాలు, పాదవర్గం


దేవాలయ రంగమండప అధిష్ఠానంపై గల రాళ్ళపై నిలువుగా ఒక పిట్టగోడ లాంటి రాయి వుంది. దీన్ని ‘కక్ష్యాసనం (ఆనుకుని కూర్చోటానికి ఉపయోగపడేది) అంటారు. మండపం లోపల వున్న వరుసల వేదికలు, దానిపై భక్తులు కూర్చోవటానికి అరుగుగా ఉపయోగపడుతుంది. అధిష్ఠానంపైన ఉండే దేవాలయ గోడభాగాన్ని ‘పాదవర్గం’ అంటారు. { {p|fs150}}

ప్రదక్షణా పథం

గర్భాలయం చుట్టూ తిరిగేందుకు ఏర్పాటు చేసిన దారి ఇది. మొత్తం గుడి చుట్టూ తిరిగేందుకు ఒక బాహ్యప్రదక్షణా పథం వుంది. పైన గర్భాలయం చుట్టూ తిరిగేందుకు మరొక ప్రదక్షణా పథం కూడా వుంది. దేవకోష్టాలను, దేవాలయం పై చెక్కిన శిల్పాలనూ, సింహ,గజ, పద్మధారలను గమనించుకుంటూ దేవాలయ ప్రదక్షణ చేసే అవకాశంవుందిక్కడ.


దేవకోష్టాలు

గర్భాలయ గోడల ముఖశాల మధ్యలో మూడువైపులా మూడు కోష్ఠాలున్నాయి. ఉత్తర,పశ్చిమ,దక్షిణ దిశలలో దేవతల విగ్రహాలనుంచే గూడుల వంటి నిర్మాణాలు ప్రతివైపూ మూడు దొంతరలలో వున్నాయి. క్రింది దానికి కంటే మధ్యలోది, దానికంటే పైదాని అంతరాళాలు చిన్నవిగా వుంటాయి. ప్రతికోష్టానికీ చక్కటి రాతి చూరు వుంది. వాటికున్న చక్కటి అలంకరణను ఆకర్షణీయంగా వున్నాయి.

ద్వారశాఖలు మరియు ప్రస్తరం (చూరుగల కప్పు)

గర్భాలయం, అర్ధ మండపం, రంగమండపంపైన గోడలపై వర్షం నీరు పడకుండా బాగా వెడల్పుగా పైన ప్రస్తర కపోతముంది. దాన్ని చూరు లేదా లింటెల్ అనవచ్చు. ద్వారశాఖలు సైతం రాతి కట్టడాలే. సాధారణంగా శివాలయాలలో చిన్న ద్వారాలను వుంచటం ద్వారా ఎంతటివారయినా తలవంచుకునే వెళ్ళాలనే సందేశాన్ని ఇచ్చివుంటారు అని కొన్ని చిన్నద్వారాల గురించి ఇచ్చిన వివరణల్లో చెపుతారు. కానీ గణపేశ్వరాలయం ద్వారం

మాత్రం చాలా పెద్దదిగా వుంటుంది. సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు సరాసరి లోపటి శివలింగాన్ని ఏ అడ్డంకీ లేకుండా స్పర్శించేందుకు పెద్దవైన ద్వారశాఖలు ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా ఇంత పెద్ద శివలింగాన్ని భక్తులు కళ్లారా చూడాలంటే ద్వారం ఖచ్చితంగా పెద్దదిగా వుండాలి.

