Jump to content

కూసుమంచి గణపేశ్వరాలయం/ఆలయ ప్రత్యేకతలు

వికీసోర్స్ నుండి

ఆలయ ప్రత్యేకతలు

కళలన్నింటికీ నిర్మాణ శాస్త్రాన్ని తల్లిలాంటిది ( Architecture is mother of all arts) అంటారు. మరీ ముఖ్యంగా దేవాలయ నిర్మాణాలలో జీవితంలోని అనేక కోణాలను రూపించారు. మానవుడు ప్రప్రథమంగా అభ్యసించిన కళ శిల్పకళే అనడంలో అతిశయోక్తి ఏమీలేదు. ప్రాచీన శిలాయుగంలోని ఆదిమానవులు జంతువులను వేటాడేందుకు,మాంసాన్ని కోయడానికి ఆత్మరక్షణకూ అనేకరకాల రాతిపనిముట్లను తయారు చేసాడు. ఈ ప్రక్రియనుండే శిల్పకళ ఉద్భవించింది.

మూల విరాట్టు బృహత్ శివలింగం

కూనుమంచి గణపేశ్వరాలయంలో చాలా ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం మూలవిరాట్టుగా వున్న అతిపెద్ద శివలింగం గురించే. ఆకారంలో పెద్దగా వుండటమే కాకుండా నిర్మాణంలోనూ చాలా ప్రత్యేకతలు ఈ శివలింగంలో వున్నాయి. దీనిని నల్ల గ్రానైట్ రాయి లేదా నల్ల సేనపు రాతి(డోలరైట్)తో చేసి వుంటారు. ఇది చాలా కఠినమైన రాయి అయినా సరే శిల్పులు నునుపుదేల్చి లోహపు అద్దంలా తీర్చిదిద్దారు. భూమి పైననే సుమారు ఏడడుగుల పైన ఎత్తువుంటుంది. వెయ్యిస్తంబాలగుడి, రామప్ప, పిల్లలమర్రిలలో ఇదే ఆకారంలో వున్న శివలింగాలున్నాయి కానీ ఇంత పరిమాణంలో లేవు.

బాహ్యనేత్రాలకు అంతర్లింగం, అంతర్నేత్రానికి బృహద్లింగం

గుడిలో మామూలు సందర్శనకు వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే కేవలం గర్భగుడిలోని అతిపెద్ద ఏకశిలా విగ్రహం కనిపిస్తుంది. అది నునుపుదేలిన లోహరూపంలో దర్పంగా హుందాగా నిలబడినట్లు ఉంటుంది. గుడిచుట్టూ ప్రదక్షిణాలు చేసి దేవాలయాన్ని అంతర్నేత్రంతో పరికిస్తే, విహంగ వీక్షణ రూపంలో చూపును సారిస్తే మొత్తం దేవాలయమే ఒక మహాలింగంలా కనిపించటం ఇక్కడి అద్భుతం. సాధారణంగా గుడి గోపురాలను కోసుగా పైకి తీసుకెళుతూ కడతారు. కానీ ఈ దేవాలయ గర్భాలయ గోపురం ఒక సంక్లిష్ట నక్షత్రాకారంగానూ, లింగాకారంగానూ కనిపిస్తుంది. గుడిని నిలబెడుతూ నిర్మించిన ప్రదక్షిణాపథం దక్షిణం వైపు నుంచి విహంగవీక్షణ(ఏరియల్ వ్యూ) చేస్తూ గమనిస్తే పానవట్టం లాగా అనిపిస్తుంది, తూర్పువైపు క్రిందకి వున్న మెట్లదిశ పానవట్టం చివరి భాగం గానూ అర్ధమై మనకి ఆశ్చర్యాన్నికలిగిస్తుంది. ఇలా శివలింగాకారం కనిపించడం యాదృచ్చికంగా జరిగిన విషయం కాదనీ, ఆలయ రూపకర్తలు మొత్తం దేవాలయాన్నే ఒక బృహత్తర శివలింగంగా భావించి వుంటారనేందుకు మరో ఆధారం కూడా వుంది. అది ఆలయానికి దక్షిణ దిశలో వున్న ముక్కంటేశ్వరాలయం.ఈ ఉపాలయంలో మధ్యలోని గర్భగుడిలో శివలింగంమే వుంది. కానీ ఈ శివాలయపు ఆలయసముదాయం మొత్తం తూర్పుకు కాకుండా ప్రధానాలయం వైపుకు అంటే ఉత్తర దిశకు తిరిగివుంటుంది. ముక్కంటేశ్వరాలయం ముందు నిలబడి గమనిస్తే ప్రధానాలయ బృహత్ లింగ స్వరూపం గోచరిస్తుంది. గణపేశ్వరాలపు బృహద్లింగరూప రహస్యాన్ని విప్పి చెప్పేందుకే ఈ ముక్కంటేశ్వరాలయాన్ని నిర్మించివుంటారేమో అనిపిస్తుంది.