వర్షం కురిసినపుడు జల్లు ఎక్కువగా లోపటికి పడితే లోపటంతా నీటిమడుగు అయ్యే అవకాశం వుంది. అందుకోసం ఈ ప్రవేశమార్గం పైన చక్కటి వంపుతిరిగిన చూరు(లింటెల్) నిర్మించారు. ఇది పరిమాణ రీత్యా చాలా పెద్దగా వుండటమే కాక ద్వారశాఖలలాగానే ఇది కూడ రాతి నుంచి మలచబడినదే. అదికూడా దేవాలయ నిర్మాణపు లెగోబ్రిక్ పద్దతిలోనే చాలా చక్కగా దర్వాజా పైన అమర్చారు. ఈ చూరు పైవైపు అండాకారంగానూ క్రిందివైపు పుటాకారంగానూ వుంది. ఎండావానలను కాచే గొడుగులాగానే కాక అబ్బురమనిపించే అలంకరణతో ఎలివేషన్ లాగా కూడా ఇది ఉపయోగపడింది. ద్వారశాఖల పై చెక్కిన శిల్పాలు రామప్ప ద్వారశాఖలపైనున్న శిల్పరీతినే పోలి వున్నప్పటికీ అంత నిపుణత చూపలేదు. ద్వారశాఖకూ రాతి స్థంభానికీ మధ్యనున్న యుధ్ధమదనిక శిల్పాలను పోలిన ద్వారాశాఖకూ మాత్రం ప్రత్యేకంగా వున్నాయి. ద్వారానికి రెండు వైపులా వాతాయనాలు అనగా కిటికీలున్నాయి. అవికూడా రాతితో నిర్మించినే కావడం ప్రత్యేకత.

గర్భగృహ ద్వారశాఖలు

గర్భగృహ ద్వారశాఖలు కూడా శిలాకుఢ్య స్తంభాలతోనే నిర్మించబడ్డాయి. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత అర్చామూర్తికీ ముందున్న చివరి విభజనరేఖ ఇది మాత్రమే. నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది కేవలం ద్వారంగానే కాకుండా ఆలయభారాన్ని మోసేందుకు కూడా ఉపయోగపడేలా నిర్మించారని అర్ధం అవుతుంది. అందుకే మందమైన పెద్ద పట్టెడలు రెండువైపులా ధృఢంగా వుండేలా నిలబెట్టివుంటారు. ద్వారపాలక విగ్రహాలను, పౌరాణికఘట్టాలను వివరించే చిత్రాలనూ ఈ నిలువు పట్టెడలపై కుడ్యచిత్రాలుగా చెక్కి వున్నాయి. క్రింది భాగంలో వెడల్పయిన పెద్ద రాతి గడపను వుంచారు. ధ్వారభందానికి పైన వున్న అడ్డురాతిదూలం మధ్య భాగంలో గజలక్ష్మీదేవిని లలాటబింబంగా చిత్రించారు.

లలాట బింబం

నుదుటన బొట్టు పెట్టుకున్న విధంగా ద్వారబంధం పైన మధ్య భాగంలో చెక్కే శిల్పాలను

లలాట బింబం అంటారు. వీటిలో ప్రధానంగా గజలక్ష్మి విగ్రహం లేదా ఒకే పద్దతిలో మలచిన మహాగణపతి విగ్రహాన్నో చెక్కేవారు. ఈ ఆలయంలో లలాట బింబంగా గజలక్ష్మి విగ్రహం కనిపిస్తుంది.