శివలింగ నిర్మాణం వెనకున్న కొన్ని సాంకేతిక విషయాలు

శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. శివ లింగము హిందూమతంలో ఒక పవిత్ర చిహ్నం. పూర్వం శివుడిని విగ్రహ రూపంలోనే పూజించే వారు. హరప్పా శిధిలాలలో ఒక పశుపతి విగ్రహాం కూడా దొరికింది వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథ ప్రకారం భృగు మహర్షి శాపం వల్ల శివుడికి లింగరూపంలోనే కానీ విగ్రహరూపంలో పూజలు అందటం లేదట.

శివలింగంలోని భాగాలు

గణపేశ్వరాలయంలోని శివలింగాన్ని మానుషలింగం అంటారు
మానుష లింగాలయిన శివలింగాలలో శాస్త్ర నిర్మాణ పద్దతిని అనుసరించి మూడు భాగాలు వుంటాయి. వాటిలో భూమిలో వుండే చతురస్రాకార భాగాన్ని బ్రహ్మభాగము అంటారు. దానిపైన అష్టదళ రూపంలో వున్న పీఠభాగాన్ని విష్ణుభాగము అంటారు. పైన స్తూపాకారంలో వున్నభాగాన్ని శివభాగము అంటారు. ఈ మూడు భాగాల పొడవులు సమానంగా వుంటే దానిని సర్వసమ లింగం అంటారు. వీటి పొడవులు వేర్వేరుగా వుంటే వాటిని వృధాయుధరం, ఇషాధికం అనే పేర్లతో పిలుస్తారు. వివరాలు పటంలో చూడవచ్చు.

శివ లింగములను వాటి నిర్మాత ఎవరు అనేదాని ఆధారంగా వాటిని వర్గీకరిస్తారు. స్వయంభూ లింగములు అంటే స్వయముగా వాటి అంతట అవే వెలసినవి. దైవిక లింగములు అంటే దేవతల చేత ప్రతిష్టింపబడినవి.రుష్య లింగములు అంటే రుషి ప్రతిష్టితాలు. మానుష లింగములు అంటే మానవ నిర్మిత లింగములు. బాణ లింగములు అంటే నర్మదా నదీతీరాన దొరికే తులా పరిక్షకు నెగ్గిన బొమ్మరాళ్ళు(పెబుల్సు) గణపేశ్వరాలయంలోని శివలింగం, మానుష లింగం(మానవులచే ప్రతిష్టితం). దీనిలో మూడుభాగాలుంటాయి. మనకి పైన శివలింగం ఎంత కనిపిస్తుందో ఆ నిష్పత్తి ప్రకారం అంతటి నిర్మాణం పీఠభాగం లోపల కూడా వుంటుంది.

శివలింగాన్ని తాకే ఉదయ కిరణాలు

గర్భాలయంలోని శివలింగాన్ని ఉదయపు సూర్యకిరణాలు సరాసరి తాకుతాయి. తూర్పుకు అభిముఖంగా వుండటం, పరిమాణ రీత్యా పెద్దగా వున్న ద్వారబంధం వుండటం. ద్వారానికీ గర్భాలయానికీ మరీ ఎక్కువ దూరం లేకపోవడం వల్ల ఇది సాధ్యపడుతోంది. ఇది ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైనది, ఆరోగ్యపరంగా ఉపయుక్తమైనది.

రాళ్లను అంటించలేదు కలిపారు

మనం ఇప్పుడు కట్టడాలకోసం సిమెంటు

కాంక్రీటుల మీదనే ఆధారపడుతున్నాం. గణపేశ్వరాలయం నిర్మాణంలో మాత్రం అతికించేందుకు సిమెంటు, సున్నం వంటి పదార్ధాలను వాడలేదు. రాళ్ళను ఒకదానికి ఒకటి రంధ్రము, కూసము పద్దతిలో కలుపుకుంటూ పేర్చుకుంటూ కట్టారు. దీనిని ఇంటర్ లాకింగ్ విధానం అంటారు. అంటే ఇప్పుడు చెక్కకుర్చీలు, మంచాలను బిగించే పద్దతి లాంటి విధానాన్ని వాడారు. కాలక్రమంలో భూకంపాలు వంటివి సంభవించినా సరే తట్టుకునేంత పటిష్టంగా ఈ రాళ్ళను పేర్చి బిగించారు. అందువల్లనే శతాబ్దాలు గడిచినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆలయం మనముందు గర్వంగా నిలబడివుంది.

రాతిని పేర్చడంలోనూ ఎంతో జాగ్రత్త

రాళ్ళను ఒకదానితో ఒకటి పేర్చటమే కాదు. వాటిని అమర్చిన క్రమంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. రంగమండపం మూడువైపులా నిర్మించిన మెట్లను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. ఒక మెట్టుకోసం వాడిన రాతిని ఎడమవైపు గోడలోపటికి వుండేలా అమర్చితే, దాని తర్వాతి మెట్టుకు వాడిన రాతిని కుడివైపు గోడలోకి బిగించారు. ఇలా ఏకాంతర (ఆల్టర్ నేటివ్) పద్దతిలో రాళ్ళను బిగించుకుంటూ రావడం వల్ల మెట్లను తవ్వకుండా పక్కనున్న గోడలు రక్షణగా వుంటాయి. వరదలూ భూకంపాలకు చెదిరిపోకుండా పట్టివుంచుతాయి కూడా. రంగమంటపంకోసం వాడిన రాతిని చదునుగానే కాక కావలసినంత మందంగా వుండేలా ఎంచుకున్నారు. ముక్కంటేశ్వరాలయపు రంగమండపపు రాతిని పక్కనే వున్న స్తంభాల క్రిందకి చేరేలా కలిపారు. నక్షత్రాకార పు నాది నిర్మాణంలో అంచుల దగ్గరవున్న రాళ్ళు జారిపోకుండా పట్టుతో వుండేంతగా లోపటికి నెట్టి బిగించారు.

నీడలు తాకనంత దూరంలో ఉపాలయాలు

గణపేశ్వరాలయం సమీపంలోవున్న ఉపాలయాలు లేదా సహాలయాల మధ్య దూరం వేర్వేరుగా వుంటుంది. ప్రధాన ఆలయం నీడ ఉపాలయాలపై కానీ ఉపఆలయాల నీడ ప్రధానాలయంపై కానీ పడదు. అలాగే ఒక ఉపాలయం నీడ మరో ఉపాలయం మీద కూడా పడదు. అందుకు అనుగుణంగానే వీటి దూరాలను ఏర్పరచారు. ప్రధానాలయం ఎత్తు ఎక్కువ కాబట్టి దానికీ ముక్కంటేశ్వరాలయానికీ దూరం కొంత ఎక్కువగా వుంటుంది. కానీ ముక్కంటేశ్వరాలయానికీ వేణుగోపాలస్వామి ఆలయానికి మధ్యదూరం మాత్రం వాటి ఎత్తులు తక్కువగా వున్నట్లే తక్కువగా వుంటుంది. ఉత్తరాయణం, దక్షిణాయణం కాలాలలో సూర్యుడి దిశ మారినప్పటికీ, ఉదయం సాయంత్రాలలో నీడల పొడవు బాగా పెరిగినప్పటికీ, రుతువులలో మార్పు వున్నప్పటికీ ఆ నీడలు మరో ఆలయాన్ని తాకవు.

నంది విగ్రహం పై ఎన్నినగిషీలో!

గణపేశ్వరాలయంలోని శివలింగానికి ఎదురుగా ఒక నంది విగ్రహము, బయటి రంగమంటపంలో మరో నంది విగ్రహమూ వున్నాయి.