గర్భాలయం

ఆలయంలోని ప్రధాన భాగమైన ఈ గర్భాలయానికి రెండు వరుసల్లో గోడలున్నాయి. బయటిగోడను బాహ్యభిత్తి అని, లోపలి గోడను అంతర భిత్తి అని అంటారు. వీటి మధ్య ఖాళీప్రదేశం కూడా వదిలారు. ఈ ఖాళీ ఉష్ణనియంత్రకంగా పనిచేయడంతో బయటి ఉష్ణోగ్రతల ప్రభావం లోపటిగదిలో ఎక్కువగా పడదు. ఈ రెండు గోడల మధ్య ఖాళీ ప్రదేశాలనుంచి రహస్య ప్రవేశమార్గాలున్నాయి. సబ్ వేలో ప్రవేశించిన తర్వాత వేర్వేరు దిశలకు మళ్ళీ అవి దారితీసినట్లు గోడల మధ్యనుంచి లోపటికి వెళ్ళిన దారి మళ్ళీ వేర్వేరు దిశలుగా చీలుతుంది వీటిద్వారా వేర్వేరు చోట్లకు వెళ్ళేలా నిర్మించుకోవడంతో అత్యవసర సమయాలలో దేవాలయం ఆనుపానులు తెలిసిన వారికివి రక్షణను కూడా కల్పించేవి కావచ్చు. అంతేకాకుండా భూగర్భంలో వున్న శివలింగం సాత్త్విక భాగాన్ని కేవలం అంత:పురం వాసం మాత్రమే సందర్శించుకునే ఏర్పటు వుండి వుంటుందని. బయటి ప్రదక్షిణా పధంలాగా లోపట కూడా మరో ప్రదక్షిణా పధం వుండొచ్చనేది ఒక ఊహ. లోపలి గోడ తర్వాత 15 అడుగుల పొడవు ఐదడుగుల వెడల్పు గల రాతి దిమ్మెలు పేర్చి గర్భాలయం, ముఖమంటపం నిర్మించారు. గర్భాలయంలోని శివలింగం 12 అడుగుల ఎత్తు, 6.3 కైవారంతో ఏకశిలా రూపంగా నిర్మించారు. దీనికింద మూడు అడుగుల విస్తీర్ణంతో పానవట్టం నిర్మించారు.

ప్రస్తరము లేదా పై కప్పు

గర్భగృహాన్ని లేదా అంతరాళాన్నిమూసిమూస్తూ పై కప్పువుంది. ఇది కూడా రాతి పలకలను జాగ్రత్తగా ఒకదానిపై ఒకటి ఆధారపడేలా పేర్చకుంటూ నిర్మించినదే. రీయిన్ ఫోర్సుడ్ కాంక్రీటుకంటే ధృఢంగా ఎక్కువకాలం నిలిచేలా వీటిని పేర్చగలగటం గొప్పదనమే

శిలాపద్మం

గర్భాలయం పై కప్పుమీద ఒక చక్రాన్ని చిత్రించడం కాకతీయుల ప్రత్యేకత. దేవాలయం పెద్దదయినా చిన్నదయినా గర్భాలయంలోని ఈశ్వరునికి పై భాగంలో అష్టకోణాలతో ఈ చక్రం కనిపిస్తుంది. గణపేశ్వరాలయపు గర్భాలయంలో అర్చామూర్తికి పైభాగంలో ఆలయపు పైకప్పుకు సౌష్టవాకారంలోని రాతి పద్మాలు వున్నాయి. దానిచుట్టూ ఒక క్రమపద్దతిలో చెక్కిన పద్మదళాలు కూడా వున్నాయి. ముక్కంటేశ్వర, వేణుగోపాల అంతరాలయ మంటపాలలోనూ, రంగమంటపంలో కూడా అందమైన పద్మనిర్మాణాలను గమనించవచ్చు.

శిఖరం (విమానం)

కప్పు తర్వాత వుండే శిఖర నిర్మాణాన్ని విమానము అంటారు. అనేక రకాల కొలతలతో నిర్మించటం వల్ల దీన్ని విమానం (నానా మానవిధానత్పాత్ విమానం పరికల్పయేత్) అన్నారు. గణపేశ్వరాలయం ఏకత విమానాలయం. పాలంపేట, గణపురం ప్రధానాలయం, పానగల్లు, కొండపర్తి, నిడికొండ, పిల్లలమర్రి, నాగులపాడు, బయ్యారం ఆలయాలుకూడా ఇదేవిధమైన ఏకత విమానాలయాలే. రామప్ప ఆలయ విమాన శిఖరం తేలికైన ఇటుకలతో మూడంతస్తులుగా కట్టారు. కానీ గణపేశ్వరాలయంలో విమానం శిఖరంలాగా ఎత్తుగా కాకుండా కూటకోట లక్షణంతో ద్రావిడ పద్ధతిలో చదరంగా నిర్మించారు. ఆకారాన్ని బట్టి శిఖరాలకు వేరువేరు పేర్లుపెట్టారు కానీ విమానం ఏ ఆకారంలో వున్నా అంటే చదరంగా, గుండ్రంగా, షట్ – అష్ట భుజ లలా వున్నప్పటికీ దానిని కూటశిఖరం అని అన్నారు. దానిపైన నిధి కలశం వుంటుంది. బహుశా మొత్తం గుడిని ఒక శివలింగాకారంలో భావించి కట్టడం వల్లనే ఇలా విమాన నిర్మాణంలో ప్రత్యేకత పాటించివుంటారేమో. అయితే నిర్మాణం ఇంకా పూర్తికాకముందే ఆపాల్సి రావడం వల్ల కూడా అలా జరిగివుండవచ్చు. కప్పువరకూ కట్టడం పూర్తయిన తర్వాత శత్రుదాడులు లేదా మరేదైనా అవాంతరాలతో నిర్మాణం ఆగిపోవటంవల్ల ఇలా జరిగే అవకాశం వుంది.