బయటిది పాతకాలపు రాతినంది. కొంత శిధిలం అయివుంది. బహుశా ఇది గుడినిర్మాణసమయంలో చెక్కినది అయివుండొచ్చు. లోపటి విగ్రహాన్ని తర్వాతి కాలంలో ఏర్పాటు చేసారు. బహుశా ఊరిబయట వున్న దేవాలయం కావడంతో రక్షణ తక్కువని కొత్తవిగ్రహాన్ని ఆలయం లోపటే హుండీకి వెనుకగా అమర్చారు. బయటి నందిపై అలంకరణలు రమ్యమైనశైలిలో చెక్కబడివున్నాయి. మెడలో గంటలు, అలంకరణ దండలు, కాలి పట్టెడలు వంటివి వున్నాయి. వాటి నిర్మాణంలో శిల్పి నైపుణ్యం కనిపిస్తుంది. అంతే కాకుండా నంది వీపుపై ఒక తాడు ముడి వుంది. దానిని సాధారణంగా ఏనుగుముడి అంటారు. ఆంగ్లంలో రీఫ్ నాట్. ఇది చాలా గట్టిముడి. వ్యవసాయ పనుల్లోనూ, సైనిక శిబిరాల ఏర్పాటులోనూ ఈ ముడి ఉపయోగం చాలా ఎక్కువ. ముడిని ఎలా వేయాలో అర్ధం అయ్యేంత విపులంగా చెక్కారంటే శిల్పాల నిర్మాణంలో అలంకరణకే కాక ఉపయోగానికీ ప్రాధాన్యత నిచ్చారని తెలుస్తోంది. ముఖ్యమైన విషయాలు వారితోనే అంతరించిపోకుండా తర్వాతి తరాలకు అందేందుకు వీటిని సాధకాలుగా వాడుకున్నారు.

ఉపాలయ స్తంభాలు

దేవాలయ స్తంభాలు కేవలం పైకప్పును మోసేందుకు మాత్రమే కాదు, అలంకరణకోసం కూడా వాడారు. గణపేశ్వరాలయంలో ప్రధాన ఆలయానికి కానీ రంగమంటపానికి కానీ ఎటువంటి స్తంభాలనూ వాడలేదు. కానీ పక్కనే వున్న ముక్కంటేశ్వరాలయానికీ, వేణుగోపాలస్వామి ఆలయానికీ కాకతీయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే స్తంబాలను నిర్మించారు. స్తంభాన్ని వివిధ ఆకృతుల సమ్మేళనంగా చెక్కడమే కాక, దానిపై రాజహంసలను మరికొన్ని అందమైన ప్రతిమలను మలచారు. స్తంభం చివర దూలాలను పట్టుతో మోసేందు అనుగుణంగా + (ప్లస్) ఆకారంలో ఆధారాలను ఏర్పాటు చేయటం ఇక్కడి స్థంభాలలో ప్రత్యేకత. అటువంటి స్తంభాలనే ప్రధానాలయం ముందు కూడా గమనించవచ్చు. దేవాలయ స్తంభాలను వాటి ముఖాల ఆధారంగా వేర్వేరు పేర్లతో పిలుస్తారు. నాలుగు ముఖాలుండే స్తంభాలను రుచక అని ఎనిమిది ముఖాలుంటే ‘వజ్ర’ అని పదహారు ముఖాలుంటే ద్విగుణ వజ్ర అని ముప్పైరెండు ముఖాలుంటే ‘ప్రతినక’మని అంటారు. ఇక్కడి స్తంభాలలో ఒకే స్తంభంలో వివిధ ఆకారాల మేళవింపును క్రమమైన పద్దతిలో నిర్మించుకుంటూ వెళ్ళారు. మంటపంలో వున్న కొన్ని స్తంభాలపై ప్రత్యేకమైన శైలిని కూడా ప్రదర్శించారు. అలాకాకుండా స్థూపాకారంలోని స్తంభాలు గుండ్రంగా వృత్తాలవలే వుంటే వాటిలోని సూక్ష్మవ్యత్యాసాల ఆధారంగా బ్రహ్మకాంత, విష్ణుకాంత, సౌమ్యకాంత, మరియు రుద్రకాంత అనే పేర్లతో పిలుస్తారు.