రంగమండపం

గణపేశ్వరాలయంలో గర్భగుడికి ఎదురుగా అత్యంత విశాలమైన రంగమండపం వుంది. వుంది దీనికి ఎటువంటి కప్పులేకపోవడంతో ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలాగా వుంటుంది. రంగమంటపం మీదకు తూర్పు, ఉత్తర, దక్షిణ మూడు దిశలనుంచి మొట్లమార్గం వుంది. 12 అడుగుల వ్యాసంతో గుండ్రని శిలతో మలచిన రంగశీర్షం మధ్యంలో వుంటుంది. రంగమండపం అర్ధం, దానిఉపయోగాలు, రకాలు, కాకతీయుల కాలంనాటి రచనలలో రంగమంటపం ప్రస్తావనల గురించి కొంచెం చూద్దాం.

దేవాలయ గర్భగృహం తరువాత తూర్పువైపున వున్న విశాలమైన స్థలాన్ని ‘రంగమండపం’ అంటారు. దీనికి మూడువైపులా దారులున్నాయి. దేవుని విగ్రహానికి చేసే అలంకరణలను అంగభోగమని, రంగశిలనుంచి అర్పించే నాట్యాన్ని రంగభోగమనీ, రెండింటినీ కలిపి అంగరంగ భోగాలనీ అంటారు. గణపేశ్వరాలయంలోని రంగమంటపానికి స్తంభాలు కానీ కప్పుకానీ నిర్మించబడిలేవు. పైగా ఇంతకు ముందు స్తంభాలుండి ఇప్పుడు కూలివుంటాయన్నట్లు గుర్తులు కూడా లేవు. కావాలనే దీనిని ఓపెన్ డయాస్ లాగా నిర్మించివుంటారు. కూసుమంచి గణపేశ్వరాలయం రంగమండపం మధ్య పన్నెండు అడుగుల వ్యాసం కలిగిన వృత్తాకార శిలా ఫలకంవుంది. పూర్వం ఆలయాలలో చేసే సాంప్రదాయ నృత్యాలకు వీటిని వేదికలుగా వాడేవారు. దేవాలయాలలో జరిపే చతుఃషష్టి ఉపచారాలలో నృత్యం ఒకటి. అది దేవాలయ రంగమండపంలో జరిగేది. {{center\

నృత్తరత్నావళిలో పేర్కొన్న రంగమండపము రకాలు

జేష్టము :

ఇది 108 మూరలు వుంటుంది. కేవలం రాజుల కొరకు మాత్రమే నిర్మించబడే రంగమంటపము ఇది.దీనిలోపాటలు,వాయిద్యములూ వినపడవు.నర్తకులు కూడా కనిపించరుఅందుకే ప్రశస్తము కాదు అని పేర్కొన్నారు.

మధ్యమము :

ఇది 64 మూరలు, రాజవంశీయులకు అనుకూలమూ మరియు ప్రశస్తమూ అని పేర్కొన్నారు.

కనిష్టము :

ఇది 32 మూరలు వుంటుంది.దీనిలో ఇతరులకు ధ్వని పెద్దదై మాధుర్యము నశిస్తుందని అందువలన అప్రశస్తము అని పేర్కొన్నారు.